కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ


4. నిసా ( స్త్రీలు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 176)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు. అదేప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. తిరిగి వారిరువురి నుండి కోటానుకోట్ల మంది స్త్రీపురుషుల్ని ప్రపంచంలో విస్తరింపజేశాడు. మీరు ఒకరిద్వారా మరొకరు తమ అవసరాలు గడుపుకోవడానికి దేవుని పేరును ఒక సాధనంగా చేసుకుంటారు. అలాంటి దేవునికి భయపడండి. రక్త సంబంధీకులతో మీకు ఏర్పడివున్న సహజ బాంధవ్యాన్ని తెంచకండి. దేవుడు మీ చర్యల్ని ఓకంట గమనిస్తు న్నాడన్న సంగతి మరచిపోకండి. (1)
అనాథలకు రావలసిన ఆస్తులు వారికి ఇచ్చివేయండి. వారికి దక్కవలసిన మంచి సొమ్ముకు బదులు నాసిరకం సొమ్ము అప్పగించకండి. వారి ధనాన్ని మీధనంతో కలిపేసి (లెక్కాపత్రం లేకుండా) తినకండి. అలా చేయడం ఘోరమైన పాపం. (2)
ఒకవేళ మీరు అనాథ బాలికల్ని వివాహమాడే పక్షంలో వారికి న్యాయం చేయలే మని భయపడితే (వారిని వదలి) మీకు నచ్చిన (ఇతర) స్త్రీలలో ఇద్దర్నిగాని, ముగ్గుర్ని గాని, నల్గుర్నిగాని చేసుకోవచ్చు. అయితే వారిమధ్య కూడా న్యాయంగా వ్యవహరించలే మని భావిస్తే ఒక్కర్నే వివాహమాడండి; లేదా మీ అధీనంలోకి వచ్చిన (బానిస) స్త్రీలను వివాహమాడండి. ఈవిధంగా న్యాయం చేయలేమన్న భయం మీకిక ఉండదు. (3)
స్త్రీలకు లభించవలసిన మహర్‌ (వధుకట్నం)ను (విధిగా భావించి) వారికి సంతో షంగా ఇచ్చివేయండి. అయితే వారు సంతోషంగా కొంత మహర్‌ మాఫీచేస్తే దాన్ని మీరు నిరభ్యంతరంగా అనుభవించవచ్చు. (4)
దేవుడు మీకు జీవనాధారంగా చేసిన సంపదను మూఢులకు అప్పగించకండి. అయితే వారికి తిండీ, బట్టా (లాంటి జీవితావసరాలు) సమకూర్చండి. వారికి హితబోధ చేస్తూ ఉండండి. (5)
అనాథ బాలలకు పెళ్ళీడు వచ్చే వరకు వారి స్థితిగతులు గమనిస్తూ ఉండండి. ఆ తరువాత వారిలో తగిన యోగ్యతార్హతలు ఉన్నాయని మీకు అన్పిస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. అంతేగాని, వారు పెద్దవారయిన తరువాత తమ (ఆస్తి) హక్కు అడుగుతారన్న భయంతో ముందుగానే వారి సొమ్మును (దుబారా చేస్తూ) త్వరత్వరగా తిని హరించి వేయకండి. (అనాథ) సంరక్షకుడు స్థితిపరుడయితే అలాంటి సొమ్ము జోలికే పోకూడదు. ఒకవేళ అతను పేదవాడయితే సముచిత రీతిలో కొంత సొమ్ము వాడుకోవచ్చు. వారి ఆస్తి వారికి అప్పగించవలసి వచ్చినప్పుడు కొందరు సాక్షుల్ని కూడా పెట్టుకోండి. లెక్క తీసుకోవడానికి దేవుడు ఒక్కడే చాలు. (6)
తల్లిదండ్రులు, ఇతర బంధువులు వదలిన ఆస్తి కొద్దిగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా అందులో పురుషులకూ వాటా ఉంది; స్త్రీలకూ వాటా ఉంది. ఇవి (దైవ)నిర్ణీత వాటాలు. (వాటిని తగ్గించడానికి లేదా పెంచడానికి ఎవరికీ అధికారం లేదు.) ఆస్తిపంపకం జరుగు తున్నప్పుడు వారసులుకాని (నిరుపేద) బంధువులు, అనాథలు, అగత్యపరులు ఎవరైనా వస్తే వారిక్కూడా ఎంతోకొంత ఇచ్చిపంపండి. వారితో మృదువుగా మాట్లాడండి. (7-8)
ప్రజలు చనిపోతూ తమ పసిపిల్లల్ని నిస్సహాయ స్థితిలో వదలిపోవలసివస్తే, ఆ తర్వాత వారి పరిస్థితి ఏమిటని ఆలోచించి భయపడాలి. కనుక వారు (ఇతరుల అనాథ పిల్లల విషయంలో కూడా) దేవునికి భయపడుతూ సవ్యమైన మాటనే పలకాలి. అన్యా యంగా అనాథబాలల ఆస్తుల్ని తింటున్నవారు నిజానికి తమ పొట్టలను అగ్నితో నింపు కుంటున్నారు. వారు తప్పక భగభగమండే అగ్నిగుండంలో విసిరేయబడతారు. (9-10)
మీ సంతానం విషయంలో దేవుడు మిమ్మల్ని ఇలా ఆదేశిస్తున్నాడు:

  • ఒక పురుషుని వాటా ఇద్దరు స్త్రీల వాటాలతో సమానం.
  • (మృతునికి) ఇద్దరు లేక ఇద్దరికన్నా ఎక్కువమంది కుమార్తెలుంటే, వారికి అతని ఆస్తిలో మూడింట రెండు వంతులు లభించాలి.
  • ఒకవేళ ఒకే కుమార్తె ఉంటే ఆమెకు అతని ఆస్తిలో అర్థభాగం లభించాలి.
  • మృతుడు సంతానం కలిగివున్నవాడయితే అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికీ అతని ఆస్తిలో ఆరోవంతు లభించాలి.
  • అతనికి సంతానం లేకుండా తల్లిదండ్రులే అతని వారసులైతే, తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి.
  • మృతునికి అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా ఉంటే, తల్లికి ఆరవ భాగం రావాలి.
  • మృతుడు రాసిపోయిన వీలునామా (లోని విషయాలు) నెరవేర్చడంతో పాటు, అతను చేసిన అప్పులన్నీ తీర్చిన తరువాతనే ఈ వాటాలన్నీ పంచాలి.
  • మీ తల్లిదండ్రులలో, మీ సంతానంలో ప్రయోజనం రీత్యా ఎవరెక్కువ సన్ని హితులో మీకు తెలియదు. ఇవి దేవుడు నిర్ణయించిన వాటాలు. దేవుడు సమస్త విషయాలు ఎరిగినవాడు, ఎంతో వివేచనాపరుడు. (11)
  • మీ భార్యలకు సంతానం లేనప్పుడు వారు వదలివెళ్ళిన ఆస్తిలో మీకు అర్థభాగం లభిస్తుంది. సంతానం ఉంటే, మీకు నాల్గింట ఒక భాగమే దక్కుతుంది. కాని రాసిన వీలునామా నెరవేర్చి, చేసిన అప్పులన్నీ తీర్చిన తర్వాతే ఇలా జరగాలి.
  • మీకు సంతానం లేకపోతే మీరు వదలిన ఆస్తిలో మీ భార్యలకు నాల్గోవంతు వాటా లభిస్తుంది. సంతానముంటే ఎనిమిదోవంతు మాత్రమే దక్కుతుంది. మీరు రాసిన వీలునామా నెరవేర్చి, అప్పులన్నీ తీర్చిన తర్వాతే ఈవాటాలు లభిస్తాయి.
