కాశీమజిలీకథలు/మొదటి భాగము/ఆరవ మజిలీ
వత్సా! విను మమ్మువ్వురు నట్లు తిరుగుచు నొకనాఁడు సాయంకాలమున హేలాపురోభాగమున నారథం బరుగఁ దత్పురగృహదీపికాశ్రేణి నేత్రంబులకు విందొనరింప దండుఁడు అన్నలారా! ఇది యొకపట్టణమువలె నగపడుచున్నయది. ఈరేయి నిందు వసించి కళావతివృత్తాంత మరయుదమే యనుటయు వా రియ్యకొనిరి. ఆరథంబు తదీయమనోరథంబు వడువునఁ బుడమికి దిగి యవ్వీటి నడివీథి నిలుచుటయు దాని నొకచో దాచి వారు పౌరులవలన బరదేశులకు నివాసయోగ్యంబగు నమాత్యుని సత్రంబు వృత్తాంతమును విని యందుఁజేరిరి. సత్రాధికారులు వారి కారాత్రి దగురీతి భోజనసదుపాయములు జేసిరి. వారు మరునాఁ డుదయంబున సత్రపువీథి వేదికపై గూర్చుండి యందు వ్రేలఁగట్టియున్న చిత్రఫలక మీక్షించి యొండొరు లిట్లు సంభాషించుకొనిరి.
సాంబు - అన్నా ! వసంతా! ఇటురా! ఈ పటము చూచితివా? ఈ ప్రతిమ మన ప్రవరుని పోలికగా నున్న దేమి ?
వసంతుఁడు - (చూచి) ఔనౌ నట్లె యున్నది. మన దండునిం బిలువుము. (పిలిచి) తమ్ముడా! ఈ చిత్రఫలకము జూడుము. ఇందున్న రూప మెవ్వరిదియో చెప్పుకొనుము.
దండుఁడు - ఓహో సోదరులారా! ఆమాత్రము గురుతుపట్టజాల ననుకొంటిరా? ఇది మనప్రవరునివలె నున్నది.
సాం - అచ్చగా నతనిమొగమువలెనే యున్నది. అతనిరూప మిం దుండుటకుఁ గారణ మేమో?
దం – ఒకవేళ నీచిత్రఫలకము వానిపోలికగల మఱియొక పురుషుని దేమో?
సాం - కాదు. కాదు. తప్పక మనప్రవరునిదే.
వసం — తమ్ములారా! నాకుఁ గళావతీవియోగశోకముకన్న మిత్రవియోగసంతాప మెక్కుడుగా నున్నది. వారిజాడయు నెందును దెలియరాకున్నది. హా ప్రవరా! హా రామా! మిమ్ముఁ గన్నులార నెన్నడు చూచెదనోకదా! అని కన్నీరు విడుచుచు నొండొరులు మాట్లాడుకొనుచుండ నాదండనున్న కింకరులు వారి నాటంకపరిచి యిట్లనిరి.
అయ్యలారా! తమరెవ్వరు? ఈ చిత్రఫలకమును సాభిప్రాయముగ వీక్షించితిరి గాన మిమ్ము నొండొకచోటునకుఁ బోనీయము. మంత్రిగారియొద్దకు రండు. పోదమని కరంబులు పట్టుకొనుటయు వారు జడియక యోహో! మీమంత్రి మంచిశాసనకర్తయే! చిత్రఫలకము జూచుటయే నేరమా? అట్టిది యిందేల వ్రేలగట్టవలయును? పరదేశుల వంచించుటకేనా యేమి యీసత్రము విలుపుట? పదుఁ డాయననే యడిగెద మని ధైర్యముగా వారివెంట నడువసాగిరి. ఆ మువ్వురను దోడ్కొని రాజకింకరులు ద్వారపాలకునిచే నావార్తఁ బ్రవరునికిఁ దెలియజేసిన నతం డప్పుడు తనభార్యతో మిత్రుల గురించియే సంభాషించుచుండి యావార్త వినఁబడినతోడనే వేడుకతో వారిని లోపల ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించెను.
