కురాన్ భావామృతం/అల్-అహ్ జబ్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
33. అహ్‌జాబ్ (సైనికదళాలు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 73)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రవక్తా! దేవునికి భయపడు. అవిశ్వాసులు, కపటులు చెప్పినట్లు నడచుకోకు. దేవుడే సమస్తం తెలిసినవాడు, వివేకవంతుడు. నీ ప్రభువు నుండి సూచించబడుతున్న విషయాలనే అనుసరించు. మీరు చేసే ప్రతిపనీ దేవునికి తెలుసు. దేవుడ్నే నమ్ముకొని ఆయన మీద భారం వెయ్యి. కార్యసాధనకు (నీకు) దేవుడొక్కడే చాలు. (1-3)
ఏ మనిషి దేహంలో కూడా దేవుడు రెండు హృదయాలు ఉంచలేదు. మీరు మీ భార్యల్ని వదిలించుకోవడానికి, నీవు నాకు తల్లివంటి దానవని అన్నంతమాత్రాన దేవుడు ఆమెను మీకు తల్లిగా చేయడు. అలాగే ఆయన మీ పెంపుడుకొడుకుల్ని సొంతకొడుకు లుగా చేయలేదు. ఇవన్నీ మీరు నోటికొచ్చినట్లు కల్పించుకున్న మాటలే. దేవుడు సత్యం తో కూడిన మాట చెబుతున్నాడు. ఆయనే మీకు సరైన మార్గం చూపేవాడు. (4)
పెంపుడు కొడుకుల్ని వారి కన్నతండ్రుల సంబంధంతోనే పిలవండి. ఇదే దేవుని దృష్టిలో న్యాయమైన విషయం. ఒకవేళ వారి కన్నతండ్రులెవరో మీకు తెలియకపోతే వారిని మీ ధార్మిక సోదరులుగా, స్నేహితులుగా పరిగణించండి. తెలియక చేసినదాన్ని గురించి మీపై ఎలాంటి దోషంలేదు. అయితే కావాలనిచేస్తే మాత్రం మీరు తప్పక పట్టు బడిపోతారు. (జరిగిందేదో జరిగిపోయింది) దేవుడు క్షమాశీలి, దయామయుడు. (5)
దైవప్రవక్త (సల్లం) విశ్వాసులకు వారి ప్రాణాలకన్నా ఎంతో సన్నిహితుడు. దైవప్రవక్త భార్యలు వారికి మాతృమూర్తుల్లాంటివారు. అయితే దైవగ్రంథం ప్రకారం తోటి విశ్వా సులు, శరణార్థులకన్నా బంధువులే పరస్పరం ఎక్కువ హక్కుదారులు. కాకపోతే మీరు మీ స్నేహితులకు ఏదైనా మేలు చేయదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయవచ్చు. ఈ ఆజ్ఞ దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. (6)
ప్రవక్తా! మేము యావత్ ప్రవక్తలచేత చేయించిన ప్రమాణం జ్ఞప్తికి తెచ్చుకో. మేము నీచేత కూడా ప్రమాణం చేయించాం. నూహ్, ఇబ్రాహీం, మూసా, మర్యం కుమారుడు ఈసా (అలై)ల చేత కూడా ప్రమాణం చేయించాం. నిజాయితీపరులకు వారి నిజాయతీ, విశ్వసనీయతలను గురించి ప్రశ్నించడానికి మేము అందరి చేతా పటిష్ఠమైన ప్రమాణం చేయించాం. అవిశ్వాసులకు మాత్రం మేము ఘోరమైన యాతనలు సిద్ధపరచి ఉంచాము. (7-8)
విశ్వాసులారా! మీకు దేవుడు చేసిన మేలు గుర్తుకు తెచ్చుకోండి. మీపైకి (శత్రు) సైన్యాలు దాడిచేయడానికి వచ్చినప్పుడు, మేము వారి మీదికి పెనుతుఫాన్ పంపాము. పైగా మీకంటికి కన్పించని సైనికుల్ని (దైవదూతల్ని) కూడా పంపాము. ఆ సమయంలో మీరు ఏం చేస్తుండేవారో దేవుడు గమనిస్తుండేవాడు. వారు మీపైకి క్రింది నుంచి, పై నుంచి దాడి చేయడానికి వచ్చారు. అప్పుడు (ముస్లిం) జనం భయంతో కళ్ళు తేల వేశారు. వారి గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. దేవుని విషయంలో మీరు రకరకాలు గా అనుమానించసాగారు. అప్పుడు విశ్వాసులు కఠినాతికఠిన పరీక్షకు గురైపోయారు; ఘోరాతిఘోరంగా కుదిపి వేయబడ్డారు. (9-11)
కపటుల్ని గురించి, హృదయాల్లో రోగమున్నవారిని గురించి గుర్తుకు తెచ్చుకోండి. వారు “దేవుడు, ఆయన ప్రవక్త చేసిన వాగ్దానాలన్నీ బూటకం, మోసం తప్ప మరేమీ లేద”ని తెగేసి చెప్పారు. వారిలో కొందరు (ఈఅగ్నికి ఆజ్యంపోస్తూ) “యస్రిబ్ వాసులారా! ఇక మీరిక్కడుండే అవకాశం సన్నగిల్లి పోయింది. వెనక్కి మరలండి” అన్నారు.
వారిలో ఒక వర్గం “మాఇళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నాయి” అంటూ వెళ్ళిపోవ డానికి ప్రవక్తను అనుమతి అడిగింది. నిజానికి వారి ఇళ్ళు ఎలాంటి ప్రమాదంలో చిక్కు కోలేదు. వారసలు (యుద్ధరంగం నుండి) పారిపోదలిచారు. (12-13)
ఒకవేళ నగరం నలువైపుల నుండి శత్రువులు లోపలికి చొచ్చుకువస్తే, అప్పుడీ కపటులు అరాచకం సృష్టించడానికి పిలిస్తే వెంటనే వీరు ఆ రంగంలోకి దూకుతారు. ఆ సంక్షోభంలో చేరి దాన్ని ఎగదోయడానికి వీరు ఏమాత్రం వెనకాడరు. గతంలో వారు (యుద్ధం నుండి) పారిపోమని దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం గురించి (వారిని) తప్పక నిలదీయడం జరుగుతుంది. (14-15)
ప్రవక్తా! ఇలా చెప్పెయ్యి: “మృత్యువు లేక వధ నుండి పారిపోతే, ఈ పారిపోవడం మీకు ఎలాంటి ప్రయోజనం కలిగించదు. ఆ తర్వాత జీవితసౌఖ్యాలు జుర్రుకోవడానికి మీకు కొంచెమే అవకాశం లభిస్తుంది.” వారినిలా అడుగు: “దేవుడు మీకు నష్టం కల్గించ దలచుకుంటే ఆయన పట్టునుండి మిమ్మల్నెవరు కాపాడగలరు? ఒకవేళ దేవుడే మిమ్మల్ని అనుగ్రహించదలిస్తే ఆయన అనుగ్రహాన్ని ఎవరు అడ్డుకోగలరు?” దేవునికి వ్యతిరేకంగా వీరికి ఎలాంటి సంరక్షకుడూ, సహాయకుడూ లభించడు. (16-17)
మీలో ఆటంకాలు సృష్టించేవారెవరో దేవునికి బాగా తెలుసు. వారు తమ సోదరులతో “(ఇక ఆ ప్రవక్తను వదిలేసి) మా దగ్గరకు వచ్చేయండి” అంటారు. ఒకవేళ వారు యుద్ధంలో పాల్గొన్నా నామమాత్రంగా పాల్గొంటారు. పైగా మీకు తోడ్పడటంలో పిసినారితనం వహిస్తారు. ప్రమాదం వచ్చినప్పుడు చచ్చిపోయేవాడు గుడ్లు తేలవేసినట్లు వారు నీవైపు నిలువుగుడ్లు వేసి చూస్తారు. అయితే ఆ ప్రమాదం కాస్తా తప్పిపోగానే లాభాల పేరాశతో రంకెలు వేసుకుంటూ మీ దగ్గరకు వస్తారు. వీరసలు (సత్యాన్ని) విశ్వసించనే లేదు. అందుకే దేవుడు వారి కర్మలన్నిటిని వ్యర్థపరిచాడు. ఇలా చేయడం ఆయనకు చాలా తేలిక. (18-19)
వీరు శత్రుసేనలు (యుద్ధరంగం వదలి) ఇంకా వెళ్ళిపోలేదని అనుకుంటున్నారు. వారు మళ్ళీ దాడిచేస్తే, అప్పుడు వీరు ఏ ఎడారిప్రాంతానికో వెళ్ళి దేశదిమ్మరుల మధ్య (హాయిగా) కూర్చొని (ఇక్కడి) మీ పరిస్థితుల్ని గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ వీరు మీ దగ్గరున్నా యుద్ధంలో నామమాత్రంగానే పాల్గొంటారు. (20)
(విశ్వాసులారా!) దైవప్రవక్త (జీవనసరళి)లో మీకు మంచి ఆదర్శం ఉంది. దేవుడ్ని, అంతిమదినాన్ని నమ్మి, దేవుడ్ని అత్యధికంగా స్మరించేవారికి ఈ ఆదర్శం ఎంతో ఉప యోగపడుతుంది. నిజమైన విశ్వాసులు శత్రుసేనల్ని చూడగానే “దేవుడు మనకు దీన్ని గురించే వాగ్దానం చేశాడు. దేవుడు, ఆయనప్రవక్త చేసిన వాగ్దానం నిజమైనది” అన్నారు. ఈ సంఘటన వారి విశ్వాసాన్ని, అంకితభావాన్ని మరింత వృద్ధిచేసింది. (21-22)
