అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె

మార్చు

అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె
పిన్న పెద్దతనము లెన్నలేల
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా
విశ్వదాభిరామ వినర వేమ!

అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి

మార్చు

అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి
తనువు ముదిమిచేతఁ దఱుచు వడక
ముప్పు తిప్పలఁ బడి మోహంబు విడువడు
విశ్వదాభిరామ వినర వేమ!

అంగమందు లింగ మతిశయంబునఁ గట్టి

మార్చు

అంగమందు లింగ మతిశయంబునఁ గట్టి
లింగమందు ముక్తి నిలుపలేరు
ముక్తిలేక తుదను మూర్ఖుఁడై పోవురా
విశ్వదాభిరామ వినర వేమ!

అంజనంబు కనుల కంటించిచూచిన

మార్చు

అంజనంబు కనుల కంటించిచూచిన
సొమ్ము దొరకు భువిని సూత్రముగను
గురుని నమ్మి కరుణ గుణమంటి చూడరా
విశ్వదాభిరామ వినురవేమ!

అంటుముట్టునెంచి యదలించి పడవైచి

మార్చు

అంటుముట్టునెంచి యదలించి పడవైచి
దూరమందు చేరి దూరుచుంద్రు
పుట్టిచచ్చుజనులు పూర్ణంబు నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!

అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లు

మార్చు

అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లు
చేరవలయు బ్రతుకఁజేయు నతఁడు
ఆ విభీషణునకు నతిగౌరవంబీడె
భూతలమున రామమూర్తి వేమ!

అండములో నాకాశం

మార్చు

అండములో నాకాశం
బుండంగాఁ జూడఁజూడ నొనరుఁగ దీనిపై
యుండును నన్నియుఁ దెలిసిన
మెండుగ నెటుచూచి చన్నమేలగు వేమా!

అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని

మార్చు

అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని
బుద్బుదములఁ బుట్టుఁ బురుగు లెల్ల
స్వేదముననుబుట్టు జీవులు కొన్నిరా
విశ్వదాభిరామ వినర వేమ!

అంత కొఱత దీఱి అతిశయకాముఁడై

మార్చు

అంత కొఱత దీఱి అతిశయకాముఁడై
నిన్ను నమ్మిచాల నిష్ఠతోడ
నిన్నుఁగొల్వ ముక్తి నిశ్చయముగఁ గల్గు
విశ్వదాభిరామ వినర వేమ!

అంతరంగమందు నభవు నుద్దేశించి

మార్చు

అంతరంగమందు నభవు నుద్దేశించి
నిల్పి చూడఁదలఁపు నిలుచుఁగాక
బాహ్యమందు శివుని భావింప నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడ

మార్చు

అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడ
మెలఁగునట్టి ద్విజులు మేదినందు
యమునినరకములకు నరుగంగ నది సాక్షి
విశ్వదాభిరామ వినర వేమ!

అందరాని పదము ఆ బ్రహ్మమందురు

మార్చు

అందరాని పదము ఆ బ్రహ్మమందురు
పొందరానిదంచు భువినియండ్రు
గురుని కరుణ కలగ గూడి రాకేమౌనె
విశ్వదాభిరామ వినురవేమ!

అందు నిందుననక యన్నిటఁ బరికించి

మార్చు

అందు నిందుననక యన్నిటఁ బరికించి
విష్ణు వరయుచుండు విదితముగను
చక్రి తిరుగు భూమిచక్రంబులోపల
విశ్వదాభిరామ వినర వేమ!

అంధులైన వారు నందు నిం దనకుండు

మార్చు

అంధులైన వారు నందు నిం దనకుండు
నన్నితావులందు హరునివలెను
తెలియువారి కెల్ల దేవుఁడే కనుపించు
విశ్వదాభిరామ వినర వేమ!

అక్షమాలపూని అలసట చెందక

మార్చు

అక్షమాలపూని అలసట చెందక
కుక్షినింపుకొనుట కొదువగాదు
పక్షికొంగరీతి పైచూపు లేదొకో
విశ్వదాభిరామ వినురవేమ!

అక్షరపుట మిట్టి యండంబులోఁ గూర్చి

మార్చు

అక్షరపుట మిట్టి యండంబులోఁ గూర్చి
యమరునొక్క రవము ననుభవించు
నతని కన్న ముక్తి యక్షరమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ!

