కాశీమజిలీకథలు/మొదటి భాగము/నాల్గవ మజిలీ
నాల్గవ మజిలీ
ప్రవరుని కథ
గోపా! అడవిలో మఱ్ఱిమ్రాను పడమటికొమ్మ యెక్కి యరిగిన విప్రకుమారుడు ప్రవరుడు మూడుదినములు దానిమీద నడచినంత నాశాఖాంతము గాన్పించినది. అతం డంతటితో యాగక మితియున్నందున నిందేవేని వింతలుండకపోవు. కొంతదూర మరిగి చూసెదంగాక యని శాఖ దిగి యడవిగానున్న యచ్చోట సన్ననిదారి యొకటి గానంబడుటయు దానింబడి నడువసాగెను. కొంతదూర మరిగిన నచ్చట కొందరు విచ్చుకత్తులతో ముచ్చులెదురై యతనియొద్దనున్న మణికనకవస్తుసమితి నంతయు దోచుకొనుటయేగాక విలువగల కట్టుబట్టలుకూడ నూడదీసికొని తమ మురికిగుడ్డ లతనికి గట్టనిచ్చి యథేచ్చం జనిరి.
దొంగలు తన్ను దోచికొనినందుల కించుకయేవి చింతింపక యతండు సంతోషముతో నరుగుచు సాయంకాలమున కొకపట్టణము జేరెను. ఆ దిన మమావాస్య యగుట రాత్రి మిగుల జీకటిగానున్నది. అందు భోజనసదుపాయము జేయు బ్రాహ్మణగృహ మెందున్నదో దెలిసికొనలేక నాలుగువీథులు తిరుగగ నా పట్టణపు రాజుగారి కోటకు బడమరదెస నున్న గుఱ్ఱములసాల యొకటి గానంబడినది ప్రవరుం డం దొకవేదికం జూచి పయికి నడువలేక యాదినమున జాలబడలియున్నకతంబున దానిమీద బండుకొని గాఢముగా నిద్రబోయెను .
నిద్రాసక్తులు శయ్యాసుఖంబుల గణింతురా? అట్టి నిద్రయు నొకజాము పట్టినది. ఆకలిగా నుండుటచే బిమ్మట మెలకువ వచ్చినది. అప్పు డతం డెద్దియో ధ్యానించుచు నూరకయే పండుకొని యుండెను.
ఇట్లుండగా నా కోటమీదుగా గలగల యను ధ్వని యొకటి వినంబడినది. దాని కతండు బెదిరి యది యేమో యని యాదెస బరిశీలింపుచుండ నాగోడపైనుండి యొకయినుపగొలుసు క్రిందికి వ్రేలవేయబడినది మిగుల నద్బుతపడుచు దత్కారణ మరయుచుండ నందుండి తొలకరిమెరపువలె నక్కటికిచీకటిలో దళ్కురని మెయిదీగ మెరయ బదియారేడులప్రాయముగల యొకముద్దుగొమ్మ చరచరం దిగి నచట కానంబడిన నతం డచ్చెరువందుచు నోహో! యింత సోయగముగల యబల యెవ్వని వలచి యిట్లు దిగివచ్చుచున్నదో చూచెదగాక యని కన్నులు మూయక నిద్రబోవువానివలె గుఱ్ఱు పెట్టుచుండెను. ఇంతలో నన్నెలంతయు గొలుసు దిగివచ్చి యాసాల నలుదెసలం బరికించి యొకమూల గుఱ్ఱుపెట్టుచున్న యాప్రవరునొద్ద కరిగి మెల్లన వీపుమీద జేయివయిచి తడుముచు లెమ్మని పిలిచిన నతండు వెరగుపడుచు మారుమాటాడక కన్నులు నులిమికొనుచు లేచి కూర్చుండెను. అప్పు డానాతి యతని హస్తసంజ్ఞచే నందున్న నొకగుఱ్ఱమును జూపి యెక్కుమనవు డతం డిట్టట్టనక యట్లు చేసెను.
అక్కలికియు నొక్కవారువ మెక్కి ముందు నడువ వెనుక ప్రవరుండును సమముగా దనహయమును నడిపించెను. అట్లయ్యిరువురు పురము వెడలి పడమరదెసనున్న యడవిమార్గంబునం బడి వడివడి దత్తడుల నడిపింపసాగిరి. అని యెఱింగించుచు మణిసిద్ధుని సుద్దుల కడ్డమువచ్చి పతంగు డిట్లనియె.
అయ్యా! అయ్యబల యెవ్వతె? అట్లు కోటగోడ దిగివచ్చి యెన్నడును నెఱుగని యతనితో నరుగ గారణమేమో యెఱిగింపుమన వాని ప్రశ్నకు సంతసించి యయ్యోగిపుంగవుం డిట్లనియె.
గోపా! యా పాటలగంధి వృత్తాంత మాకర్ణింపుము. కాంచనవల్లి యను పేరంబరగు నా తరుణి జయసేనుం డనందగు నానగరాధీశ్వరుని గూతురు. ఆ రాజు తనకు లేకలేక కలిగిన యక్కన్నెమిన్నను మిగుల గారాబముగా బెనుచుచు నైదేడులు ప్రాయము వచ్చినతోడనే సకలశాస్త్రము లామూలచూడముగా దెలిసికొనిన యొకగురువునొద్ద సవయస్కుండగు జయంతుడను మంత్రిసూనుని జతపరచి జదువవేసెను.
అక్కన్యయు నక్కుమారుండును రూపంబునను గుణంబులను శీలంబునను సుకుమారంబునను బుద్ధికౌశల్యంబున నొండొరులను మించుచు నయ్యాచార్యునొద్ద గ్రమంబున సకలశాస్త్రములు గ్రహించి సంగీతమునందును గవిత్వమునందును మిగుల నేర్పరులై యశ్వశిక్షయందు సైతము నెన్నదగిన పాటవము నేర్చుకొనిరి.
వారిరువు విద్యాగ్రహణసమయమందుగాక ఆహారవిహారనిద్రాదివ్యాపారములయందును నొకగడియయేని విడిచియుండక యేకదేహమట్ల యతిమైత్రితో మెలంగుచుండిరి. ఇట్లు పదియారేడుల ప్రాయము వచ్చుపర్యంతము విద్యలం గఱచుచు నొకనాడు సాయంకాలమున జల్లనిగాలి విసరుచుండ నయ్యిరువురు గుఱ్ఱపుబండిమీద విహారార్థమై పూవుదోట కరిగి యందు గ్రీడింపుచుండ నయ్యండజయాన మంత్రిసూనున కిట్లనియె.
వయస్యా! నిన్నటిరేయి మాయింట జరిగిన వార్త నీవు వింటివా? నాక్రివకంపుజవ్వన మేటికి బొడసూపినదో కాని నీకును నాకు నెడబాపుటకు మూలమగు చున్నది. నన్నింక బడికిని బైటికిని బోనియ్యవలదనియు గురుదక్షిణ నిప్పించి యంతఃపురమున బ్రవేశపెట్టుమనియు మాయమ్మ మజ్జనకునితో నుడివినది. అతం డట్టిపనికి రేపు విదియ యుక్తముగా నున్నదని యేర్పరచెను. నేటితోడ నాకు నిను జూచు భాగ్యము దప్పిపోవుచున్నది. పెండ్లి విషయమై గొంత ముచ్చటించిరి. కాని నాకు స్పష్టముగా దెసినది కాదు. ఎవ్వరికో నిశ్చయించినట్లు నాకొక దాది చెప్పినది. ఈ రెండు విషయములు నా మనోభీష్టమునకు వ్యతిరేకముగానే యున్నవి. నిన్ను జూడ నొకనిమిషమైనను జాగైనచో బ్రాణములు బోవునంత వంతబూను నేను నీ చిరకాలవియోగ మెట్లు సైతును. దేహములు మాత్రము భేదములు గలిగి విద్యాగుణరూపశీలధీవకిత్తుల నొక్కటిగా సంచరించు మన యిరువురకు బెండ్లి సేయక యశాశ్వతపు సిరికై యాసపడి నన్నెవ్వరికో యియ్యదలచిన మా తండ్రికన్న మూఢుం డుండునే? అయ్యయ్యో! కామినులకు సంపద కలిగినను దగని మగనితో గాపురము సేయుటకన్న విద్యారూపచతురుండగు మగనితో ముష్టియెత్తుకొనినను సంతుష్టిగా నుండునుగదా.
సీ! ఈ యాడుజాతి యస్వతంత్రపుబ్రతు కేమని గర్హింతు. తల్లిదండ్రు లే తుచ్చునికి గట్టిపెట్టినను వానిని దైవముగా జూచుకొనుచు శుశ్రూష చేయుచుండవలయునట. నాకు జ్ఞానమువచ్చినది మొదలు నిన్ను బెండ్లి యాడవలయునని యభిలాష గలిగియున్నను నెన్నడును లజ్జాదోషంబున నట్టి కోరిక బయలుబెట్టనైతిని. వసంతా! నిన్ను గాక వేరొక్కని బెండ్లి యాడవలయునని నాకు లేదు. దీని కెద్దియేని యుపాయమున్న నుడువుమని యడిగిన నప్పడతి కతం డిట్లనియె.
తరుణీ! అట్టి కోరిక నాకును బెక్కుదినములనుండి గల్గియున్నను నేను ముందు బయలుపరచినచో నీ చిత్తవృత్తి యెట్లుండునో యని మనంబున నణచుకొనియుంటిని. మన యిరువురకున్నను నేమి లాభము? కులమున సమానుండనైనను సంపదచే హీనుండనగుట నాకు మీ తండ్రి నిన్నియ్యనొడంబడడు. దీనికేమి సేయుదము. అందరాని పండ్లకు జేతులు సాచనేల? సాహసకృత్యంబుల కొడంబడుమని నుడుపుట నాయదికాదు. అదియు నీ మాటలనే తేటపడవలయునని భావగర్భితముగాఁ బలికిన నక్కలికి వసంతా! యని మేను గరుపార బిలిచి యింకను సందియ మందెదవేల? నా డెంద మిదివరకే నీ యధీనమైనది నీ యిష్టము వచ్చునట్లు నడుచుదాన గర్తవ్య ముపదేశింపుమని పలికిన నతం డట్లయిన నేనొక యుపాయము వక్కాణింతు వినుము. నీకు ముఖ్యముగా నన్ను బెండ్లియాడవలయునను తలంపు గలిగియున్నచో విదేశ మరుగవలయును. అంతఃపురంబుల నత్యంత సుకుమారవంతురాలవై సుఖపడుచున్న నిన్నిట్లు వెడలుమని చెప్పుటకు నోరాడకున్నది. పైన నీ చిత్తమనవుడు నవ్వుచు నవ్వనిత నిట్లనియె.