  • పురుషునికి లేక స్త్రీకి సంతానంగాని, తల్లిదండ్రులుగాని లేకుండా ఒక సోదరుడో, ఒక సోదరియో ఉంటే వారిద్దరిలో ఒక్కొక్కరికి ఆరోవంతు లభిస్తుంది. సోదరులు, సోదరీలు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే మొత్తం ఆస్తిలో మూడింట ఒక భాగం వారికి లభిస్తుంది. అదైనా రాసిన వీలునామా నెరవేర్చి, అప్పులు తీర్చిన తర్వాతనే లభిస్తుంది. అయితే వీలునామా (ఎవరికీ) బాధాకరంగా ఉండరాదు. ఇది దేవుడు జారీ చేస్తున్న ఆజ్ఞ. దేవుడు సర్వజ్ఞుడు; ఎంతో మృదుహృదయుడు. (12)

ఇవి దేవుడు నిర్ణయించిన పరిమితులు. (వీటిని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు.) దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులై నడచుకునేవారిని దేవుడు సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అక్కడే వారు కలకాలం (సుఖంగా) ఉంటారు. ఇదే అసలు ఘనవిజయం. దీనికి భిన్నంగా దేవునికి, ఆయన ప్రవక్తకు అవిధే యులై, దేవుడు నిర్దేశించిన పరిమితుల్ని అతిక్రమించేవారిని ఆయన నరకాగ్నిలో పడ వేస్తాడు. అక్కడే వారు ఎల్లకాలం (నానా యాతనలు అనుభవిస్తూ) పడిఉంటారు. వారికి అత్యంత అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. (13-14)
మీ స్త్రీలలో ఎవరైనా సిగ్గుమాలిన పనికి పాల్పడితే, అందుకు మీలో నలుగురిని సాక్షులుగా తీసుకురావాలి. ఆ నల్గురు సాక్ష్యమిస్తే, అప్పుడు ఆ స్త్రీలను వారి ఇండ్లలో నిర్బంధించాలి. వారికి (సహజ)మరణం వచ్చేదాకా లేదా దేవుడు వారికేదైనా దారి చూపే దాకా ఇలా నిర్బంధంలో ఉంచాలి. మీలోఎవరైనా (స్త్రీపురుషులు) ఈ దుశ్చర్యకు వడి గడ్తే వారిద్దర్నీ శిక్షించాలి. వారు పశ్చాత్తాపం చెంది తమను తాము సంస్కరించుకుంటే వారిని వదలిపెట్టాలి. దేవుడు అమిత క్షమాశీలి, అపార కృపాశీలుడు. (15-16)
అజ్ఞానం వల్ల కాలుజారి, ఆ తరువాతయినా పశ్చాత్తాపం చెంది, తమ నడవడి కను సరిదిద్దుకునేవారిని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. అలాంటివారినే ఆయన కనిక రిస్తాడు. దేవుడు సమస్తం ఎరిగినవాడు, ఎంతో వివేచనాపరుడు. (17)
అయితే జీవితాంతం చెడ్డపనులు చేస్తూ, చెడుతిరుగుళ్ళు తిరుగుతూ, చావు దగ్గర పడగానే “నేనిప్పుడు పశ్చాత్తాపపడుతున్నా, లెంపలు వేసుకుంటున్నా”అనే వారిని దేవుడు మన్నించడు. అలాగే అవిశ్వాస స్థితిలో చనిపోయేవారి క్షమాపణను కూడా దేవుడు స్వీక రించడు. అలాంటివారికి మేము అతి బాధాకరమైన యాతన సిద్ధపరచి ఉంచాం. (18)
విశ్వాసులారా! బలవంతంగా స్త్రీల (ఆస్తి)కి వారసులై పోవడం మీకు ధర్మసమ్మ తం కాదు. అలాగే మీరు మీ భార్యలకిచ్చిన మహర్‌లో కొంతభాగం కాజేసే ఉద్దేశ్యంతో వారిని వేధించడం కూడా మీకు భావ్యంకాదు. అయితే వారేదైనా చెడ్డపనికి పాల్పడినట్లు స్పష్టంగా తెలిస్తే మాత్రం (వారిని శిక్షించడానికి మీకధికారం ఉంది). వారి పట్ల మంచిత నం కలిగివుంటూ సంసారం చేయండి. ఒకవేళ వారు మీకు (ఒక విషయంలో) నచ్చక పోతే, నచ్చనిదానిలోనే దేవుడు మీకెంతో శ్రేయస్సు, మేలు పెట్టి ఉండవచ్చు. (19)
మీరు గనక ఒకభార్య స్థానంలో మరొక భార్యను చేసుకోవడానికి నిర్ణయించు కుంటే, మొదటి భార్యకు మీరు ఎంతపెద్ద ధనరాసి ఇచ్చివున్నా దాన్ని ఎట్టి పరిస్థితి లోనూ మళ్ళీ తీసుకోరాదు. మీరామెపై నీలాపనిందలు వేసి, మరీ అంత అన్యాయంగా దాన్ని తిరిగి తీసుకుంటారా? (ఎంత సిగ్గుచేటు!) మీరిద్దరు ఒకరి ద్వారా మరొకరు సుఖం అనుభవించారు. ఆమె మీదగ్గర (వివాహం ద్వారా) గట్టి వాగ్దానం తీసుకుంది. అలాంటప్పుడు మీరామె ధనాన్ని బలవంతంగా ఎలా తీసుకుంటారు? (20-21)
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను (వారి మరణానంతరం) మీరు ఎన్నటికీ వివాహమాడకండి. లోగడ జరిగిందేదో జరిగింది. (ఇకముందు అలాంటి ఘోరాలకు పాల్పడకండి.) ఇది నీతిబాహ్యమైన పని, అవాంఛనీయమైన దుష్టసంప్రదాయం. (22)
మీ తల్లులు, కుమార్తెలు, అక్కాచెల్లెళ్ళు, మేనత్తలు, పినతల్లులు, పెత్తల్లులు, మేనకోడళ్ళు, సోదరకుమార్తెలు, మీకు పాలుపట్టిన స్తన్యసంబంధ తల్లులు, మీరు పాలుపంచుకున్న స్తన్యసంబంధ సోదరీలు, మీ భార్యలతల్లులు, మీతో లైంగిక సంబం ధం ఏర్పడిన మీభార్యలకు (గతభర్తల ద్వారా) పుట్టి మీసంరక్షణలో పెరిగిన కుమార్తెలు- మీకు నిషేధించబడ్డారు. (వీరిని మీరు చేసుకోరాదు.) పోతే, మీతో లైంగిక సంబంధం ఏర్పడకుండా (పెళ్ళి మాత్రమే జరిగి)ఉంటే (అలాంటి భార్యల్ని వదలి వారి కుమార్తెల్ని చేసుకోవడంలో) ఎలాంటి తప్పులేదు. ఇక కన్నకొడుకుల (వితంతువులైన లేక విడాకులు పొందిన) భార్యలు (అంటే కోడళ్ళు) కూడా మీకు నిషేధించబడ్డారు. అంతేకాదు, ఒక వివాహబంధంలో (ఏకకాలంలో) ఇద్దరు అక్కాచెల్లెళ్ళను ఉంచడం కూడా నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగింది. దేవుడు అమిత క్షమాశీలి, అపార కృపాశీలుడు. (23)
(యుద్ధంలో) మీచేతికి చిక్కిన స్త్రీలు తప్ప ఇతరులు వివాహమాడిన స్త్రీలు కూడా మీకు నిషేధించబడ్డారు. ఇది దైవశాసనం. దాన్ని పాటించడం మీ విధ్యుక్తధర్మం.
వీరుతప్ప ఇతర స్త్రీలందర్నీ ధనవినియోగం ద్వారా మీరు పెండ్లాడవచ్చు. అయితే వివాహలక్ష్యం శీలరక్షణయి ఉండాలిగాని, స్త్రీలోలత్వమై ఉండకూడదు. మీరు వారి వల్ల అనుభవించే దాంపత్య సుఖానికిగాను వారికి చెల్లించవలసిన నిర్ణీత మహర్‌ ధనాన్ని విధిగా భావించి చెల్లించాలి. మహర్‌ నిర్ణయం జరిగిన తర్వాత మీరిద్దరు ఆ విషయంలో పరస్పరం ఇష్టపూర్వకంగా ఏదైనా చేయదలచుకుంటే చేయవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. దేవుడు సమస్తం ఎరిగిన వాడు; ఎంతో వివేచనాపరుడు. (24)
మీలో ఎవరికైనా విశ్వసించిన స్వతంత్ర స్త్రీలను వివాహమాడే స్తోమత లేకపోతే అలాంటివారు తమ అధీనంలోకి వచ్చిన ముస్లిం బానిస స్త్రీలను వివాహమాడాలి. దేవునికి మీ విశ్వాసస్థితి బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒకే సృష్టిరాశికి చెందినవారు. కనుక బానిస స్త్రీలను వారి యజమానుల అనుమతి తీసుకొని వివాహమాడండి. చట్టం ప్రకారం వారికి చెల్లించవలసిన మహర్‌ కూడా చెల్లించాలి. అయితే వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచండి. విచ్చలవిడిగా చెడు తిరుగుళ్ళు తిరగనివ్వకండి. దొంగచాటుగా ప్రేమ కలాపాలకు పాల్పడనీయకండి.
ఒకవేళ వారు వివాహబంధంలోకి వచ్చి భద్రత పొందిన తర్వాత దుర్నడతకు పాల్ప పడితే అలాంటివారికి స్వతంత్ర స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష విధించాలి. పెళ్ళి చేసు కోని కారణంగా తమ ధర్మనిష్ఠకు భంగం కలుగుతుందని భయపడేవారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంది. అయితే మీరు (అలాంటి పరిస్థితిలో పెళ్ళి చేసుకోకుండా) సహనం వహిస్తే అది మీకెంతో శ్రేయస్కరం అవుతుంది. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (25)
దేవుడు తన సూక్తులు వివరిస్తూ మీకు పూర్వం సజ్జనులు నడచిన బాటలోనే మిమ్మల్ని నడప గోరుతున్నాడు. ఆయన మిమ్మల్ని కటాక్షించదలిచాడు. దేవుడు గొప్ప జ్ఞానసంపన్నుడు, ఎంతో వివేకవంతుడు. ఆయన మిమ్మల్ని కటాక్షించదలిచాడు. అయితే మనోవాంఛలకు బానిసలైనవారు మిమ్మల్ని సన్మార్గం నుంచి తప్పించి దూరంగా ఉంచ గోరుతున్నారు. మానవుడు (సహజంగానే) బలహీనుడుగా పుట్టాడు. అందువల్ల దేవుడు మీపై ఉన్న ఆంక్షల భారాన్ని తగ్గించదలిచాడు. (26-28)
విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి. పరస్పరామోదంతో వ్యాపార లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు జరుపుకోవచ్చు. (అన్యాయం, అక్రమం, హత్య, ఆత్మహత్యల ద్వారా) మిమ్మల్ని మీరు హతమార్చుకో కండి. దేవుడు మీ విషయంలో ఎంతో దయామయుడని తెలుసుకోండి. (29)
అన్యాయం, అక్రమాలతో ఇలా చేసేవాడ్ని మేము త్వరలోనే నరకాగ్నిలో విసరి వేస్తాం. ఇది దేవునికి ఏమంత కష్టం కాదు. మిమ్మల్ని వారిస్తున్న ఘోరమైన పాపాలను మీరు మానుకుంటే మేము మీ చిన్నచిన్న పాపాల్ని మీ కర్మలచిట్టా నుండి తొలగిస్తాం. పైగా మిమ్మల్ని ప్రతిష్ఠాకరమైన (స్వర్గ)ధామంలో ప్రవేశింపజేస్తాము. (30-31)
మేము మీలో కొందరికి ఇతరులకన్నా ఎక్కువ ప్రసాదించినదాన్ని మీరు ఆశించ కండి. పురుషులకు వారు సంపాదించుకున్న దానికి తగిన ప్రతిఫలం ఉంది. అలాగే స్త్రీలకు కూడా వారు సంపాదించుకున్న దానికి తగినట్లే ప్రతిఫలం లభిస్తుంది. అయితే మీరు దేవుని అనుగ్రహం వేడుకోండి. ఆయన ప్రతి విషయం ఎరిగినవాడు. (32)
తల్లిదండ్రులు, బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము (ఇదివరకే) వారసుల్ని నిర్ణ యించాము. ఇక మీరు వాగ్దానం చేసిన వారికి కూడా (మీ జీవితంలోనే) వారి భాగం ఇచ్చి వేయండి. దేవుడు సర్వసాక్షిగా ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. (33)
