కురాన్ భావామృతం/అర్-రాద్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
13. రాద్ (మేఘగర్జన)
(అవతరణ: మక్కా; సూక్తులు: 43)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్-లామ్-మీమ్-రా. ఇవి దైవగ్రంథం సూక్తులు. నీ ప్రభువు నుండి నీపై అవతరించిన పరమసత్యం. కాని చాలామంది దీన్ని విశ్వసించలేక పోతున్నారు. (1)
మీకు ఏవిధంగానూ గోచరించని ఆధారాలతో ఆకాశాన్ని నిలబెట్టినవాడే అల్లాహ్. ఆ తర్వాత ఆయన తన (అధికార)సింహాసనం అధిష్టించాడు. ఆయన సూర్యచంద్రుల్ని ఒక నిర్దిష్ట నియమావళికి కట్టుబడి నడిచేలా చేశాడు. యావత్తు విశ్వవ్యవస్థలోని సమస్త సృష్టిరాసులు ఒక నిర్ణీతకాలం వరకు మనగలిగేలా ఏర్పాటు చేయబడింది. ఈ ఏర్పా టంతా దేవుడే చేసి నిరంతరాయంగా నిర్వహిస్తున్నాడు. మీరు మీప్రభువుని (ఒకరోజు) కలుసుకోవలసి ఉంటుందన్న విషయంపై మీకు నమ్మకం కుదరాడానికే (ఈవిధంగా) ఆయన (ప్రకృతి) నిదర్శనాలను విడమరచి తెలియజేస్తున్నాడు. (2)
ఆయనే ఈ భూమండలాన్ని పరచి అందులో పర్వతాలను, నదులను నెల కొల్పాడు. ఆయనే సమస్తజాతుల పండ్లలో రెండేసి రకాలను సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని ఆవరింపజేస్తున్నాడు. వీటన్నిటిలోనూ జాగ్రత్తగా పరిశీలించి ప్రశాంత మనస్సుతో యోచించేవారి కోసం గొప్ప నిదర్శనాలు ఉన్నాయి. (3)
ధరణిలో పక్కపక్కనే ఒకదానికొకటి కలిసివుండే విభిన్నరకాలు కల్గిన వేర్వేరు నేలలున్నాయి. అయితే అవన్నీ (ఆయానేలల్లో) ద్రాక్షతోటలు, పంటపొలాలు, ఖర్జూరపు చెట్లు (వగైరా) ఉన్నాయి. తిరిగి వీటిలో కొన్ని బహుళ శాఖవృక్షాలు, మరి కొన్ని వేరే రకమైనవి కూడా ఉన్నాయి. వాటన్నిటికీ ఒకేనీరు సరఫరా అవుతుంది. అయితే వాటిలో కొన్నిటిని మేము ఎక్కువ రుచికరమైనవిగా, మరికొన్నిటిని తక్కువ రుచికరమైనవిగా చేశాం. వీటిలో కూడా బుద్ధిమంతుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి. (4)
నీకు ఆశ్చర్యం కలిగించే మాటేదైనా కావాలంటే కొందరిమాటలు నీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. “ఏవిటీ, మేము చచ్చి మట్టిలో మట్టయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ సృష్టించబడతామా?” అంటారు వారు (తెగ ఆశ్చర్యపోతూ. ఆశ్చర్యంగా లేవూ నీకీ మాటలు?) వారసలు తమ ప్రభువును నిరాకరించిన పచ్చి అవిశ్వాసులు. వారు మెడలలో (భావదాస్యపు)పట్టాలు పడిన (అంధ)మనుషులు. వారే నరకవాసులు. నరకం లోనే వారు (నానా యాతనలు అనుభవిస్తూ) ఎల్లకాలం పడిఉంటారు. (5)
