కురాన్ భావామృతం/అన్-నాజియాత్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
79. నాజిఆత్ (దూరి లాగేవారు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 46)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దూరి గట్టిగా లాగేవారి సాక్షి! మెల్లిగా వెలికి తీసేవారి సాక్షి! వేగంగా ఎగురుతూ తిరిగేవారి సాక్షి! (ఆజ్ఞాపాలనలో) ఒకర్నొకరు మించిపోయేవారి సాక్షి! తిరిగి (దైవాజ్ఞలతో విశ్వ) వ్యవహారాలు నిర్వహించేవారి సాక్షి!... భూమి ఒకదాని తర్వాత ఒకటి అనేక ప్రకంపనాలతో కుదిపివేయబడే రోజు కొందరిగుండెలు తీవ్ర భయాందోళనలతో దడదడ లాడిపోతాయి. వారి చూపులు (అవమానభారంతో) క్రిందికి వాలిపోతాయి. (1-9)
“మనం నిజంగా మళ్ళీ మన పూర్వ స్థితికి తీసుకురాబడతామా? మనం (చచ్చి) శిథిలమయిపోయి ఎముకలుగా మారిపోయినా (తిరిగి బ్రతికించబడతామా)?” అని అంటారు వీరు. “అయితే మళ్ళీ ఈ బ్రతికించి లేపడమనేది (మనకు) చాలా నష్ట దాయకమే” అంటారు తిరిగి. కాని ఇది పెద్ద పనేమీ కాదు. ఒకే ఒక భీకర గర్జన విన్పిస్తుంది. అంతే- మరుక్షణమే వారంతా లేచి ఓ బహిరంగ మైదానంలోకి వచ్చి నిలబడతారు. (10-14)
నీకు మూసా వృత్తాంతం చేరిందా? అతని ప్రభువు పవిత్ర తువాలోయలో అతడ్ని పిలిచి ఇలా అన్నాడు: “ఫిరౌన్ దగ్గరకు వెళ్ళు. అతను (మాపై) తిరగబడి విద్రోహి అయ్యాడు. అతనికిలా చెప్పు: ‘నీవు పవిత్రజీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నీకు నీప్రభువు మార్గం చూపుతాను. దానివల్ల నీలో (దైవ)భీతి ఏర్పడవచ్చు.” (15-19)
మూసా అతనికి అద్భుతమైన మహిమలు చూపించాడు. కాని అతను ధిక్కరిం చాడు, (ఎంత నచ్చజెప్పినా) వినలేదు. తర్వాత అతను వెళ్ళి రకరకాల పన్నాగాలు పన్నాడు. జనాన్ని సమీకరించి “నేనే మీకు అందరి కంటే పెద్ద ప్రభువుని” అన్నాడు. చివరికి దేవుడు అతడ్ని ప్రపంచంలోనూ, పరలోకంలోనూ శిక్షించడానికి పట్టుకున్నాడు. భయపడేవారికి ఈ సంఘటనలో గొప్ప గుణపాఠం ఉంది. (20-26)
(సరే) మిమ్మల్ని సృష్టించడం కష్టమైన పనా లేక ఆకాశాన్నా? దేవుడు దాన్ని నిర్మిం చాడు. దానికప్పు ఎంతోపైకి ఉండేలా చేశాడు. తర్వాత దాన్ని క్రమబద్ధీకరించాడు. దాని రాత్రిని (చీకటితో) కప్పాడు, పగటిని (వెల్తురుతో) తీశాడు. ఆ తర్వాత ఆయన భూమిని (నివాసయోగ్యంగా) పరిచాడు. అందులో నుంచే నీరు, మేత తీశాడు. దానిపై పర్వతాలు పాతాడు. ఇదంతా మీ, మీపశువుల ప్రయోజనం కోసమే చేశాడు. (27-33)
చివరికి మహోపద్రవం సంభవిస్తుంది. ఆరోజు మానవుడు తాను చేసుకున్న పను లన్నీ గుర్తుచేసుకుంటాడు. ప్రతిచూపరీ చూడటానికి వీలుగా నరకం తెరచిఉంటుంది. అయితే తలబిరుసుతో ధిక్కారవైఖరి అవలంబించి, ఐహిక జీవితానికి అత్యధిక ప్రాధాన్య మిచ్చిన వాడికి నరకమే (శాశ్వత) నివాసం. విశ్వప్రభువు ముందు నిలబడి తన కర్మలకు సమాధానమిచ్చుకోవలసి ఉంటుందన్న భావనతో ఆయనకు భయపడుతూ, దుష్ట మనో వాంఛలకు కళ్ళెంవేసిన వ్యక్తికి స్వర్గనివాసం లభిస్తుంది. (34-41)
“ఇంతకూ ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అడుగుతున్నారు వారు. దాని సమయం తెలియజేయడానికి నీకేం పని? ఆ విషయం దేవునికి మాత్రమే తెలుసు. నీవు దాన్ని గురించి భయపడేవారిని హెచ్చరించేవాడివి మాత్రమే. వారు దాన్ని (ప్రత్యక్షంగా) చూసినప్పుడు (తాము ప్రపంచంలో) ఉదయమో, సాయంత్రమో ఒక్క పూట మాత్రమే ఉండిఉంటాం” అని అనుకుంటారు. (42-46)