విశ్వాసులలో కొందరు దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం నెరవేర్చినవారున్నారు. కొందరు (తమ సర్వస్వం ధారపోయడం ద్వారా) తమ మొక్కుబడి తీర్చుకున్నారు. మరి కొందరు సమయంకోసం నిరీక్షిస్తున్నారు. వారు తమ వైఖరిలో ఎలాంటిమార్పు రానివ్వ లేదు. దేవుడు సత్యసంథులకు వారి సత్యసంధత, విశ్వసనీయతలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికే (ఇదంతా జరిగింది). కపటుల్ని మాత్రం ఆయన తలచుకుంటే శిక్షిస్తాడు; లేదా క్షమించి వదిలేస్తాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (23-24)
దేవుడు సత్యతిరస్కారుల ముఖాలను వెనక్కి తిప్పివేశాడు. వారు మనసులో కసి నింపుకొని ఎలాంటి ప్రయోజనం సాధించకుండానే ఉత్తచేతులతో వచ్చినదారే వెళ్ళి పోయారు. విశ్వాసుల తరఫున పోరాడేందుకు ఒక్క దేవుడే సరిపోయాడు. దేవుడు ఎంతో బలాఢ్యుడు, మహా శక్తిమంతుడు. (25)
గ్రంథప్రజలలో శత్రుసేనలకు తోడ్పడినవారిని దేవుడు వారి కోటల నుండి బయ టికి తీశాడు. వారి హృదయాల్లో (మీపట్ల) భయోత్పాతం సృష్టించాడు. అందుకే ఈరోజు మీరు వారిలో కొందరిని హతమార్చి, మరికొందరిని బందీలుగా పట్టుకోగలిగారు. అంతే కాదు, ఆయన వారి భూములు, ఇండ్లు, ఇతర ఆస్తిపాస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. వారి ప్రాంతంలో మీరు ఇదివరకెన్నడూ కాలు కూడా మోపి ఉండలేదు; అలాంటి ప్రాంతాన్ని కూడా మీకు స్వాధీనం చేశాడు. (26-27)
ప్రవక్తా! నీ భార్యలకిలా చెప్పు: “మీరొకవేళ ఈ ప్రపంచాన్ని, దీని తళుకు బెళుకుల్ని కోరుకుంటుంటే, రండి నేను మీకు వాటిని ఎంతోకొంత ఇప్పించి మర్యాదగా సాగనంపు తాను. అలాకాకుండా మీరు (నిజంగా) దేవుడ్ని, దైవప్రవక్తను, పరలోకాన్ని కోరుకుం టుంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మీలో సదాచార సంపన్నులయిన వారికోసం దేవుడు (పరలోకంలో) గొప్ప ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు.” (28-29)
ప్రవక్తభార్యలారా! మీలో ఎవరైనా అసభ్యకరమైన చేష్టలకు పాల్పడితే ఆమెకు మేము రెట్టింపు శిక్ష విధిస్తాం. ఇలా చేయడం దేవునికి చాలా తేలిక. అలాగే మీలో దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులయి సత్కార్యాలు చేసేవారికి మేము రెట్టింపు ప్రతి ఫలం ప్రసాదిస్తాం. ఆమెకు గౌరవప్రదమైన ఉపాధి కూడా సమకూర్చుతాం. (30-31)
