వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము/అక్షరాంజలి
అక్షరాంజలి
ఈనాడు - స్ఫురద్రూపియైన వయోవృద్ధుడుగా సమకాలీనలోకానికి కన్పించే శ్రీవావిలాల సోమయాజులుగారు - నాకు సుమారు ఒక అర్ధశతాబ్దికి పూర్వం - జ్ఞానవృద్ధుడైన కవి కుమారుడుగా సుపరిచితులు. “శ్రీసోమయాజులుగారికి రావలసిన కీర్తి రాలేదు" అని అప్పుడప్పుడు నాలో నేను అనుకున్నాను గాని, అది సరియైన అభిప్రాయం కానే కాదు. అభిజ్ఞులు పలువురకు సాహితీతపస్వి శ్రీసోమయాజులు గారి రచనల విలువ తెలుసు. సమకాలీన విజ్ఞులు ఆయనను "కుమార ధూర్జటి” - “సాహిత్యాచార్య” - “సౌహార్ద సారథి" “సాహిత్య బంధువు" - "సాంస్కృతిక సింధువు" ఇత్యాది బిరుదులు ఇచ్చి సత్కరించారు. “వెన్నవంటి చిరునవ్వు” - “వేణువు వంటి కంఠస్వరం” - “వేదం వంటి విజ్ఞానం” “వేలుపు వంటి రూపం” - పంచ వషట్‌కార సంస్కార సంపన్నుడు శ్రీవావిలాల సోమయాజులు అని సాహితీ సహవ్రతులు ప్రస్తుతించారు. నేడు ఈ కవితా ఖండికలు ప్రచురించటానికి నడుం కట్టుకొని ముందుకు వచ్చిన శ్రీఊట్ల కొండయ్యగారు విజ్ఞులలో విజ్ఞుడు.
శ్రీసోమయాజులుగారి కవితలకు పరిచయ వాక్యాలు వ్రాయగలిగిన ఏకైక వ్యక్తి సాహితీ సమితి సంస్థాపకుడు సభాపతి స్వర్గీయ తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారు. నేడు వారు లేరు. ఇక సోమయాజులుగారితో కలిసిమెలిసి తిరిగినవారు పలువురు భూలోకంలో లేనే లేరు. నేటికీ సజీవుడై యున్న వయోవృద్ధుడను నేను గనుక ఈ “భారం” నా మీద పడింది. నిజానికి ఇది భారం కాదు, నా భాగ్యమే!
1942 సంవత్సరంలో శ్రీజంధ్యాల పాపయ్యశాస్త్రి గారు, శ్రీవావిలాల సోమయాజులుగారు, నేను తరచు శ్రీ శివశంకర శాస్త్రిగారిని గుంటూరులో దివ్యజ్ఞాన సమాజం ఆవరణలో సాయంసంధ్యా కాలంలో కలుసుకుంటూ ఉండేవారం. శ్రీ శివశంకరశాస్త్రిగారు సహజసాహితీ కవచకుండలాలతో అవతరించిన “సభాపతి”. ఆయనకు ఆప్తమిత్రుడు నవ్య సాహిత్య పరిషత్తు కార్యదర్శి శ్రీతెలికిచెర్ల వేంకటరత్నంగారు అక్కడకు వచ్చేవారు. గుణగ్రహణపారీణుడైన శ్రీవేంకటరత్నం గారికి, శ్రీవావిలాల సోమయాజులు గారిపై ప్రత్యేకమైన “మోజు” ఉండేది. నవ్య సాహిత్యపరిషత్తు ఆయన దత్తపుత్రిక. ఆయన అతిథి సేవాపరాయణత్వంలో అభినవ పెరియాళ్వారు. ఆయన ఇంటిలో శనివారము నందు మాత్రమే గాక, నిత్యం అతిథిపూజ అర్ధరాత్రి వరకూ జరిగేది. శ్రీఅడివి బాపిరాజు, శ్రీవేదుల సత్యనారాయణ శాస్త్రి, శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రభృతులు తమ నూతనకవితలు వినిపించేవారు. తెరమరుగున నిలిచి నవ్య సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసినవారిలో ప్రాతఃస్మరణీయుడు శ్రీతెలికిచెర్ల వేంకటరత్నం గారు. ఆయన “ప్రతిభ" పత్రికకు సంపాదకుడు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆంధ్రశాఖకు అధిపతి. ప్రతిభను గుర్తించటంలో ఆయన కన్నులు దృగ్భిణీ యంత్రాలు. ఆనాడు అనామకులుగా నిరుద్యోగులుగా అలమటించే యువ నవ కవులను చేరదీసి కేవలం పరోపకార పారీణతలో ఆంధ్ర క్రయిస్తవ కళాశాలలో ఉద్యోగాలు ఇచ్చి, ప్రతిభ పత్రికలో వారి రచనలు ప్రచురించి ఆదరించిన మహనీయుడు ఆయన. శ్రీపాపయ్యశాస్త్రికి, నాకు మొట్టమొదట ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే. ఆ నాడు పలువురు యువకవుల నవనవోన్మేష ప్రజ్ఞకు ఆటపందిరి 'ప్రతిభ' పత్రిక.
“సభాపతి” శ్రీశివశంకర శాస్త్రిగారు ఆ నాడు 'నవీన బహుళాంధ్రోక్తిమయ ప్రపంచానికి' సాహిత్యాచార్యుడు. శిష్యవత్సలుడైన ఆయనకు - భారతంలో ద్రోణాచార్యులకు అర్జునునిపై ఉన్నట్లు - శ్రీసోమయాజులు గారిపై పక్షపాతప్రాయమైన ప్రత్యేకప్రేమ ఉండేది. నేను ఆ తల్లావజ్ఝల వారికి ఏకలవ్య శిష్యుడను. సుదూరంగా నిలిచి ఆయనను ఆరాధించేవాడిని. నవ్య సాహితీ మహోద్యానవనంలో విచ్చకముందే “మొగ్గల”లోని సౌందర్య సౌరభాలను రంగరించి ప్రపంచానికి ప్రసారం చేసిన సహృదయామోద గంధవహుడు ఆ మహానుభావుడు. శ్రీవావిలాల సోమయాజులుగారు శ్రీశివశంకర శాస్త్రిగారికి అభిమానపాత్రుడైన "గద్య పద్య కావ్య నిర్మాణ చాతురీ సవ్యసాచి". గద్య రచయితలు పద్య రచయితలు కాకపోవచ్చు. అట్లే పద్య రచయితలు గద్య రచయితలు కాలేకపోవచ్చు. శ్రీ సోమయాజులుగారి అసలు ప్రజ్ఞ పద్యరచన.
"ఏక శ్లోకః ప్రబంధ శతాయతే” అన్న ప్రశస్తి సంస్కృతంలో అమరుకునకు అన్వయిస్తారుగాని - వంద ప్రబంధాలతో సరితూగగల ఒక పద్యం వ్రాయగల నేర్పు తెలుగులో శ్రీవావిలాల సోమయాజులు గారిది. కవిత వాగర్థాల వర్ణనాతీత సమ్మేళనం. భాష భావాల కలయికలో పార్వతీ పరమేశ్వరుల పవిత్ర దాంపత్యం పరిఢవిల్లాలి! ఆకాశనీలాల కవ్వలి సీమల మేరలకు ఎగురగలిగే ఎత్తయిన భావాలు - కడలి లోతులు తడివి చూడగల నుడికారపు కెరటాలపై తేలియాడే పలుకుబడులు కలిస్తేనే - అది ఆలోచనామృతం అనదగిన కవిత అవుతుంది. కవిత - ఆపాతమధురం కాదు. శ్రీసోమయాజులుగారి కవనాలు తొలకరి చిటపొటి చినుకులు కావు. అవి వేసవి వడగళ్ళ వానలు.