అప్పుడు కింకరు లోహో! వీరి నంతిపురికిఁ గొనిరండని మంత్రిగా రాజ్ఞ యిచ్చినారు. భూషించుటకో దూషించుటకో తెలియదని పెక్కుగతులఁ దలపోయుచు వారిని మంత్రియెదుట బెట్టి యాభటులు మరల సత్రముదరి కరిగిరి.
వారిం జూచి ప్రవరుండు ప్రహర్షసాగరమున మునుగుచు దన్ను దెలిసికొనెదరో లేదో యని యేమియుం బలుకక యూరకున్నంత వసంతుఁడు అయ్యా! ఇందు బ్రధానప్రవరులు మీరేనా? పరోపకారబుద్ధితో నన్నసత్రము వైచిరిగదా? అందు జూచుటయే యపరాధముగా గణింపఁబడు చిత్రఫలక మేమిటికి వ్రేలం గట్టించితిరి ? దాని మేము జూచితిమని మీకింకరులు మ మ్మపరాధులఁబోలె మీయొద్దకుఁ దీసికొనివచ్చిరి. ఇది యేమి పాలన మని యడిగిన నతండు కంఠంబు డగ్గుత్తికపడ మీ రావిగ్రహము నేమిటికి నిరూపణపూర్వకముగాఁ జూచితిరని యడిగెను. అది మామిత్రుఁడు ప్రవరుని పోలికగా నున్నది. దానం చేసి నిరీక్షించితి మనవుఁడు మీ మిత్రుఁ డేమయ్యెను. మిమ్ము మరచి విగ్రహ మయ్యె ననుకొంటిరా? యని పలుకుచుండగనే దండుఁడు గ్రహించి యీతఁడే మన ప్రవరుఁడని యరచెను.
అప్పు డతండును సంభ్రమముతో వారినెల్లఁ గౌఁగిలించుకొని అన్నలారా! నన్ను గురుతుపట్టలేకపోయితిరిగదా! మీ నిమిత్తమే నే నాచిత్రపట మందుఁ గట్టించితి. నేఁటికి మనపుణ్యము ఫలించినదని తాను మఱ్ఱికొమ్మ యెక్కి బయలుదేఱినది మొద లంతదనుక జరిగిన కథ యంతయం జెప్పి కాంచనవల్లిని జూపెను.
వారును దమతమవృత్తాంతముల వేరువేర యెఱింగించిరి. అప్పుడు వారందరు సంతోషపారావారవీచికలం దేలియాడుచు, బీఠంబులం గూర్పుండి రాముఁ డొక్కరుఁడే చేరవలసినవాఁడని యతని గుఱించి సంభాషించుకొనుచున్న సమయంబున ద్వారపాలుఁడు వచ్చి దేవా! జయపరాక్. సత్రమందలి చిత్రఫలకమును సాభిప్రాయముగాఁ జూచెనని యొక మిథునమునుఁ దీసికొనివచ్చి కావలివారలు ద్వారమందున్నవారు ప్రవేశమునకు సెలవే యని యడిగిన నతండు రాముఁడే యను సంతోషమున వడిగాఁ దీసికొనిరమ్మని యాజ్ఞాపించెను. అతం డప్పుడు పోయి యమ్మిథునమును దోడ్కొనివచ్చి వసంతాదుల మ్రోల విడిచిపెట్టిపోయెను. వా రతని దూరంబునం జూచి రాముఁడు రాముఁడను కంఠధ్వనులు పరాభవనమునం బ్రతిధ్వను లీయ నందఱును లేచి యెదురేగి యతనిం గౌఁగిలించుకొని యాలంకెలతోడనె తోడ్కొనివచ్చి యుచితపీఠంబునం గూర్చుండఁబెట్టిరి. కనకప్రభయుఁ గాంచనవల్లిచే నుచితసత్కారము లంది తదీయసంభాషణము లాలించుచుఁ బ్రాంతమున నిలువఁబడెను. అప్పుడు వసంతుడు రామునితో మిత్రమా! నిన్ను చూచి యెంతకాలమైనది. మాకన్నులు వాచినట్లే యున్నవి. ఈ చిన్నది ఎవ్వతె? ఎందెందు సంచరించితి వేమేమి వింతలం జూచితివి? యని యడిగిన నతండు తాను మఱ్ఱివృక్షము విడిచినది మొదలు నాఁటివరకు జరిగిన వృత్తాంత మంతయుఁ జెప్పి నిన్ననే న న్నీచిన్నది సత్రప్రాంతమందున్న సన్యాసిం బ్రార్థించి పురుషుని గావించెను. ఇమ్ముదిత దయావిశేషంబుననే నేను మిమ్ములం బొడగంటి. ఎన్నిగతుల నైన దీని ఋణంబు దీర్చికొనలేనని యా పూఁబోణిం జూపించిన వారందరు నందులకు నాసుందరి బ్రశంపించిరి.
పిమ్మట వారొండొరు లభిముఖముగా గూర్చుండి తనివిదీరని ప్రీతితో నొకరి మొగము నొకరు జూచుకొనుచుండ నత్తరి వసంతుం డిట్లనియె. తమ్ములారా! ఈ దినంబెంత సుదినమో చూచితిరా? అయత్నోపసిద్ధముగా మనమందఱ మొకతావు చేరితిమి. ఆహా! దైవవియోగ మెట్టిదో చూడుఁడు.
మ. ఎట నెవ్వారికి నెన్నిరే ల్సుఖముగానీ, దుఃఖము న్గాని, వి
స్ఫుటపూర్వచరితాత్మకర్మవశతన్భోక్తమై యుండునో
ఘటనాచాతురిఁ ద్రాళ్ళఁ గట్టుచు బలాత్కారంబుగా వాని న
చ్చోటికిం దోడ్కొనివచ్చి దాని గుడిపించున్ దైవ మన్నా ళ్ళొగిన్.
పురుషకార మెందులకునుఁ బనికిరాదుసుడీ? మన మెంతకాల మెట్టియిడుమలఁ బడితిమో చూచితిరా? దైవకారంబునఁ దుదకయ్యిడుమలే మనకుఁ దలంప శుభంబు లొనగూర్చినవి.
ఉ. కోరక దుఃఖముల్ మనుజకోటికి నేగతి వచ్చు నాగతిన్
ధారుణి సౌఖ్యము ల్గలుగు దానికి వీరిప్రయత్న మేమియున్
గారణమై దలిర్ప దది కాలవిశేషము పట్టి వచ్చులో
నోరిమి దక్కికుందుటయు నుబ్బుటయుంజుమి వీరధర్మముల్.
సోదరులారా! మన కింతటి యామోదం బొనఁగూర్చిన భగవంతున కనేకవందనము లౌఁగాక యని బహుప్రకారంబుల దైవకారంబునుం గూర్చి ప్రశంసించుచు మఱియు రామునితో నిట్లనియె.
రామా! కళావతీవృత్తాంత మంతయు మనప్రవరునిచే వింటిమిగదా! యిప్పుడక్కాంత నేకాంతముగా రప్పింతమా లేక నగరంబున దర్పంబు జూపి నాకందర్పకేతు నోడించి పిమ్మటఁ గొనివత్తమా! ఇప్పుడు చేయఁదగిన కృత్య మెద్దియో విచారింపు మనుటయు రాముం డిట్లనియె. సామాదిచతురోపాయంబు వై రుల యెడ గ్రమంబున నడిపింపఁదగినవి గదా? తొలుత నతనియెడ సామంబు ప్రయోగించి యొడంబడనినాఁడు దండంబ కర్తవ్యము. ఇంతకును మనప్రవరుని యనుమతి యెట్లున్నదో విచారింపు మనుటయుఁ బ్రవరుం డిట్లనియె.