మనోహరా! నేను నీదాననని చెప్పినను వేరొక్కరీతి బలికెదవేల? నీతోడ విదేశమున కరుగ సిద్ధపడివుంటి. సరిపడని వరునితోగూడి రాజ్యము సేయుటకంటె నిష్టమగు మగనితో ముష్టి యెత్తుకొనినను దృప్తిగా నుండునని యిదివరకే చెప్పితిని గదా. పెక్కేల? యెల్లుండి అమావాస్యనాటి రాత్రి మా కోటకు పడమర ప్రక్కనున్న గుఱ్ఱముల సాలలోనికి వచ్చియుండుము. గొలుసువెంబడి గోట దిగివత్తును. గుఱ్ఱము లెక్కి యెక్కడికేనిం బోవుద మిదియె ముమ్మాటికిని నమ్మకమయిన ప్రయాణమనిన జయంతుండు నొడంబడియె. అట్లయ్యిరువురు బాస జేసికొని బండియెక్కి యిండ్ల కరిగిరి.
పిమ్మట ప్రయాణదినంబున విలువగల వస్తువులు నిమిడిగల పుట్టములు నాహారపదార్ధములు సాయంకాలము దనుక సంగ్రహించుచు నమ్మంత్రిసూనుడు చీకటిపడినతోడనే బోజనము సేయ ప్రయత్నించెనుగాని నాడు దండ్రియు రాజనగరినుండి యింటికి బెందలకడ వచ్చెను. భోజనమునకై మడిగట్టుకొనిన తండ్రి పంక్తినే కుమారునికి గూడ వడ్డించిరి. కుడుచునప్పుడు కొడుకుతో దండ్రి యిట్లనియె.
వత్సా! విదేశమునుండి సంగీతవిద్యాపారంగతురాలగు వారాంగన యోర్తు వచ్చినది . ఈరాత్రి నగరిలో సంగీతసభ జరుగును. దానిం బరీక్షించుటకై నీకు మిగులపాటవము గలదని మీగురువు రాజుతో జెప్పియున్నాడు. నే నింటికి వచ్చునప్పు డతడు నాతో నిన్నుకూడ నీరేయి సభకు దోడ్కొని రమ్మని నుడివెనుగాన బరుండక మంచిదుస్తులను గట్టుకొని సిధ్ధముగా నుండుము పోదమనుటయు నాపలుకు లతని చెవులకు ములుకులవలె నాటిన గొండొకవడి నేమియు బలుకనేరక విశ్చేష్టుండై యూరకున్న నతం డేమిరా మాటాడవు. గానప్రావీణ్యము నీకు లేదా యేమి యనుటయు నతం డయ్యా! నా కీదినమున దలనొప్పిగా నున్నదిగాన నట్టిదాని పూర్తిగా బరీక్షించలేనని తోచుచున్నది. అందులకై యూరకుంటి ననిన మంత్రి యెట్లయినను నగరి కరుగక తీరదు. ఓపిక లేనిచో రాజుగారితో నీ సంగతి చెప్పి యతని చిత్తవృత్తిప్రకారము నడువవలయుననిన జయంతుం డనేకప్రతికూలవాక్యములు జెప్పి ప్రాల్మాలదలచెను గాని తండ్రి యొప్పుకొనుక పోవుటచే తుద కతనితో రాజసభ కరుగక తీరినదికాదు.
తండ్రితో రాజసభ కరుగునప్పు డాజయంతునికి మనంబునగల చింత యిట్టిదని చెప్ప మనోగమ్యము గాదనినచో వాక్కులకు శక్యమా? ఆవృత్తాంత మారాజపుత్రిక యెఱుగక యనుకొన్నరీతిని గొలుసు దిగి గుఱ్ఱపుసాల జేరి యందు నిద్రించుచున్న ప్రవరుని రా జయంతుడే యనుకొని యతనితో దురగమెక్కి యేగినది.
శౌనకా! పూర్వోత్తరసందర్బ మెఱింగితివిగద. తా నొకటి తలచిన దైవ మొకటి తలచునను లోకోక్తి యేల తప్పును? అట్లయ్యిరువురు నరుగుచున్నతరి నత్తరుణి ప్రవరుని గుఱ్ఱముదరికి దనవారువము బోనిచ్చి నాథా! నేటికి మన మనోరథ మీడేరినది గదా. మొన్నటినుండి నే నీపయనంబున కెంత ప్రయాసపడితి ననుకొంటిరి. రాత్రియు నొకయవాంతరము వచ్చినది కాని దైవకృపచే దాటించితిని.
గానకళానిపుణిక యగు గణిక యొకతె రాత్రి సంగీతము బాడుననియు దానిం బరీక్షించుటకై రమ్మని నాకు మాతండ్రి వార్తనంపెను. తలనొప్పి వచ్చెనని బొంకి యంకిలి జెప్పితి నింతవట్టు దైవానుకూలము గానే యున్నది. మీకు నట్టి విష్నుము లేమియు రాలేదుగదా యని యనేకరీతుల దన మనంబునగల కోరికలన్నియు బయలు పరచుచున్న యన్నాతిమాటల నూకొట్టుచు నతండు గొన్నిటికి నప్పటికి దగినట్లు ప్రత్యుత్తరము జెప్పుచు నడువజొచ్చెను
అంత నక్కాంత మోమిట్టు తెల్లతెల్ల పోవునని తెలుపురీతి దిక్కులదావళ్యము బిక్కటిల్ల తెల్లవారజొచ్చిన గ్రమంబున భానుండు పూర్వశిఖరం బలంకరించుటయు నమ్మించుబోడి యవ్వెలుంగున వానిం బరీక్షించి తన మనోహరుడైన జయంతుడు కాడని యెఱిగి యంతరంగము తత్తరమంద దత్తడినుండి నేలంబడి మూర్ఛిల్లి కొండొకవడికి దెలిసి మరల నతని దిలకించి ధరించిన మలిన వస్త్రములంబట్టి యతని నల్పునిగా దలంచి తలయెత్తి పొల్లుపొల్లుగా గన్నులనుండి నీరు స్రవించుచుండ నేడ్చుచు నిట్లని తలపోసెను.
అయ్యో దైవమా! తల్లిదండ్రుల మక్కువ లెక్క సేయక చుట్టముల ప్రేముడి విడనాడి వయస్యప్రీతి బూతిగలపి కులశీలసుగుణపరిపాటి నీటబుచ్చి ప్రజానింద కోర్చి ప్రాణత్యాగమునకు సహించి యొక్కచక్కనిపురుషునిం గూడదలచిన దక్కింపక యీ నిర్భాగ్యుని నా కెక్కడ దెచ్చిపెట్టితివి? కటకటా! నాచక్కదన మిక్కడియడవిపాలు సేయుదే? ఇప్పు డేమి సేయుదాన? మరల పురికరిగినచో నురిదీయ నియమింతురు గాని వెనుకటి మక్కువ నుంతురా? ఆహా! దైవఘటనము.
శ్లో॥ "ఆఘటిత ఘటితాని ఘటయతి ఘటిత ఘటితాని దుర్ఘటీకురుతే
విధి రేవతాని ఘటయతి యాని పుమాన్నైవ చింతయతి"
అను శ్లోకమును పలుమారు పఠించుచు మరియు ధైర్యము దెచ్చుకొని,
శ్లో॥ "ఉపస్థిరే విప్లవ ఏవపుంసాంసమస్తభావః పరిమీయతేయతః
ఆవాతి వాయౌనహితూలరాశే ర్గీరేశ్చ కశ్చిత్ప్రతిషాతిభేదః."
అనగా ఆపదలు వచ్చినప్పుడే దైర్యమును నిలుపుకొనతగినది. గాలి విసరునప్పుడే గదా దూదిరాశికిని పర్వతమునకుగల భేదము తెలియపడుచున్నది. కావున బుద్ధిమంతు లాపత్సమయమందే తమ దెలివిని గనపరచుదురని నిచారము విడిచి యుదుట వహించినది. అట్టి యవసరంబున నా ప్రవరుండును నచ్చటనే గుఱ్ఱము దిగి యమ్మగువ నేమియు బలకరింపక రెండు దంతకాష్ఠములు విరచితెచ్చి యొకటి యా రమణి ముందరవైచి తాను పల్లు తోముకొనియె. అవ్వనితయు దానిం దీసికొని ముఖ మార్జనంబు జేసినది.
అట్లయ్యిరువురు ప్రాతఃకృత్యంబుల నిర్వర్తించి యొకరినొకరు పలుకరింపకయే గుఱ్ఱముల నెక్కి జాము ప్రొద్దెక్కు పర్యంతము నడిచినంత నొక నది యడ్డమైనది.
అచ్చట గుఱ్ఱములు విడిచి అంతకుమున్ను కొందరు జనుల నెక్కించుకొని విడచుటకు సిద్ధముగానున్న చిన్నయోడ నొకదానింగాంచి వడివడి నరిగి వారుగూడ నా యోడ నెక్కిరి.
పిమ్మట నోడద్రోయించి కర్ణాధారుండు అవ్వలిరేవు చేరునంతలో నందుగల జనులవలన దాటించుటకు నియామకమగు సొమ్మడిగి పుచ్చుకొనుచు నందొకబ్రాహ్మణ విశ్వస్థయుండ నామెను సొమ్మిమ్మని యడిగెను,
ఆ యవ్వయు దీనస్వరముతో నాయనా! నేను మిక్కిలి, దరిద్రురాలను. నా యొద్ద నేమియులేదు. యెవ్వరి యొద్దనైన బనిచేసి యుదరపోషణ జేసికొనవలయు నని యఱుగుచున్నదాన. ఇట్టి దీనురాలిం గనికరించి యూరక దాటించిన నీకు మిగుల పుణ్యము రాగలదని యెన్ని విధములనో బ్రతిమాలినది . కాని వానికి దయవచ్చినది కాదు.
అమ్మా! దీనికి మే మెక్కుడుగా బన్నిచ్చుకొనవలయును. ప్రతిదినము మీవంటి వారు పెక్కండ్రు వచ్చుచుందురు. అందరిని నూరక రేవు దాటించినచో మేమిల్లు వాకిలి నమ్ముకొనవలసినదే. సొమ్మియ్యక తీరదు. లేనిచో నవ్వలనే దించివేయుదుమని యా నావికుం డుత్తరము చెప్పెను.