ప్రవక్తభార్యాలారా! మీరు సాధారణ స్త్రీల్లాంటి వారు కాదు. మీరు దేవునికి భయపడే వారైతే (పరపురుషులతో మాట్లాడేటప్పుడు) మెతకదనం కనపడేలా మెల్గిగా మాట్లాడకండి. ఆంతర్యంలో ‘చెడు’ ఉన్నవాడ్ని ఈ మెతకదనం పేరాశకు పురిగొల్పే ప్రమాదం ఉంటుంది. అందువల్ల స్పష్టంగా, కరాఖండిగా మాట్లాడండి. మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి. పూర్వం మూఢకాలంనాటి స్త్రీలు తిరిగినట్లు సింగారం చూపుకుంటూ తిరగకండి. నమాజు (వ్యవస్థ) నెలకొల్పండి. (పేదల ఆర్థిక హక్కు) జకాత్ నెరవేర్చండి. దేవుని పట్ల, ఆయన ప్రవక్త పట్ల విధేయత కలిగిఉండండి.
మీరు (సాధారణ మహిళల్లాంటి వారు కాదు.) ప్రవక్త గృహస్థులు. అందువల్ల దేవుడు మీలోని కల్మషాన్ని తీసేసి మిమ్మల్ని పూర్తిగా పునీతం చేయగోరుతున్నాడు. దేవుని సూక్తుల్ని, మీ ఇండ్లలో విన్పించబడుతున్న వివేకవంతమైన విషయాల్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఎంతో సూక్ష్మగ్రాహి, బాగా తెలిసినవాడు. (32-34)
ముస్లింలయిన, విశ్వసించిన, విధేయులయిన, నిజాయితీపరులయిన, సహన శీలురయిన, దానశీలురయిన, మర్మాయవాలు కాపాడుకునే, ఉపవాసవ్రతాలు పాటించే, అణుకువ వినయం కలిగివుండే, దేవుడ్ని అత్యధికంగా స్మరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు మన్నింపు, గొప్ప ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు. (35)
దేవుడు, ఆయన ప్రవక్త ఏదైనా వ్యవహారంలో ఒక నిర్ణయం చేసిన తరువాత, ఇక దాన్ని గురించి విశ్వాసులయిన స్త్రీ పురుషులెవరికీ ఎలాంటి స్వంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు. దీనికి భిన్నంగా ఎవరైనా దేవునికి, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే వారు పూర్తిగా మార్గభ్రష్టత్వంలో పడిపోయినట్లే. (36)
ప్రవక్తా! జ్ఞాపకంతెచ్చుకో. దేవుడు, నీవు మేలుచేసిన వ్యక్తితో నీవు “దేవునికి భయపడు, నీభార్యను వదలిపెట్టకు” అన్నావు. అప్పుడు నీవు ఒక విషయం మనసులో దాచావు. దాన్ని దేవుడు బహిర్గతం చేయదలిచాడు. అప్పుడు నీవు లోకులకు భయ పడుతుండేవాడివి. నీవు దేవునికి మాత్రమే భయపడాలి. జైద్ తనభార్య దగ్గర అవసరం తీర్చుకున్న తర్వాత ఆమెతో మేము నీ వివాహం జరిపించాం. పెంపుడు కొడుకులు తమ భార్యల వద్ద అవసరం తీర్చుకున్న తరువాత వారి భార్యల(ను వివాహమాడే) విషయంలో విశ్వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే మేమిలా చేశాం. దేవుని ఆజ్ఞ (ఎట్టి పరిస్థితిలోనూ) అమలు జరిగే తీరవలసి ఉంది. (37)
