వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము
శివాలోకనము
అంకితము
ఈ “శివాలోకనము” ఖండకావ్య సంకలనం వావిలాల కైకమ్మ, సోమయాజుల మైన మా ఉభయుల జ్యేష్ఠ పుత్రుడు కీర్తిశేషులు నా పెత్తల్లి సుబ్బాయమ్మ, పెత్తండ్రి రామచంద్రశాస్త్రిగార్ల దత్తపుత్రుడు
స్వర్గీయ విశ్వనాథ ఛాయాపతి స్మృత్యర్థము
బిడ్డడవు నీవు పుట్టిన పెంచుకొనగ
కాకయున్న పుత్రునిగ ననె స్వీకరింప
తలపుగొనియున్న నాదు పెత్తండ్రి - హృదయ
కాంక్ష దీర్ప పుట్టితివి మా గర్భమందు.
ఆ సుజను పితృమేధార్థ మవతరించి
నట్టి కారణజన్ముండ వరయ నీవు
భీష్ము నేకాదశికి వేచి, వీడి పృథ్వి,
మాకు కల్గించినావు నమ్మకము తండ్రి!
'పెంపకము' వల్ల, నీ వ్యాధి పెరుగుచుంట
విద్య అక్రమవిధానమున ప్రాప్తించలేదు
‘బహుముఖీనమ్ము’గా నబ్బె ప్రతిభ నీకు,
నృత్య చిత్రకళలు కొంత నేర్చినావు.
నాదు సాహిత్య జీవన నందనాన
విహరణము చేసి భావ వైవిధ్యగతుల
బహుముఖీనతాదృష్టి, దుర్వారరక్తి
పొంది సంతోషపరచి తో పుత్ర! నన్ను.
యౌవ నారంభమున నిను గన్నవారు
'తల్లి, కైకమ్మ - మహలక్ష్మి, తనయు డడుగో,
అందగాడు, రతీభర్త' అంచు పలుక
వినగ నానందమును, శీలభీతి గలిగె.
ఎందరో పుణ్యజనుల దర్శించి నీవు
జ్ఞానివైనావు శుద్ధసంకల్పగరిమ,
బంధుమిత్రుల యనురాగ భద్రతలతో
చేసితివి జనప్రీతికర జీవయాత్ర.
దీనజన రక్షణార్థమ్ము పూనుకొనెడు
దానధర్మాల యెడ బుద్ధి తరుగ దెపుడు
ఋణమొనర్చు చిచ్చెదవు సుశ్లోకులయిన
శాస్త్ర సాహిత్య విద్యా విశారదులకు
ఏమి బోధించినను పరు, లేమి విన్న
సోదరీసోదరుల ఎడ నీదు హృదిని
ఎట్టి వైషమ్యమును సోక దించుకైన,
చూచుకొంటివి గాఢవిస్ఫూర్తితోడ.
నీదు సోదర సోదరీ నిచయ గేహ
ములను బాల లతా వృక్షములు జనించె
అమరలోక నివాసీ వనవరతము
వచ్చి పోషించుకొనుము నీవాని, వాని.
విషయ సూచిక
15 |
21 |
26 |
29 |
35 |
37 |
40 |
44 |
50 |
53 |
55 |
61 |
65 |
71 |
ముందుమాట
అభిజ్ఞ రసజ్ఞుల కరకమలాలను అలంకరించిన ఈ కావ్యం పేరు “శివాలోకనము”. దీనిని రచించినవారు "కుమార ధూర్జటి" బిరుదాంకితులు శ్రీవావిలాల సోమయాజులు గారు.
ఉ. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగ వీచినట్లు, తీ
వలు తల బూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొ
వ్వలపులు లేచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు ఆ
త్మలు పెనవైచినట్లు కవితల్ రచియింతురహో మహాకవుల్!!
సుమారు నలభై సంవత్సరాలకు పూర్వం కవితాసరస్వతి స్వరూపాన్ని
నిరూపించుతూ నేను వ్రాసిన పద్యమిది. ఇటువంటి కవివరేణ్యుల కోవకు చెందినవారు
శ్రీవావిలాలవారు.
సహృదయ బంధువూ, సారస్వత సింధువూ, సౌజన్య నీరధీ, సౌహార్ద సారథీ అయిన శ్రీవావిలాలవారు తమ కవితా సంపుటికి “శివాలోకనం” అని పేరు పెట్టారు.
శివాలోకనం! ఎంత చక్కని పేరు? ఎంత చిక్కని పేరు? "శివ" శబ్దానికి ఈశ్వరుడు అనీ, శుభం అనీ అర్థం. “శివా” శబ్దానికి పరమేశ్వరి అని అర్థం. “శివాలోకనం" అని తన కావ్యానికి పేరు పెట్టటం వల్ల పైన చెప్పిన మూడింటి ఆలోకనం అనీ, కవి హృదయం అవగతమవుతున్నది.
ఈ కావ్యంలో మొత్తం ఎనిమిది కవితా ఖండికలు ఉన్నాయి. అవి, వాత్సల్యప్రియ, ఉజ్జీవము, పరివర్తన, భ్రష్టయోగి, మాచలదేవి, ఆత్మార్పణము, విన్నపము, బృహన్న లాశ్వాసము అనేవి. శివాలోకనంలోని ఈ అష్ట ఖండికలూ అష్టమూర్తి అయిన పరమశివుని స్వరూపాన్ని స్పురింపజేస్తున్నాయి. ఇలా తన కావ్యం ద్వారా ఆ "ధూర్జటి”ని, ఈ "కుమార ధూర్జటి” మనకు ప్రత్యక్షం చేయించటంలో ఎంతో ఔచిత్యం ఉంది.
“వాత్సల్య ప్రియ”లో చిన్ని కృష్ణుని అల్లరి పనులు మానమని అనేక విధాలుగా బోధిస్తున్న మాతృమూర్తి యశోదాదేవి అంతరంగ తరంగాలు పొంగిపొరలాయి. “ఉజ్జీవం”లో తానే దేవతలకు రక్షకుణ్ణి కాగలిగాననే దుర్గర్వంతో దూసుకువచ్చి శివ తపోభంగానికి తలపడిన మన్మథుని మనోమథనం మూర్తి గట్టింది.
“పరివర్తన"లో వల్లమాలిన అహంకారంతో తమ్మునితో తగాదాకు దిగి, రామబాణం తగిలి నేల కూలిన వానరరాజు వాలి వ్యాకుల హృదయం వ్యక్తమయింది.
“భ్రష్టయోగి"లో పరమతపోనిష్ఠకు ప్రయత్నించినప్పటికీ ప్రకృతిని జయించలేక పోయిన ఒక యోగివరుని తలపులు తేటతెల్లమైనాయి.
ఇక కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుని ఉపపత్నీ, సంగీత నాట్యకళా విశారదా అయిన మాచలదేవి ఔన్నత్యమూ, ప్రత్యేకతా "మాచల దేవి” అన్న కవితలో కళ్ళకు కట్టించబడినాయి.
“ఆత్మార్పణం” అన్న కవితలో కర్ణుని స్వామిభక్తీ, మైత్రీ మాధుర్యమూ, ధర్మాధర్మ విచికిత్సా, ఉచితజ్ఞతా, పరాక్రమ ప్రదర్శనాభిలాషా, కృష్ణభక్తి, అచంచల స్వభావమూ. ఆత్మాభిమానమూ, సత్యసంధతా స్పష్టమైనాయి.
“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ?” అని ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలచే ప్రశంసింపబడిన శివభక్త శిఖామణి ధూర్జటి మహాకవి హృదయఘోష, “విన్నపం” అన్న ఖండికలో నిండుగా నింపబడింది.
"బృహన్నలాశ్వాసం” అన్న చిట్టచివరి కవితాఖండికలో ఆడవారి యెదుట బీరాలు పలికి ఆడంబరంగా కౌరవులతో యుద్ధానికి సిద్ధమైన ఉత్తర కుమారుడు, సమయానికి వెన్ను చూపి రథం దిగి పారిపోతుంటే, బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు అతనిని ఊరడించి ధైర్య స్థయిర్యాలను నూరిపోయటం వెల్లడింపబడింది.
ఈ విధంగా విభిన్నవ్యక్తుల హృదయాలలోకి పరకాయ ప్రవేశం చేసి, వారి వారి చిత్తవృత్తులను వివిధ రీతులలో చిరస్మరణీయంగా చిత్రించారు శ్రీసోమయాజులు గారు తమ “శివాలోకనం"లో.
చిత్రం ఏమిటంటే “శివాలోకనం” అనే పేరుతో ప్రత్యేకమైన కవిత లేకపోయినప్పటికీ కవితాసంపుటి మొత్తానికి ఆ పేరు పెట్టి తమ నామౌచిత్య పాటవాన్ని ప్రకటించుకున్నారు వావిలాలవారు. అన్ని కవితలలోనూ అంతస్సూత్రం "శివాలోకనమే” అన్న రచయిత క్రాంతదర్శనానికి అది నిదర్శనం. ఇక ఈ కావ్యంలోని సాహిత్య సౌందర్యాన్ని ఇంచుక పరిశీలిద్దాం. వీరి సుమసుకుమారమైన శయ్యాసౌభాగ్యాన్ని వెల్లడించడానికి ఈ క్రింది పద్యాలు చాలు.
"ఈ సెలయేటి కేమిటికొ యింతటి వేగము నీ వెరింగినా
వే సఖి! చేసెనే ప్రియుని యింటికి జేరగ ప్రొద్దు క్రుంకగా
బాసట అందుకౌ త్వర - త్రపారహితంబుగ నేగుచున్నదే
ఆ సెలయేటి మానసము నందలి కోర్కెల నూహ సేయుమా!”
“హాసౌజ్జ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీపాలావతంసోన్నత
ప్రాసాద ప్రమదావనాంతలతికా వాల్లభ్యపుష్పాళిలో
నీ సమ్మోహన ముగ్ధరూప సుమమో నీరేజపత్రేక్షణా!!”
వావిలాల వారి అలంకార సౌభాగ్యాన్ని ఔపమ్యరమ్యమైన ఈ క్రింది పద్యం
వ్యక్తీకరిస్తుంది.
"కనకపు కంబ మొండు స్ఫటికంపు సురమ్య విశాలహర్మ్యమం
దున లగియించి నట్టులుగ తోచెడి శర్వుడు యోగశక్తిచే
ననుచగ నాత్మతేజము మహోన్నత దేహమునందు మున్ను నే
ననుకొన నీశు డర్యమ సహస్ర కళాకలితుం డటం చెదన్.”
ఒయ్యారాన్ని ఒలకబోసే ఈ ఎత్తుగడలు చిత్తగించండి...
- అ) ఎన్నడులేని యీ యొదుగు లెచ్చట నేర్చినదీ పికంబు?
- ఆ) ఈడుకు తగ్గ చేష్ట లగునే వ్రజభామినులార!
- ఇ) కాకులమూక లోకము ప్రకారము వింతయె
- ఈ) కాళులు లేక చిక్కితిమె కాలవశంబున చిక్కినాము.
- ఉ) అవును నిజమ్మె కుంతి కనెన్నది నమ్మితి.
- ఊ) నేనొక తేపగాగ నవనీపతి దాటదలంచె.
ఈ క్రింది పద్యాలలోని తెలుగు నుడికారాలు సుమనో మనోజ్ఞంగా ఉన్నవి.
'ఏగతి వచ్చి చేరితివి యింటికి వాకిట నిల్చియుంటి కా
దా గజదొంగ! మూసితివి అమ్మకు కన్నుల దొడ్డిగుమ్మమున్
నే గడివేసి వచ్చితిని నీ కెటు వచ్చెనొ! ఇట్టులైన నే
లాగున నిల్వగాగలమురా నిను పెట్టుకు ఊరిలోపలన్!"
“అడుగుల కడ్డువచ్చి తడియారని కన్నులతో కపోలముల్
వెడవెడ వెల్లనై సొగసు వీడగ వీడుట కొప్పుకోని నీ
యెడదను దిద్ద ఉన్నయటులే చనుదెండు యుగమ్ము కాదె మీ
కడ నిలువంగలేని క్షణకాలము నా కని యార్తవైతివే!”
చిన్ని కన్నయ్య అల్లరి అనిర్వచనీయం. చెరువుకు గండి కొట్టాడని ఒకరూ,
జింకల గుంపును పొలంలోకి తోలాడని మరొకరూ, అరకల కర్లు లాగాడని ఒకరూ,
మంచెలు విరగగొట్టాడని ఇంకొకరూ, గడ్డ పలుగులను కనపడనీయక మట్టిలో
కప్పెట్టాడని వేరొకరూ, చెట్టుమీద దాచుకున్న దుత్తలోని పెరుగన్నం ఖాళీ చేశాడని
కొండొకరూ - ఇలా గోపగోపికలు బాలగోపాలుడి చిలిపి పనులను యశోదాదేవికి
చెప్పుకున్న సందర్భం సహజసుందరం.
దండిగా కొండేలు చెప్పిన నందవ్రజం వారి పలుకులు. విని 'కృష్ణుణ్ణి పట్టుకుందామని పరుగెత్తిన యశోదకు కాళ్ళు "కండెలు కట్టాయి. 'ముత్తైదువ' లాగా ఏమీ ఎరగనట్లు నీతిగా కూర్చున్నాడు కృష్ణుడు. జన్మతోనే "నటకాగ్రగణ్యు"డైన ఆ పిల్లవాణ్ణి ఆమె ఏం చేయగలుగుతుంది? అవి "ఈడుకు తగ్గ చేష్టలగునే?” అని వాళ్ళను మందలిద్దామంటే, వెంటనే 'చిన్నబిడ్డ లీ యీడుకు కొండలెత్తుచు ఫణీశు లతో చెరలాట మాడిరే!' అని, వాళ్లెక్కడ అంటారో అని మెదలకుండా ఊరుకుంది యశోద.
"తల్లికి నాకు తీరినది ధర్మము వీడుచు గంగ చేతిలో నుల్లము రాయి చేసుకొని యుంచిన యప్పుడె” అనీ, "స్వామికి ఉపాయనమై ఋణమెల్ల తీర్చెదన్" అనీ, "అతని సుఖమ్మె నా సుఖము అతని దుఃఖమె నాదు దుఃఖమై మతు లొకటై చరించితిమి మంచికి చెడ్డకు" అనీ, "ఇహపరా లేమైన నాకేమి నా ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే" అనీ కృష్ణుడితో కర్ణుడు పలికిన పలుకులలో అతని ఆత్మాభిమానమూ, ధర్మబుద్ధి, స్నేహశీలతా, కృష్ణభక్తి, ద్యోతకమైనాయి.
“జగము సమస్తమున్ నవరసాలము పోలిక సాంధ్యరాగపున్ జిగిని వెలుంగ”
"ఎద నదియై స్రవింప”
"ఏనాడైన భువిన్ అసూయ కలుషం బీర్ష్యావ్యథాశాంతియే
కానన్ రావు సమత్వ మభ్యుదయ మగ్రామ్యంబు సౌఖ్యంబు”
"శిరమున నున్న గంగ శశిశేఖర: నా రసనాంచలమ్ము నన్
దిరముగ నిల్పుమయ్య”
“నా కొక జన్మమున్న భువి నన్ జనియింపగనిమ్ము స్వామి : నీ
వాకిట బిల్వవృక్ష మటు వత్సలతన్”
"భోగము లారగించు తలపుల్ కొని చంచల చంచరీక హృ
ద్వేగ గతిన్ చరించి భ్రమ తీరగ జేరితి నిన్ శివా!”
- మొదలైన పద్య పంక్తులలోని హృద్యానవద్యములైన భావాలు గమనింపదగినవి.
సందర్భ సముచిత సమాసవిన్యాసం వావిలాల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సురుచిర సమాససంఘటనం చూడండి -
ప్రౌఢానంత వాసంత లీలాలాలిత్యము, అనంత విలాస శకుంత సంతతులు, మహోన్నత భక్తి రసప్రపూత, చండీశోద్ధత కార్ముకోపమ మహాచాపమ్ము త్వదీయ ధనురంచిత జంభర మంజు శింజినీ రసభర ఝాంకృతీ ధ్వని, ఐంద్రద్వీపోద్గళ ఘంటారవ పాటవోజ్జ్వల లసత్కావ్యంబు మొదలైనవి అనాయాససమాస లాస్యవిలాసాన్ని వ్యక్తం చేస్తాయి.
కాటికి కాళ్లు చాచుకొను, గంపెడు కోర్కెలు, మిన్నుల తన్ని పోరగల మేటి బలాఢ్యుడు, ఉప్పెన నవ్వు, కదనదోహలి, దురుద్యోగి, కనుచూపు వెన్నెలల తీరము, తడబడు గుండె, గాలి బుడతలు, ఎడద ఉయ్యాల వంటి జాతీయాలూ, శబ్దసంపుటులూ - వావిలాల వారి ప్రత్యేక ప్రతిబింబాలు.
ఈ విధంగా బహుముఖీన గుణగణమండితమైన “శివాలోకనం" సహృదయు లందరికీ సదా సదాలోకనమై, సాహిత్యజగత్తులో వ్యక్తిత్వం ముద్రాభద్రమైన స్థానాన్ని వావిలాల వారికి వాటిల్ల జేస్తుందని నా విశ్వాసం.
సోమయాజులు గారి వ్యాసాలు, కావ్యఖండికలు, నాటకాలు మొదలైన వెన్నో పుంఖానుపుంఖాలుగా సుప్రసిద్ధ సాహిత్య పత్రికలైన భారతి, ప్రతిభ, గృహలక్ష్మి, ఆనందవాణి మొదలైనవాటిలో ప్రచురితమై, పాఠకుల ప్రశంసల్ని అందుకున్నాయి. ఎన్నో గ్రంథాలు పాఠ్య గ్రంథాలుగా విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో నిర్దేశింపబడినాయి. సోమయాజులుగారి వివరణ, వ్యాఖ్యానం, తాత్పర్యంతో కూడిన 'నోట్సు' చదవని కళాశాల విద్యార్థి లేడంటే అతిశయోక్తి కాదు.