వారు మేలుకు బదులు కీడు కోసం తొందరపడుతున్నారు. వారికి పూర్వం కను విప్పు కల్గించే సంఘటనలు (ఎన్నో)జరిగాయి. ప్రజలు హద్దుమీరి వ్యవహరించినప్పటికీ నీప్రభువు వారిని ఉపేక్షిస్తున్నాడు. అయితే నీప్రభువు అతి కఠినశిక్ష కూడా విధిస్తాడు. నీ మాటలు నిరాకరిస్తున్నవారు “ఈమనిషి దగ్గరకు ఇతని ప్రభువు నుండి ఏదైనా మహిమ ఎందుకు రాలేదు?” అంటున్నారు. కాని నీవు (దుష్పరిణామాలను గురించి ప్రజలను) హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతిజాతికీ ఒక మార్గదర్శి ఉన్నాడు. (6-7)
దేవునికి ప్రతి గర్భిణీ గర్భంలో రూపుదిద్దుకునే పిండం గురించి తెలుసు. ఆ పిండంలో జరిగే మార్పులు, లోపాలు కూడా ఆయనకు తెలుసు. ప్రతి వస్తువుకూ ఆయన దగ్గర ఒక నిర్ణీత పరిమాణం ఉంది. ఆయన ప్రతి విషయానికీ సంబంధించిన అంతర్ బాహ్యాల జ్ఞానం తెలిసినవాడు. ఆయన మహోన్నతుడు, సర్వాధికుడు. మీలో ఎవరైనా మెల్లిగా మాట్లాడినా, బిగ్గరగా మాట్లాడినా లేక రాత్రివేళ చీకటిలో దాగినా, పగటి వెల్తురులో తిరుగుతున్నా సరే ఆయనకు ఒకటే. (8-10)
ప్రతి మనిషికీ ముందూ వెనుకా దేవుడు నియమించిన (అదృశ్య) గూఢచారులు ఉన్నారు. ఆయన ఆజ్ఞతో వారతడ్ని పర్యవేక్షిస్తుంటారు. అయితే ఏజాతి అయినా తనను తాను సంస్కరించుకోనంత వరకూ దేవుడు దాని పరిస్థితి మార్చడు. ఇదొక యదార్థం. అలాగే ఏదైనా జాతికి దేవుడు కీడు తలపెట్ట దలచుకుంటే ఇక దానికి తిరుగే ఉండదు. దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా అలాంటి జాతిని ఏ శక్తీ ఆదుకోజాలదు. (11)
ఆయనే మీ ముందు మేఘ మెరుపుల్ని మెరిపిస్తున్నాడు. వాటిని చూసి మీరు ఆందోళన చెందుతారు; ఆశలు కూడా పెట్టుకుంటారు. ఆయనే నీటితో నిండిన మేఘా లను సృజిస్తున్నాడు. ఆ మేఘాలు అద్భుత గర్జనలతో ఆయన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతాయి. దైవదూతలు భయకంపితులై ఆయన్ని జపిస్తూ స్తోత్రగానం చేస్తారు. ఆయనే పిడుగుల్ని పంపుతున్నాడు. ప్రజలు దేవుని విషయంలో పరస్పరం వాదించుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఆయన తాను తలచుకున్న వారిపై వాటిని తెచ్చి పడవేస్తాడు. ఆయన అద్భుత యుక్తిపరుడు, అసాధారణ శక్తిసంపన్నుడు. (12-13)
(కనుక ఆపదలో) ఆయన్నే మొరపెట్టుకోవడం మీధర్మం. ఆయన్ని వదలి వారు మొరపెట్టుకుంటున్న మిధ్యాదైవాలు వారి మొరలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేవు. ఒకతను నీటి వైపు చేతులు చాచి “నీవు నానోటి దగ్గరకు వచ్చెయ్యి” అనంటే ఆ నీరు అతని నోటి దగ్గరకు వస్తుందా? ఎన్నటికీ రాదు. మిధ్యాదైవాలను మొరపెట్టుకునేవారి పరిస్థితి కూడా అంతే. అవిశ్వాసుల మొరలు గురితప్పిన బాణాలు వంటివే. (14)
ఆయనే (పరాత్పరుడు, పరమోన్నతుడయిన) అల్లాహ్. భూమ్యాకాశాల్లోని అణు వణువూ తన ఇష్టాయిష్టాలతో ప్రమేయంలేకుండా ఆయనకే సాష్టాంగపడుతోంది. ఉదయం, సాయంత్రం సమస్తవస్తువుల ఛాయలు కూడా ఆయనకే మోకరిల్లుతున్నాయి.
వారిని భూమ్యాకాశాల ప్రభువు ఎవరని అడుగు. దేవుడే అని చెప్పు. “మరి ఈ యదార్థం అంగీకరిస్తున్నప్పుడు, ఆ దేవుడ్ని వదలి మీరు తమకుతాము కూడా ఎలాంటి లాభనష్టాలు కలిగించుకోలేని మిధ్యాదైవాలను ఎందుకు రక్షకులుగా చేసుకున్నారు?” అని ప్రశ్నించు. “గుడ్డివాడు, కళ్ళున్నవాడు ఒకటేనా? చీకటివెలుగులు సమానమవు తాయా?” అని అడుగు. అలాకాకపోతే వారు కల్పించుకున్న మిధ్యాదైవాలు కూడా దేవుని మాదిరిగా దేన్నయినా సృష్టించాయా? ఈ కారణంగా వారు సృష్టినిర్వహణ గురించి సందేహంలో పడిపోయారా? వారికిలా స్పష్టంగా చెప్పు: “ప్రతి దానికీ దేవుడే సృష్టికర్త. ఆయన ఒక్కడే, అద్వితీయ శక్తిసంపన్నుడు, సర్వోన్నతుడు.” (15-16)
ఆ దేవుడే ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. దాన్ని యావత్తు నదీనదాలు తమతమ పరిమాణాలకు సరిపడేలా (నీటిని) తీసుకొని ప్రవహిస్తున్నాయి. ఆ వర్ష సమ యంలో వరదలొచ్చినప్పుడు వాటి ఉపరితలంపై నురుగులు కూడా ఏర్పడుతాయి. ప్రజలు నగలు, పాత్రలు తయారు చేయడానికి అగ్నిలో కరిగించే లోహాలపై కూడా ఇలాంటి నురుగులే ఏర్పడుతాయి. ఈ ఉపమానం ద్వారా దేవుడు సత్యాసత్యాల వ్యవ హారాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు. పైన ఏర్పడిన నురుగు ఇగిరిపోతుంది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వస్తువు అడుగున మిగిలిపోతుంది. ఈవిధంగా (రకరకాల) ఉపమానాల ద్వారా దేవుడు మీకు విషయాన్ని విశదీకరించి బోధిస్తున్నాడు. (17)
(కనుక) దేవుడు పంపిన సందేశం స్వీకరించేవారికే మేలు జరుగుతుంది. దాన్ని స్వీకరించనివారు దేవుని పట్టు నుండి బయటపడేందుకు తమ అధీనంలో యావత్తు ప్రపంచ సంపదలున్నా, ఇంకా వాటికి రెట్టింపు సమకూర్చుకున్నా వాటన్నిటినీ పాప పరిహారం క్రింద ఇవ్వడానికి సిద్ధమవుతారు. (అయినా వారికి విముక్తి లభించదు.) అలాంటివారిని నిలదీసి కఠినంగా (కర్మల్ని గురించి) విచారించడం జరుగుతుంది. చివరికి వారి నివాసం నరకమవుతుంది. అది పరమ చెడ్డనివాసం. (18)
నీప్రభువు నీపై అవతరింపజేసిన వాణి సత్యమని గుర్తించినవాడు, దాన్ని గుర్తిం చని అంధుడు ఒకటే అవుతారా? విజ్ఞులే (మా) హితోపదేశాన్ని గ్రహిస్తారు. (19)
ఆ విజ్ఞుల జీవనసరళి ఇలా ఉంటుంది: వారు దేవునితో చేసిన ప్రమాణాన్ని నెర వేరుస్తారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భంగపరచరు. స్థిరంగా ఉంచాలని దేవుడు ఆదే శించిన సంబంధాలను స్థిరంగా ఉంచుతారు. వారు తమ ప్రభువుకు సదా భయపడు తుంటారు. కఠినంగా (కర్మ)విచారణ జరుగుతుందేమోనని భయపడుతుంటారు. తమ ప్రభువు ప్రసన్నత ఆశిస్తూ సహనంతో వ్యవహరిస్తారు. అదీగాక, వారు ప్రార్థనా వ్యవస్థ స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి (సత్కార్యాలకోసం) రహస్యంగాను, బహిరంగంగాను ఖర్చుపెడతారు. చెడుని మంచి ద్వారా నిర్మూలిస్తారు.
