కురాన్ భావామృతం/సబా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
34. సబా (సబాజాతి)
(అవతరణ: మక్కా; సూక్తులు: 54)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాల్లోని సమస్త వస్తువులకు యజమాని అయిన దేవుడే స్తుతింపదగిన వాడు. పరలోకంలో కూడా ఆయనే ప్రశంసనీయుడు. ఆయన ఎంతో వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు. భూలోకానికి చేరుతున్నదేమిటో, భూలోకం నుండి వెలువడుతున్న దేమిటో, ఆకాశం నుండి దిగుతున్నదేమిటో, ఆకాశంలోకి ఎక్కి పోతున్నదేమిటో అంతా ఆ దేవునికి తెలుసు. ఆయన అమిత దయామయుడు, గొప్ప క్షమాశీలి. (1-2)
అవిశ్వాసులు, తమపై ప్రళయం ఎందుకు వచ్చి పడటంలేదని అడుగుతున్నారు. వారికిలా చెప్పు: “అగోచర జ్ఞానసంపన్నుడైన నా ప్రభువు సాక్షి! ప్రళయం మీమీద తప్పక వచ్చిపడుతుంది. భూమ్యాకాశాల్లో దాగివుండే ఏ (ప్రాణీ,) వస్తువూ దాన్నుండి తప్పించుకో లేదు. అణువుకన్నా పెద్దదిగాని, చిన్నదిగాని ఏదీ ప్రళయం బారినుండి ఏమాత్రం తప్పించుకోలేదు. సమస్తం ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. సత్యాన్ని విశ్వ సించి సత్కార్యాలు చేసేవారికి ప్రతిఫలం ఇవ్వడానికి, వారి పాపాలు మన్నించి గౌరవ ప్రదమైన ఉపాధి ప్రసాదించడానికి ప్రళయం తప్పకుండా సంభవిస్తుంది.” (3-4)
అయితే మా సూక్తులకు వ్యతిరేకంగా తమ సర్వశక్తులతో పెనుగులాడే విద్రోహు లకు అత్యంత వ్యధాభరితమైన శిక్ష కాచుకొని ఉంది. ప్రవక్తా! నీ ప్రభువు నుండి అవతరించినది పరమసత్యమని; అది మహాబలశాలి, ప్రశంసనీయుడైన పరాత్పరుని సన్నిధికి దారి చూపిస్తుందని జ్ఞానసంపన్నులకు బాగా తెలుసు. (5-6)
సత్యతిరస్కారులు ప్రజలతో ఇలా అంటారు: “మేము మీకు ఒక విచిత్ర వ్యక్తిని గురించి చెప్పమంటారా? మీ దేహాలు అణువణువూ విడిపోయిన తరువాత మీరు కొత్తగా మళ్ళీ సృజించబడతారని ఆయనగారు అంటున్నారు. ఇతను దేవుని పేర అబద్ధాలు మాట్లాడుతున్నాడో లేక ఇతనికేదైనా పిచ్చిపట్టిందో మాకయితే తెలియదు.”
కాదు, (అసలు విషయం అదికాదు.) పరలోకాన్ని నమ్మనివారు (త్వరలోనే) నరక యాతనలు చవిచూడబోతున్నారు. వారు ఘోరంగా దారితప్పారు. వారు ఎన్నడూ కళ్ళు తెరచి భూమ్యాకాశాల్ని చూడలేదా? అవి వారిని ముందూ వెనకల నుంచి చుట్టుముట్టి ఉన్నాయి. మేము తలచుకుంటే వారిని భూమిలో క్రుంగిపోయేలా చేస్తాము. లేదా ఆకాశపు తునకలను వారి మీద పడవేస్తాము. (పశ్చాత్తాప హృదయంతో) దేవుని వైపు మరలేవారికి ఇందులో గొప్ప సూచన ఉంది. (7-9)
మేము దావూద్‌కు అనేక భాగ్యాలు ప్రసాదించాం. “పర్వతాలూ! స్తుతిగానంతో మీరితనికి సహకరించండ”ని మేము పర్వతాలను ఆదేశించాం. పక్షులను కూడా ఇలాగే ఆదేశించాం. దావూద్ కోసం మేము ఇనుమును మెతకగా చేసి దాంతో కవచాలు తయారుచేయాలని, వాటి కైవారాలు లెక్కప్రకారం ఉంచాలని ఆదేశించాం. (ప్రజలారా!) సత్కార్యాలు చేయండి. మీరు చేసే ప్రతిపనీ నేను చూస్తున్నాను. (10-11)