అన్నలారా! యారాజు పరాక్రమమునను బుద్ధికౌశల్యమునను మనలను మించినవాఁడు కాఁడు. సర్వసేనలు నాయధీనములోనే యున్నవి. తృటిలో నీకోట స్వాధీనము చేసికొనఁగలము. కాని కృతఘ్నతాభీతి నన్ను బాధింపుచున్నది. కావున మనరాముఁడు చెప్పినట్టు సామంబుననే సర్వకార్యములు చక్కఁబరచుకొనవచ్చును. సామం బెవ్వరికిని మేలు. దైవప్రతికూలదినములలో నితండు మనల నింత జేసెంగాని యిప్పు డేమి సేయఁగలఁడు. ఒండు వినుం డిప్పుడ యప్పుడమియొడయనికడ కరిగి యీవిషయము వినిపింత మనుటయు నందుల కందరు నియ్యకొనిరి.
పిమ్మట వారేగురు నడుములఁ గాసికోకలు బిగియించి జెట్టిలాగులు నీలికంచులు నీలికంచుళులు నరుణోష్ణిషంబులుఁ దాల్చి భయంకరవేషములతో గరంబుల గరవాలంబులం బూని భూమి కంపించునట్లు చటులగతి నడుచుచుఁ జూచినవారెల్ల బీతిల్లి యోరసిల్ల నల్లన నమ్మహీవల్లభు నాస్థానంబు జేరి రాజసింహాసనముమీఁద వసంతుఁడును ప్రాంత పీఠంబులం దక్కినవారును గూర్చుండి తత్సభారక్షకునిచే రాజునకు వార్త నంపిరి.
వాఁ డతిజవంబునం బోయి యంతఃపురంబున భార్యతో వినోదంబుననున్న యన్నరపతిం జూచి స్వామీ! అయినది. అయినది. తమ సింహాసనము శాత్రవు లాక్రమించుకొనిరి. ఏమిటికో దేవరను దీసుకొనిర మ్మనిరి. మీఁదటికార్య మాలోచించుకొనుడని యా వృత్తాంతమంతయుం జెప్పెను.
రాజు — ఓరీ! ప్రవరుని శీఘ్రముగాఁ దీసికొని రమ్ము,
సభారక్షకుఁడు – ఎక్కడి ప్రవరుఁడు? వారితోనే వచ్చి పీఠ మాక్రమించుకొని మనలను బెదరింపుచున్నాఁడు. ఆయన మూలముననే యీ ముప్పువచ్చినదని తలంచెదను.
రాజు — మనమంత్రి యందే యున్నాఁడా! నీవు చూచితివా?
సభా — నేను జూచితిని, అందేయున్నవాఁడు. మునుపటి వేషము కాదు. వారివలెనే భయంకరవేషము వైచికొని హస్తంబున గరవాలంబుఁ బూని కూర్చున్నవాఁడు.
రాజు — ఓహో! అతనికి మనమేమి యపకారము చేసితిమి? ఇట్టి క్రౌర్య మేమిటికిఁ బూనవలయును! వారు శత్రువులు కారేమో? సభా — వారు మైత్రి సేయ నరుదెంచినచో సింహాసనము నాక్రమింతురా ? యుద్ధసన్నద్ధులై రానేల? వారి యాకారములు తేరిచూడ శక్యము కాకున్నవి గదా?
రాజు - అలాగునా! అలాగునా! (అని వడంకుచు భార్యతో) కాంతా! యీ యుదంతము వింటివా? యిప్పు డేమి చేయఁదగినది.
రాజపత్ని - క్షత్రియవంశమునఁ బుట్టి యిట్టి పిరికితనం బేటికి బూనెదరు కత్తి గట్టి పరాక్రమముతో సంగరంబున శత్రుల బరిభవింపుఁడు.
