వాఁత నాకు మేను వలపట మెడవాఁడు మార్చు

వాఁత నాకు మేను వలపట మెడవాఁడు
ఒంటికాలువాఁడు నొప్పుచుండు
రాజసభలయందె రంజిల్ల మాట్లాడు
విశ్వదాభిరామ వినర వేమ!

వంటదప్పునపుడు వంటకము విషంబు మార్చు

వంటదప్పునపుడు వంటకము విషంబు
కంటఁ జూడఁగానె కంటగించుఁ
గంటకమునఁ దిన్నకడి గండమైవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

వంటవారియింట తిన్నవంటకమును మార్చు

వంటవారియింట తిన్నవంటకమును
వంట తినినయపుడె వెంటవచ్చు
వచ్చు నట్లగాక వరఁకు నుభయులకు
కంటకమగు వంటకమును వేమా!

వెండికొండ పసిడికొండయు తనకుండ మార్చు

వెండికొండ పసిడికొండయు తనకుండ
దేవు డేలబోయి తిరిపెమెత్తె?
దైవబలమేగాని, తనబల్మికాదయా!
విశ్వదాభిరామ వినురవేమ!

వండివచ్చునపుడు వంటక మమృతంబు మార్చు

వండివచ్చునపుడు వంటక మమృతంబు
కంటికింపుగాను కానుపించు
నొడలతినినదిండి వడిమించ గడిదేఱు
విశ్వదాభిరామ వినర వేమ!

వాక్కుచేత దప్పు వావులు వరుసలు మార్చు

వాక్కుచేత దప్పు వావులు వరుసలు
వాక్కుచేత దప్పు వనిత గుణము
వాక్కుచేత కలుగు వర కర్మములు భువిన్
విశ్వదాభిరామ వినురవేమ!

వాక్కునందు గురువు వాక్తత్వము గురువు మార్చు

వాక్కునందు గురువు వాక్తత్వము గురువు
చీఁకటింట గురువు చిక్కియుండు
అఖిలమునకు గురువె యాధార మయియుండు
విశ్వదాభిరామ వినర వేమ!

వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు మార్చు

వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు
ప్రేమశుద్ధిలేని పెట్టులేల
నొసలు భక్తుఁడైన నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినర వేమ!

వక్షమందు గురుని వర్ణించి చూడరా మార్చు

వక్షమందు గురుని వర్ణించి చూడరా
రక్షకత్వమునకు రాచబాట
అక్షమాల జపమె యటవి దొంగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ!

వచ్చెడిది పోయెడిది మఱి మార్చు

వచ్చెడిది పోయెడిది మఱి
చచ్చెడిదియుఁ గనకలేక సహజము లనుచు
విచ్చలవిడిగాఁ దిరుగుట
చిచ్చునఁబడునట్టి మిడుత చెలువము వేమా!

విటునిఁగన్నయంత విశదమై వలపుండు మార్చు

విటునిఁగన్నయంత విశదమై వలపుండు
బోటిఁజూడకట్టిపాటి గలదె
కంటిలోనిపాప కన నెంతవాఁడురా
విశ్వదాభిరామ వినర వేమ!

విటులకనుల కెంత విభ్రమమై యుండు మార్చు

విటులకనుల కెంత విభ్రమమై యుండు
సాటిలేని పొలఁతి చక్కఁదనము
కంటిలోనిపాప కుంటెనకాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు మార్చు

వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు
ముందు మగనిఁ దిట్టు ముసుఁగుపెట్టు
గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ!

వేడబంబువాని వినయంబు లధికంబు మార్చు

వేడబంబువాని వినయంబు లధికంబు
చెడ్డముండ ముసుఁగు చెలఁగిపెట్టు
చెడిపెకొడుకు మిగులచేయు నాచారంబు
విశ్వదాభిరామ వినర వేమ!

వాడవదినెకేల వావివర్తనములు మార్చు

వాడవదినెకేల వావివర్తనములు
చాడివాని కేల జాడబుద్ధి
మూఢసతులకేల ముదముతో జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!

విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక మార్చు

విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక
వెఱపులేక విద్య నొరయలేక
వెడలలేనివాని నడపీనుఁ గందురో
విశ్వదాభిరామ వినర వేమ!