సులైమాన్ కోసం మేము గాలిని అదుపులో ఉంచాం. తద్వారా అతను ఉదయం ఒక నెలరోజుల్లో నడిచే దూరాన్ని, సాయంత్రం ఒక నెలరోజుల్లో నడిచే దూరాన్ని నడుస్తాడు. అతని కోసం మేము కరిగిన రాగితో కూడిన నదిని ప్రవహింపజేశాం. పెద్ద పెద్ద భూతాలను అతని అధీనంలో ఉంచాం. అవి తమ ప్రభువాజ్ఞతో అతని ముందు (కట్టుబానిసల్లా) పనిచేసేవి. వాటిలో ఏదైనా మా ఆజ్ఞను పాటించడానికి నిరాకరిస్తే మేము దానికి భగభగమండే అగ్నిని చవిచూపించేవాళ్ళము. అతని కోసం ఆ భూతాలు కోరిన వస్తువు తయారుచేసేవి, ఆకాశహర్మ్యాలు, రకరకాల బొమ్మలు, కోనేరుల్లాంటి విశాలమైన కంచాలు, ఒకచోట స్థిరంగా ఉండే పెద్దపెద్ద వంటపాత్రలు వగైరా తయారు చేసేవి. దావూద్‌సంతతి ప్రజలారా! నాపట్ల కృతజ్ఞతగా సత్కార్యాలు చేయండి. నా దాసులలో చాలా తక్కువమంది కృతజ్ఞులైన వారున్నారు. (12-13)
మేము సులైమాన్ విషయంలో మృత్యు ఆదేశం జారీ చేసినప్పుడు, సులైమాన్ చేతికర్రకు పట్టిన చెదవల్ల తప్ప మరే విషయం ద్వారా అతని మరణవార్త భూతాలకు తెలియలేదు. ఇలా (చేతికర్రకు చెదపట్టి) సులెమాన్ (భౌతికకాయం) నేలకొరిగిపోగానే భూతాలకు ఈసంగతి తెలిసిపోయింది. ఒకవేళ ఆ భూతాలకు అతీంద్రియజ్ఞానం ఉంటే ఈవిధంగా అవి అవమానకరమైన యాతనలో చిక్కుకొని ఉండేవికావు. (14)
సబాజాతి ప్రజలకు వారి నివాసగృహాలలోనే ఒక సూచన ఉంది. కుడిఎడమల వైపు రెండు తోటలున్నాయి. మీ ప్రభువు ప్రసాదించిన ఉపాధిని అనుభవిస్తూ, ఆయన పట్ల కృతజ్ఞులయి ఉండండి. (ఇక్కడ భోగభాగ్యాలతో నిండిన) మంచి రాజ్యం ఉంది. (అక్కడ) మిమ్మల్ని మన్నించే ప్రభువున్నాడు. (15)
కాని వారు (మా నుండి) ముఖం తిప్పుకున్నారు. చివరికి మేము ఆనకట్టలు తెగి పోయిన వరదను వారి మీదికి పంపాము. వారి (వినాశం) తరువాత మేము పూర్వం ఉండిన (మధురఫలాలతో నిండిన) తోటల స్థానంలోనే, చేదుపండ్లు పండే మరోరెండు తోటలు సృజించాం. కాకపోతే ఆ తోటలలో అక్కడక్కడ కొన్ని రేగుచెట్లు, వెదురుచెట్లు మాత్రం ఉన్నాయి. ఇదీ మేము సత్యతిరస్కారానికి వారికిచ్చిన ప్రతిఫలం. కృతఘ్నులైన వారికి తప్ప మరెవరికీ మేము ఇలాంటి ప్రతిఫలం ఇవ్వము. (16-17)
వారికి, మేము శుభాలు చేకూర్చిన పట్టణాల మధ్య స్పష్టంగా కన్పించే పట్టణాలు నెలకొల్పాం. ఆ పట్టణాల మధ్య సులువైన మజిలీలు ఏర్పరచాం. (కనుక) మీరు నిశ్చింతగా రేయింబవళ్ళు ఆ రహదారులలో తిరగండి. కాని వారు “ప్రభూ! మా ప్రయాణ మజిలీలు సుదీర్ఘం చేయి” అన్నారు. వారు తమకుతాము అన్యాయం చేసుకున్నారు. చివరికి మేము వారిని చెల్లాచెదరు చేసి చరిత్రగర్భంలో కలిపేశాం. కృతజ్ఞులు, సహన శీలురకు ఈ ఉదంతంలో గొప్ప సూచనలు ఉన్నాయి. (18-19)
వారి విషయంలో ఇబ్లీస్ తనఅంచనా నిజమైనట్లు గ్రహించాడు. కొందరు విశ్వా సులు తప్ప వారంతా అతడ్ని అనుసరించారు. విశ్వాసులపై ఇబ్లీస్‌కు అధికారం లేదు. అయితే ఎవరు పరలోకాన్ని విశ్వసిస్తారో, ఎవరు దాన్నిగురించి సందేహంలో పడిపోతారో పరీక్షించడానికే మేమిలా చేశాం. నీ ప్రభువు ప్రతిదాన్నీ ఓకంట గమనిస్తున్నాడు. (20-21)
