కాశీమజిలీకథలు/మొదటి భాగము/తొమ్మిదవ మజిలీ
తొమ్మిదవ మజిలీ
సింహదమనుని కథ
అందు గోపాలుం డాలకై పొలమున కరిగి యొకచో మేదోమాంసచర్మశూనంబై మిక్కిలిపెద్దదియగు పుఱ్ఱె నొకదానిం జూచి దాని వృత్తాంతము జెప్పుమని యడిగిన మణిసిద్ధుం డారత్నప్రభావంబునఁ దెలిసికొని యక్కథనిట్లు చెప్పందొడంగెను.
కళింగదేశాలంకారంబగు విజయపురంబున శత్రుంజయుండను రాజుగలఁడు. అతండు పెద్దకాలంబు రాజ్యంబు జేసియు సంతానము గలుగమిఁ బరితపించుచు సంతానకాంక్షంజేసి క్రమంబున రూపయౌవన కళావిశాలలైన చేడియల నేడ్వురం బెండ్లి యాడెను. వారియందును సంతతిఁ బొడమినది కాదు. అప్పుడు చింతించి యమ్మహీకాంతుం డొకనాఁడు విజ్ఞానసిద్ధుండను యోగి నాశ్రయించిన నతండును దదీయ భక్తివిశ్వాసములకు మెచ్చి దివ్యప్రభావుండగు తనూభవుం డొక డుద్బవించుచు మామిడిపండొకం డిచ్చి యది నీ కిష్టురాలగు భార్య కిమ్మని చెప్పియంపిన నా రాజు సంతోషముతో నింటికివచ్చి యేడ్వురు భార్యలందును సమానప్రీతి కలవాడగుట నొకదాని విడిచి యొకదాని కియ్య నేరక యందరకు సమముగాఁ బంచియిచ్చిన నా ఫలంబు దిని యా సుందరులందఱు గర్భవతులైరి.
అంత రాజొక్కనాడు పెక్కండ్రు మృగములు సేవింప వేటకై యడవికరిగి యందందు వెదకి వెదకి పెక్కుమృగంబులం జంపి యొక్క వరాహంబు తన వేటుఁ బడియు మడియక పారిపోయిన వెంట నొంటరిగా నరిగి తరిమిన నదియుఁ బెద్దదూరం బతనిం గొనిపోయి యందదృశం బగుటయు నతండు వెఱఁగందుచుఁ దత్ప్రదేశ మంతకుమున్న తానెఱుఁగనిదగుట వేగంబున సేనాముఖంబు జేరవలయునని తలఁచి యతిరయంబున నరుగుచుండ నొకదండఁ గన్నులపండువుగ నుద్యానవనం బొండు గనఁబడినది. మున్నెన్నడును కవివివి యెరుఁగని యవ్వని సొబగునకు వెఱగొందుచు నతం డవ్వన మెవ్వరిదియో! దీని రామణీయక మరయ నమరనిర్మితంబని తోచుచున్నది. ఇందమానుషంబులగు వింతలుండక మానవు. చూచిపోయెదంగాక. అని యల్లనల్లన నయ్యుపవనాంతరమున విహరింపుచుఁ దదీయవిశేష మరయుచు నడచుచుండ నొక పొదరింటి దండ నవ్వనంబునకు మండనాయమానంబగు వనదేవతయో యన నొప్పారు నొక యొప్పులకుప్ప గనంబడినది.
అప్పుడమిఱేఁ డాశ్చర్యమందుచు నిలువంబడి యాప్రోయాలు సోయగం బంతయు నయనంబుల గ్రోలుచున్నవాఁడో యన నిరీక్షించుచుఁ బాపురే! ఇట్టి పాటలగంధిని వసుంధర నెందును జూడలేదు. ఇత్తోట వేల్పులదని నేఁటికిఁ దేటయైనది. ఇది దేవతాకాంతలలోఁ బ్రసిద్దివడసిన యూర్వశి కావచ్చును. యూర్వశియైనచో నేత్రంబులు మూతపడునా? కాదు. భూలోకములోని వనితామణియే. దీని వృత్తాంత మడిగి తెలిసికొనియెదగాక యని యమ్ముద్దుగుమ్మ దగ్గర కరిగి యోజవ్వనీఁ నీ వెవ్వతవు? ఇవ్వనంబున నొంటిగానుండ నేమిటికి? నీ యభిధేయమెద్ది? నిన్నుఁ గన్న దల్లి దండ్రు లెవ్వరు? నిన్ను బతిగాఁ బడసిన ధన్యుని పేరెద్దియో యెఱింగించి శ్రోత్రానందము గావింపుము. అని యడిగిన నతని మాటలు విని సహించని దానివలెఁ గన్నులు మూసికొని యవ్వెలఁది తలవాల్చి మాటాడకున్న నా రాజు వెండియు నిట్లనియె.
వధూటీ! మాటాడవేమి? నన్ను జూచిఁ సిగ్గుపడుచుంటివా? నన్నన్యునిగా భావింపక నీ వృత్తాంత మెఱింగింపుమని తరిమి తరిమి యడిగిన నక్కపటపు టక్కులాడి యొక్కింత తలయెత్తి నాతో నీ కేమి పనియున్నది? నీ వచ్చిన త్రోవం బోవ రాదా? యేకాంతముగానున్న కాంతల బురుషులు పలుకరింపవచ్చునా? చాలు చాలు. మగవారి చెయువులు నే నెఱుఁగనివి కావు. మొదట మృదువైన పలుకులచే మదవతుల మతుల గరగించి పిమ్మట జిక్కులు పెట్టెదరు. నన్నూరక పలుకరింపకు. నీ త్రోవంబట్టి పొమ్మని నిరసించి పలికిన నక్కలికి మాటలచే ననురాగ మంకురింప నతఁడు మెల్లన నిట్లనియె.
వాల్గంటీ! అట్లంటి వేమి? మగవారి గుణంబు లేమి పరిశీలించితివి? నన్నుఁ బురుషసామాన్యునిగా దలంపకుము. నీ కథ తెలుపుము. పిమ్మట నా యభిప్రాయ మెఱింగించెద ననుటయు నప్పాటలగంధి ఆహా! రాజుల మాటలు మరియు నమ్మఁదగినవే. అడవియం దేకాంతముగానున్న శకుంతలను మోసముచేసి క్రీడించి పిమ్మట నిడుములు పెట్టిన దుష్యంతుని కథ నీ వెఱుఁగవు కాబోలు. మొదట నతండును నింతకన్న నెక్కుడు మాటాడలేదా? మరి మాటాడక నీ దారిని నీవు పొమ్మని పలికిన నమ్మగువ పలుకులు రాజహృదయమునకు లంకెలై తగులుకొనిన మించిన తమకముతోఁ గ్రమ్మర నిట్లనియె. నారీమణి! సారెకు నన్నిట్లు వట్టిమాటల నలయించనేల. నీ పలుకులచేతనే నీవుఁ బెండ్లి కానియట్లు తోచుచున్నది. బాలా! విను, నన్ను నీవు స్వీకరించినచో సర్వకృత్యములయందు నీవు చెప్పినట్లు నడుచువాఁడు. పెక్కేల, నా రాజ్యంబే నీ యధీనంబు జేయుదు. నీ తెరం గెరిగింపు మనిన, నల్లన నవ్వుచు నక్కురంగనయన యిట్లనియె.
రాజా! అట్లైన నా కథ వినుము. నేను అవంతీశ్వరుని కూఁతురును నా పేరు సూర్యప్రభ. నాకు జవ్వనము పొడసూపినంత మా తండ్రి వివాహముసేయ ప్రయత్నించెను గాని మగవారి ద్రోహకృత్యము లెఱింగిన నాకు వివాహమునందే యిష్టము గలుగమిఁవలదని మా తండ్రితోఁ జెప్పితిని. అతండును నాకు బెక్కు తెరంగుల బోధించెను. నా యనుమతిలేని యప్పుడేమి చేయగలఁడు? అట్లు నేను కన్యాత్వవ్రతంబు బూనియున్న యప్పు డొకనాఁడు సిద్ధవ్రతుం డను యోగి వచ్చెను. అమ్మహానుభావునకు శుశ్రూషచేయ నా తండ్రి నన్ను నియమించెను. నేనును ఆయనయందు భయభక్తి విశ్వాసములు గలిగి శుశ్రూషఁ జేసితిని. దాని కతండు మెచ్చి వెళ్ళబోవునపుడు నన్ను పిలిచి నీ కెద్దియేని యిష్టమైన వరం బడుగుమనిన నే నేమియుఁ గోరక మనోహరోద్యానవనమునం దేకాంతముగా విహరింప వేడితిని.
అత్తపోధనుఁడు సంకల్పమాత్రంబునం బ్రభవించిన యీ యుద్యానవనంబు నా యధీనంబుజేసి యెక్కడికేని జనియె. నేనును మా తండ్రి యనుమతి వడసి నాఁటి నుండియు నిందు గ్రీడించుచుంటిని. ఇంతకుమున్ను నిన్నుగాక యిందువచ్చిన వారినిఁ గానను. నిన్ను జూచిననాటఁగోలె నా డెందమునఁ గామక్రీడాభిరతి జనించినది. కాని పూర్వుల చర్యలఁ దలంచుకొనినంత స్వాంతము విరాగ మందుచున్నది. యదార్ధముగా నీవు నే చెప్పినట్లు చేసెదవేని నీవెంట వచ్చెదను. నిదానముగా విచారించి మరలఁ జెప్పుము. ఇంతకుమున్ను నీకుఁ గలిగియున్న భార్యలవలన నీకుఁ జిక్కులు రాఁగలవని యమ్మగువ పలికిన వచనంబులు విని యింతయేని సంకోచింపక యతం డిట్లనియె.
అబలా! నీవు వచ్చినం జాలును పదివేలమంది నీకు సాటియగుదురా! నీవు చెప్పినట్టు చేయుట యేమి యాశ్చార్యము? నాతో రమ్ము. నా మాటల సత్యాసత్యములు నీకే విశదములగునని పలుకుచుండ నా వగలాడి సంతసించుదానివలె నభినయించుచుఁ గొంచెములేచి యతని కంఠంబు బిగియ యమపాశంబులం బోలు హస్తంబులఁ దగిలించి గాఢాలింగనము జేసికొనుటయు నుల్లంబు గరంగి యక్కురంగనయనను స్వీకరించి కొంతతడవు తులలేని వేడుకతోఁ గైదండ యొసంగి మెల్ల మెల్లన నడపించుచుఁ గ్రమంబున సేనాముఖంబును కలిసికొని యామెతోడం గూడ రథంబెక్కి చతురంగబలంబులు గొలువఁ బురంబున కరిగెను.
అది యొక బ్రహ్మరాక్షసి. ఆ రాజును మోసము జేయఁదలఁచి యట్టిరూపము పూనియున్నది. పాపమా భూపాలుం డా కపట మెఱుంగక నిజముగా రాజనందనయే యనుకొని కాళరాత్రివలె దాని బురంబునకుఁ దీసికొనివచ్చి యందొక సుందరమందిరము దానికి నివసింపనిచ్చి తగిన యుపచారములుచేయు బెక్కండ్ర దాసదాసీజనంబుల నియమించెను. మరియు నిత్యము దానికి భుజింప సన్నబియ్యము మంచికూరలు శక్కరఘృతఫలాధికమగు నాహారపదార్థములఁ బంపుచుండునుగాని యవి యారక్కసి కేమి లెక్క. దాని నాకలిదీరక రాత్రులందా రాకాసి రహస్యముగా నిల్లు వెడలి రాజుగారి యేనుగులలో నొకదానిని భక్షించి తెల్లవారునంత మరలివచ్చి యంతపురములో నెప్పటియట్ల నివసింపుచుండును. ఆ రీతి బ్రతిదినంబును నర్ధరాత్రంబునం బయలుదేరి యేనుగులను గుఱ్ఱములను లొట్టియలను భక్షింపుచుండ గారణము తెలియక కావలివార లొకనాఁడు రాజునొద్ద కరిగి యిట్లనిరి.
దేవా! పదిదినములనుండి యొక బ్రహ్మరాక్షసి మన యూరిమీదఁబడి తోటలోని యేనుగులను గుఱ్ఱములను లొట్టియలను దినుచున్నది. నిత్యము అర్ధరాత్రంబున వచ్చుచుండును. ఆ చర్యను రహస్యముగానుండి నిన్నఁ గనిపెట్టితిమి. రక్తమును మాంసమును మాత్రము బీల్చి యెముకలు మిగుల్చును. దేవరవారు దాని కెద్దియేని ప్రతిక్రియ జేయనిచోఁ గొలఁదికాలములోనే మన యేనుఁగులు గుఱ్ఱములు లొట్టియలు నాశనమగును. అని యెఱింగించిన నదరిపడి యతం డేమేమి! బ్రహ్మరాక్షసి వచ్చినదా? దానిఁ బారగొట్టుట దుర్ఘటమే యని పలుకుచు వారివెంటబోయి యా యాస్థానములో నున్న జంతుశల్యంబులఁ బరీక్షించి వగచుచుఁ దక్షణమే రాత్రులయందు గస్తు దిరుగుటకై పెక్కండ్ర శూరుల నియమించెను. వారి కాపుదల యేమియు నా రక్కసి ఘోరకృత్యమున కాటంకము చేయనోపదయ్యెను. ఇట్లెంత ప్రయత్నము చేయుచున్నను జీవహింస తగ్గినదికాదు. అందులకుఁ జింతించుచు నొకనాఁడు రాత్రి తనయింట వాల్గంటిగానున్న యా రాత్రించరితో నిట్లనియె.
ముదితా! పదిదినములనుండి రాత్రులందు మాయూరి కొకబ్రహ్మరాక్షసి వచ్చి యేనుఁగు మొదలగు జంతువులం దినుచున్నది. ఎన్ని కాపులుంచినను లెక్క సేయుటలేదు. ఉపాయమేమియుఁ దోచకున్నది. తుదకుఁ బ్రజలను గూడఁ దిన మొదలుపెట్టునేమో యని భయమగుచున్నది. నీవును బుద్ధిమంతురాలవు. నీకేమైన నుపాయము తోచినఁ జెప్పుమని యడిగిన నది నవ్వుచు మీ కేమియుఁ దెలియదు కాబోలు. వేరే యెక్కడనుండియో బ్రహ్మరాక్షసి వచ్చు చుండుటలేదు. బ్రహ్మరాక్షసులు మనయింటనే యున్నవి. మీకు గోపము రానిచో నిక్కము వక్కాణించెదననుటయు రాజు తొందరపడుచు అక్కటా! అట్టి దుర్మార్గులు నా యింటనే యుండిరా! వారిం బేర్కొనుము. ఎవ్వరైన నుగ్రదండనలకుఁ బాత్రుల చేసెదనని యడిగిన నది నాథా! మాటలతో బ్రయోజనమేమి? రేపు సూర్యోదయమునకు రమ్ము. నీకుఁ బట్టి యిచ్చెదనని చెప్పిన నొప్పుకొని యతండు నిజనివాసమునకుం బోయెను.
ఆ రక్కసి రాత్రి బూర్వమువలె బయలుదేరి తోటలోనున్న పట్టపుటేనుఁగను పట్టిచంపి మాంసఖండబులం దినక రాజభార్యల వంటశాలలోఁబెట్టి యెప్పటియట్ల యంతఃపురమునకుం బోయెను. అంతమరునాఁడు రాజు దానియొద్దకుఁబోయి వాల్గంటీ! మన యింటనున్న రక్కసులెవ్వరో చూపించమని యడిగిన నది నవ్వుచు దేవా! మఱి యెవ్వరునుకారు. దేవరవారి భార్యలే! వారే రాత్రులు బయలుదేరి యిట్లు చేయుచున్నారు. దృష్టాంతము కావలసినచో వారి వంటశాలలఁ బరీక్షించుకొనుఁడు. రాత్రి చచ్చిన మృగముల మాంసఖండము లుండక మానవని పలికిన రాజు తెల్లబోయి యేమేమి! నా భార్యలే యట్టిపని చేయువారు? చూచినంగాని నమ్మనని యప్పుడే వారి యిండ్ల కరిగెను.
వారి వారి వంటశాలల భటులచేఁ బరీక్షించి యందు రాత్రి చచ్చిన భద్రగజము యొక్క మాంసఖండము లుండుట జూచి మితిలేని కోపముతో మరల నా రక్కసి యింటికరిగి తరుణీ! నీవు చెప్పినది యథార్థమే. నేను దెలిసికొనలేక పెక్కు చింతబోయితిని. ఈ రహస్యము నీ వెట్లు గ్రహించితివి? కటకటా! భార్యలని యెక్కుడు ప్రేముడిగాఁ జూచినందుల కెంత ఘోరకృత్యములు చేయుచుండిరో చూచితివా! సామాన్యపు రాజస్త్రీ లనుకొంటిగాని రక్కసులని యెఱుంగనైతిని. వారి కేమి శిక్ష విధింపవలయునో నీవే చెప్పుమని యడిగిన నది సంతసించుచు విట్లనియె.