దేవుడు స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చుపెడ్తున్నందు వల్ల పురుషులు స్త్రీలపై వ్యవహారకర్తలు అవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తలకు విధేయత చూపుతూ వారి కను సన్నలలో నడచుకుంటారు. పురుషులు (ఇంటి పట్టున) లేనప్పుడు దేవునిరక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురుచెప్పి తిరగబడతారని భయమున్న స్త్రీలకు (నయాన భయాన) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరుచేయండి. (అప్పటికీ మీమాట వినకపోతే) కొట్టండి. ఆతర్వాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన దేవుడు ఉన్నాడని గుర్తుంచుకోండి. (34)
భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయముంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని, భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలసి పరిస్థితి చక్కదిద్ద దలచుకుంటే దేవుడు దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. దేవుడు సర్వజ్ఞాని, సమస్తం ఎరిగినవాడు. (35)
మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయనకు (దైవత్వంలో) ఎవరినీ సాటి కల్పించ కండి. తల్లిదండ్రుల పట్ల సద్వర్తనంతో వ్యవహరించండి. బంధువులు, అనాథలు, నిరు పేదలతో మంచిగా మసలుకోండి. ఇరుగుపొరుగు బంధువులకు, పరిచయంలేని పొరుగువారికి, (మీ దైనందిన కార్యకలాపాలలో) తారసపడే మిత్రులకు, బాటసారులకు, మీ అధీనంలో వున్న బానిసలకు మేలు చేయండి. దేవుడు అహంకారుల్ని, ప్రగల్భాలు పలికేవారిని ఎన్నటికీ ప్రేమించడు. (36)
అలాగే తాము పిసినారితనం వహించడమేగాక ఇతరులక్కూడా పిసినారితనం నూరిపోసేవారిని సైతం దేవుడు ప్రేమించడు. వారు తమకు దేవుడు ప్రసాదించిన అను గ్రహాన్ని (ధనాన్ని) కూడబెడ్తారు. ఇలాంటి కృతఘ్నుల కోసం మేము నీచమైన యాతనను సిద్ధపరచివుంచాం. వారేదైనా ఖర్చుపెట్టినా లోకుల మెప్పు కోసమే ఖర్చుపెడ్తారు. వారు దేవుడ్నీ విశ్వసించరు, పరలోకాన్నీ విశ్వసించరు. కారణం, అలాంటివారికి షైతాన్‌ సహ చరుడైపోవడమే. షైతాన్‌ సహచర్యం అత్యంత దుష్టసహచర్యం. (37-38)
వారు గనక దేవుడ్ని, ప్రళయదినాన్ని విశ్వసించి, తమకు దైవం ప్రసాదించినదాన్ని సద్వినియోగం చేస్తే వారికి వచ్చే నష్టం ఏమిటీ? వారి సంగతి దేవునికి బాగా తెలుసు. దేవుడు ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయడు. ఎవరైనా ఒక సత్కార్యం చేస్తే దేవుడు దానికి రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు. అంతేకాకుండా, ఆయన తన (ప్రత్యేక) అను గ్రహనిక్షేపాల నుండి కూడా అమితమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (39-40)
(ముహమ్మద్‌!) మేము (పరలోక న్యాయస్థానంలో) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, ఆ సాక్షులపై నిన్ను సాక్షిగా నిలబెట్టే రోజున వీరి పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు దైవప్రవక్తను నిరాకరించి, అతనికి అవిధేయులైన అవిశ్వాసులు (పశ్చాత్తాపంతో) “అయ్యయ్యో! భూమి బ్రద్దలయి తామందులో కూరుకుపోతే ఎంత బాగుండు!!” అని వాపోతారు. కాని వారు దేవుని దగ్గర ఏ విషయాన్నీ దాచలేరు. (41-42)
విశ్వాసులారా! మీరు మైకంలో ఉన్నప్పుడు ప్రార్థన దరిదాపులకు పోకండి. ప్రార్థనలో మీరు పఠిస్తున్నదేమిటో మీకు తెలుస్తున్నప్పుడే ప్రార్థన చేయాలి. అలాగే (సంభోగం, వీర్య స్ఖలనాలతో) అశుద్ధావస్థలో ఉన్నప్పుడు కూడా స్నానంచేసే వరకు నమాజు దరిదాపులకు పోకూడదు, (మసీదు) దారిగుండా పోవడం అనివార్యమైతే తప్ప. ఇక వ్యాధిగ్రస్తులైనప్పుడు, ప్రయాణావస్థలో ఉన్నప్పుడు, మలమూత్ర విసర్జనకు వెళ్ళి నప్పుడు లేదా స్త్రీని కలసినప్పుడు నీరు లభించకపోతే శుభ్రమైన మట్టి ఉపయోగించండి. దాన్ని ముఖాల మీద, చేతుల మీద రుద్దుకోండి. నిస్సందేహంగా దేవుడు అమిత క్షమాశీలి, అపార కృపాశీలుడు. గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడినవారిని నీవు చూడ లేదా? వారు స్వయంగా మార్గభ్రష్టత్వం కొనితెచ్చుకోవడమే గాక, మిమ్మల్ని కూడా మార్గభ్రష్టుల్ని చేయజూస్తున్నారు. మీ శత్రువుల సంగతి దేవునికి బాగా తెలుసు. మీ సంరక్షణకు, సహాయానికి దేవుడే చాలు. (43-45)
యూదులైనవారిలో కొందరు పదాలను వాటి సందర్భాన్నుండి మార్చివేస్తారు. నిజ ధర్మానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో వారు నాలుకలు మెలితిప్పుతూ “మేము విన్నాం- త్రోసిపుచ్చాం, వినండి-విన్పించకండి, మామాట వినండి” అని అంటారు. (అలా అనడా నికి బదులు) వారు “మేము విన్నాం, విధేయులై పోయాము; వినండి, కాస్త మా వైపు చూడండి” అనంటే వారికి శ్రేయస్కరంగా ఉండేది. అది సవ్యంగా కూడా ఉండేది. కాని దేవుడు వారి తలబిరుసు, తిరస్కారాల కారణంగా వారిని శపించాడు. అందువల్ల వారిలో బహు కొద్దిమంది తప్ప ఎవరూ సత్యాన్ని విశ్వసించరు. (46)
గ్రంథప్రజలారా! మేము (అవిశ్వాసుల) ముఖాలు చెడగొట్టి వెనక్కి తిప్పివేయక ముందే, లేదా శనివారనియమం ఉల్లంఘించినవారిని శపించినట్లు వారిని శపించక ముందే మేము పంపిన ఈ గ్రంథాన్ని విశ్వసించండి. ఇది మీ దగ్గరున్న గ్రంథాన్ని కూడా ధృవీకరిస్తోంది. గుర్తుంచుకోండి, దైవాజ్ఞ అమలు జరిగితీరుతుంది. (47)
దేవుడు తనకు సాటి కల్పించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. అది తప్ప ఇతర పాపాలను ఆయన తలచుకుంటే క్షమిస్తాడు. దేవునికి (ఆయన దైవత్వంలో, గుణగణాల్లో, శక్తిసామర్థ్యాల్లో) సాటి కల్పించడమంటే ఘోరమయిన పాపం మూట కట్టుకున్నట్లే. (48)
(ముహమ్మద్‌!) నీవు ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకునే వారిని చూడలేదా? దేవుడు తాను తలచుకున్న వారిని మాత్రమే శుద్ధిచేస్తాడు. వారికి అణుమాత్రం కూడా అన్యాయం జరగదు. చూడు, వారు దేవుడ్ని గురించి ఎలాంటి దారుణమైన అబద్ధాలు కల్పిస్తున్నారో! ఘోరమైన పాపం కావడానికి ఇదొక్క నిర్వాకం చాలు. (49-50)
నీవు గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడినవారిని చూడలేదా? వారు భ్రష్టాచారా లను, మిథ్యాదైవాలను నమ్ముతున్నారు. పైగా వారు, విశ్వాసులకంటే (మక్కా బహుదై వారాధకులైన) అవిశ్వాసులే కాస్తంత సన్మార్గంలో ఉన్నారని అంటున్నారు. అలాంటివారే దైవశాపగ్రస్తులు, దైవశాపగ్రస్తులకు ఇక ఎవరూ సహాయం చేయలేరు. (51-52)
పోనీ, రాజ్యాధికారంలో వారికేమైనా వాటాఉందా? ఉంటే వారు ప్రజలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. లేక, దేవుడు దయతో వారికి (దైవదౌత్య) భాగ్యం ప్రసాదించాడని అసూయపడుతున్నారా? మేము ఇబ్రాహీం సంతానానికి గ్రంథం, వివేకం ప్రసాదించాం. అదీగాక అతనికి మేము ఎంతో శక్తిమంతమైన సామ్రాజ్యం కూడా ఇచ్చాము. (53-54)
అయితే వారిలో కొందరు విశ్వసించారు; మరికొందరు విశ్వసించకుండా ముఖం చాటేశారు. అలాంటివారికి భగభగమండే నరకాగ్నే తగిన శిక్ష. మా సూక్తులు నిరాకరించిన వారిని మేము తప్పక అగ్నిలో విసరేస్తాం. అక్కడ వారి చర్మాలు కాలిపోయినప్పుడల్లా (నిరంతరం) నరకయాతనల్ని చవిచూసేందుకు మళ్ళీమళ్ళీ కొత్త చర్మాలు సృజిస్తాం. గుర్తుంచుకోండి, దేవుడు సర్వశక్తిమంతుడు; అత్యంత వివేచనాపరుడు. (55-56)
సత్యాన్ని విశ్వసించి సదాచారసంపన్నులైన వారిని మేము సెలయేర్లు పారే స్వర్గ వనాలకు పంపుతాం. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. వారికక్కడ పరిశుద్ధ పత్నులు కూడా లభిస్తారు. వారిని మేము దట్టమైన చల్లని నీడలలో ఉంచుతాం. (57)
ముస్లింలారా! దేవుడు మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు: ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా వస్తువుని మీ దగ్గర భద్రపరిస్తే తిరిగి వారికి సురక్షితంగా అప్పగించండి. ప్రజల మధ్య ఏదైనా వ్యవహారం తీర్చవలసివస్తే న్యాయంగా తీర్చండి. చూడండి దేవుడు మీకు ఎంత మంచి హితోపదేశం చేస్తున్నాడో! ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. (58)
విశ్వాసులారా! దేవునిపట్ల, ఆయన ప్రవక్త పట్ల విధేయత కలిగి ఉండండి. మీలో వ్యవహారకర్తలైన అధికారుల పట్ల కూడా. అయితే ఏదయినా వ్యవహారంలో మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని తిరిగి దేవుని వైపునకు, ఆయనప్రవక్త వైపునకు మరల్చండి. మీరు నిజంగా దేవుడ్ని, అంతిమదినాన్ని విశ్వసిస్తున్నట్లయితే ఇదే మీకోసం సరైన పద్ధతి. పర్యవసానం రీత్యా కూడా ఇదే ఉత్తమ విధానం. (59)
ప్రవక్తా! నీవు బూటకాలు పలికేవారిని చూడలేదా? వారు నీపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని, నీకు పూర్వం వచ్చిన గ్రంథాలను విశ్వసించామని పైకి గొప్పలు చెప్పుకుంటారు. కాని తమ వ్యవహారాలు పరిష్కరింప జేసుకోవడానికి మాత్రం వారు దైవ(శాసన) ధిక్కారులను ఆశ్రయిస్తారు. కాని దైవ(శాసన) ధిక్కారులను తిరస్కరించా లని వారిని ఆదేశించడం జరిగింది. షైతాన్‌ వారిని దారితప్పించి బహుదూరం తీసికెళ్ళ గోరుతున్నాడు. (60)