చెప్పు: “మీరు దేవుడ్ని వదలి ప్రార్థిస్తున్న మిధ్యాదైవాల్ని పిలుచుకోండి. అవి భూమ్యాకాశాల్లోని అణుమాత్రం వస్తువుక్కూడా యజమానులు కావు. వాటి యాజమా న్యంలో వారికి ఎలాంటి వాటా లేదు. వాటిలో ఏ ఒక్కటీ దేవునికి సహాయసహకారాలు అందజేయడం లేదు. దేవుని సన్నిధిలో ఆయన అనుమతించినవారి సిఫారసు తప్ప ఎవరి సిఫారసూ ఎవరి విషయంలోనూ ప్రయోజనం చేకూర్చదు. అంతేకాదు, ప్రజల హృదయాల్లోని ఆందోళన, అస్థిమితాలు దూరమైన తర్వాత వారు (సిఫారసు చేసేవారిని) “మీ ప్రభువు ఏం సమాధానమిచ్చాడ”ని అడుగుతారు. దానికి వారు “సరైన సమాధానమే లభించింది. ఆయన మహనీయుడు, మహోన్నతుడు” అంటారు. (22-23)
భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధి ప్రసాదిస్తున్నది ఎవరని వారినడుగు. “దేవుడే, కనుక మన ఉభయవర్గాల్లో ఇప్పుడు ఒక వర్గం మాత్రమే సన్మార్గంలో లేక దుర్మార్గంలో పడివుంద”ని చెప్పు. “మేము చేసిన తప్పులకు మిమ్మల్ని నిలదీయడం జరగదు. అలాగే మీరు చేసినకర్మలకు మమ్మల్ని ప్రశ్నించడం జరగద”ని చెప్పు. “మన ప్రభువు మనందర్నీ (తీర్పుదినాన) సమావేశపరచి మన మధ్య న్యాయంగా, సరయిన తీర్పిస్తాడు. ఆయన సమస్త విషయాలు తెలిసిన గొప్పన్యాయమూర్త”ని కూడా చెప్పు. (24-26)
“సరే, మీరు దేవునికి సహవర్తులుగా చేసి ఆయన స్థాయికి చేర్చిన ప్రముఖ దేవతలు ఎవరో చూపండి నాకు. ఎవరూ లేరు. దేవుడు మాత్రమే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు” అని చెప్పు వారికి. ముహమ్మద్ (స)! మేము నిన్ను యావత్తు మానవాళి కోసం (స్వర్గ)శుభవార్త అందజేసేవానిగా, (దైవశిక్ష గురించి) హెచ్చరించే వానిగా చేసి పంపాము. కాని చాలామందికి ఈ వాస్తవం తెలియదు. (27-28)
“నీవు చెప్పేది నిజమైతే (ప్రళయం గురించిన) ఈవాగ్దానం ఎప్పుడు నెరవేరు తుంద”ని నిన్నడుగుతున్నారు. వారికిలా చెప్పు: “మీకోసం ఒకరోజు నిర్ణయించబడింది. ఆరోజు రావడంలో మీరు ఒక్క ఘడియ కూడా ఆలస్యం చేయలేరు. అలాగే మీరు దాని నిర్ణీత సమయానికి ఒక్క ఘడియ కూడా ముందుగా తీసుకురాలేరు.” (29-30)
“ఈ ఖుర్‌ఆన్‌ని, దీనికి పూర్వం అవతరించిన మరే గ్రంథాన్నీ మేము ఎన్నటికీ నమ్మం” అంటున్నారు అవిశ్వాసులు. ఈ దుర్మార్గులు తమప్రభువు సన్నిధిలో నిలబడి నప్పుడు నీవు వారి పరిస్థితి చూస్తే బాగుంటుంది! అప్పుడు వీరు ఒకరిపై నొకరు నిందా రోపణలు చేసుకుంటారు. ఇహలోకంలో అణచివేయబడినవారు, నాయకులుగా చెలా మణయినవారితో “మీరు లేకపోతే మేము విశ్వాసులై ఉండేవాళ్ళం” అంటారు. (31)
నాయకులుగా చెలామణైనవారు, అణగిమణగి ఉన్నవారితో “మీ వద్దకు వచ్చిన సన్మార్గం అవలంబించకుండా మిమ్మల్ని మేము నిరోధించామా? అసలు మీరు స్వతహా గానే పాపాత్ములు” అంటారు. అణగిమణగి ఉన్నవారు, నాయకులుగా చెలామణైన వారితో “కాదు, ఇవన్నీ రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్రలు. మీరు మమ్మల్ని (నిజ) దేవుడ్ని తిరస్కరించి, ఆయనకు సాటికల్పించమని చెబుతుండేవారు” అనంటారు.