వావిలాల వారిది వెన్నలాంటి మనస్సు. వెన్నెల లాంటి చిరునవ్వు. వేణువు లాంటి గాత్రం. వేదం లాంటి విజ్ఞానం. వేలుపు లాంటి రూపం. జీవితంలోని అందాన్ని, ఆనందాన్ని పదిలంగా ఆస్వాదించి, తోటివారికి పంచిపెట్టగల చరితార్థుడు రసవేది, రసవాది వావిలాల.
సోమయాజులు గారి శేముషీవిశేషం అంతా ఏండ్ల తరబడి విద్యార్థులకు 'గైడ్లు' వెలయించటంతోనే చెల్లింపబడిందనీ, రావలసినన్ని కావ్యాలు వారి చేతి మీదుగా రాలేదనీ తపనపడేవారిలో నేను మొదటివాణ్ణి. ఇప్పుడు ఈ విధంగా వారి రచనలు వెలువడటం అస్మదాదులందరికీ అపరిమితానందాన్ని కలిగిస్తున్నది.
కవిత్వం, పాండిత్యం, పరిశోధనం, ఆచార్యత్వం, వక్తృత్వం, మిత్రత్వం ఏకీకృతమైన రూపం ఆయనది. ఇతోధికమైన గ్రంథాలు ఆయన నుండి వెంట వెంటనే వెలికి రావాలని కోరుతూ నా “ముందు మాట" ముగిస్తున్నాను.
- డాక్టర్ కరుణశ్రీ
అక్షరాంజలి
ఈనాడు - స్ఫురద్రూపియైన వయోవృద్ధుడుగా సమకాలీనలోకానికి కన్పించే శ్రీవావిలాల సోమయాజులుగారు - నాకు సుమారు ఒక అర్ధశతాబ్దికి పూర్వం - జ్ఞానవృద్ధుడైన కవి కుమారుడుగా సుపరిచితులు. “శ్రీసోమయాజులుగారికి రావలసిన కీర్తి రాలేదు" అని అప్పుడప్పుడు నాలో నేను అనుకున్నాను గాని, అది సరియైన అభిప్రాయం కానే కాదు. అభిజ్ఞులు పలువురకు సాహితీతపస్వి శ్రీసోమయాజులు గారి రచనల విలువ తెలుసు. సమకాలీన విజ్ఞులు ఆయనను "కుమార ధూర్జటి” - “సాహిత్యాచార్య” - “సౌహార్ద సారథి" “సాహిత్య బంధువు" - "సాంస్కృతిక సింధువు" ఇత్యాది బిరుదులు ఇచ్చి సత్కరించారు. “వెన్నవంటి చిరునవ్వు” - “వేణువు వంటి కంఠస్వరం” - “వేదం వంటి విజ్ఞానం” “వేలుపు వంటి రూపం” - పంచ వషట్‌కార సంస్కార సంపన్నుడు శ్రీవావిలాల సోమయాజులు అని సాహితీ సహవ్రతులు ప్రస్తుతించారు. నేడు ఈ కవితా ఖండికలు ప్రచురించటానికి నడుం కట్టుకొని ముందుకు వచ్చిన శ్రీఊట్ల కొండయ్యగారు విజ్ఞులలో విజ్ఞుడు.
శ్రీసోమయాజులుగారి కవితలకు పరిచయ వాక్యాలు వ్రాయగలిగిన ఏకైక వ్యక్తి సాహితీ సమితి సంస్థాపకుడు సభాపతి స్వర్గీయ తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారు. నేడు వారు లేరు. ఇక సోమయాజులుగారితో కలిసిమెలిసి తిరిగినవారు పలువురు భూలోకంలో లేనే లేరు. నేటికీ సజీవుడై యున్న వయోవృద్ధుడను నేను గనుక ఈ “భారం” నా మీద పడింది. నిజానికి ఇది భారం కాదు, నా భాగ్యమే!
1942 సంవత్సరంలో శ్రీజంధ్యాల పాపయ్యశాస్త్రి గారు, శ్రీవావిలాల సోమయాజులుగారు, నేను తరచు శ్రీ శివశంకర శాస్త్రిగారిని గుంటూరులో దివ్యజ్ఞాన సమాజం ఆవరణలో సాయంసంధ్యా కాలంలో కలుసుకుంటూ ఉండేవారం. శ్రీ శివశంకరశాస్త్రిగారు సహజసాహితీ కవచకుండలాలతో అవతరించిన “సభాపతి”. ఆయనకు ఆప్తమిత్రుడు నవ్య సాహిత్య పరిషత్తు కార్యదర్శి శ్రీతెలికిచెర్ల వేంకటరత్నంగారు అక్కడకు వచ్చేవారు. గుణగ్రహణపారీణుడైన శ్రీవేంకటరత్నం గారికి, శ్రీవావిలాల సోమయాజులు గారిపై ప్రత్యేకమైన “మోజు” ఉండేది. నవ్య సాహిత్యపరిషత్తు ఆయన దత్తపుత్రిక. ఆయన అతిథి సేవాపరాయణత్వంలో అభినవ పెరియాళ్వారు. ఆయన ఇంటిలో శనివారము నందు మాత్రమే గాక, నిత్యం అతిథిపూజ అర్ధరాత్రి వరకూ జరిగేది. శ్రీఅడివి బాపిరాజు, శ్రీవేదుల సత్యనారాయణ శాస్త్రి, శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రభృతులు తమ నూతనకవితలు వినిపించేవారు. తెరమరుగున నిలిచి నవ్య సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసినవారిలో ప్రాతఃస్మరణీయుడు శ్రీతెలికిచెర్ల వేంకటరత్నం గారు. ఆయన “ప్రతిభ" పత్రికకు సంపాదకుడు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆంధ్రశాఖకు అధిపతి. ప్రతిభను గుర్తించటంలో ఆయన కన్నులు దృగ్భిణీ యంత్రాలు. ఆనాడు అనామకులుగా నిరుద్యోగులుగా అలమటించే యువ నవ కవులను చేరదీసి కేవలం పరోపకార పారీణతలో ఆంధ్ర క్రయిస్తవ కళాశాలలో ఉద్యోగాలు ఇచ్చి, ప్రతిభ పత్రికలో వారి రచనలు ప్రచురించి ఆదరించిన మహనీయుడు ఆయన. శ్రీపాపయ్యశాస్త్రికి, నాకు మొట్టమొదట ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే. ఆ నాడు పలువురు యువకవుల నవనవోన్మేష ప్రజ్ఞకు ఆటపందిరి 'ప్రతిభ' పత్రిక.
“సభాపతి” శ్రీశివశంకర శాస్త్రిగారు ఆ నాడు 'నవీన బహుళాంధ్రోక్తిమయ ప్రపంచానికి' సాహిత్యాచార్యుడు. శిష్యవత్సలుడైన ఆయనకు - భారతంలో ద్రోణాచార్యులకు అర్జునునిపై ఉన్నట్లు - శ్రీసోమయాజులు గారిపై పక్షపాతప్రాయమైన ప్రత్యేకప్రేమ ఉండేది. నేను ఆ తల్లావజ్ఝల వారికి ఏకలవ్య శిష్యుడను. సుదూరంగా నిలిచి ఆయనను ఆరాధించేవాడిని. నవ్య సాహితీ మహోద్యానవనంలో విచ్చకముందే “మొగ్గల”లోని సౌందర్య సౌరభాలను రంగరించి ప్రపంచానికి ప్రసారం చేసిన సహృదయామోద గంధవహుడు ఆ మహానుభావుడు. శ్రీవావిలాల సోమయాజులుగారు శ్రీశివశంకర శాస్త్రిగారికి అభిమానపాత్రుడైన "గద్య పద్య కావ్య నిర్మాణ చాతురీ సవ్యసాచి". గద్య రచయితలు పద్య రచయితలు కాకపోవచ్చు. అట్లే పద్య రచయితలు గద్య రచయితలు కాలేకపోవచ్చు. శ్రీ సోమయాజులుగారి అసలు ప్రజ్ఞ పద్యరచన.
"ఏక శ్లోకః ప్రబంధ శతాయతే” అన్న ప్రశస్తి సంస్కృతంలో అమరుకునకు అన్వయిస్తారుగాని - వంద ప్రబంధాలతో సరితూగగల ఒక పద్యం వ్రాయగల నేర్పు తెలుగులో శ్రీవావిలాల సోమయాజులు గారిది. కవిత వాగర్థాల వర్ణనాతీత సమ్మేళనం. భాష భావాల కలయికలో పార్వతీ పరమేశ్వరుల పవిత్ర దాంపత్యం పరిఢవిల్లాలి! ఆకాశనీలాల కవ్వలి సీమల మేరలకు ఎగురగలిగే ఎత్తయిన భావాలు - కడలి లోతులు తడివి చూడగల నుడికారపు కెరటాలపై తేలియాడే పలుకుబడులు కలిస్తేనే - అది ఆలోచనామృతం అనదగిన కవిత అవుతుంది. కవిత - ఆపాతమధురం కాదు. శ్రీసోమయాజులుగారి కవనాలు తొలకరి చిటపొటి చినుకులు కావు. అవి వేసవి వడగళ్ళ వానలు.
వీరు వ్రాసిన పద్యనాటికలు, ఏకాంకికలు రంగస్థలాన్ని, ఉరుములతో మెరుపులతో నింపేస్తాయి. వీరు వ్రాసిన గద్య పద్య నాటకం - “నాయకురాలు” ఆంధ్ర నాటక రంగస్థలంపై వడగళ్ళు - ఉరుములు మెరుపులు సృష్టించటమే గాక - పిడుగుల పిండు కురిపించింది.
శ్రీసోమయాజులుగారి గద్యరచనకు గీటురాయి “మణి ప్రవాళం” వ్యాసమంజరి. వ్యాసరచన తెలుగువారు అభ్యసించిన క్రొంగొత్త విద్య. తెలుగు వారికి ఈ కళలో ఒరవడి దిద్దినవారు ఆంగ్లేయులు. ఆంగ్ల వ్యాసరచయితలలో తాడిని తన్నినవారు - భారతీయులు కొందరు ఉన్నారు. తాడి తన్నినవారి తల తన్నినవాడు ఆంధ్ర “మణిప్రవాళ” వ్యాసమంజరి రచయిత. వ్యావహారికమైన కర్మ జగత్తులలో బ్రతుకు పోరాటంలో విశ్రాంతి కోరేవారు అవశ్యం చదువదగినట్టిది “మణిప్రవాళ” వ్యాసమంజరి.
ప్రస్తుత గ్రంథంలో ఉన్న కావ్యఖండికలు - ఉజ్జీవము. పరివర్తన, మాచలదేవి, ఆత్మార్పణము, విన్నపం మున్నగునవి. ఇవి అన్నీ లోగడ ప్రతిభ మున్నగు పత్రికలలో పడినట్టివే. ఇందలి పరివర్తన రామ బాణోపహతుడైన వాలి స్వగతం. ఆత్మార్పణం కర్ణుడు శ్రీకృష్ణునితో జరపిన ఏకాంత సంభాషణ. ఈ రెండు ఖండికలు వింటే వాల్మీకి - వ్యాస మహర్షులు తలలూపక తప్పడు - అని నా అభిప్రాయం. మహాభారత రామాయణ కావ్యాలే కాక కాళిదాస ప్రభృత కవులు చేసిన ప్రౌఢప్రయోగాలు, శ్రీసోమయాజులుగారి తెలుగు కవితలలో ఎడనెడ సాక్షాత్కరిస్తాయి. మూడు వేల సంవత్సరాల సంస్కృత ప్రౌఢప్రయోగాలు, వేయి సంవత్సరాల గడుసరి తెలుగు నుడికారపు సొంపులు, వంపులు స్వాయత్తం చేసుకున్న సంస్కారి శ్రీసోమయాజులుగారు.
నేను అనంతపురంలో ఉన్నప్పుడు - శ్రీసోమయాజులుగారు పద్యాలలో ఒక “సుహృల్లేఖ” నాకు అందించారు. అది ఒక అపర మేఘసందేశకావ్యం. ఆయన
దూతగా పంపిన మేఘుడు
“ఇంచు కాడంబరుడు గర్వి ఏమొ గాని
జలద యువకుడు వాడు ప్రశస్త గుణుడు
భావుకత వెఱ్ఱియై నింగి పర్వులెత్తు
మనవలెనె వాడు పాడక మనగలేడు.”
నాకు పలువురు సహృదయులు విద్వత్ కవులు సన్మాన పత్రాలు ఎన్నెన్నో
అందించారుగాని - అన్నిటిలో శ్రీసోమయాజులుగారి సుహృల్లేఖ - మకుటాయమాన
మైన సన్మాన పత్రముగా భావించి నేను భద్రం చేసుకున్నాను.
సంస్కృత సాహిత్యాన్ని మాత్రమేగాక శ్రీసోమయాజులుగారు ఆంగ్లవాఙ్మయాన్ని గూడ ఆపోశనం పట్టారు. షేక్స్‌పియరు నాటకాలను వారు తెలుగులోకి అనువదించిన తీరు తీయాలు, తరతరాలవారికి ఒరవడులుగా నిలుస్తాయి.
ఆంధ్రుల సాహితీ సంప్రదాయంలో - భువన విజయం - అష్టదిగ్గజకవి వ్యవస్థ విశిష్ట స్థానాన్ని పుంజుకున్నాయి. ఆధునిక కాలంలో అష్ట దిగ్గజాలను ఎన్నుకోవలసి వస్తే - శ్రీసోమయాజులుగారికి ఏకగ్రీవంగా లభించేది "ధూర్జటి” పాత్ర. వీరు వ్రాసిన “విన్నపం” ఆధునికాంధ్ర వాఙ్మయంలో విశిష్టమైన రచన. అష్టదిగ్గజాలలో ధూర్జటి విశిష్ట వ్యక్తిత్వం గల మహాకవి. ఆంధ్ర వాఙ్మయములో మాత్రమే గాక, ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం విశ్వసాహితీ రచనలోనే సాటిలేని ఉజ్జ్వల రచన. ఆంధ్ర సాహితీ పట్టభద్రుడు కాగోరేవారు ధూర్జటి వ్రాసిన ప్రతి పద్యం తప్పనిసరిగా చదవాలి. అథవా - శ్రీసోమయాజులుగారు వ్రాసిన “విన్నపం” పూర్తిగా కంఠస్థం చేయాలి - అని నా అభిప్రాయం. ఈ ఖండిక 1952 నవంబరు భారతిలో ప్రచురింపబడింది.
ఈ పద్యాలు శ్రీసోమయాజులుగారు తాడేపల్లిగూడెంలో కవి సమ్మేళనంలో చదివినపుడు నరసాపురం వాస్తవ్యులు డాక్టరు పొన్నపల్లి సుబ్రహ్మణ్యం గారు ఆనందబాష్ప విలులిత నేత్రాలతో విని సద్యఃపరనిర్వృతిలో లీనమైపోయారు. తదుపరి శ్రీసోమయాజులుగారికి సత్కారం చేయటానికి నరసాపురంలో డాక్టరుగారి అధ్యక్షతన ఒక సన్మానసంఘం ఏర్పడింది. దానికి నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అధ్యక్షుని అకాలమరణంతో ఆ సన్మానం జరుగలేదు. ఆ బాకీ తీర్చవలసిన బాధ్యత నాపై ఇంకా మిగిలి ఉంది. ఇంకా ఈ గ్రంథం ప్రచురణ - ఈ గ్రంథం ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని, నా సౌహృదఋణం తీర్చుకోవాలని నా తహ తహ! శ్రీవావిలాల సోమయాజులుగారి పద్యాలు గోరుముద్దలు కావు. గుజ్జనగూళ్ళు కావు. సెనగ గుగ్గిళ్ళు కావు. అవి సానబట్టిన వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మణిమాణిక్య శకలాలు. పూత పసిడి తళతళలతో చెమికీ దారాలతో చీరెలు నేసేవారు - లంబాడీ లంగాలు కుట్టుకునేవారు వీటి జోలికి పోనక్కరలేదు. భావికాలంలో, సాహితీ ప్రతాపరుద్రులు కాగోరేవారు, కవితా కిరీటధారులు కాగోరేవారు, వీటిని కష్టపడి సేకరించి వినియోగించుకొని, తమ శిరస్సుల చుట్టు పరివేషప్రభలు తీర్చిదిద్దుకోవచ్చు.
- ప్రగతి గీతాప్రవక్త
డా. నండూరి రామకృష్ణమాచార్య
సమీక్షణం
నేను మెడపైకెత్తి చూచేటంత ఎత్తైన వ్యక్తిత్వం గల మనీషి శ్రీ వావిలాల సోమయాజులుగారు. ఆయన సుహృదయ స్పందన నుండి, ప్రౌఢధిషణ నుండి ఆవిర్భవించిన ఈ పద్యకావ్యానికి నేను నాలుగు మాటలు సమీక్షారూపంలో రాయటం కేవలం విద్యావయో వృద్ధులైన మా ఊట్ల కొండయ్యగారి మెత్తని ఆజ్ఞవల్లనే:
ఈ కావ్యాన్ని "శివాలోకనము” అనటంలోనే కావలసినంత కవిత్వం వుంది. కావ్య ప్రయోజనాన్ని వివరిస్తూ మమ్మటుడు
"కావ్యం యశసే౽ర్థకృతే వ్యవహార విదే
శివేతరక్షతయే సద్యః పర నిర్వృతయే
కాంతా సమ్మిత తయోపదేశయుజే”
అని వక్కాణించాడు. ఈ నిర్వచనంలోని శివేతరక్షతే యీ కావ్యానికి శివాలోకన
మయ్యింది. అంటే అమంగళ పరిహారార్థమన్న మహత్తర కావ్యప్రయోజనం కాస్తా
"మంగళ ప్రదమైన చూపు" అయ్యింది.
ఈ రకమైన అంటే “విశ్వశ్రేయః కావ్యమ్" అనే లక్ష్యంతో కూడిన శివాలోకనం గల కవే జగత్కల్యాణాన్ని సాధించగలడు. అయితే అటువంటి 'చూపు' కలగాలంటే చిత్తసంస్కారం చాలా అవసరం. కవుల స్థానం ఈ చిత్తసంస్కారాన్ని కలిగించటంలోనే నిర్ణయించబడుతుందనే సత్యాన్ని Emerson అనే పండితుడు, "Great Poets are judged by the frame of mind they induce in us" అంటూ చెప్తాడు. ఈ కావ్యాన్ని చదివి ఆలోచనామృతాన్ని ఆస్వాదించిన తర్వాత, సోమయాజులు గారి మహాకవి అనని సాహిత్యాభిమానులుండరని నా విశ్వాసం.