అలాంటి వారికే పరలోక (స్వర్గ)సీమ ఉంది. (అంటే) శాశ్వత నిలయాలుగా లభించే స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు. వారి తాతముత్తాతలు, తల్లిదండ్రులు, భార్యా పిల్లల్లో సజ్జనులైనవారు కూడా స్వర్గప్రవేశం చేస్తారు. అప్పుడు నలువైపుల నుండి ఎందరో దైవదూతలు వారిని స్వాగతించడానికి వస్తారు. ఆ దూతలు వారికి స్వాగతం చెబుతూ “మీకు శాంతి కలుగుగాక! మీరు ఇహలోకంలో సహనంతో వ్యవహరిస్తూ (సాత్విక) జీవితం గడిపినందుకు ఈరోజు దీనికి అర్హులైపోయారు” అనంటారు. ఆహా! ఎంత శ్రేష్ఠమైనది ఈ పరలోక (స్వర్గ)సీమ!! (20-24)
దేవునితో గట్టి ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించేవారు, దేవుడు స్థిరంగా ఉంచా లని ఆదేశించిన సంబంధాలను విచ్ఛిన్నంచేసేవారు, ప్రపంచంలో కల్లోలాలు సృష్టించే వారు శాపగ్రస్తులౌతారు. వారికోసం పరలోకంలో పరమ చెడ్డనివాసం ఎదురుచూస్తోంది. దేవుడు తాను కోరిన విధంగా కొందరికి ఇతోధికంగా, మరికొందరికి పరిమితంగా ఉపాధి నిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్నారు. కాని పరలోక జీవితం ముందు ప్రాపంచిక జీవితం మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. (25-26)
ముహమ్మద్ (స)! నీమాట నిరాకరిస్తున్నవారు “ఈ మనిషి దగ్గరికి అతని ప్రభువు నుండి ఏదైనా నిదర్శనం ఎందుకు అవతరించదు?” అని అంటున్నారు. వారికిలా చెప్పు: దేవుడు తాను తలచుకున్న వారిని మార్గభ్రష్టత్వంలోనే పడిఉండేలా చేస్తాడు. ఆయన తనవైపు మరలేవారికి మాత్రమే తన వైపుకొచ్చే మార్గం చూపిస్తాడు. (27)
విశ్వాసుల హృదయాలే దైవస్మరణ వల్ల తృప్తిచెందుతాయి. గుర్తుంచుకోండి, దైవ స్మరణ వల్లనే మనశ్శాంతి లభిస్తుంది. సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారు ఎంతో అదృష్టవంతులు. వారికి అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (28-29)
ముహమ్మద్ (స)! పూర్వం అనేక జాతులు గతించాయి. (ఆయా జాతుల కోసం మేము ఎందరో ప్రవక్తలను ప్రభవింపజేసాం.) అలాగే ఇప్పుడు మేమీ జాతి ప్రజలకు మా సందేశం అందజేయడానికి నిన్ను ప్రవక్తగా నియమించి పంపాము. ఈ ప్రజలు కరుణామయుడైన దేవుడ్ని మరచి సత్యతిరస్కారంలో పడివున్నారు. వారికిలా చెప్పు: “ఆయనే నాప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్నే నేను నమ్ము కున్నాను. (ప్రతి వ్యవహారంలోనూ) నేను ఆయన వైపుకే మరలుతాను.” (30)
భూమిని బ్రద్దలుచేసే, పర్వతాలను పెకలించి నడిపే, లేదా మృతుల్ని లేపి మాట్లా డజేసే శక్తిగల ఖుర్‌ఆన్‌ని పంపినా లాభం ఏమిటీ? సమస్తకార్యాలు దేవుని అధీనంలోనే ఉన్నాయి. దేవుడు తలచుకుంటే మానవులందర్నీ సన్మార్గంలో నడిపించగలడు. విశ్వా సులు తృప్తిచెందడానికి ఇదొక్క మాట చాలదా?