రాజు - సంగరమని సులభముగా బలికితివి నేను జిన్నతనములో నెంత గారాబముగాఁ బెంపఁబడితినో యెఱంగుదువా? యించుక దెబ్బయైనఁ బడి యెరుంగను. అట్టి నేను అసిధారాపాతంబుల నెట్లు సైరింతును?
పత్ని - అయ్యో! సంగరవీరులగు క్షత్రియకుమారు లెల్లఁ జిన్నతనమునందు దెబ్బలు పడినవారేనా? శ్రీరాముని కన్నను అర్జునుని కన్నను మీరు సుకుమారులా? వా రెట్టి సంగ్రామంబులం గావించిరి.
రాజు — సీ! నీ యాడుబుద్ధి పోనిచ్చుకొంటివికావు. చెప్పినం దెలియదేమి. వారివలె నేనడవులఁ గ్రుమ్మరి కాయగూరల దింటినా? నా సుకుమారత నీ కేమి యెఱుక.
పత్ని – మీ రట్టివారే కానిండు. ఇప్పు డేమి చేయుదురు?
రాజు - రెండవదారిం బారిపోయి ప్రాణములు దక్కించుకొంట లెస్సయని తోఁచుచున్నది. అట్లుచేయుట నీ కభిమతమేనా?
పత్ని - పారిపోయిన మనమెన్ని దినములు బ్రతుకుదుము. ఈ యపఖ్యాతి వసుంధరఁ దిరంబై యుండదా.
రాజు — ఉన్నను సరియే కాని నేను పోరుసేయనోప (అని బలుకుచున్న సమయంబున నెవ్వరో వచ్చుచున్న యలుకుఁడు వినంబడునంత వడంకుచుఁ బారిపోవ బ్రయత్నించుటయు నడ్డపడి బిగ్గరగాఁ బట్టుకొని)
పత్ని - అయ్యయ్యో! శత్రువుల బలాబలముల దెలిసికొనక యెద్దియో యలుకుడైన నడలుచు నూరక పారిపోవ బ్రయత్నింపనేల? నిలువఁ డేను బోయి సంధి చేసికొని వత్తును.
రాజు — విడువిడు. అదిగో వా రిక్కడికే వచ్చుచున్నట్లు తోచుచున్నది. నిలిచితివేనిఁ బ్రాణహాని కాగలదు. నీవు వారితో మాట్లాడి సంధి కుదిరినచో నాకు వార్త నంపుము. వెండియు రా కెక్కడికిఁ బోవుదును.
పత్ని - వారు శత్రువులు కారు. అదిగో మనపరిచారకులే వచ్చుచున్నారు. భయము విడచి నిలువుఁడు. రాజు – నాకు లోపలినుండి చలివచ్చుచున్నది. నిలువలేకున్నాను. బిగ్గరగాఁ బట్టుకొనుము. (అని ముసింగిడుకొని మంచముపై పండుకొనుచున్నాఁడు)
ఇంతలో పరిచారకులు వచ్చి అమ్మా! రాజుగా రెచ్చట నున్నారు. వారెవ్వరో సభాభవనంబంతయుఁ బ్రతిధ్వను లీయ సింహనాదములు సేయుచు వెరపుగలుగ రాజుగారినిఁ దీసికొనిరండని మాకు నియోగించిరి. ఇ ట్లుపేక్ష చేయుచున్నా రేమి? ముందటివార్త తెలియలేదా యేమి యని చెప్పిన విని యామె తెలిసినది. దానికే యాలోచించుచున్నాము. మీరు గ్రమ్మర జని రాజుగా రస్వస్థులై యున్నవారని చెప్పి మనమంత్రి నొకసారి నేను రమ్మంటినని చెప్పి తీసుకొనిరండు పొండని పంపెను.