నాథా! స్త్రీలచర్యలు స్త్రీలకేగాని యెఱకపడపు. వారి కృత్యములు నాకుఁ దెలియక మీకుఁ దెలియునా? ఈ రహస్యము నాకు మొదటనుండియుఁ దెలిసియే యున్నది గాని నాకు నేనై చెప్పిన యుక్తము గాదని యూరకుంటిని. నన్నడిగితిరిగాన యిప్పుడు చెప్పితిని. వానికి దగినశిక్ష చెప్పెదవినుండు. వారు గర్భములు ధరించియున్నవారు గావున జంపుట యుక్తముగాదు. మహారణ్యములోఁ గనుగ్రుడ్డులు పెరికి విడచివేయవలయును. ఇట్టి కృత్యములు చేసిన వారికిదియే దండనయని చెప్పెను.
ఆతండు సమ్మతించి యప్పుడే భటులం బిలిపించి గర్భవతులని కొంచెమేని సందియమందక దయారహితుఁడై భార్యల నడవిలో విడిచి కన్నులు బెరకిరండని యాజ్ఞాపించిన రాజకింకరులును తదాజ్ఞానుసారముగా నా మగువలతో నేమియుంజెప్పక యెద్దియో మిషచే మహారణ్యమునకుఁ గొనిపోయి యందు వారి కనులం బెరకి పెద్ద యెలుంగున నేడ్చుచున్న వారిని విడిచి యానవాలుగా నాకన్నులం దెచ్చి యారక్కసి కిచ్చిరి. పిమ్మట రాజు భార్యలు అందు మితిలేని శోకంబున గుందుచుండ నందులోఁ బెద్దదానికిఁ బ్రసవవేదన యావిర్భవించినది. వెంటనే పుత్రుం డుదయించెను. అబ్బాలుండు జనించిన కొంచెముసేపులోనే తల్లులు యంధత్వంబు గనిపెట్టి దాపుననున్న మృగము లాశిశువుం జంపి భజించినవి.
ఆ సుందరులందరు తమముందు శిశువుం గానక యుల్లంబులు పగుల బలు దెరంగుల నేడువఁజొచ్చిరి. వారి యరణ్యరోదనం బాలించి యోదార్చువా రెవ్వరు? అ మరునాఁడే రెండవదిగూడ మగశిశువుం గనెను. గాని యప్పసికూననుగూడ మునుపటి మృగములె తినినవి. క్రమంబున దినము వరుస వరుస నార్గురు రాజభార్యలు పిల్లలం గని మృగముల పాలుచేసిరి. కటకటా! పుత్ర శోకంబున నడలు నప్పడతుల కంఠనాదంబులు నయ్యడవియంతయుఁ బ్రతిధ్వనులిచ్చినవి. ఏఁడవ దానికిఁగూడఁ బ్రసవవేదన యంకురించిన తోడనే వారిలో బుద్ధిమంతురాలగు మూడవది తక్కినవారి కిట్లనియె.
అక్కలారా! మనమిక్కడ నూరక యేడ్చుచున్న నోదార్చువారెవ్వరు? మన పురాకృతదుష్కృతఫలం నిట్లు పలించినది. మన యార్వురకుఁ బొడమిన బాలుర నడవిపాలు సేసితిమిగదా! ఇప్పుడు యేఁడవదానికిఁగూడ నొప్పులు పట్టుచున్నవి. దాని పిల్లనుగూడ నేదియో యీడ్చికొనిపోవును. కావున నాకొక్క యుపాయము తోచుచున్నది వినుఁడు. మనమొక్క చిన్నవానినేని బ్రతికించుకొనకపోయితిమేని మనలను రక్షించువా రెవ్వరు? ఇప్పుడు మన మార్వురము దీనిచుట్టు జేతులు లంకెలు వైచుకొని కాచియుందము. ప్రసవమైనతోడనే యాబిడ్డ నెత్తుకొనినచో మృగబాధ యుండదు.
పిమ్మట వానిని గ్రమంబుగాఁ బెంచవచ్చును. దైవానుగ్రహమున వాఁడు పెద్దవాఁడైనచో మనకు నన్నమైనఁ దెచ్చి పెట్టును. కావున నట్లుచేయ సిద్ధముగానుండు డని చెప్పెను. ఆ మాట కాబోటులెల్లరు సంతసించిరి. ఇంతలో కాంతకుఁ బ్రసవవేదన యెక్కువయైనది. అప్పుడప్పడతు లందరు దానిచుట్టును నిలిచి చేతులు లంకె వైచుకొని కాచుచుండ నక్కలికి చక్కని మగశిశువుం గనినది. తోడనే యా చేడియలలో నొకతె యా బాలునిం దడవి తీసికొని మృగముల బారి తప్పించెను కడు జాగరూకతతో నా సుందరులందరు నా పిల్లవానిం గాపాడుచు నొకరువిడిచి యొకరు యెత్తుకొని పాలిచ్చుచు నొకప్పుడైనఁ గ్రింద దింపక రొమ్ములం బెట్టుకొని పెంచుచుండిరి.
అధికరూపవిశాలుండగు నాబాలుండు నేడ్గురుతల్లుల పాలుం ద్రావి క్షణక్షణప్రవర్ధమానుండగుచు నైదేండ్లకే పదియేండ్లప్రాయముగలవానివలె నుండెను. దిక్కులేనివారికి దైవమే దిక్కనురీతి నాగ్రుడ్డివారి కాహారాదికవిషయమై యాయడవిలోనున్న తపసులు ఫలాదికము సహాయము చేయుచుఁ దమయాశ్రమములో నుంచుకొని కాపాడుచుండిరి. అయిదాఱుసంవత్సరముల ప్రాయమప్పుడే యా బాలుం డడవిలోని కరిగి ఫలములు మొదలగునవి తల్లులకు దెచ్చి యిచ్చుచుండెను.
సహజపరాక్రమశాలియగు నబ్బాలుం డొకనాఁడు అడవిలో దిరుగుచుండఁ భయంకరమగు నొకసింహము గనంబడెను. తోడనే యాయర్భకుండు నిర్భయముగా నాయుధములేక యద్దానిపయింబడి సాధారణసాధనముతోడనే దానిం గడతేర్చెను. ఆ విశేష మందలి తపసులు చూచి యతని పరాక్రమమునకు మెచ్చుకొని సింహదమనుం డని యతనిఁ బిలువఁ జొచ్చిరి. వానికిఁ బదియేఁడులు వచ్చినతోడనే కొండవాండ్ర యొద్ద విల్లును అమ్ములను సంపాదించి సులభముగనే శరభసార్దూలాది మృగంబులం జంపుచు బహువిధమాంసంబుల దెచ్చి భయభక్తివినయవిశ్వాసంబులు తేటపడఁ దల్లుల కిచ్చుచు వారు సంతోషించి యాశీర్వదింప నంగీకరించుచు వారి దుఃఖ మొకరీతి మరపు పుట్టించెను. మఱియు నయ్యడవిలోఁ బ్రసిద్ధులైయున్న కిరాతుల రప్పించి వారితో బనులు చేయించుచు వారికెల్ల నాయకుడై రాత్రులయందుఁ దల్లులచే లోకవ్యవహారంబు లన్నియుఁ దెలిసికొనుచు నరణ్యరాజ్యము సేయుచుండెను. ఇట్లుండ సింహదమనుఁ డొక్కనాఁడు తల్లులతో నిట్లనియె.
అమ్మలారా! మీ రీయరణ్యంబున ననాథలై యుంటిరేమి? మీరు గ్రుడ్డివారగుటకుఁ కారణంబేమైన గలదా? మీరు చెప్పుచున్న లోకవ్యవహారసిద్ధంబులగు కథలను వినుచుండఁ బురుషులకు స్త్రీలును స్త్రీలకుఁ బురుషులు నుండవలసిన యగత్యము గానంబడుచున్నది. మిమ్ము నెవ్వరేని బురుషులు బెండ్లియాడిరా, లేదా? మీ వృత్తాంతము చెప్పఁదగినదేని జెప్పుడవి వేడిన నతని మాటలకు సంతసించి యాచేడియ లిట్లనిరి.
పుత్రా! మా వృత్తాంత మేమని వక్కాణింతుము. ఏ చింతయు నెఱుఁగకున్న నీకుఁగూడ విచారము గూర్చినవార మగుదుము. నీవు పుట్టినది మొదలు సంతసించుచుంటిమి. అంతకుమున్ను మేము దుఃఖించిన ఘోషంబు కొండగుహలనుండి యిప్పటికిని వెడలుచున్నది. మమ్మింతకుఁ బూర్వ మిట్లడుగువా రెవ్వరును లేకపోయిరి. నేఁటికి మా పూర్వపుణ్యంబున నీవు బయలుదేరి మా యాత్రము తెరంగరయుచుంటివి. అని యతని గారవించుచు దాము శత్రుంజయ మహారాజును బెండ్లియాడినది మొదలు సింహదమనుండు దొడమువరకు నడుమ జరిగిన వృత్తాంతమంతయుంజెప్పి యయ్యా! యింతకును నామానవతియే మూలమని కన్నీరు విడువజొచ్చిరి.
అప్పు డబ్బాలునకు వచ్చిన శోకమును రోషమును యింతింత యవి చెప్పుటకు నలవికాదు. తనుఁదాన యుపశమించుకొని కటకటా! మాతండ్రి యెంత క్రూరాత్ముఁడు! మిమ్ము నెట్టియిడుమలఁ బెట్టెను. పితృవధ మహాపాతకంబని సందియమందుచుంటిని కాని యిప్పుడే యతని లోకాంతరగతునిఁ జేయకపోదునా! ఇంతకు మన పురాకృతకర్మ మిట్లున్నది. యొకరిం దిట్టనేల? కానిండు. ఇంతటిచో నీ యాపదలు తొలఁగినజాలు. మనమీ యడవిలో నుండనేమిటికి ? ఎద్దియేని పట్టణమునకుఁ బోయి సుఖింపరాదేయని యప్పుడే కిరాతులఁ బెక్కండ్ర రప్పించి వారిచేఁ గట్టఁబడిన బొంగుసవారీలలోఁ దల్లుల నెక్కించి యాబోయలచేతనే మోయించుకొనిపోయి క్రమంబున ననేకపురంబుల గడచి చివరకుఁ దండ్రిగారి పట్టణమే చేరెను.
ఆ పురంబేలు రాజు తన తండ్రియని యెఱింగియుఁ దనకు తానుపోయి తన కథ జెప్పనేలయని రాజునొద్ద కరుగక సామాన్యగృహస్తునింటి కరిగి యదియే బాడిగకుఁ దీసికొని యందుఁ దల్లులుకు తాను నుచితవ్యాపారములచే గొన్నిదినములు గాలక్షేపము చేసెను. అట్లుండ నొకనాఁ డయ్యూరి యంగడికి యొకగుఱ్ఱము పెద్దకత్తియు నమ్మకమునకు వచ్చెను. అశ్వముఖంబునఁ గట్టబడియున్న పట్టంబున నిట్టు వ్రాయబడియున్నది.
"ఈ గుఱ్ఱము గత్తితోగూడ పదివేల రూపాయలు. ఆ కత్తిని చేత సులభముగా నెత్తినవారుగాని యీ వారువము నెక్కలేరు. ఇది భూమిమీదవలె నాకాశముమీదను వేగముగా నడువగలదు. అసమర్థులు దీనిని గొనినచోఁ బరాభవమును బొందుదురు", అట్టి శాసనముతో నున్న యా యశ్వవర్తమానమును విని రాజుగారు దానిఁ గొనదలంచి దానియొద్దకు వచ్చి తన సంస్థానములోనున్న యోధులందఱిచేత నాకత్తి నెత్తింప నిరూపించెను. అట్టిపని యొక్కఁడును చేయలేకపోయిరి.
అంతకుపూర్వమే తా నాకత్తిని కదుపలేకపోయెను. ఆ రాజు సిగ్గుపడి వచ్చిన దారింబట్టి యూరక యింటికరిగెను. ఆతురగవృత్తాంతమంతయు విని సింహదమ నుండు అంగడికరిగి దానిం గొనదలఁచిన వారు తొలుత నాకత్తి నెత్తి చూడవలయుం గానఁ జులకనగా నావాలు కేల నమర్చి యాతత్తిడిపై కెగిరి యచ్చటివారెల్ల జూచుచుండ క్షణమాత్రములోఁ బహుదూరము పోయివచ్చి నిలిచెను. అప్పు డచ్చటనున్నవా రాతని బలపరాక్రమములు శ్లాఘించుచు రాజునకుం దెలియజేసిరి.
ఆ నృపతి యద్భుతము జెందుచు అట్టివీరుం డెవ్వఁడు? వాఁడు నాకొలువున నుండినచోఁ గోరిన వేతన మిత్తునుకద! పోయి చూచెదంగాక యని కడువేగముగా నతనియొద్ద కరిగెను. సింహదమనుని రూపంబు జూచినంత రాజుమిగుల వెరగు పడుచు నౌరా! యీ కుమారుండు సుకుమారుండు. ఇతని పరాక్రమమేగాక సౌందర్యము గూడ ననన్యసామాన్యమై యున్నది. ఇట్టివాఁడు నాయొద్ద వేతనంబునకు నిలుచునా? వీఁడు నిజముగా దలఁచికొనినచో నారాజ్యమే కాదు భూలోకమంతయు తన వశము జేసికొని పాలింపగలఁడు అయినం బ్రార్థించి చూచెదంగాక యని యతనితో వినయముగా ఆయ్యా, యీగుఱ్ఱమును సవారు చేసినవారు తమరేనా? మీ దేశ మేమి? మిమ్ము గన్న తలిదండ్రులెవ్వరు? వారెట్టిపుణ్యము చేసిరోగదా? యెవ్వరేని మీకుఁ దగినవేతన మిచ్చినచో నుందురా? అని యడిగిన సింహదమనుం డారాజు తన తండ్రియని యెఱింగియు నింకను తన్నెఱింగింపరాదని యతనితోఁ గులదేశనామంబుల మఱుగుపెట్టి చెప్పి యీగుఱ్ఱమును నాకుఁ గొనియిచ్చి నెలకు నూఱుమాడలు జీతమిచ్చినచో మీయొద్ద నుండెదనని యుత్తరము చెప్పెను.
అప్పుడు రాజు మిగుల సంతసించుచు నతఁడు కోరినట్లొప్పుకొని యావెల కాఘోటకమునుఁ గత్తితోఁగూడ గొనియిచ్చి తన సభకుఁ దీసికొనిపోయెను. అది మొదలు సింహదమనునకు రాజసభకు రాకపోకలు గలిగియుండెను. ఆ విచ్చుకత్తిని జేతంబూని యాగుఱ్ఱమెక్కి వీధివెంబడి నరుగునప్పుడు సింహదమనుని జూడ నెంత వానికైన భయము పుట్టకమానదు.
గోపాలా! భూపాలుని వంచనజేసి రాజు భార్యల నడవికి ద్రోయించి రాత్రుల ఘోరకృత్యములు చేయుచున్న యా రక్కసి కొన్నిదినములు మాత్రము రాజునకు నమ్మకము బుట్టుటకై జీవహింససేయుట మాని తరువాత మరల రాత్రులందు బయలుదేరి పూర్వమువలెనే గజాశ్వహింస సేయదొడంగినది. రాజు పెక్కుగతుల చింతించి యెన్నియో ప్రతీకారము లాచరించెను. ఏమియు పనికివచ్చినవి కావు.
సింహదమనుఁడు తన కొలువునఁ జేరిన వెంటనే యారాజొ క్కనాఁ డతనితో నా హింస విషయమై ముచ్చటించి దానిబాధ తొలగింపుమని బ్రార్ధించెను. అప్పుడు సింహదమనుఁడు మందహాసము చేసి చంద్రహాసము జళిపించుచు రాజా! వెరవకుము. యీ రాత్రియే నారాత్రించరి బాధయుడిగించెద. సుఖముగా నిద్రబొమ్మని దైర్యముఁ బలికి యతని యనుజ్ఞ వడసి యింటికరిగి పెందలకడ భుజియించి జెట్టిలాగును గాశికోరియు బిగించి చంద్రహాసము చేత నమర్చి, యా గుఱ్ఱమెక్కి రాత్రుల వీధియందు గస్తుదిరుగఁ జొచ్చెను.
ఆ రాక్షసియుఁ బూర్వమువలెనే యర్ధరాత్రంబున గృహంబు వెడలి యా యేనుఁగులుండు తోట కరిగెను. అందు భయంకరవేషముతో గుఱ్ఱమెక్కి కత్తిఝళిపించుచుఁ దిరుగుచున్న సింహదమనునిఁ జూచి యతని బలపరాక్రమము లంతకుమున్నే వినియున్నది కావున భయపడి చేరజేర యూరక మరలి నిజనివాసమున కరిగినది. మరునా డుదయంబున రాజు రాత్రి జంతుహింస జరగమికి నాశ్చర్యపడుచుఁ సింహదమనుని వేతెరంగులఁ గొనియాడి కొన్ని దినములు రాత్రుల నా రీతిగనే గస్తు దిరుగుటకు మిక్కిలి వేడుకొనెను.