అక్షరపుటడవిఁ బొరలక

మార్చు

అక్షరపుటడవిఁ బొరలక
యక్షరమగు మహిగాన నవనిం దొలుతౌ
నక్షరమును జపియించిన
నక్షరమగు నదియు చాల నరయఁగ వేమా!

అక్షరపుటడవిఁజొర వే

మార్చు

అక్షరపుటడవిఁజొర వే
లక్షలఁ జదువంగ నేల లాలితముగఁ బ్ర
త్యక్షముగను శివ యను రెం
డక్షరములు మనకి శుద్ధి యగురా వేమా!

అక్షరాసివెంట అడవులవెంటను

మార్చు

అక్షరాసివెంట అడవులవెంటను
కొండ రాల గోడు గుడవనేల
హృదయమందు శివుడటుండుట తెలియరో
విశ్వదాభిరామ వినురవేమ!

అగ్ని చేతఁబట్టి యాపరమేశుని

మార్చు

అగ్ని చేతఁబట్టి యాపరమేశుని
నిండఁజేసి నరులు నీఱుగారె
దక్షుక్రతువులోని తల్లడ మెఱుఁగరా
విశ్వదాభిరామ వినర వేమ!

అగ్ని శిఖలయందు నమరంగ మమకార

మార్చు

అగ్ని శిఖలయందు నమరంగ మమకార
మభవుమీఁద ధ్యాన మమర నునిచి
యాహుతి యగువెనుక హరున కర్పితమౌను
విశ్వదాభిరామ వినర వేమ!

అగ్నిబాణముచేత అంబుధింకినపుడె

మార్చు

అగ్నిబాణముచేత అంబుధింకినపుడె
రాముడవలి కేగులావుమరచె
వరుస కొండలమోసి వారధేటికికట్టె
విశ్వదాభిరామ వినురవేమ!

అచరచరసమూహ మంగము లింగము

మార్చు

అచరచరసమూహ మంగము లింగము
సరణి దెలియనట్టి శైవమేల
అష్టతనువు లమర హరుఁడౌట నెఱుఁగరో
విశ్వదాభిరామ వినర వేమ!

అజ్ఞానమె శూద్రత్వము

మార్చు

అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా
యజ్ఞాన ముడిగి వాల్మీకి
సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా!

అట్టినికృష్టుని బ్రతు కగ్ని పాలైపోవు

మార్చు

అట్టినికృష్టుని బ్రతు కగ్ని పాలైపోవు
నిర్ధయాత్మునిబ్రతుకు నీటగలియు
క్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌను
విశ్వదాభిరామ వినురవేమ!

అడవి దిరుగ లేదు ఆకసమున లేదు

మార్చు

అడవి దిరుగ లేదు ఆకసమున లేదు
అవనిఁ దీర్థయాత్రలందు లేదు
ఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

అడుగ దగువారి నడుగమి

మార్చు

అడుగ దగువారి నడుగమి
నిడినయెడ¦ కొసరు చుంట యీలేననఁగా
గడుసుపడి యాసచేఁదా
నడుగుట దుర్మార్గవృత్తు లగురా వేమా!

అణువులోన నుండు నఖిలజగంబులు

మార్చు

అణువులోన నుండు నఖిలజగంబులు
నణువు తనదులోన నణఁగియుండు
మనసు నిల్ప నరుఁడు మఱిముక్తిఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ!

అతిథి రాక చూచి యదలించి పడవైచి

మార్చు

అతిథిరాకచూచి యదిలించిపడవైచి
కఠినచిత్తులగుచు కానలేరు
కర్మబుద్ధులగుచు ధర్మంబు సేయరు
విశ్వదాభిరామ వినురవేమ!

అద నెఱిఁగిన మగువ యనువెర్గు చనువెర్గు

మార్చు

అద నెఱిఁగిన మగువ యనువెర్గు చనువెర్గు
ముదముతోడ మగని మోహ మెఱుఁగు
విభుని శ్రేష్ఠగుణము వేశ్యతా నెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండు

మార్చు

అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండు
నాదిఁ జూప నొకని కలవిగాదు
ఆదిముక్తిఁ దెలుపు నాత్మనే యుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

అదయ హస్తమందు నభయహస్తంబీయ

మార్చు

అదయ హస్తమందు నభయహస్తంబీయ
దర్పకాంగుఁడైన తన్నుఁ జూచి
మంగళంబుచేయు మంగళహీనుఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని

మార్చు

అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని
కుదువసొమ్ము కొన్నఁ గొంత హాని
మొదటి పక్షమునను మూలకర్తకు హాని
విశ్వదాభిరామ వినర వేమ!

అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగక

మార్చు

అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగక
మతియు లేక చదివి మగ్నుఁ డయ్యె
నతిరహస్య మెల్ల నాజనుఁ డెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

అధికజనులతోడ నాప్తులతోడను

మార్చు

అధికజనులతోడ నాప్తులతోడను
పరువు గురు తెఱింగి పలుకకున్న
వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య
హానిచెందుఁ దనకు నపుడు వేమ!

అధికమైన యజ్ఞ మల్పుండు తాఁ జేసి

మార్చు

అధికమైన యజ్ఞ మల్పుండు తాఁ జేసి
మొనసి శాస్త్ర మనుచు మురువు దక్కు
దొబ్బ నేర్చుకుక్క దుత్తల మోచునా
విశ్వదాభిరామ వినర వేమ!

అధికుడైనరాజు నల్పును చేపట్టు

మార్చు

అధికుడైనరాజు నల్పును చేపట్టు
వానిమాట చెల్లు వసుధలోన
గణికు లొప్పియున్న గవ్వలు చెల్లవా
విశ్వదాభిరామ వినర వేమ!

అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

మార్చు

అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగ దినఁగ వేము దీయనుండు
సాధనమున బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినర వేమ!

అనఘ పురుషుండు నొక్కఁడు

మార్చు

అనఘ పురుషుండు నొక్కఁడు
విను నిత్య మనిత్యమనెడివిధ మిట్టి దగు
తన సంకల్పమె బంధము
తన సంకల్పక్షయంబె తత్వము వేమా!

అన్ని దానములను నన్నదానమె గొప్ప

మార్చు

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నవారికంటె ఘనులు లేరు
ఎన్న గురునికన్న నెక్కువలేదయా
విశ్వదాభిరామ వినురవేమ!

అన్నదానమునకు నధిక సంపదగల్గి

మార్చు

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినురవేమ !

అన్న మడుగనతని కన్నంబుఁ బెట్టిన

మార్చు

అన్న మడుగనతని కన్నంబుఁ బెట్టిన
బాఱవేయుదాన ఫలిత మేమి
ధనికునకు నొసంగు దానంబు నటువలె
విశ్వదాభిరామ వినర వేమ!

అన్న మధికమైన నది తనుఁజంపును

మార్చు

అన్న మధికమైన నది తనుఁజంపును
నన్న మంటకున్న నాత్మ నొచ్చుఁ
జంప నొంప బువ్వ చాలదా వెయ్యేల
విశ్వదాభిరామ వినర వేమ!

అన్న మధికమైన నరయ మృత్యువు నిజం

మార్చు

అన్న మధికమైన నరయ మృత్యువు నిజం
బన్న మంటకున్న నాత్మనొచ్చు
చంపఁబెంప బువ్వచాలదా వేయేల
విశ్వదాభిరామ వినురవేమ!

అన్నిగోసివేసి యనలంబు చల్లార్చి

మార్చు

అన్నిగోసివేసి యనలంబు చల్లార్చి
గోచిబిగియఁగట్టి కోప మడచి
యాసవిడిచెనేని యతఁడు తా యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

అన్నిజాడ లుడిగి యానందగాముఁడై

మార్చు

అన్నిజాడ లుడిగి యానందగాముఁడై
నిన్ను నమ్మఁజూచు నిష్ఠతోడ
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన
విశ్వదాభిరామ వినర వేమ!

అన్నమదమువలన నతివలు పురుషులు

మార్చు

అన్నమదమువలన నతివలు పురుషులు
ఏపురేఁగి మదనుఁ డేఁచె నందు
రన్న ముడుగువెనుక నతఁ డెందుఁబోయెరా
విశ్వదాభిరామ వినర వేమ!

అన్నమునకు నంటునైన నాత్మకునంటు

మార్చు

అన్నమునకు నంటునైన నాత్మకునంటు
ఆత్మను పెనగొన్న నన్నమంటు
ఆత్మశుద్ధియన్న మన్న శుద్ధియునాత్మ
మిన్నుమన్నుమాడ్కి మెఱయు వేమా!

