కురాన్ భావామృతం/అత్-తూర్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
52. తూర్ (తూర్‌పర్వతం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 49)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
తూర్ పర్వతం సాక్షి! వ్రాతచర్మం మీద రాయబడిన తెరచిన పుస్తకం సాక్షి! భక్తు లతో కళకళలాడే ఆరాధనాలయం సాక్షి! ఎత్తయిన (ఆకాశం)కప్పు సాక్షి! ఉప్పొంగే సము ద్రం సాక్షి! నీప్రభువు శిక్ష తప్పక సంభవిస్తుంది. దాన్ని ఏశక్తీ అడ్డుకోలేదు. ఆకాశం తీవ్రం గా కంపిస్తూ, పర్వతాలు పెకలి గాలిలో తేలియాడే రోజు అది సంభవిస్తుంది. (1-10)
నేడు తమాషా కోసం పిడివాదం చేస్తున్న అవిశ్వాసులకు ఆరోజు వినాశం తప్పదు. ఆరోజు (దైవదూతలు) వీరిని కొడుతూ, నెడుతూ నరకం వైపు తీసికెళ్తూ ఇలా అంటారు: “మీరు నిరాకరిస్తుండిన నరకాగ్ని ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా లేక మీకేమీ అర్థంకావడం లేదా? ఇక వెళ్ళండి. అందులో పడి మాడిపోండి. మీరు ఓర్పు వహించినా, వహించకపోయినా ఒక్కటే. (నరకయాతన ఏమాత్రం తగ్గించబడదు.) మీరు ఎలాంటి కర్మలు ఆచరించారో అలాంటి ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది.” (11-16)
పోతే దైవభీతిపరాయణులు అక్కడ స్వర్గవనాలు, భోగభాగ్యాలలో ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసాదించే మాధుర్యాలను ఆస్వాదిస్తూ సుఖసంతోషాలలో తేలి యాడుతారు. వారి ప్రభువు వారిని నరక యాతనల నుండి రక్షించాడు. “ఇక మీరు ఆచరించిన కర్మలకు ప్రతిఫలంగా (నేడు) హాయిగా తినండి, త్రాగండి.” (17-19)
వారక్కడ ఆసనాలపై దిండ్లకానుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. మేము వారికి అందమైన (విశాల) నేత్రాలుగల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాం. విశ్వాసు లతో పాటు వారి సంతానం కూడా విశ్వాసంలో వారి అడుగుజాడల్లోనే నడచుకొని ఉంటే, వారిని కూడా మేము (స్వర్గంలో) వారి దగ్గరికి చేర్చుతాం. వారి సుకృత ఫలాన్ని మేము ఏమాత్రం తగ్గించం. ప్రతిమనిషీ తనకర్మలకు తాకట్టుగా ఉన్నాడు. (20-21)
మేము వారికి రకరకాల పండ్లు, ఫలాలు, మాంసాహారాలు ప్రసాదిస్తాం. వారికిష్ట మైన ప్రతి వస్తువూ ఇస్తుంటాం. వారు అమితోత్సాహంతో ఒకరికొకరు మధుపాత్రలు అందించుకుంటారు. ఆ మధువు (ఇహలోకపు మద్యంలా) మనిషిని మైకంలో పడవేసి వదరుబోతులా చేయదు. అతడ్ని దుర్గుణుడిగా చేసి దుశ్చర్యలకు కూడా పురిగొల్పదు. వారి సేవకోసం అక్కడ దాచిన రత్నాల్లాంటి అందమైన బాల సేవకులు ఉంటారు. ఈ బాలసేవకులు అటూ ఇటూ తిరుగుతూ వారిని సేవిస్తూ ఉంటారు. (22-24)
వారు (ప్రపంచంలోని గత విశేషాల్ని గురించి) పరస్పరం మాట్లాడుకుంటారు. “మనం ఇంతకుపూర్వం మన ఇండ్లలో బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతుండే వాళ్ళం. చివరికి దేవుడు మనల్ని కరుణించి (ముఖాల్ని) మాడ్చే వడగాల్పుల యాతనల నుండి రక్షించాడు. మనం గతజీవితంలో (ఏకష్టమొచ్చినా) ఆయన్నే వేడుకునేవాళ్ళం. నిజంగా ఆయన మహోపకారి, అపార దయామయుడు” అని అంటారు. (25-28)
