కురాన్ భావామృతం/అల్-మారిజ్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
70. మఆరిజ్ (ఆరోహణా సోపానాలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 44)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అడిగేవాడు శిక్షను గురించి అడుగుతున్నాడు. అది అవిశ్వాసులపై విరుచుకు పడేందుకు తప్పక వస్తుంది. దాన్నెవరూ ఆపలేరు. అది ఆరోహణాసోపానాల యజమాని అయిన దేవుని వైపునుండి వస్తుంది. పరిశుద్ధాత్మ, (ఇతర) దైవదూతలు ఆయన సన్నిధికి యాభైవేల సంవత్సరాలకు సమానమైన ఒక సుదీర్ఘదినంలో ఎక్కిపోతారు. కనుక ప్రవక్తా! సహనం వహించు, సంస్కారవంతమైన సహనం వహించు. (1-5)
వారా శిక్ష చాలా దూరం ఉందనుకుంటున్నారు. కాని మేము దాన్ని అతి సమీ పంగా చూస్తున్నాం. ఆ (శిక్ష వచ్చిపడే) రోజు ఆకాశం చమురు తెట్టులా మారిపోతుంది. పర్వతాలు రంగు రంగుల దూదిపింజాల్లా ఎగురుతాయి. ప్రతి ఒక్కడూ ఎదుటివాడి (దుస్థితి)ని చూస్తున్నప్పటికీ ఏ ప్రాణస్నేహితుడూ తన ఆప్తమిత్రుడ్ని పట్టించుకోడు.
ఆరోజు పాపాత్ములు శిక్ష నుండి తప్పించుకోవడానికి తమ భార్యాపిల్లల్ని, అన్న దమ్ముల్ని, తమకు ఆశ్రయం ఇవ్వగలిగిన అతి సన్నిహిత బంధువర్గాన్ని, చివరికి లోకం లోని వారందర్నీ పరిహారంగా ఇవ్వదలచుకుంటారు. అయినా (శిక్ష నుండి బయట పడటం) జరగదు. అది తీవ్రంగా ప్రజ్వరిల్లే నరకాగ్ని జ్వాల. అది చర్మాన్ని వలిచి మాడ్చి వేస్తుంది. సత్యానికి విముఖుడై పోవడమేగాక ధనాన్ని కూడబెట్టి దాన్ని మాటిమాటికి సర్ది పెట్టుకుంటూ భద్రపరచుకున్న ప్రతివాడ్నీ అది ఎలుగెత్తి పిలుస్తుంది. (6-18)
మానవుడు సహనం లేనివాడుగా సృజించబడ్డాడు. ఏదైనా కాస్త ఆపద వస్తే చాలు, కంగారుపడిపోతాడు. సంపద ఒనగూడినప్పుడు పిసినారితనం వహిస్తాడు. అయితే కొందరు అలా చేయరు. వారి గుణగణాలు ఇలా ఉంటాయి:
- వారు నమాజ్ చేసేవారు; నిత్యం క్రమం తప్పకుండా నమాజ్ విధి పాటిస్తారు.
- వారి సంపదలో అర్థించేవారికి, అర్థించనివారికి ఒక నిర్ణీత భాగం ఉంటుంది.
- వారు (పరలోక) తీర్పుదినాన్ని విశ్వసిస్తారు.
- తమ ప్రభువు శిక్షకు భయపడుతుంటారు. వారి ప్రభువు శిక్షే అలాంటిది, దాని పట్ల ఎవరూ నిర్భయంగా ఉండకూడదు.
- వారు తమ మర్మావయవాలను కాపాడుకుంటారు. అయితే తమ భార్యలు, తమ బానిసస్త్రీల విషయంలో ఇలా చేయకుండా ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. అది తప్ప మరేదైనా కోరేవారే హద్దు మీరేవారు.
- తమను నమ్మి అప్పగించబడేదాన్ని కాపాడే నిజాయితీపరులు.
- ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వాగ్దాన పాలకులు.
- సాక్ష్యం విషయంలో నీతి, న్యాయాలకు కట్టుబడి ఉండేవారు.
- (ఏమరుపాటుకు లోనుకాకుండా) తమ నమాజులను కాపాడుకునేవారు. వీరెంతో గౌరవప్రదంగా స్వర్గవనాలలో (హాయిగా) ఉంటారు. (19-35)
సరే, ప్రవక్తా! ఈ తిరస్కారులు కుడిఎడమల వైపు నుంచి జట్లుజట్లుగా నీ దగ్గరకి పరుగెత్తుకొస్తున్నారెందుకు? వారిలో ప్రతిఒక్కడూ భోగభాగ్యాలతో కూడిన స్వర్గంలో ప్రవే శింపజేయబడతానని ఆశలు పెట్టుకున్నాడా? అలా ఎన్నటికీ జరగదు. మేము తమను ఎలాంటి పదార్థంతో పుట్టించామో వారికీ తెలుసు. కనుక ప్రవక్తా! తూర్పు పడమరల ప్రభువు సాక్షిగా చెబుతున్నాం. మేము తలచుకుంటే వీరి స్థానంలో వీరికంటే శ్రేష్ఠులైన మానవుల్ని తీసుకురాగలం. మాకా శక్తి ఉంది. మాతో ఎవరూ పోటీపడలేరు. (36-41)
కాబట్టి వారిని ఆటపాటల్లో, పనికిమాలిన మాటల్లోనే పడిఉండనివ్వు. అదే స్థితిలో చివరికి వారు తమకు వాగ్దానం చేయబడుతున్న రోజుకు చేరుకుంటారు. అప్పుడు వారు తమ విగ్రహాలవైపు దౌడు తీస్తున్నట్లు, సమాధుల నుంచి లేచి ఒకరికొకరు పోటీ పడుతూ పరుగెత్తుతారు. (అయితే తీరా చేరవలసిన చోటికి చేరినప్పుడు) వారి చూపులు (పశ్చాత్తాపంతో) క్రిందికి వాలిపోతాయి. అవమానం, అప్రతిష్ఠలు వారిని ఆవరిస్తాయి. అదే వీరికి వాగ్దానం చేయబడుతున్న (ప్రళయ) దినం! (42-44)