దైవప్రవక్త కోసం దేవుడు నిర్దేశించిన (ఈ) పనిలో ఎలాంటి దోషం లేదు. గత ప్రవక్తల విషయంలో కూడా దేవుని పద్ధతి ఇలాగే ఉండేది. దేవుడు జారీచేసిన ఆజ్ఞకు తిరుగు లేదు. దేవుని సందేశం (ప్రజలకు) అందజేసేవారు, ఆయనకు భయపడేవారు, ఒక్క దేవునికి తప్ప మరెవరికీ భయపడనివారు (ఆయన జారీచేసే ప్రతి ఆజ్ఞనూ శిరో ధార్యంగా భావిస్తారు). కర్మల విచారణ జరపడానికి ఒక్క దేవుడే చాలు. (38-39)
(ప్రజలారా!) ముహమ్మద్ (సల్లం) మీ పురుషుల్లో ఎవరికీ తండ్రి కాడు. ఆయన దేవుని సందేశహరుడు. దౌత్యపరంపరను అంతమొందించిన అంతిమ దైవప్రవక్త. దేవుడు సమస్త విషయాలు ఎరిగినవాడు. (40)
విశ్వాసులారా! దేవుడ్ని అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంత్రం స్తుతిస్తూ ఉండండి. ఆయనే మిమ్మల్ని కరుణించి, చీకటి నుండి వెలుగులోకి తీసుకు వచ్చినవాడు. దైవదూతలు కూడా మిమ్మల్ని దీవిస్తున్నారు. దేవుడు విశ్వాసుల పాలిట అపార కరుణామయుడు. విశ్వాసులు (పరలోకంలో) ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, వారికి శాంతి వచనాలతో స్వాగతం లభిస్తుంది. వారి కోసం దేవుడు గౌరవ ప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు. (41-44)
ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా, దేవుని ఆజ్ఞతో ఆయన వైపున సందేశం అందజేసేవానిగా, వెలుగుతున్న దీపంగా చేసి పంపాము. కనుక విశ్వసించిన వారికి దేవుని తరఫున గొప్ప అనుగ్రహం కలుగుతుందని శుభవార్త విన్పించు. అవిశ్వాసులకు, కపటులకు నీవు ఏమాత్రం లొంగకు. వారు పెట్టే బాధలను ఖాతరు చేయకుండా దేవుని మీదనే భారంవేసి పనిచెయ్యి. దేవుడ్ని నమ్ముకొని ఆయన మీద భారం వేసేవాడికి దేవుడే చాలు (సహాయం చేయడానికి). (45-48)
విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలను వివాహమాడిన తరువాత వారిని తాకకముందే మీరు వారికి విడాకులిస్తే, వారిని గడువు కాలం పూర్తిచేయమని అడిగే అధికారం మీకే మాత్రం లేదు. వారికి ఎంతోకొంత ధనమిచ్చి సహృదయంతో సాగనంపండి. (49)
ప్రవక్తా! నీవు మహర్ (వధువు ఆస్తిహక్కు) చెల్లించి వివాహమాడిన స్త్రీలను మేమే నీకు ధర్మసమ్మతం చేశాం. అలాగే దేవుడు నీకు ప్రసాదించిన బానిస స్త్రీలు, నీతోపాటు (మదీనా) వలసవచ్చిన నీ పినతండ్రి కుమార్తెలు, పెత్తండ్రి కుమార్తెలు, పిన్నమ్మ కుమార్తెలు, పెద్దమ్మ కుమార్తెలు, మేనత్త కుమార్తెలు, మేనమామ కుమార్తెలను కూడా (వివాహానికి) నీకు ధర్మసమ్మతం చేశాం. అదీగాక తనను తాను దైవప్రవక్తకు సమర్పిం చుకున్న స్త్రీని కూడా దైవప్రవక్త వివాహమాడవచ్చు. ఈ (చివరి) రాయితీ నీకు మాత్రమే ఇవ్వబడుతోంది, ఇతర విశ్వాసులకు లేదు.