అతం డాప్పార్థివుని ప్రార్థన మంగీకరించి రాత్రి ప్రతిదినమును గాచుచుండెను. ఆ రక్కసియు ననుదినము ఇల్లువెడలి యా యేనుఁగుల భక్షింపఁ బ్రయత్నించెనుగాని యతని రక్షణలోనున్న వానిని జేరలేక చింతతో నూరక నింటి కరుగుచుండెను.
అట్లు కొన్నిదినములైన వెనుక యారక్కసి యాహారములేక స్రుక్కి యొక్కనాఁ డిట్లు తలంచెను. అయ్యో! నాప్రాణమున కీవీరుఁ డెక్కడ నుండి వచ్చెనోకదా! నాకు వీనింజేర భయమగుచున్నది. వీఁడు రాత్రుల నొక్కనాఁడుగాని యేమరక తోటలో నేనుఁగుల గాపాడుచున్నాడు. ఎన్నిదినంబు లిట్లు తిండిలేక బ్రతుకగలను. వీఁడు యీ యూరు విడిచిపోపు నుపాయం బెద్దియేని బన్నినచో నాకు నాహారము దొరుకును. లేనిచో బ్రతుకలేదని నిశ్చయించి యొక యుపాయమూహించి నాఁటి రాత్రిఁ దలగట్టుకొని పరుండి యేడ్చుచుండెను.
అది యంతయుఁ జూచి దాని దాదులు పరుగునబోయి రాజుగారితో నా వృత్తాంతము జెప్పిరి. యతివేగముగా దాని యంతఃపురము కరిగి యందు డెందము పగుల నేడ్చుచున్న యా చిన్నదానిం జూచి రాజు దీనస్వరముతో మోహనాంగీ! నీ వింత శోకింప నేటికి ? నీ కెవ్వరేని యవమానము సేసిరేమో నుడువుము. వారికిప్పుడు తగిన దండన విధింతు ననుటయు నది యతని కిట్లనియె.
నాధా! నా దుఃఖకారణము మీతో నేమని చెప్పుదును? నాకు భ్రమరవేణి యను చెల్లెలు గలదు. దాని నా పంచప్రాణములలో నొకదానిగాఁ దెలిసికొమ్ము. ఆ చక్కెరగొమ్మ యిప్పుడు రోగపీడితయై బాధపడుచున్నట్లు స్వప్నము వచ్చినది. నాకల యెన్నడును వట్టిదికాదు. నా కేమియుం దోచకున్నది. పోయి చూతమన్నను సమీపమున లేదు. ద్వీపాంతర మందున్నది. అచ్చటికిబోయి దాని క్షేమ మరసి వచ్చువా రిచ్చట నెవ్వరు గలరు? ఏమి చేయుదును? ఇందులకే చింతించుచుంటి ననిన నతఁ డిట్లనియె.
తరుణీ! కలగన్నందులకే చింతింపవలయునా? స్వప్న మెన్నఁడేని యదార్ధ మగునా? అయినను, మన యొద్దనున్న వీరుని నంపినచో నెంతదూరమైనను దేవతాతురగముమీఁద బోయి శీఘ్రముగా రాగలడు. మీ చెల్లెలు క్షేమ మరయ నతని నంపెదను నీవు చింతింపకుము అని యోదార్చిన విని, యది సంతసించుచు నాథా! యతని వేగముగాఁ బంపవలయును. వానితో నేను గొన్ని మాటలు చెప్పవలసియున్నవి. నాయొద్ద కనుపు మనిన నతం డందులకు సమ్మతించి యప్పుడే సింహదమనులకు వార్త నంపి యా ప్రయాణ మెఱింగించెను.
ఆ బల్లిదుం డందుల కియ్యకొని సయ్యన నయ్యతివయున్న యంతఃపురమున కరిగి అది బ్రహ్మరాక్షసి యని యెఱుంగక నా పత్నిమాతయే యనుకొని యామెతో అమ్మా! నేను సింహదమనుండ. నీవు పొమ్మన్నచోటునకుఁ బోవసిద్ధముగ నుంటి అత్తావెద్దియో యెఱింగింపుమనిన సంతసించి యానక్తంచరి యిట్లనియె.
మహావీరా! నీ పరాక్రమ మిదివరకే వినియుంటిని. నీవుగాక మరియొఁక డచ్చటి కరుగనోపఁడు. వినుము. ఇచ్చటనుండి దక్షిణదిక్కుగాఁ బోయిన మళయాళదేశము మీఁద లవణసముద్రము గనంబడు. ఆ సముద్రంబు నూఱుయోజనములు దాటినంత నొక లంక బొడసూపును. అందు గనఁబడిన రాజమార్గంబునంబడి బోవఁబోవ నూఱుయోజనంబులపైన మూఁడు పర్వతంబులు జూడనగును. వానిలో నడిమిదాని శిఖర మెక్కిన విశాలంబగు పాషాణమొకటి పొడకట్టు. ఆ రాతిమీఁద నగ్ని ప్రేల్చి నాయిచ్చిన పొడి యగ్నిలో వైచినంత నా రాయి పగిలి దారియిచ్చును. ఆ దారింబోయిన మాచెల్లెలు నివసించు మందిరము గనంబడును. దానింజూచి యీ యుత్తరంబిచ్చి దానియొద్దనుండి మరల నుత్తరము తీసికొనిరమ్ము . పొమ్మని సెలవిచ్చిన నా వీరుఁ డా యువతి యిచ్చిన చూర్ణమును నుత్తరమును నందుకొని నమస్కరించి యటనుండి వెడలి తన యింటికి వచ్చెను.
తల్లులకు నమస్కరించి నే నిప్పుడు రాజుపంపున ద్వీపాంతరమున కరుగుచుంటిని. నేను వచ్చువరకు భద్రముగ నుండుఁడు. మీ కుపచారములు చేయఁదగిన పరిచారకుల నియమించితిని. నాకుఁ బోవ సెలవియ్యుఁడని వేడిన వారు సమ్మతింపక కొంతసేపు చిక్కులబెట్టిరి. కాని యెట్టకేల కతని యనునయవాక్యంబులచే నొప్పుకొనిరి. అంత నా సింహదమనుండు, జట్టివేషము బూని చంద్రహాసము చేతఁబట్టికొని యా దేవతాతురంగ మెక్కి జయపరమేశ్వరా యని శుభముహూర్తంబున నిల్లువెడలి దక్షిణాభిముఖుఁడై యాకాశమార్గంబున నరుగుచుండ సాయంకాలమున కొక పురము గనంబడినది.
మణిమంజరి కథ
అన్నగరము మీఁదుగా నరుగునప్పుడు నన్నగరాధీశ్వరుని కూతురు మణిమంజరి యనునది సఖులతో సౌధోపరిభాగమున జల్లగాలి సేవింపుచుఁ గొలువుండ యాకాశమార్గమున నరుగుచున్న యా రాజకుమారునింగని తదీయరూపవిభ్రమవిలాసంబులు మనంబున కుల్లాసంబు గలుగఁజేయఁ దనయొద్దకు రమ్మని చేయి వీచినది. సింహదమనుఁడా సంజ్ఞను గ్రహించి యామేడకు దాపుగా నరుగుచుండ నల్లన నందు దిగెను.
అప్పు డదరిపడి యా చేడియ చెలికత్తెలతోఁగూడ తటాలున లేచి సుందరుఁడా! నీవు కంతుఁడవా? జయంతుఁడవా? వసంతుఁడవా? వీరిలో నొక్కరుఁడవు కానిచో నిట్టి సోయగముండునా? ఆకాశగమనమున నీవు మనుష్యుఁడవు కానియట్లు తెలియఁ బడుచున్నది. నీ వృత్తాంత మెఱింగించి నన్నుఁ గృతార్ధురాలిం గావింపుమని యడిగిన నతండు దాని కిట్లనియె.
అబలా! నాపేరు సింహదమనుండు. నేను నీవన్నవారిలో నొక్కరుఁడనుగాను. నేనొక రాజకుమారుండ. తండ్రిపంపున ద్వీపాంతరమున కరుగుచుంటిని. నాకు మిగుల దాహమగుచున్నది. తియ్యని పానకంబు ద్రావనిత్తువేని త్రావిపోయెద ననుటయు నచ్చతుర నవ్వుచు నిట్లనియె.
రాజపుత్రా! ఇచ్చట సుఖముగాఁ బానకము దొరకదు. అదియున్న తావు చెప్పెద వినుము. శ్రీకూర్మముమీఁదుగా నరిగిన మకరారంబు జూడనగును. దానిం దాటిన గదళీవనంబు బొడగట్టును. దానిం దాటిన కాంచీస్థానము, దానిపైన నొక హ్రదమున్నది. దాని పల్లమునుండి దాపుననున్న పైడిమెట్ల వెంబడి పై కెక్కినచో రెండు బంగారుకొండలు గనంబడు . వానిమీదఁ గొంచెముసేపు విశ్రమించి పైకిఁజన శంఖచూడుని వీడు జూడనగును. దానిఁ దాటినఁ జంద్రలోకం బాలోకోత్సవము జేయును. అందు వెదకినచో నమృతంపుబావి యున్నది. నీకు సమర్ధత గలిగియున్నచో నాబావిలో నమృతంబు ద్రావి దప్పిదీర్చుకొనుము, అని పలికిన విని యయ్యతివ చతురంబులగు వచనంబులకు మెచ్చుకొనుచు నా సుందరుండు మందహాసముచేసి యిట్లనియె.
చేడియా! నీవు చెప్పిన బావి పెక్కుచిక్కులు పడినంగాని లభింపదు. అచ్చటికి మేము స్వతంత్రముగాఁ బోవచ్చునా? అందుల కంకిలి లేదంటివేనిఁ బోయి త్రావెదను. అని పలుకుటయు నజ్జాణ యించుక సిగ్గుతో మఱియు నతని కిట్లనియె.
రాజహంసమా! అది మానసంబటిన వారికిఁగాని యంటరాదు. నీ వట్టివాఁడ వైనచో ద్రావుమనియె. ఇట్లొండొరులు సంభాషించుకొనుచుండ వారి యభిప్రాయములు తెలిసికొని చెంతనున్న చెలికత్తియలు ఎద్దియో మిషపన్ని మాటున కరిగిరి.
అప్పు డప్పురుషపుంగవుండు ప్రాంతమందున్న హంసతూలికాతల్పంబు జేరి ముదితా! ఇదిగో యమృతంబు గ్రోలుచుంటిని. యెంత ద్రావినను దప్పి దీరకున్నది. దీని రుచి యేమని చెప్పుదునని పలుకుచు నధరరసం బానియాని కేళీరతుండై నంత నక్కాంత గంఠంబున నద్భుతకూజితంబు వెలయ నతనిచేతులు బెనంగి పట్టుకొనినది. వారట్లు తబ్బిబ్బగుచుఁ బెక్కుతెరంగుల మన్మథక్రీడలఁ దేలుచు ననేక విశేషములఁ దమ పాటవంబు తేటపడ నానందించిరి.
ఆయ్యవసరంబున సింహదమనుండు సొమ్మసిల్లి నిద్రాయత్తుండయ్యె. మణిమంజరియు నతనికి నిద్రాభంగము గలుగునని కదలక పాదంబు లొత్తుచుండెను. అప్పుడు ఆ యలజడిలో నతని యంగీజేబునుండి యొక యుత్తరము జారిపడినది. అది యేమియో యని యా మణిమంజరి యందిపుచ్చుకొని పై విలాసము చూచి యా లిపి పైశాచభాషలో నుండుటం జూచి యాభాష తాను జదివినదగుట నా పత్రిక విప్పి చూచిన నిట్లున్నది.
అనేక జీవహింసానిరతాత్మురాలగు మాచెల్లెలు లంబోదరికి మీయక్క కంకాళి యనేకాశీర్వచనములు. నేనిక్కడ శత్రుంజయుండను రాజును వంచనజేసి, యతని భార్యల నడవికిఁ ద్రోసి కన్నులం బెరికి వారి గ్రుడ్డుల నీయొద్ద కిదివరకే పంపితిని గదా? ఇంతవఱకును జరిగినకథ నీ వెఱిఁగినదే. మరియు నే నే యాటంకమును లేక రాత్రుల నిష్టము వచ్చినట్టు లేనుఁగులు మొదలగు జంతువులఁ జంపి తినుచుంటిని. గ్రుడ్డిరాజు ఆ సంగతి యేమియు గుఱుతెరుంగక యా హింసను గఱించి నన్నే యుపాయమడుగుచుండ నేను వానిని మోసము చేయుచుంటిని.
నాలుగు నెలల క్రిందట నీ వీరుఁ డీ యూరు జేరి యీ రాజునొద్ద నుద్యోగమునకుఁ గుదిరెను. వీఁడు రాత్రుల నద్భుతమైన గుఱ్ఱముపై నెక్కి గస్తుదిరుగుచు నా జంతువులఁ గాపాడుచున్నాడు. వీనిఁ బరిభవించుటకు నాకు సామర్థ్యములేదు. వీఁడు సాధారణుఁడు గాడు. సురాసురులైన వీని జయింపజాలరు. వీనికి మన భాషరాదు. ఈ యుత్తరమిచ్చి నీయొద్ద కనిపితిని. వీనిం బరిమార్చి నాకుఁ దెలియజేయుము. నీ యుత్తరమున కెదురుచూచుచున్నదాన.
కంకాళి వ్రాలు
అనియున్న యుత్తరము జదువుకొని మణిమంజరి గుండెమీఁదఁ జేయివైచుకొని ఆయ్యా ! యీ యుత్తరములో నేమి వ్రాసినదియు నెఱుఁగక యీ సుందరుఁడు రాక్షసియొద్ద కరుగుచున్నవాఁడు పాప మీతని కీభాష రానియట్లు స్పష్టమైనది. వీఁడు నా యొద్దకు రానిచో నిష్కారణముగా చచ్చునుగదా! దైవమే వీని కీ యుపకారము చేసేను. కానిమ్మని యా యుత్తరము దాచి మఱియు నిట్టు వ్రాసెదనని యాలోచించి నా చెల్లెలను దీవించి కంకాళి వ్రాయునది యేమంటే, ఇదివఱకు నేను నీ యొద్ద కంపిన కంటిగ్రుడ్డుల యుత్తరము మూలముగ నన్ని సంగతులు బోధపడినవి కదా!
ఇప్పుడు నాకత్యంతప్రాణమిత్రుడును పుత్రతుల్యుఁడగు రాజపుత్రుని నీయొద్ద కనిపితిని. వీనికి మన యింటనున్న వింతలన్నియుఁ జూపించి మనగుట్టంతయు నెరుఁగజెప్పుము. వీఁడు నిత్యము నాకుఁ జాలసహాయము చేయుచున్నాఁడు. వీఁడు సంతసించునటుల విందులుచేసి యంపవలయును. నీక్షేమ మరయుటకే వీని నీయొద్ద కనిపితిని. విశేషములు లేవు. కంకాళివ్రాలు అని యాజాణ దాని లిపి పోలికగానే వ్రాసినది.
అట్లు వ్రాసి యాయుత్తరము మునుపటి సంచిలోనే యమర్చి తెలియనట్లు అంటించి మరల నతని జేబులో వైచినది.
మునుపటి యుత్తరము తనయొద్దనే దాచియుంచెను. ఇంతలో నతనికి మెలకువ వచ్చినది. కన్నులు నులిమికొనుచు లేచి యతం డామెతో తరుణీ! నేను పండుకొని చాలాసేపైనది. లేపకపోతివేమి? పోవలసిన యగత్యమున్నదని నీతోఁ జెప్పలేదా? బాగుబాగని పలికిన యా కలికి నవ్వుచు నిట్లనియె. నాదా! యీవేళనే యరుగవలయునా! రేపు పోవచ్చును. మీ కార్యము తొందరయెట్టిదో నేనుగూడ వినియెదఁ గొంచెము దెలుపు డనవుఁడు సింహదమనుం డిట్లనియె
ప్రేయసీ! నా కథయంతయుం జెప్పుటకుఁ బెద్దతడవు పట్టును. క్రమ్మరవచ్చిన తరువాత నంతయుం జెప్పెద. నేను ద్వీపాంతరమున కరుగుచుంటిని. నాకు నేడుగురు తల్లులున్నారు. వారు సవతితల్లి మూలముగా నడవిలోఁ గన్నులుపోయి నిడుమలుబడుచున్నారు. మాతండ్రిపంపుననే నరుగుచుంటిని. నాకిచ్చట నిలువరాదని సంక్షేపముఁగా దనకథ చెప్పి యప్పడఁతికి నానవాలుగా నుంగరమొకటి యిచ్చి యెట్టకేలకు నామెచే ననిపించుకొని మరల నాగుఱ్ఱమెక్కి దక్షిణాముఖుండై యరిగెను. అట్లు చని చని, క్రమంబున నాకంకాళి చెప్పిన యానవాలు చొప్పున లవణసముద్రంబు దాటి శీఘ్రకాలమునే యాపర్వతశిఖరము చేరెను. అందున్న ఱాయి గురుతుపట్టి దానిపై నిలువఁబడి యగ్ని ప్రేల్చి చూర్ణము పొగవైచినతోడనే యారాయి పగిలి దారి యిచ్చినది. ఆ ద్వారముగుండ లోనికరిగిన విచిత్రభవన మొకటి కన్నులఁబడినది. అందనేక చిత్రవస్తువు లలకరింపఁబడి యున్నవి. మరియు ననేకమహారాజుల తలపుఱ్ఱెల మాలయొకటి గోడప్రక్కను వ్రేలఁగట్టబడి యున్నది. కంకాళి యీరీతినే పెక్కండ్ర రాజుల మోసముజేసి నలువది సంవత్సరములు కాగానే యతనిం జంపి యాపుఱ్ఱెఁ నామాలికలోఁ జేర్చుచుండును.