చివరికి వారు (నరక) యాతనలను ప్రత్యక్షంగా చూడగానే (బెంబేలెత్తిపోయి) లోలోన పశ్చాత్తాపపడతారు. మేము ఇలాంటి తిరస్కారుల మెడలకు గుదిబండ కడ్తాం. వారికి వారి కర్మలకు తగ్గ ప్రతిఫలమే లభిస్తుంది. (32-33)
మేము ఏ పట్నానికి హెచ్చరించేవాడ్ని పంపినా ఆ పట్నంవాసులు అతడ్ని తిరస్క రిస్తూ “నీవు తెచ్చిన సందేశాన్ని మేము నమ్మం” అనే అన్నారు. పైగా “మేము నీకంటే ఎక్కువ ధనికులం, సంతానంలో కూడా మేమే అధికులం. అంచేత మాకు శిక్షపడే ప్రశ్నే లేదు” అని చెప్పేవారు. చెప్పు: “నా ప్రభువు తాను కోరినట్లు కొందరికి పుష్కలంగా, మరికొందరికి స్వల్పంగా ఉపాధినిస్తాడు. కాని చాలామందికి ఈ సత్యం తెలియదు.”#
మీ సంతానం, సిరిసంపదలు మీకు మా సాన్నిధ్యం ప్రసాదించలేవు. సత్యాన్ని విశ్వ సించి సదాచార వైఖరి అవలంబించినవారికే మా సాన్నిధ్యం లభిస్తుంది. అలాంటివారికే వారి కర్మలకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. వారు (స్వర్గ వనాలలోని) ఆకాశ హర్మ్యా లలో చీకూచింతా లేకుండా హాయిగా ఉంటారు. మా సూక్తుల్ని తుదముట్టించడానికి పరుగులు తీసేవారు మాత్రం నరక యాతనలు చవిచూస్తారు. (34-38)
వారికిలా చెప్పు: “నా ప్రభువు తన దాసులలో తానుకోరిన విధంగా కొందరికి విస్తృతంగా, మరికొందరికి స్వల్పంగా ఉపాధి ప్రసాదిస్తున్నాడు. మీరు (దైవమార్గంలో) ఏది ఖర్చుపెట్టినా ఆ వెలితిని భర్తీచేయడానికి ఆయన మీకు మరింత ప్రసాదిస్తాడు. ఆయన యావత్తు ఉపాధి ప్రదాతల్లోకెల్లా గొప్ప ఉపాధిప్రదాత.” (39)
ఆయన మానవులందరినీ సమావేశపరచిన తర్వాత “వీరు మిమ్మల్ని ఆరాధిస్తుండే వారా?” అని దైవదూతల్ని ప్రశ్నిస్తాడు. దానికి వారు “మీరు పరమపవిత్రులు. మాకు మీతోనే సంబంధం ఉంది. వారితో మాకెలాంటి సంబంధం లేదు. వీరసలు మమ్మల్ని కాదు, భూతపిశాచాల్ని పూజిస్తుండేవారు. వారిలో చాలామంది భూతాలనే నమ్మేవారు” అని అంటారు. అప్పుడు మేము “ఈరోజు మీలో ఏ ఒక్కడూ ఎవరికీ ఎలాంటి లాభం గాని, నష్టంగాని కలిగించలేడు” అంటాము. మరోవైపు దుర్మార్గులతో “ఇక మీరు తిరస్కరిస్తూ ఉండిన ఈ నరక శిక్ష చవిచూడండి” అని చెబుతాం. (40-42)
వారికి (మహోజ్జ్వలమైన) మా సూక్తులు విన్పిస్తున్నప్పుడు “మీ తాతముత్తాతలు ఆరాదిస్తూ వచ్చిన ఈ దైవాలను ఆరాధించనీయకుండా మిమ్మల్ని ఇతను నిరోధించ గోరుతున్నాడు” అంటారు వారు. “ఇది (ఖుర్‌ఆన్) అభూతకల్పన తప్ప మరేమీ కాదు” అని కూడా అంటారు. ఈ తిరస్కారులు తమ దగ్గరికి సత్యం వచ్చినా “ఇది స్పష్టమైన మంత్రజాలం” అన్నారు. (43)