మానవుని దుష్టప్రవృత్తిని క్షాళనం చేసి, ఉత్తమ సంస్కార బీజాల్ని అతని హృదయ క్షేత్రంలో నాటగల మహత్తర కావ్యాలు భారత, భాగవత రామాయణాలు. ఈ కావ్యంలోని “ఆత్మార్పణము”, “బృహన్నలాశ్వాసము” అనే ఖండికలు భారతానికి, 'వాత్సల్యప్రియ” అనే ఖండిక భాగవతానికి, “పరివర్తన" అనే ఖండిక రామాయణానికి అనుబంధాలు కాగా, “భ్రష్టయోగి” అనే కవిత కూడా మేనక అంటిన విశ్వామిత్రుణ్ణి గుర్తుకు తెస్తూ రామాయణ స్పర్శతోనే వున్నట్టుగా కనిపిస్తూ వుంది.
పౌరాణిక ఇతివృత్తమైన కుమార సంభవం ప్రతిధ్వనించే కవితాఖండిక “ఉజ్జీవనము”. శివుని మీదికి దండెత్తి వెళ్లి, తన అశక్తతని అర్థం చేసుకొన్న మన్మథుని ఆంతర్యం ఉజ్జీవనంగా పొంగులెత్తింది. ఇలాగే, శివునికి ముడిపడ్డ మరో కవిత ధూర్జటి మహాకవి ఆంతర్యాన్ని నివేదించే “విన్నపము”. ఈ “ఉజ్జీవనము” “విన్నపము” - అనే రెండు కవితలూ నిజంగా శివాలోకానికి సంబంధించి, కావ్యశీర్షికని సార్థకం చేస్తూ ఉన్నాయి.
ఇంక, ఈ కావ్యంలోని "మాచలదేవి”, “కర్తవ్యము" - అనే రెండు కవితలు కాకతీయ చరిత్రకు సంబంధించినవి. ఈ రెండింటిలో శృంగార, వీరరసాలు తరంగితమవ్వడాన్ని సహృదయులు గమనించగలరు. అలాగే "వాత్సల్యప్రియ"లో వాత్సల్యరసం, "ఉజ్జీవనం”, “పరివర్తన", “విన్నపము”, కవితల్లో కరుణరసం. “భ్రష్టయోగి"లో శృంగారరసం, “ఆత్మార్పణం”, “బృహన్నలాశ్వాసం"లో వీరరసం - మనకి కనిపిస్తాయి.
రసస్థాయినిబట్టి రచన చేయటం మహాకవి లక్షణం. శృంగారరస శృంగాన్ని అధిష్ఠించిన ఈ క్రింద పద్యాన్ని చూడండి :-
"హాసౌజ్జ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీ పాలావతం సోన్నత
ప్రాసాద ప్రమదా వనాంత లతికా వాల్లభ్య పుష్టాళిలో
నీ సమ్మోహన ముగ్దరూప సుమ మో నీరేజపత్రేక్షణా!!”
ఇటువంటి పద్యాల్ని, కవుల ఱొమ్ముల్ని కాల్చి విడిచిన ఏ శ్రీనాథుడో గానీ
రాయలేదు. ఆ భావాలు, ఆ పద్యగమనాలూ అలాంటివి. భవభూతి తన ఉత్తర
రామచరిత్రలో అంటాడు.
"లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతే
ఋషిణాం పునరాద్యానాం వాచ మర్థో౽నుధావతి”
ఋషుల మాట వెంట అర్థం వస్తుందట. అందుకే “నా నృషిః కురుతే కావ్యమ్”
అన్నారు. ఋషిహృదయులకు తప్ప శివలోకనం ఏర్పడదు. ఎందుకంటే,
ఈ కావ్యఖండికలన్నిట మనస్తత్త్వశాస్త్రం నిండివుంది. ఆ మనస్సు కొక రూపచిత్రణ వుంది. "The Poet's main glory is the power of Pictorial expression" అని.
ఈ మానసిక చిత్రణాభివ్యక్తి వల్లే కవికి సుస్థిరప్రతిష్ఠ కలిగేది.
ఎవరకే మాట కొసమెరుపో అచ్చమైన కవికి తప్ప తెలియదు. చూడండి - విల్లు పట్టుకోలేనివాడు యుద్దమేం చేస్తాడు? ఉజ్జీవనంలో - "జారి పోయె నీ ననవిలు నిల్వనోపకను నా కరకంజము నుండి" అని అనుకుంటాడు మన్మథుడు. చేతికి చెమట పట్టిన మాట - 'కర కంజము' అనే శబ్దం చెబుతోంది. ఇది శబ్దశిల్పరహస్యం.
“భ్రష్టయోగి”లో “ఈ సకలము 'కాదు కా' దను వచస్సున లేదటె కాంక్ష గుప్తమై” అనే మాటవల్ల భ్రష్టత్వానికి పరాకాష్ఠని చూపించిన ఈ కవి, "ఆత్మార్పణం”లో - “నా ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే” అని, కర్ణుని మహాత్మని ఆవిష్కరించటంలోని ఔచిత్యాన్ని గమనించండి. ఇలా ఎన్నని ఎన్నిక చేసి చూపించేది? ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రస గుళిక!
“కావ్య స్యాత్మా ధ్వనిః” అన్నాడు ఆనందవర్ధనుడు. కావ్యగత రసధ్వనిని ఆత్మతః వినగలగడమే రసజ్ఞత. భ్రష్టమైన సమాజంలో పరివర్తన చెంది, ఉజ్జీవనమై, కర్తవ్యాన్ని గ్రహించి, భావితరాల మీద వాత్సల్యంతో ఆత్మవిమర్శని విన్నవించుకుంటూ, మానవత కోసం లలిత జీవనం కోసం ఆత్మార్పణకైనా సిద్ధపడాలనే ధ్వని యీ శివాలోకనంలో ప్రవహిస్తోంది.
ఇంతటి ఉత్తమ కవితా సంపుటిని మా 'పింగళి - కాటూరి సాహిత్య పీఠం' అందించగలగటం ఒకానొక భాగ్యవిశేషం.
మహాకవులైన సోమయాజుల వారికి హృదయపూర్వక నమస్సులర్పిస్తున్నాను.
- ఆచార్య తిరుమల
వావిలాల వారి సాహిత్య జీవనం
శ్రీవావిలాల సోమయాజులు గారి సాహిత్యచరిత్ర అంటే - అర్ధశతాబ్ది గుంటూరు సాహిత్యచరిత్ర అన్నమాట. యాభై యేండ్ల పాటు రేయింబవళ్లు, అధ్యయన, అధ్యాపన, రచనా, ఉపన్యాస వ్యాసంగాలతో గడచిందాయన జీవితం. సాహిత్యం వినా మరొకటి ఆయన పట్టించుకోలేదు. పోనీ, గృహస్థయి వుండి, ఇల్లూ వాకిలీ అయినా పట్టించుకొన్నారా అంటే అదీ లేదు. బలిష్ఠమూ, సుందరమూ అయిన తన శరీరారోగ్యాన్నీ లక్ష్యపెట్టలేదు. సాహిత్య మొక్కటే పని అదే లక్ష్యం, అదే జీవితమూ, జీవనమున్నూ.
గేయాలు వ్రాశారు, పద్యాలు వ్రాశారు, సాహిత్యవిమర్శలు వ్రాశారు. చరిత్ర పరిశోధనలు వ్రాశారు సభల్లో మహోపన్యాసాలు చేశారు. మృదుమధురంగా వ్రాసి, ఊరూర కమ్మగా పాడారు. సాహిత్య సమావేశాల్లో, రేడియో నాటికలూ, ప్రసంగాలూ వ్రాశారనేకం. సంగీత, నృత్య రూపక రచనకు ఒరవళ్ళు పెట్టారు. జయదేవుని 'పీయూష లహరి' అనే సంగీత నృత్య నాటికను తొలుదొల్త తెలుగువారికి పరిచయం చేసినవారు సోమయాజులుగారే. దాన్ని తెనుగు చేశారు కూడ, జయదేవుని ఇంపుసొంపులు తగ్గకుండా.
విశ్వనాథ తర్వాత అంత పెద్దయెత్తున వివిధ సాహిత్యరీతులలో రచనలు చేసినవాడూ, దేవులపల్లి తర్వాత, ఆంధ్ర దేశమంతటా సాహిత్యసభల్లో జనరంజకంగా ఉపన్యాసాలు చేసినవాడూ, వాసిలోనూ, రాశిలోనూ శ్రేష్ఠుడనిపించుకొన్నవాడూ శ్రీవావిలాల సోమయాజులుగారే. విద్వత్తుకు విద్వత్తూ, ప్రతిభకు ప్రతిభా, బహుముఖప్రజ్ఞా, అనంత సృజనాశక్తి కల వాడాయన. విశ్వనాథ, దేవులపల్లిలలో లేని సాహిత్యవిమర్శా, చరిత్ర పరిశోధనలనే విశేషకౌశలం వీరికి కైవసమైంది.
ఆంధ్రదేశంలోని సంగీత నాట్యరీతులపై వారి పరిశోధనవ్యాసం చాలామందే వ్రాసినా, 1948 సెప్టెంబరు భారతి సంచికలో వెలువరించారు. అలాగే వాత్స్యాయన కామసూత్రాలపై వ్యాఖ్యానవ్యాసం 1947లో అమరావతిలో జరిగిన ఆంధ్ర సామ్రాజ్య మహోత్సవ సభల సందర్భంలో వెలువడినా, 1950లో ప్రకటింపబడిన సాతవాహన సంచికలో దర్శనమిచ్చింది. ఇవి ఆ నాటి పండిత పరిశోధకుల మన్ననలందుకొన్నవి.
1940 నుంచిన్నీ ఆయన ఎన్నెన్ని సాహిత్య సంఘాల వ్యవహారాలు నిర్వహించారో లెక్క లేదు. కార్యదర్శిగా సాహితీ సమితిలోనూ, 'ప్రతిభ'కు ఉపసంపాదకుడిగానూ, సహకార్యదర్శిగా నవ్య సాహిత్య పరిషత్తుతోనూ తనకున్న సాన్నిహిత్యం అలా వుండగా, హిందూ కాలేజీ నాటక సమాజానికి, "శారదాధ్వజ" సభకూ, "సుధర్మ” సభకూ కార్యదర్శిత్వమూ, నిర్వహణమూ ఆయనదే. పిల్లలమఱ్ఱి హనుమంతరావు గారధ్యక్షులుగ వున్న జ్యోత్స్నా సమితికి తొలుదొల్త తాను కార్యదర్శి, అనంతరం అధ్యక్షుడు. డాక్టర్ మారేమండ రామారావు గారధ్యక్షులుగా వున్న ఆంధ్రేతిహాస పరిశోధక మండలికి కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 1963 నుంచీ 73 వరకూ 10 ఏండ్ల పాటు సభ్యుడు - ఇలా ఇంకా ఎన్నెన్నో!
దాదాపు 35 ఏండ్ల పర్యంతం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలోనూ - కోస్తా, రాయలసీమ, తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ, ఇంచుమించు అన్ని కళాశాలల్లోనూ అన్ని హైస్కూళ్ళలోనూ సాహిత్యం పైననే గాక, ఇంకా అనేకానేక విషయాలపై సోమయాజులుగారి ఉపన్యాసాలు మారు మ్రోగేయి.
సోమయాజులుగారు ఉత్తమరచనల్ని చాలా అనువాదం చేశారు. మహాకవి జయశంకర్ ప్రసాద్ 'కామాయని'నీ, అంసూ'నూ హిందీనుండీ, షేక్‌స్పియర్ నాటకాలు - జూలియస్ సీజర్, మేక్బెత్, ఆంటోనీ క్లియోపాత్రాలను బహాఈ మతానికి చెందిన అనేక గ్రంథాలనూ, కేథలిక్ క్రయిస్తవుల మతసాహిత్యాన్ని ఇంగ్లీషు నుండీ మనోహరంగా తెలిగించారు. బాల సాహిత్యం కూడా చాలా రచించారు ప్రీ యూనివర్శిటీ, ఇంటర్, బి.ఏ., బి.ఎస్సీ, బి.కాం. తరగతులకు నోట్సు వ్రాశారు అసదృశంగా అనేక సంవత్సరాలు. భువనవిజయ ప్రక్రియ నారంభించడంలోనూ, దాన్ని రూపొందించడం లోనూ, దాని ప్రదర్శనలలో పాల్గొని విజయవంతం చేయడంలోనూ వావిలాలవారు అమోఘమైన పాత్ర నిర్వహించారు.
భువనవిజయం సభల్లో ప్రియదర్శనుడైన తాను ధూర్జటి పాత్రలను పోషిస్తూ వుంటే, నిజంగా ధూర్జటియేనేమో ఈయన అనిపించేవాడు. అంతగా ఆ పాత్రలో ఐక్యమైపోయేవారీ కుమార ధూర్జటి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో జరిగిన భువన విజయం సభలో, మహామంత్రి తిమ్మరుసు పాత్ర నిర్వహిస్తున్న జమ్మలమడక మాధవరామశర్మగారు -
“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గె నీ
యతులిత మాధురీమహిమ...?"
అంటూ పృచ్ఛ చేస్తే - ధూర్జటి పాత్రనభినయిస్తున్న సోమయాజులు గారు వెంటనే
అందుకొని,
"..................ఔ. తెలియందగు లోకమోహనో
ద్దత సుమసాయక ప్రబలతాప మహోజ్జ్వల పూజ్యపార్వతీ
పతిపద మంజులాబ్జ మధుపాన మధువ్రతుడై చెలంగుటన్”
అంటూ ఆ పద్యం పూరించారు సభికుల కరతాళధ్వనుల నడుమ 1956 జులై 12
నాటి ఉదంతమిది.
.............................
స్వాతంత్ర్యోద్యమ దీక్షతో, జాతీయ విద్యాభిమానంతో, మహిళాభ్యుదయాభిలాష తో, ఉన్నవ వారి శారదానికేతనానికి ప్రిన్సిపాలై త్యాగబుద్ధితో పనిచేశారు. స్వాతంత్ర్యం మన ప్రాంగణం చేరేవరకు ఖద్దరు తప్ప కట్టలేదు. 'మణిప్రవాళం' (1952) వంటి ఉన్నత సాహిత్య ప్రమాణాలు గల అపురూప పాఠ్యగ్రంథాన్ని విద్యార్థుల కందించారు. 'నాయకురాలు' (1944) వంటి గొప్ప నాటకాన్ని సృష్టించారు. తన విద్వత్తుచేత ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి వంటి సాహిత్యమహోపాధ్యాయుని మెప్పు పొంది, కట్టమంచి రామలింగారెడ్డి గారివంటి మహనీయుని వలన, పండిత - లెక్చరర్ పదవీ నిర్వహణకై ఎగ్జెంప్షన్ పొందగలిగారు. గుంటూరు హిందూ కళాశాలలో 30 ఏండ్ల కాలం సాహిత్యాధ్యాపకులుగా వుండి, ఎందరెందరో విద్యార్థులు విద్వత్కవులుగా, సాహిత్యాచార్యులుగా రూపొందడానికి దోహదం చేసిన గురుదేవుడు సోమయాజులు గారు. చూచేవాళ్లకు కళ్లు చెదిరే రూపలావణ్యం కలిగిన్ని, ఎన్నడూ తన కన్ను చెదరనీయని శీలసంపద నిండుకొన్న నిష్టాగరిష్ఠుడాయన. ఆచార్యుడై, కవియై, ఋషియై మహామానవుడైనా డాయన.
ఇంతటి మహనీయ సాహిత్యమూర్తి కావడం చేతనే ఆంధ్రసాహిత్య లోకం ఆయన్ని మహదానందంతో అభిమానించి, ఆదరించి, ఎన్నెన్నో సన్మానాలు జరిపింది సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్యబంధువు, మధురకవి, కవిభూషణ, కుమార ధూర్జటి - ఇత్యాదిగా ఎన్నో బిరుదులిచ్చి సత్కరించింది. అందుచేతనే సాహిత్య, నాటకరంగాలలో హేమాహేమీలందరూ ఆయన కాత్మీయులూ, సహవ్రతులూ ఐనారు. విస్సా అప్పారావు, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, కురుగంటి సీతారామ భట్టాచార్య, నోరి నరసింహశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, తెలికిచెర్ల వేంకటరత్నం, వల్లభజోశ్యుల సుబ్బారావు వంటి పెద్దలాయనకు సాహిత్య సహవ్రతులైతే, డాక్టర్ మారేమండ రామారావు, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, శ్రీసదన ప్రస్తుత పీఠాధిపతులు నృసింహభారతీస్వామి వారు (పూర్వాశ్రమంలో ఘట్టి నరసింహశాస్త్రి), టేకుమళ్ల అచ్యుతరావు, కామేశ్వరరావు వంటి వారు చారిత్రిక సహవ్రతులైనారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, కూర్మా వేణుగోపాలస్వామి, మాధవపెద్ది వెంకట్రామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు ప్రభృతులు నాటకరంగంలో సహవ్రతులు కాగా, ఆయన వలన సాహిత్య భాసురులైన వారిలో కె.వి.యల్. నరసింహారావు, ఎక్కిరాల కృష్ణమాచార్య, జూలూరి హనుమంతరావు, బూదరాజు రాధాకృష్ణ, బండ్లమూడి సత్యనారాయణ, బొడ్డుపల్లి పురుషోత్తం, కేతవరపు రామకోటిశాస్త్రి, పేరాల భరతశర్మ, యామర్తి గోపాలరావు మొదలైన యశస్వులెందరో వున్నారు. ఇంతటి విస్తార - సాహిత్య నాటకరంగ బంధువర్గాన్ని బట్టే మనం ఊహించుకోవచ్చును సోమయాజులుగారి అర్థశతాబ్ది సాహిత్య జీవితం ఎలాటి నిరంతరాయయోగ సమాధియై సిద్దించిందో! ఈ యోగసిద్ధి వెనుక, అజ్ఞాతంగా, కృతజ్ఞత కూడా ఆశించని ఒక వ్యక్తి త్యాగ మహిమ అండదండలుగా వుంది ఆ వ్యక్తే ఆయన ప్రియధర్మపత్ని, నా చెల్లెలు - చిట్టెమ్మ. తొణుకు బెణుకు లేకుండా, సంసారాన్ని అహర్నిశలూ కంటికి రెప్పలాగా కాపాడగలిగిందామె పుణ్యమే. ఆయన ఇంతటి సాహిత్య పారిజాతమై వికసించడానికి గృహరంగంలో ఈమె సాహచర్యమూ, సాహిత్యరంగంలో శ్రీశివశంకరుల సాహచర్యమూ దోహదం చేశాయి.