వాండ్రు పోయి కొండొకవడి మరల నరుదెంచి అమ్మా! తమవార్త మంత్రిగారితో చెప్పితిమి. మామాటలు విని వారు నవ్వుకొనిరి. అది యేమి సాంకేతికమో తెలియదు. మంత్రియొక్కఁ డేల మేమందరము వచ్చుచున్నారము. రాజుగారి రోగకారణ మరిసెదమని చెప్పి బయలుదేరిరి.
అని చెప్పునంత రాజు తటాలున లేచి వస్త్రమాల్యానులేపనార్యలంకారములఁ దీసివైచి మలినవస్త్రంబులఁ దాల్చి పారిపోవఁ బ్రయత్నించుచుండ రాజపత్ని పోవలదని నిర్బంధించి పట్టుకొనినది. ఇంతలో వరప్రసాదు లచ్చోటికి వచ్చిరి. రాజును మంచముపై ముసింగిడికొని యెన్నఁడో చచ్చినవానివలెఁ బరుండియుండెను.
అప్పు డారాజపత్ని చాటున నిలిచి ప్రవరునితో అన్నా! అమాత్య ప్రవర! నీవిట్ల కృతఘ్నుండవై వీరి నేటికిఁ దీసుకొని వచ్చితివి ? వీ రెవ్వరు? వీరికి మే మేమి యపకారము గావించితిమి? రాజుగారితో వీరి కేమి పని యున్నదని యడిగినఁ బ్రవరుండు సాధ్వీ! వీరి వృత్తాంతము చాల కలదు. పిమ్మటం జెప్పెదం గాని యీతం డి ట్లచేతనుండువోలెఁ బడియుండుటకుఁ గారణ మేమని యడిగిన నచ్చేడియ యేమియుం బలుకక యూరకున్నది.
అప్పుడు ప్రవరుఁడు రాజునొద్ద కరిగి ముసుంగు దీసి చూసెను. కన్నులు తేలవైచి పళ్ళు బిగియఁబట్టి యూపిరి రానీయక గతాసుండట్లున్న యన్నరనాథుం జూచి వరప్రసాదులు పకపక నవ్వదొడంగిరి. అప్పుడు ప్రపరుఁడు పెద్ద యెలుంగున రాజా! రాజా! యని పిలిచి పలుకకున్నంత స్వాంతమున విస్మయమువొందుచు అయ్యో! యీ నృపాలుం డకారణమువ జేతనముబాసిన వావివలె నొప్పుచున్నాడు. వీనికిఁ దగినచికిత్స జేయింపవలయును. వీనితత్వ మెఱింగినది బ్రాహ్మణవిస్వస్తయొకతె యుండవలయును. ఆమెను దీసుకొని రండని కొందరు కింకరుల బంపెను.
అ జరఠయు నంతకుమున్న యన్నరపతికి ప్రాణోత్క్రమణసమయమైన మాట విని వడివడి వచ్చుచున్నది. కావున వారి కెదురు పడినది. అప్పుడు కింకరులామె కాతెఱం గెఱింగించి యచ్చటికిఁ దీసికొని వచ్చిరి. నిశ్చేష్టితుండై పడియున్న రాజుం జూచి అయ్యో! అయ్యో! యని గుండెలు బాదుకొనుచు నింక నన్ను మన్నించువా రెవ్వరు? నాపారితోషిక మియ్యలేదే. యేమి చేయుదురు. పెక్కుచిక్కులు పడి యుప్పడుచుం దీసికొని వచ్చితినే. యేమియు లేకపోయినది. హాదై వమా! యని నేడ్చుచున్న యన్నీచురాలి జూచి రాముడిట్లనియె. అవ్వా! నీ వీరాజున కేమి యుప కారము జేసితివి. ఆతఁడు నీ కేమి కానుక లిత్తునని చెప్పెను చెప్పుమనుటయు నావృద్ధ యిట్లనియె.