అట్లామె నా సరదారుడు సొమ్ముదెమ్మని నిర్బంధించుచు నాదరించి గూర్చున్న ప్రవరుం జూచి–అయ్యా! తమరుగూడ సొమ్మిత్తురా యని యడిగిన నా ప్రవరుండు చింతాక్రాంతుండై యోహో వీనికిచ్చుటకు నాచేత నేమియును లేదు. వీని ధోరణిం జూడ నూరక దాటించునట్లు కనబడదు పేదరాలి నీ యవ్వనే నిర్బంధించుచున్నాడు. వీనిచే నవమానము పడుట కష్టము. ఎట్లొకో యని తలంచుచు నా ప్రాంతమందే యధోముఖియై కూర్చుండియున్న యా చిన్నదానిని సంజ్ఞపూర్వకముగా జూపెను.
అప్పుడా సన్న గ్రహించి యా యించుబోడి తా దెచ్చిన నాణెములలో నొకటి విప్పి యతని ముందర విడిచినది. దానిం గైకొని ప్రవరుండు సంతోషముతో నావికుడా! ఈ నాణెము నీ వడిగెడు సొమ్మునకు బదిరెట్లు వెలగలిగి యున్నది. దీని నీకు గానుకగా నిచ్చుచున్నాము. ఈ యవ్వను నిక నిర్బంధింపకుమని పలికి యది వాని కిచ్చెను.
వా డది సంతోషముతో గైకొని యతనిని మిక్కిలి స్తుతియించుచు నెమ్మదిగా నోడనడిపెను.
అంత కొంతతరి కత్తరి యవ్వలిదరి జేరినంత బ్రవరుడును రాజపుత్రికయు నోడ దిగి నడువజొచ్చిరి. ఆ వృద్ధబ్రాహ్మణియు వారిని దంపతు లనుకొని వారు తనకు జేసిన యువకారమునకు గృతజ్ఞత జూపుచు వారివెంట నడుచుచు నా ప్రవరునితో నిట్లనియె. అయ్యా! నేను దిక్కుమాలినదానను. నాకింత యన్నము పెట్టనోపుదురేని మీ యింట వంట జేయుచుందును. తోడగొనిపోదురే యని యడిగిన నతండు లోన నవ్వుకొనుచు నవ్వా! ఆలాగుననే రమ్ము పోషింతునని యామెంగూడ వెంటబెట్టుకొని నడువసాగెను.
ఆ చిన్నదియు నేమియుం బలుకక వాని మొగమైనం జూడక దైవమునుం దూరుచు హా! జయంతా! జయంతా! యని నడుమ నడుమ బలవరించుచు నేమి సేయ దలంచియోగదా! దైవము న న్నీతని కప్పగించెను. వీని విడిచినచో బ్రమాదమగును. వీనితోడం బోయెద నేమైన నగుగాక యని యతనివెంట నడువజొచ్చెను.
ఆ మువ్వురు మధ్యాహ్నమునకు నా ప్రాంతమందున్న హేలానగరము జేరి సత్రమున బసచేసిరి. ప్రవరుండును. సత్రాధికారియొద్ద కరిగి నాటికి సరిపడిన సామగ్రి యడిగితెచ్చి యా యవ్వకిచ్చిన నా ప్రోడ జక్కగా బాకము చేయుటయు మువ్వురును భుజించిరి.
మరునా డరుణోదయంబున లేచి యా బ్రాహ్మణుడు స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు నిర్వర్తించి మేన విభూతి నలది బ్రహ్మతేజంబు మెరయ బంచాంగ మొకటి తీసికొని విపణివీధి కరిగి యందు గొప్పవర్తకులందరు నెద్దియో బేరమునకై నొకచోట గుంపుగా జేరియుండ నచ్చటికేగెను. వారు నతనికి నమస్కరించి యాగమనకారణం బడిగిన నాశీర్వదించి యతం డిట్లనియె.
అయ్యా! నేను బ్రాహ్మణుడను పరదేశస్థుండ కుటుంబముతో నిన్న నీయూరు జేరితిని. సత్రము మూలముగా నిన్నటికి భోజనము గడిచినది. ఈ దినమున కేమియును లేదు. నాకు జ్యోతిశ్శాస్త్రమందు మిగుల పాటవము గలదు. మీ మీ నక్షత్రములు జెప్పినచో దినచర్య వ్రాసి యిచ్చెదను. దృష్టాంతరముగా నుండిన నన్ను మన్నింపుడు. లేనిచో రేపు నన్ను గౌరవము సేయవలదని ప్రతిజ్ఞాపూర్వకముగా నుడివిన నతని మాటలకు సంతసించి తమ నక్షత్రములు వ్రాసి యిచ్చి యానాటికి బిండివంటలతో గూడ సరిపడు సామగ్రి యిచ్చిరి. ప్రవరుడును వారివారికి దగిన ఫలములు వ్రాసి యిచ్చి యా సామగ్రి గొనిపోయి వృద్ధబ్రాహ్మణి చేతి కిచ్చిన నామెయు రుచిగా వండిపెట్టిన సంతుష్టిగా భుజించిరి.
మరునా డుదయమున బూర్వమువలె నతండు బజారున కరిగిన వర్తకులందరు నొకచోటుననే కూర్చుండి తమకు వ్రాసియిచ్చిన ఫలములన్నియు దృష్టాంతరముగా నుండుటకు మిగుల సంతసించుచు నతని వినుతించి మరల నా దినమున ఫలములు వ్రాయించుకొని పూర్వమువలెనే సామగ్రి యిచ్చిరి. దానిచేత వారు మువ్వురేగాక మరి కొందఱుగూడ దృప్తిగా భుజించిరి.
ఇట్లు ప్రతిదినము ప్రవరు డుదయమున బజారున కరిగి వర్తకులచే గౌరవము బొందుచుండ గొద్ది దినములలోనే యతని ఖ్యాతి యా యూర నలుమూలలు వ్యాపించినది.
ఆ వార్త పెక్కండ్రు వర్తకులు విని యతనిచే ఫలములు వ్రాయించుకొనుచు మిగుల సత్కారముల చేయదొడగిరి. మరియొకనా డొకరత్నవర్తకుని దినచర్య వ్రాసి యిచ్చుచు బ్రస్తావముమీద దనకుగూడ రత్నపరీక్షయందు మిగుల నైపుణ్యముగలదని నుడివిన విని యా వర్తకుడు వానిని తన రత్నముల యంగడికి గొనిపోయి తనయొద్ద నున్న రత్నముల నాణెము సేయుమనిన నతం డన్నియు బరిశీలించి యందు వారు రత్నములని కొనియుంచిన పెక్కుగాజురాళ్ళు నేరితీసి పరీక్ష చూపెను. దాని కావర్తకు డాశ్చర్యపడుచు నయ్యా తమ కీబ్రాహ్మణవృత్తియగు దైన్యజీవన మేటికి? నెల కిరువది రూపికల వేతనం బిచ్చెద. నాయొద్ద రత్నపరీక్షకై యుందురే? యనుటయు నతండు వల్లెయని మొదట నట్టి యుద్యోగమందు బ్రవేశించెను .
అదృష్టవంతులు కెందేగినను గొరంతయుండునా? అప్పుడా సత్రమున బసదీసి యొక చిన్నయి ల్లద్దెకు దీసికొని యందు ప్రవేశించిరి. కాని యప్పుడు సైత మా రాజపుత్రిక యతని మొగము జూడక మౌనం బవలంబించియు మర్యాదగా నడుచుచున్నందులకు గొంత సంతసించుచు బనిపాటలయందు గొంచె మా యవ్వకు దోడు పడుచు నొకరీతి విరాగబుద్ధితో గాలక్షేపము సేయుచుండెను.
ఆ బ్రాహ్మణియు వారిని దంపతులే యనుకొని పరస్పర సంభాషణములు లేకపోవుటకు శంకించుగొనుచు నవ్విషయము విమర్శింపక నియమితమైన పనుల గావించు చుండెను. ప్రవరుండును భోజనము సేయునప్పుడుతప్ప తక్కినసమయముల వేరొకచోట గాలక్షేపము సేయుచుండును. ప్రవరుడుగాని రాజపుత్రికగాని ముసలియామెగాని యొండొరుల వృత్తాంత మరయకయే కాపురములు సేయుచుండిరి. ఆహా! వారి బుద్ధిపటిమ మిగుల గొనియాడదగియున్నది గదా? ఆ వర్తకుడు నతని తెలివికి సంతసించుచు నెలనెలకు వేతన మభివృద్ధి జేయుచుండెను. ఇట్లుండ నతం డొక్కనాడు దక్షిణదేశమునుండి యొక వర్తకుడు అద్భుతమైన రత్నమొకటి కొనివచ్చి కందర్పకేతుని దర్శనమున కరిగి నా రత్నము సోయగమున కచ్చెరువందుచు నట్టిదానిం దన జీవితకాలములో నెన్నడును జూడమి నా రాజు దాని గొనుటకు మిగుల నుత్సాహ మందుచు దాని వెల యెంత యని యా వర్తకు నడిగెను.
ఆ వర్తకుండును రాజుగారి యుద్దేశము గ్రహించి దీని వెల కోటిరూపాయలనియు గవ్వయేమియు దక్కువైన నీయననియు గచ్చితముగా నుత్తర మిచ్చె.
కందర్పకేతుండును తనయొద్దనున్న రత్నపరీక్షకుల చేతికిచ్చి యా మాణిక్యమునకు వెల గట్టుమనిన వారును బరీక్షించి కొందరు నలువది లక్షలు కొందరు డెబ్బదిలక్షలు, గొందరు తొంబది లక్షలు జేయునని వెలగట్టిరి. అంతటితో దృప్తి బొందక యా నృపతి యా మణిని వెలగట్టింప కింకరులకిచ్చి నంగడివీధినున్న పెద్ద వర్తకులయొద్ద కంపెను.
అప్పురిలోని వర్తకులందఱు దాని నాణెము చేసిరి. యేబది లక్షలకు దక్కువ వెలగట్టినవాడు లేడు. కొందరు కోటిరూపికలు జేయుననిరి. ఈ రీతి నంగడులు ద్రిప్పుచు గ్రమంబున ప్రపరుండున్న రత్నవర్తకునియొద్ద కామణిని దెచ్చి వెలగట్టుమని రాజభటు లడిగిన దాని నతడు పుచ్చుకొని తత్తేజమునకు వెరగందుచు జెంత నున్న ప్రవరుని చేతబెట్టి వెలగట్టుమని యడిగెను. అతం డది పుచ్చుకొని ముమ్మా రిటు నటు త్రిప్పి పెదవి విరచినం జూచి యా వర్తకుడు పెదవి విరచితివి లోపమేమి? వెల యెంత జేయు నని యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె. "అయ్యా యిది యొక కృత్రిమరత్నము దీని వెల గవ్వయైన జేయ" దని యెకసక్కెముగా జెప్పెను.