ఎనిమిదేండ్ల మా చిట్టెమ్మను 14 ఏండ్ల సోమయాజులుగారు 13-5-1932న పెండ్లాడారు. చిట్టెమ్మ తండ్రి రాయప్రోలు రామశేషయ్య గారు గుంటూరు వాస్తవ్యులు, గుంటూరులోనే నివసిస్తున్న - సోమయాజులు గారి పెదతండ్రి - వావిలాల రామచంద్రశాస్త్రి గారీ సంబంధం కుదిర్చి పెండ్లి చేశారు. సోమయాజులుగారి తండ్రి, సత్తెనపల్లి వాస్తవ్యులైన సింగరావధాని గారు తల్లి మాణిక్యాంబగారు. 18-1-1918 పింగళ నామ సంవత్సర పుష్యశుద్ధ సప్తమీ శనివారం నాడు సోమయాజులుగారు జన్మించారు. తాను పసిగుడ్డుగా వున్నప్పుడే తండ్రి స్వర్గస్థులు కావడంతో సోమయాజులుగారు నరసరావుపేట తాలూకాలోని విప్రులపల్లి అగ్రహారంలో మాతామహుల ఇంట పెరిగి, సత్తెనపల్లెలోని క్రైస్తవ ఎలిమెంటరీ స్కూలులోనూ, తరువాత నరసరావుపేట హై స్కూలులోనూ, పిమ్మట గుంటూరు ఎ.సి. కాలేజీలోనూ చదువుకొని, తెలుగు సాహిత్యం, దక్షిణ భారత చరిత్ర అభిమానవిషయాలుగా తీసికొని 1938లో పట్టభద్రులైనారు.
పట్టభద్రులైన తరువాత రెండేండ్ల కాలం గుంటూరులోని ట్యుటోరియల్ కాలేజీలలో అధ్యాపకులుగానూ, స్వాతంత్ర్య సమరయోధుడైన ఒక మిత్రునకు ప్రింటింగ్ ప్రెస్సు నిర్వహణలో సహాయకుడుగాను పనిచేశారు. 1940 నుండి 1947 వరకు శారదానికేతనం ప్రాచ్య విద్యా కళాశాలకు ప్రిన్సిపాలుగానూ, 1947 నుండి 1977 వరకు హిందూ కళాశాలలో ఆంధ్ర భాషాచార్యులుగాను పనిచేశారు. 1974, 1975, 1976 సంవత్సరాలలో - ఇంటర్, పి.యు.సి., బి.ఎ., బి.ఎస్‌సి., తరగతుల వారికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కరెస్పాండెన్సు విద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా కూడా పని చేశారు.
శ్రీవావిలాల కవిశేఖరుల సంతానం నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, పెద్ద వాడైన ఛాయాపతిని, తన పెద తండ్రి నిస్సంతు కావడం చేత, ఆయన దత్తత తీసుకొన్నాడు. ఆ పుత్రుడు వివాహానంతరం కొద్ది కాలానికే, అందరి కడుపుల్లో చిచ్చుపెట్టి వెళ్ళిపోయాడు. పెద్దమ్మాయి భర్త కూడా అదే పని చేశాడు, సంతానమైనా కలగకుండానే. తక్కిన ఈ ముగ్గురూ ఆ ముగ్గురూ ఉన్నతవిద్యావంతులై ఆర్జిస్తూ, సద్గృహస్థులై సంతానవంతులై, తండ్రి కీర్తి నినుమడింప జేస్తూ ఉన్నారు.
'పూర్ణపురుషుడు' అనే మాట ఒకటి ఉన్నది కదా? సర్వతోముఖ నిష్కళంకమూ సుందరమూ శుభప్రదమూ ఆనందదాయకమూ ఐన మానవజీవితాన్ని తెలియజెప్పడాని కీ మాట వర్తించేట్లయితే, తప్పక శ్రీవావిలాల సోమయాజులుగారికి కూడా వర్తిస్తుంది. అయితే సాహిత్యంతో ప్రత్యక్షసంబంధం లేని మహాపురుషులకే ఈ మాట వాడకంలో ఉండడం చేత, సాహిత్య విశేషార్థం వచ్చేట్లు ఈయన్ని 'సాహిత్య పూర్ణపురుషుడు' అందాము. నా చెల్లెలు చిట్టెమ్మకు 'ఇంటాయన' కావడం చేత, ఈయన నాకు బావగారైనారు. 73వ ఏడులో నడుస్తున్న ఈ సాహిత్య పూర్ణపురుషుడు. మా బావ వావిలాల సోమయాజులుగారు, ఆంధ్ర సాహిత్యభాగ్యాన్ని ఇనుమడింపజేస్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ నూరేండ్ల కాలాన్ని దాటి, హాయిగ సాహిత్య జీవయాత్ర కొనసాగించాలని త్రికరణ శుద్ధితో కోరుకొంటున్నాను.
పింగళి - కాటూరి
విధేయుడు
సాహిత్యపీఠం, హైదరాబాదు
ఊట్ల కొండయ్య
విజ్ఞాపనం
“శివాలోకనము” ను "కరుణశ్రీ" గారికి పీఠికకోసం పంపినప్పుడు, అది అష్టఖండికల సంపుటి మాత్రమే. తరువాత దానికి “కర్తవ్యము” అనే మరో ఖండిక చేర్చడంతో, అది నవఖండికల సంపుటి అయింది. 'కరుణశ్రీ' గారి 'ముందు మాట' నాకు అందేలోగా, 'కర్తవ్యము' ఖండికను వారికి పంపలేకపోయినందుకు చింతిస్తున్నాను.
అష్టఖండికల సంపుటిపై 'కరుణశ్రీ' గారు వెల్లడించిన ఆధ్యాత్మిక భావనను అనుగమిస్తూ భావుకుడైన ఒక మిత్రుడు. ఇప్పుడిది నవఖండికలు కలిగి వుండడాన్ని “నవరసనటనామూర్తిని స్ఫురింపజేస్తున్నది” అంటూ చమత్కరించాడు.
తొమ్మిదవది యైన "కర్తవ్యము”లో, శత్రుసైన్యాలతో, సాగిస్తున్న భీకరకదనంలో సర్వ సేనాధిపతి హఠాత్తుగా దివంగతుడుకాగా, అతని పరిరక్షణలో సర్వతోముఖ భద్రతలు అనుభవిస్తున్న చాళుక్య యువరాజు, ఆ భయంకర పరిస్థితికి తట్టుకోలేక, సంధి ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు, మరణించిన సర్వసేనాధిపతి ధర్మపత్ని చిరంటి వీరనారి “కామసాని” వీరవేషంతో వచ్చి, సర్వసేనాధిపత్యాన్ని తానే వహించి, సైనికదళాలను నడిపించి, విజయాన్ని చేకూరుస్తానని ప్రతిన చేస్తుంది. యుద్ధక్రీడకు యువరాజును ఘనంగా ప్రోత్సహిస్తుంది. ఈ కవితలో వీరనారి 'కామసాని'కి గల రాజవంశానురక్తి, రణతంత్రజ్ఞతా, శౌర్యమూ, త్యాగశీలమూ ఇత్యాది గుణవిశేషాలు నిస్తంద్రాలుగా నిరూపితాలయినవి.
నా గురువర్యులు శ్రీశివశంకరులు పీఠికాదులకు పరమేశ్వరుడని ప్రసిద్ధి గన్నవారు కదా? అయినా “నాయకురాలు” (1946), “మణిప్రవాళము” (1952) 'వసంతసేన' (1953) ఇత్యాది కృతులను ముద్రింపించి ప్రచురించినప్పుడు, నేను, వారిని గానీ, వారితో తుల్యులయిన ఆ నాటి సాహిత్యరంగంలోని పెద్దలను గానీ పీఠికాదుల కొరకు అర్థించవలసిన అగత్యం కలుగలేదు. ఇప్పుడు చాలాకాలం తరువాత ఈ ఖండకావ్య సంకలనం ప్రచురిస్తున్నందున వీని ఆవశ్యకతను కొందరు మిత్రులు సూచించి వున్నారు. ఫలితంగా మాన్యసాహిత్యమిత్రుల నుండి అవి లభ్యమయినాయి. ఆదరంతో నాకు 'అభినందన' అందజేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీతయైన మహాకవి. తెలుగు విశ్వవిద్యాలయ - ఉపాధ్యక్షులు ఆచార్య సి. నారాయణ రెడ్డి గారికి నా కృతజ్ఞతాభివందనములు.
తీరిక లేకున్నా అనురాగంతో "శివాలోకనము”నకు “ముందు మాట” పంపించిన నా ఆత్మీయులైన మాన్యమిత్రులు, కవీంద్రులు శ్రీజంధ్యాల పాపయ్యశాస్త్రి గారికి నా శ్రద్ధాపూర్వక ప్రణామములు. "కరుణశ్రీ" గారి వలెనే నాకు చిరకాల మాన్యమిత్రుడు, బహుముఖ సాహిత్య ప్రజ్ఞానిధులు, ఇష్టులు నైన సరస్వతీసమవాయ సహచరులు, “ప్రగతిగీతాప్రవక్త” శ్రీనండూరి రామకృష్ణమాచార్యులుగారు గౌరవానురాగాలతో అక్షరాంజలిని పంపించారు. వారికి నమఃపూర్వకాశీస్సులు. అంతర్జాతీయ కవి అవార్డు గ్రహీతలుగా ప్రఖ్యాతి నార్జించిన పింగళి - కాటూరి సాహిత్యపీఠం అధ్యక్షులు, యువవిద్వత్కవి చంద్రులు శ్రీఆచార్య తిరుమలగారు గౌరవానురాగాలతో "సమీక్షణం” పంపినందుకు వారికి నా నమఃపూర్వకాశీస్సులు. "శివాలోకనము”నకు సంపాదకత్వము వహించి, సమస్తాన్ని సక్రమంగా నడిపిన వారు, ఈ కావ్య సంచికలోనికి “సాహిత్యజీవనం”ను అందించిన వారు నా చిరకాల ఆప్తమిత్రులు, సత్కవులు, "పింగళి - కాటూరి సాహిత్యపీఠం సంస్థాపకులు. జనతా సంక్షేమ కాంక్షులు, గాంధేయాను యాయులు శ్రీఊట్ల కొండయ్య గారికి నా నమఃపూర్వకాశీస్సులు. ఈ నా ఖండకావ్య సంపుటిని అభిమానంతో ఆకర్షించి ప్రోత్సహించిన సాహిత్యమిత్రులు - సరసవిద్వత్కవులు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ విభాగాధికారులనగు డా. వి.వి.యల్. నరసింహారావుగారికి, ప్రసిద్ధ కవి జీవిత చరిత్రకారుడు, శ్రీత్రిపురనేని సుబ్బారావు గారికీ నా అభివాదనపూర్వ కాశీస్సులు.
'శివాలోకనము'ను వెలువరించే పనిలో మనఃపూర్వకంగా సహకారమందించిన నా ధర్మపత్ని చి.ల.సౌ. కైకమ్మ వురఫ్ చిట్టెమ్మకు, నా ప్రియ పుత్రీపుత్రులకు, వారి సహచరులకు, పౌత్రతుల్యుడైన - సమీపబంధువర్గంలోని - చిరంజీవి పైడిమఱ్ఱి శ్యాంప్రసాదుకు, నా అభినందనలూ, శుభాశీస్సులూ.
మేము అర్పించే పాదాభివందనాలను దశశతాలుగ స్వీకరించి, 'శివాలోకనము' నకు సాహిత్య లోకంలో విపుల ప్రచారాన్ని ప్రసాదింపుమని భక్తితో బ్రాహ్మీ పరమేశ్వరులను అర్థిస్తున్నాను.
తిరుమల అపార్ట్‌మెంట్స్,
భవదీయుడు
హైదరాబాద్
వావిలాల సోమయాజులు
10-5-90
వాత్సల్యప్రియ
లీలామానుషవిగ్రహుడగు గోపాలుని లీలలను మాయామోహితమైన జగమంతా ఒక ఎత్తుగా చెప్పుకుంటే, అదృష్టవంతురాలయిన శ్రీకృష్ణుని తల్లి యశోద ఆ మాటలనే మళ్ళీ చెపుతూ 'వాత్సల్యప్రియ'గా పరిపూర్ణత పొందింది. లీలల వర్ణనలో, పలుకుల పొందికలో, మాటల తీరులో అనేక అందాలు పోయింది ఆ అమ్మ హృదయం. ఈ కవితావాహినిలో పాలనురగలై ప్రవహించిపోయింది.
ఉ . | గోపిక లొక్కటై పలుకు కొండెములన్ తలపట్టిపోయి నా | |
మ . | నిను దండింపగ వేచియుంటినని మున్దే చెప్పినా రెవ్వరో, | |
ఉ . | ఏ గతి వచ్చి చేరితివి యింటికి, వాకిట నిల్చియుంటి కా | |
ఉ . | ఒక్కరు చెప్ప నమ్మకనె యుందును కావని గ్రామమధ్యమం | |
మ. | పలుకన్ వారల కేమి చెప్పుటకు నే పాల్పోక నో తండ్రినా | |
| కుల తండంబుగ నింటిపై బరపి గగ్గో లాచరింపంగ నీ | |
ఉ . | ఊరికి ముందె నిద్దురకు నోర్వవు నీ కనులో మహాత్మ! నే | |
మ. | వరసా వాయలు లేక కన్నియల త్రోవల్ కాచి కవ్వించి నీ | |
ఉ . | ప్రాయపు లేమ లొంటి మథురానగరమ్మున క్షీరమమ్ముకో | |
ఉ . | పండుగరోజు లంచు బ్రతిమాలిన అల్లుడుగారు వచ్చి రే | |
ఉ . | పాపము బ్రాహ్మణుం డెవరొ పంక్తికి భోజనవేళ వచ్చి సాం | |
మ . | పగ సాధింపగ కోర్కె కలిగినను 'తప్పా ఒప్ప' యం చించుకం | 11 |
చ | చెరువుకు గండి కొట్టె గుమి జింకల మా పొలమందు తోలె, మా | |
ఉ | ఈడుకు తగ్గ చేష్టలగునే వ్రజభామినులార! యంచు నే | |
చ | ఒక చిరునవ్వుతో నెడద నుయ్యెలలో నిదురింపచేతు వా | |
ఉజ్జీవము
(మహేంద్ర రాజ్యరక్షాగర్వి మదనుడు తపోభంగ కార్యార్థమై మహేశ్వరాశ్రమానికి విచ్చేసి తన అశక్తతను అవగతం చేసుకున్న తరువాత)
మ. అవిగో, శాత్రవ కాలమేఘములు, ప్రోవై క్రమ్మగా వచ్చె
దివి నల్టిక్కుల, దిక్కు మాకిక భవద్దివ్యాస్త్ర జాలంబె నీ
పువువిల్ బూనుము, లెమ్ము, కావగదవే పుష్పాస్త్ర! శీతాద్రి సం
భవపై నీశు మనమ్ము నిల్పుము తపోభంగంబునన్ నెచ్చెలీ!
మ. అనుచున్ దేవసభాంతరాళమున నాకాధీశుడే బేలయై
నను ప్రార్థించిన పొంగి నాపొగరు మిన్నందెన్ భళీ! క్రొవ్వి ఆ
డిన మాటల్ తలకెత్తె నీ బరువు, పాటింపంగ లే రెవ్వ రే
మనినన్ నామొర నేడు, గర్వ మిటు మాయావాగురన్ చేర్చెనే?
చ. వలదని ఎంత చెప్పితినా రతి, నే విన నైతి సాధ్వి, నీ
తలపులె సత్యమయ్యె, జడదారులపై విజయంబు గొన్నటుల్
వలనగు నంచు వచ్చితిని భర్గు మహోగ్రతపంబు మాన్చ, నీ
పలుకెడ సేయ నింక కొనప్రాణముతోడ తిరోగమించినన్!
చ. అడుగుల కడ్డువచ్చి తడియారని కన్నులతో కపోలముల్
వెడవెడ వెల్లనై సొగసు వీడగ వీడుట కొప్పుకోని నీ
యెడదను దిద్ద, ఉన్నయటులే చనుదెండు యుగమ్ముకాదె మీ
కడ నిలువంగలేని క్షణకాలము నాకని యార్తవైతివే!
చ. ఎడ నెడ దుర్నిమిత్తముల నేడ్తెర కుంగి కృశించి ఓ చెలీ!
తడబడు గుండెతో నెదురు దారులు చూచుచు నిల్లు వీవు! నా
ఒడికముతప్పె - ఇంక తడవో కలకాలము - మానవే సఖీ!
ఎడదను నాపయిన్ మమత ఏగతి నున్నదొ ఈశ్వరేచ్ఛయున్?