ఆతఁడు ఇంటిలోఁ బ్రవేశించినతోడనే మనుష్యవాసన గొట్టుటచేఁ బసికట్టి యారక్కసి మేల్కొని బ్రహ్మాండకరండంబు వగులనార్చుచు నతని మ్రింగరా నవ్వీరుండు జడియక కత్తి ఝళిపించుచు ముందుగ చేతనున్న యుత్తర మందిచ్చినంత బుచ్చుకొని యారక్కసి యది విప్పి జదువుకొని తటాలున నతనిం గౌఁగలించుకొని యిట్లనియె.
పట్టీ ! నీ వెవ్వరవో తెలియక నిన్నుఁ జంపఁ గమకించితిని. నిన్ను మాయక్క పెంచుకొని యెన్నిదినము లైనది? నీవు మా యక్కకుఁ జాల యుపకారములు జేసి నట్లు వ్రాసినది. నీ వాయుత్తరము నా కందియ్యనిచోఁ జంపుదును సుమీ! క్షమింప వేడెదను. ఈ మాట నాయక్కకుఁ దెలియపఱచకుము. నాయందుఁ గోపము జేయును. నీవు తనకు బెంపుడ పుత్రుఁడవనియుఁ మిగుల సహాయము చేయుచున్నావనియును, చాలమర్యాద చేయుమనియు వ్రాసినది. ఇటు రమ్ము. ఇందున్న వింతలన్నియుం జూపించెదఁ జూడుము. మన యింటిలోనున్న వింత లేలోకమునను లేవు. అనేక మహారాజులం జంపి తెచ్చిన పుఱ్ఱెలమాలిక అదే చూడుము. ఇప్పుడు మీ యమ్మ మాయలోఁబడిన శత్రుంజయుని తలయు నిందులోనే చేరును. అచ్చట మా యక్క సుఖముగానున్నదియా! ఆ మధ్య నెవ్వఁడో సింహదమనుండను వీరుని యవరోధము కొంచెము తనకుఁ గలిగెనని వ్రాసినది. వాని సంగతి యేమైనదో యెఱుంగుదువా ? మీ యమ్మగుట్టు తెలిసికొనలేక రాజు భార్యయే యని నమ్మియుండెనుగద అని యనేక ప్రకారముల గుట్టువదలి మాట్లాడుచున్న దానిమాటల చేతనే యథార్థమంతయు సింహదమనునకుఁ బోధపడినది.
అతండు దానిమాటల కనుకూలముగా నుత్తరము చెప్పుచు నంతరంగంబున నిట్లు వితర్కించెను. అన్నన్నా! నాతండ్రి యెంత మూఢుడో! కంకాళియను పేరుగల రాక్షసిని సుందరి యనుకొని యంతఃపురంబునఁ బెట్టుకొనియె. అదియేకాఁబోలును మాయజేసి నా తల్లులగ్రుడ్లు పీకించి యడవికిఁ ద్రోయించినది. రాత్రుల బయలుదేరి యేనుఁగుల దినుచున్నదియు నదియే. ఈ మాట నాకప్పుడే తెలిసినచో నా కత్తికి బలిఁగా జేయకపోదునా! నా బాధ కాగలేకయే యుత్తరమిచ్చి దీనియొద్ద కంపినది. ఉత్తరములో నన్ను జంపమనే వ్రాసి యుండునుగాని, మణిమంజరి చూచి యీ యుపకారము చేసినది. ఔనౌను! జ్ఞాపకము వచ్చినది. నిద్దురపరాకునఁ బరామర్శింపలేక పోతిని గాని యప్పుడెద్దియో యుత్తరము జదివినట్లు వ్రాసినట్టు కొంచెము కొంచెము జ్ఞాపకము వచ్చుచున్నది.
ఆహా! ఆ చిన్నది చేసిన మేలునకుఁ బరిమాణమున్నదా? దీని గుట్టంతయుఁ దెలిసికొని దీనిం బరిమార్చి వేగబోయి మణిమంజరిని గాఢాలింగనము జేసికొని దాని ఋణంబు తీర్చుకొనియెదనని పెక్కు తెరంగుల దలపోయుచు దానివెంట దిరుగుచు నా యింటనున్న వింతలన్నియుఁ జూచుచుఁ నిట్లనియె.
అమ్మా! నిన్ను మాయమ్మ చాలచాల నడుగమని చెప్పినది. దాని కేమియు లోపములేదు. రాజు దానికి లోఁబడియే యుండెను. సింహదమనుండను వాఁడు అ నడుమ రెండుదినములు గస్తు దిరిగెను. గాని వాఁడు వాని దేశమునకుఁ బోయెను. ఇప్పుడు వానిబాధ యేమియును లేదు. నాతో నీ పాతాళగృహము తెరగు దరుచు చెప్పుచుండ నేను వేడుకపడినంత యిచ్చట కంపినది. మనయిల్లు చూచినది మొదలు నాకు మిగుల సంతసముగా నున్నది. మరియు నాకుఁ దినుటకు మనుష్యభోజనపదార్థము లేమైనం గలవా! యని యడిగిన నది సంతసించుచు నొక మనుష్యుల భోజనపదార్థము లననేల. దేవతల భోజనపదార్థములు కూడనున్నవి. చూడుమని అనేక శాకములు, పచ్చడులు, పిండివంటలు మొదలగు రుచిగల పదార్థములు వండిపెట్టిన తృప్తిగా భుజించెను.
భుజించిన వెనుక దాని గుట్టంతయుఁ దెలిసికొనఁ దలంచి, అమ్మా! మన యింటిలోనున్న వింతలన్నియు నాకుఁ జూపవా? లేనిచో మాయమ్మ నన్నేమి చూచి వచ్చితివని యడిగిన నేనేమి చెప్పుదును; వేగలెమ్మని తొందరపెట్టిన నది యతని మీఁద మేడలోనికి దీసికొనిపోయి వత్సా! చూడు మవిగో రత్నరాసులు, ఇది కాంచనము, ఇవి నాణెములు, ఇవి నవధాన్యములు, ఇది చిత్రశాల, ఇందులోనున్న వింతలు ద్రిలోకములలో లేవు. రమ్ము చూడుమని యాశాల యందొక మూలనున్న పెట్టెలోనుండి తళుక్కున మెరయు కన్నుగ్రడ్డు లెత్తి యతనికిఁ జూపించుచు నివి యేవియో చెప్పుకొనమని యడిగిన నతండవి యానవాలు పట్టలేక నీవే చెప్పుమని పలికెను
అప్పుడది, అయ్యో! యివియే చెప్పుకొనలేక పోయితివేమి ? ఇవి రాజు భార్యల కంటిగ్రడ్డులు కావా! యిచ్చట నొక పొడిచల్లి దాచియుంచుటచే నింకను పచ్చగాయున్నవని చెప్పిన నతండు వెఱుఁగుపడుచు పిన్నమ్మా! యొకవేళ నీ గ్రుడ్డులు ఆ రాజు భార్య నేత్రముల కమర్చినచోఁ జక్కబడునా? యని యడిగిన నది నవ్వుచు నాయనా యట్టియవసర మేటికి వచ్చును? ఒకవేళ వచ్చినచోఁ దులసియాకు పసరుతోఁ గన్నుల నంటించినచో యధాప్రకారముగా నుండునని చెప్పెను. ఆ మాటలచే గొంత సంతసించుచు నాగ్రుడ్డులున్న పెట్టె గురుతుపట్టుకొని మరియున్న వింతలు జూచుచుండ రెండు పంజరములు గనంబడినవి. వాటిలోనున్న చిలుకను గోరింకను జూచి అమ్మా! ఇవి యెందులకిట్లున్న వని యడిగెను.
నాయనా! వీని పూర్వోత్తరము వినుము. ఈ చిలుకలో మీ యమ్మ ప్రాణములును. ఈ గోరింకలో నా ప్రాణంబులు నున్నవి. వీనికి భంగము వచ్చినప్పుడే గాని మఱియొకప్పుడు మాకు భయములేదు. ఈ రహస్యము నీవు మా కాప్తుడవు గావునఁ జెప్పితిని. మరియెవ్వరికినిఁ దెలియదు. అని చెప్పుచు వేరొక్క గదిలోనికిఁ దీసికొనిపోయినది. అందునొక శయ్యయందు పదియారేఁడు ప్రాయముగల చిన్నది యొకతె యున్నది. దానియాకారవిలాసంబులకు నాశ్చర్యమందుచు నతండు పిన్నమ్మా! ఇందొక బంగారుబొమ్మ యున్నది. దీని నెందులకై యుంచితివి? ఇది నిజముగా జిన్నదిలాగే యున్నది సుమా! యని యడిగిన వినియది నవ్వుచు కుర్రా! యది బొమ్మయనుకొంటివా? కాదు: నిజమైన చిన్నదియే. ఇది మిగుల చక్కదనముగలది కావున నట్లు కానంబడుచున్నది.
'పూర్వ మొకప్పుడు మీ యమ్మ దేశసంచారము చేయుచు నొక సంస్థానము మీఁదబఁడి దానినంతయు జనశూన్యముగాఁ జేయుచు నందుఁ దన కన్నులకు మిగుల ముద్దుగాఁ గనంబడిన యారేండ్ల ప్రాయముగల యీ చిన్నదానిం జంపక తన చిత్రశాలలో నుంచుకొనవచ్చునుగదా యని యూహించి తెచ్చి యందుఁ బెట్టినది. ఈచిన్నది యిప్పుడు ప్రాయము గలిగియున్నది: దీని సంరక్షణమంతయు నేనే కనుగొనుచుంటిని. దీనికి లోకవ్యవహారములును విద్యయు నేనే కొంత నేర్పితిని. ఇది మిగుల తెలివి గలది' అని దానికథ చెప్పినది. అతండు దాని నిజమైన వెలఁదిగా నెఱింగి సాభిప్రాయముగాఁ జూచి మూర్ఛ మునింగి యెట్టకేలకు లేచి అయ్యారే! యిట్టి మోహనాంగి నెందును గని విని యెఱుఁగ దీని మేనికాంతికిఁ గుందనము తళ్కుగూడ చాలదని చెప్పవచ్చును. దీని యవయవము లన్నియు మొలచినట్లే యున్నవి అని పెక్కు తెరంగుల వర్ణించుచు పిన్నమ్మా! దీనిమాట మాయమ్మ యొకసారి నాతో జెప్పినది. జ్ఞాపకము వచ్చినది. నాకుఁ బెండ్లి జేయుమని యడిగితిని. అప్పుడామె అబ్బాయీ! నీ కొఱకు చక్కనికన్యను బెంచుచుంటిని. దానిం బెండ్లి యాడవచ్చునని సమాధానము చెప్పినది. నేఁడు నా కన్నులు ధన్యత్వమొంద జూచితినని పలికిన నది వత్సా! అలాగునా? అట్లయిన యుక్తముగానే యుండును నీ కిష్టమున్న చెప్పుము. ఇప్పుడే మీ యిద్దరకుఁ బెండ్లి చేయుదుననిన, సింహదమనుండు సంతసించుచు, పిన్నమ్మా! యిందులకు మాయమ్మ యొప్పుకొనినదిగదా! నీవును సెలవిచ్చినచో నట్లే పెండ్లి యాడెదనని పలికెను.
అప్పుడది యాచిన్నదానితో పట్టీ! ఈ కుమారుని మాయక్క పెంచుకొనినది. వీనికిఁ నిన్నుఁ బెండ్లిజేయ నిష్టపడినది. నీ యదృష్టము మంచిది. ఇట్లీ విజన ప్రదేశ మందున్నను దగిన మగనిఁ బడసితివి. ఇందు మీ యిరువురు యథేష్టసుఖంబు లనుభవింపుఁడని పలికిన యా రాక్షసి భోజనము చేయుటకై మొదటఁజూచిన యింటిలోనికిఁ బోయినది.
పిమ్మట నమ్మగువయు, వానిఁజూచినది మొదలు సజాతీయవస్తుదర్శనసంతోషము జెంది యతనిం గామించినది. సింహదమనుని హృదయంబు ననురాగసూచకములగు విలోకములను త్రాళ్ళచే నాకర్షించెను. అప్పుడు సింహదమనుఁడు పైకొనిన తమకముతో దానిశయ్యం జేరి గాఢాలింగనముఁ జేసుకొని నాతీ! నీ పేరేమి ? ఈ పాతాళగేహంబున నొంటిగా వసించి నీ యవ్వనమంతయు నీఁట గలుపుచుంటి వేమని యడిగిన నప్పడఁతి వాని కిట్లనియె.
ఆర్యా! నా తల్లిదండ్రు లెవ్వరో నే నెఱుంగను. నన్ను బాల్యమందే యిచ్చటికిఁ దీసికొని వచ్చినదట. నాకు మోహినియను పేరు పెట్టినిదియు నిదియే. నేనింతకు మున్ను నిన్నుఁగాక మరియెవ్వరిని మగవారిని జూచియుండలేదు. లోకవ్యవహారము లన్నియు వినుటయే కాని యీ జన్మమం దొక్కటియుఁ జూడలేదు. కూపకూర్మమువలె నీ గుహాగేహంబున వసించియుంటి నాపూర్వజన్మమం దెచ్చటనో కొంచము సుకృతము చేసియుంటిని. లేనిచో మీ యట్టి మనోహరుండు మనోహరుఁడుగా దొరకునా యని పలుకుచు నతనికి సంతోషము గలుగఁ జేసినది.
సింహదమనుండును నెచ్చెలి కనుకూలమగు కేళీవిలాసంబులు వెలయింపుచు నింపుపుట్టించెను. ఇట్టయ్యిరువురు దమకంబుదీరఁ గొంత తడవు గ్రీడించి యలసి సొలసియున్న సమయంబున నమ్మోహిని వాని కిట్లనియె.
ఆర్యపుత్రా! నీవు రాజకుమారుండవు. కంకాళి రాక్షసస్త్రీ. అట్టిదానికి నీవు పుత్రుఁడవగుట యెట్లో తెలియకున్నది. నీ వృత్తాంతము విన వేడుకయగుచున్నది. చెప్పుమని యడిగిన నతండు తన్వీ ! నా వృత్తాంతమంతయుఁ నీకు బిమ్మటఁ జెపెదం గాని యొకటి వినుము. ఇది రాక్షసి. రాక్షసులకు మనుష్యులు ఆహారవస్తువులు గదా. అట్టివారికి మనయెడ మక్కువ స్థిరముగా నుండదు. యెప్పుడో యాకలి యైనతరి నిది మనలను భక్షించును. కావున ముందు దీనిం బరిమార్చిన మేలగును. దీని యాయువు యిందులోనున్న గోరింకపిట్టలో నున్నది దానిం జంపిన నిది చచ్చునఁట. అట్లుచేయుట నీ కిష్టమేనా యని యడిగిన నదియును బెంచిన మోహమునఁ గొంచెము సంశయించుచు మగనిబోధచే నెట్టకేలకు సమ్మతించినది.
తర్వాత నారాజకుమారుండు దానిజాడఁ జూచి మెల్లన నా పంజరమున్నచోటి కరిగి యాపంజరములోఁ జేయిపెట్టి యాపిట్టను పైకిఁదీసి యొక్క పెట్టున దాని గొంతును పట్టి నులిమి చంపెను. ఆ పిట్ట చచ్చినతోడనే వంటశాలయం దారాక్షసియు గిజగిజ తన్నుకొనుచుఁ బ్రాణములు వదలెను. అప్పుడు రాజకుమారుఁడు మిగుల వేడుక జెందుచు నాసుందరితోఁ దన వృత్తాంతమంతయుఁ దెలియజెప్పి బోఁటీ! ఇంకొక నిశాటిని యున్నది. అది మాతండ్రిని మోసము చేయుచున్నది. దానిపనిగూడఁ బట్టవలయును. అది నన్నే చంపఁదలఁచి యిచ్చటికిఁ బంపెనుగాని మణిమంజరియను చిన్నదానివలన నా కా యాపదదాటినది. దానితో వేగము గలిసికొనవలయును. మరియు నా తల్లులు నాకై వేచియుందురని పలికి యక్కలికితో నాగృహవిశేషంబు లన్నియుఁ బరిశీలించి యందు గొన్ని దినంబులు యధేష్టకామంబు లందుచుండెను.