అవిశ్వాసులపై వారి దుష్టకార్యాల మూలంగా ఏదో ఒక ఆపద వచ్చిపడుతూనే ఉంటుంది. అది వారి ఇళ్ళ సమీపంలో కూడా పడవచ్చు. దేవుని వాగ్దానం నెరవేరేదాకా ఇలా సంభవిస్తూనే ఉంటుంది. దేవుడు తన వాగ్దానాన్ని భంగపరచే ప్రసక్తే లేదు. నీకు పూర్వం కూడా ప్రవక్తలు హేళన చేయ బడ్డారు. అయితే మేము అవిశ్వాసుల్ని (కొంతకాలం) చూసీచూడనట్లు వదిలేశాం. ఆ తర్వాత వారిని పట్టుకున్నాం. చూడు, నా శిక్ష ఎంత కఠినంగా ఉండిందో. (31-32)
ప్రతి ప్రాణినీ ఓకంట కనిపెట్టివున్న దేవుడు వారి దుశ్చర్యల్ని గమనించడా? వారు దేవునికి సాటి కల్పించారు. (అలా చేయమని దేవుడు నిజంగా చెప్పివుంటే) వాటి పేర్లేమిటో, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో అడిగిచూడు. ఇంకా వారినిలా అడుగు: “మీరు దేవునికి కొత్త విషయం నేర్పుతున్నారా? ఆయనకు తన ధరణిలోని విషయాలు తెలియవనా? లేక మీ బుర్రకు ఏది తట్టితే దాన్నే గుడ్డిగా అనుసరిస్తున్నారా?
సత్యసందేశం నిరాకరించినవారికి వారి పన్నాగాలు ఆకర్షనీయమైనవిగా చేయ బడ్డాయి. (అలా)వారు సన్మార్గంలోకి రాకుండా నిరోధించబడ్డారు. దేవుడు దారితప్పించిన వాడికి మరెవరూ దారి చూపలేరు. అలాంటివారికి ఇహలోక జీవితంలో యాతనలు తప్పవు. పరలోకజీవితంలో అంతకంటే (ఎన్నో రెట్లు) కఠినమైన (నరక) యాతనలు చవి చూడవలసి ఉంటుంది. దైవశిక్ష నుంచి వారిని ఇక ఎవరూ కాపాడ లేరు. (33-34)
దేవునిపట్ల భయభక్తులు కలిగి (సాత్విక)జీవితం గడిపినవారికి దేవుడు స్వర్గప్రవేశం గురించిన వాగ్దానం చేశాడు. ఆ స్వర్గంలో (చల్లటి) సెలయేరులు ప్రవహిస్తుంటాయి. అక్కడ ఎన్నటికీ తరగని ఫలాలు ఉంటాయి. అక్కడి వృక్షచ్ఛాయలక్కూడా అంతం లేదు. దైవభీతిపరాయణుల జీవిత పర్యవసానం ఇలాగే ఉంటుంది. మరి సత్యతిరస్కారుల జీవిత పర్యవసానం? వారికోసం నరకాగ్ని కాచుకొని ఉంటుంది. (35)
ప్రవక్తా! గతంలో దివ్యగ్రంథం ఇవ్వబడిన ప్రజలు మేము నీపై దించిన ఈ గ్రంథం పట్ల సంతోషంగా ఉన్నారు. వారిలో కొన్నివర్గాలు ఇందులోని కొన్ని విషయాల్ని విశ్వసించడం లేదు. వారికిలా చెప్పు: “ఒక్క దేవుడ్నే ఆరాధించాలని, ఆయన దైవత్వంలో ఎవరినీ భాగస్వాములుగా చేయకూడదని నాకు ఆజ్ఞయింది. కనుక నేనీ విషయం వైపుకే ప్రజల్ని పిలుస్తున్నాను. ఈవిషయాన్నే నేను అనుసరిస్తున్నాను.” (36)