ఆ మాటవిని రత్నవర్తకు లందరు దెల్లబోయి యతని నందులకు దృష్టాంత మేమని యడిగిన ప్రవరుండు కావలసిచో బరీక్ష జూపింతునని ప్రతిజ్ఞాపూర్వకముగా జెప్పెను.
రాజకింకరు లంత నా రత్నమును గొనిపోయి రేనితో వర్తకుల మాటయు బ్రాహ్మణుని వచనంబులు జెప్పిన విని వెరగుపడి యా యొడయ డప్పుడు యాబ్రాహ్మణుని దీసికొనిరమ్మని పరిచారకుల నంపెను. వారును వడివడి జని యనేకరత్నములతోగూడ నా ప్రవరుని రాజసభకు దోడ్కొని వచ్చిరి
కందర్పకేతుండును ప్రవరుని మిగుల గౌరవిపరచి కొలువుతీర్చి యాయద్భుత రత్నమును దెచ్చిన వర్తకు నెదుర నిలువబెట్టి యా విప్రునితో నయ్యా! తమ రీరత్నమునకు వెల యెంత గట్టితిరని యడిగిన నతం డిట్లనియె. దేవా! ఇది యదార్థపురత్న మైనచో రెండుకోట్లరూపికలు వెలజేయును గాని గాజురాయి యగుటచే నొకరూప్యమైన జేయదు. దాని యందమునుబట్టి ఇచ్చినచో నొక రూపిక నియ్యవచ్చునని నిర్భయముగా జెప్పెను. ఆ మాట విని యా రత్నవర్తకుడు లోన దిగులొందియు నా దైన్యము మొగమునం దోపనీయక, యోహో! మంచి నాణెగాడవౌదువు. ఈలాటివారు పదుగురున్నచో మా వర్తకము బాగుగనే సాగును. చాలు చాలు. కొందరు వస్తువులకు వెలగట్టుమని యిచ్చినప్పుడు తమ్ము మిగుల నాణెగాం డ్రనుకొందురని తెలియకున్నను వానికి దక్కువ వెల గట్టుచుందురు. అంతియ కాని దాని నాణె మెఱిగి కాదు. ఇది నిజముగా గాజురాయి యని యెట్లు చెప్పగలవో తార్కాణము జూపింతువా! యని పెద్దయెలుంగున గద్దించి పలికిన నతండు వెనుదీయక పెక్కేల చూడు మిదిగో యని యొక యినుపపలకమీద నా రత్నమును నెత్తికొట్టుటయు నది తిలలంతలేసి శకలములై రూపరినది.
దానితోడన యా వర్తకుని హృదయము సైతము భిన్నమైనది . వర్తకులందరు వెరగందిరి. నృపతి యతనిం గౌగిలించుకొని సుముఖా! నీ మూలమున నాకు మిగుల లాభము గలిగినది. నీవంటి నాణెగా డెందును లేడు. నీకు నెలకు నూరురూపికల వేతన మిచ్చెద. నాయొద్ద రత్నపరీక్షకై యుండుమని యతని కప్పుడు తదుద్యోగమునకు ముద్రిక నిచ్చెను. ఆ దాక్షిణాత్యుని యొద్దనున్న ధనమంతయు దోచికొనుటయేగాక యతని బద్ధునిం గావించియు నా నృపప్రవరుడు బ్రవరుని యనునయవాక్యములచే నతని విడిచిపెట్టెను.
అది మొదలు ప్రవరునికి రాజనగరిలో నుద్యోగమూలమగు గౌరవ మెంతేని ప్రబల మగుచుండెను. ఇట్లుండిన గొలదిదినములకే రాజుగారి ముఖ్యప్రధాని మరణము నొందెను. అప్పుడా రే డాయుద్యోగము ప్రవరునికే యిచ్చివేసెను. మంత్రిత్వపదవి వచ్చినతోడనే ప్రవరు డాచిన్నయిల్లు విడిచి యొకమేడ బాడుగకు దీసికొని యందప్పటికి దగిన మర్యాదగా నడుపుచుండెను. అప్పుడైనను రాజపుత్రిక ప్రవరుని గాని, ప్రవరుడు రాజపుత్రికను గాని బలాత్కరించుటలేదు. వారి మనోదార్ఢ్య మెట్టిదో తిలకింపుము.
ప్రవరుడు మంత్రియైనది మొదలు రాజ్యమందు ధర్మప్రవర్తనలు మెండుగ జరుగునట్లును ఆధర్మప్రవర్తకుల శిక్షించునట్లును పెక్కు ప్రకటన పత్రికల దేశమందు వ్యాపింపజేయుటచే నతని బ్రజలందరు ధర్మప్రభువని కీర్తింపం దొడంగిరి.
ఇట్లుండునంత నద్ధరాకాంతు డొకనా డేకాంతముగా నతని కిట్లనియె. సుమతీ! మతికౌశల్యంబున నీవు బృహస్పతియంతవాడవు. నీ ప్రాపునంజేరి లోపము లేకుండ రాజ్యము గాపాడుకొనగలనని మిగుల సంతసించుచుంటి. ఇక నీకును మాకును దెలుపు కొనని రహస్యము లుండవుగదా! విను మేను ద్రిభువనాశ్చర్యకరూపంబున దొలుపొందు నిందుముఖి నొకదాని ద్వీపాంతరమునుండి రప్పించితిని. ఎన్ని జెప్పినను నప్పడంతి నాకు వశవర్తినిగాక సర్వదా దఃఖించుచున్నది. అత్తలోదరి నిమిత్తముగా జిత్తభవుడు నా చిత్తము దుత్తునియలు గావింపుచున్నవాడు. ధర్మాధర్మవివేచము విడిచి రేయింబవలు నే నాకనకాంగి నవకంబు దలంచుకొనుచు జివుకుచుంటిని మరియు-
ఉ॥ "ఒకొక్కవేళ బద్మములు ● లొల్లమి సేయుదు రొక్కవేళ దె
న్మక్కువ నాదరింతురు క్ష ● ణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్
పక్కున వేసరంజనదు ● పాయములం దగు నిచ్చకంబులం
జిక్కగజేసి డాసి సతి ● చిత్తముబట్టి సుఖింపగాదగున్."
అని వ్రాసిన కవివాక్యము ననుసరించి కాలయాపన సేయుచుంటిని. బలవంతము సేయుటకు నుల్ల మొల్లకున్నది. ఆక్కాంతారత్నము తనంతవచ్చి నన్గలసికొనునట్లు సేయుదువేని నీ బుద్దిబలంబునకు సాధ్యముకానిది లేదని స్తోత్రపూర్వకముగా నా చిన్నదానివృత్తాంతము చెప్పిన విని యయ్యధర్మమునకు మిగుల బరితపించుచు సమయజ్ఞుండగు యతం డప్పటి కేమియు ననక యొకనా డచ్చేడియమేడ కరిగి యధోముఖియై ద్యానించుచున్న యమ్మించుబోటి నోదార్చి యల్లన నిట్లనియె.
సాధ్వీ! నేను గ్రొత్తగా వచ్చిన మంత్రిని. నీవృత్తాంత మంతయును విని జాలిపడియు నిప్పు డేమియు జేయునదిలేక యూరకుంటిని. సమయము వచ్చినప్పుడు నా యోపినంత యుపకారము సేసెద. దుర్మార్గుడైన రాజు నన్నిప్పుడు నీ చిత్తవృత్తి యరసిరమ్మని పంపెను. నా బుద్ధి యధర్మమునందు బ్రవేశించునది కాదు. నీ మగని కులశీలనామంబుల జెప్పుము. వాని బట్టి తేరనియోగింతునని పలికిన యతని చల్లనిమాటలు హృదయసంతాపంబు కొంతవాయ మొగ మొకయింత యెత్తి యమ్మత్తకాశిని యిట్లనియె.
అన్నా! నీమతి వివేకము వచనగౌరవమే చెప్పుచున్నది. నీ వంటి పరోపకారపారీణులు కొంద రుండబట్టి గదా వసుంధరతిరంబై యున్నది. నా పేరు కళావతి. నా మగండు కాశ్మీరదేశ రాజకుమారుడు. వసంతుడను స్వార్ధకాహ్వాయముగల యాపురుషరత్నము నలుగురుమిత్రులతో విదేశదర్శనార్ధమై దేశము వదలి యందంద సంచరించుచు నొకవటవృక్షమూలమున దనచెలికాండ్రతో వియోగము నొంది రాక్షసనగముల నేకాంతముగానున్న నన్ను గాంధర్వవిధి బెండ్లి యాడి యందు స్వర్గసౌఖ్యంబు లనుభవింపుచుండ నొకనా డొకముసలిది వచ్చి కొన్ని దినములు మిగుల నమ్మకముగా మా నడుమ నుండి నా మగని యాయువు మర్మము నాచేత నడిగించి తెలిసికొని మేము గాఢనిద్రాపరవశులమైయుండ నా ప్రియుని స్మృతి తప్పించి నన్నోడమీద నీ నగరము జేర్చి యీ రాజున కప్పగించినది.
ఇతండును, కందర్పజ్వరపీడితుండై యాతురంబున నన్ను ముట్టవచ్చిన వ్రతకైతవంబున నొకవత్సరంబు మితిగోరితిని. అదియు సమీపించుచున్నది. దైవము నన్నేమి సేయదలంచెనో యెరుగను. బంధుదర్శనంబునంబోలె మిమ్ము జూడ నా కానంద ముదయించుచున్నది. మీ వట్టి ధర్మాత్ములకు దీనులయెడ మీ యెడద బొడమిన కరుణ బెంపుజేయ భగవంతుని మిక్కిలి ప్రార్ధించెదను. నా వృత్తాంతం బిదియ. నా మనోహరు నరసి దెప్పించెద నంటిరి. అట్టిమాట పాటికిఁ దెచ్చి నా యాపదల దొలగింపుడని మిక్కిలి వేడుకొనియెను.