వీరు వ్రాసిన పద్యనాటికలు, ఏకాంకికలు రంగస్థలాన్ని, ఉరుములతో మెరుపులతో నింపేస్తాయి. వీరు వ్రాసిన గద్య పద్య నాటకం - “నాయకురాలు” ఆంధ్ర నాటక రంగస్థలంపై వడగళ్ళు - ఉరుములు మెరుపులు సృష్టించటమే గాక - పిడుగుల పిండు కురిపించింది.
శ్రీసోమయాజులుగారి గద్యరచనకు గీటురాయి “మణి ప్రవాళం” వ్యాసమంజరి. వ్యాసరచన తెలుగువారు అభ్యసించిన క్రొంగొత్త విద్య. తెలుగు వారికి ఈ కళలో ఒరవడి దిద్దినవారు ఆంగ్లేయులు. ఆంగ్ల వ్యాసరచయితలలో తాడిని తన్నినవారు - భారతీయులు కొందరు ఉన్నారు. తాడి తన్నినవారి తల తన్నినవాడు ఆంధ్ర “మణిప్రవాళ” వ్యాసమంజరి రచయిత. వ్యావహారికమైన కర్మ జగత్తులలో బ్రతుకు పోరాటంలో విశ్రాంతి కోరేవారు అవశ్యం చదువదగినట్టిది “మణిప్రవాళ” వ్యాసమంజరి.
ప్రస్తుత గ్రంథంలో ఉన్న కావ్యఖండికలు - ఉజ్జీవము. పరివర్తన, మాచలదేవి, ఆత్మార్పణము, విన్నపం మున్నగునవి. ఇవి అన్నీ లోగడ ప్రతిభ మున్నగు పత్రికలలో పడినట్టివే. ఇందలి పరివర్తన రామ బాణోపహతుడైన వాలి స్వగతం. ఆత్మార్పణం కర్ణుడు శ్రీకృష్ణునితో జరపిన ఏకాంత సంభాషణ. ఈ రెండు ఖండికలు వింటే వాల్మీకి - వ్యాస మహర్షులు తలలూపక తప్పడు - అని నా అభిప్రాయం. మహాభారత రామాయణ కావ్యాలే కాక కాళిదాస ప్రభృత కవులు చేసిన ప్రౌఢప్రయోగాలు, శ్రీసోమయాజులుగారి తెలుగు కవితలలో ఎడనెడ సాక్షాత్కరిస్తాయి. మూడు వేల సంవత్సరాల సంస్కృత ప్రౌఢప్రయోగాలు, వేయి సంవత్సరాల గడుసరి తెలుగు నుడికారపు సొంపులు, వంపులు స్వాయత్తం చేసుకున్న సంస్కారి శ్రీసోమయాజులుగారు.
నేను అనంతపురంలో ఉన్నప్పుడు - శ్రీసోమయాజులుగారు పద్యాలలో ఒక “సుహృల్లేఖ” నాకు అందించారు. అది ఒక అపర మేఘసందేశకావ్యం. ఆయన
దూతగా పంపిన మేఘుడు
“ఇంచు కాడంబరుడు గర్వి ఏమొ గాని
జలద యువకుడు వాడు ప్రశస్త గుణుడు
భావుకత వెఱ్ఱియై నింగి పర్వులెత్తు
మనవలెనె వాడు పాడక మనగలేడు.”
నాకు పలువురు సహృదయులు విద్వత్ కవులు సన్మాన పత్రాలు ఎన్నెన్నో
అందించారుగాని - అన్నిటిలో శ్రీసోమయాజులుగారి సుహృల్లేఖ - మకుటాయమాన
మైన సన్మాన పత్రముగా భావించి నేను భద్రం చేసుకున్నాను.