శా. | శా. ఆలోచింపకమున్నె నల్దెసల ప్రౌఢానంత వాసంత లీ | 6 |
చ. | చ. నను గని నవ్వుచున్నది వనం బొక యుప్పెననవ్వు నేడు నా | |
మ. | మ. సుమబాణావళితో జగత్రయము నే సుత్రాముకై గెల్చి ఆ | |
ఉ. | జీవన పుష్ప సౌరభము చిత్రగతిన్ మటు మాయమయ్యె నే | |
ఉ. | “అచ్చరపిండు వెంటగొని, ఆమనియున్ మలయానిలుండు నీ | |
ఉ. | ఓ మలయానిలా! సఖ!! మహోదయ!! నీదగు నృత్యకేళి నా | |
చ. | చ. ప్రసవశరాసనోజ్జ్వల విలాసములన్ గనలేదు లోప మో | 12 |
చ. | అని నను ప్రోత్సహించెడు నయాచిత శక్తి యొకండు ఎన్నడున్ | |
ఉ. | "తుంటరి వింటితో కదనదోహలియైన పినాకపాణి పై | |
చ. | అని మొరవెట్టి పల్కునెడ నో రతి! దీనత దుఃఖరేఖ నా | |
చ. | పొలయలుకన్, నిరాదరణపూర్వక చేష్టల, మందహాసరే | |
చ. | కనకపుకంబ మొండు స్ఫటికంపు సురమ్యవిశాలహర్మ్యమం | |
ఉ. | ఎంత మహోగ్ర మీ తపమ రెట్టి మహార్ధము నొంద గోరియో! | 18 |
ఉ. | కమ్మని తావి గాలిబుడతల్ తలకెత్తుచు మోయలేని భా | |
ఉ. | ఏ యెడ నుండియో యివె నవేందుసుధామయరోచు లీవనిన్ | |
ఉ. | ఈ మహనీయ గాత్రి మధురేక్షణ పంక్తులలో, నటించు ది | |
ఉ. | మానితహస్తయుగ్మ మధుమాస మహోదయ పత్రపుష్ప మా | 22 |
(ప్రతిభ 1945 అక్టోబరు)
పరివర్తన
(శ్రీరాముని బాణప్రయోగానంతరం వాలి మనోభావాలు)
శా. ఎన్నో మారు లెదిర్చి యోడి గిరులం దేమూలనో డాగి వా
డున్నా డన్నదె మాసి పోవ బ్రతు కెట్లో యీడ్చు సుగ్రీవు డు
ద్యన్నవ్యార్భటి బొబ్బవెట్టి నను నాహ్వానింప, నే మోసమో
యున్నట్లున్న దటంచు నెంచియును నే యుద్ధంబు నీ వచ్చితిన్.
మ. సరియే నాయనుజన్ము డెన్నడును భాస్వత్సత్త్వ సంపత్తి నా
కరయన్ వానిని కీటడంచు టొక యాటై యుండు నేవేళ సో
దర సౌహార్దముచే వధించుటకు జిత్తం బొప్పుకోకున్న నే
వరకున్ దేలని పోరు సల్పి తరుమన్ వా డిట్లు జీవించెడిన్.
మ. తరుమూలమ్మున డాగి చోరుని గతిన్ ద్రాఘిష్ఠ చాపాన భీ
కర నారాచము తొడ్గి నా విపుల వక్ష శ్శైలముం జీల్చుదా
కరయన్ నీ జతనమ్ము శాత్రవుడ వెట్లైనాడ వయ్యా! భవ
త్పరమ క్షాత్ర విచిత్ర రూపమును మున్ దర్శింప నే నెన్నడున్.
ఉ. కట్టిన వల్కలమ్ములకు గౌరవమున్ గలిగింపగోరి చే
పట్టితె వీర కార్ముకము వంచనమై పగవాడ గాని నన్
నెట్టన నిట్టు కూల్చి యవనిన్ మహనీయ పృషత్క విద్యకున్
పట్టము గట్టుకో దలచి భండన పండిత! యిట్లొనర్చితే?
ఉ. ఇట్టు లధర్మచేష్టను వధించి ననున్ చిరునవ్వు నవ్వుచున్
దిట్టతనాన మించి, గడి దేరిన వాడవువోలె నిల్చు, నీ
దెట్టి విశిష్ట సత్కులమొ, ఎయ్యది దేశమొ, ధర్మమేమొ? నీ
యట్టిడు లుబ్ధకుండొ, మహితాత్ముడొ కావలయున్ ప్రవీరుడా!
చ. ఎదురుగ నిల్చి గెల్చుటకు నెవ్వడు పూనిన వాని శక్తి సం
పద నొక యర్ధభాగ మెడబాసి ననున్ గని చేరు నెప్పు డి
య్యది యగు నాదు జీవిత రహస్యము - దీని నెరింగి యుంటచే
కదనము కోర కిట్లు నిజకార్ముక మంపి వధించి నాడవే? 6
మ. అవు నా జీవిత మర్మ మీ వెరుగుదయ్యా! కాక వంచింప నీ
కవునా? క్షాత్రమె మూర్తి దాల్చి నటులున్నా వీవు జ్యాఘోషమున్
వివిధాశాప్రవిభేదకస్వన మహావిస్ఫూర్తి విన్పించి నా
డవు నీ వెక్కటి శౌర్య సారుడవు గాఢ ప్రక్రియన్ నమ్మెదన్.
చ. తలపుకు వచ్చు చున్న యది దాసులు తొలగ విన్న వించి నా
రలు, రఘువంశజుం డొకడు రాజ్యరమన్ విడనాడి, తమ్ముడున్
చెలియును వెంటరా విపిన సీమలలో ముని వేషధారియై
మెలగెడి నంచు నా గతిని మించిన వాడవు నీవె యౌదువా?
ఉ. ఆవల వింటి నాత డగు నా రఘువంశజు డంచు రక్తి మై
యీవన భూమి పంచవటి నింతియు గూడి సుఖించు వేళ, నా
రావణు డేగుదెంచి, తన రాక్షస మాయను, జూపి ధీరుడై
ఆ వనితా మణిన్ గొని శతాంగముపై పయనించె నంచునున్.
ఉ. ఆతడ వీవె? యా దశరథావనినాథుని యాత్మజుండవా?
ఆతపనీయకీర్తి కగు నయ్య యనామయ మెన్న డేని న
త్యాతరభక్తి యున్నయది యీ యవనీపతి యన్న నాకు నీ
వాతని పుత్రకుండవ? మహత్తరమూర్తి, రఘూద్వహుండవా!
ఉ. కాదన నీవు, రాఘవునిగా గయికొందును నిన్ను! కాని మీ
రాదట ధర్మరక్షయె మహార్థముగా గయికొన్న దొడ్డ భూ
మీదయితుల్ కదా! యిలకు మేటివి, నీ విటు మాయచేత రా
జా! దయతప్పి నన్ను తెగటార్చుటలో గల సూక్ష్మ మెద్దియో?
చ. మధువన వీథులన్ ప్లవగ మానవతీ జనతా మనోజ దు
ర్వ్యథలను దీర్చుటల్! సుమసుధారస సేవన కేళిలోలతా
కథనములున్ మదీయ గుణ గౌరవ భంగము సేయ నీచపు
న్నిధనము నిచ్చినావె? యవినీతుడు వీడని నమ్మి నీయెదన్. 12
ఉ. ధర్మము నుద్ధరింప వసుధన్ రఘువంశము నందు కేశవుం
డర్మిలి పుట్టె నంచును మహాత్ములు మౌనులు చెప్ప వింటి మున్
నిర్మలచిత్త! యాతడవు నీ వగుదేమొ! వనేంద్ర నీతికిన్
ధర్మముగాని కార్యము లొనర్పను నే మదగర్వితుండనై.
మ. యమఘంటా నినదోపమంబయిన సింహధ్వానముం జేసి యా
హిమవంతుం గని న్యక్కృతించి కదనం బెవ్వాడు కాంక్షించే వా
డమితోత్సాహుడు యాతుధానుడును నే నా దుందుభిం జంపి దో
స్సమరంబందున కాలజిమ్మి యిట నాశ్వాసించితిన్ మేటినై.
మ. దెసలం గెల్చితి నన్న గర్వమున నంధీభూతుడై రావణుం
డసిసాహాయ్యమె మెచ్చి వచ్చి యొకనా డాయోధన క్రీడ నా
కొసగన్ శక్తుడవే యటన్న 'చెడె దోహో!' యంచు సూచించి వె
క్కసమౌ మల్ల విశేషబంధమున ఢాకంగొట్టి నిర్జించితిన్.
శా. ఆవిర్భావము నొందినాడ దివి జాధ్యక్ష ప్రభన్ దీర్ఘ బా
హా విశ్రాంత బలాతిరేకమున సర్వారాతి దోర్గర్వమున్
త్రావన్ శాత్రవులైరి మిత్రులు - సదా రాజ్యప్రజాపాలనా
ప్రావీణ్యంబున కీర్తి కెక్కితిని, చంపన్ జెల్లునే నన్నిటుల్?
శా. ధర్మత్యాగ మొనర్ప నెన్నడును, సత్యప్రీతి పాలింతు, నే
కర్మిష్ఠుండను - సర్వసంధ్యలను శ్రీకంఠాంఘ్రి కంజాత స
న్మర్మాభిజ్ఞుడనై ద్విరేఫముగ నస్మత్ శీర్షము న్జేర్తు నో
ధర్మార్థ ప్రభవిష్ణు! విష్ణు! ఎటు లే దండ్యుండ నై నాడనో!
శా. ఆదిత్య ప్రభవమ్ము భవ్యమని నా కత్యంత తాత్పర్య మ
య్యా! దీవ్యద్భవదీయ వంశ మన సర్వానర్ధముల్ దీర్పగా
నా దేవేంద్రుడు మిమ్ము గోరు కథలన్ జిన్నప్పుడే వింటి-ని
ర్వేదం బెన్నడు మీ కొనరుచు గతి వర్తింపన్ “దురుద్యోగినై”. 18
ఉ. అంగదు వల్ల వింటిని బలాఢ్యుడు క్షత్రియ వీరమూర్తి స
ర్వాంగ మనోహరుం డొక డహస్కర పుత్రుని మైత్రిగోర ను
త్సంగము నందు వహ్నిగొని సంగడికిన్ శపథమ్మొనర్చి యు
త్తుంగ సుఖోపగూహనముతో జెలువొంది రటంచు మొన్ననే!
శా. ఆ మాయావిని రూపుమాపు తరి మాద్యద్దివ్య మాతంగ లీ
లామాత్సర్యము తోప నే కడగి ఘోర ప్రక్రియన్ పోరు వే
ళన్ మా సుగ్రీవుడె ద్రోహియై తనకునై రాజ్యంబు గైకొన్న వా
డా మాయావియె నీకు మైత్రి కయినాడా? సత్యధర్మప్రియా!
ఉ. అన్నయె చచ్చె నా డనుజు డాహవభూమిని గెల్చె, బాహుసం
పన్నత నన్న యీహ పొడమన్, కపిరాజ్యమునందు నంగదున్
మన్నన నిల్పి నా సచివ మండలికిన్ కడు పెద్దయౌచు, తా
నున్న మనోజ్ఞ కీర్తియును నూర్జిత ధర్మము నబ్బి యుండదే?
మ. అటు కిష్కింధకు నొక్కమారయిన రా! వాతిథ్య మిప్పించి యు
త్కట హర్షాంబుధి నోలలార్చి ప్రజ చేతం గాన్క వెట్టించి నీ
వటు విక్రాంతికి దగ్గ యర్హణము దేవా! ఏనె కావింపనే?
ఇటు లీ క్రూర నిశాంత సాయకముచే న న్నేల శిక్షించితో?
శా. కామాంధుం డయి పంక్తికంఠుడు నినున్ గైకోక మోసమ్మునన్
భామారత్నము బల్మి బట్టి కొనిపోవన్ వాని శిక్షింప నీ
వీ మార్గమ్ముల మెట్టు చుంట విని తండ్రీ! దర్శనం బిచ్చి నన్
ప్రేమం దీర్పగ కార్యము న్విలుతువం చెంతేని యూహించితిన్.
శా. నీకుం దృప్తిగ కింకరుండ నయి వానిం బట్టి తెప్పించి దే
వా! కంజాతమనోజ్ఞ తావక పదద్వంద్వంబు పట్టించి సీ
తాకాంతా మణి నిచ్చునట్లొనరుపన్ దైవార కాంక్షించు నా
కో కాకుత్థ్సమణీ! అనుగ్రహము కయ్యో! నిగ్రహం బబ్బెనే! 24
చ. అయినను నా పులస్త్యజ దురాసదవిక్రము నర్థి కొల్చు వా
రయి యనుజన్ములన్ సుతుడు వాహన దోహలులున్న వార లె
మ్మెయి గెలువంగ జాలునని మిత్రసుతుండు తదీయ మైత్రియున్
రయమున నిచ్చగింప తగునా యిది నీ సతి దెచ్చు మార్గమే?
చ. తగునె యుదగ్రవైర మిటు తమ్మునితో నని తార చెప్పినన్
మగటిమి నమ్మి యా పలుకు మన్నన సేయగ నైతి తత్ఫలం
బగు పడె నేటి కీగతిని, నయ్యును సంతస మౌను వంచనన్
పగతుడు గెల్చెగాని నిజబాహుబలంబున గెల్వ నేర్చునే?
చ. ఉరుతర సత్త్వసంపదను నూర్జిత మూర్తివె యయ్యు స్వామి? నీ
చిరవిరహంబు చే తనువు చిక్కెను - క్రూర వియోగ శక్తి ని
ట్లెరిగియు నేల తారకు విధించితి తీరని విప్రయోగమున్!
విరహి కిరాతు డేని కవవీడగ జేయడుగా మహాశయా!
చ. అనుపమ సాధ్వి, నా హృదయ హర్మ్యమహత్తరతార తార, స
ద్గుణఖని సుందరాంగి సుమకోమలచిత్త, గణించి నెమ్మదిన్
నను తన దేవదేవుగ ననారతము న్భజియించు నా మృతి
న్విని యది గుండియల్ ప్రిదిలి వ్రేలక యెట్లు భరింప నేర్చునో!
ఉ. ఎంతగ నింద చేసినను నేమియు నీ నగుమోము నందు నొ
క్కింతయు లేదు మ్లానత అహినము శుద్ధము ధర్మసూక్ష్మ మ
త్యంతము నుండు నన్ను పరిమార్చిన లీల నటంచు తోచు, నీ
వింతగు మార్గమున్ గొనిన ప్రీతికి హేతువు తెల్పవే ప్రభూ!
ఉ. ఆతత విక్రమాన్వితుడ వయ్యును హీనత నీకు గూర్చి వి
ఖ్యాతిని నాకు గూర్చు తెరగారసి యిట్టు లపూర్వ లీల జీ
వాతువు నాహరించి ప్రభువా! నను ధన్యుని జేసినాడవే
ఓ తపనీయ ధామ! ఇది యుజ్జ్వలమైన యనుగ్రహమ్మెగా! 30
శా. వ్యగ్రంబైన మనంబుతో వదనమం దార్తిచ్ఛటల్ గ్రమ్మ నో
సుగ్రీవా! యిటు లుంటి వేమి? మదిలో సుంతైన జింతింప కే
నగ్రభ్రాతను జంపుకొంటి నని, నా కయ్యెన్ శుభం బిందుచే
నుగ్రారుల్ గలవాడ నెప్డొ యని నాకున్నట్టిదే మృత్యువున్.
ఉ. ఆదట బూర్వ పుణ్యమున నబ్బె రమావిభు మైత్రి నీకు - నిన్
కాదన గల్గువార లిల గల్గరు రక్తిని రామకార్య మ
ర్యాదను దీర్చి, నిల్పి కవిరాజ్య యశోలతికాంకురమ్ములన్
పాదుకొనంగ నల్దెసల, పాలన సేయగదయ్య సోదరా!
ఉ. అంగదు డన్న నీహృదయమందున హార్దత యున్న, దెన్నడున్
భంగము రాదు వాడు ననువర్తన నిన్ కొలువం గలడు, స
త్సంగము వాని కిచ్చి యనుతాపము తీర్పుము - తండ్రి నైన నా
కుంగల మైత్రిచే నిటుల కోరెద గాని ఎరుంగు దెల్లయున్.
మ. ఒక గర్భమ్మున పుట్టి ఋక్షవిరజుం డుద్గాఢ వాత్సల్యమున్
ప్రకటింపన్ తమి నొక్కచో బెరిగి సర్వం బొక్కచో నేర్చి పా
యక విశ్వాసముతో కవల్ వలెను నున్నామయ్యా, రాజ్యంబుకై
యకటా! వైరము వచ్చె, తీరినది ఆర్యా! కౌగిలింపంగదే!
ఉ. వందన మిద్ది గైకొని భవచ్ఛర కర్షణకైతవాన నా
నందము గూర్ప నొక్కపరి నా తనువున్ స్పృశియింపు మయ్య! నా
సందియ మెల్ల తీరినది సర్వమయుండవు నీవు రామ! ఆ
క్రందిత మీ కపి ప్రతతి, కానగ లే, నిక కన్ను మోడ్చెదన్. 35
(ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక 1960)
'భ్రష్టయోగి'
ఉ. మానవలోక నైజమగు మానుషరూపము కాదు నీది ది
వ్యానన దీధితుల్ తెలుపు నచ్చర వీవని - కాని దేనికై
మానిని వచ్చినా విటకు, మాదు తపోవన పార్శ్వసీమలం
దే నవకమ్ములైన పువుటీరములో చెలి నిన్ను పిల్చెనే!
శా. ఓహో, ఎంతటి జాణవే సఖియ! న న్నూరించి కానంతలో
మోహావేశుని జేసి నాతపసు నున్మూలించె నీ రూప, మే
దేహ భ్రాంతియు లేని నా యెడద సందీప్తంబు గావించి నా
వొహో! లోతుల గ్రొచ్చి చల్లితివి రాగోద్రిక్త మోహోర్ములన్.
ఉ. నీ కనుచూపు వెన్నెలల నీరము త్రావుచు మోసులెత్తి, రా
కాకమనీయమైన ముఖకాంతుల తీవలువారి నా మదిన్
ప్రాకెను, చల్లనౌ వలపు పాటల నాటల పూచె నీ పయిన్
నా కనుచూపు గాటముగ నాటకమున్నె మహాద్భుతంబుగన్.
చ. శిలపయి నిల్చి నే తపసు చేయగపూనిన నాటినుండి యీ
చలువలయూట,- మానసము - చయ్యన నాగి జలంబులింకి ఆ
వల నొక సానువై ఉపలవైఖరి నొందెగదా! మధూల కో
త్పల భవదీయదృష్టి పరిపాకముసోక స్రవన్తి యయ్యెడిన్.
చ. ఎద నదియై స్రవింప కమలేక్షణ! నా కనుచూపు వింతగా
కదిసె జలాల! హల్లక నికాయము కాయము తాల్చె నోసి! నీ
మృదుతర మాధురీ నిబిడమేచక కుంతల పంక్తిలోన సం
పదలను క్రుమ్మరించి మధుపమ్ముల గుండెలు దోచ చూచెడిన్.