ఆమె వృత్తాంతమంతము విని యతండు మేను ఝల్లుమన హా వసంతా! హా రామా! హా సాంబా! హా దండుడా! మీ మాట మరిచిపోయి, యిం దితరవ్యాపారాసక్తుండనై యుంటి మిత్రముండన నేను కానా? అయ్యో! మిమ్ముజూచి యెంతకాల మయినది. తరుమూలము జేరి నా కొరకు నిరీక్షించి విసిసి యెందేని బోయితిరా? కట కటా! వసంతుని వృత్తాంత మీ యింతి మాటలం దెలిసినది. నావలెనే యతండును సుఖసక్తుండై మిత్రులమాట మరచి వృక్షమూలము చేరలేదు. మఱియు నావృద్ధాంగనవలన మోసపోయెనే యని యనేక ప్రకారముల విచారించుచు తనవృత్తాంతమంతయు నానాతి కెఱింగించిన నయ్యించుబోడి మోమంత యెత్తి సంతోషముతో నతని కిట్లనియె.
ఆర్యా! మీయన్న వసంతుడు నాతో బలుమారు మీచరిత్ర లుగ్గడించి చెప్పెను. నీవు మిగుల సాధుబుద్ధివి. నా పురాకృతసుకృత మెద్దియో యించుక బయల్పడినది. లేకున్న నిట్టి యాపద్సమయంబున బంధుదర్శనం బగునా యిక నీయన్నజాడ నరయుచు న న్నీయిడుములనుండి తొలగించుటకు నీదే భారము. నీకు బెక్కులు చెప్పనక్కరలేదు. అని తత్సమయోచితములగు మాటలనే నతనికి సంతోషమును విచారమును గలుగజేసినది.
ఆమె పలుకులకు వెరగుపడుచు ప్రవరుండు సాధ్వీ! నీవు చింతింపకుము. నే నిన్ను గాపాడుదు నిందుండియే మిత్రుల వెదకించి యిందు రప్పించెదసు. మానవులకు గోరక దుఃఖములెట్లు వచ్చునో కాలక్రమంబున సౌఖ్యములుగూడ నట్లే ప్రాప్తించును. రెండును దైవాధీనములే యని యనేక నీతివాక్యములచే నామె నోదార్చి వీడ్కొని యతండు రాజునొద్ద కరిగి యతనితో నయ్యా ! యయ్యతివ యింకను వ్రతపరాధీనమైయున్నది గాన మౌనంబుగా నున్నది. ముందాలోచింతము గాక యని యతని నప్పటికి సమాధానపరచి యింటి కరిగి వారి జాడ నరయ నలుదిక్కులకు బెక్కండ్ర దూతలం బుచ్చెను. పిమ్మట నొక సత్రకుడ్యమ్మున దనరూపు చిత్తరువును వ్రాయించి వేలగట్టి దానిని సాభిప్రాయముగా జూచినవారి దనయొద్దకు బట్టితెండని తగినకింకరుల నియోగించెను.
ఇట్లుండ నంత నొక్కనాడు మంత్రిగారి యింటికి బిశునమతి యను చాకలిది వచ్చి యుదుకుటకు బట్టలు వేయుడని యడిగిన రాజపుత్రియుం బారాయత్తచిత్తయై యున్నకతంబున బరిశీలింపక కొన్నిబట్టలతో దొడిగిన రైక యప్పుడ విప్పివైచిన ననియన్నియు మూటగట్టుకొని యది యామె సోయగమున కచ్చెరువందుచు నామూట మోసికొని రాజుగారి యింటి కరిగి యా చాకలిది మాసిన పుట్టములు వేయుడని యడిగినది. రాజపత్ని యంతకుముందు దెచ్చిన బట్ట లెవ్వరివని యడిగిన అమ్మా! ఇవి మంత్రిగారి బట్టలు. వారి యింటిపనిగూడ మేము చేయుచున్నవారము అని చెప్పుటయు రాజపత్ని ఓసీ! మంత్రిభార్య యేపాటి చక్కనిది? ప్రాయమెంత? గుణమెట్టిదని యడిగిన నా రాజకాంత కా యంగన నవ్వుచు నిట్లనియె
దేవీ! మంత్రిగారి భార్యవంటి యందకత్తె నింతకుముందు నే నెందును జూచి యుండలేదు. నిజము చెప్పిన మీకు గోపము వచ్చునేమో! మీరుగూడ నామెకు జాలరు. ఆమె యెప్పుడును విచారించుచు నొకచోట గూర్చుండును. వారియింట నొకముసలామె యున్నది. మంత్రిగారి భార్య వయసుబింక మెట్లున్నదియో యీ రైకయే చెప్పుచున్నది చూడుడు. విప్పివైచినను దొడిగినట్లేయున్నది. మేనిపొంకము బింకమంతయు నిట్లేయున్నది. అని యూరక పొగడుటయు నా రాజు భార్యయు నా చిహ్నములు జూచి వెరగుపడుచు నిట్లనియె.
ఓసీ! మా ప్రధాని మొదట యాచకుడుగా గుటుంబముతో నీయూరు వచ్చి తన విద్యామహిమచే బ్రధానపదవి సంపాదించుకొనియెనని వింటిని. సామాన్యస్థితియం దింత చక్కని భార్య యెట్లు లభించినది. ఇది కడువింతయే యని యా రైక గైకొని విమర్శించుచుండ నింతలో నొడయం డెద్దియో పనిమీద నక్కడికి వచ్చి భార్యచేత రైకజూచి యిది యెవ్వరిది? దీని నిట్లు పరీక్షించుచుంటివేమి అని యడిగిన భర్తం జూచి నవ్వుచు నా పువ్వుబోటి యిట్లనియె.
ప్రాణేశ్వరా! ఈ కంచుళి యెవ్వరిదో చెప్పుకొనుడు. దీనిం దొడుగు పడతి యెంతవయసు గలదియో యూహింపుడని పరిహాసముగా నడిగిన నా నృపతి పరీక్షించి ఆమెతో నిట్లనియె. ఆహా! వీనిం ధరించు మించుబోడి బింకమంతయు నిది చాటించుచున్నది. ఎన్ని మడతలుబెట్టి నలిపి విడిచినను గుబ్బవడువున నిలంబడుచున్నది. దీనిం ధరించు మించుబోడి వయసును సొగసును విస్మయజనములని తోచుచున్నవి. ఇది యెవ్వతెదో యెఱిగింపుమని యుత్సుకుడై యడిగిన నా వధూటి నిట్లనియె. మనోహరా! ఈ రైక మీ ప్రధానిగారి భార్యదని యీ చాకెత చెప్పినది. ఆమె చక్కదనము గుఱించి యీ రజకాంగన యూరక పొగడుచున్నది. ఇట్టి మూఢురాలినే వెరగుపరచిన యా తరుణీమణి సోయగము దర్శనీయమని తెల్లమగుచున్నది అని యెరిగించుటయు నా భూపతి యాశ్చర్యవస్థావేశితమతియై యేమి! ప్రవరుని భార్య యింత చక్కనిదియా! అతండు ప్రధానియైన పిమ్మట వివాహమాడియుండలేదు. అంతకుముందు సామాన్యస్థితి కలవాడని వింటిమి. అప్పు డట్టి యెలనాగ యెట్లు దొరకును. బ్రాహ్మణులలో రూపవంతులుండుట యరుదందురు. ఈ సందేహము తీర్చుకొనవలసినదే యని పలికెను.
అప్పుడా రాజపత్ని నవ్వుచు చేపకడుపున రత్నవలయము దొరకినతోడనే దానిం ధరించు మించుబోడిని సముద్రాంతము నుండి రప్పించితివి. ఇప్పు డీ రైక ధరించు కోకస్తనని జూడక విడుదురా! యని పరిహాసమాడినది. ఆ నృపతియు కాంతా! వింతవస్తువులం జూడ నెవ్వనికి వేడుకయుండదు? చూచినంతనే తప్పు వచ్చునా? ప్రవరుని భార్యంజూచు నుపాయ మొకం డూహించితిని. రేపు నీవు స్వయముగా వంటజేయుము మన యింటి కతని విందునకు బిలచెదనని చేయదగిన కృత్యము లన్నియు బోధించి యతం డప్పుడ యాస్థానమున కరిగెను.
అంతకుబూర్వమే కొల్వుకూట మలంకరించిన ప్రవరునితో గూడుకొని రాజకార్యముల విమర్శించి యనంతర మా నృపాలుం డతనితో నిట్లనియె. సుమతిప్రపరా! మన మిరువర మొకచోట భుజింపవలయునని యెన్నియో దినములనుండి వేడుకగలిగి యున్నది. రేపు మా యింట భుజించి నా యభిలాష దీర్పుము. మిత్రయుక్తముగా భుజించు దివసమే పండుగయని జెప్పుదురు. నీవు మా కన్నిగతుల బూజ్యుడవని సాదరముగా నుడివిన విని ప్రవరుండు సంతోష మభినయించుచు దేవా! మేమునిత్యము మీ యన్నమే భుజించుచున్నారము. అది యట్లుండె మీసహపంక్తిని భుజించుటకన్న గౌరవ మున్నదియా? మీరు నన్నింత పెద్ద చేసి మన్నించిరి. రేపు నాకు సుదినమని ప్రవరుడు స్తోత్రముజేయుచు నా విందున కనుమోదించెను.
కందర్పకేతుడును నమ్మరునాడు ప్రవరుని దన యింటికి దోడుకొనివచ్చి యంతఃపురములో భార్య వడ్డింప నామంత్రితో నిష్ఠగోష్ఠి వినోదాలాపములతో భుజించుచుండెను.
దీర్ఘ దర్శియగు నా ప్రవరుడును భుజించునప్పు డెద్దియో విచారము మనంబున నంకురింప దలవాల్చుకొనియే చింతించుచుండెను. అప్పు డయ్యొడయండు ఆర్యా ! ఈ ఫలమెంత రసవంతముగా నున్నదియో చూచితివా? ఈ శాకము రుచిగా జేయబడినది సుమీ! ఈ పాయసంబున వైచిన మిరియపుపొడి కారము, ప్రియుని మునుపంటి పోటిగంటుమంట వాల్గంటికింబలె రహస్యమైయున్నదిగదా! యని యనేకగతుల చమత్కృతి వచనంబు లాడుచు భార్యతో బోటీ! ఘృతాపూపంబుల నిటు తీసుకొనిరా. ఇతనికి వడ్డింపుమనిన నతండు వలదని చేయిద్రిప్పిన నిర్బందించుచు తన్వీ నాకంత పూర్తిగా వడ్డింపకుము. రేపు నాకు మంత్రిగారి యింట్లో విందు జరుగబోవును. మా మంత్రి భార్య పదార్ధములు నీకంటె రుచిగా జేయగలదట. బ్రాహ్మణులకు రుచి తెలిసినట్లు భోజనమం దితరులకు తెలియదు. లోకంబున మైత్రియు బాంధవ్యంబును భోజనంబునం గాని లెస్సగా గలియవు. అని యభిప్రాయసూచకముగా సంభాషించు రాజు మాటలన్నియు విని ప్రవరుడు గుండె పగుల దిగులుపడి వేతెరంగుల నంతరంగమున జింతించుచుండెను.