అయ్యలారా! నే నీతండు కోరిన చిన్నదానిని ద్వీపాంతరమున నుండి తీసుకొని వచ్చితిని అర్ధరాజ్య మిచ్చెదనని వాగ్దత్తము చేసి యున్నాడు. వెంటనే యడుగుటకు నాచిన్నది వీని వరింప సంవత్సరము వ్రతము నెపంబున మితిగోరినది. అందుమూలమున వీలుపడినది కాదు. ఇంతకును నేను దురదృష్టవంతురాలను అని యాకథ యుంతయుం జెప్పినది. అప్పుడు ప్రవరుఁడు వసంతుని జూపుచు అవ్వా! యీతని నీ వెప్పుడైనఁ జూచితివా యని యడిగిన నామె యతనిం జూచి గురుతుపట్టి గుండె ఝల్లుమనఁ దెలతెలపోవుచు నెచ్చటనో చూచినట్టే జ్ఞాపకమున్నదని పలికినది. అప్పుడు వసంతుడు కోప మాపనేరక యట్టె లేచి దానిం జంప గమకించిన నడ్డము వచ్చి ప్రవరుండు స్త్రీవధ మహాపాతకము. దీని వేరొకరీతి శిక్షింతమని దాని నప్పుడు పెడకేలు కట్టించెను.
ఆ చర్యలన్నియుం జూచి రాజపత్ని వెరచుచు వారి పాదంబులం బడి పతిభిక్ష పెట్టుఁడని వేడుకొనినది. అప్పుడు ప్రవరుండు సాధ్వీ! వీరు నా మిత్రులు. ఈ రాజు చెరఁకొని తెప్పించిన చిన్నది యీ వసంతునిభార్య. ఈతడు సార్వభౌముని కుమారుఁడు మేమందరము తల్లిదండ్రు లెఱుంగకుండ నిల్లు వెడలి దేశాటనము చేయుచుఁ జిక్కు లం బడితిమి. దైవకృపచే నందఱము చేరుకొంటిమని తమ వృత్తాంత మంతయుం జెప్పెను.
ఆ కథవిని యామె వెరగుపడుచుండ నారాజు తటాలున లేచి వారి పాదములం బడి మహాత్ములారా! మీరు లోకాతీతులు. ఏమి చేసినను చేయగలరు. మీ పాదసేవకుండనై బ్రదికెద. రక్షింపుడు. నా యపరాధంబుల మరువుఁడు. కళావతిని నేను ముట్టలేదు. ఆ చిన్నది సాధ్వీతిలకమని చెప్పఁదగినది. నన్నుఁ గన్నెత్తియైనఁ జూచి యెఱుంగదు. గడ్డిగరచితినని యనేకప్రకారములఁ బ్రార్థించెను. దయార్ద్రహృదయు లైన వరప్రసాదు లారాజుం గరుణించి విడిచిపెట్టి యావృద్ధబ్రాహ్మణిని మాత్రము విడువక గెంటుకొనుచుఁ గళావతియున్న యంతఃపురమునకుఁ దీసికొనిపోయిరి. అందయ్యింతిం జూచిన తోడనే వసంతునకు శోకంబును నక్కటికంబును నానందంబున మనంబున జనింప నాగలేక పెద్దయెలుంగున హా! "కళావతీ! యిట్లున్న దానవేయని పయింబడి కౌఁగిలించుకొనిన నులికిపడి యప్పఁడతియు నట్టెచూచి యతని తన మనోహరుఁడు వసంతునిగా నెఱింగి యోహో! నా యదృష్టమేమి? ప్రాణనాథుఁడే వచ్చెనా యిది కలగాదుగద? కాదు నిజమే తొలిజామున నెప్పుడో కొంచెము సుకృతము గావించితిని. లేకున్న నా కంతటిభాగ్యము మరల లభించునా యని యనేకప్రకారంబుల దన భాగదేయమును గుఱించి మెచ్చుకొనుచు నార్యపుత్రా! మీ జీవితాంతము గావించిన దుష్టురాలిని జూచుటకై యెట్లు వచ్చితిరి? ఏ పుణ్యాత్ముండు మిమ్ము బ్రతికించెను! పాపపు ముసలిముండ యెంత చేసినదో చూచితివా? అని త న్నాముసలిది పెట్టిన చిక్కులన్నియుఁ జెప్పి తనివివోనిచూడ్కు లతనిమొగంబున బరగించుచున్న యయ్యంగనకుఁ దనవృత్తాంతమును మిత్రులవృత్తాంతము నింతేనిం దాచక యెరింగించి వారిం జూపించిన సంతసించి యమ్మించుఁబోఁడి వారిమైత్రిని గురించి వేతెరంగులఁ బ్రశంసించెను. పిమ్మట ముసలిదానిం జూచి యది మొఱ్ఱపెట్టుచుండ జాలిపడి వారిని బ్రార్థించి దానిని గూడ విడిపించినది. దయాశాలు లపకారులనైనను శరణువేడిన రక్షింపక మానరు.
