కురాన్ భావామృతం/అల్-బలద్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
90. బలద్ (పట్టణం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 20)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
కాదు, (మీరనుకునేది ఎంతమాత్రం నిజం కాదు.) నేనీ (మక్కా) పట్టణం సాక్షిగా చెబుతున్నాను. (పవిత్రమైన) ఈ పట్టణంలో వీరు నిన్ను (వేధించడం) ధర్మసమ్మతం చేసుకున్నారు. నేను (మీ)తండ్రి (ఆదం) సాక్షిగా, అతనికి పుట్టిన సంతానం సాక్షిగా చెబు తున్నాను. మేము మానవుడ్ని (విశృంఖలజీవితం గడపడానికి పుట్టించలేదు.) శ్రమజీవిగా పుట్టించాము. తనపై ఎవరూ అదుపు సాధించలేరని భావిస్తున్నాడా అతను? (1-5)
(మానవుడు పేరుప్రతిష్ఠల కోసం ప్రాకులాడుతూ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు! పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ) “నేను లక్షలాది రూపాయలు మంచి నీళ్ళులా ఖర్చుపెట్టాను” అని అంటున్నాడు. తనను (పైన) ఎవరూ చూడటం లేదని భావిస్తున్నాడా అతను?
మేమతనికి రెండు కళ్ళు, ఒక నోరు, రెండు పెదవులు ఇవ్వలేదా? (మంచికి, చెడుకు సంబంధించిన) రెండు స్పష్టమైన మార్గాలు అతనికి చూపలేదా? (6-10)
కాని అతను కఠినమైన కనుమ గుండా నడవడానికి సాహసించలేదు. కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? (కఠినమైన కనుమంటే) బానిసను బంధవిముక్తి చేయడం, లేదా (కరువుదినాల్లో) ఆకలిగొన్న రోజు సమీప అనాథకుగాని, దారిద్య్రంలో మగ్గే నిరుపేదకుగాని పట్టెడన్నం పెట్టడం, ఆపై ఓర్పు, దయాదాక్షిణ్యాల్ని గురించి ఉపదేశించుకునే విశ్వాసుల్లో చేరిపోవడం. ఇలాంటివారే కుడిపక్షం వాళ్ళు. (11-18)
పోతే మా సూక్తుల్ని తిరస్కరించినవారు ఎడమపక్షం వారవుతారు. వారిని (నరకా) అగ్ని (నలువైపులా) చుట్టుముట్టి ఉంటుంది. (19-20)