చూశావా? కపటవిశ్వాసులతో “దేవుడు అవతరింపజేసిన దానివైపు రండి, ప్రవక్త (హితవుల) వైపు రండి” అని పిలిచినప్పుడు వారు నీదగ్గరకు రాకుండా తప్పుకోజూస్తారు. కాని చేజేతులా కొనితెచ్చుకున్న ఆపద వచ్చినప్పుడు వారు నీ దగ్గరకు పరుగెత్తుకు వచ్చి “దైవసాక్షి! మేము మంచినే కోరుకుంటున్నాం. ఎలాగైనా ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరాలన్నదే మా ఉద్దేశ్యం” అని కల్లబొల్లి ప్రమాణాలు చేస్తారు. (61-62)
వారి హృదయాల్లో ఏమున్నదో దేవునికి బాగా తెలుసు. అందువల్ల వారి మాటలు పట్టించుకోకు. వారికి మనస్సులో నాటుకునేలా నచ్చజెప్పు. మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞ ననుసరించి ప్రజలు అతనికి విధేయులైపోవాలనే పంపించాము. వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి దైవాన్ని క్షమాభిక్ష వేడుకొని ఉంటే, దైవప్రవక్త కూడా వారికోసం దేవుడ్ని ప్రార్థించి ఉంటే, దేవుడు గొప్ప క్షమాశీలి అని, ఎంతో దయామయుడని వారు తెలుసుకునేవారు. (63-64)
నీ ప్రభువు సాక్షి! వారు తమ వివాదాల పరిష్కారం కోసం నిన్ను న్యాయనిర్ణేతగా అంగీకరించి, వాటిపై నీవిచ్చే తీర్పుపట్ల ఏమాత్రం తటపటాయించకుండా ఆసాంతం స్వీకరించనంత వరకూ వారు నిజమైన విశ్వాసులు కాలేరు. (65)
‘మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీఇండ్లు వదలి వెళ్ళిపోండ’ని ఆదేశిస్తే వారిలో కొద్దిమంది మాత్రమే దాన్ని పాటిస్తారు. మా హితబోధ ప్రకారం నడుచుకుంటే వారికెంతో శ్రేయస్కరంగా ఉండేది. పైగా అది (ధర్మంలో)వారికి స్థిరత్వాన్నిచ్చేది. అప్పుడు మేము వారికి గొప్ప ప్రతిఫలం ప్రసాదించి సన్మార్గం చూపేవారము. (66-68)
దేవునికి, ఆయన ప్రవక్తకు పూర్తిగా విధేయులయి వారి ఆజ్ఞలను పాటించేవారు (రేపు ప్రళయదినాన) దేవుడు కటాక్షించిన ప్రవక్తలతో, సత్యసంధులతో, అమరవీరులతో, సదాచారసంపన్నులతో కలసి ఉంటారు. అలాంటివారి సహచర్యమే సహచర్యం. ఇది దేవుని అనుగ్రహం దేవుడే సర్వం తెలిసినవాడు. (69-70)
విశ్వాసులారా! మీరు పోరాటానికి సర్వసన్నద్ధులయి ఉండండి. అవసరాన్నిబట్టి వేర్వేరు దళాలుగానో లేదా అంతాకలసి ఒకే దళంగానో బయలుదేరండి. మీలో కొందరు కావాలని ఆలస్యంచేస్తూ తప్పించుకొని తిరిగేవారు కూడాఉన్నారు. ఒకవేళ మీపై ఏదైనా ఆపద వచ్చిపడితే “దేవుని దయవల్ల నేను వారివెంట పోలేదు” అంటాడు అలాంటి వ్యక్తి. అలాకాకుండా దేవుడు మీకు (విజయం) అనుగ్రహిస్తే, మీకూ తనకూ మధ్య ఎలాంటి మైత్రీబంధం లేనట్లు “నేను కూడా వారి వెంట వెళ్ళివుంటే ఎంత బాగుండేది, నాక్కూడా గొప్ప విజయ(ధన)ం లభించివుండేది” అంటాడతను. (71-73)
పరలోక జీవితం కోసం ప్రాపంచిక జీవితం అమ్మదలచుకున్నవారు దైవమార్గంలో పోరాడాలి. దైవమార్గంలో పోరాడి అమరగతినొందినా లేక విజయం సాధించినా అలాంటి వ్యక్తికి మేము గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. దిక్కులేక పోవడం చూసి అణచి వేయబడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలను రక్షించడానికి మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడరు? వారు (బాధలు భరించలేక) “దేవా! దుర్మార్గులు నివసిస్తున్న ఈ నగరం నుండి మమ్మల్ని బయటికి తీసి కాపాడు. మాకు రక్షణ కల్పించి అండగా నిలిచేవారి నెవరినైనా నీ వైపు నుండి మా దగ్గరికి పంపు” అని మొరపెట్టుకుంటున్నారే! అలాంటి పీడిత ప్రజల రక్షణ కోసం ఎందుకు పోరాడరు మీరు? (74-75)
విశ్వాసులు దైవమార్గంలో పోరాడుతారు. అవిశ్వాసులు షైతాన్‌ మార్గంలో పోరాడు తారు. కనుక మీరు (దైవమార్గంలో) షైతాన్‌ అనుచరమూకతో పోరాడండి. షైతాన్‌ పన్నే కుటిల పన్నాగాలన్నీ చాలా బలహీనమైనవని తెలుసుకోండి. (76)
“మీ చేతుల్ని (యుద్ధం చేయకుండా) కాస్త ఆపివుంచండి, నమాజ్‌ స్థాపించండి, (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లించండి” అని (లోగడ) ఆదేశించినవారిని నీవు గమనిం చావా? ఇప్పుడు వారిని (దైవమార్గంలో) పోరాడమని ఆజ్ఞాపిస్తే వారిలో కొందరు దేవునికి భయపడినట్లు (శత్రు)జనాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. అంతకంటే ఎక్కువే భయపడిపోతున్నారు. పైగా వారు “దేవా! (అప్పుడే) ఈ యుద్ధాజ్ఞను మాపై ఎందుకు విధించావు? మరికొంత అవకాశం ఎందుకివ్వలేదు?” అని వాపోయారు.
వారికి చెప్పు: ఈ ప్రాపంచిక సౌఖ్యాలు క్షణభంగురం, బుద్బుదం. భక్తిపరాయణు లకు పరలోక జీవితమే ఎంతో శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది. (అక్కడ) మీకు అణుమాత్రం కూడా అన్యాయం జరగదు. (77)
మృత్యు విషయానికొస్తే, అది మీరు ఎక్కడున్నా, ఎట్టి పరిస్థితిలో వున్నా, చివరికి మీరు పటిష్ఠమైన భవనాల్లో వున్నాసరే వచ్చి తీరుతుంది. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు.
వారికేదైనా ప్రయోజనం చేకూరితే “ఇది దేవుని దయవల్ల లభించింది” అంటారు. నష్టం జరిగితే “ఇది నీ మూలంగా జరిగింది” అంటారు. వారికి చెప్పు, అంతా దేవుని వల్లనే జరుగుతుందని. అసలు వారికేమయింది, ఏ మాటా అర్థం చేసుకోరు? (78)
మానవా! నీకు ఏ మేలు జరిగినా అది దేవుని దయవల్లనే జరుగుతుంది. ఒకవేళ నీకేదైనా కీడు జరిగితే అది నీ చేజేతులా చేసుకున్నదాని ఫలితమని తెలుసుకో. మేము ముహమ్మద్‌ (స)ని యావత్‌ మానవాళి కోసం దైవప్రవక్తగా నియమించాం. దీనికి దేవుని సాక్ష్యమే చాలు. కనుక ఎవరు దైవప్రవక్తకు విధేయులై నడచుకుంటారో, వారు దేవునికి విధేయులై నడచుకున్నట్లే. అలాచేయకుండా ముఖం తిప్పుకుంటే తిప్పుకోని. అలాంటి వారి కోసం మేము నిన్ను పర్యవేక్షకునిగా నియమించి పంపలేదు. (79-80)
వారు పైకి మాత్రం “మేము మీకు విధేయులం” అంటారు. కాని నీ దగ్గర్నుంచి వెళ్ళిపోగానే వారిలో కొందరు రాత్రివేళ ఒక చోట గుమిగూడి నీకు వ్యతిరేకంగా రహస్య మంతనాలు జరుపుతారు. వారు జరుపుతున్న రహస్య మంతనాలన్నిటినీ దేవుడు వారి కర్మలచిట్టాలో నమోదుచేస్తున్నాడు. కనుక నీవు వారిని గురించి పట్టించుకోకు. దేవునిపై భారం వేసి, ఆయన్నే నమ్ముకొని ఉండు. నమ్ముకునేవారికి దేవుడే చాలు. (81)
వారు ఖుర్‌ఆన్‌ గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్‌ నుండి గాకుండా మరెవరి నుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది కదా! (82)
వారు ఏదైనా సంతోషకరమైన వార్తగాని లేక భయాందోళనలు కలిగించే వార్తగాని వింటే దాన్ని నలువైపులా వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారా వార్తను దైవ ప్రవక్తకు గాని లేదా తమ నాయకులకుగాని చేరవేస్తే దాన్ని గురించి వారు నిజానిజాలు తెలుసుకొని సరయిన నిర్ణయం తీసుకోగలుతారు. మీపై దేవుని అనుగ్రహం, ఆయన కారుణ్యం గనక లేకపోయిఉంటే మీలో కొందరు తప్ప అందరూ షైతాన్‌ని అనుస రించేవారు. (83)
కనుక ప్రవక్తా! దైవమార్గంలో పోరాడుతూ ఉండు. నీవు నీ విషయంలో తప్ప మరెవరి విషయంలోనూ బాధ్యుడవు కావు. అయితే విశ్వాసుల్ని పోరాటానికి ప్రేరేపిస్తూ ఉండాలి. త్వరలోనే దేవుడు సత్యతిరస్కారుల శక్తిని నిర్వీర్యం చేస్తాడు. దేవుడే అందరి కంటే శక్తిమంతుడు. ఆయన విధించే శిక్షే అన్నిటికంటే కఠినమైనది. (84)
ఎవరు ఒక మంచివిషయాన్ని ప్రోత్సహిస్తాడో అతనికి దాని పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఎవరు ఒక చెడువిషయాన్ని ప్రేరేపిస్తాడో అతను దాని పాపఫలితం అనుభవి స్తాడు. దేవుడు ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (85)
మిమ్మల్ని ఎవరైనా గౌరవసూచకంగా సలాం చేస్తే, మీరు అంతకంటే శ్రేష్ఠంగా వారికి ప్రతిసలాం చేయండి. లేదా అదేవిధంగానైనా చేయండి. దేవుడు ప్రతి విషయం లోనూ మీనుండి లెక్కతీసుకుంటాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. ఆయనే అల్లాహ్‌. ఆయన మిమ్మల్నందర్నీ ప్రళయదినాన తప్పకుండా సమావేశపరుస్తాడు. దేవుని మాటకన్నా నిజమైనమాట మరెవరిది కాగల్గుతుంది? (86-87)
ఏమిటి, కపటుల్ని గురించి మీలో రెండు అభిప్రాయాలు ఏర్పడ్డాయి? దేవుడు వారిని వారిచేష్టల వల్ల (అవిశ్వాసం వైపు) వెనక్కి తిప్పివేశాడు. దేవుడు దారి తప్పించిన వాడ్ని నీవు దారికి తీసుకురాదలిచావా? అలా ఎన్నటికీ దారికి తీసుకురాలేవు. (88)
వారు ఎలా అవిశ్వాసులైపోయారో అలా మీరుకూడా అవిశ్వాసులైపోయి అందరూ ఒకే విధంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. కనుక ఇస్లాం కోసం స్వస్థలం వదలి రానంతవరకు వారిలో ఎవరితోనూ మీరు స్నేహం చేయకండి. స్వస్థలం వదలి రావడా నికి అంగీకరించకపోతే వారిని (యుద్ధరంగంలో) ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకొని హత మార్చండి. వారిలో ఏ ఒక్కరితోనూ స్నేహసంబంధాలు పెట్టుకోకండి. (89)
అయితే మీతో యుద్ధ ఒడంబడిక కుదిరిన జాతి వద్దకు వెళ్ళి, అక్కడ ఆశ్రయం పొందిన కపటులు మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయించబడ్డారు. అలాగే యుద్ధాలతో విసిగిపోయి ఇటు మీతోనూ, అటు తమజాతి వారితోనూ పోరాడకుండా మీదగ్గరకు వస్తూ పోయే కపటులు కూడా ఈ ఆజ్ఞ నుండి మినహాయించబడ్డారు.