ఈ విషయాన్నే (మరింత వివరంగా) బోదిస్తూ అరబీ భాషలో మేమీ ఉత్తర్వుని నీపై అవతరింపజేశాం. ఈ యదార్థం నీదగ్గరకు వచ్చినప్పటికీ నీవు ప్రజల కోరికల్ని అనుసరిస్తే మాత్రం దేవుని పట్టు నుండి నిన్నెవరూ కాపాడలేరు. నీకు సహాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. (37)
నీకు పూర్వం మేము ఎందరో ప్రవక్తలను పంపాం. వారికీ భార్యాపిల్లల్ని ఇచ్చాం. దైవాజ్ఞ లేకుండా ఏప్రవక్తా తనంతటతాను ఏనిదర్శనం చూపలేడు. ప్రతి యుగానికి ఓ గ్రంథం ఉంది. దేవుడు తానుకోరినట్లు కొన్ని విషయాల్ని రద్దుచేసి కొన్నిటిని అలాగే ఉంచుతాడు. అన్నిటికీ మూలమైన మాతృగ్రంథం ఆయన దగ్గరే ఉంది. (38-39)
ప్రవక్తా! మేము వారిని హెచ్చరిస్తున్న దుష్పరిణామంలో కొంతభాగం వారికి నీ జీవిత కాలంలో చవిచూపినా, లేదా అది సంభవించకముందే మేము నిన్ను మా దగ్గరకు పిలుచుకున్నా మొత్తంమీద మా సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే నీ కర్తవ్యం. ఆపై లెక్క తీసుకోవడం మా బాధ్యత. (40)
మేమీ భూభాగాన్ని నలువైపుల నుంచి నరుక్కుంటూ ఎలా నడిచి వస్తున్నామో వారు గమనించడం లేదా? దేవుడు (వివిధ వ్యవహారాలకు సంబంధించిన) ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను ఎవరూ అడ్డుకోలేరు. (కర్మలను గురించి) లెక్క తీసుకోవడం ఆయనకు ఎంతో సేపు పట్టదు. (41)
వారికి పూర్వముండిన (తలబిరుసు)మనుషులు కూడా అనేక పన్నాగాలు పన్నారు. కాని తిరుగులేని పన్నాగం దేవుని చేతిలోనే ఉంది. ఎవరెలాంటి పనులు చేస్తున్నారో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. పరలోక (స్వర్గ) సదనం ఎవరి అదృష్టంలో ఉందో త్వరలోనే అవిశ్వాసులు తెలుసుకుంటారు. (42)
నీవు దేవుని చేత పంపబడిన ప్రవక్త కాదని అంటున్నారు ఈ అవిశ్వాసులు. వారికిలా చెప్పు: “నాకూ, మీకూ మధ్య దేవుడే సాక్షి. ఆ తరువాత దివ్య గ్రంథజ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తీ దీనికి సాక్షిగా ఉన్నాడు.” (43)