ఇంతకు పూర్వం వీరికి మేము చదవడానికి ఎలాంటి (దివ్య)గ్రంథం ఇవ్వలేదు. నీకు పూర్వం వీరి దగ్గరికి హెచ్చరించేవాడ్ని కూడా ఎవరినీ పంపలేదు. వీరికి పూర్వం కూడా ప్రజలు (సత్యాన్ని) తిరస్కరించారు. మేము ఆనాటి ప్రజలకిచ్చిన వైభవాల్లో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినప్పటికీ వారు నా ప్రవక్తలను తిరస్కరించినందున (నేను వారిని సర్వనాశనం చేశాను). చూడు, నా శిక్ష ఎంత కఠినమైనదో! (44-45)
ప్రవక్తా! వారికిలా చెప్పు: “నేను మీకు ఒక విషయం ఉపదేశిస్తున్నాను. దేవుని కోసం మీరు ఒక్కొక్కరు విడిగా, ఇద్దరేసి కలసి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. మీ సహచరునికి ఎలాంటి పిచ్చి పట్టలేదు. అతను అత్యంత కఠినమైన (నరక) శిక్ష రాకముందే దాన్ని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు.” (46)
వారికీ మాట కూడా చెప్పు: “మిమ్మల్ని నేనేదైనా ప్రతిఫలం అడిగితే, దాన్ని మీరే అట్టిపెట్టుకోండి. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత దేవునిపై ఉంది. ఆయన ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు.” ఈమాట కూడా తెలియజెయ్యి: “నా ప్రభువు (నాపై) సత్యం అవత రింపజేస్తున్నాడు. ఆయన యావత్తు నిగూఢ రహస్యాలు తెలిసినవాడు.” (47-48)
వారికి స్పష్టంగా ఇలా చెప్పేసేయి: “సత్యం వచ్చేసింది. దాంతో అసత్యానికి నూకలు చెల్లినట్లే. ఇక దాని ఆటలు ఎంతోకాలం సాగవు.” వారికీ సంగతి కూడా చెప్పు: “నేను గనక మార్గభ్రష్టుణ్ణయిపోతే ఆ మార్గభ్రష్టత్వం నామీదే ఉంటుంది. కాని నేను రుజుమార్గంలో ఉంటే, అది నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యావిష్కృతి కారణం గానే నేను రుజుమార్గంలో ఉన్నాను. ఆయన సమస్తం వింటున్నాడు, మనకు అతి చేరువలోనే ఉన్నాడు.” (49-50)
వారు భీతావహులై తిరుగుతున్నప్పుడు నీవు వారిపరిస్థితి చూస్తే బాగుండు. వారు తప్పించుకొని పారిపోలేరు. సమీపం నుంచే పట్టుబడిపోతారు. అప్పుడు వారు “మేము దీన్ని విశ్వసిస్తున్నాం” అంటారు. కాని చాలాదూరం పోయిన వస్తువు ఇప్పుడెలా దక్కు తుంది? వారు గతంలో దీన్ని తిరస్కరించారు. పైగా ముందూవెనుకా ఆలోచించకుండా దూరాన నిలబడి రాళ్ళు విసరుతుండేవారు. ఆనాడు వారు పెట్టుకున్న ఆశలన్నీ నేడు అడియాశలయ్యాయి. వారికి పూర్వం కూడా ఇలాంటి ప్రజల ఆశలు అడియాశలై పోయాయి. వారు కూడా (సత్యం గురించి) సందిగ్ధంలో పడిపోయారు. (51-54)