సింహదమనుండు మోహినితో నాపాతాళగృహంబునఁ బూర్వవృత్తాంతము మరచి కొన్ని యేడులు రాత్రియుఁ బగలను వివక్షతలేక కేళీసౌఖ్యము లనుభవించెను. అక్కాలమంతయు నతని కొకసంవత్సరములాగైనను తోచలేదు. తల్లులను దండ్రిని మణిమంజరినిఁ దన దేశంబును మరచి యిష్టసుఖంబు లనుభవింపుచుండ నొక్కనాఁ డతఁ డెద్దియో కార్యంబునకుఁ దల్లుల కంటిగ్రుడ్డులున్న పెట్టె తెరచెను. వానింజూచి నంత పూర్వవృత్తాంతమంతయు నతనికి జ్ఞాపకమువచ్చినది. అప్పు డతఁడు మిగులఁ దన్ను నిందించుకొనుచు భార్యతో రమణీ ! నావంటి మూఢుం డెందును లేడు. తల్లులును దండ్రియు నచ్చట శత్రుబాధితులై చిక్కులుపడుచుండ నిచ్చట సుఖం బనుభవింపుచుంటి. ఆ రక్కసి మా తండ్రి నెన్నిచిక్కులు పెట్టుచున్నదియో! వేగఁ బోవలయునని చెప్పి యప్పుడ చిలుక పంజరమును, కనుగ్రుడ్డులున్న పెట్టెను మాత్రము గైకొని మోహినితోఁ గూడ గుహాముఖంబునకు వచ్చి యచ్చట పూర్వము దానెట్లు విడిచెనో యట్లేయున్న యా యద్భుతతురంగముపై భార్య నెక్కించి పంజరము పెట్టెయు గూడ దాని మూపుమీఁద నమర్చి మునుపట పొడి నిప్పులో వైచెను. అప్పు డచ్చటి రాయి పగిలి దారి యిచ్చినది.
పిమ్మట సింహదమనుండు తానుగూడ గుఱ్ఱమెక్కి జయపరమేశ్వరా! యను నంతలో నాగుఱ్ఱము దారింబడి వెడలి యతివేగముగా మున్ను వచ్చినట్లు నడుచుచుఁ దృటికాలము లవణసముద్రంబు దాటి యవ్వలియొడ్డు చేరెను. మోహిని భూలోక మెన్నఁడును జూడలేదు కావున నందుఁ జూచినదియెల్ల నాబిడకు వింతగానే దోచు చున్నది.
ఆమె వింతలు చూచుటకై గుఱ్ఱమును వేగముగా నడువనీయక మెల్లగా నడిపించుచుఁ జిన్న చిన్న మజీలు చేయించుచుండెను. ఇట్లు నడుచుచు నొకనాఁడు సాయంకాలమున నొకయడవిలో బసఁజేసిరి. రాత్రియొక చెట్టుక్రిందఁ బరుండి సింహదమనుండు భార్యతో నిష్టాలాపము లాడుకొనుచుండఁ బ్రాంతమున నొక సింహధ్వని వినంబడినది. దానికి దద్దరిల్లి యప్పల్లవాధరి వరునిఁ గౌగలించుకొనినను భయము తీరక మేనెల్ల వణకఁజొచ్చెను. అప్పుడు సింహదమనుండు భార్యకు ధైర్యముజెప్పుచు నామెను చెట్టుమ్రోల నిలఁబెట్టి కత్తి చేతంబూని గుఱ్ఱమెక్కి సింహధ్వని వినఁబడిన దిక్కు పరిశీలింపుచుండ నాదండనుండి యొకసింహము మొగంబు దెరచికొని తోకఁ యాడింపుచు నా చెట్టుమ్రోల కేతెంచు నంతలో సింహదమనుండు వెరువక యతిసాహసముతో గుఱ్ఱమును దానిమీఁదికి ద్రోలెను. అప్పుడా సింగము బెదరి వెన్నిచ్చి పరవఁజొచ్చెను. విడువక సింహదమనుండు దాని వెంటఁబడి తరుముచుండెను. ఈ రీతి నతిరయముగా సింహమును, సింహము వెనుక సింహదమనుండును పరుగిడు చుండ నడుమ ననేకవృక్షలతాగుల్మాదులు నుగ్గయిపోయినవి.
అట్లేకవిధముగాఁ దెల్లవారువరకుఁ బరుగెత్తెను. ఎంతదూరము వచ్చెనో చెప్పుటకు వీలులేదు. తెల్లవారినంత నాసింహము సింహదమనునికిఁ గనబడినదికాదు. దానికతండు వెరఁగుపడుచు నయ్యయ్యో! యీ సింగమెందేగెనోకదా? నా వచ్చిన పయనంబంతయు వృధయైనదే. దీనింజంపక మగుడనని ప్రతిజ్ఞ జేసితిని. యూరక మరలిపోయినచో మోహిని పరిహాసము చేయునేమో? ఇదియునుం గాక నా వాల్గంటి నొంటిగా నట్టడవిలో విడిచివచ్చితిని. అది నాకై యెంత పరితపించుచుండెనోగదా! యేమి మోసమువచ్చునో! యేమృగమైనను భక్షించునేమో! యెంత తెలివితక్కువాఁడ నైతిని. అప్పటి తొందరచే దానిమాట నిదానించనైతినే యని పరిపరిగతులఁ జింతించుచుఁ గడువేగముగా నాబిడయున్న తావు జేరఁదలఁచి రెండుమూఁడు క్రోశములు నడిపించిన నంతలో ప్రాంతమున నొకపట్టణము గనంబడినది.
అప్పుడు సూర్యోదయ సమయమైనది. దారి స్పష్టముగాఁ గనంబడుచున్నది. తానున్న దారి యాపట్టణ నడుమనుండియే పోయెను. దానింబడి వేగముగాఁ బోవుచుండ నాయూరి బయట పెద్ద కాలువ యడ్డము వచ్చినది. యతని గుఱ్ఱము కాకాలువ యొకలెక్కా! సులభముగా దానిందాటిన అతని గుఱ్ఱము గమన విశేషమునకు వెరఁ గందుచు నచ్చటఁ గాపున్న రాజభటులు వేగమేవచ్చి యా గుఱ్ఱమును కడ్డము నిలిచి యతనితో గుఱ్ఱము దిగుమని పలికిరి. అంతమాత్రమున కతండు జడియక నాకు గుఱ్ఱము దిగవలసిన యగత్యమేమో చెప్పుఁడని యడిగిన వారతని కిట్లనిరి.
అయ్యా! మా రాజశాసనమును జిత్తగింపుఁడు. ఈ కాలువ దిగక యెవఁడు దాటునో వాని నాయొద్దకుఁ దీసికొనిరండని నియమించెను. అట్లు నియమించుట యేమిటికో మాకుఁ దెలియదు. మీరు దీనిం దిగక గుర్రముతోడనే దాటిరి. రాజదర్శనమునకుఁ బోదమని రాజాజ్ఞను జూపించిన నతండేమియు ననలేక యెవ్వరికైనను రాజశాసన మనతిక్రమణీయముగదాయని తలంచి వారితోఁగూడ రాజుగారి దివాణమున కరిగెను.
ఆ వార్త వినినతోడనే యారాజు సింహదమనుని కెదురువచ్చి యుచితమర్యాదలతోఁ దీసికొనిపోయి యర్ధసింహాసనమునఁ గూర్చుండబెట్టుకొని యెల్ల బందువులను బౌరులను మంత్రులను రప్పించి వారెల్లరు విన నతని కులదేశనామంబులడిగి తెలిసికొని మిగుల సంతసించుచు నిట్లనియె.
ఆర్యా! నా పేరు ప్రతాపరుద్రుఁడు. నాకు బుత్రసంతానము లేదు. చిరకాలమునకు గాంచనమాలయను పుత్రిక జనించినది. అది రూపంబునను గుణంబులను మిగులఁ బొగడదగియున్నది. వెదకి వెదకి దానికిఁ దగినఁమగనిఁ గూర్పలేక విసిగి సాధారణుని కీయ నిష్టపడక యట్టిశపథము చేసితి. ఎవ్వడు మా యూరి బయటనున్న కాలువను దిగక దాటునో వానికిఁ గాంచనమాలను రాజ్యముతోగూడ నిత్తునని మనంబున నియమించుకొంటని. నాఁడు మొదలు నేఁటివరకు దీనిం దాటినవాఁ డెవండు లేఁడు. తుదకిట్టి శపథం బేటికిఁ బట్టితినని పశ్చాత్తాపమందుచుంటివి. నేఁడు నాభాగ్యవశంబున నీవు నా ప్రతిజ్ఞాభంగము గాకుండాఁ గాలువందాటితివి. నీకు నాపట్టిని రాజ్యంబుతో నిచ్చి వేసెదను. గైకొనుమనుటయు నతండు సంతసించి యంగీకరిం చెను. సిరిరా మోకాలొడ్డువాఁడుఁగలడా? పిమ్మట నారాజు శుభముహూర్తంబున నధికవైభవముతోఁ గాంచనమాలను సింహదమనునికిచ్చి బెండ్లిచేసి వెంటనే రాజ్యమునకుఁ గూడ నధీశ్వరునిగాఁ జేసెను.
సింహదమనుండా దేశమున కదీశ్వరుండై న్యాయంబునఁ బ్రజలఁ బాలింపుచుఁ గాంచనమాలతోఁగూడ యధేష్టకామసుఖంబు లనుభవించుచు నతనికిఁ బూర్వస్మృతి యేమియులేక మోహినిం గాని మణిమంజరినిగాని తల్లిదండ్రులఁగాని యొకనాఁడైన స్మరింపఁడయ్యె. ధనమదులకు వెనుకటి చింత యుండదను నార్యోక్తి తప్పునా?
మోహిని కథ
గోపా! యాకథ యటుండనిమ్ము! అచటఁ జెట్టుక్రిందఁ దన మగండట్లు సింహమును తరుముకొని పోయిన వెనుక మోహిని తెల్లవారువరకు మరల నతండు వచ్చునేమోయను నాసచే నొంటిప్రాణముతో నిలిచి నలుదెసలు పరికించి చూచుచుండెను. తెల్లవారినను నతని జాడయేమియు లేదు. అప్పుడప్పఁతి గుండెపగుల నిటునటు తిరుగుచు నతఁడు పోయిన త్రోవంబట్టి కొంతదూరము పోయియు నతండొకవేళ నాచెట్టు క్రిందకువచ్చి తన్ను వెదకుచుండు నేమోయని మరల నాచెట్టు మొదలుచేరి యతనిం గానక పెద్ద యెలుంగున నోసింహదమనా! యోమనోహరా! యని యరచియు నెందును బ్రతిధ్వనిఁగానక గుండెలు బాదుకొనుచు దైవమును దూరుచుఁ దన్నుదాన నిందించుకొనుచు నరచేతఁ బ్రాణంబులు పెట్టుకొని యమ్మహారణ్యములోఁ గొంత తడవు దిరుగఁజొచ్చినది.
అప్పుడొక మూలనుండి యాయెలుంగు విని కొందరు దొంగలువచ్చి యమ్మోహనిం బట్టుకొని యొడలినున్న వస్తువులన్నియుఁ దోచుకొనియు విడువక కట్టి వైచి తమ రారాధించు నొక యమ్మవారికి బలియియ్యఁదలచి చయ్యన నచ్చటికిఁ దీసికొనిపోయిరి. అప్పుడామె గుండె రాయి చేసికొని యట్టిమగఁడే పోయినప్పుడు మరణం బెక్కుఁడా యని తెగించి నిర్భయముగా వారివెంట కటికచీకటిలో నమ్మవారి యాలయమున కరిగెను. ఆ దొంగలా యంగననట్లు అమ్మవారి గుడికిం దీసికొనిపోయి ముందు కానుకలిచ్చి యావెలఁదిని బలి యియ్యఁబోవు సమయమున వారిలో నొకఁడు తక్కినవారి కిట్లనియె.
ఓరీ ! తమ్ములారా! ఈ నారీమణి మిగుల నందకత్తెలాగున నగుపడుచున్నది. దీని నిష్కారణమేల చంపెదరు. నావంతు వచ్చిన సొమ్ము మీకు వదలివేసెదను. దీని నాకు భార్యగా నీయుఁడని యడిగెను. ఆ మాటవిని మరియొకండు అన్నా! నీవేనా? కాముకుఁడవు. నాకు మాత్రము మంచి యందముగల దానియందు వలపు గలుగదనుకొంటివా? హాయిగా దీనిం గౌఁగిట జేర్చువానికి దేవేంద్రుడై నను సాటి వచ్చునా! నీవు నీవంతు ధనం బిత్తువుగాని దీని నాకు భార్యగాఁ జేసిరేని నా పాలుకు వచ్చిన ధనమున కిబ్బడిగా నిత్తునని పలికెను. ఆ యిరువురి మాటలను విని వేరొక్కఁడు ఓహోహో! మీరేనా భాగ్యవంతులు! మీసాటి వలపును సొమ్మును గలవారు వీరిలో నెవ్వరుగలరు? అమ్మవారికి బలి యియ్య పేరుపెట్టిరి గాన నూరుకొంటిని గాని యీయూహ నాకు మొదటనే పుట్టినది. దీనినే నాకు భార్యగాఁ జేసినచో మీ వంతునకు వచ్చిన ధనము నిత్తుమని పలికిరిగాని నేను మీ యందరకు నెలకు నూరుమాడలవడుపున యావజ్జీవము వేతనము నిత్తునని పలికెను.
ఈ రీతి నందరకును గ్రమంబుగఁ గామవృత్తులు మనంబుల నంకురించినవి. అమ్మించుబోణి తమకే కావలయునని యెల్లరును గోరి కలహము పెంచుకొని కత్తులం దీసి కోపముతోఁ బెద్దతడవుపోరి తుదకు నొకరిచేత నొకరు చంపబడిరి. ఆహా! పూర్వము విష్ణుండు జగన్మోహినియై రాక్షసులనెల్లఁ బరిమార్చినట్లు ఆ మోహనియు దొంగల భంగపెట్టెను. ముచ్చులందరు నట్లుచచ్చిన వెనుక యచ్చేడియ విధిచేష్టకు నాశ్చర్యపడుచు నయ్యయ్యో! దైవము నన్నింక నెన్నిబాదలు పెట్టుటకోగదా చావనియ్యలేదని శరకంపము చేయుచు నా గుడిలో నమ్మవారిని ధ్యానింపుచుండ నింతలో నా హృదయాంధకారంబుతోఁ గూడ దిక్కులు చీఁకటివాసి తెల్లవారెను. అప్పుడు ప్రాంతమందుఁ బ్రజల కోలహలధ్వని వినంబడిన నది యొక పట్టణప్రాంత మనియు నూరిలోనికిఁ బోవచ్చుననియుఁ గొంతదైర్యముగా నుండెను. ఇంతలో నా యమ్మవారి పూజారి గుడికివచ్చి యందు రతీదేవియుం బోలెఁ బ్రకాశించుచున్న యాచిన్నదానిం జూచి యద్భుతపడుచు అమ్మా! నీ వెవ్వరిదాన వీగుడిలోనికేమిటికి వచ్చితివని యడిగిన నప్పడఁతి యిట్లనియె.
అయ్యా! నా కెవ్వరును దిక్కులేరు. నాభర్త యీయరణ్యములో నన్ను విడచి మృగమును హింసింసనరిగి తిరుగా రాలేదు. మృగముచేత హింసింపఁబడెనేమో తెలియదు. నన్ను దొంగలు పట్టుకొని యాభరణములన్నియుఁ దీసికొనిపోయి తుదకు నా మూలముగనే యొకరినొకరు కొట్టుకొని మృతిఁజెందిరి. అదిగో! వారి కళేబరము లందున్నవి. చూడుము. నీ మొగముచూడ మంచివాఁడవులె నుంటివి. మీ యింటఁ గొన్నిదినంబు లుండెదఁ గాపాడదవే యని యడిగిన నతండు తల్లీ! నీ కేమియు భయములేదు. మాయింటఁబెట్టుకొని పుత్రికవలె జూచుకొనియెద రమ్ము. నీ భర్తను బొందఁగలవని యోదార్చుచు నప్పుడతిని యింటికిఁ దీసికొనిపోయెను. అతని భార్య మిగుల గయ్యాళి. ఆ యిల్లాలిం జూచి కోపముతో నీ పడుచు నెచ్చటినుంచి తెచ్చితివి? ఇది యెవ్వతెయని యడిగిన దానికతం డిట్లనియె. ఓసీ ! ఇదియొక రాజకుమార్తె. పాపము కారణాంతరమున బంధువులతో విడిపోయినదఁట. అమ్మవారి గుడిలో చేరినది. కొన్ని దినములు మనయింట నుండును. దీని మర్యాదగాఁ జూడమనుటయు నక్కులట పండ్లు పటపట గొఱుకుచు నీ యాశయము నే నెఱుంగుదును. ఇది చక్కనిది గదాయని జేర్చి నే నేమైన నందునని యిట్లనుచుంటివి. నాకన్న యిది యందము గలదియా? అదియునుఁగాక చెడిపోయినట్లు కనుపించుచున్నది. ఇంతకుపూర్వ మెందర నుంచుకొని విడిచినదో. ఇట్టిది మనయింట నుంచినచో మనకుఁగూడ నల్లరివచ్చును. చాలు చాలు మరియొక యింటికిఁ దీసికొనిపొమ్ము. ఊరిలో విటపురుషులు పెక్కండ్రు గలరని పలికిన నా మాటలాలించి యమ్మోహిని చెవులు మూసికొని శివ శివా ! ఏమయ్యా! యీమె యిట్లనుచున్నది? నీవు నన్నట్టి యుద్దేశముతో దెచ్చితివా యని యడిగిన నతం డిట్లనియె.