వాడువాడుకాడు వానిలోపలనుండు మార్చు

వాడువాడుకాడు వానిలోపలనుండు
వాడేవాడు వాడువాడుకాడు
వాడు వానిని గూర్చువాడేపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!

విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న మార్చు

విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న
విడువవలయు నాలి విధముఁ దెలిసి
విడువవలయు రాజు వితరణి గాకున్న
విశ్వదాభిరామ వినర వేమ!

వాతగుణము చేత వలపున మగవాఁడు మార్చు

వాతగుణము చేత వలపున మగవాఁడు
లొట్టకనులదాని లోలతకును
పుట్టి జగతి నిలుచు పునరుద్భవంబగు
విశ్వదాభిరామ వినర వేమ!

విత్తనంబు గురువు విశ్వంబునకు నెల్ల మార్చు

విత్తనంబు గురువు విశ్వంబునకు నెల్ల
ప్రణవమంత్ర మరయ పరమ గురువు
కర్మ గురువు సుమ్ము గాయత్రిమంత్రంబు
విశ్వదాభిరామ వినురవేమ!

విత్తును నుముకయుఁ ధరలోఁ మార్చు

విత్తును నుముకయుఁ ధరలోఁ
బొత్తున జనియించి పొట్టుపోయినభంగి
వేత్తయగువానికర్మం
బత్తెఱగున విడిచిపోవు ననువున వేమా!

విత్తులేని వృక్షమొక్కటి పుట్టె మార్చు

విత్తులేని వృక్షమొక్కటి పుట్టె
ఫలము లేని పువ్వు మొదలు పత్రిలేదు
స్వాదులేదు చూడ నాపాటుకును లెస్స
దీనిభావ మేమి తెలుపు వేమా!

వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని మార్చు

వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని
తత్వవేత్తలేఁడు ధరణిలోనఁ
గలిగెనేని యతఁడు కనఁబోఁడు మఱివేఱె
విశ్వదాభిరామ వినర వేమ!

వెదకి కానలేరు వేదాంత వేద్యుని మార్చు

వెదకి కానలేరు వేదాంత వేద్యుని
నుత్తముండు గాంచు నుర్విమీఁదఁ
గలిగెనేని వానిఁ గానంగ లేరయా
విశ్వదాభిరామ వినర వేమ!

వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు మార్చు

వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు
వెదకువానిఁ దాను వెదకుచుండు
వెదకనేర్చునట్టి వెరవరుల్‌ గలరొకో
విశ్వదాభిరామ వినర వేమ!

విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ మార్చు

విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ
చచ్చుదాఁకమోయు చాపగుడిసె
భాగవతులపట్టు పట్టంగ నోపఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు మార్చు

వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు
బాధవిద్యయుఁగాదు పరపు గాదు
మధురమైన యట్టి మనసు నిల్పెడివిద్య
సాధువిద్య యెన్న సరస వేమా!

వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి మార్చు

వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమలపెట్టి తేటపడగ నీవు
గుప్తవిద్య యొకటె కులకాంతవంటిది
విశ్వదాభిరామ వినర వేమ!

వేదశాస్త్రములను విని యేమి కుడిచిరి మార్చు

వేదశాస్త్రములను విని యేమి కుడిచిరి
యరిగితిరిగి సొత్తు రందఱిల్లు
బ్రహ్మమహిమఁ దెలిసి బ్రతుకుట నిజమయా
విశ్వదాభిరామ వినర వేమ!

విధికృతములందు రన్నియు మార్చు

విధికృతములందు రన్నియు
విధికిని విధి లెస్సయయ్యె విష్ణు జపింప
విధియుభవురూప మందెను
విధి బ్రహ్మము సుమ్ముదలప వినరా వేమా!

వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు మార్చు

వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు
వానిలోనివాఁడు వాఁడు సుమ్మి
వాని గన్నవాఁడు వాఁడెపో యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

వెన్న చేతఁబట్టి వివరంబు దెలియక మార్చు

వెన్న చేతఁబట్టి వివరంబు దెలియక
ఘృతముఁ గోరునట్టి యతనిభంగి
తాను దైవమయ్యు దైవంబుఁ దలఁచును
విశ్వదాభిరామ వినర వేమ!

విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు మార్చు

విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు
కన్నవానికన్నఁ గలియువాఁడు
ఉన్నతోన్నతుఁడయి యుర్విలోపల నుండు
విశ్వదాభిరామ వినర వేమ!

వానను దడియనివారును మార్చు

వానను దడియనివారును
పూనిక విడ మన్న చేఁత బొరయనివారున్
నానాదిక్కుల వెదకినఁ
గానమురా నెంతవాని గానము వేమా!

వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు మార్చు

వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు
కనియుఁ గానకుండు కడఁగి యోగి
మనుజవరులచేత మఱిపూజఁ గొనుచుండు
విశ్వదాభిరామ వినర వేమ!

వినియుండెడి జనమెల్లను మార్చు

వినియుండెడి జనమెల్లను
చనిపోయినవారి పుణ్యసత్కథ లెలమి
వినవలెఁ గనవలె ననవలె
ననిమిషునకునైనఁ దెలియ దంత్యము వేమ!

వానరాకడ మఱి ప్రాణంబు పోకడ మార్చు

వానరాకడ మఱి ప్రాణంబు పోకడ
కానఁబడదు ఘనుని కైనఁగాని
కానఁబడిన మీఁద కలి యిట్లునడుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్‌ మార్చు

వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్‌
మనసుతోడఁ గూర్చి మర్మ మెఱిఁగి
యాత్మలింగపూజ నంటిన ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ!

వినవలె నెవ్వరు చెప్పిన మార్చు

వినవలె నెవ్వరు చెప్పిన
వినినంతనె తమకపడక వివరింపవలె
విని కని వివరము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో వేమా!

విను వివేకమనెడి వింతగొడ్డలిచేత మార్చు

విను వివేకమనెడి వింతగొడ్డలిచేత
వలయవిద్యయనెడు నడవి నఱికి
తెలివియనెడుగొప్ప దీపంబు చేఁబట్టి
ముక్తిఁ జూడవచ్చు మొనసి వేమ!

వినుకలి కనుకలి గోరము మార్చు

వినుకలి కనుకలి గోరము
కనుకలియాకాంతగూడి కవయగ గోరు
గనుగొని ప్రేమన్బొరలును
ఘనతరమోహంబుచోటు గదరా వేమా!

విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక మార్చు

విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక
ప్రాకృతులను జూచి పరిహసించు
ధరణిసురులకన్న దాసరిమత మెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

వేమన చెప్పిన మాటలు మార్చు

వేమన చెప్పిన మాటలు
సామంబున సకలవేద సారంబుగదా
సామెత పంచాక్షరిలో
నీమహిమలఁ దెలియకున్న నింపా వేమా!

వేమన పద్యము లన్నిటి మార్చు

వేమన పద్యము లన్నిటి
సామంబునఁ జదివినట్టి సజ్జను లెల్ల
సోమనతల సుందరు కడు
నేమంబునఁ జూడరయ్య నేర్పున వేమ!

వేమన్నా నీమహిమలు మార్చు

వేమన్నా నీమహిమలు
నేమన్నా తెలియ దింక నెటువలె నన్నా
వేమన్నా నీచిత్త మ
దేమన్నా నీవె మాకు నెఱుక గదన్నా!

వేమననగ యోగి వెలసె లోకములోనఁ మార్చు

వేమననగ యోగి వెలసె లోకములోనఁ
బూజలిడుఁడు, పుణ్య పురుషులార
పూజలిడిన యంత, భుక్తి ముక్తుల నిచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన మార్చు

వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన
చేదువిడిచి తీపు చెందదెపుడు
నోగుగుణము విడిచి యుచితజ్ఞుఁ డగునట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు మార్చు

వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు
తప్పు లెన్నియున్న నొప్పియుండు
తత్తఱపడ కందుఁ జిత్తము నిల్పుము
విశ్వదాభిరామ వినర వేమ!

వెయ్యారుగతుల జలనిధి మార్చు

వెయ్యారుగతుల జలనిధి
తియ్యగ ననిశంబు గలయ దిప్పుట యరుదౌ
కొయ్యకుఁదా సుజ్ఞానము
వెయ్యి విధంబులను జెప్ప వృథరా వేమా!