సంస్కృత సాహిత్యాన్ని మాత్రమేగాక శ్రీసోమయాజులుగారు ఆంగ్లవాఙ్మయాన్ని గూడ ఆపోశనం పట్టారు. షేక్స్‌పియరు నాటకాలను వారు తెలుగులోకి అనువదించిన తీరు తీయాలు, తరతరాలవారికి ఒరవడులుగా నిలుస్తాయి.
ఆంధ్రుల సాహితీ సంప్రదాయంలో - భువన విజయం - అష్టదిగ్గజకవి వ్యవస్థ విశిష్ట స్థానాన్ని పుంజుకున్నాయి. ఆధునిక కాలంలో అష్ట దిగ్గజాలను ఎన్నుకోవలసి వస్తే - శ్రీసోమయాజులుగారికి ఏకగ్రీవంగా లభించేది "ధూర్జటి” పాత్ర. వీరు వ్రాసిన “విన్నపం” ఆధునికాంధ్ర వాఙ్మయంలో విశిష్టమైన రచన. అష్టదిగ్గజాలలో ధూర్జటి విశిష్ట వ్యక్తిత్వం గల మహాకవి. ఆంధ్ర వాఙ్మయములో మాత్రమే గాక, ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం విశ్వసాహితీ రచనలోనే సాటిలేని ఉజ్జ్వల రచన. ఆంధ్ర సాహితీ పట్టభద్రుడు కాగోరేవారు ధూర్జటి వ్రాసిన ప్రతి పద్యం తప్పనిసరిగా చదవాలి. అథవా - శ్రీసోమయాజులుగారు వ్రాసిన “విన్నపం” పూర్తిగా కంఠస్థం చేయాలి - అని నా అభిప్రాయం. ఈ ఖండిక 1952 నవంబరు భారతిలో ప్రచురింపబడింది.
ఈ పద్యాలు శ్రీసోమయాజులుగారు తాడేపల్లిగూడెంలో కవి సమ్మేళనంలో చదివినపుడు నరసాపురం వాస్తవ్యులు డాక్టరు పొన్నపల్లి సుబ్రహ్మణ్యం గారు ఆనందబాష్ప విలులిత నేత్రాలతో విని సద్యఃపరనిర్వృతిలో లీనమైపోయారు. తదుపరి శ్రీసోమయాజులుగారికి సత్కారం చేయటానికి నరసాపురంలో డాక్టరుగారి అధ్యక్షతన ఒక సన్మానసంఘం ఏర్పడింది. దానికి నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అధ్యక్షుని అకాలమరణంతో ఆ సన్మానం జరుగలేదు. ఆ బాకీ తీర్చవలసిన బాధ్యత నాపై ఇంకా మిగిలి ఉంది. ఇంకా ఈ గ్రంథం ప్రచురణ - ఈ గ్రంథం ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని, నా సౌహృదఋణం తీర్చుకోవాలని నా తహ తహ! శ్రీవావిలాల సోమయాజులుగారి పద్యాలు గోరుముద్దలు కావు. గుజ్జనగూళ్ళు కావు. సెనగ గుగ్గిళ్ళు కావు. అవి సానబట్టిన వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మణిమాణిక్య శకలాలు. పూత పసిడి తళతళలతో చెమికీ దారాలతో చీరెలు నేసేవారు - లంబాడీ లంగాలు కుట్టుకునేవారు వీటి జోలికి పోనక్కరలేదు. భావికాలంలో, సాహితీ ప్రతాపరుద్రులు కాగోరేవారు, కవితా కిరీటధారులు కాగోరేవారు, వీటిని కష్టపడి సేకరించి వినియోగించుకొని, తమ శిరస్సుల చుట్టు పరివేషప్రభలు తీర్చిదిద్దుకోవచ్చు.
- ప్రగతి గీతాప్రవక్త
డా. నండూరి రామకృష్ణమాచార్య