తల్లీ ! నీ యుల్లంబున నట్లెన్నఁడును తలంపకుము. నీవు నాకుఁ గూతురవు. ఈ నిర్భాగ్యురాలి కేమి తెలియును. అది యెప్పుడును మర్యాద తెలియక యట్లే కూయుచుండును. దాని సంబంధము నీ కేమియు లేదు. నీయిష్టము వచ్చినట్లు సంచరింపుమని పలికి పెండ్లామును తిట్టి యమ్మోహినిని సగౌరవముగాఁ దన యింటబెట్టుకొని కాపాడుచుండెను. మోహిని యర్చకుని యింట నున్నప్పుడు తనకుఁ దగిన కృత్యంబులు చేయుచు సంతతము తన భర్తను గురించి చింతించుచు, నితర ధ్యానము లేక కాలక్షేపము చేయుచుండెను.
ఆ పూజారి భార్య నొకకంసాలితోను కోమటితోను సాంగత్యము గలిగి యున్నది. నిత్యము రాత్రులయందు వారిరువురు నొకరు విడిచి యొకరు వచ్చుచుందురు. ఈరీతిఁ బెక్కుదినములనుండి జరుగుచున్నను నాపూజారి గుర్తెఱుఁగడు. ఒక్కనాఁడు రాత్రి మోహిని యెద్దియోపనికి వాకిటికి వచ్చెను. అప్పుడు కంసాలి గోడప్రక్కను పొంచియుండెను. అది చూచి మోహిని భయపడి దొంగ దొంగ యని యరచెను. ఆ ధ్వని విని పూజారి దీపము తీసికొనివచ్చెను.
వానికిఁ దప్పించుకొనిపోవ వేరదారి లేమింజేసి యాపూజారి ముందరినుండియే పారిపోయెను. ఆ పూజారి దీపము వెలుగున వాని నానవాలు పట్టి వాఁడు దొంగతనము చేయువాఁడు కాఁడనియు జారత్వమునకే వచ్చెననియు ననుమానపడి నాఁటినుండియు భార్య నితరమిషలచే దండింపఁ దొడంగెను. ఆయదలిం పాకులట గ్రహించి మోహిని మూలముగఁ దనగుట్టు బయలయ్యెనని యామెంజంపఁ ప్రయత్నించుచుండెను. ఆ పూజారి భార్య యొకనాఁ డెట్లో విషచూర్ణము సంపాదించి కొంత మిఠాయి చేసికొని, యుండలలో నావిషచూర్ణము కలిపెను. మంచియుండలును, విషము గలిపిన యుండలను గురుతుగా నొక పెట్టెమీఁద బెట్టెను.
ఆ రాత్రి పూర్వమువలె గంసాలివచ్చి దాని మంచముక్రింద దాగియుండెను. నాఁటిరాత్రి ప్రొద్దుపోవువరకు పూజారి నిదురపోలేదు. ఆ జారిణి తన విటుని యునికి బయలుపడునని దీపమార్పినది. అపుడు అర్చకుఁడు నిద్రపట్టక భార్యతో దీపమారిపోయినది. లేచి వెలిగింపుము నాకు నీ విందాక చేసిన మిఠాయి కొంచెము పెట్టుము అని యడిగెను. అ మాటలు విని యది యిటునటు దిరిగి దీపము వెలిగించు సాధన మెక్కడనున్నదో తెలియలేదని చెప్పుచు మందసము మీదనున్న మిఠాయి యుండలఁ కొన్ని తెచ్చి మగని కిచ్చినది.
అందులో రెండు మిఠాయియుండలను మంచముక్రింద దాగియున్న యుపపతికి నందిచ్చినది. అది పెట్టిమీఁదనుండి మిఠాయి తీసికొనివచ్చునపుడు చీకటిలో నానవాలు పట్టలేక విషము గలిపిన యుండ యొకటి వానితో దీసికొనివచ్చెను. ఆ యుండయే యెఱుంగక యుపపతి కిచ్చుటచే నది తిని కొంచెములోనే వాఁడు మృతినొందెను. తానొకటి తలఁప దైవమొకటి తలంచునను సామెత తప్పునా? ఆ లంజ మగనికి నిద్రపట్టిన వెనుక మంచముక్రింద జేయిపెట్టి యతని పైకి రమ్మని సంజ్ఞ చేసెను. అతండు దానికి మరల నుత్తరము చెప్పలేదు. అపుడు వానికి నిద్రపట్టిన దనుకొని గట్టిగా లేపినది కాదు. తెల్లవారుజామున నర్చకుఁడు యథాప్రకారము గుడియొద్దకు బోయెను. తర్వాత నా రంకులాడి దీపము వెలిగించి యా కంసాలిని లేపెనుగాని యేమియుఁ బ్రయోజనము లేకపోయెను. వాఁడు చచ్చెనని గ్రహించి చీకటిలో విష ముంచిన మిఠాయియుండ యతని కిడితిఁ గాబోలునని పశ్చాత్తాపతప్తయై గుండెలు బాదుకొనుచు వాఁడు చచ్చిన శోక మొకటియేగాక యుదయంబున రాజభటులు జూచిఁ దన్ను శిక్షింతురను వెరపు మనంబునఁ బాధింపుచుండఁ బెక్కు తెరంగులఁ జింతించు చుండెను. ఇంతలో దెల్లవారునప్పుడు వచ్చు వైశ్యకుమారుఁడు గోడదుమికి లోపలకు వచ్చెను. వానిం జూచి యా రహస్యము వానితోజెప్పి యెట్లయిన నీ ముప్పు దాటింపు మని వేడుకొనెను . ఆ కోమటి యట్టిమాట వినినతోడనే గడగడ వడఁకుచు అయ్యో బాబు! నాకు గుండెలు కొట్టుకొనుచున్నవి. ఏమియుం దోచకున్నది. రాజభటులు జూచినచో నిన్నును నన్నునుగూడఁ దీసికొనిపోయి చెరసాలఁ బెట్టుదురు. నీ పాదములకు మ్రొక్కెదను నన్నేలాగుననైన మా యిల్లు చేర్చుము. సొమ్మేమైన గావలసినచో నిచ్చెదను. ఇందునిలువ నాకు భయమగుచున్నదని పిరికితనముగాఁ బలికిన నది వాని కిట్లయెను.
ఓయీ! నీవు వెరువకుము. దీని గురించి నీ కేమియు మాట రానియ్యను. మా యింటనున్న మోహినిమీదఁ నీ నేరమంతయుఁ ద్రోసివేసి దానిని శిక్షింపఁజేసెదను. ఈ శవమును మనము మోసుకొనిపోయి దానియింటఁ బెట్టుదము రమ్మని పలికిన యతండు కాలవైపు తాను తలయంపినిబట్టి యాశవమును మోసుకొనిపోయి మోహిని పరుండియున్న గదిలో మంచముక్రింద మెల్లగావైచి యామె లేవకుండునట్లు తలుపులు వేచి యరిగిరి. ఆ కోమటి యింటికరిగియు నుదయంబునఁ దనమీఁద నేమి పడునో యను వెరపుతోనుండెను. అంతట నా చెడిపె యుదయంబున లేచి పాఁచిచేయుచు మోహినీ! లెమ్ము లెమ్ము. తెల్లవారిన మాటయే యెరుంగకుంటివి. ఇంతయలపునకు రాత్రి యేమి చేసితివని లేపిన నులికిపడి యక్కలికి లేచినది. లేచినతోడనే మెత్తగా నామె కాలికి శవము తగిలినది. దానికి బెదరి యమ్మదవతి అయ్యో! యిచ్చటనెవ్వరో యుండిరని యరచెను.
అప్పుడా పూజారి భార్య తలుపులు తెఱచిజూచి మోహినీ! కంసాలి యిచ్చటఁ బరుండి యున్నా డేమి? యని యడిగెను. ఆ మోహిని దానితో అమ్మా! యీతండిచ్చటి కెట్లు వచ్చెనో నే నెరుఁగనని చెప్పెను. అప్పుడా టక్కులాడి ముక్కుమీఁద వ్రేలు వైచుకొని భళిభళీ! యెంతదానివె ఇదియా, నీ గుణము తెలిసినది. వీనిఁ బెట్టుకొని యుంటివా? తెల్లవారినది లేపి వాని నింటి కంపుము. అని పలుకుచు బిమ్మట వాఁడు చచ్చియుండెనని యప్పుడే దెలిసిన ట్లభినయించుచు గుండెమీఁద జేయివైచుకొని అమ్మయ్యో! యేమి జరిగినదో జూచితివా? వీడిప్పుడు చచ్చియున్నాడు. యేమియు నెరుంగని దానివలె నట్లు తెల్లబోయెద మేమిటికి? యథార్థము చెప్పుము. నీ కతంబున మాకుగూడ మాట రాగలదు. నీ కులగోత్రములు తెలిసికొనక నింట బెట్టుకొనినందులకు నామగని కీపాటి శాస్తి కావలసినదే యని యనేక ప్రకారములుగా నా పతివ్రతను నిందించుచు వీధిబడి యో పెద్దమనుష్యులారా! యో రాజభటులారా! యిటురండు. మా యింటనున్న తొత్తు నరహత్య చేసినదని యరచిన విని రాజభటు లా యిల్లు చొరబడి కంసాలి శవమును, రెండవశవమువలెఁ గదలక ద్యానించుచున్న మోహినిం జూచిరి.
అప్పుడా రాజభటులు పూజారి భార్యం జూచి యా చిన్నది యెవ్వతె? మీయింటి కెట్లు వచ్చినదో చెప్పమని యడిగిరి అది పేరెలుంగునవారితో నిట్లని చెప్పదొడంగెను. అయ్యా! కొన్నినెలల క్రిందట నా మగఁడు ఈ లంజనుదెచ్చి యింటఁబెట్టెను. దీని వైఖరియంతయుం జూచి యప్పుడే వలదని చెప్పితిని. నామాట బాటిసేయకుండుట చేతనే యీరొష్టు తగిలినది. ఇది వచ్చినది మొదలు దీని యందమును వలచికాఁబోలు విటపురుషులు మా యింటిచుట్టు తిరుగుచుండిరి. ఈ కంసాలియుఁ దరుచు వచ్చుచుండెడివాఁడు. నాకేల యని యుపేక్షగా నూరకుంటిని. నిన్న రాత్రి యేమి హేతువు చేతనో వీనిం జంపినది. ఆ రహస్యము నాకుఁ దెలియక పూర్వమువలెఁ దెల్లవారుజామున లేవమి సందియ మందుచుఁ దలుపు చెంతకుబోయి లేపితిని. అప్పుడును లేచినది కాదు. పిమ్మట దలుపు దెరచిచూడ నిందీ శవము గనంబడినది. నేను భయపడి యిత డెవ్వఁడు యిట్లేల చచ్చియున్నాడని యెంత యడిగినను బెల్లముగొట్టిన రాయివలె మాట్లాడినదికాదు. అప్పుడు యీ నేరము మా యింట జరిగినది. కావున వెరపుజెంది వీధిఁబడి మిమ్ములను బిలిచితిని. ఇదియే నే నెఱిఁగిన కథ యని యా బోంకరి వారితో జెప్పినది.
పిమ్మట వారు మోహినిం జూచి దీనికి నీవేమి చెప్పెదవని యడిగిరి. అప్పుడా సాధ్వి మనంబున నది చేసిన కల్పనకు వెరగుజెందుచు దైవము తనకు మరలఁ దెచ్చిన చిక్కుల గురించి చింతించుచు నెట్లయినను జావఁనెంచియున్నది గావున వారికేమియు నుత్తరమియ్యక నేరము చేసినట్లే యొప్పుకొనుదానివలెఁ దలవంచి యూరకుండెను. అప్పుడా రాజభటులు ఆమెను నేరము చేసినదానిగా నిశ్చయించి సంకెళ్ళువైచి బందీ గృహంబునకుఁ దీసికొనిపోయిరి. వైద్యులా శవమును గోసి పరీక్షించి విషప్రయోగము మూలముగాఁ జచ్చినట్లు తెలియఁజేసిరి. అప్పుడు రక్షకపురుషులు పూజారి భార్యను సాక్ష్యము చెప్పుటకు నిశ్చయించి యానేరము న్యాయాధిపతి యొద్దఁ బెట్టిరి. ఆ న్యాయాధిపతి యంత బుద్ధిమంతుఁడు కాఁడు. ఆ సాక్ష్యమంతయు విచారించి ఆమె మాట్లాడకపోవుటయే నేరము చేయుటకు నిదర్శనమని నిశ్చయించి యా చిన్నదానికి నురిశిక్షకు నుత్తరమిమ్మని యప్పుడు రాజుగానున్న యజ్ఞదత్తునికి వ్రాసికొనెను.
గోపా! పూర్వము సింహదమనుండు ద్వీపాంతరమున కరుగుచు మేడమీఁద గొలువున్న మణిమంజరియను రాజపుత్రికతో నొకరాత్రి గ్రీడించి యేగిన వార్త నీవు వినియేయుంటివి. ఆ మణిమంజరి గర్భము ధరించినది. ఆ రహస్య మామె తండ్రి దాసీముఖంబుగాఁ దెలిసికొని గూఁతురుపై గోపముసేయక పండితులఁ బిలిపించి యా వృత్తాంతము వారికిఁజెప్పి మణిమంజరి దోషురాలా? యని యడిగెను.
అప్పుడు పండితులు విమర్శించి శకుంతల మొదలగు రాజస్త్రీలఁ గొందరఁ దృష్టాంతముఁజూపి గాంధర్వవివాహంబున స్వతంత్రముగాఁ బతిని స్వీకరించుట రాజపుత్రికలకు ధర్మమేయగుట నిర్దోషురాలే యని చెప్పిరి. పిమ్మట రాజు సంతసించుచు నుత్సవములు పెక్కు చేయించెను. ఆ మణిమంజరికి శుభలగ్నంబునఁ బుత్రుఁడు జనించెను. వానికి యజ్ఞదత్తుఁడను పేరుపెట్టిరి. ఆ కుమారుండు ఆకారంబునను, గుణంబులను, బరాక్రమంబునను, బుద్ధికౌశల్యంబునను, సింహదమనుని బోలియుండెను. పదియారేఁడులు వచ్చినతోడనే యారాజు దౌహిత్త్రుడైన యజ్ఞదత్తునికిఁ బట్టాభిషేకముజేసి తపోవనంబున కరిగెను . యజ్ఞదత్తుండును తల్లివలన దనతండ్రి వృత్తాంతమంతయు విని యా లోపమునకై పెక్కు తెరంగులఁ జింతింపుచుండెను.
అందు రాజ్యము సేయుచున్న యా యజ్ఞదత్తుడుఁ న్యాయాధిపతి వ్రాసిన జాబునుజూచి తాను సింహాసనమెక్కి కొలఁదికాలమెయయ్యెను. మొదటనే యొక యాఁడుదానికి నురిదీయ నాజ్ఞయిచ్చుటకు శంకించి యానేరమును గుఱించి జరిగిన గ్రంథమంతయుఁ దనయొద్దకుఁ బంపుమనియుఁ దానే వివారించి శిక్ష విధింతుననియు న్యాయాధిపతికి వ్రాసి యా గ్రంథమంతయుఁ దన చెంతకుఁ దెప్పించుకొనెను. విచారణ దివసంబున యజ్ఞదత్తుఁడు విద్వాంసులును, మంత్రులును, సామంతులును, పౌరులును, బెక్కండ్రు సభనలంకరింపఁ బెద్దకొలువుదీర్చి యచ్చటికి మోహినిం బిలిపించి పూజారి భార్యవలన మరల సాక్ష్యమును బుచ్చుకొని యాసాక్ష్యము మూలముగానే మోహిని నేరము చేయనట్లు దృఢపరచెను. సాధారణముగా జారిణికి నుపపతియందున్న మక్కువ యెవ్వరియందును నుండదనియు, నట్టి ప్రేమాస్పదుని విషముపెట్టి యేటికి జంపుననియు మౌనమవలంబించి యుండుటయే నేరము స్థాపించుటకు నాధారమగుచున్నదని వ్రాసిన న్యాయాధిపతి యభిప్రాయము తప్పని స్థిరపరచి సూక్ష్మబుద్ధియైన యజ్ఞదత్తుఁడు మోహిని నిరపరాధిని యని నిశ్చయించి యామెతో నిట్లనియె.
అమ్మా! నీ విట్లు మౌన మవలంబించి యుండుటచే నీమీదను నేరమే స్థాపింపఁబడుచున్నది. నీ మొగంబు జూడ నపరాధము జేసినట్లు గనంబడదు. నీ వెద్దియో యాపదజెంది ప్రాణత్యాగమునకై తెగించి మాట్లాడకుంటివి. నీ విరాగ మల్పమతులు తెలిసికొనలేక నీ వీ నేరము చేసినదానివే యని నిందింపుచున్నారు. లోకాపవాదము బాపకారణమే యని పెద్దలు జెప్పుదురు. ఊరక నీవట్టి యపవాదము బొందనేటికి? యథార్థముచెప్పి యీనింద బాపుకొనుమని పలికిన నామోహిని యతని చల్లనిమాటలచేఁ దన హృదయసంతాపము కొంత తొలంగ నొక్కింత తలయెత్తి యతని కిట్లనియె.