ఉ. ఎన్నడులేని యీ యొదుగు లెచ్చటనేర్చిన దీ పికమ్ము నా
కెన్నడు విన్నయట్టు లొకయించుక యేనియు లేదు జ్ఞప్తి ఓ
అన్నులమిన్నరో! నెమిలి ఆటలలో సరిక్రొత్త పోకడల్
వన్నెలు తేరె - నీ విటకు వచ్చుటయేయగు నింతకున్ సఖీ! 6
చ. వన సుమ కన్యకావళి ప్రవాసి విభుం డరుదెంచె నంచు లో
మనమున పొంగె కాని పవమానున కైనను కౌగిలీయకే
మనకయి తాల్చి తావులను మంజుల ముగ్ధదరస్మితంబులన్
పనివడి వంపుచున్నయవి భాగ్యపురాసులు గాగ కానుకల్.
చ. జగము సమస్తమున్ నవరసాలము పోలిక సాంధ్యరాగపున్
జిగిని వెలుంగ కొమ్మలను చేరిన పక్షులు జంటకట్టి ఓ
మగువరొ! ప్రేమ గీతికల మాటికి మాటికి నాలపించి పా
డగ పులకల్ జనించిన కడాని వెలుంగుల బారు నింగిపై.
చ. తొలకరి వాన చిన్కులకు దోసిలి యొగ్గి నుతించు చాతకం
బుల కనినాడ మొన్న పెను పోటున నీగతి గట్లపై నదీ
జలములు పర్వులెత్తు ఘన చక్రమునన్ తటినీ లతాంగు లూ
ర్పులు చెలరేగగా గగురుపుల్ మొలకెత్తగ నాడ సాగెడిన్.
చ. ఉదయమె యీ నదిన్ మునిగి ఓ సుమ కోమలి! కర్మసాక్షికిన్
ఉదకము లర్ఘ్యమిచ్చి యెద యొల్లగ బూచితి నన్నిదిక్కు లే
మిది? యెటు తాల్చెనో ఋతువు లేమిటి మారినవా చెలీ! తరుల్
ముదిమిని మోయుచున్నవి సమూలముగా చివురించె నిత్తరిన్.
ఉ. ఈ సెలయేటి కేమిటికొ యింతటి వేగము నీ వెరింగినా
వే సఖి! చేసెనే ప్రియుని యింటికి జేరగ ప్రొద్దుక్రుంకగా
బాసట అందు కౌత్వర - త్రపారహితంబుగ నేగుచున్నదే
ఆ సెలయేటి మానసము నందలి కోర్కెల నూహసేయుమా!
చ. వడి వడి సాగి యేగ నలవాటుగ పోయెడి వంకదారి నీ
పొడవగు నీడలే అరుగు పోలిక నున్నవి, భానుడేగినన్
తడబడు గుండెతో నెదురు దారులు చూచుచు నిల్చువానికై
వడి నరుదెంచి కొంతదరి వాంఛితముల్ నడిపింప నెచ్చెలుల్. 12
చ. ప్రకృతికి నాకు దూరమని భ్రాంతి వహింపకు, మంతె చాలు నీ
కిక విపులంబుగా పలుక నేటికి? జాణవు? మౌని నైన నో
పికశుకవాణి! కోరికలు పెల్లుగ జీర్ణములై కలంచు - ఈ
సకలము 'కాదు కా'దను వచస్సున లేదటే కాంక్ష గుప్తమై!
ఉ. | ఎంత విరక్తవై ఇటు నటింతువు నీవు-మనోజుడన్న కా | |
(ప్రతిభ 1945 అక్టోబరు)
'మాచలదేవి'
(మాచలదేవి నాట్యకళాకోవిద, గణిక, కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రదేవుని ఉపపత్ని, విద్యాగోష్ఠీప్రవీణ)
చ. అరుణపటమ్ము గట్టె నుషయా యిది! రమ్య గృహాంగణమ్మునన్
తరుణవిలాసయై నిలిచె దర్పముతో మధులిట్ప్రభూత్తముం
డెరుగని పుష్పకోమలిగ - ఎవ్వతె? ఈ తొలిసంజ పార్థివుం
డరుగుచునుండె నా నెలవు, కాయమ యెంతటి పుణ్యమూర్తియో!
చ. కలగదు రాజరా జెదురుగా జనుదెంచిన, ముగ్ధహాసరే
ఖల నొలికించుగాని పదకంజము సుంత కదల్పబోదు, మం
జుల కరపల్లవంపు కొన జోకగ నూతనొసంగు పూనినా
డలసతతో మనోజ్ఞభవనాంతర భూమికి జేరు కోరికన్.
ఉ. ఇంతటి గారవమ్ము కలదే మును పెవ్వరికైన, రాజు ల
త్యంతదయార్ద్రచిత్తమున నాత్మ సఖీజన మెన్నడేని య
భ్యంతర హర్మ్యవీథి లఘుభావముతో గ్రహియించిరేని ని
శ్చింత క్షమింతు, రియ్యది విశిష్ట మపూర్వము పో మనోహరీ!
మ. అది యా మాచలగాక యెవ్వరగు సౌహార్దప్రమోదాన నా
మదిరాక్షిన్ ప్రియశిష్యగా గొనియె నా మాన్యుండు రారాజు - నీ
పదకంజాతము లంటి నూత్నగతు లభ్యాసంబు సేయించు నే
యుదయంబందున, ధన్య వీవు, సరి లే రో నాకలోకాంగనా!
చ. అనయము స్వర్గసీమను బిడౌజుని గొల్చెడు దేవనర్తకీ
గణపరిసర్పవై యమర కల్పక మంజుమహీజ మైన సం
జనితముగాగ నీర్ష్య సురసారసలోచనలందు వచ్చి ఈ
వనుకొనెదన్, మహోజ్జ్వల మహత్తర కాంతులు కాక కల్గునే! 5
శా. హాసౌజ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీపా లావతం సోన్నత
ప్రాసాద ప్రమదావనాంతలతికా వాల్లభ్యపుష్పాళిలో
నీ సమ్మోహన ముగ్ధరూప సుమ మో నీరేజపత్రేక్షణా!
మ. నిను సామాన్యగ జూచు నేత్రముల కున్మేషంబు రాబోదు తీ
రని కోర్కుల్ దయివారగా తెనుగునేలన్ నృత్యపాథోధి ఖే
లన సంజాత రసామృతమ్ము పొలుపారం బంచిపెట్టంగనై
జననం బందితి వంచు నెంచెద నినున్ సంధ్యారుణోద్యత్ప్రభా!
మ. అతిపుణ్యుండవు జాయపా! దొరికె నయ్యా నృత్యరత్నావళీ
కృతికిన్ ఈ అభినేత్రి మాచలయె, నీ కీర్తిధ్వజం బెత్తి భా
రతదేశాన త్రిలింగ నృత్యభరతా! లాస్య క్రియాజ్యోతి నా
తత దక్షత్వముతో రగిల్చి వెలుగొందన్ నిల్పు నశ్రాంతమున్.
శా. జాయా మధ్యగత ప్రభూత్తముని విస్ఫారాక్షియుగ్మమ్ముపై
నీ యాకేకర నేత్రకోణరుచి సందేహ ప్రమోదమ్ముతో
నాయత్తం బగువేళ బొల్చు స్మితమందాక్షమ్ము దేవేరులం
దా యర్ధాంగిను లే మెరుంగుదురు సఖ్యం బో రసానందినీ?
మ. శివ నీవై, ప్రభువే సదాశివుడుగా క్షేమంకరోద్య ల్లయో
త్సవవేళానటనం బొనర్చుతరి నే ధన్యుల్ మిమున్ జూచిరో,
యెవ రానందరసాబ్ది మగ్నులయిరో ఎవ్వారు స్తంభించిరో
భవరాహిత్యము కల్గు వారి కని నే భావింతు నో నర్తకీ!
ఉ. నేనును నీవు నాంధ్రధరణీపతి కొల్వున సర్వశాస్త్రపా
రీణులమై విరోధి నవలీలగ గోష్ఠులు గెల్చినార మం
చే ననుకొందు - కాక కలదే మనకున్ మన ఓరుగంటికిన్
ఈ నయగారపుం బ్రణయ మేర్పడ కొండొక కారణం బిలన్? 11
('సాహితీ సమితి' రజతోత్సవ సంచిక 1946 జులై)
'ఆత్మార్పణము'
చ. అవును : నిజమ్మె - కుంతి కనెనన్నది నమ్మితి, సూతపుత్రునిన్
చివరకు రాజ్యమిచ్చి యిటు జేసెను రాజుగ రాజరాజు, నే
నెవరికి బంధువైతి నపు డేడ్తెర చిత్తము కుందువేళ - నీ
పవరము వచ్చె స్వామికి ఉపాయనమై ఋణమెల్ల తీర్చెదన్.
ఉ. తల్లికి నాకు తీరినది ధర్మము వీడుచు గంగ చేతిలో
నుల్లము రాయిచేసుకొని యుంచిన యప్పుడె - నాటనుండి నా
తల్లియు తండ్రియున్ ప్రభువు దాతయు నాతడె యయ్యె గావునన్
ఎల్లిరణంబులో తనువు నిచ్చెద నాయది కాదు మాధవా!
ఉ. నే నొక తేపగాగ నవనీపతి దాట దలంచె శాత్రవాం
భోనిధి, నమ్మినాడు నను పొత్తులవానిగ, పార్థివుండు నా
పైనిఖిలమ్ము నిల్పి యొక పాడివహించెను - నీవె వచ్చి నన్
పూనము వైరిగెల్చి భువి పొల్పుగ నేలుమటందు వీగతిన్ -
మ. నిజమే రాజ్యము నాది, తమ్ములును నన్నే రాజుగా చేసి నా
విజిగీషాప్తికి తోడునీడలుగ నుర్వీ రాజ్య మిప్పింపగా
ప్రజకెల్లన్ పితనౌట ధర్మమనె, దప్పార్థుండు బావా! చతు
ర్భుజ! మాకక్కిన కూటి కాసపడె కర్ణుం డన్న నే మయ్యెదన్?
ఉ. క్రోధము జీర్ణమై హృదయ గోళములం దొకమూల దాగి మ
మ్మోధరణీధరా! కదలి యూరక బాధలు వెట్టు నొక్క దు
ర్వ్యాధిక - నన్ను ఫల్గుణుని - వారణ చేయగ వెజ్జు లేడు, మా
ఆధియు వ్యాధియున్ తొలగు నాహవ మెవ్వరికైన కేశవా!
ఉ. పార్థున కీడు కర్ణుడని పార్థివు డున్నవాడు, నే
వ్యర్థము చేయ నా తలపు వంచన చేసి - మహోపకారి,
జ్యార్థము నేనె యిట్లయిన నాతని కెవ్వరు తోడునిల్తు, ర
న్యార్ధము నీవె ఏల యిటు యాచన చేసెదవో జనార్దనా? 6
ఉ. కాలులు లేక చిక్కితిమె కాలవశంబున చిక్కినాము మే
మూలములోన చిత్రరథు, కర్జును డయ్యెడ వచ్చి గెల్చి మా
యేలికతోడ మమ్ముగొని యేగెను ధర్మజు నొద్ద కాత డిం
కేల వచింప మెత్తనివి ఎన్ని మాటల నాడె సూడగన్.
చ. తప మొనరించె ఫల్గుణుడు, దానము చేసెను పార్వతీప్రియుం
డపరిమితారాగమున నద్భుత దివ్య మహాస్త్ర మంచు మా
కృపుడును ద్రోణుడున్ బెదర క్రేపులు క్రీడికి చిక్కెగాని వా
రపు డొక సుంత పూనుకొన నాతని కేగతి మూడి యుండునో?
ఉ. మిన్నుల తన్ని పోరగల మేటి బలాఢ్యుడ నన్న పొంగు భీ
మన్నకు మిన్న మమ్ము గని మల్లుల నెంతటి వారినైన నే
సున్నములోని కెమ్ము పొడసూపని యట్లుగ నుండ చేతునం
చెన్నియొ చెప్పె నిప్పు డవి యేటికి వ్యర్థము చేయ జూచెదో?
ఉ. నేనొక వేళ పాండవుల నీడకు చేరిన లోకనింద నా
పై నిక రాకమానదు, త్రపన్ త్యజియించెద నోర్చియైన, కా
నీ నను కన్నబిడ్డవలె నేగతి పెంచెను సూతు, డెంత లో
లోన తపించునో, ప్రభుని రూక్షణ వీక్షణ పర్వినంతటన్.
మ. అతడే మూలము దీని కంచు ప్రభు వత్యంతాగ్ర హోన్మత్తుడై
చితి కెక్కింపక మానునే యతని నా సీమంతినీ రత్నమున్?
వెత లన్నింటికి నాడు గంగకడ నన్వీక్షించు టౌగాదె, ఆ
తత ప్రేమార్ధ మనస్కులన్ చెరచి యీతం డొందునే స్వర్గమున్?
మ. నవమాసమ్ములు మోసి కన్నయటు నాన్నా చిట్టి నా తండ్రి, నీ
వవుదోయీ సకలార్థముల్ జనని కం చానంద సందోహ సం
భవరాగమ్మున చూచి దృష్టిభయ ముత్పాటిల్ల గొంతెత్తి కా
వవె నా బిడ్డను దేవదేవ యను బావా! తల్లి యీ నాటికిన్. 12
చ. ఎటు త్యజియింతు నాయమను? ఏగతి నిల్చును నాదు ప్రాణముల్
పటుతర లోభమోహముల బానిస నా యెద తల్లివంక నీ
వటువలె చేయనేర్చితని అచ్యుత! నే నెటు చేయనేర్తు? నీ
వెటు మది నిల్పినావొ పరమేశ! యశోదను వీడి యేగగన్ ?
ఉ. సూతుల కంటిపాపనయి సూతకుమారిక నిచ్చిచేసి నన్
సూతులు కొల్వగా నిటులు సూతకులంబున నేను కర్తనై
సూతుడ కానటన్న యది చొప్పడునే పయిపెచ్చు సర్వమున్
కోతలె యౌటగాన నటు కుంతిచరిత్రకు మైల సోకదే?
మ. నను ధర్మజ్ఞుడవోయి నీ వనెదు నే నామాట సత్యంబుగా
గను వర్తింపగ పోలదే, యిచట నాకై ప్రాణ మర్పించువా
రును మారాకుగ నెంచి ప్రాకి మది యూరు న్పేరు కాంక్షించువా
రును నున్నారెటు లింతలంతలన పోలున్ చేయ నన్యాయముల్ ?
ఉ. కాటికి కాళ్లు చాచుకొని గంపెడు కోర్కెల చేతిమీదుగా
దాటగనున్న సూతుని విధం బెటు భగ్నముచేసి వత్తు? నా
మాటల కడ్డు చెప్పెనని మాత్రము లో ననుమాన మున్నచో
చోటు లభింప నీయకుము సూతకుమారుని నీ వెరుంగవే!
చ. చెలి పొలయల్క తీర్చుతరి సేవకురా లరుదెంచి దేవ! మీ
చెలువుడు వచ్చె కర్ణుడని చెప్పినమాత్రనె లేచి వచ్చి నన్
పులకితగాత్రుడై ఎడద పొంగులు వారగ గ్రుచ్చి యెత్తు నే
కలగెద నయ్య మా ప్రభుని కాంతులు పారెడు చోట నిల్వగన్.
ఉ.కాకులమూక లోకము ప్రకారము వింతయె అద్ది యర్థమౌ
నే కనినంతనే తొలుతనే కురురాజు పవిత్రమూర్తి - కృ
ష్ణా! కలుషాత్ము లెంద రెటు లాడిన నేమి హిమాద్రియాత, డ
స్తోక దయాపయోధి, రిపుతోయజమత్తగజంబు పోరులన్!
చ. జనపతి చూచినట్లే అనుజన్ములు చూచెద రాత్మబంధువున్
కనుగొనినట్లు, నే మరువ గల్గుదునే పదిజన్మలెత్తి? ఆ
అనిమిషసౌహృదమ్ము హృదయమ్మున లేదిక తావు వేరె నా
అనుజులకైన కాన సదయా! దయవీడకు మిట్టి పల్కులన్. 18
మ. ధృతరాష్ట్రుండును కర్ణు డన్న నమితోత్సాహంబు చూపించు నే
వితమైనన్ చెవి వేయ కా ప్రభువు కావింపండు, భీష్మాది బం
ధుతతిన్ విన్నటు కానవచ్చు వెలికిన్, దుర్యోధనాదిత్య సం
స్తుతి కెవ్వారలు పట్టుకొమ్మ లెరుగున్ స్వీయాంతరంగంబునన్.
మ. సుఖమో, దుఃఖమొ, స్వర్గమో, నరకమో సూత్రించె నీ కర్ణుడే
అఖిలం బాతని దంచు మాధవ! సహస్రాంశుండె రానీ యికన్
మఖవుండే యరుదెంచి నాక మీదె కొమ్మా! ధర్మరాజాగ్ర జా
సఖివై పాండవ బంధువై యనిన నే చాలింప నా యత్నమున్.
ఉ. ద్రోవదిలోన పాలని అదోవితమైన మొగమ్ము పెట్టి యీ
పావన మానసున్ కలగ బారగ చేసెదవేల? సూతుడే
పూవిలుకాని బారిపడి పోవగ కీచకుడా యితడు? బా
వా! వనజాక్ష! ఏటి కిటు లగ్నిపరీక్షకు పూనుకొంటివో!
చ. అతని సుఖమ్మె నా సుఖము అతని దుఃఖమె నాదు దుఃఖమై
మతు లొకటై చరించితిమి మంచికి చెడ్డకు నింతకాల మే
గతిచనెనో అదే గతిని కాలము వెళ్లెడుగాక కృష్ణ! ఆ
కతమున రౌరవాది నరకమ్ములు వచ్చిన సంతసంబగున్.
తే. నా పురాకృతమైన పుణ్యంబె యిట్లు
మూర్తి తాల్చిన దనదగు, పూత చరిత
సఖియ, అర్ధాంగి జీవితేశ్వరియునైన
సూతసుత మిన్న యొరులను చూడగలనె? 24
తే. నన్ను కనిపెట్టి నా యెదనున్న లతలు
చివురు లెత్తగ దోహద సేవసేయ
విసుగు చెందదు నడపు నెవ్వేళనైన
బ్రతుకు పడవను వినువాక బాటలందు.