దేవుడు తలచుకుంటే వారికి మీపై ఆధిక్యత నిచ్చేవాడే. అప్పుడు వారు మీతో తప్పకుండా పోరాడేవారు. కనుక వారు రంగం నుంచి తప్పుకొని మీతో యుద్ధం చేయకుండా రాజీకి వస్తే (మీరిక అనవసరంగా కయ్యానికి కాలు దువ్వకండి.) వారిని వేధించడానికి దేవుడు మీకు ఎలాంటి కారణం చూపలేదు. (90)
మరికొందరు కపటులున్నారు. వారు మీతోనూ, అటు తమజాతి వారితోనూ శాంతీ సఖ్యతలతో ఉండాలని భావిస్తారు. అయితే వీలుచిక్కితే చాలు, ఒక్కసారిగా కలహం, కల్లోలాలలోకి దూకుతారు. అలాంటివారు మీతో పోరాడటాన్ని మానుకొని రాజీకి రాకుండా యుద్ధం మానుకోకపోతే వారిని ఎక్కడ కన్పిస్తే అక్కడ పట్టుకొని హత మార్చండి. వారి పీచం అణచడానికి మేము మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. (91)
పొరపాటున తప్ప తోటి విశ్వాసిని హతమార్చడం ఏ విశ్వాసికీ శోభించదు. ఒకవేళ పొరపాటున హతమార్చడం జరిగితే అందుకు ఒక బానిస ముస్లింకు స్వేచ్ఛనివ్వాలి. మరోవైపు హతుని వారసులకు రక్తపరిహారం కూడా చెల్లించాలి. ఒకవేళ వారు క్షమిస్తే అది వేరే విషయం. అయితే హతుడు మీ శత్రువర్గానికి చెందినవాడయి, అతను విశ్వాసి కూడా అయివుంటే, ఒక ముస్లిం బానిసకు స్వేచ్ఛనిస్తే చాలు. అలాకాకుండా హతుడు మీరు శాంతిఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైవుంటే, మీరు హతుని వారసులకు రక్తపరిహారంతో పాటు ఒక బానిస ముస్లింకు సేచ్ఛ కూడా ఇవ్వాలి. స్వేచ్ఛ నివ్వడానికి బానిస లేకపోతే హంతకుడు వరుసగా రెండు నెలలపాటు ఉపవాసవ్రతం పాటించాలి. ఇది చేసిన తప్పును పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవడానికి దేవుడు నిర్ణయించిన నిష్కృతీ విధానం. దేవుడు సమస్తం తెలిసినవాడు, ఎంతో వివేచనాపరుడు. (92)
తోటివిశ్వాసిని బుద్ధిపూర్వకంగా హతమార్చినవారికి నరకమే తగిన శిక్ష. అక్కడే అతను ఎల్లకాలం పడిఉంటాడు. అతనిపై దేవుని ఆగ్రహం, అభిశాపం విరుచుకు పడతాయి. దేవుడు అతని కోసం ఘోరమైన (నరక)యాతన సిద్ధపరచి ఉంచాడు. (93)
విశ్వాసులారా! మీరు దైవమార్గంలో యుద్ధానికి బయలుదేరితే మీ శత్రువులెవరో, మిత్రులెవరో కాస్త విచక్షణచేసి చూడండి. (శత్రువర్గానికి చెందిన వ్యక్తి) ఎవరైనా ముందుకు వచ్చి మీకు సలాం చేస్తే మీరు తొందరపడి నీవు ముస్లిం కాదని అనకండి. దాని ద్వారా ప్రాపంచిక ప్రయోజనం పొందడమే మీ ఉద్దేశ్యమైవుంటే, దేవుని దగ్గర ఎన్నటికీ తరగని అనేక నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకోండి. ఒకప్పుడు మీరు కూడా అలాంటివారే కదా! ఆతర్వాత దేవుడు మీకెంతో మేలు చేశాడు. కాబట్టి ఇకనుంచి ఏదైనా చేయబోయేటప్పుడు కాస్త వెనుకా ముందూ ఆలోచించి మరీ చేయండి. మీరు చేసే ప్రతి పనినీ దేవుడు గమనిస్తూనే ఉంటాడన్న సంగతి విస్మరించకండి. (94)
విశ్వాసుల్లో ఏ కారణం లేకుండా ఇంట్లో ఉండిపోయేవారు, దైవమార్గంలో ధన ప్రాణాలు త్యజించి పోరాడేవారు- ఉభయులూ సమానులు కాలేరు. ఇంట్లో ఉండిపోయే వారికన్నా ధనప్రాణాలతో పోరాడేవారికి దేవుడు గొప్ప హోదా, ఔన్నత్యాలు ప్రసాదిస్తాడు. శ్రేయోశుభాలకు సంబంధించిన దైవవాగ్దానం అందరికీ వర్తిస్తుంది. కాని ప్రతిఫలం రీత్యా ఇంట్లోఉండిపోయేవారికన్నా దైవమార్గంలో పోరాడేవారికి దేవుడు ఎక్కువ ఔన్నత్యం ప్రసా దిస్తాడు. (అంటే)దేవుని వద్ద అంతస్తులలో, మన్నింపులో, (దైవ)కారుణ్యంలో ఔన్నత్యం లభిస్తుందన్నమాట. దేవుడు గొప్పక్షమాశీలి, అమిత దయామయుడు. (95-96)
దైవదూతలు తమకుతాము అన్యాయం చేసుకున్నవారి ప్రాణాలు తీస్తూ “మీరి ప్పుడు ఏస్థితిలో ఉన్నారు?” అని ప్రశ్నిస్తారు. దానికి వారు “మేము దేశంలో చాలా బల హీనులుగా, పీడితులుగా ఉండేవాళ్ళం” అంటారు. అప్పుడు దైవదూతలు “దేవుని భూమి విశాలంగా లేదా మీరు ఉన్నచోటు నుంచి మరోచోటికి వలసపోవడానికి?” అని అడుగు తారు. అలాంటివారికి నరకనివాసమే తగిన శిక్ష. అది పరమ చెడ్డనివాసం. (97)
అయితే ఎటూ వెళ్ళలేని, దారీ తెన్నూ కానలేని బలహీనులు, పీడితులైన స్త్రీలు, పిల్లలు, పురుషులు మాత్రం (ఈ శిక్ష నుంచి మినహాయించబడ్డారు). దేవుడు వారిని త్వరలోనే క్షమిస్తాడు. దేవుడు ఎంతో క్షమాశీలి, అమిత దయామయుడు. (98-99)
దైవమార్గంలో ఇల్లూవాకిలి వదలి వలస పోయేవారు పుడమిపై మంచి ఆశ్రయం, విశాలమైన చోటు, జీవనోపాధి పొందడానికి ఎంతో అవకాశం ఉంది. దేవుని వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు తనఇంటి నుండి వలసపోయే వ్యక్తి దారిలో గనక మృత్యువాత పడితే, అతనికి ప్రతిఫలం ప్రసాదించే బాధ్యత దేవునిపై ఉంది. దేవుడు ఎంతో క్షమాశీలి, అమిత దయామయుడు. (100)
మీరు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తే నమాజ్‌ను తగ్గించి చేసుకోడంలో ఎలాంటి తప్పు లేదు. ముఖ్యంగా అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారని భయముంటే అలా చేయవచ్చు. ఎందుకంటే వారు బహిరంగంగా మీతో విరోధానికి పాల్పడ్డారు. (101)
ప్రవక్తా! నీవు (యుద్ధరంగంలో) ముస్లింల దగ్గరుండి వారికి నాయకత్వం వహించి నమాజు చేయడానికి ఉపక్రమించినప్పుడు వారిలో ఒక వర్గం ఆయుధాలు ధరించి నీతో పాటు నిలబడాలి. వారు సాష్టాంగప్రణామం చేసి ప్రార్థన ముగించగానే వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇంకా ప్రార్థన చేయని రెండవ వర్గం వచ్చి నీతో కలసి ప్రార్థన చేయాలి. వారు కూడా ఆయుధాలు ధరించి అప్రమత్తులయి ఉండాలి. ఎందుకంటే మీరు గనక మీ ఆయుధాలు, ఇతర సామగ్రి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారు ఒక్కసారిగా మీపై విరుచుకుపడేందుకు కాచుకొని ఉంటారు.