దేవా! అష్టదిక్పతుల యంశమువలనఁగదా రాజు జనించును. అట్టి దేవతాసంభూతులగు మీరు యెఱుఁగనిది గలదా? నేనీ నేరము చేయలేదని చెప్పినలాభమేమి? నన్ను నాపత్సముద్రంబున ముంపఁదలంచిన దైవసంకల్పమును నేను మార్పఁగలనా? ప్రయాసపడి యపరాధము తప్పించుకొని బ్రతికినను సార్దక మేమున్నది? కావున నా వృత్తాంతముతో మీకేమియు నిమిత్తములేదు. నాకు వేగమ యురికి యాజ్ఞ యిప్పింపుఁ డని వేడుకొనెను.
ఆ మాటలచే యజ్ఞదత్తునికి నా మెయందు మరియు నక్కటిము దొడమినది, తదీయ వేతృత్వమున కచ్చెరువందుచు మరలనిట్లనియె. అమ్మా ! యథార్థము చెప్పినచో నీకేమి లోపమున్నది. అన్యాయముగ నిన్ను నురిదీయ నాజ్ఞాపించుటకు నేనంత దుర్మార్గుఁడననుకొంటివా? నన్నుఁ బుత్రునిగా దలంచి నీవృత్తాంత మెఱింగింపుమని వినయ పూర్వకముగాఁ బ్రార్థించిన నతిని మాటలఁ ద్రోసివేయలేక మెల్లన నిట్లనియె.
అయ్యా! మీరిట్లు సారెకు నన్నడుగుచుండ జెప్పకునికి మూర్ఖతగా నుండును. వినుండు నా పేరు మోహిని. నన్ను బాల్యంబునచే యొకబ్రహ్మరాక్షసి యెత్తుకొని పోయి ద్వీపాంతరమందున్న పాతాళగృహములోఁ బెట్టి పోషింపుచుండెను. అచ్చటికి, గొంతకాలము క్రిందట సింహదమనుండను రాజకుమారుఁ డొక కార్యముమీఁద వచ్చెను. అతండును మణిమంజరి యను రాజపుత్రిక మార్చిన యుత్తరము మూలముగా నా రక్కసి గుట్టంతయు గ్రహించి దాని జంపి యందున్న నన్ను గాంధర్వవివాహంబున స్వీకరించి కొంతకాలమా గుహయందు గ్రీడావిశేషములనుభవింపు చుండెను. అంత నొక్కనాఁడు తల్లుల కన్నుగ్రుడ్డుల మూలముగాఁ బూర్వస్మృతి గలిగి యప్పుడే కదలి యద్భుతవేగము గలిగిన తన గుఱ్ఱముమీద నన్నెక్కించుకొని యా గుహ వెడలి సముద్రంబుదాటి యావలియొడ్డు చేరెను.
నాకు నరణ్యములోఁగల వింతలన్నిటి జూపుచు నొకనాఁడు రాత్రి యొక చెట్టు క్రింద బసజేసి మాట్లాడుకొనుచుండ వొక సింహము మమ్ముఁ జంపవచ్చినది . అప్పు డతండు గుర్రమెక్కి కత్తిదీసికొని దానిపై బడెను. అదియు బారిపోయిన దానివెంట నతండు తరుముకొనిపోయెను. ఆ సింహమును సింహదమనుండును నెచ్చటికిఁ బోయిరో కాని యా రాత్రియు మరునాఁడుగూడ రాలేదు. నేను జింతించుచు నడవిలో దిరుగుచుండఁ గొందరు దొంగలువచ్చి నన్నుఁ బట్టుకొని వస్తువులు దోచికొనియు విడువక అమ్మవారికి బలినియ్య గుడియొద్దకు! దీసికొనివచ్చిరి గాని పాపము నామూలముగనే వాండ్రెల్లరు మృతినొందిరి. పిమ్మటఁ దెల్లవారుసమయమున నీయూరివాఁడు యాగుడి యర్చకుఁడు వచ్చి నన్నాదరించి తన యింటికిఁ దీసికొనిపోయెను.
వారియింట నేను కాలము గడుపుకొనుచుండ నొకనాఁ డుదయమున నేను లేచు నంత నా మంచము క్రింద నీశవము బడియున్నది. కారణము నాకుఁ దెలియదు. దీని గుర్తించి పూజారి భార్య నామీద నెంతయో కల్పనజేసినది. ఎట్లయినఁ జచ్చుటయే మేలని యన్నిటికి నొడంబడి యూరకుంటిని. ఇదియే నాకథ. మీకుఁ దోచినట్లు చేయుఁడని యూరకున్నంత, యజ్ఞదత్తుడంతకుమున్నె తన తల్లివలన సింహదమనుని కథ వినియుండుట నతండే తన తండ్రియనియు మోహిని తల్లియనియు నెఱింగి గుండె ఝల్లుమన నెల్లరుచూచి వెరగందుచుండఁ దటాలున నా సింహాసనమునుండి లేచి యామోహిని పాదంబులంబడి యిట్లనియె.
తల్లీ ! నేను నీ పుత్రుండను. నీ పతి సింహదమనుండు మా తండ్రియే. నీవు చెప్పిన మణిమంజరియందు జనించి మాతామహర్జితమగు నీ రాజ్యంబు బాలించు చుంటిని. అన్నన్నా! నీవెట్టి యిడుమలుబడుచుంటివి. కానిమ్ము, నీవిఁక జింతింపకుము . మా తండ్రి బ్రతికియున్నాఁడు గదా! యెచ్చటనున్న వెదకి రప్పించెదను. నీవు పూర్వజన్మకర్మమూలముగా నిట్టిబాధలు పడుచుంటివి. కర్మ పరిపక్వమైనట్లు తోచుచున్నది. ఈ మిషగా నా యొద్ద జేరితివి. లేనిచో నెట్లు తెలియనగు! నంతఃపురమునకు బోదము రమ్ము మణిమంజరి నీకు శోకోపశమనము చేసెఁడుగాక యని పలికి ఆమె నిందబాపుటకై యా పూజారి భార్యవలననే నిజము వెల్లడిసేయఁదలచి యొక యినుపగునపము నెర్రగాఁ గాల్పించి యథార్థము చెప్పనిచో నర్చకునిభార్యను కాల్చమని యాజ్ఞాపించెను. అయ్యాజ్ఞానుసారముగా రాజకింకరులు గాల్చిన లోహపుగజము నంటించఁబోవు సమయంబున భయపడి ఆ చెడిపె గడగడ వడకుచు అయ్యయ్యో! నాకంటింపకుఁడు, అంటింపకుఁడు నిజము చెప్పెదనని మొర్రపెట్టుచు దాను మిఠాయిలో విషముంచి యానవాలు తెలియక యుపపతికిఁ బెట్టుటయ నతఁడు చచ్చినవెనుక దాను కోమటియు మోసికొనిపోయి మోహిని గదిలో నుంచుటయు నాబిడమీఁదనే నేరముంచుటయు లోనగువృత్తాంతమంతయుఁ జరిగినట్లు చెప్పెను. అపుడు సభ్యులెల్లరు తెల్లపోయి దాని నిందించు వాక్కులతోనే మోహిని యోర్పునుగురించియు యజ్ఞదత్తుని బుద్ధిసూక్ష్మతను గురించియు మిగుల స్తుతించిరి.
అంత ననంతకోపముతో యజ్ఞదత్తుండు అర్చకుని పెండ్లామునకు నురిదీయ నాజ్ఞాపించుటయు, మోహిని సమ్మతింపక యర్చకుఁడు ఆపత్కాలములోఁ దనకుఁ జేసిన యుపకారమునకు మారుగా దానిఁ గాపాడవలయునని యజ్ఞదత్తుని బ్రతిమాలుకొనియెను. తల్లి మాట ద్రోసివేయక యజ్ఞదత్తుఁడు దాని క్షమించి సామాన్యశిక్షతో విడిచిపెట్టెను.
పిమ్మట యజ్ఞదత్తుఁడు సగౌరవముగా మోహినిని మణిమంజరియున్న యంతఃపురమునకుఁ దీసికొనిపోయి యామెవృత్తాంతమంతయు దల్లి కిఁ జెప్పెను. మణిమంజరియు మోహిని సంతోషముజెందఁ బెక్కు తెరంగుల గారవింపుచు దుఃఖోపశమనములైన మాటలచే నోదార్చెను. మోహినియు మణిమంజరికి నమస్కరించి యామె చేసిన యుపకారమును గురించి సంతసించుచు సింహదమనుఁడు తనతోఁ జెప్పిన మాటలన్నియుఁ జెప్పుచు నావిడను అక్కగానే భావించి క్రమంబునఁ దానుబడిన యిడుమల గొంచెము మరువఁజొచ్చెను.
మణిమంజరియు మోహినియు నిరంతరము సింహదమనుని గుఱించియే చెప్పుకొనుచుఁ ధీనాధీనచిత్తలై విరాగమతులతోఁ గాలక్షేపము చేయుచుండిరి.
యజ్ఞదత్తుఁడును తల్లుల సంతాపము జూడలేక తండ్రినరయు నుపాయములు పెక్కు చింతించి యొక్కనాఁడు తన తల్లుల రూపములు చిత్రఫలకంబుల వ్రాయించి పరిచారకుల చేతికిచ్చి యాఫలకరూపంబుల సాభిప్రాయముగాఁ జూచినవారి నా యొద్దకుఁ దీసికొనిరండని యాజ్ఞాపించి యంపెను. రాజభటులు రాజశాసనప్రకారమా చిత్రఫలకంబులం గొని యనేక దేశములు దిరుగఁజొచ్చిరి.
అచ్చట సింహదమనుఁడు కాంచనమాలతో యథేష్టసుఖంబు లనుభవించుచు రాజ్యతంత్రరతుండై పూర్వస్కృతిలేక తిరుగుచు నొకనాడు విహారార్థ ముద్యానవనంబున కరుగచు నంగడిలో నొకచోట బదుగురు గుంపుగూడియుండుటఁ జూచి యది యేదియో కనుంగొని రండని కింకరులనంపిన వారు తెలిసికొనివచ్చి యిట్లు సెప్పిరి. అయ్యా ! అడవినుండి చెంచులొక చిలుకను బెట్టెతో నమ్మఁదెచ్చిరి పెట్టెలోదళుక్కురని నేమియో మెఱయుచున్నవి. వానినెవ్వరు నిరూపింపలేకుండిరి. ఆ పెట్టెయుఁ బంజరము నడవిలో వారికొక చెట్టుక్రింద దొరికినవఁట. ఆ చిత్రమును జూచుటకై యనేకులు గంపులుగూడిరి. సెలవైనచో దేవరవారి యొద్దకుఁ దీసికొనివత్తుమని పలికిరి. ఆ మాటలు విని యతఁడు ధ్యానించుచు నా వస్తువులతో వారినిటకుఁ దీసికొని రండని యాజ్ఞాపించెను.
పిమ్మట నాచెంచు లావస్తువులు తెచ్చి రాజుముందర బెట్టిరి. దానిం జూచిన తోడనే సింహదమనునికిఁ గలిగిన దుఃఖ మింతని చెప్పుటకు నలవికాదు. గుఱ్ఱము పైనుండి నేలఁబడి మూర్చిల్లి కొంతసేపటికిఁ పరిచారకులు చేసిన యుపచారములచేఁ దెప్పరిల్లి అయ్యయ్యో! యెంత మరపుజెందితిని! మోహిని యడవిలో నేమైనదోగదా! ఏమేమి? ఇది స్వప్నమా? లేక నిజముగా రాజ్యమే చేయుచుంటినా? నాకు రాజ్యమెట్లు వచ్చినది? మోహినియు నేనును పాతాళభవనములోనేకదా యుంటిమి. లేదు లేదు. ఆటబయలు వెడలి యడవిలోఁ జెట్టుక్రింద నున్నప్పుడు సింహము మూలముగ విడిపోతినా? జ్ఞాపకమువచ్చినది. ఈ చిలుక నేను తెచ్చినదేకదా? ఈ గ్రుడ్లు మా తల్లులవి కావా! అన్నన్నా? ఎన్నాళ్ళయినది. రాజ్యమదము నన్నింత మరపు జెందించునే యని యనేకప్రకారముల వెర్రివాడుం బోలె బలకరించుచు నాచెంచులఁ జీరి యోరీ? మీ కివి యెచ్చట దొరికినవో చెప్పుఁడని యడిగెను.
వాండ్రు ఫాలంబులఁ జేతులుచేర్చి మ్రొక్కుచూ సామీ! మేము వీనిని దొంగతనము చేసి తీసికొనిరాలేదు. అడవిలోఁ దిరుగుచుండ నొకచెట్టుక్రింద దొరికినవి. ఇవి మాకు దొరికి చాలదినములైనవి గాని యిన్నాళ్ళవరకుఁ గ్రామాలకు రాలేదుగానఁ తీసికొనిరాలేదు. మా గుడిసెలలోనే దాచియుంచితిమి. పెట్టెలోనివేమియో మాకు దెలియకున్నవి. ఏలినవారికిఁ గావలసినచోఁ దీసికొనుడని చెప్పిరి. ఆ మాటలు విని యతండు గన్నులనీరు గార్చుచు నోరీ! ఆ చెట్టుక్రింద నొక చిన్నదాని జూడలేదా యని యడిగెను. వాండ్రు అయ్యో! ఆ చెట్టుదగ్గిర మా కెవ్వరును గనంబడలేదు. ఈ పెట్టెయుఁ బంజరము మాత్రమే యున్నవి. మనుషుల జాడలున్నవని చెప్పిరి.
అంత నాసింహదమనుం డపారమగు శోకముతో నాపంజరమును పెట్టెయు దీసికొనిఁ యప్పుడ సభాంతరమునకు నరిగి ముఖ్యామాత్యుని రప్పించి ఆర్యా! నాకు గార్యావసరములు గొన్ని యున్నవి. దేశాంతరమున కేగుచుంటిని. నేనుదిరుగ వచ్చు దనుక నీ వీరాజ్యంబు పాలించుచుండుమని చెప్పి తనముద్రిక లిచ్చివేసెను. తర్వాత నతఁడు అంతఃపురమున కరిగి కాంచనమాలతో నేదియో మిషజెప్పి యెట్టకేలకు నావిడ నొడబరచి యాచిలుక పంజరమును పెట్టెనుమాత్రము గైకొని యొకడే యేకాంతముగాఁ బురము వెడలి యడవిమార్గంబునం బడి మున్ను తాను మోహినిని విడిచిన తావు నరయుచు దిరిగెను. ఎందును నామెజాడ యగుపడినదికాదు—
ఆతం డెనలేని విచారముతో నొడలెల్ల భస్మము బూసికోని బైరాగియై యా రెండువస్తువులను విడువక యనేకపురములు నదులు దీర్థంబులు దిరుగుచుండెను. అట్లు దిరుగుచు నొకనాడు ఒకగ్రామంబున వీథివెంబడి వేఱుదండంబులకుఁ గట్టిన పటములఁ ద్రిప్పుచున్న రాజభటులఁ గొందరగాంచి సింహదమనుఁ డాపటములో నేమి యున్నదని యడిగిన, వారు అయ్యా! చూడుఁడు అని యాపటముల వంచి చూపించిరి. సింహదమనుఁడు అందున్న విగ్రహములలో మణిమంజరిని గురుతుపట్టలేదు. మోహినిని గురుతుపట్టెను.
సింహదమనుం డట్లు మోహిని పటమును జూచి కొంతసేపు తానుగూడ చిత్తరుబొమ్మవలెఁ గదలక యట్టె నిదానించి చూచి మోహినీ నీవు మనుష్యరూపము విడచి దివ్యరూపము ధరించితివా? నన్ను మరచితివే. మాట్లాడవేమి. నన్నుఁ గృతఘ్నునిగాఁ దలిచితివా? నీ పాదంబులం బడియెదను. నా యపరాధము సైపుము. రాజ్యమదాంధుడనై నిన్ను మరచితిని. తప్పు మన్నింపుమని పలుకుచు జిత్తరువు నున్న యీ మోహినినిఁ గౌగలించుకొనబోవుచుఁ జెక్కుల ముద్దుపెట్టుకొనుచు విరహతాపం బంతకంతకు నతిశయించుచుండ నా పటమును విడువక నలిబిలి చేయఁ దొడంగెను.
అప్పుడు రాజకింకరులు అతని విరాళియంతముఁ జూచి పెక్కు తెరంగులఁ జింతించుచు సన్యాసీ! నీకేమైన పిచ్చిపట్టినదా? యూరక మాపటమును నలుపుచుంటివే? మా రాజునొద్దకు రమ్ము పోదమని నిర్బంధించిరి.
