వాత్సల్యప్రియ
లీలామానుషవిగ్రహుడగు గోపాలుని లీలలను మాయామోహితమైన జగమంతా
ఒక ఎత్తుగా చెప్పుకుంటే, అదృష్టవంతురాలయిన శ్రీకృష్ణుని తల్లి యశోద ఆ మాటలనే
మళ్ళీ చెపుతూ 'వాత్సల్యప్రియ'గా పరిపూర్ణత పొందింది. లీలల వర్ణనలో, పలుకుల
పొందికలో, మాటల తీరులో అనేక అందాలు పోయింది ఆ అమ్మ హృదయం.
ఈ కవితావాహినిలో పాలనురగలై ప్రవహించిపోయింది.
ఉ . |
గోపిక లొక్కటై పలుకు కొండెములన్ తలపట్టిపోయి నా
కోపము మిన్నుముట్టి, ఇక కొట్టక తిట్టక యున్న పట్టగా
నోప నటంచు నీ కయి గృహోపరిభాగ కవాట సీమలో
కాపల కాసి కాళులివె కండెలు కట్టెనురా కుమారకా!
|
|
మ . |
నిను దండింపగ వేచియుంటినని మున్దే చెప్పినా రెవ్వరో,
అనుమానించిరి, రాధ కాదు గద! ఏరా! అల్లరే మాని, నీ
తిని ముత్తైదటు కూరుచుంటి విటు లేదీ ఒక్కమారెత్తరా
కనుగొందు న్మొగ మెంత దొంగవుర సాక్షాన్మౌని వైనావురా!
|
|
ఉ . |
ఏ గతి వచ్చి చేరితివి యింటికి, వాకిట నిల్చియుంటి కా
దా గజదొంగ, మూసితివి అమ్మకు కన్నుల దొడ్డిగుమ్మమున్
నే గడి వేసి వచ్చితిని, నీకెటు వచ్చెనొ ఇట్టులైన నే
లాగున నిల్వగాగలమురా నిను పెట్టుకు ఊరిలోపలన్?
|
|
ఉ . |
ఒక్కరు చెప్ప నమ్మకనె యుందును కావని గ్రామమధ్యమం
దక్కట మంచివాడ వని యాడరు ముద్దునకై నొక్క రే
దిక్కున నీవెయై ప్రజను త్రిప్పలు పెట్టుచు నుంటివంచు మా
మక్కువ యింత చేసెనని - మన్నన దక్కదటంచు పల్కెరా!
|
|
మ. |
పలుకన్ వారల కేమి చెప్పుటకు నే పాల్పోక నో తండ్రినా
తల యాడించితి సత్య మన్నటుల నిత్యం బిట్టు లెన్నాళ్లు లో
|
|
|
కుల తండంబుగ నింటిపై బరపి గగ్గో లాచరింపంగ నీ
తలపో - అర్థము కాదు మానసములో ధైర్యమ్ము శుష్కించెరా!
|
|
ఉ . |
ఊరికి ముందె నిద్దురకు నోర్వవు నీ కనులో మహాత్మ! నే
మారులు పిల్చినన్ పలుకు మాని, ప్రగాఢ సుషుప్తి చెంది న
ట్లో రమణీయ మోహన తనూ! నటియింతువు కాలరాత్రు లే
పారిన వల్లవీ దయిత మానవురా! యమునా విహారముల్.
|
|
మ. |
వరసా వాయలు లేక కన్నియల త్రోవల్ కాచి కవ్వించి నీ
పరిహాసమ్ములు మానరా' యనిన 'అబ్బా! ఎంత కోపమ్మొ! - ఇ
ట్లరచాటై నటియింప సిగ్గుతెర నా కాహ్లాదమం చెంచితో
తెరవా! చాలని ముద్దు గొందువట ఈ తీరేమి మర్యాదరా?
|
|
ఉ . |
ప్రాయపు లేమ లొంటి మథురానగరమ్మున క్షీరమమ్ముకో
బోయెడు వేళ దారులను పొంచుక నీ వపు డడ్డుకొట్టి 'అ
మ్మా యితడెవ్వడో ఎరుగుదే, ఇక రాజగు ముందు ముందు నీ
తీయని గుమ్మపా లిటుల తెమ్మని రొమ్ములు చూచినావురా!
|
|
ఉ . |
పండుగరోజు లంచు బ్రతిమాలిన అల్లుడుగారు వచ్చి రే
యెండకు మేడపై పడుక టింటను నిద్దురవోవు వేళ మా
దుండగి మెల్లగా నరిగి తొయ్యలి రుబ్బిన గోరటాకుతో
మెండుగ కాలు సేతులను మెత్తెనటంచొక తాడిపోసెరా!
|
|
ఉ . |
పాపము బ్రాహ్మణుం డెవరొ పంక్తికి భోజనవేళ వచ్చి సాం
దీపుల వారి యింట కొన తీర్థము లాడగ లోని కేగగా
నా పరదేశి మూలరుగుపై నిడి వెళ్ళిన దేవతార్చనన్
దోపిడి చేసినావట - బుధుం డత డేమి యొనర్చె పాపమున్?
|
|
మ . |
పగ సాధింపగ కోర్కె కలిగినను 'తప్పా ఒప్ప' యం చించుకం
తగ నాలోచన చేయగా వలదె ఎంతైనాను, పై రేట కొ
ప్పుగ పండించిన చేలపై ఎనుము గుంపున్ త్రోలి త్రొక్కించ నీ
కగునా! వీటి విచిత్ర చేష్ట లివి సర్వానర్థ మూలమ్ములే.
| 11
|
చ |
చెరువుకు గండి కొట్టె గుమి జింకల మా పొలమందు తోలె, మా
అరకల కర్లు లాగె పొలమందలి మంచెల పాడుచేసి కా
పరులను కొట్టి పంపె, గునపమ్ముల మట్టిలొ పూడ్చె చెట్టుపై
మరుగగు దుత్తలో చలిది మాయము చేసె నటంచు పల్కినన్.
|
|
ఉ |
ఈడుకు తగ్గ చేష్టలగునే వ్రజభామినులార! యంచు నే
నాడగ నోడినాను శిశువా! ఎట వారలు 'చిన్న బిడ్డ లీ
యీడుకు కొండలెత్తుచు ఫణీశులతో చెరలాట మాడిరే
యేడవి మాట లమ్మ' యని యెచ్చట దెప్పెదరో యటం చెదన్.
|
|
చ |
ఒక చిరునవ్వుతో నెడద నుయ్యెలలో నిదురింపచేతు వా
నిక పలువిప్పి మాటలను ని న్ననలేనుర! జన్మతోడ నీ
వొక నటకాగ్రగణ్యుడవు ఉన్నది కాదనుపించు శక్తి యే
తికమక పెట్టియో హృదయ తీవ్రత మాన్చెదురా వివేకివై.
|
|
(ఆనందవాణి, 1946 దీపావళి సంచిక)