ఒకవేళ వర్షం వల్ల మీకేమైనా అసౌకర్యంగా ఉంటే, లేదా మీరు వ్యాధిగ్రస్తులయి ఉంటే ఆయుధాలు తీసి పక్కన పెట్టడంలో తప్పులేదు. అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరుండటం చాలా అవసరం. దేవుడు అవిశ్వాసుల కోసం అత్యంత అవమానకరమైన యాతన సిద్ధపరచి ఉంచాడు. ఆవిధంగా (ప్రార్థన) ముగిసిన తరువాత మీరు నిల్చొని, కూర్చొని, పడుకొని ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడ్ని స్మరిస్తూ ఉండండి. శాంతియుత వాతావరణం నెలకొనడం జరిగితే పూర్తినమాజ్‌ చేయాలి. నమాజ్‌ విశ్వాసులు నియమం తప్పకుండా వేళకు విధిగా పాటించవలసిన విధ్యుక్తధర్మం. (102-103)
శత్రువర్గాన్ని వెంబడించడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకండి. మీకు కష్టంగా ఉందంటే మీలాగే మీ శత్రువులు కూడా కష్టపడుతున్నారు. అయితే వారు ఆశించని దాన్ని మీరు దేవుని నుండి ఆశిస్తున్నారు. దేవుడు సర్వం ఎరిగినవాడు, ఎంతో వివేకవంతుడు. (104)
ముహమ్మద్‌! దేవుడు నీకు చూపినమార్గం అనుసరించి నీవు ప్రజల వ్యవహారాలు పరిష్కరించడానికి మేము సత్యపూరితమైన గ్రంథం నీపై అవతరింపజేశాం. కనుక నీవు నీతిలేని వారివైపు నిలబడి వాదించకు. దేవుడ్ని క్షమాభిక్ష అర్థిస్తూ ఉండు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. ఆత్మద్రోహానికి పాల్పడేవాడిని ఎన్నటికీ సమర్థించకు. పాపాత్ముల్ని, విశ్వాసఘాతకుల్ని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. (105-107)
వీరు తమ చేష్టల్ని ప్రజల కంటబడకుండా దాచగలరుగాని దేవుని కంటబడ కుండా దాచలేరు. వారు రాత్రివేళల్లో దేవుని అభీష్టానికి వ్యతిరేకంగా రహస్యమంతనాలు జరుపుతారు. కాని అప్పుడు కూడా దేవుడు తమను వెన్నంటి ఉంటాడన్న సంగతి మరచి పోతున్నారు. దేవుడు వారి చర్యలన్నిటినీ పరివేష్ఠించి ఉన్నాడు. (108)
(ముస్లింలారా!) ప్రపంచ జీవితంలో మీరు వారి పక్షాన వాదించగలరు. కాని ప్రళయదినాన వారి పక్షాన దేవుని ముందు ఎవరు వాదించగలరు? అసలక్కడ వారిని కాపాడే నాథుడెవరు? ఎవరైనా పాపకార్యానికి పాల్పడటమో లేదా తనకుతాను అన్యా యం చేసుకోవడమో జరిగి ఆ తర్వాత దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పుకుంటే, దేవుడు గొప్పక్షమాశీలి అని, అపార దయామయుడని అతను తెలుసుకుంటాడు. దానికి బదులు ఎవరైనా పాపకార్యానికి పాల్పడితే ఆ పాపదుష్ఫలితం అతడ్నే చుట్టుకుంటుంది. దేవుడు సమస్త విషయాలు ఎరిగినవాడు, ఎంతో వివేకవంతుడు. (109-111)
ఎవరైనా ఏదైనా నేరం చేసి దాన్ని ఏపాపం ఎరగని అమాయకునిపై మోపితే, ఇక అతను ఘోరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని మూటకట్టుకున్నట్లే. (112)
ముహమ్మద్‌! నీపై దేవుని కారుణ్యకటాక్షాలే గనక లేకపోయివుంటే (నీ పరిస్థితి ఏమైవుండేదో), వారిలో ఒక వర్గం నిన్ను తప్పుత్రోవ పట్టించడానికి కంకణం కట్టుకుంది. కాని వారు తమనుతాము తప్ప ఎవరినీ తప్పుత్రోవ పట్టించలేరు. వారు నీకు వీసమెత్తు నష్టం కూడా కల్గించలేరు. దేవుడు నీపై దివ్యగ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేసి నీకు తెలియని విషయాలెన్నో తెలియజేశాడు. ఆయన దయ నీపై ఎంతగానో ఉంది. (113)
సాధారణంగా ప్రజలు జరిపే రహస్య మంతనాలలో ఎలాంటి శ్రేయస్సు ఉండదు. అయితే దానధర్మాలను గురించి రహస్యంగా ఏదైనా హితోపదేశం చేస్తే లేదా మరేదైనా సత్కార్యం చేయడానికో లేక ప్రజల వ్వవహారాలు చక్కదిద్దడానికో ఎవరితో ఏదైనా అంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అది మంచి విషయమే. ఎవరైనా దేవుని ప్రసన్నత కోసం ఇలా చేస్తే మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. (114)
సన్మార్గం ఏమిటో స్పష్టమైపోయినా దైవప్రవక్తను ధిక్కరిస్తూ విశ్వాసులు నడిచే దారి కాదని వేరే (పెడ)దారి పట్టి నడిచేవాడ్ని మేము అతను నడిచే దారినే నడిపిస్తాం. (చివరికి) మేము అతడ్ని నరకంలోకి త్రోసివేస్తాము. అది పరమ చెడ్డస్థలం. (115)
దేవుడు తనకు సాటి కల్పించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. అదితప్ప మరే పాపాన్నయినా తానుతలచుకుంటే క్షమిస్తాడు. దేవునికి సాటి కల్పించినవాడు సన్మార్గానికి బహుదూరం పోయి పడినట్లే. వారు నిజదేవుడ్ని వదలి దేవతలనబడే స్త్రీ (విగ్రహా)లను పూజిస్తున్నారు. వారసలు స్వామిద్రోహి అయిన షైతాన్‌ని ఆరాధిస్తున్నారు. (116-117)
షైతాన్‌ని దేవుడు శపించాడు. వాడు దేవునితో ఇలా అన్నాడు: ‘నేను నీ దాసులలో ఓ నిర్ణీతవర్గాన్ని తప్పక మార్గభ్రష్టుల్ని చేస్తాను. నేను వారిలో అనేక భ్రమలు కల్పిస్తాను. నేనిచ్చే ఆదేశంతో వారు పశువుల చెవులు చీల్చివేస్తారు; దైవసృష్టిని తారుమారు చేస్తారు.’ దేవుడ్ని వదలి ఇలాంటి షైతాన్‌ని సంరక్షకునిగా చేసుకున్నవారు ఘోరంగా నష్టపోతారు. వాడు మానవులకు (నోరూరించే) వాగ్దానాలుచేసి వారిలో (లేనిపోని)ఆశలు రేకెత్తిస్తాడు. కాని షైతాన్‌ వాగ్దానాలన్నీ వట్టి బూటకం, మోసం మాత్రమే. (118-120)
అలాంటి వారికి నరకమే (అంతిమ) నివాసం. అక్కడ్నుంచి వారు ఏ విధంగానూ బయట పడలేరు. దీనికి భిన్నంగా సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారిని మేము సెలయేరులు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాము. అక్కడే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. ఇది దేవుడు చేస్తున్న నిజమైన వాగ్దానం. దేవుని మాట కన్నా ఎవరిమాట ఎక్కువ నిజమవుతుంది? (121-122)
ఫలితం మీ కోరికలపైగాని, గ్రంథప్రజల కోరికలపైగాని ఆధారపడి ఉండదు. ఎవరైనా సరే చెడ్డ పని చేస్తే అతను దాని పర్యవసానం అనుభవిస్తాడు. ఇక దైవాభీష్టానికి వ్యతిరేకంగా అతనికి ఎలాంటి సహాయం, సమర్థింపులు లభించవు. స్త్రీలైనా పురుషు లైనా విశ్వసించినవారై ఉండి సత్కార్యాలు చేస్తే తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఏమాత్రం అన్యాయం జరగదు. (123-124)
ఒక వ్యక్తి తనను తాను దేవునికి పూర్తిగా సమర్పించుకొని తదనుగుణంగా తన నడవడికను సరిదిద్దుకున్నాడు. అతను ఇబ్రాహీం సంప్రదాయాన్ని కూడా పాటిస్తున్నాడు, దేవుడు తన మిత్రుడిగా చేసుకున్న ఇబ్రాహీం సంప్రదాయాన్ని. ఇలాంటి వ్యక్తి జీవితం కంటే మరెవరి జీవితవిధానం శ్రేష్ఠమైనదవుతుంది? భూమ్యాకాశాల్లో వున్న సమస్తం దేవునివే. ఆయన ప్రతి వస్తువునీ పరివేష్ఠించి ఉన్నాడు. (125-126)
ప్రజలు నిన్ను స్త్రీల విషయంలో (దేవుని) ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు. వారికిలా సమాధానమివ్వు: “దేవుడు మీకీ విషయంలో తన ఆజ్ఞ తెలియజేస్తున్నాడు. దాంతోపాటు ఈ గ్రంథంలో ఇదివరకు మీకు తెలిపిన ఆజ్ఞలు కూడా గుర్తుచేస్తున్నాము. అంటే (మీ సంరక్షణలో వుండే) అనాథ బాలికల గురించిన ఆజ్ఞలు. వారి హక్కులు మీరు నెరవేర్చరు; వారికి పెళ్ళిళ్ళు చేసి పంపరు. (లేదా పేరాశతో మీరే వారిని పెళ్ళాడ గోరుతారు.) అలాగే బలహీనులైన పసిపిల్లలకు సంబంధించిన ఆజ్ఞలు కూడా. అనాథ బాలల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని దేవుడు మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు. మీరు ఏ మంచిపని చేసినా అది దేవునికి తెలుస్తుంది. (127)
ఏస్త్రీ అయినా భర్త తనను వేధిస్తున్నాడని లేదా సరిగా ఆదరించడంలేదని భావించి నప్పుడు భార్యాభర్తలు పరస్పరం సంప్రదించుకొని సర్దుకుపోతే తప్పులేదు. అసలు వారు సర్దుకుపోవడమే సర్వదా శ్రేయస్కరం. హృదయాలు సంకుచితత్వం వైపు ఎక్కువగా మొగ్గుతాయి. అయితే మీరు పరస్పరం శ్రేయోభిలాషతో, దైవభీతిపరాయణతతో వ్యవహ రిస్తూ ఉండండి. మీరు చేసే పనులన్నిటినీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (128)