అప్పుడతఁడు కొంచెము మోహము మరలించుకొని అయ్యో! నేనేమి తప్పు చేసితిని. మీ రాజు నన్నూరక శిక్షించునా ! యొక కారణంబునం దొందరపడి యీ పటమును నలిపితిని. యీ మాత్రము తప్పుసైచుఁడు. నన్ను మీ రాజునొద్దకుఁ గొని పోకుఁడని బ్రతిమాలఁ దొడంగెను.
కింకరు లామాటఁ బాటింపక ఇదిగో రాజశాసనము— పరిశీలింపుము ఈ పటమును నలియఁ జేసినందులకు నిన్నుఁ గొనిపోవుట కాదు. సాభిప్రాయముగాఁ జూచుటయే నేరమని పలికి యతం డెన్ని చెప్పినను వినక బలత్కారముగా యజ్ఞదత్తుని వీటికిఁ దీసికొనిపోయిరి. సింహదమనుండు వారి నెదిరింప సమర్ధత గలిగియు నచ్చటిస్థితిని బట్టి యిట్టట్టనక వారివెంట నరిగెను. యజ్ఞదత్తుఁడు సభజేసియున్న సమయంబున రాజభటు లాబైరాగిని తీసికొనిపోయి రాజు ముందరబెట్టి, అయ్యా! మేము తమ యాజ్ఞానుసారముగానే పటములతో ననేకదేశములు తిరిగితిమి. ఎందును యెవ్వరును శంకింపలేదు. యీ బైరాగి దీనిని జూచినది మొదలు మోహిని! మోహిని యని పరితపించుచు నీ పటమును గౌఁగలించుకొని పెద్దతడవు విడువక గడబిడజేసెను. దానం జేసి యీతనిం దీసికొనివచ్చితిమని చెప్పిరి. యజ్ఞదత్తుఁడు తండ్రి నెఱుగమి యానవాలు పట్టలేదు. సన్యాసిగా నున్న నాజానుబాహుత్యాదిరూపసౌష్టవమును బట్టి సందియ మందుచు నతనితో నిట్లనియె.
అయ్యా! తమదేశమేది? ఈ పటముం జూచి యేమిటికి శోకించితిరి? యథార్థము చెప్పుడు. మీకేమియు భయములేదని సగౌరవముగా నడిగిన విని యతం డిట్లనియె. అయ్యా! బైరాగిగానున్న నాకు భయమనునది యొకటిగలదా! నేనొక కారణమున నాపటమును జూచి శోకించితిని. నా శోకమున మీకేమి నష్టమువచ్చినది ? నా వృత్తాంతము మీతో నేమని చెప్పుదును? సిగ్గు సిగ్గు. నా యిడుములన్నియు జెప్పుకొనుటకు పది దినములుబట్టును. నన్నుఁ బోనిండు పోయెదననుటయు యజ్ఞదత్తుఁడు అతని మాటలచేతనే తన తండ్రియని బాగుగా నిశ్చయించి యిట్టనియె. అయ్యా! మీవంటి మహాత్ముల యిడుమల గనుంగొని తీర్చుట రాజునకు ముఖ్యమైన పనియై యున్నది. నాతోఁ జెప్పిన నేమి లోపమున్నది? నన్ను మీ పుత్రునిగాఁ దలంచి మీరీ పటమును జూచి శోకించిన కారణం బెఱిగింపుండని వేడుకొనెను.
అప్పుడా బై రాగి యజ్ఞదత్తునితో అయ్యా! వినుండు. నా ప్రాణ ప్రియురాలగు మోహినియను దానిని నిష్కారణముగ నడవిలో విడచిపోయితివి నేను దుర్మార్గుడను. ఆ నేరమునకై నన్ను శిక్షింపుఁ డనిన నతండయ్యా! తమరు మోహిని నడవిలో నేటికి విడిచితిరి? ఆమె యెచ్చటికిఁబోయినది? మీ యుదంతంబు విన ముచ్చట యగుచున్నది. యెరింగింపుఁడనిన నతండు దాచక తనవృత్తాంత మామూల చూడముగా వక్కాణించెను. కన్నుల నీరు గార్చుచు నామోహినియొక్క రూప మీపటములో నున్నది. దానిఁ జూచినట్లే యున్నది. అందులకు శోకించితిని. ఇదియే నావృత్తాంతమని పలుకుచున్న సమయంబున యజ్ఞదత్తుఁడు సింహాసనము డిగ్గ నురికి యత్యంత సంతోషముతో నతని పాదంబులబడి, తండ్రి! నేను నీ పుత్రుండ. నా పేరు యజ్ఞదత్తుఁడు మణిమంజరి యందు జనించితిని. మోహినియుఁ గొలది దినములై నది ఇచ్చటికే వచ్చినది. అని తన వృత్తాంతమంతయుఁ జెప్పిన సింహదమనుండు ఆ! యేమీ? ఇదంతయు స్వప్నముకాదుగద ! కాదు. నిజమేయని సంతోషంబను సముద్రంబున మునుంగుచుఁ బుత్రుని గౌఁగలించుకొని కన్నుల నానందబాష్పములుగారఁ బెద్దయుం బ్రొద్దు నొడలెఱుంగ కుండెను.
పిమ్మట సింహదమనుఁడు అత్యాతురముతో బత్రునివెంట నంతఃపురమున కరిగి సంతతము తన్నే ధ్యానించుచున్న మణిమంజరిని, మోహినినిం జూచి పెద్దతడవు గాఢాలింగనము చేసికొని, యొక్కింతసేపు ఒకరినొకరు పలుకరించి మాటలురాక కంఠములు డగ్గుత్తికజెంద జిత్తరువు ప్రతిమలవలె నిలబడిరి. అప్పుడు వారికిఁగలిగిన సంతోష మింతింతయని చెప్పుటకు నలవికాదు. అట్టి సంతోషముతోఁ గొంత సేపు ఒకరినొకరు తమపడిన యిడుమలఁ చెప్పుకొనుచు నిష్టాలాపములచేఁ గాలక్షేపము చేసిరి.
పిమ్మట మణిమంజరి తానుదాచిన యుత్తరము దెచ్చి సింహదమనునికిఁ జదివి వినిపించి దానికి మారుగా వ్రాసిన యుత్తరము వృత్తాంతము జెప్పినది. అప్పుడు సింహదమనుఁడు మణిమంజరినిఁ బెక్కుగతులఁ గొనియాడి తనయున్నత దశకంతకు ఆమెయే కారణమని ప్రస్తుతిజేసెను. తర్వాత సింహదమనుఁడు తనతల్లులకు తండ్రిని దలంచుకొని వారిచిక్కులఁ బాపుటకై మిక్కిలి తొందరపడ పయనంబగుటయు మణిమంజరియు మోహినియుఁ యజ్ఞదత్తుఁడుగూడ ప్రయాణమున కుత్సహించిరి. చతురంగబలముతోఁ గూడుకొని శుభముహూర్తంబున సింహదమనుఁడు వెడలి మార్గంబున నెడనెడ పటకకుటీరంబులు నిర్మింపించి విడియుచు గొన్ని పయనంబులకు విజయపురంబు జేరెను.
అందు బాహోద్యానవనంబున బసజేసి రహస్యముగాఁ దల్లులకు వార్త నంపి వారి రప్పించి మున్ను విన్న పసరుతోఁ దాఁదెచ్చినగ్రుడ్లు వారి నేత్రముల కంటించెను. అప్పుడా రాజభార్యలు తేజోవంతములైన నేత్రములతోఁ బ్రకాశించిరి చతురంగబలముతో నూరిబైట వ్యూహము పన్నియున్న సింహదమనుని యౌద్దత్యమంతయుం విని శత్రుంజయుఁడు భయపడి యూరు విడిచి పారిపోవఁదలచి దన్ను మాయచేయు చున్న రక్కసియున్న యింటికరిగి దానితో జెప్పెను.
అప్పుడది బెదరక రాజేంద్రా! వెరవకుము. నేను గలుగ నీకేమి కొరఁత. నాకు యుద్ధముచేయు పాటవము గలిగియున్నది. నిజముగా వారు మనమీదఁకు యుద్ధమునకే వచ్చినచో నన్నుఁ బంపుము. ఆ సంగతి రాయబారము మూలముగాఁ దెలిసికొన మని పలికిన నతండు వెరగుపడుచు నప్పుడే యొక బుద్ధిమంతుని వారివార్త దెలిసి కొనుటకై యంపెను. వాఁడును రాజశాసనంబున సింహదమనుండున్న శిబిరమున కరిగి సగౌరవముఁగాఁ దమయేలిక సందేశమును విన్నవించెను.
సింహదమనుఁడు నవ్వుచు దూతా! మీ రాజుతోఁ గొన్ని రహస్యములు మాట్లాడవలసియున్నది. ఇచ్చటికిఁ దీసికొనిరమ్మని చెప్పెను. వాఁడును వేగంబునం బోయి సింహదమనుని యాజ్ఞను శత్రుంజయులతో జెప్పిన నతం డిట్లనియె. ఓరీ ! నేనిప్పుడు శత్రు మధ్యమునకు నొంటిగాఁ బోవచ్చునా? వారు నన్నుఁ బట్టి బద్ధునిచేసినచో నేమి సేయనగు. వారి బలాబలము లెట్లున్నవి? శాంతముగా నుండిరా? యుగ్రముగా నుండిరా? తెలుఁపుమని యడిగిన, వాడిట్లనియె.
దేవా! వారిని మన మెట్లును గెలువలేము. వారిముఖవిలాసములను జూడ శాంతముగానుండిరి. వారియెడఁ గ్రౌర్యముఁ జూపట్టదు. మిమ్ము రప్పించి నమ్మించి మోసము చేయ వారికెంత యవసర మేమి? యుద్ధము చేసి జయింపలేరా? వారి యుద్దేశము మీతో సంధిమాటలు మాట్లాడుకొనుటకే యని తోచుచున్నది. వారి మాటలన్నియు బ్రసాదాభిముఖములుగానే యున్నవి. నిజముగా వారు తలంచుకొనిన మీకుఁ బారిపోవుటకు శక్యమగునా? కావున మీరు గొన్ని కానుకలు దీసికొనిపోయి వారిని బ్రసన్నులఁ జేసికొనుటయే యుత్తమమని పలికిన వానిమాటలు పాటించి శత్రుంజయుఁడు తగు పరిచారకులతోఁ బెక్కు కానుకలు తీసికొని సింహదమనునియొద్ద కరిగెను.
సింహదమనుండు తండ్రి కెదురేగి మంచిమర్యాదలతోఁ దోడితెచ్చి యుచిత ఠంబునం గూరుచుండబెట్టి తానును యజ్ఞదత్తుఁడు లోనుగాఁగల సామంతు లతని చుట్టును పీఠంబులఁ గూర్చుండి లోకపరిపాటిగాఁ గుశలప్రశ్నలఁ జేసికొనదొడంగిరి. అట్లు కొంతసేపు మాటలచే గాలము గడపిన వెనుక సింహదమనుండు శత్రుంజయుని నార్యా! నీకు సంతానము గలదా యని యడిగెను.
దాని కతఁడు తలవాల్చుకొని అయ్యా! నా చరిత్ర మేమని చెప్పుదును. నేను సంతానము బడయఁ నెక్కుడు ప్రయత్నముజేసి యొక వనిత మాట విని గర్భవతులై యున్న యేడ్గురు భార్యల నడవిపాలు చేసికొంటిని. ఆ దుర్మార్గురాలి మూలముగానే నాకీ ముప్పు వచ్చినది. దానిని దెచ్చినది మొదలు నా గ్రామంబున నరిష్టములే వచ్చినది. దానిని దెచ్చినది మొదలు నా గ్రామంబున నరిష్టములే సంభవించుచున్నవి. అదియు గొడ్రాలేయైయున్నది. దానంజేసి నాకు సంతానము లేదని సంతాపముతోఁ జెప్పెను.
సింహదమనుండు మొదటఁ దండ్రిని బెద్దతడవు చిక్కులు బెట్టదలంచుకొనెను. గాని యతనిఁ జూచినతోడనే దుఃఖము సహింపనేరక వెంటనే యతని నంతఃపురమునకుఁ దీసికొనిపోయి తల్లుల నేడ్వురను జూపి వీరెవ్వరో యెఱుంగుదువా యని యడిగెను.
శత్రుంజయుఁడు చిరకాలమైనసు వారిని గురుతుపట్టెను. కన్నులు కలిగి యుండుట శంకించుకొనుచు నతనితో నే నెఱుఁగనని యనుమానముగాఁ జెప్పెను. అప్పుడు సింహదమనుఁడు తండ్రికి నమస్కరించి తన్నెరింగించి తనకు జ్ఞానము వచ్చినది మొద లతనినిం జూచినదాక నడుమ జరిగిన కథయంతయుఁ జెప్పెను. అప్పుడు శత్రుంజయుఁడిది యొక కలగాఁ భావించి కొంతవరకు నమ్మలేదు. భార్యలును గొడుకును కోడండ్రు పౌత్రుఁడు మొదలగువారు తనకుఁ జేయు మన్ననలం జూచి నిజమేయని నమ్మెను.
శత్రుంజయుఁడు దైవఘటనము గుఱించి యాశ్చర్యపడుచుఁ దానెఱుగఁకుండ నిక్షేపంబు గృహంబునం గనంబడిన సంతసించు నిరుపేదయుంబోలె నానందపారావారకలోలమాలికం దేలియాడుచు భార్యలం గారవించి పుత్రుని మన్నించి పౌత్రుని ముద్దుగొని కోడండ్ర నాదరించి వారి వారికిఁ దగినట్లు మన్ననలం గావించెను.
పిమ్మటఁ దండ్రి యనుమతిచే సింహదమనుండు చిలుకయున్న పంజరమును దెచ్చి చిలకను పై కిదీసి ముందు కాళ్ళు విరుగఁదీసి వెనుక రెక్కలు ముక్కలుచేసి తర్వాత కంఠము నులిమి దూరముగా విసరి పారవైచెను.
గోపా! యేమి చెప్పుదును. అంతలోనే శత్రుంజయుని యింటను మాయవనిత వేషముతోనున్న రక్కసి నిజరూపము ధరించి బ్రహ్మాండకరండము పగులనార్చుచు నెగసి సింహదమనుని దాపునకు రాఁబోయెను. మొదటనే కాళ్ళు విరచెనుగాన నొకచోట కాళ్ళును నొకచోటఁ జేతులును విరిగి పడిపోవ నతఁడు విరిచిన యట్లకచోట శిరము శరీరముతో వేరుజెందినంత నక్కంకాళి మృతినొందెను. దాని పాదముల క్రిందను జేతులక్రిందను మొండెము క్రిందను తలక్రిందనుఁబడి యనేక జీవులు మృతి నొందినవి. దాని దేహమెంత యుండునో విచారింపుము. ఆ యుత్పాతమును జూచి పౌరులందరు వెరగందుచుఁ జిట్టచివర దానికథయంతయు విని సింహదమనుని మిగుల వినుతించిరి.
యజ్ఞదత్తుఁడు మొదలగువీరులు పెక్కండ్రువచ్చి దానియంగములన్నియు పెద్దకఠారులచే ముక్కలక్రింద నరికి దహనము చేయించిరి. తలమాత్రము నరుకుటకు లొంగినదికాదు. దాని బెక్కండ్రు గొప్పసాధనముచే నూరిబై టనున్న యడవిలోనికి బెద్దకాలమునకు దొర్లించిరి. శత్రుంజయుఁడు సకలపరివారసహితముగాఁ గోటలోనికిఁ దీసికొనిపోయి శుభముహూర్తమునఁ బుత్రునకుఁ పట్టాభిషేకముచేసి తాను తపోవనమున కరిగెను. యజ్ఞదత్తుఁడు కొన్ని దినములుండి మరల మాతామహుని రాజ్యము సేయ నరిగెను. సింహదమనుండు కాంచనమాలనుగూడ రప్పించి మువ్వుర భార్యలతో యథేష్టకామంబుల ననుభవించుచుఁ బెద్దకాలము రాజ్యముచేసెను.
గోపా! నీవు చూచిన పుఱ్ఱె యారక్కసిది. చిరకాలమైనది . కావున మేదో మాంసములు హరించినవి. దాని గొప్ప యిప్పుడేమి యున్నది? దాని మేదోమాంసము లున్నప్పుడు చూచితీరవలయును. మార్గస్థులు దానింజూచి పర్వత మేయని పెక్కుదినముల వరకు భ్రాంతిపడుచుండిరి. ఇదియే దాని వృత్తాంతము. నిస్సంశయముగాఁ దెలిసినదికదా? యని యడిగిన వాఁడు స్వామీ! మీ కటాక్షమున నంతయుఁ దేటగాఁ దెలిసినది. కథ నాకు మిగుల సంతసము గలుగఁజేసినది. ఇట్లు చెప్ప మీకుగాక యన్యులకు శక్యమా యని యయ్యతీశ్వరుని బెక్కుగతులఁ గొనియాడెను.
అంతలో ప్రయాణసమయమైన నాగొల్లవాఁడును యతీశ్వరుఁడును నప్పురంబు వెడలి మార్గంబు వెడలి మార్గంబునంబడి నడుచుచు గ్రమంబున పదియవ మజిలీ చేరిరి—