చ. అలసత నేగు జహ్ను తనయా విరహోద్ధత మంద గీత లు
త్కలముగ వచ్చి మా మతులు త్రచ్చ ప్రియామృదు బాహువల్లరీ
లలిత దృఢాను బంధన విలాసముతోడ శరన్ని శీథినీ
విలసనలన్ హసింతు మతివేలముగా ప్రణయానుకూలతన్.
చ. అగునని సంధి వచ్చితివె? ఆ నెపమంతయ ధార్తరాష్ట్రు పై
దిగవిడిచేగ నిట్టు లరుదెంచి మమున్ కనుకట్టి గారడీ
తగ నొనరించి నావు ప్రభుధైర్యపుటాయువు పట్టుచిక్కె మా
పగతుర కెంత కొండ కనుపట్టిన దెంత యదృష్టమో కదా!
చ. మేమో ధర్మవిరుద్ధమౌ నటుల స్వామీ! నిన్ను బంధించినా
మేమో ప్రజ్ఞగనెంచి, భ్రాంతిపడి కానీ నీకె మేలయ్యె మా
వ్యామోహమ్ము భవత్ప్రదర్శనము దేవా! గుండెలో రాయియై
ఏమో చేయక యూరకుండు నటవే? యీడేరె నీ వ్యూహమున్.
ఉ. పాండవ పక్షపాతివి శుభప్రతిపాదన చేయుకోర్కెయే
మెండుగ నున్నరీతి కని మెచ్చగ లోకము రాయబారివై
దండిజయమ్ము పొందితివి, తథ్యము, ధర్మబలమ్ము చిక్కె నె
వ్వండు సమానమౌను నిలువన్ సరిపజ్జను నీతికోవిదా?
తే. ఆవులించిన ప్రేవుల నట్టె లెక్క
పెట్ట గలిగిన నీపయి పెట్టినారు
సకలమును దిద్ది సాగింప సమరమఖము
నాంది మొదలయ్యె నీ మహానాటకమున. 30
కం. కదలక మెదలక పోనీ
కదుపక నీవొక్కమారు కనుదామరలన్
కదిపితి వెల్లర గుండెల
పదపదమున కృష్ణ! నీదు ప్రాభవ మెసగన్.
తే. ఒకట నమరులు నమరారు లొకట నిలచి
సమబలంబుగ మథియింప జలధి గర్భ
మొదవ హర్షము కలిగె రసోదయంబు
అటులె యగు గాక నేటి మహాహవమున.
ఉ. కారణజన్మమెత్తి యల కచ్చపమైన పురాణపూరుషుం
డీరణ సాగరోన్మథన మేర్పడ భారము మ్రోయ పుట్టె పెం
పారగ నంచు ధర్మమధురామృతమున్ ఒకవేళ చక్రియై
పోరున తారుమారయిన పూనగవచ్చు నధర్మమార్గమున్.
తే. అతని కొర కేను నా కొర కతడు పుట్టె
విధి నియామక మిది గాగ విశదమగును
కర్రి లేకున్న కర్ణుడు కాన బడునె
కర్ణుడే లేక లేదు పో కర్రిబ్రతుకు.
చ. నొగపయి నిల్చి నీవొక వినోదముగా నడపంగ తేరు ఓ
యగధర! సవ్యసాచి పరమాద్భుతరీతి విరోధివర్గమున్
తెగ పరిమార్చువేళ రణధీరుడనై యెదురొడ్డి నిల్చి ఆ
సుగతతి బర్వి యిర్వురకు చూపెద నారణకౌశలద్యుతిన్.
శా. జ్యానాదారభటీ ప్రతిశ్రుతుల సద్యఃస్ఫూర్తి వర్తిల్లి మే
మూనానూన శరప్రహారముల కుద్యోగింప ధానుష్క సం
తానం బంతయు మూర్ఛవోవు నిక నాదైత్యారి వీరవ్రతుల్
ప్రాణాపాయ భయంబునన్ చెదరి శంపాకంపులై నిల్వరే?
శా. గాండీవమ్మును కాలపృష్ఠమును శ్రీకంఠోగ్ర కోదండముల్
నిండారన్ తెగలాగి వైచిన మహానిర్ఘాత పాతంబులై
కొండల్ కొండలె కూల్చినట్లుగను కాకోలార్చులన్ చిమ్ముచున్
చండాడన్ విశిఖాఘమున్ బరువు ద్విట్సేనాసమూహాళిపై.
మ. సరియై క్ష్మాపతి వర్గముల్ బెదర నాశాదుర్గముల్ గిర్గిరన్
తిరుగన్ పార్థుడు నేను మొగ్గరములన్ తీండ్రించి భంజింప నో
హరి నీ కెంతయొ మోదమబ్బును గదయ్యా! నేడు నీ వేటి కా
తరుణంబున్ చెడగొట్ట చూచెదవు భక్తాయత్తచిత్తంబున్?
శా. ఈ రాధేయుడు కుంతిబిడ్డ డని నీ వేనాడు సూచింప కీ
పారావార పరీత భూవలయమున్ వర్ణించు ధర్మాత్మజుం
డా రాజన్యుడె భూమి నేలవలె చంద్రాలోకముల్ కాయగా
మా రాజేశ్వర రాజసోజ్వలుడు ధర్మం బీయగా నేర్చునే?
ఉ. మాధవ! నీకె సంగర రమా పరిరంభణ మబ్బు మాదు భూ
మీధవు కౌనటన్న మతిమీరిన ఊహల పోను కాని నే
నాధరణీపతిన్ ఏడువ నాత్మ కశాంతిని తెచ్చుకోను మా
యాధవ! యేల యిట్టి పరియాచకముల్ ననుబోటి వానితోన్?
శా. మాయావాదము లేలనయ్య ప్రభువా! 'మా కర్ణుడే' యన్నయా
యీ యాదృచ్ఛికమైన బుద్ది కెదలో నిల్లిచ్చి కాపాడవో
యీ! యాచించెద దీనినే యిహపరాలేమైన నాకేమి? నా
ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే! 41
(ప్రతిభ 1946)
'విన్నపము'
(లౌకిక విజయమర్యాదాదులను ఆశించి నానారాజసందర్శన చేయదలచిన ధూర్జటి కవీంద్రుని మనఃప్రవృత్తిని గుర్తించిన కాళహస్తీశ్వరుడు తొలుత వారించినాడు. పెడచెవిన పెట్టి వెళ్ళి ఆయా స్థితిగతులకు ఒదగలేక తిరిగి వచ్చి సర్వేశ్వర సన్నిధానంలో ఒకనాటి ఏకాంతమందు చేసుకొన్న విన్నపము)
కం. కన్నుల మూడిటి నార్పుచు
ఎన్నడు న న్నెఱుగ నట్టు లేల నటింపన్?
కన్నీరొలుకకు తండ్రీ!
కన్నప్పను గాను నేను కన్నుల నొసగన్.
చ. చనినాడన్ విజిగీషతోడ కవితా సామ్రాజ్యమున్ గోరి నా
ఘననిష్ఠా జపహోమ సత్రియలకున్ కల్పించితిన్ స్వస్తి, మా
యని కాలుష్యము, క్లేశమున్ మిగిలె రాజాస్థాన మర్యాద లీ
వని నట్లే జరిగెన్, సభన్ గలుగవయ్యా! అర్హ సత్కారముల్.
శా. ఏ నాడైన భువిన్ అసూయ, కలుషం బీర్ష్యా, వ్యథా, శాంతియే,
కానన్ రావు సమత్వ, మభ్యుదయ, మగ్రామ్యంబు, సౌఖ్యంబు దే
వా! నాకేశగురూత్తముండు కవియై ఆస్థానముల్ చేరినన్
నే నమ్మన్ కనకాభిషేక మగునేవిన్, నా శిరం బిచ్చెదన్.
మ. 'పటు గంగా లహరీపరీత శమ శుంభత్ప్రౌఢతాంచత్కళా
ఘటనున్' న న్గని కృష్ణరాయ ధరణీకాంతుండు సామాన్య వా
క్పటిమన్ దర్పునిగా మదిన్ దలచి సంభావింపడున్, కావ్య ది
క్కటి గండస్థల గంధవాహమధు వాఘ్రాణింపగా నేర్వడున్.
ఉ. నాగరక ప్రపంచము ఘనమ్మని నెమ్మది నమ్మి స్వామి సం
ధ్యాగగనాంగనారుణ విధామథితాత్మ రజః ప్రవృత్తిమై
భోగము లారగించు తలపుల్ గొని చంచల చంచరీక హృ
ద్వేగగతిన్ చరించి భ్రమతీరగ జేరితి నిన్ సదాశివా ! 5
ఉ. అలఘుప్రౌఢిని క్రీడమై బహు రణోద్యద్భూములన్ నిల్చు రా
ట్కుల గంధేభుడు కృష్ణరాయ వసుధా గోపాలు డైంద్రద్విపో
ద్గళ ఘంటారవ పాటవోజ్వల లసత్కాష్యంబు కల్పించి నే
అలపెద్దన్నకు రాజుకున్ మధురసఖ్యం బన్న నిద్దాననే!
ఉ. అంకిలి లేక గైకొనిన ఆ శఠగోప యతీంద్రదత్త చ
క్రాంకిత సర్వ దేహమును కైటభవైరి పదాబ్జ సేవ ప్రే
మాంకిత నర్తకీగణ రహః ప్రణయార్ద్ర హృదంతరంబు లే
కంకురితమ్ము గాదు మనుజాధిప సత్కృప యెంతవానికిన్.
సీ. ఆళీక నేత్రాగ్ని హాసానంత రోచిస్సు
కనలేక శిఖిపింఛకాంతి వలచి,
హారవాతాశన మారుతౌద్ధత్యమ్ము
లడయింప కౌస్తుభహారు జేరి,
సందీప్త శితికంఠ సప్తార్చి వర్చస్సు
భయపెట్ట వైకుంఠు పజ్జ నిలిచి,
నందీశ హుంకార నాద జర్జరితోర్వి
మనలేక వాంశిక స్వనము గ్రోలి,
తే. పెద్దిరా జయ్యె నంతటి పెద్దవాడు,
ముక్కుతిమ్మన్న సంస్తుతి కెక్కినాడు,
అబ్బినది రామలింగన్న కంత చొరవ
అయ్యె కలిపితామహుడు పెద్దన్న మొన్న!
ఉ. ఏ శివలెంక నీ భువిని ఎన్ని భవంబులు గల్గు నన్నిటన్
నే శివు కొల్వగా గలనె నీ మహనీయ భుజంగ దివ్య భూ
షాశితికంఠ సుందర హసన్న వరూపము దక్క నన్య, మీ
యాశయ మొక్కటే బ్రతుకు నార్ధము మంజులమున్ పొనర్చెడిన్. 10
మ. గణికాలోలు డటన్న యొక్క ప్రథ లోకంబెల్ల వ్యాపించె నిం
దణుమాత్రమ్మును లేదు సత్యమెట ఈశా! పెట్టినా డెవ్వడో
ప్రణయాందోళన నిత్యజీవన కథాలాపుండు - కల్పించె తీ
రని దుష్కీర్తిని - సంతసించెదను కల్గన్ భుక్తి అవ్వానికిన్.
శా. రాజద్వారము లందు దర్శన సముల్లాసంబునన్ నిల్చుటన్
నా జన్మం బిటు వ్యర్థమైన యది - విన్నాణంబు కోల్పోయి పం
కేజశ్రీపరిణద్ధ మత్కవిత విక్రీడింపగా మానె - నీ
రాజన్యత్వమె నమ్మి చేరితిని శర్వా! రాజరాజేశ్వరా!
ఉ. రాజత శైలరాజ! నగరాజ సుతాసురభూజ!! ఫాలవి
భ్రాజిత నేత్ర దగ్ధరతిరాజ!! సురాసుర నమ్రమౌళి సం
యోజిత నిత్య రమ్య కరయుగ్మ సరోజ!! శిరోజరాజ! ఈ
రాజులు నిన్ను పోలగలరా! సకలార్తిహరా! కృపాకరా!!
ఉ. ఉన్నది నా శరీర మట - ఉన్నది నా యెడ కాళహస్తి సం
పన్న మనోజ్ఞ తాపక శుభప్రతిపాద జలేజ షట్పదం
బన్నటు లెల్లవేళల, నహర్నిశలందును నీవె నాకు నే
నెన్నుట గాదు సర్వము మహేశ! ఎఱుంగుడు వీవె సాక్షిగన్.
శా. నా కీ స్వర్ణముఖీ జలౌఘములలోనన్ నాకకూలంకషా
రాకాచంద్ర విశుద్ధ మోహన సుధారంహమ్ములే తోచు నిం
దేకాలమ్మున దీర్థమాడుటలు స్వామీ! ఏ పురాజన్మలో
నో కావించిన పూజకాక యెటు లై యుండున్ మరొక్కండుగన్.
మ. జననం బన్నది దుఃఖహేతువని నే శర్వా! మహాదేవ!! ము
న్ననినాడన్ మది కెక్కెనా అది మహేశా!! జన్మమే లేని నీ
గణమం దొక్కనిగా నొనర్చు మిక కైలాసరాజ్య న్నట
ద్గణమం దొక్కడనై రచించెదను సంధ్యా నృత్యగీతమ్ములన్. 16
చ. నా కొక జన్మమున్న భువి నన్ జనియింపగ నిమ్ము స్వామి! నీ
వాకిట బిల్వవృక్షమటు వత్సలతన్ - దినమున్ దినమ్ము ప
త్రాకృతితో త్వదీయ 'పదహల్లక' వీథి నలంకరింతు, ఛా
యా కమనీయ దేహమున హ్లాదము గూర్చెద నేత్రపంక్తికిన్.
చ. శిరమున నున్న గంగ శశిశేఖర! నారసనాంచలమ్మునన్
దిరముగ నిల్పుమయ్య మధుదిగ్ధ సువర్ణ మహత్త్వవాణి నీ
కరుణకథానకమ్ములె యుగమ్ములు తెల్గుధరిత్రి పాడగా
చరణములాన చెప్పెద ప్రశస్తికి పాత్రునిగా నొనర్పవే!
శా. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండ వద్వైత వి
ద్యాగోష్ఠిన్ వివరింప నీవె కద చిత్తవాసముం జేరి మ
త్రాగల్భ్యమ్ము సమస్తమున్ మెరయ శుంభ త్ప్రౌఢి పల్కింపనే
నీ గాథన్ గిరిశా! ప్రజాపతిపురంధ్రీ కంఠహారమ్ముగన్.
కం. తెలతెలవారెడ్డి తూరుపు
తెలిగన్నుల విచ్చి దేవ! దీవన లిమ్మా!
తలపున నీ యెడ నాపై
వలపే జనియింప నిమ్ము వరద! దయాళూ!
కం. "శ్రీకంఠ! కంఠభూషిత
కాకోదరవర వరాకఖండ మతవ్యా
ఖ్యాకోలాహలదూర" చి
దాకృతి! జితకాల! కాలహస్తీశ! శివా!" 21
(భారతి 1952 నవంబరు శాంతి 1961)
'బృహన్నలాశ్వాసము'
(ఉత్తర గోగ్రహణవేళ కౌరవసైన్యములు గెల్చి గోవులను మరలించుకొని వత్తునని వచ్చి శత్రువ్యూహముల తిలకించినంతనే భీతివడి పారిపోవుచున్న ఉత్తరునితో బృహన్నల)
చ. "కురుపతి సైన్యముల్ వెలుచ క్రొవ్వెనె! గోవులఁ బట్టి యేగెనే
యరమర లేక! వారు వివిధావదోహలు నైన నన్నునున్
బరిగణనంబు సేయరె! శుభస్థితి వారికి జెల్లె నింక స
త్వరముగఁ బూన్చుడీ రథము దారుణచాపశిలీముఖాదులన్.
చ. "అనిమిషకోటి నాజి విబుధాద్భుతవిక్రముడై జయించి య
త్యనుపమకీర్తియై వెలుగునట్టి పృథాసుతు కెందునైన నే
నెనయగువాఁడ - కౌరవుల కెల్లి రణాంగణమందుఁ జూపి నా
ఘనతర యుద్ధకౌశలము క్రమ్మర దెచ్చెద గోధనంబులన్.
శా. "కల్లోలంపడఁ గ్రీడి వచ్చె నని సంగ్రామక్రియాశ క్తి సం
పల్లాభుల్ కృప ద్రోణ భీష్ములె ఘనభ్రాంతిన్ ననుఁ జూడ వి
ద్యుల్లోకోజ్జ్వలకాంతుల న్మెరసి శత్రువ్రాతమున్ గెల్చి యో
చెల్లీ! తెచ్చెద బొమ్మ పొత్తికల నీ చిత్తంబు రంజిల్లగన్.
చ. "కొని యిదె వత్తు గోవుల నకుంఠితశక్తి" నటంచు నంగనల్
మనమున నుత్సహింప పలుమాటలు, మేటిగ బల్కి వచ్చి నీ
వనిమొనఁ జేరలేదు, రిపునైనను గల్గొనలేదు, వారు ని
న్గన రిసుమంత యైనఁ నిటుభీరుడవై పరువెత్త బాడియే?
మ. "అకృతాస్త్రుండను బాలుఁడన్ కదనవిద్యాప్రౌఢి పొల్పారు న
య్యకలంక ప్రతిభా సమగ్రు లగు భీష్మాచార్యద్రోణాధి నా
యక సంలక్షిత శత్రుసైన్యముల మారై నిల్చి పోరంగ నే
నకటా! చాల, బృహన్నలా! విడువు మం చర్ణించుటల్ క్షాత్రమే!” 5
ఉ. శ్వాపదమేదుర మ్మయిన చండమహాటవి జొచ్చుతీరునన్
భూపకుమార! భీతివడిపోయెదు, మత్స్యకులోద్వహా! ఇటుల్
తాపముఁ జెంద నేమిటికి? తాల్మిమెయిన్ రణకాణయాచి యై
యీపృథివిన్ సుకీర్తి వెలయించిన వంశయశమ్ము నెంచుమా!