భోజనమైన వెనుక సభామండపమున వారాంగనానృత్యగానవినోదంబుల గొంత గడపి యా రేడు ప్రగ్గడకు గర్పూరవీటీప్రముఖములగు పెక్కుసత్కారంబు లాచరించిన నవి యన్నియు నాదరపూర్వకముగా స్వీకరించి లేవబోవునప్పుడు మంత్రి రాజుతో నిట్లనియె.
దేవా! మేము దినునది యంతయు దేవరసొమ్ము. ఐనను మా భక్తివిశ్వాసము లిట్లు బ్రేరేపించుచున్నవి. తమ రిందాక నాడిన మాట యదార్థము సేయ వేడెదను. ఆర్యులు పరిహాసంబుల సయిత మసత్యము దొలుకనీయరుగదా? దేవరగూడ రేపు మా యింటికి విందునకు దయచేసి గృహపావనము సేయ ప్రార్థించుచున్నవాడ ననిన నవ్వుచు నతం డిట్లనియె.
మిత్రమా! దీనికై నన్నింత ప్రార్థింపవలయునా? విందు లనిన నాకు మిగులసంతసమను విషయము నీ వెరుగవు కాబోలు. ఆలాగుననే వచ్చెద. వంటమాత్రము పెందలకడ జేయింపుమని యాదరపూర్వకముగా సాగనంపిన నతండును రానిసంతోషము మొగమునకు దెచ్చుకొనుచునతని వీడ్కొని యింటికరిగెను. అట్లరిగి పర్యంకము మీద బరుండి యిట్లు ధ్యానించెను.
అయ్యో! నా కప్పటికి రాజును విందునకు బిలువక తీరినదికాదు. వంట జేయ నాకు భార్యలేదు గదా! రాజు భార్యచే వంట జేయించి వడ్డింపించి నప్పుడు నే నొరులచే వంట జేయించుట యుచితముగాదు. అదియుంగాక రమణీప్రియుండగు రాజు చేసిన కపటము బొడగట్టినది. నా యింటనున్న యీవాల్గంటివృత్తాంత మెవ్వరివలననో విని యిది నా భార్యయే యనుకొని దీనిం జూచుటకే యిట్టి ప్రయత్నమును జేసెను.
ఈ కాంత యెవ్వతయో నాకును దెలియదు. తా నెవ్వరినో వలచి సాంకేతిక మేర్పరచికొని నన్నే యతడనుకొని మోసపోయినది. పాపము సంతతము వానికొరకే చింతించుచుండును. ఇన్ని దినములై నది. నీ వెవ్వడవు. నీ వృత్తాంతమేమని న న్నడుగలేదు. ముసలామెయు మాకన్న మనసు దిట్టముది. మా కాపురముగు ట్టిన్నినా ళ్ళొరు లెరుగకుండ నిలుపుకొని వచ్చితిమి. ఇప్పు డేమి చేయుదును. నాకు భార్య లేదంటినా మిగుల హాస్యాస్పదముగా నుండును. వినినవారును నమ్మరు. నిప్పల్లవపాణి నా భార్యయే యని తలంచుచున్నారు. దాని యునికిచేతనేకదా నే ముట్టినది బంగార మగుచున్నది. నా కితండు భార్యచేతనే వండించి వడ్డింపజేసెను. నే నీయవ్వచే వడ్డింపజేసితినేని మర్యాదహీనముగా నుండును. అదియునుంగాక యీమెం జూచుట కొరకేగదా యతం డీవిందులు గల్పించుట. హా! దైవమా! ఈయాపద యెట్లు దాటునో గదా యని ధ్యానించుచు నట్లే పండుకొనియుండెను.
వృద్ధబ్రాహ్మణియు యథాప్రకారము ప్రవరుడు భోజనమునకు రాకపోవుటచే నతనియొద్దకుబోయి భోజనమునకు లెమ్మని పిలిచినది. అతం డవ్వా! నా కీ దినమున నాకిలిలేదు. భోజనము చేయను. మీరు భుజింపుడనుటయు నామెయు బహువిధముల నిర్బంధించెను. గాని యామె ప్రయత్నమేమియు గొనసాగినదికాదు.
అట్లు లేవకయే పరుండి యుత్తరము చెప్పుచున్న ప్రవరుని మాటలన్నియు వినుచున్న రాజపుత్రిక తన బుద్ధిసూక్ష్మతచే నతని విచారకారణము గ్రహించి యతనియందు బద్ధానురాగయై యున్నది గావున నతడు వినుచుండ నా బ్రాహ్మణితో నిట్లనియె.
అవ్వా! బుద్ధిమంతు లల్పకార్యవిషయమై చింతించుచు నజ్ఞులువోలె భుజింపమానుట తగునా? తమ పోషకత్వములోనున్నవారిచే దీరవలసిన కార్యము లెవ్వియేని గలిగినచో నుడివినం దప్పా? ఒకవేళ బలకరించినచో దగుల మెక్కుడనని వెరపు గలిగియున్న దేమో? హృదయంబున నట్టి భీతిగొన నవసరములేదు. దైవప్రతికూలదినములలో మిత్రులు మాత్ర ముపచరింతురా? మే మిట్లు చెప్పదగినవారము కాము. అయినను పోషకవిశ్వాస మూరకుండనీయకున్నది. భుజించినవెనుక కార్య మెరింగించి నియోగింపవచ్చునని పలికిన నాపూబోణివాక్యంబులకు సంతసించి యతం డప్పుడ లేచి భుజించిన వెనుక యవ్వతో జెప్పినట్లు కార్యవృత్తాంత మంతయు నెరింగించుటకు నమ్మించుబోణియు నిప్పనికింత చింత యక్కరలేదు. వంట జేయుదు. విందునకు బిలువవచ్చునని యతండు వినుచుండ నవ్వకే చెప్పినది.
అంత మరునా డారాజపుత్రిక గ్రొత్తరుచు లుప్పతిల్ల బెక్కువిధముల వండి వంటలతో బాకంబు చేసి సిద్ధపరచిన బ్రవరుడును రాజు నుచితసత్కారంబుల దోడ్కొనివచ్చి భోజనారగారంబునం గనకసుమవిరాజమానంబగు పీఠంబున గూర్చుండబెట్టి వడ్డింపుమని యమ్మానవతి కానతిచ్చిన నాచతురయు నృపతిమతి యెఱింగి మొదట లొక దినసు చీనాంబరముగట్టి కెంపులుచెక్కిన నగలబూని తళుక్కురని నిజతనుద్యుతులు మెఱయ హొయలుగులుకు నడల జనుతెంచి వారిముంగల బైడిపాత్రల నమర్చి యందు పెక్కు పిండివంటకములతో మొదటి వడ్డన వడ్డించి పిమ్మట నయ్యలంకారములు తీసి మఱియొక దినుసు పుట్టంబును భూషణంబులు దాల్చి వారు భుజించుచుండ గావలసిన పదార్థముల నభిప్రాయ మెరింగి వడ్డింపదొడంగినది .
అప్పుడు రాజు రెండు విధములుగా గాన్పించిన యప్పాటలగంధిని నిరువురుగా భావించి వారి సోయగ మోరగంటం జూచుచు నోహో! యీతని కొక్కతరియే భార్య యని వింటి. యేకరీతి సొగసుగల ముగుద లిరువు రుండిరే! ఇంత యందకత్తె లెక్కడ దొరికిరో గదా! వీని యదృష్ట మేమి? మేలు మేలని యప్పడుచుల గురించి యాశ్చర్యపడుచు భుజించిన వెనుక యతనిచే సత్కారములనంది యింటి కరిగి భార్యతో విట్లనియె.
ప్రేయసీ! మన ప్రగడ కొక్కరితయే చక్కనిభార్ యగలదని వింటిమి గాని నిజం బరయ నిద్దఱు సుమీ. అన్నన్నా! యాయన్నులమిన్నలసొంపు మనము విన్నదానికన్న మిన్నయై యున్నదిగదా. తెరగంటి వాల్గంటులు వారియింట దాస్యంబునకైనం జాలరని యూహించెదను. చక్కదనం బొక్కటియేగాక దానికి వన్నెవెట్టు దీకౌశల్యము గూడ యున్నదిసుమీ. అది యెల్ల నడల యొయ్యారంబునను వడ్డన చమత్కృతిచేతను వెల్లడియైనది. అది అట్లుండనిమ్ము. తత్కృతమ్మగు పాకమున, బదార్థభేదమ్ముల కనిపెట్ట నెవ్వరితరంబు? రుచిపస చెప్పనేల?
ఒక్కటియే పెక్కువిధముల రుచి గలుగునట్లు వండినది. భుజించితిని గాని యేది యెట్టిదియో భేదమే తెలిసినది కాదు. బాపురే! అని యత్యాశ్చర్యముగ నామెను వర్ణించుచున్న నాథునిమాట లాలించి యాప్రోయాలు దానుగూడ నా చేడియలంజూడ వేడుక పడుటయు రేడు అందులకొక యుపాయ మూహించి మరునాడు సచివుని రప్పించి యిట్లనియె.
ప్రగ్గడా! మన మెల్లుండి వచ్చుచున్న యర్ధోదయంబునకు సకుటుంబముగా సముద్రస్నానమున కరుగుదము. మహాపర్వంబుల దీర్థంబులయందు భార్యలతో వలువచెరంగుల ముడివైచుకొని క్రింకినచో నెక్కుడుపుణ్యము గలుగునవి విద్వాంసులు చెప్పుదురు. అట్టి ప్రయత్నము గావింపుమని యభిలాషపూర్వకముగ జెప్పిన విని యెడద దిగులువడియు సంతసము మొగమునం దభినయించుచు వల్లె యని యింటికరిగి మునువోలె విచారగృహంబునం బండుకొని యిట్లు ధ్యానించెను.
పాప మీచిన్నదాని యనుగ్రహమున నొకయాపద గడిపితిని. పరకాంతను వంట చేయుమనిన గొంతయుక్తముగా నున్నది గాని సరిగంగాస్నానమాడ రమ్మని యెట్లు పలుకుదును? మొదటనే యాసుందరి నాభార్య కాదనియు నాకు బెండ్ యే లేదనియు జెస్సినచో నీముప్పు రాకపోవు గదా. వట్టిదంభము బెట్టికొనిన నెవ్వరికిని గీడు రాకమానదు. ఇప్పుడు నాకు భార్య లేదని చెప్పిన బరిహాసాస్పదుడ నగుదును. ఏమి సేయుదుసు. ఉపాయమేమి? అని ధ్యానించుచుండ వెండియు ముసలి యామె భోజనమునకు రమ్మని పిలిచిన నతండు వెనుకటివలెనే రానని చెప్పిన నాసన్న యెఱింగి యా కురంగనయన యతండు వినుచుండ నవ్వతో నిట్లనియె.