కనుక ప్రవక్తా! నీవు (యధాప్రకారం జనానికి) హితబోధ చేస్తూవుండు. నీ ప్రభువు దయవల్ల నీవు జ్యోతిష్కుడుగాని, పిచ్చివాడుగాని కానే కావు. వీరు (నీగురించి) “ఇతనో కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురుచూస్తున్నాం” అని అంటున్నారా? “సరే ఎదురుచూడండి. మీతోపాటు నేనూ ఎదురుచూస్తాను” అని చెప్పు. వారి బుద్ధులు వారి చేత ఇలాంటి మాటలే పలికిస్తున్నాయా? లేక వీరు దుర్మార్గంలో హద్దు మీరిపోయారా? “ఇతను ఖుర్‌ఆన్‌ని కల్పించుకున్నాడ”ని అంటున్నారా? అసలు వీరు సత్యాన్ని విశ్వసిం చడానికే సిద్ధంగా లేరు. వీరు తమ అభిప్రాయమే నిజమనుకుంటే ఇలాంటి అద్భుత మైన వాణినొక దాన్ని రచించి తీసుకు రమ్మను. (29-34)
వీరు సృష్టికర్త లేకుండానే తమంతట తాము తయారయి ఉనికిలోకి వచ్చారా? లేక తమకుతామే సృష్టికర్తలా? పోనీ, భూమ్యాకాశాల్ని సృష్టించారా వీరు? (అదేమీకాదు.) వీరి కసలు సత్యం మీద నమ్మకమే లేదు. వీరి దగ్గర నీ ప్రభువు నిక్షేపాలేమయినా ఉన్నాయా? లేక వాటి మీద వీరికి ఏమైనా అధికారం ఉందా? (35-37)
వారి దగ్గర ఏదైనా నిచ్చెన ఉందా, దానిమీద ఎక్కిపోయి ఊర్థ్వలోకాల మాటలు వినడానికి? వారిలో ఎవరైనా అలాంటి అగోచర విషయాలు ఏమైనా వింటే దానికతను గట్టి సాక్ష్యాధారాలు చూపాలి. దేవునికి కుమార్తెలు, మీకయితే కుమారులా? (38-39)
నీవేదైనా ప్రతిఫలం అడుగుతున్నావా వారిని, వారా రుణభారం క్రింద అణిగిపోవ డానికి? వారి దగ్గర అతీంద్రియజ్ఞానం ఉందా, దాని ఆధారంగా వీరు (తమ వాదనల్ని నిరూపించే) విషయాలు రాసుకోడానికి? లేక వారేదైనా పన్నాగం పన్నదలిచారా? అవిశ్వా సులు పన్నే పన్నాగం వారికే బెడిసికొడ్తుంది. వారికి దేవుడు కాక మరోఆరాధ్యుడున్నాడా? వారు చేస్తున్న బహుదైవారాధనకు దేవుడు ఎంతో అతీతుడు, పరమపవిత్రుడు. (40-43)
వారు నింగి తునకలు విరిగిపడుతున్నా వాటిని చూసి ఇవి దట్టమైన మబ్బు తునకలని అంటారు. కనుక ప్రవక్తా! వారిని వారి మానాన వదలిపెట్టు. చివరికి వారు (మొదలు నరికిన చెట్టులా) పడగొట్టబడే (ప్రళయ) దినానికి చేరుకుంటారు. ఆరోజు వారి పన్నాగాలు వారికి ఏవిధంగానూ ఉపయోగపడవు. వారిని ఎవరూ ఆదుకోలేరు. ఆ సమయం రాకముందు కూడా దుర్మార్గుల కోసం (ప్రకృతి వైపరీత్యాల రూపంలో) ఒక పరీక్ష ఉంది. కాని వారిలో చాలామంది ఈయదార్థం గ్రహించడం లేదు. (44-47)
ప్రవక్తా! నీవు మాత్రం నీ ప్రభువు నిర్ణయం వచ్చేవరకు సహనం పాటిస్తూ ఉండు. నీవు మా కనుసన్నల్లోనే ఉన్నావు. నీవు లేచినప్పుడల్లా నీ ప్రభువుని స్తుతిస్తూ, ఆయన (పవిత్రతను) స్మరిస్తూ ఉండు. రాత్రివేళల్లో కూడా ఆయన్ని స్మరిస్తూ ఉండు. నక్షత్రాలు అస్తమిస్తున్న (ఉషోదయం) వేళల్లో కూడా ఆయన్ని స్మరిస్తూ ఉండు. (48-49)