అన్యులకును వచ్చునాపదఁ దనదిగా

మార్చు

అన్యులకును వచ్చునాపదఁ దనదిగా
నెన్నువాఁడు భువిని నున్నవాఁడు
ఎన్నువారిలోన నిహపరంబులు లెస్స
కన్నవాఁడు మిగుల ఘనుఁడు వేమా!

అనలంబున జనియించియు

మార్చు

అనలంబున జనియించియు
ననలంబున సలిలమగును నాకాశమున
గనిపించి పుట్టుఁదానే
జనకుఁడు లేనట్టిదాయె చరితము వేమా.!

అనుకూల్యముగల యంగన కలిగిన

మార్చు

అనుకూల్యముగల యంగన కలిగిన
సతికిపతికి పరమసౌఖ్య మమరు
ప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినర వేమ!

అనువు గాని చోట నధికుల మనరాదు

మార్చు

అనువు గాని చోట నధికుల మనరాదు
కొంచె ముండు టెల్ల కొదువ గాదు
కొండ అద్దమందుఁ కొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినర వేమ!

అప్పుదీయ రోఁత హరిహరాదులకైన

మార్చు

అప్పుదీయ రోఁత హరిహరాదులకైన
మొప్పెతోడ మైత్రి మొదలె రోఁత
తప్పు బలుక రోఁత తాకట్టిడిన రోఁత
విశ్వదాభిరామ వినర వేమ!

అభిజాత్యముననె ఆయువున్నంతకు

మార్చు

అభిజాత్యముననె ఆయువున్నంతకు
తిరుగుచుండ్రు భ్రమల తెలియలేక
మురికిభాండమునందు ముసురు ఈగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ!

అమ్మసుమీ యా లనఁగా

మార్చు

అమ్మసుమీ యా లనఁగా
నమ్మనఁగా నాలు సుమ్మియాయిద్దరిని¦
ఇమ్మహిలోఁ బరమాత్ముని
నెమ్మదిలోఁ దెలియఁ దానె నేర్పరి వేమా!

అమలమైన పలుకు లభిషేకవారిధి

మార్చు

అమలమైన పలుకు లభిషేకవారిధి
తనువు దేవళంబు తాల్మి నొంది
యాత్మ శివునిఁజేర్చు నాతఁడే శివయోగి
విశ్వదాభిరామ వినర వేమ!

అమృతసాధనమున నందఱుబలుతురు

మార్చు

అమృతసాధనమున నందఱుబలుతురు
అమృతమెంచిచూడ నందలేరు
అమృతము విషమాయె నదియేమి చిత్రమౌ
విశ్వదాభిరామ వినర వేమ!

అయిదు నక్షరముల యంగంబు దెలిసిన

మార్చు

అయిదు నక్షరముల యంగంబు దెలిసిన
నైదునందు ముక్తి యమరియుండు
నైదులోననున్న యతఁడెపో బ్రహంబు
విశ్వదాభిరామ వినర వేమ!

అర్థవంతుల సొమ్ము నాసింతు రర్థులు

మార్చు

అర్థవంతుల సొమ్ము నాసింతు రర్థులు
యర్థికీయ సొమ్ము వ్యర్థమౌను
వ్యర్థమైన సొమ్ము వ్యర్థులఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ!

అరయ కర్మమునను నాహరిశ్చంద్రుండు

మార్చు

అరయ కర్మమునను నాహరిశ్చంద్రుండు
ఆలిబిడ్డనమ్మ యతడు కూడ
మాలవానికపుడు మరిలోకువాయెరా
విశ్వదాభిరామ వినురవేమ!

అరయ నాస్తి యనక యడ్డుమాటాడక

మార్చు

అరయ నాస్తి యనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని తన్నుకోక
తన్నుఁ దాఁ గనుగొని తాఁ బెట్టినది పెట్టు
విశ్వదాభిరామ వినర వేమ!

అరయ లజ్జజూడ అందరు యుందుండు

మార్చు

అరయ లజ్జజూడ అందరు యుందుండు
లజ్జలేనివాడు లాలితుండె
లజ్జగల్గువాని లాభంబు లేమయా!
విశ్వదాభిరామ వినురవేమ!