అమ్మా! సారెసారె కట్లు కార్యాతురత్వంబున జింతింపనేటికి ? ఒకమాటు నియోగించిన భృత్యుల వేరొకమాటు నియోగించువిషయ మాలోచింపవలయునా. సతతము దన్ను బోషించువారి కవసరము వచ్చినప్పుడు కార్యములు దీర్చుట భృత్యకృత్యమేగదా! కావున గార్య మెరింగించి నియోగింపవచ్చునని పలికిన విని సంతసించి ప్రవరుండు సంతోషముతో లేచి భుజించి రాజుచెప్పిన కార్యవృత్తాంతమంతయు నెరింగించిన నా యించుబోడి యిట్లనియె.
ఈ మాత్రపు పనికే యింత చింతింపవలయునా! అక్కార్య మేను సవరించి కృతజ్ఞత జూపించుకొనియెద గాక. ఏడందలములు నేడురకముల నగలు పుట్టములు దెప్పింపవలయును. స్నానఘట్టమున నేడు గుడారములు, నేడు గుమ్మములు గలుగునట్లు కట్టనియోగింపవలయునని కర్తవ్యములన్నియు నవ్వతో జెప్పున ట్లుపదేశించుటయు నా మంత్రియు నవియన్నియు నా తీరున సిద్ధపరచి ప్రయాణసమయ మారమణి కెరింగించెను.
అప్పు డబ్పోటి నీటులు గులుకు మేటి సోయగంపురూపు దీపింప సింగారించుకొని తానొక యాందోళికమున గూర్చుండి తక్కిన చతురంతయానములలో వింతలగు నగలను బుట్టములను బెట్టి తలుపులు మూయించి నడువ నియోగించినది.
మంత్రియు మిగుల నానందముతో నొక్క పల్లకీయెక్కి యాందోళికాసప్తకంబు దన వెంటరా బోయెల యెలుంగుల నింగిపగుల సముద్రస్నానంబున కరుగుచుండెను.
రాజును భార్యతో నంతకుమున్ను వెడలి మంత్రి గలసికొనెను. తదీయాందోళికాసందోహవాహకరజకకంఠనిర్ఘోషార్భటులకు వెరగందుచు నా చక్రవర్తి యాచతురంతయానము లన్నియు నెవ్వరివని ప్రాంతగుల నడుగ వార లవన్నియు మంత్రిగారి భార్యలవి యని యుత్తరము చెప్పిరి.
ఆ నుడువుల నా యొడయని యెడద సంశయాశ్చర్యపారావారంబున మునింగి వేదెరంగుల జింతించుచుండ గ్రమంబున వారందఱు స్నానఘట్టము జేరిరి.
అందు మంత్రి యెక్కిన యాందోళికముదక్క తక్కినవి యాపటకుటీరములలో బ్రవేశబెట్టిరి. అప్పుడు రాజును భార్యయు జూచుచుండ నయ్యండజయాన మొదటి గుడారమునుండి వచ్చి ప్రవరునితో స్నానము జేసి పోయి యాడేరాలోనుండి రెండవదానిలోనికి వచ్చి యందున్న నగలను వలువను ధరించి యప్పటియట్ల యరిగి యత్తరుణి ప్రవరునితో స్నానము జేసెను. ఈ రీతిని నగలును జీరలును మార్చుచు నచ్చేడియ నేడుగుడారములలో నుండి వచ్చి వచ్చి ప్రవరునితో సరిగంగాస్నానములు చేసినది.
ఆ వింతయంతయు జూచి కందర్పకేతుండును భార్యయు మనంబున మిగుల వెరగుపడి యోహో! మొదట మన ప్రధానికి నొకతయే భార్యయని వింటిమి. విమర్శింప నిద్దరు దోచిరి. ఇప్పుడు జూడ నేడ్గురుగా గాన్పించిరి. వీరి చక్కదన మొక్కరీతిగా నుస్నది. ఈతని కిందఱు సుందరులున్న సంగతియే తెలియదు. వీరి యైకమత్యమే యీగుట్టునకు మూలమని యనేకరీతుల నాదాంపత్యమును గురించి చెప్పుకొనుచు మరల నాందోళికము లెక్కి యింటి కరిగిరి. ప్రవరుడును రాజపుత్రికయు నెప్పటియట్ల గొప్పవైభవముతో బస జేరిరి. జానలగు మానినులు పన్ను కార్యములకు బ్రతిహతము గలదా?
ఆమరునాడు రాజు తెలివిగల యొకపరిచారికం జీరి యేడుజల్తారుచీరలతో మఱికొన్నికానుక లుంచి వీని దీసికొనిపోయి మంత్రిగారి భార్యల కిచ్చి వారివారిపేరుల వ్రాసికొని రమ్ము. వా రేమి విద్యలం జదివిరో తెలిసికొని రమ్మని మరికొన్ని మాటలం బోధించి యంపెను.
ఆపనికత్తెయు నాకానుకల బట్టించుకొని మంత్రిగారి ద్వారము నొద్దకుబోయి తనరాకయు రాజుగారి సందేశప్రకారము దెలియజేయుటయు బ్రవరుడు గుండె ఝల్లుమన నయ్యో! ఈరాజు నాగుట్టు దెలిసికొనువఱకు విడుచునట్లులేదు. ఆ చిన్నదియు నతనికి బైయెత్తు వైచుచు భ్రమపెట్టుచున్నది. ఇప్పు డేమి చేయగలను. ఏడ్వురుభార్యలకు నేడుజల్తారుమేల్కట్టుచీరలు పంపించియున్నాడు. ఏడ్వురు గనబడి కానుక లందికొని పేరులు చెప్పవలయునట. ఏమి చేయుదును దైవమా! అని ధ్యానించుచు నా ముద్దియ నాకన్న బుద్ధిమంతురాలు. దీని కేమి వ్యూహము బన్నునో చూచెదంగాక యని తలంచి యప్పుడే యా వృత్తాంతము అవ్వతో చెప్పి యాయొప్పులకుప్పకు దెలియజేసెను.
అప్పుడా ప్రజ్ఞావతి అవ్వా! ఇందులకు వెరవబనిలేదు. ఆ దాదిని గానుకలతో రమ్మనవచ్చును. సరిగంగస్నానములు జేసినవారు జీరలందుకొనరా? సందియ మవసరము లేదనిచెప్పి తరువాత ముసలమ్మకు గొన్నిమాటలు బోధించి చేయవలసిన యుపాయ మెఱింగించి తాను లోపలకు బోయినది.
ప్రపరుడు తనపరిచారికవెంట రాజదాసిని తనయంతఃపురమున కనిపెను. అవ్వ యందు గూర్చుండి యాదాదికి దగినమర్యాద గావించినది. అప్పు డాదాది అమ్మా! మంత్రిగారి భార్య లేరీ! వారి కీకానుక లీయవలయు. నెందఱు? వారిపేరు లేమో మీ రెఱుంగుదురా వ్రాసికొనవలయునని యడిగిన నా యవ్వ మంత్రిగారికి నెనమండ్రు భార్యలున్నారు. వారిభార్యలపేరులు శ్రీకృష్ణుని భార్యలపేరులే. వారందరు కలసి యేకముగా రారు. ఒకరితో నొకరు మాటాడరు. సాపత్నీధర్మము లోకవిదితమే కదా? ఎవ్వరిని పిలువమన్న వారిని నేను తీసుకొనివచ్చెదఁ జెప్పుమనుటయు నా దాది మొన్న సముద్రస్నానమునకు వచ్చినవా రేడ్వురే కదా యని యేడుచీరలే తెచ్చితిని. కానిండు మఱియొకటి నింతలోఁ దెప్పించెద ముందుగాఁ బెద్దభార్యం బిలువుడని పలికిన విని యా యవ్వ మొన్న కడపటియామెకు దేహములో స్వస్థతలేక సముద్రస్నానమునకు రాలేదు. మంత్రిగారి కెనమండుగురు భార్యలు అని చెప్పుచు నా యవ్వ లోపలకుఁ బోయి దివ్యాలంకారభూషితయై యొకదినుసు నగలును వలువలును ధరించి మెఱయుచున్న యాయన్నులమిన్నను వెంటబెట్టుకొనివచ్చి యీమెయే పెద్దభార్య. ఈమె పేరు రుక్మిణి. ఈమె సంగీతములో నిధి అని యామె గుణంబును వర్ణించి చెప్పినది.
దాది యామెకు నమస్కరించి కొంతప్రసంగము గావించి యామె పలుకుల కలరుచు దాను దెచ్చిన కానుక లిచ్చి రెండవయామెను దీసికొనిరమ్మని ముసలమ్మకు సంజ్ఞఁ జేసినది. అప్పు డాయవ్వ యవ్వనితను లోపలకుఁ దీసికొనిపోయి ముహూర్త కాలములో మఱియొక దినుసునగలు వలువలుదాల్చి మఱియొకతెవలె దోచుచున్న యా చిన్నదాని కైదండ పట్టుకొని తీసికొనివచ్చి దానికి జూపుచు నీమె రెండవభార్య. ఈమె పేరు సత్యభామ ఈమెకుఁ దర్కవ్యాకరణములు రెండును గూలంకషముగాఁ దెలియునని చెప్పినది.
ఆ దాది యామెతోఁ గొంత ముచ్చటించి సంతసించుచుఁ గానుక లిచ్చి మూడవయామెం దీసికొనిరమ్మని సంజ్ఞ జేయుటయు వృద్ధ యమ్ముద్దియను లోపలకుఁ దీసికొని పోయి మరియొకవేషముతోఁ దీసికొనివచ్చి చూపినది . ఈరీతిగా నానాతి యెనమండ్రు జవరాండ్రగా తోచునట్లు వేషములుమార్చి వలువలు తొడవులు చాయలుగూడ నెనిమిదిదినుసులుగా ధరించి దానితో సంభాషించునప్పుడు స్వరభేదములు గలుగునట్లుచేసి దానిని మోహింపఁజేసినది.