భార్యలందరి పట్ల సమానదృష్టితో మసలుకుంటూ వారికి పూర్తిన్యాయం చేకూర్చ డం మీ శక్తికి మించిన పని. మీరు తలచినా అలా చేయలేరు. అయినప్పటికీ మీరు ఒక భార్య వైపు పూర్తిగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవేయకండి. మీ వైఖరి సరిదిద్దుకొని దేవునికి భయపడుతూ మసలుకోండి. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. ఒకవేళ దంపతులిరువురూ విడిపోవడానికే నిర్ణయించుకుంటే దేవుడు తన అపార శక్తియుక్తులతో వారిని ఒకరిపై మరొకరు ఏమాత్రం ఆధారపడని వారిగా చేయగలడు. దేవుడు సర్వోపగతుడు, ఎంతో వివేచనాపరుడు. (129-130)
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునిదే. నీకు, నీకుపూర్వం గ్రంథం ఇవ్వబడిన వారికి కూడా మేము దేవుని పట్ల భయభక్తులు కలిగిఉండాలనే ఆదేశించాం. ఒకవేళ మీరు (మాఈ) ఆదేశాన్ని అంగీకరించకపోతే పోనివ్వండి. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునిదే. ఆయన నిరపేక్షాపరుడు, ఎంతో ప్రశంసనీయుడు. దేవుడే భూమ్యాకాశాల్లోవున్న సమస్తానికి యజమాని. కార్యసఫలతకు ఆయన ఒక్కడే చాలు. (131-132)
దేవుడు తలచుకుంటే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఇతరుల్ని తీసుకురా గలడు. అలా చేయడం ఆయనకు కష్టమేమీ కాదు. కేవలం ఐహిక ప్రతిఫలం కోరుకునే వాడు, దేవుని దగ్గర ఐహిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉందని తెలుసుకోవాలి. దేవుడు సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. (133-134)
విశ్వాసులారా! న్యాయానికి కట్టుబడి ఉండండి. స్వయంగా మీకుగాని, మీ తల్లి దండ్రులకుగాని లేదా మీ బంధువులకుగాని నష్టం వాటిల్లినా సరే దేవుని కోసం నిజమైన సాక్ష్యం ఇవ్వండి. కక్షిదారుడు ధనికుడైనా, పేదవాడైనా వారి విషయంలో మీకంటే దేవుడే ఎక్కువ శ్రేయోభిలాషి. కనుక మీరు మీ మనోవాంఛల్ని అనుసరిస్తూ న్యాయానికి తిలోదకాలు ఇవ్వకండి. ఒకవేళ మీరు విషయాన్ని వక్రీకరిస్తే లేదా నిజాన్ని దాటవేస్తే మీరు చేసేదంతా దేవుడు గమనిస్తుంటాడని తెలుసుకోండి. (135)
విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింప జేసినదానిని (ఖుర్‌ఆన్‌ని), అంతకుపూర్వం అవతరింపజేసిన (తౌరాత్‌,ఇన్జీల్‌ మొదలైన) వాటిని (మనస్పూర్తిగా) విశ్వసించండి. దేవుడ్ని, ఆయన దూతల్ని, ఆయన గ్రంథాల్ని. ఆయన ప్రవక్తల్ని, ప్రళయదినాన్ని విశ్వసించడానికి నిరాకరించినవాడు మార్గభ్రష్టత్వంలో పడి బహుదూరం కొట్టుకుపోయినట్లే. సత్యాన్ని విశ్వసించిన తర్వాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, తిరిగి తిరస్కరించి, చివరికి ఆ తిరస్కార వెల్లువలోనే కొట్టుకుపోయేవారిని దేవుడు ఎన్నటికీ క్షమించడు. వారికిక సన్మార్గం చూపడం కూడా జరగదు. (136-137)
ప్రవక్తా! విశ్వాసుల్ని వదలి అవిశ్వాసులతో స్నేహంచేసే కపటులకు దుర్భరమైన (నరక)శిక్ష పడుతుందని శుభవార్త విన్పించు! వీరు గౌరవమర్యాదల కోసం వారి దగ్గరకు వెళ్తున్నారా? కాని గౌరవమర్యాదలన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. (138-139)
ఎక్కడైనా దేవుని సూక్తులు నిరాకరిస్తూ, వాటిని అపహాస్యం చేయడం చూస్తే, జనం ఆ విషయం మార్చి వేరేవిషయం మాట్లాడనంతవరకూ మీరు వారి చెంత కూర్చో కండి. దీన్ని గురించి ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఆజ్ఞ ఇవ్వబడింది. (ఈ విషయం విస్మరించి) మీరిలా చేస్తే మీరు కూడా వారి మాదిరిగానే అయిపోతారు. త్వరలోనే దేవుడు కపటుల్ని, అవిశ్వాసుల్ని నరకంలో ఒకచోట సమీకరిస్తాడు. (140)
ఈ కపటవిశ్వాసులు మీ పరిస్థితి గమనిస్తూ అవకాశంకోసం ఎదురుచూస్తున్నారు. దేవుని దయవల్ల మీకు విజయం లభిస్తే “మేము మీతోపాటు లేమా?” అంటారు వారు. అవిశ్వాసులకు విజయం లభించే సూచనలు కన్పిస్తే వారితో “మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? అయినా మేమలా చేయకుండా ముస్లింల నుండి మిమ్మల్ని కాపాడాము” అనంటారు. వీరందరి వ్యవహారాల్ని గురించి దేవుడు ప్రళయదినాన తీర్పు చేస్తాడు. దేవుడు విశ్వాసులపై అవిశ్వాసులకు ఎన్నటికీ ఆధిక్యత నివ్వడు. (141)
ఈ కపటులు దేవుడ్ని మోసగింపజూస్తున్నారు. కాని దేవుడే వారిని మోసగిస్తున్నాడు. (అది వారు గ్రహించడం లేదు.) వారు ప్రార్థన చేయడానికి నిల్చుంటే బద్ధకం చేస్తూ లోకుల మెప్పు కోసం నిలబడతారు. పైగా దేవుడ్ని చాలాతక్కువగా స్మరిస్తారు. వారు అటూఇటూ కాకుండా విశ్వాసం, అవిశ్వాసాల మధ్య ఊగిసలాడుతున్నారు. కనుక (ప్రవక్తా!) దేవుడు దారి తప్పించినవాడికి నీవు ఏమాత్రం దారి చూపలేవు. (142-143)
విశ్వాసులారా! మీరు తోటి విశ్వాసుల్ని కాదని అవిశ్వాసులతో స్నేహం చేయకండి. మీరు దేవుని సన్నిధిలో మీ మీదనే నింద మోపుకోదలిచారా? వినండి, కపటులు నరకంలో అందరికంటే అట్టడుగు భాగాన ఉంటారు. వారికిక సహాయంచేసే వారెవరూ మీకు కన్పించరు. అయితే వారు (ఇహలోకంలోనే) పశ్చాత్తాపంచెంది తమ నడవడికను సరిదిద్దుకొని, దేవుడినే గట్టిగా నమ్ముకొని, దేవుని కోసమే తమ ధర్మాన్ని ప్రత్యేకించు కుంటే- అలాంటివారు తిరిగి విశ్వాసులుగా పరిగణించబడతారు. త్వరలోనే దేవుడు విశ్వాసులకు మహోన్నత ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (144-146)
మీరు కృతజ్ఞులయి విశ్వాసవైఖరి అవలంబిస్తే దేవుడు మిమ్మల్ని అనవసరంగా ఎందుకు శిక్షిస్తాడు? దేవుడు ఎంతో ఆదరించేవాడు, సర్వం తెలిసినవాడు కూడా. (147)
మనిషి తనకు అన్యాయం జరిగితే తప్ప ఎవరి విషయంలోనూ దుర్భాషకు దిగడాన్ని దేవుడు మెచ్చడు. దేవుడు సమస్తం వినేవాడు, సర్వం ఎరిగినవాడు. (అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలిపే హక్కుమీకుంది.) అయితే మీరు బహిరంగం గానూ, రహస్యంగానూ మంచినే చేస్తుండండి. లేదా కనీసం చెడుని క్షమాభావంతో ఉపే క్షించండి. అప్పుడు దేవుడు కూడా (మిమ్మల్ని) క్షమిస్తాడు. ఆయన ఎంతో శక్తిమంతుడు. (అయినప్పటికీ మీ బలహీనతల్ని ఉపేక్షిస్తున్నాడని తెలుసుకోండి.) (148-149)
కొందరు దేవుడ్ని, ఆయన ప్రవక్తల్ని విశ్వసించడానికి నిరాకరిస్తారు. దేవునికి, ఆయన ప్రవక్తలకు మధ్య తారతమ్యాలు సృష్టించగోరుతూ “మేము కొందరిని నమ్ము తాం, కొందరిని నమ్మం”అంటారు. పైగా విశ్వాసం, అవిశ్వాసాల మధ్య ఓ(కొత్త) మార్గం కనిపెట్టదలిచారు. ఇలాంటివారే కరుడుగట్టిన అవిశ్వాసులు. అవిశ్వాసుల కోసం మేము అత్యంత అవమానకరమైన యాతన సిద్ధపరచి ఉంచాము. దీనికి దేవుడ్ని, ఆయన ప్రవక్తలను విశ్వసించి, వారి మధ్య తారతమ్యాలు సృష్టించనివారికి మేము తప్పక తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాము. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (150-152)
(ముహమ్మద్‌!) ఈ గ్రంథప్రజలు తమపై ఆకాశం నుండి నేరుగా ఒక గ్రంథాన్నే అవతరింపజేయమని నిన్ను అడుగుతున్నారు. కాని వీరు గతంలో మూసాను ఇంత కంటే దారుణమైన కోర్కెలనే కోరారు. వారు తమకు దేవుడ్నే ప్రత్యక్షంగా చూపమని మూసాను అడిగారు. ఆ తలబిరుసు వైఖరి కారణంగానే వారిపై హఠాత్తుగా పిడుగు పడింది. (కాని దానివల్ల కూడా వారు గుణపాఠం నేర్చుకోలేదు.)
ఆ తర్వాత వారు (తమ ప్రవక్త హితవుల్ని పెడచెవిన పెట్టి) ఆవుదూడను దైవంగా చేసుకొని పూజించడం ప్రారంభించారు. వారు ఇంతకు ముందు ఎన్నో మహిమలు చూశారు. (అయినా వారు మళ్ళీ అపమార్గంలోనే పడిపోయారు.) సరే, అంతటి ఘోరా నికి పాల్పడినా మేము వారి తప్పుల్ని ఉపేక్షించాము. మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞావళిని (రాతిపలకలపై రాయబడిన పది ఆజ్ఞలను) ప్రసాదించాము. (153)
ఆ తరువాత (ఈ ఆజ్ఞావళిని శిరసావహించే విషయంలో) వారిపై తూర్‌ పర్వతం ఎత్తిపట్టి వారిచేత ప్రమాణం చేయించాము. (మరొకసారి) మేము వారిని, నగరద్వారం గుండా సాష్టాంగపడుతూ లోపలికి ప్రవేశించమని ఆదేశించాము. (వేరొకసారి) మేము వారికి సబ్బత్‌ (శనివారం)నియమం ఉల్లంఘించవద్దని చెప్పాము. ఈ విషయంలోనూ వారిచేత ప్రమాణం చేయించాము. (కాని దానికీ వారు కట్టుబడి ఉండలేదు.)