వేయుపద్యముల వివేకియై భక్తితోఁ మార్చు

వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
బఠనఁ జేసినట్టి భక్తులకును
బాయకుండు మోక్షపద మరచేతిదై
విశ్వదాభిరామ వినర వేమ!

వాయువందె పుట్టి వాయువందె పెఱిగి మార్చు

వాయువందె పుట్టి వాయువందె పెఱిగి
వాయువందు మేలు వరుసఁ దెలియ
వాయువందు ప్రాణవాయువు తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

వేయువిధము లమర వేమనపద్యంబు మార్చు

వేయువిధము లమర వేమనపద్యంబు
లర్థ మిచ్చువాని నరసి చూడ
చూడఁజూడఁ గలుగుచోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!

వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు మార్చు

వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు
సేఁతకొలదిగాని వ్రాఁతగాదు
వ్రాఁతకజుఁడు కర్త చేఁతకుఁ దాఁగర్త
విశ్వదాభిరామ వినర వేమ!

వారకాంత లెల్ల వలచి యేతెంతురా మార్చు

వారకాంత లెల్ల వలచి యేతెంతురా
పొందుఁజేసి ధనము పుచ్చుకొఱకు
మాచలమ్మ వచ్చి మఱి యిల్లువెళ్లురా
విశ్వదాభిరామ వినర వేమ!

వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని మార్చు

వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని
యాత్మచిక్కుఁ గాన నలవిగాదు
ఆత్మచిక్కుఁ బాపునతఁడెపో ఘనయోగి
విశ్వదాభిరామ వినర వేమ!

వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు మార్చు

వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు
వ్రేయవ్రేయఁ బ్రబల వృక్షమగును
తెలియఁ దెలియవాఁడు దేవుఁడనందగు
విశ్వదాభిరామ వినర వేమ!

వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ మార్చు

వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ
జక్కదంచి వండి మిక్కుటముగ
సుష్టుభోజనములఁ జూరగా నిడువాఁడు
చెప్పనేల వాఁడు శివుఁడు వేమ!

వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును మార్చు

వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును
చీడ పురుగు చేరి చెట్టుఁ జెఱుచు
కుత్సితుండు చేరి, గుణవంతుఁ జెఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!

వెఱ్ఱినక్కలవలె వేదముల్‌ చదివెద మార్చు

వెఱ్ఱినక్కలవలె వేదముల్‌ చదివెద
రాశయంబు లెఱుఁగరయ్య వారు
వేదసారమంత వేమన యెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!

వెఱ్ఱిమొద్దు కేల వేదశాస్త్రంబులు మార్చు

వెఱ్ఱిమొద్దు కేల వేదశాస్త్రంబులు
ముద్దులాడి కేల ముసలిమగఁడు
చద్ది మిగులనింట సంసార మేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

వెఱ్ఱివాని కయిన వేషధారికయిన మార్చు

వెఱ్ఱివాని కయిన వేషధారికయిన
రోగికైన పరమయోగికైన
స్త్రీలఁజూచినపుడె చిత్తంబు రంజిల్లు
విశ్వదాభిరామ వినర వేమ!

వెఱవవలెఁ బామునకు నిల మార్చు

వెఱవవలెఁ బామునకు నిల
వెఱవఁగవలె మరణమునకు విశ్వములోన
మఱవగవలె సంగమముల
మఱి మఱువగ వలదు మేలు మహిలో వేమా!

వెలఁది చక్కఁదనము వెరపైన యీడును మార్చు

వెలఁది చక్కఁదనము వెరపైన యీడును
విభుని కరుణలేక వితగనుండు
నీదుకరుణలేక నేర్పులు కొఱగావు
విశ్వదాభిరామ వినర వేమ!

వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు మార్చు

వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు
ములకపంటిగిజరు ముష్టిరసము
చింతలేనివేళ జీడిసమానమౌ
విశ్వదాభిరామ వినర వేమ!

వెలయ పరమతత్వ విభవంబు దెలియక మార్చు

వెలయ పరమతత్వ విభవంబు దెలియక
బాహ్యవిద్యచేత బరఁగు టెల్ల
పూరి మెసవఁగ హరి పోయినచందంబు
విశ్వదాభిరామ వినర వేమ!

