హంగుమీరఁ దాను యతులజన్మంబుల మార్చు

హంగుమీరఁ దాను యతులజన్మంబుల
నరసి చెప్పునెంతవారికైన
ఆడకాడ కనువు నతిశయమై వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

హంస మానసోద మంటక తిరిగిన మార్చు

హంస మానసోద మంటక తిరిగిన
యట్టు కర్మచయము నంటకుండ
యోగి తిరుగు సకలభోగంబుతోడను
విశ్వదాభిరామ వినర వేమ!

హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు మార్చు

హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు
ఆనక హింసచేసి రవనిసురులు
చావుపశువుఁ దినెడు చండాలుఁడే మేలు
విశ్వదాభిరామ వినర వేమ!

హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా మార్చు

హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
హాని వచ్చు నెంతవాని కైన
ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా
విశ్వదాభిరామ వినర వేమ!

హీనజాతివానికెచ్చు వైష్ణమిచ్చి మార్చు

హీనజాతివానికెచ్చు వైష్ణమిచ్చి
ద్విజునికన్న దొడ్డతీరటండ్రు
కల్లు కడవ కడిగి గంగ నించినరీతి
విశ్వదాభిరామ వినురవేమ!

హీననరులతోడ నింతులతోడను మార్చు

హీననరులతోడ నింతులతోడను
పడుచువాండ్రతోడ ప్రభువుతోడ
ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మఘ్న జనులతో
వైపు దెలిసి పలుకవలయు వేమ!

హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన మార్చు

హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన
ఘనుఁడు గాఁడు హీనజనుఁడె కాని
పరిమళమ్ము గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినర వేమ!

హేమ నగము చేత నెప్పుడు గలవాడు మార్చు

హేమ నగము చేత నెప్పుడు గలవాడు
వెండికొండపైన వెలయువాడు
యెత్తవలెసె బిచ్చ మేమన వచ్చురా?
విశ్వదాభిరామ వినురవేమ!

హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల మార్చు

హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల
వెతలఁ బడనియట్లు విద్యచేతఁ
దత్వమెఱుఁగు వెనుక తనకుఁ జింతేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

హరికి దొరికెనందురా సిరి యప్పుడే మార్చు

హరికి దొరికెనందురా సిరి యప్పుడే
దొరికె కాదె విషము హరున కరయ
నెవని కెట్టులగునొ యెవ్వరెఱుగుదురు
విశ్వదాభిరామ వినురవేమ!

హరివిధిసురిమును లాదిని మార్చు

హరివిధిసురిమును లాదిని
మెరసియు జన్మించి పిదప మేలులకెడగా
జరయందు మరణమందును
వరుస న్వర్తిలిరి మాయవాసన వేమా!

హృదయమందు నున్నయీశుని దెలియక మార్చు

హృదయమందు నున్నయీశుని దెలియక
శిలలనెల్ల మ్రొక్కుజీవులార
శిలల నేమియుండు జీవులందే కాక
విశ్వదాభిరామ వినర వేమ!

హృదయము పదిలంబైనను మార్చు

హృదయము పదిలంబైనను
గుదికొను సన్యాసమునకుఁ గొమ్మలు గలవా
యిదియెఱుఁగరు చదువరులటు
మది ముక్తికి నాస్పదంబు మహిలో వేమా!