ఉ. ధూర్తులు ధార్తరాష్ట్రులిటు తోయధులై మనపైబడంగ స
త్కీర్తి గడించు కాల మరుదెంచిన తృప్తిని వీరపాణివై
వర్తనకేళి సల్పి, యట వచ్చి నిజప్రజ మెచ్చ - నిట్టుల
త్యార్తిని మున్నె వెన్దిరుగు టయ్యొయు! యారయ నాత్మహత్య యౌ!
ఉ. ఉత్తర కేను లాస్యము, లయోచితరీతుల నేర్పువేళలన్
గ్రొత్తవి చెల్లి యేమి యనుగుంగతులం దగ నేర్చె వాని నీ
చిత్తము కెక్క ఁ జూచి పటుశేముషి నా కట వీరనర్తనో
ద్వృత్తగతుల్ నటించి మురిపించిన నెమ్మది నెంత మెచ్చితిన్!
ఉ. “కీచక కాలమేఘ మపకీర్తుల లొనరింప క్రమ్మి య
త్యాచరణాళి రాజ్యమున కంతటికిన్ పెనుభీతి నిచ్చు, సం
కోచము మాని బంధు వని క్రుద్ధమహానిలలీల త్రోలి ధ
ర్మోచితరీతి దేశమున నొప్పఁగ నిల్పెద నన్న పొంగితిన్.
చ. "కురుబల మెత్తి వచ్చి మనగోవులఁ బట్టిన దాని గెల్చి క్ర
మ్మరఁ గొనితేర శౌర్యమహిమంబున నెక్కటి వీరమూర్తినై
యరిగెడివేళ తేరికి బృహన్నల సారథియైన జూచువా
రం! పురిలోన నింతకరవా రథచోదకు లంచు నవ్వరే!”
చ. అని మును మాలినీరమణి యయ్యెడ సారథిగాఁగ నన్ను గై
కొని యని కేఁగు మంచు తనకుం గల సూచనఁ జెప్పినం నీ
వనినటు వింటి - నందుకు నృపాత్మజ! నా యెద నవ్వుకొంటి - నై
నను నిటు భీరుతాగుణగణ ప్రబలార్హుడ వం చెరుంగబో! 11
ఉ. ఆహవ మన్న భీతిల జనాధిపనందన! నీ కి దేల? సో
త్సాహుఁడ వై వినీలజలదక్రియ నిల్చి రణానఁ గౌరవ
వ్యూహముల న్నిశాతవి శిఖోజ్జ్వలవృష్టిఁ దపింపఁజేయ స
మ్మోహనసాంపరాయచణభూరిరిరంస వహింపఁగాఁదగున్.
చ. అనయముఁ గోరి 'అల్లుడ నయో, యల పార్థున కే' నటంచు నీ
వనియెడు మాటలం దలఁచి, యంతిపురమ్మున క్షాత్రమూర్తివై
చనియెడు వేళఁ జూచి పదచాలనవైఖరి, మేనమామ చా
లనుకొని యెంత సంతసము నందితి నుత్తర, నా మనమ్మునన్,
ఉ. "ఆటకొ, పాటకో కడఁగు మన్నఁ దగున్ రిపుఁ గెల్వఁగోరి యి
ప్పాటునఁ పోటుబంట వయి భండనభూమికి నేఁగువేళ వై
రాటి! రథంపు సారథిగ రమ్మని పిలువు, పేడి నైన నే
నేటికి నీకు సాటి యగు నెవ్వని నైనను బిల్వ యోగ్యమౌ”
చ. అని మును నేను వల్కినపు డద్భుతవీరరసాతిరేకతన్
గని జగదేకవీరుఁడవుగా నెది వల్కితొ దాని నెల్ల నీ
మనమున నెంచి, కాని యనుమానములన్ దిగబుచ్చి, లెమ్ము, నీ
కెనయగు వీరమాని జనియించునె కొన్ని యుగాల కేనియున్?
ఉ. గోధనమున్ గ్రహించి తమకుం జిరకీర్తిగ శాత్రవాళి ని
ర్బాధితులై చనంగ, సమరక్రియ కీవు జనించి, యస్త్రవి
ద్యాధనసంపదన్ గొని, మహత్తరవీర పరిశ్రముండ వై
యో ధరణీశనందన! మహోద్ధతిఁ జూపకయుంట పాడియే?
ఉ. ప్రాణము లింత తీపయినఁ బైకొను మృత్యు వనుక్షణమ్ము - ని
ద్రాణములై నశించు శుభదంబులు శక్తు లవెల్ల - యుద్ధపా
రీణుఁడ వోయి నీవు, నిటలేక్షణవీక్షణ నీకు నౌ తను
త్రాణము, భావిమత్స్యజనతాపతి నీవు విరాటనందనా! 17
ఉ. చచ్చిన వచ్చు స్వర్గ మిట సంగరభూమిని గెల్పుగొన్నచో
వచ్చు ననంతగౌరవము, బంధురకీర్తియుఁ - గాఁన, పూని వి
వ్వచ్చుఁడ వై, రిపువ్రజము పైఁ బడి, సింహకిశోరలీలల
న్మెచ్చఁగ శాత్రవేయు అనిమేషమహత్త్వముతోడఁ బోరుమా!
ఉ. ఏగతి బోధచేసినను నించుక యైన మరల్పవోయి నీ
భీగతచిత్తవృత్తి - నిఁకఁ బేడిని నాపయిఁ బడ్డ దెల్ల యు
ద్యోగము - పొంగి పొర్లి కడలొత్తెడు మామక శత్రుభంజనో
ద్వేగము నాపఁజాల, రిపువీరులపైఁ బడ నిశ్చయించితిన్.
ఉ. గోహరణమ్ము నొక్క యవకుంఠనగా గొని ధార్తరాష్ట్రు లు
త్సాహము నొంది పాండవులు సల్పెడి, మీకడ గూఢవృత్తి క
త్యాహితముం బొనర్ప నిటు లర్థిని దిక్కుల రెంట నొక్క మా
రూహ యొనర్చి పట్టిరి రయోద్ధతి మీదగు నాలమందలన్.
చ. అమితవిచిత్రరీతిఁ గనులందునఁ బ్రశ్న మెలర్పఁ జూతు వో
యమలినచిత్త! మత్స్యమనుజాధిపు గొల్చుచు నొక్క యేడు గా
సముచితదాస్యవృత్తిఁ గెలసంబునఁ బాండవు లున్నవారు ఆ
సమయము దీరె భాస్కరుడు చయ్యనఁ జేరఁగ నింగి నచ్చటన్.
ఉ. కారణజన్మమై తనువికార మ దించుక గల్గినన్ మహా
వీరుఁడ నయ్య నేను పృథివీవరనందన నాడు కోర్కె మైఁ
తేరు చరించెనేని కురుధీరులె కాదు, సమస్తవీరులున్
స్థిరమతి నిల్చినన్ జయము దెత్తును - తథ్యము రాజనందనా!
చ. ఇదె, కనుమా, బృహన్నలనె? ఏగతిఁ బుంస్త్వము నన్నుఁ జేరి తా
నుదితమనోజ్ఞమోహనత నున్నదొ యీ తనువెల్ల నిండి - నా
యెదకడలిన్ సుడుళ్లుగొని యెల్ల జగమ్ముల ముంచియెత్త నౌ
నదయత రేగు రౌద్రరసహారివిజృంభణ లేమి సెప్పుదున్? 23
చ. మతిపస, బాహుశక్తి, యతిమానుషవీరవిభూతి నొప్పి సం
తతఘనభైరవార్చనల దర్పితుఁడై వెలుగొందు నా జరా
సుతు, మురవైరి యీర్ష్యపడు శూరతమైఁ బ్రథనోర్వి సప్తవిం
శతిదినముల్ యెదిర్చి తుది జంపిన భీమున కేను తమ్ముడన్.
మ. అకలంకోజ్జ్వలబాహుదర్పమున నుద్యద్దైర్య హేమాద్రి యై
బక కిమ్మీర జటాసుర ప్రతతికిన్ బ్రాణాంతకుం డై తిరం
బొక విఖ్యాతి గడించి మా కొసఁగె నే యోధానయోధుల నితం
డొకఁడే కీచకుఁ గాముకున్ చదిపి ప్రాణోత్సర్గఁ గల్పించెఁబో!
మ. నతనానావనినాథ దివ్యమకుటన్యస్త ప్రభారత్నదీ
ధితు లెవ్వాని పదాబ్జకాంతులు సముద్దీపించి త్రైలోక్యవి
ద్యుతులై వెల్గెనొ రాజసూయమఖసంస్తుత్యక్రియావేళ నా
యతిలోకుం డగు ధర్మజప్రభుని రాజ్యం బెల్ల నా గెల్పె యౌ.
ఉ. ఊర్జితశక్తియుక్తి మహితోదయ శౌర్యరసప్రభావ వి
స్ఫూర్జితధైర్యధుర్యుల, విశుద్ధయశస్కుల, గాఢసాధనో
పార్జితభీమభైరవరణాంచితులన్ రిపుల స్థాయించు నా
'అర్జున' నామధేయుఁడను ఆ 'విజయుండ'ను నేనె ఉత్తరా!
చ. అదె యుపగూహనోజ్జ్వలత నా తపనీయజలేజకాంతి ను
న్నది పృథుసర్పదర్పమున గాండివ మా పెనుజమ్మిపైన - మ
త్కదనకఠోరబాహువులఁ దాండవమాడఁగ నద్ది, నిల్చి నే
నెదిరిన నింద్ర సైన్యముల నైన జయింతును రాజనందనా!
చ. కొలువునఁ గంకుభ ట్టనఁగఁ గ్రుమ్మరు నట్టిఁడె ధర్మజుండు - మీ
వలలుఁడు భీమసేనుఁడు, అపాకృతపౌరుషశక్తియుక్తిమై
లలితకళాగురుండ నయి లాస్యము నేర్పితి ఫల్గుణుండ - ను
జ్జ్వలులు కవల్ త్వదీయహయ శాసకగోగణదక్ష శిక్షకుల్. 29
చ. కనుఁగొన నగ్నికీల యను గౌరవభావ మెలర్పఁజేసి 'మా
లిని' యను పేర మిమ్ము నలరించుచు, మీకడ గట్టువాలుగా
మని, తుదిఁ గీచకాధము నమాన్యవిచేష్టలఁ జిక్కి స్రుక్కి, వా
నిని మడియింపఁజేసిన యనిందితదివ్యచరిత్ర 'కృష్ణ' యౌ.
ఉ. మోహముదీర నింక రథముం గొని ర మ్మిట కేను వైరిసం
దోహము నొంప సింహగతులన్ జన సారథి వౌట కీవు వ్యా
మోహపడన్ దగున్ - అధిపుపుత్రుఁడ! అల్లుఁడ! ధన్యుఁజేతు నే
నాహవభార మందుకొని యంతయుఁ దీర్తును సవ్యసాచి నై.
ఉ. సంతస మయ్యెనా? సమరసంభృతి కేను గడంగ ధీర ధీ
మంతుఁడ వైతివే? ఇపుడు మా రథసారథి వైతి నీవు - ని
శ్చింత రథమ్ము నెక్కి ననుఁ జేర్పు శమీకుజభూమి - వైరిరా
డంతకమూర్తి నై మెరయ నయ్యెడఁ దాల్చెద వీరవేషమున్.
మ. అవనీచక్రము తల్లడిల్లఁ, ద్రిదివం బాకంపమున్ బొంద, ది
గ్వివరమ్ముల్ చలియింప, నుద్గురకులోర్వీధ్రమ్ము లల్లాడ న
ర్ణవముల్ పెల్లు కలంగి ఘోష లిడ రుద్రప్రౌఢహాసోద్భటా
రవశంఖం బగు దేవదత్తమును దర్పంబొప్ప పూరించెదన్.
శా. చండీశోద్ధతకార్ముకోపమమహాచాపమ్ము, సంబుద్ధమ
ద్గాండీవమ్ము ధరించి, వీరగతి విక్రాంతిన్ రథం బెక్కి, యే
చండాంశుంబలె వెల్గుచు న్గదలి యా శత్రుక్షమానాథుకుం
గుండెల్ దల్లడిలంగ విన్చెదను జ్యాఘోషం బపూర్వంబుగన్.
ఉ. అచ్చట శత్రుమారణనయాంచితకేళి కుపక్రమింప నే
వచ్చెద - నాహవావని నవారణఁ జొచ్చెద, నా గురుండు వి
వ్వచ్చుఁడు వచ్చినాఁ డని కృపామతి మెచ్చఁగఁ, తాతయుం గడు
న్నచ్చిక దీవనల్ గురియ నాటెద వందనమార్గణద్వయిన్. 35
(అముద్రితం, 1965 జనవరి)
'కర్తవ్యము'
(మృత్యు దేవతాహ్వానాన్ని అంగీకరించేటప్పుడు కాకతి ప్రోలరాజు దుర్జయ ఎర్రసేనానిని కుమార బేతరాజుకు పాలకుణ్ణిగా నియమించారు. కొంతకాలం గడచిన తరువాత యుద్ధభూమిలో వృద్ధు ఎర్రసేనాని వీరస్వర్గాన్ని అలంకరించాడు. అదను దొరికిందని పల్లవరాయాది శత్రువర్గం యువ బేతరాజు మీదికి దండెత్తి ఓరుగల్లును ముట్టడించింది. సంధిప్రయత్నాల కోసం ఆహ్వానించిన రాజసభలో ఎర్రసేనాని భార్య కామసాని, ప్రభువుతో)
ఉ. క్రమ్మెను కారుమేఘములు కైవడి దిక్కుల శత్రుసేన, వీ
రమ్మగుసాధనమ్ము, పవరంబులు పోక లెరుంగక నట్లు నీ
నెమ్మది కింత భీతి తగునే? బలగంబులు చాలవే? ప్రభూ!
లెమ్ము, కరాంబుజంబున ధరింపుము కాకతి శాతఖడ్గమున్.
ఉ. నీవొక వీరమూర్తివయి నిస్తులధైర్య హిమాద్రి నాం
ధ్రావనికిన్ మహాయశ మనంతముగా గడియింతు వంచు, లో
కావన దక్షతన్ పృథివి కంతటి కేలిక వౌదు వంచు నే
మో వచియింపరాని తమి నువ్విళులూరెడి దేశమింతకున్.
మ. రిపు లేనాడును తేరిచూడగలవారే నిన్ను! నీ ప్రాభవం
బిపు డేపాటిదొ నీవెరుంగక ధరిత్రీశావళిన్ బేలవై
అపకీర్తిన్ ఘటియింప పూనెదవు రాజా! కాకతీయాన్వయ
ప్రప నీ మూలమునన్ విషాక్త జలపూర్ణం బౌటయోజింపుమా!
ఉ. ఆ కమలాప్తు డాదిగ మహాద్భుత విక్రము లెందరెందరో
మీకులమందు పుట్టి పుడమిన్ వ్రతులై వెలుగొంది నార, ల
వ్యాకుల చిత్తవృతి తలపన్ దగు నియ్యది కిల్బిషమ్ము తం
డ్రీ! కలకాలమున్ నిలచు నెన్నడు మాయదు మీ చరిత్రలో.
ఉ. ఆచ్ఛత మ్రోసె పేరు భవదన్వయ, మెన్నటికైన నిత్యమీ
తుచ్ఛ శరీర నాశనము - దూషణ కీవొడి పట్ట బోకుమా
స్వేచ్ఛ నశింపగా బ్రతుక చింత యొనర్చుట సిగ్గు సిగ్గు, ప్రా
ణేచ్ఛ త్యజింపుమా, ఇక వరింపుము స్వర్గమునో జయమ్మునో .5
ఉ. సంధికి ప్రాకులాడు టొక సాహసమే, అది క్షాత్రధర్మమే,
బంధములన్ తెమల్చి పరపార్థివ మోహన రాజ్యలక్ష్మి సం
బంధముకోరి నిల్వదగు భండన భూమి - ఆరాతి శౌర్య గ
ర్వాంధత రూపు మాపి జనరంజక కీర్తి వహింపగాదగున్.
మ. ఇది నీ స్వేచ్ఛ క్రయం బొనర్చుకొనుటే - ఈ యావదాంధ్ర ప్రజా
హృదయా వాసములన్ దవాగ్ని నిడుటౌనే కాని - భీరుండవై
కదన క్షోణిని నిల్వలేని తరి యోగ్యంబౌ ప్రజారక్షకై
అద నేతెంచెను చాలవేని ప్రభు రాజ్యత్యాగమున్ చేయుమా!
ఉ. ఎగ్గు దలంచి వారలు జయింపగ నీపయి కత్తి గట్ట ని
మ్మగ్గలమైన సేనల మహాహవ భూమిని జైత్రయాత్రకై
మొగ్గరముల్ రచించి పురమున్ నలు దిక్కుల ముట్ట నిమ్ము, ఇ
ల్లిగుగ్గులు పెట్టగా గలరె లేశము నే నొకదాన చాలనే.
చ. అబలయె కామసాని, వివిధాహవ కేళుల నందెవేసె నా
ప్రబల విరోధి సైన్యములు - బారల ప్రాభవముల్ హరించుటే
కబళముగాగ మింగెదరు గాదె బలమ్ము క్షణమ్ములోన నే
నబకను నమ్మి గంగ దిగినట్లగు నంచు తలంప బోకుమా!
శా. గర్జింపన్ ప్రళయాంబుదంబుగ రిపుక్ష్మానాధు లుద్విగ్నులై
వర్ణింపన్ రణభూమి శౌర్యవిభవ వ్యావృత్తి శాసింప నే
తర్జన్యంగుళితో - సమస్త వసుధా ధాత్రీశ్వరత్వంబు నీ
కార్జింతున్ భయమేల యుద్ధమున కాహ్వానింపగా శాత్రవుల్.
శా. సేనా పట్టము గట్టి నన్ననుపు మాజిన్ కాళికా మూర్తినై
నానా భూత వితాన భీకర లసన్నవ్యోజ్వల క్రీడగా
నే నాట్యం బొనరించి తెత్తు జయ తన్వీ గాఢ సంశ్లేష భ
వ్యానందం బట రాజ్య మేలు కొనుమయ్య, శ్రీశచీస్వామివై : 11
ఏకశిల' నుండి (1951)'