వెలయాలి వలనఁ గూరిమి మార్చు

వెలయాలి వలనఁ గూరిమి
కలుగదు, మఱి కలిగెనేని కడతేరదురా
పలువురు నడిచెడి తెరువున
పులు మొలవదు, మొలిచెనేని పొదలదు వేమా!

వెల్లకుక్కల యెంగిలి విశదమాయె మార్చు

వెల్లకుక్కల యెంగిలి విశదమాయె
పడుచువేశ్యల యెంగిలి ప్రాప్తమాయె
చెడుగు నెంగిలి యెంతకు శ్రేష్ఠమాయె
ఇష్టమగువారి యెంగిలి యెగ్గు వేమ!

వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి మార్చు

వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి
యదిగొయిదిగొ యనుచు నాసఁబెట్టి
గడువుఁ బెట్టి రేపు గడియ కానిమ్మని
గడియలోనఁ బడియెఁ గదర వేమ!

వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల మార్చు

వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల
పట్టవచ్చుగాని, పాడుకర్మ
గురునిబోధ లేక కుదురు చెందదు సుమీ
విశ్వదాభిరామ వినురవేమ!

వెళ్లి వచ్చు నాఁడు మళ్లి పోయెడు నాఁడు మార్చు

వెళ్లి వచ్చు నాఁడు మళ్లి పోయెడు నాఁడు
వెంట రాదు; ధనము కొంచఁ బోఁడు;
తానదేడఁ బోనొ ధన మేడఁ బోవునో?
విశ్వదాభిరామ వినర వేమ!

వావివర్తనలును వరుసలు మర్యాద మార్చు

వావివర్తనలును వరుసలు మర్యాద
దప్పి నడచెనేని తగులుఁ గీడు
వదల దపుడు తాకు నది దప్పినం దుది
ముసలిముప్పునైన మునుగు వేమా!

విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ మార్చు

విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ
బ్రహ్మలకునునేల పాటిదక్కె
వనములోని క్రోతి వసుమతి నడుపునా
విశ్వదాభిరామ వినర వేమ!

వేష మొనరఁగట్టి వెలయ శూద్రత్వంబు మార్చు

వేష మొనరఁగట్టి వెలయ శూద్రత్వంబు
తనకు లేదనుకొను ధరణి ద్విజుఁడు
అరిది గిట్టువేళ నడఁగు ద్విజత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని మార్చు

వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని
భ్రష్టు లంతకన్న వేఱులేరు
చారు బలమదైన నీరుగాఁ బోవునా
విశ్వదాభిరామ వినర వేమ!


విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి మార్చు

విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి
వాదమేల మతవిభేదమేల
తెలియ లింగధారులు తిరుమణిపాలైరి
విశ్వదాభిరామ వినర వేమ!

విషయము లొరసిన నొరయఁడు మార్చు

విషయము లొరసిన నొరయఁడు
విషయేంద్రియ పరదళంబు సేయగ మఱిదా
విషమాది షట్కమను దు
ర్విషయములను బొందకుండ వేమన నేర్చు!

విషయములఁ బొరలి రోయక మార్చు

విషయములఁ బొరలి రోయక
విషమంటినగతిని జూచి విముఖత ధరలో
విష సమమాయా సుఖముల
విషయముల గూడకుండ్రు వేత్తలు వేమా!

విషయములు తెరలపొలుపున మార్చు

విషయములు తెరలపొలుపున
విషయము లంటక మహాత్ము విధమున ధరలో
విషసంసారము లన్నియు
విషయము లన్నియును గెల్వ వేమన నేర్చు!

విషసహితులు నరులు విషధరు లెన్నఁగ మార్చు

విషసహితులు నరులు విషధరు లెన్నఁగ
విష విషధరములను విరియఁగొట్ట
నఘము వచ్చుకడకు నాయువుకొదువగు
విశ్వదాభిరామ వినర వేమ!

వినియు వినకయుండు కనియు గనక యుండు మార్చు

వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినురవేమ!

వెన్న చేతబట్టి వివరంబు తెలియక మార్చు

వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ!

వేషధారినెపుడు విశ్వసింపగరాదు మార్చు

వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!