ఆ దాదియు నెనమండ్రు భార్యలకుఁ గానుక లిచ్చి వారివారినామవిద్యారూపవిశేషములు వ్రాసికొని వారివలన నామంత్రణము వడసి రాజునొద్దకుఁ తచ్చాతుర్యాదివిశేషంబులు నద్భుతముగా స్తుతిజేయఁదొడంగినది. రాజు ఆ విశేషము భార్యతోజెప్పి మన మంత్రిపుంగవుఁడు శ్రీకృష్ణునికన్న విలాసపురుషుఁడట. ఎనమండ్రు భార్యలు దేవకాంతలు గాని మనుష్యకాంతలు కారట. అతని కీ యదృష్ట మెట్లు పట్టినదో యని వెరగుపడుచుఁ బరితపించుచుండెను .
ప్రవరుఁడు రాజనందన చేసిన చమత్కారమునకు మిగుల మెచ్చుకొనుచు నయ్యుపకారమునకు బ్రతి యెద్దియొఁ దాను జేయలేనని యవ్వనిత వినుచుండ నవ్వతోఁ గృతజ్ఞతాసూచకములగు స్తుతులు పెక్కుచేసెను. అక్కన్యయు మనంబున నిట్లు వితర్కించెను.
అక్కటా! నా జవ్వనమంతయు నడవిఁగాసెడు వెన్నెలవలె వ్యర్ధమగుచున్నది! మంత్రికుమారుఁడగు జయంతుని విడదీసి ప్రతికూలుఁడైన దైవమిప్పుడు సానుకూలుఁ డగుచున్నట్లు తోచుచున్నది. మొదట నీతని మొగము నిదానించి చూడమి నిన్నా ళ్ళుపేక్షించి యూరక కుందుచుంటిని. పరిశీలించినచో నితం డతనికన్న జక్కనివాఁడును విద్వాంసుఁడు నగుటచే నా కింత చింతించవలసిన యవసరమే లేకపోవును. చక్కదనమేకాక యీ పురుషశ్రేష్ఠుని జితేంద్రియత్వము మిగుల శ్లాఘాపాత్రమై యున్నది. ఇంత సొగసుగల నెలంత యూరక తన యాధీనమం దుండ మఱియొకం డెవడైన నిట్లుపేక్ష జేయునా ? ఆ సుగుణనంపత్తియే వీని యదృష్టమునకుఁ గారణమని యూహించెద. నే నిఁక నితని వివాహమాడనిచో నా చక్కదనమునకు దిక్కేది? నేఁడు నాకు శుభశుభసూచకముగా నెడమభుజ మదురుచున్నది. ఈ రేయి వీనితోఁ గలసి కొంత ముచ్చటించెదఁగాక యని నిశ్చయింలి యా రాత్రి ప్రవరునికి వడ్డించునప్పు డవ్వతోఁ బూర్వముకన్న నెక్కుడుగా పదార్థములు వడ్డించుమని రహస్యముగా బోధించినది.
వృద్ధయు నమ్ముద్దులగుమ్మ చెప్పినచొప్పున నెక్కుడుగా వడ్డించినం జూచి ప్రవరు డవ్వా! నా కీదినంబున నిట్లు వడ్డించితివేమి? నా భోజనపుతీరు మరచితివా? నా కడుపు పెద్దదియైన దనుకొంటివా? యని యడిగిన దలుపుదాటున నున్న యన్నాతి యతఁడు వినుచుండ నిట్లనియె
అవ్వా! పదార్థము లెక్కుడైనచో దిగఁబెట్టవచ్చును. వంటజేయుటకును సరిగంగాస్నానము లాడుటకును నొడంబడినవారు పదార్థశేషములు దినుటకు మాత్ర మర్హులుగారా? అవసరం బున్న యప్పుడేగాని యాశ్రితజనంబుల మన్నింపరు గాఁబోలు నని యుత్తరము చెప్పిన నతం డా మాట కేమియుఁ బలుకక వలయునంత భుజించి యెప్పటియట్ల తన శయ్యాగృహంబున కరిగి పండుకొనియె.
పిమ్మట నా కొమ్మయు నాఁడు కాంతుని పాత్రయందు భుజియించి యంతఃపురంబంతయు వింతగా సింగారించి మించుతళ్కులఁ దిరస్కరించు మేనికాంతుల మెరయు రతనంపు పైడితొడవులఁ బెక్కుదాల్చి యొడలనలఁదిన పరిమళద్రవ్యంబుల వాసనలు దెసలావరింపఁ బెంపగు నింపుగులుకు వేషంబునఁ బుడమి జక్కఁదనంబునం బ్రసిద్ధికెక్కిన చక్కెరబోండ్లనెల్లఁ దిరస్కరించుచు నా మేడమీద గద్దియం గూర్చుని నిలువుటద్దంబునఁ దన మేని సోయగంబెల్ల నుల్లంబలర నీక్షించుకొనుచు నా వృద్ధం జీరి యిట్లనియె.
అవ్వా! నే నొక్కసారి జీరుచుంటినని చెప్పి యప్ప్రవరు నిచ్చటికిం దోడ్కొని రమ్మని పనిచిన నామెయు జని యతనితో నామాట చెప్పినది. అతండు శంకాన్వితస్వాంతుఁడై కారణం బడిగి రమ్మని మరల నామె ననచిన నా యవ్వయు నా జవ్వని వలన బోధింపబడి మరల నరిగి యతని కిట్లనియె.
ఆర్యా! మొన్న సముద్రస్నానము చేయునప్పుడు కాలిలోఁ జేపముల్లు గ్రుచ్చుకొనెనఁట. అది తీయజాలినవా రెవ్వరును లేకపోయిరి. నీకు శక్యమగునని యూహించియే పిలువమన్నదని పలికిన నులికిపడి యతం డయ్యో! పాప ముపకారమునకై వచ్చిన యచ్చేడియ ముల్లువిరిగి బాధపడుచున్నదియా! యింతదాక నేమిటికి జెప్పినది కాదు. అని పలుకుచు ముల్లుతీయు సాధనమొదటి చేతంబూని యతిజవంబున నావృద్ధవెంట నా వాల్గంటియున్న మందిరమున కరిగి యొక్కింత తలవాల్చి యో సాధ్వీ! నీ కాలిలో ముల్లెక్కడ విరిగినదియో చెప్పుము. దీసెద ననుటయు నల్లన నవ్వుచు నా శుకవాణి యిట్లనియె.
ఆర్యా! ముల్లు దీయవచ్చి యింత తొందరపడియెద రేమిటికి? అది నిదానింపక తీసినచో నొప్పియగుం గదా! యీ పీఠమునం దొకింత విశ్రమించి ముంటిజాడ దెలిసికొనుడు అనిన నతం డట్లే యని యామెచే నియ్యబడిన బీఠమునం గూర్చుండెను. పిమ్మట నాచతుర చిరునగవు మొగము నలంకరింప దట్టంపుచూపు లతనిపై బరగించుచు నిట్లనియె.
మహాత్మా! ఆపత్సముద్రనం బడద్రోసిన భగవంతుడే నాకు మీ రను తెప్పం జూపించెను. హస్తగతంబగు మణిని గాజుపూసయని యుపేక్షించితిని. అల్లనాడు గుఱ్ఱముమీఁద జూచినప్పుడు కట్టుకొనిన పుట్టములంబట్టి మిమ్ము సామాన్యులనుకొనియే యింతదనుక నుపేక్షచేసితిని. మీ రూపమేకాక విద్యాగుణశీలంబులు ననన్యసామాన్యములై యొప్పుచున్నవి. ఇట్టి మీ ప్రాపుదొరికినను ననాథవలె నే నీపరువమంతయు గాలముపాలు చేయుచున్నదాన నింతకన్న నవివేకమున్నదియా? దీనురాలనై వేడుకొనియెద. నన్ను గాంధర్వవివాహంబున స్వీకరించి కులం బుద్ధరించుకొనుఁడు. ఒకవేళ నన్ను దుష్టురాలినిగాఁ దలంచెదరేమో వినుండు. నేను రాజకుమార్తెను. నా పేరు కాంచనవల్లి. నేను సమవయస్కుండును సహాధ్యాయుఁడునగు మా మంత్రికుమారుఁడు జయంతుఁడను వానిఁ జిన్ననాటినుండియు వలచియుండ నాతండ్రి వివాహసమయమున నతని కీయమి సూచించిన నా జయంతుడును నేనును విదేశగమనమునకై సాంకేతిక మేర్పరచుకొంటిమి.
ఇంతకన్న నే దోషము నెరుంగను. అతఁ డెట్టి కారణమునో యనుకొనినట్లు రాకపోవుట యెరుంగక మిమ్ము నతడే యనుకొని వెంటఁబడితిని. ఇంతవట్టు నిక్కము దైవముతోడుగా వక్కాణింపగలను. పైన మీరెరిగినదియే గదా యని దైన్యంబున బెక్కుగతులఁ దన్ను బ్రార్థించుచుండ దయాళుండగు ప్రవరుం డామోదించి యాపైదలిం గౌఁగిటంజేర్చి యనునయపూర్వకముగా నిట్లనియె.
కాంతా! నీస్వాంత మన్యథా యున్నదనియే నే నింతకాలము నుపేక్ష చేసితిని. మొన్న నవమానము రాకుండఁ గాపాడిన నీవు చెప్పినట్లు చేయుట నా కుచితమే గదా! నీమతి చమత్కృతియేగాక సౌందర్యముగూడ త్రిలోకమోహాజనకమైయున్నది. అస్వీకృతిదారుఁడనగు నాకు నీయట్టి చేడియం పెండ్లియాడుటకంటె భాగ్యమున్నదియా? దీనికై నన్నింత బ్రతిమాలవలయునా? ఇప్పుడు మంచిముహూర్తము ని న్నిదిగో గాంధర్వవివాహంబున స్వీకరించుచున్నవాఁడ నని యమ్మానవతి మెడలో నొక పూలదండ వైచెను. అమెయు నతనిపై బూవులు జల్లినది. అప్పురుషపుంగవుం డంగకళానైపుణ్యము దేటంబడ నాఁబోటి నారేయి బహువిధరతుల నలయించెను. అయ్యతివయు నా చతురుని రతివిశేషములకు మతిగఱఁగి నానందపారావారవీచికలం దేలెనని యెరింగించునంతలో, బయనంపుతరి యగుటయు నా సన్యాసి కథ చెప్పుట చాలించి యా గొల్లపిల్లవాని కావిడి యెత్తుమని క్రమంబున బైమజిలీ చేరి యందును గాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట నతం డొకరమ్యప్రదేశమున గూర్చుండి శిష్యునకుఁ దదనంతరోదంత మిట్లు చెప్పదొడంగెను.