సాధారణ విశ్వాసులకు వారి భార్యలు, బానిస స్త్రీల విషయంలో మేము ఎలాంటి హద్దులు నిర్దేశించామో మాకు తెలుసు. (ధర్మవ్యాప్తి కార్యకలాపాలలో) నీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకే (మేమిలా నీకు కొన్ని రాయితీలు కల్పించాము). దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (50)
నీ భార్యలలో నీవు తలచిన వారిని (విడాకులద్వారా) వేరుచేయవచ్చు; కోరుకున్న వారిని నీదగ్గర అట్టిపెట్టుకోవచ్చు. వేరుచేసినవారిని కావాలనుకుంటే మళ్ళీ వెనక్కి పిలిపించుకోవచ్చు. అంతా నీ ఇష్టాయిష్టాల మీద వదిలేస్తున్నాం. ఈ విషయంలో నీవు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పులేదు. ఈవిధంగా వారి కళ్ళు చల్లబడతాయని, వారు ఆవేదన చెందరని ఆశించడానికి ఎక్కువ ఆస్కారముంటుంది. నీవు ఏదిచ్చినా వారు సంతోషంగా స్వీకరిస్తారు. మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. ఆయన సర్వజ్ఞాని, దయార్థహృదయుడు. (51)
ఆ తర్వాత మరెలాంటి స్త్రీలూ (వివాహానికి) నీకు ధర్మసమ్మతం కారు. ఆ స్త్రీలను వదలి నీ అధీనంలోని బానిసస్త్రీలు తప్ప ఇతరస్త్రీల సౌందర్యం నీకు ఎంత నచ్చినా వారిని చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు ప్రతి విషయాన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. (52)
విశ్వాసులారా! అనుమతి లేకుండా దైవప్రవక్త ఇండ్లలోకి ప్రవేశించకండి. భోజన సమయంలో (అనవసరంగా) అక్కడ తారట్లాడుతూ ఉండకండి. ఒకవేళ మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీరు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. అయితే భోజనం చేయగానే అక్కడ్నుంచి లేచి వెళ్ళండి. అంతేగాని కబుర్లు చెబుతూ అక్కడే (గంటల తరబడి) కూర్చోకండి. ఈ వైఖరి ప్రవక్తకు బాధ కలిగించవచ్చు. అతను బిడియం, మొహమాటం వల్ల మిమ్మల్నేమీ అనలేడు. దేవుడు యదార్థం చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడడు.
మీరు ప్రవక్త భార్యల్ని ఏదైనా అడగదలచుకుంటే తెర వెనుక నిలబడి అడగండి. ఇది చిత్తశుద్ధి కోసం మీకూ, వారికీ ఎంతో మంచిపద్ధతి. దైవప్రవక్త (మనసు)ను బాధించడం మీకు భావ్యంకాదు. దైవప్రవక్త తదనంతరం ఆయన భార్యలను వివాహ మాడటం కూడా ధర్మసమ్మతం కాదు. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. మీరేదైనా మాట బయటికి వెలిబుచ్చినా లేక మనసులో దాచినా దేవునికి తెలుసు. (53)
ప్రవక్త భార్యల తండ్రులు, వారి కొడుకులు. అన్నదమ్ములు, అన్నదమ్ముల కొడు కులు, అక్కాచెల్లెళ్ళ కొడుకులు, వారితో కలసిమెలసి తిరిగే స్త్రీలు, వారి బానిసలు (పరదానియమాలు పాటించకుండా) వారి ఇండ్లలోకి ప్రవేశిస్తే తప్పులేదు. (వనితల్లారా!) మీరు దేవునికి భయపడండి. దేవుడు ప్రతి దానికీ సాక్షిగా ఉన్నాడు. (54-55)
దేవుడు, ఆయన దూతలు దైవప్రవక్తను దీవిస్తున్నారు. (కనుక) విశ్వాసులారా! మీరు కూడా అతను శాంతీ సౌభాగ్యాలతో వర్థిల్లాలని (దైవాన్ని) ప్రార్థించండి. (56)
దేవుడ్ని, ఆయన ప్రవక్తను బాధిస్తున్నవారిని దేవుడు ప్రపంచంలోనూ, పరలోకం లోనూ (నశించాలని) శపిస్తున్నాడు. వారికోసం అవమానకరమైన (నరక) యాతనలు సిద్ధంచేశాడు. విశ్వసించిన స్త్రీ పురుషుల్ని అన్యాయంగా వేధిస్తున్నవారు నిజానికి ఘోర మైన అపనిందను, స్పష్టమైన పాపభారాన్ని తమ నెత్తిమీద వేసుకుంటున్నారు. (57-58)