అరయఁ దఱచుకల్ల లాడెడు వారిండ్ల

మార్చు

అరయఁ దఱచుకల్ల లాడెడు వారిండ్ల
వెడలకేల లక్ష్మి విశ్రమించు
నీరు నోటికుండ నిలువని చందాన
విశ్వదాభిరామ వినర వేమ!

అరయఁదోచునాఁడు గురువని తా నెంచి

మార్చు

అరయఁదోచునాఁడు గురువని తా నెంచి
తిరుగువాఁడు తన్ను నరయలేఁడు
పనికిమాలినట్టి బానిసె కొడుకురా
విశ్వదాభిరామ వినర వేమ!

అరిషడ్వర్గంబులచే

మార్చు

అరిషడ్వర్గంబులచే
నరులెల్లను జొక్కిచిక్కినయగతి యనుచు
జరుగుదురు గాకతత్వము
నరయంగను లేరు నించుకైనను వేమా!

అరుదుగా నడిగిన యతఁడర్థిగాఁబోడు

మార్చు

అరుదుగా నడిగిన యతఁడర్థిగాఁబోడు
తఱచుగా నొసగక దాతగాఁడు
దాత కర్థి కింత తారతమ్యము సుమా
విశ్వదాభిరామ వినర వేమ!

అర్ధ యంకణమున కాధారమైనట్టి

మార్చు

అర్ధ యంకణమున కాధారమైనట్టి
యొంటిమేడ గుంజు నొనరనిల్పె
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు
విశ్వదాభిరామ వినురవేమ !

అఱుతలింగ ముంచి యదిగనఁజాలక

మార్చు

అఱుతలింగ ముంచి యదిగనఁజాలక
పర్వతమున కేగు పామరుండు
ముక్తిఁగాన నగునె మూఢాత్ముఁడగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ!

అలను బుడగపుట్టినప్పుడే క్షయమౌను

మార్చు

అలను బుడగపుట్టినప్పుడే క్షయమౌను
కలనుగాంతులక్ష్మిగనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరె కానరు
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన

మార్చు

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్లఁ దొలఁగఁగొట్టు
చెప్పుతినెడికుక్క చెఱకుతీ పెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు

మార్చు

అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు
బహుళ దుఃఖములను బాధపడును
పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను

మార్చు

అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను
సజ్జనుండు బలుకుఁ జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినర వేమ!

అలయఁజేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లు

మార్చు

అలయఁజేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లు
తిరిపెమిడెడు కటికిదేబెలెల్ల
నెలమి మన్నుదినెడు నెఱ్ఱలౌదురు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ!

అల్లుఁడైన నేమి యన్యుఁడైన నేమి

మార్చు

అల్లుఁడైన నేమి యన్యుఁడైన నేమి
చెప్పఁదగిన రీతిఁ జెప్పినాము
హరునియెఱుక లేక యాకులల్లాడునా
విశ్వదాభిరామ వినర వేమ!

అల్లువాని మృతికి నాత్మఁ జింతించును

మార్చు

అల్లువాని మృతికి నాత్మఁ జింతించును
తనయుమృతికిఁ దానె తల్లడిల్లుఁ
బుణ్యపురుషు మృతికి భూమిలో జనులకు
యుగము గ్రుంగినట్టు లుండు వేమ!

అవని వేమన్న చెప్పిన యాత్మబుద్ధిఁ

మార్చు

అవని వేమన్న చెప్పిన యాత్మబుద్ధిఁ
దెలియలేనట్టి యజ్ఞాని తేజమెల్ల
తలనుఁ బాసిన వెంట్రుకవలెను జూడ
భుక్తి ముక్తులు హీనమైపోవు వేమ!

అవుటఁగా మెఱుఁగని యజ్ఞానజీవులు

మార్చు

అవుటఁగా మెఱుఁగని యజ్ఞానజీవులు
మూలము దెలియకను ముట్టుచేత
ననుదినము సృజించి యాత్మఁ దెలియ లేక
చచ్చి పుట్టుచుండు జగతి వేమా!

అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవు

మార్చు

అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవు
నిర్దయాత్ము బ్రతుకు నీటఁగలియు
క్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌను
విశ్వదాభిరామ వినర వేమ!

అసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చి

మార్చు

అసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చి
గోచి బిగియఁబెట్టి కోపమడఁచి
గుట్టు మీఱవాఁడు గురువుకు గురువురా
విశ్వదాభిరామ వినర వేమ!