ఈవిధంగా వారు (ఎన్నో) ప్రమాణాలు ఉల్లంఘించారు. వారు దేవుని సూక్తులు తిరస్కరించారు. అనేకమంది దైవప్రవక్తల్ని అన్యాయంగా హతమార్చారు. ఇంతచేసి కూడా (వారుతమ ఆత్మశుద్ధిని పొగడుకుంటూ) తమ హృదయాలు గలేబులలో భద్రంగా ఉన్నాయని చెప్పుకున్నారు. వీటన్నిటి కారణంగానే (దేవుడు వారిని శపించాడు). నిజానికి వారి తిరస్కారం, తలబిరుసుతనాల మూలంగా దేవుడు వారి హృదయ కవాటాలు మూసివేశాడు. అందువల్లనే వారు చాలా తక్కువగా విశ్వసిస్తారు. (154-155)
అంతేకాదు, వారు తమ అవిశ్వాస వైఖరిలో మరింత ముందుకుపోయి మర్యం మీద ఘోరమైన అపనింద కూడా మోపారు. పైగా వారు (సిగ్గువిడిచి) “మేము మర్యం కుమారుడు ఈసా మసీహ్‌ దైవప్రవక్తను చంపేశాం” అని చెప్పసాగారు. కాని వారసలు ఆయన్ని చంపలేదు. సిలువపై ఎక్కించనూ లేదు. ఆ విషయంలో వారు అనుమానా లకు గురిచేయబడ్డారు. దానిపై విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చినవారు కూడా అను మానంలోనే పడిపోయారు. దాన్ని గురించి వారి దగ్గర ఎలాంటి జ్ఞానం లేదు. ఊహా గానాలు మాత్రమే చేస్తున్నారు. వారు మసీహ్‌ని చంపలేదు; దేవుడు ఆయన్ని తన వైపు ఎత్తుకున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడు. (156-158)
గ్రంథప్రజలలో ఏ ఒక్కడూ ఈసా మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండడు. ప్రళయదినాన అతను వారికి వ్యతిరేకంగా (దేవుని ముందు) సాక్ష్యమిస్తాడు. (159)
యూదులుగా మారినవారు (ఈవిధంగా) ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్ప డ్డారు. వారు దైవమార్గంలో ఆటంకాలు సృష్టిస్తారు. వడ్డీ నిషేధించబడినప్పటికీ వారు దాన్ని (నిస్సంకోచంగా) తీసుకుంటారు. ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా కాజేస్తారు. ఈ కారణాల వల్ల మేము గతంలో ధర్మసమ్మతం చేయబడిన అనేక పరిశుద్ధ వస్తువుల్ని వారికి నిషేధించాము. వారిలో అవిశ్వాసులైనవారి కోసం మేము దుర్భరమైన (నరక) యాతనల్ని సిద్ధపరచి ఉంచాము. (160-161)
అయితే వారిలో పరిపూర్ణ జ్ఞానం కలవారు, విశ్వసనీయులు నీపై అవతరించిన దాన్ని, నీకు పూర్వం అవతరించినవాటిని విశ్వసిస్తున్నారు. ఇలాంటి విశ్వాసులకు, నమాజ్‌, జకాత్‌ విధులు పాటించేవారికి; దేవుడ్ని, అంతిమ దినాన్ని దృఢంగా నమ్మేవారికి మేము తప్పకుండా గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. (162)
(ముహమ్మద్‌!) మేము నూహ్‌కు, అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు ఎలా దివ్య జ్ఞానం అందజేశామో అలా నీకూ అందజేస్తున్నాం. మేము ఇబ్రాహీం, ఇస్మాయిల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌, యాఖూబ్‌ సంతానం, ఈసా, అయ్యూబ్‌, యూనుస్‌, హారూన్‌, సులైమాన్‌ (అలై)లకు దివ్యజ్ఞానం అందజేశాం. దావూద్‌ (అలై)కు జబ్బూర్‌ ప్రసాదించాం. నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలలో కొందరి వృత్తాంతాలు నీకు తెలిపాము. అనేకమంది వృత్తాంతాలు తెలపలేదు. మేము మూసాతో (నేరుగా) సంభాషించాం. (163-164)
ఈ ప్రవక్తలంతా శుభవార్తాహరులుగా, హెచ్చరించేవారిగా చేసి పంపబడ్డారు. ఇలా దైవప్రవక్తలు వచ్చిన తర్వాత ప్రజలకు ఇక దేవుని దగ్గర సాకులు చెప్పడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. దేవుడు అసాధారణ శక్తిసంపన్నుడు, అత్యంత వివేక వంతుడు. కాని దేవుడు నీపై అవతరింపజేసినదానిని తన జ్ఞానసంపత్తితోనే అవతరింప జేశానని సాక్ష్యమిస్తున్నాడు. అందుకు దైవదూతలు కూడా సాక్షులుగా ఉన్నారు. అసలు ఒక్కదేవుని సాక్ష్యమే చాలు.
కనుక దీన్ని నిరాకరించి, ఇతరుల్ని కూడా దైవమార్గంలోకి రాకుండా నిరోధించే వారు నిస్సందేహంగా మార్గభ్రష్టులై సత్యానికి బహుదూరం వెళ్ళిపోయారు. ఈవిధంగా తలబిరుసు, తిరుగుబాటువైఖరి అవలంబించి అన్యాయం, అక్రమాలకు పాల్పడేవారిని దేవుడు ఎన్నటికీ క్షమించడు. ఆయన వారికిక నరకానికిపోయే దారితప్ప మరేదారీ చూపడు. నరకంలోనే వారు (నానాయాతనలు అనుభవిస్తూ) ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయడం దేవునికి ఏమంత కష్టమేమీ కాదు. (165-169)
మానవులారా! ఈ ప్రవక్త మీ ప్రభువు నుండి మీ దగ్గరకు సత్యం తీసుకొచ్చాడు. దాన్ని విశ్వసించండి, మీకు మేలు జరుగుతుంది. దాన్ని విశ్వసించడానికి నిరాకరిస్తే గుర్తుంచుకోండి, భూమ్యాకాశాల్లోని సమస్తం దేవునిదే. ఆయన సమస్తం తెలిసినవాడు. ఎంతో వివేకవంతుడు. (కనుక మీరు ఆయన పట్టునుండి తప్పించుకోలేరు.)- (170)
గ్రంథప్రజలారా! మీరు మీధర్మం విషయంలో అతిశయానికి పోయి హద్దులు మీర కండి. సత్యం తప్ప దేవునికి మరే విషయాన్నీ ఆపాదించకండి. మర్యం కుమారుడు ఈసా మసీహ్‌ దేవుని ప్రవక్తలలో ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. కాకపోతే ఆయన “మర్యం దగ్గరకు దేవుడు పంపిన ఒక ఆజ్ఞ; దేవుని దగ్గరనుండి (మర్యంకు) పంపబడిన ఒక ఆత్మ మాత్రమే.” (ఈ ఆజ్ఞ, ఆత్మలే మర్యం గర్భంలో బిడ్డరూపం సంతరించు కున్నాయి.) కనుక మీరు దేవుడ్ని, ఆయన ప్రవక్తల్ని విశ్వసించండి. ముగ్గురు (దేవుళ్ళు) అనకండి. అలా అనడం మానేస్తే అది మీకే క్షేమం. నిజానికి దేవుడు ఒక్కడే. ఆయనకు కుమారుడున్నాడని అనడం తగదు. అలాంటి బలహీనతలకు దేవుడు అతీతుడు, ఎంతో పరిశుద్ధుడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునిదే. అన్నిటికీ ఆయనే స్వామి, యజమాని. వాటి సంరక్షణ, నిర్వహణలకు ఆయన ఒక్కడే చాలు. (171)
మసీహ్‌ తాను దేవుని దాసులలో ఒక దాసుణ్ణని చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడ లేదు. అత్యంత సన్నిహితులైన దైవదూతలు కూడా దాన్ని సిగ్గుచేటుగా భావించలేదు. ఒకవేళ ఎవరైనా దేవునికి దాస్యం చేయడం తనకు సిగ్గుచేటయిన విషయమని భావించి అహంకారం వహిస్తుంటే (అలాంటి వ్యక్తి ఒక విషయం తెలుసుకోవాలి), దేవుడు యావ న్మందిని ఓరోజు సమావేశపరచి తన ముందు నిలబెట్టుకుంటాడు. (172)
అప్పుడు విశ్వసించి సత్కార్యాలు చేసివున్నవారు తమకు రావలసిన ప్రతిఫలం పూర్తిగా పొందుతారు. దేవుడు తన ప్రత్యేక అనుగ్రహంతో వారికి మరింత సుకృతఫలం కూడా ప్రసాదిస్తాడు. పోతే దైవదాస్యాన్ని తమకు అవమానకరమైన విషయంగా భావించి అహంకారం వహించినవారికి మటుకు దేవుడు దుర్భరమయిన (నరక)శిక్ష విధిస్తాడు. దేవుడ్ని కాదని సహాయ సంరక్షణల కోసం వారు ఎవరెవరిని నమ్ముకున్నారో వారిలో ఏ ఒక్కరూ ఆరోజు వారిని ఆదుకోవడానికి ముందుకు రారు. (ఇలా నమ్ముకున్న వాళ్ళందర్నీ వారు నట్టేట ముంచుతారు.) (173)
మానవులారా! మీ ప్రభువు వైపు నుండి మీ దగ్గరికి స్పష్టమైన ప్రమాణం వచ్చింది. మేము (మీ అజ్ఞానం దూరంచేసి రుజుమార్గం చూపడానికి) మీదగ్గరకు స్పష్టమైన జ్యోతి పంపాము. కనుక దేవుని సూక్తులు విశ్వసించి ఆయన చూపిన ధర్మాన్ని గట్టిగా ఆశ్ర యించినవారిని ఆయన తన కారుణ్యానుగ్రహాల (స్వర్గం)లోకి ప్రవేశింపజేస్తాడు. అదీగాక తన దగ్గరకు చేరుకోవడానికి తిన్ననిమార్గం కూడా చూపుతాడు. (174-175)
ప్రజలు నిన్ను నిర్వారసుడి విషయం గురించి అడుగుతున్నారు. వారికి చెప్పు: దేవుడు మీకిలా తన ఆజ్ఞ విన్పిస్తున్నాడు- ఎవరైనా సంతానరహితుడుగా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రం ఉన్న పక్షంలో అతని ఆస్తిలో ఆమెకు అర్ధభాగం లభిస్తుంది. సోదరి సంతానం లేకుండా చనిపోతే ఆమె సోదరుడే ఆమె ఆస్తికి వారసుడవుతాడు.
మృతునికి వారసులుగా ఇద్దరు సోదరీలు ఉన్నప్పుడు వారిద్దరికి అతని ఆస్తిలో మూడింట రెండు వంతుల ఆస్తి లభిస్తుంది. అనేకమంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు గనక ఉంటే స్త్రీలకు ఒకవాటా, పురుషులకు దానికి రెట్టింపు వాటా లభిస్తుంది.
మీరు దారితప్పి తిరగకుండా ఉండేందుకే దేవుడు ఈవిధంగా మీకు తన ఆజ్ఞల్ని విడమరచి తెలియజేస్తున్నాడు. ఆయన సమస్త విషయాలు ఎరిగినవాడు. (176)