ప్రవక్తా! నీ భార్యలకు, కుమార్తెలకు, (ఇతర) ముస్లింస్త్రీలకు వారు తమ పైటలను తమ (ముఖాల)పై కప్పుకోవాలని చెప్పు. ఇదే సరైన పద్ధతి. దీనివల్ల వారిని ఎవరైనా గుర్తించి వేధిస్తారనే భయముండదు. దేవుడు క్షమాశీలి, దయామయుడు. (59)
కపటులు, హృదయంలో రోగమున్న (దుష్టబుద్ధికల)వారు, దారుణమైన వదం తులు వ్యాపింపజేసేవారు తమ దుశ్చర్యలు మానుకోకపోతే మేము వారికి వ్యతిరేకంగా నిన్ను సమాయత్తపరుస్తాం. అప్పుడు వారికీ నగరంలో నీతోపాటు ఉండటం కష్టమై పోతుంది. నలువైపుల నుండి వారిపై అభిశాపం పడుతుంది. ఎక్కడ కన్పిస్తే అక్కడ వారు పట్టుబడి చంపబడతారు. ఇలాంటివారి విషయంలో ఇది పూర్వం నుంచీ వస్తున్న దైవసంప్రదాయమే. దైవసంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పు చూడలేవు. (60-62)
ప్రళయఘడియ ఎప్పుడొస్తుందని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. ఆ సంగతి దేవునికే తెలుసని చెప్పు వారికి. బహుశా అది సమీపంలోనే ఉందేమో నీకేం తెలుసు? ఏదిఏమైనా సత్యతిరస్కారుల్ని దేవుడు శపించాడన్నది నిజం. ఆయన వారికోసం భగభగ మండే నరకాగ్ని సిద్ధపరచి ఉంచాడు. అందులో వారు (నానాయాతనలు అనుభవిస్తూ) శాశ్వతంగా పడివుంటారు. వారికి ఎలాంటి సహాయం, రక్షణ లభించవు. (63-65)
ఆరోజు వారి ముఖాలను వెనక్కి తిప్పివేసి అగ్నిలో వేయడం జరుగుతుంది. అప్పుడు వారు (తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ) “అయ్యయ్యో! మనం దేవునికి, దైవ ప్రవక్తకు విధేయులైవుంటే ఎంత బాగుండేది!” అనంటారు. (ఆ తర్వాత వారు దేవుడ్ని మొరపెట్టుకుంటూ) “ప్రభూ! మేము మా నాయకులు, పెద్దలు చెప్పిన మాటలు విని, వారిని అనుసరించాము. వారు మమ్మల్ని అపమార్గం పట్టించారు. ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు. వారిని తీవ్రంగా శపించు” అని అంటారు. (66-68)
విశ్వాసులారా! మీరు మూసాను వేధించినవారిలా తయారుకాకండి. వారు మూసా మీద వేసిన అభాండాలు దేవుడు దూరంచేసి వాస్తవం బహిర్గతం చేశాడు. అతను దేవుని దృష్టిలో ఎంతో గౌరవనీయుడు. కనుక విశ్వాసులారా! దేవునికి భయపడండి. సరైనమాటే పలకండి. దేవుడు మీపనులు చక్కబెడతాడు. మీపొరపాట్లు క్షమిస్తాడు. దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయుడైనవాడు నిజంగా గొప్ప విజయం సాధించినట్లే. (69-71)
మేమీ (దైవప్రాతినిధ్య) బాధ్యతను మొదట్లో భూమ్యాకాశాల ముందు, పర్వతాల ముందు పెట్టాము. కాని అవి భయపడిపోయి ఈ బాధ్యతాభారం మోయడానికి సిద్ధపడ లేదు. కాని మానవుడు మాత్రం (మహా ఒరగబెట్టే వాడిలా ముందుకొచ్చి) దీన్ని తన భుజాల పైకెత్తుకున్నాడు. (ఇప్పుడీ బాధ్యతను నిర్వహించడానికి నిరాకరిస్తున్నాడు.) నిజంగా మానవుడు మహా దుర్మార్గుడు, పరమ మూర్ఖుడయి పోయాడు. (72)
ఈ బాధ్యతను తలకెత్తుకున్న పర్యవసానంగా కపట స్త్రీ పురుషులకు, బహుదైవా రాధనకు పాల్పడే స్త్రీ పురుషులకు దేవుడు శిక్ష విధిస్తాడు. విశ్వసించిన స్త్రీపురుషులను క్షమిస్తాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు కూడా. (73)