కురాన్ భావామృతం/అల్-ఫజ్ర్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
89. ఫజ్ర్ (ప్రాతఃకాలం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 30)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రాతఃకాలం సాక్షి! దశరాత్రుల సాక్షి! సరి, బేసి (సంఖ్య)ల సాక్షి! గడచిపోతున్న రాత్రి సాక్షి! బుద్ధి, జ్ఞానం కలవారికి ఈ సాక్ష్యాలు చాలవా? (1-5)
ఎత్తయిన స్తంభాలవారైన “ఆదెఇరమ్”జాతి ప్రజలపట్ల నీప్రభువు ఎలా వ్యవహ రించాడో నీకు తెలియదా? అలాంటి (శక్తిసామర్థ్యాలు, వైభవోన్నతులుగల) జాతి ప్రపంచ దేశాల్లో ఇదివరకెన్నడూ ఉద్భవించలేదు. లోయల్లో కొండల్ని తొలచిన సమూద్ జాతి ప్రజలపట్ల (నీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో తెలియదా)? మేకులవాడైన (భారీసైన్యాలు గల) ఫిరౌన్‌పట్ల (ఆయన ఎలా వ్యవహరించాడో తెలియదా)? (వీరంతా ఆయా దేశాల్లో మహా గర్వపోతులయి (దేవుని మీద) తిరగబడ్డారు. అక్కడ దారుణమైన దురంతాలు కూడా చేశారు. చివరికి నీ ప్రభువు వారిపై కొరడా ఝళిపించి కఠినంగా శిక్షించాడు. (ఇలాంటి దుర్మార్గుల పీచమణచడానికి) నీప్రభువు మాటువేసి ఉంటాడు. (6-14)
మానవుడ్ని అతని ప్రభువు పరీక్షించే నిమిత్తం గౌరవం, ఇతర భాగ్యాలు ప్రసా దించినప్పుడు అతను (పొంగిపోయి) “నా ప్రభువు నన్ను గౌరవనీయుడిగా చేశాడు” అంటాడు. (మరో విధమైన) పరీక్ష నిమిత్తం లేమికి గురిచేసినప్పుడు అతను (నిరాశతో క్రుంగిపోయి) “నా ప్రభువు నన్ను అవమానం పాల్జేశాడు” అంటాడు. (15-16)
(మానవుడు గౌరవ ప్రతిష్ఠలకు సిరిసంపదలే కొలమానం అనుకుంటున్నాడు). ఎంతమాత్రం కాదు. మీరసలు అనాథను ఆదరించరు; పేదవాడికి పట్టెడన్నం పెట్టే విషయంలో ఒకర్నొకరు ప్రోత్సహించుకోరు. (బంధువుల బలహీనలతను ఆసరాగా చేసుకొని, వారికి దక్కవలసిన) వారసత్వపు ఆస్తినంతటినీ కాజేస్తున్నారు. మీరసలు ధన వ్యామోహం ఊబిలో పూర్తిగా కూరుకుపోయారు. (17-20)
(ఇన్ని అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతూ కూడా దేవునికి భయపడకుండా పరలోకం, తీర్పుదినం ఏదీ లేదని వాదిస్తున్నారు.) ఏమాత్రం కాదు. యావత్తు భూమి దంచి, పిండిపిండి చేయబడినప్పుడు నీప్రభువు పంక్తులుతీరిన దైవదూతలతో అవత రిస్తాడు. ఆరోజు నరకం దగ్గరకు తీసుకురాబడుతుంది. ఆరోజు మానవుడికి అసలు సంగతి అర్థమవుతుంది. కాని అప్పుడు అర్థంచేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటీ?#
అప్పుడతను (తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ) “అయ్యయ్యో! నేనీ (పరలోక) జీవితం కోసం ముందుగా ఏదైనా (సత్కార్యం) చేసి పంపుకొనివుంటే ఎంత బాగుండేది!” అని వాపోతాడు. ఆతర్వాత ఆరోజు దేవుడు శిక్షించేలా (కఠినంగా) మరెవరూ శిక్షించలేరు. దేవుడు బిగించి కట్టేలా (గట్టిగా) మరెవరూ బిగించి కట్టలేరు. (21-26)
(ఇక సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నుడయిన మనిషిని ఉద్దేశించి) “తృప్తి చెందిన మనసా! పద నీ ప్రభువు సన్నిధికి. నీవు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. (ఇక) నా పుణ్యదాసులలో చేరి నా స్వర్గంలో ప్రవేశించు” అని చెప్పడం జరుగుతుంది. (27-30)