కళావతీలాభసంతుష్టి నొంది వసంతుడు మిత్రులఁ జూచి యిట్లనియె. తమ్ములారా! మనము వచ్చి పెక్కుదినంబు లైనది. మొదట శీఘ్రకాలములోనే మగుట దలంచుకొంటిమిగాని దైవగతిచే నట్లు సాగినదికాదు. ఈక్షణ మందరము కుశలముగా నొకతావునకుఁ జేరితిమి. మనకై మనతలిదండ్రు లెంత చింతించుచున్నారో వారిం జూడ వేగబోవలయుఁ గావున మీయుద్దేశ మేమనిన నందుల కందఱు నియ్య కొనిరి.
పదపడి సాంబుఁడు దండుఁడును రాగమంజరిని విద్యుత్ప్రభను దలంచుకొను నంతలో నయ్యింతులు పాణుల వీణులం బూని గాంధర్వంబు వెలయించుచు నచ్చోటి కరుదెంచిరి. ఇట్లు సపత్నీకులై వారేగురు నొక్కతావుం జేరి దండునిచే రచియింపబడిన కీలురథ మెక్కి, యచ్చటివారెల్ల నత్యద్భుతస్వాంతులై చూచుచుండ నాకాశమార్గంబున నరిగిరి.
మొదట మంత్రికుమారుఁడగు రాముడు కన్నులిచ్చి పెండ్లి యాడిన పద్మగంధియున్న పట్టణ మరిగి యాతరుణి గూడ రధం బెక్కించుకొని క్రమంబున ననేకదేశములు గడచి పుష్పకారూఢుండగు శ్రీరామచంద్రుఁడువలె భార్యలతో నిష్టాగోష్ఠివిశేషంబుల సంభాషించుకొనుచు నక్కాంతలకుం గల చక్కఁదనంబుల తారతమ్యములఁ దెలిసికొనుచుఁ దాముపడిన యిడుమల నొండొరుల కెరింగించుకొనుచు స్వదేశాభిముఖులై యరుగుచున్నారు గోపాలా! నీవు చూచినది వారి కీలురథముసుమీ! యని యెఱింగించిన సంతసించు గొల్లవానికి వింటివా! కథ స్పష్టముగా దెలిసినదికద. వా ర ట్లరిగి తమకై కుందుచున్న తల్లిదండ్రుల కానందము గలుగఁజేసిరి.
అని యెఱింగించిన యాకథావృత్తాంతమెంతయు నాగొల్లవాడు ప్రయాణంబు సేయునప్పుడు జ్ఞాపకమునకు దెచ్చుకొనుచు నవ్వరప్రసాదుల యదృష్టమునకు మెచ్చుకొనుచుఁ గ్రమంబున నాయతీంద్రునివెంటఁ గావడి మోసికొని ముందరమజిలీ జేరెను.