శ్రీ గీతామృత తరంగిణి/భక్తి యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)

శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)

గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అనుష్టుప్.
అర్జున ఉవాచ|
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః|| 12-1 ||

అర్జును వాక్యము.
తేటగీతి.
సగుణు , నీశ్వరు నిన్ను విశ్వస్వరూపు ,
భక్తి నిరతినిఁ గొలిచెడు వారు , మఱియు
నక్షర బ్రహ్మ భావమ్ము నలరు వారు ,
లిరు తెఱగులందు నధికు లెవ్వరు , ముకుంద ! ౧

అర్జునుడు చెప్పెను.

ఈ ప్రకారముగ ఎల్లప్పుడు నీ యందే మనస్సును నెలకొల్పినవారై ఏ భక్తులు నిన్నుపాసించుచున్నారో , మఱియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మను ధ్యానించుచున్నారో , ఆ యిరుతెగలవారిలో యోగమును బాగుగ నెఱిగినవారెవరు ?

శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః
తే మే యుక్తతమా మతాః|| 12-2 ||

శ్రీ భగవానుల వాక్యము.
చంపకమాల.
సతతము నన్నె కీర్తనల శ్రద్ధ భజించి , నమస్కరించి , భూ
త తతి మదీయ రూపమని తథ్యము తద్ధిత మాచరించు సు
వ్రతమున విశ్వరూపము నుపాసన చేయు మహాత్ముఁ డెన్న , నా
మతమున నుత్తముండనుచు , మాన్యుఁ డటంచుఁ దలంతు నర్జునా ! ౨

శ్రీ భగవంతుడు చెప్పెను.

నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై ( తదేకనిష్ఠులై ) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై యెవరు నన్ను పాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా అభిప్రాయము.

అ.
యే త్వక్షరమనిర్దేశ్య
మవ్యక్తం పర్యుపాసతే|
సర్వత్రగమచిన్త్యఞ్చ
కూటస్థమచలన్ధ్రువమ్|| 12-3
అ.
సన్నియమ్యేన్ద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః|
తే ప్రాప్నువన్తి మామేవ
సర్వభూతహితే రతాః|| 12-4 ||

కందము.
సమబుద్ధి ద్వంద్వముల యం
దమరి . జితేంద్రియత నంది , యచల మ్మవ్య
క్త మనిర్వచనీయ బ్ర
హ్మము నక్షరు నను భజింపనగు నన్నొందన్ . ౩
తేటగీతి .
సర్వభూత హితంబునే సలుపువాఁడు ,
నిర్వికారుండు సర్వత్ర నిండి యుండు
నక్షరుండగు బ్రహ్మమే నంచుఁ గొలుచు
సంయమివరుండు నన్నొందు , సవ్యసాచి ! ౪

ఎవరు ఇంద్రియములనన్నిటిని బాగుగ నిగ్రహించి ( స్వాధీనపఱచుకొని ) ఎల్లెడల సమభావముగలవారై , సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై , ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు , ఇంద్రియములకు గోచరము కానిదియు , చింతింపనలవి కానిదియు , నిర్వికారమైనదియు , చలింపనిదియు , నిత్యమైనదియు , అంతటను వ్యాపించియున్నదియునగు అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో , వారు నన్ను పొందుచున్నారు .

అ.
క్లేశోऽధికతరస్తేషా
మవ్యక్తాసక్తచేతసామ్||
అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే|| 12-5 ||

తేటగీతి.
నిర్గుణోపాస నిరతి యెంతేని దుఃఖ
దాయకమ్మగుఁ గద దేహ ధారులకును ,
నింద్రియ మనమ్ము బుద్ధిపై కెగయు జ్ఞాన
మార్గము గృహస్థులకుఁగడు దుర్గమమ్ము . ౫

అవ్యక్త ( నిర్గుణ ) పరబ్రహ్మమునం దాసక్తిగల మనస్సు గలవారికి ( బ్రహ్మమందు ) నిష్ఠను బొందుటలో సగుణోపాసకుల కంటె ప్రయాస చాల అధికముగ నుండును . ఏలయనిన , నిర్గుణోపాసనామార్గము దేహాభిమానము గలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది .

అ.
యే తు సర్వాణి కర్మాణి
మయి సంన్యస్య మత్పరః|
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయన్త ఉపాసతే|| 12-6
అ.
తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసారసాగరాత్|
భవామి నచిరాత్పార్థ !
మయ్యావేశితచేతసామ్|| 12-7||

ఉత్పలమాల .
నాకయి సర్వకర్మల ననారత మాచరణం బొనర్చుచున్ ,
నాకె ఫలంబు లర్పిత మొనర్చి , చరాచర భూతకోటి నా
యాకృతులంచు , విశ్వమయు నంచు దలంచి , భజించువానినిన్ .
వే కరుణించి కాచెదను , మృత్యు భవాబ్ధిఁ దరింపఁ జేయుచున్ . ౬
కందము .
నాయందె మనము నుంచుము ,
నాయందే బుద్ధి నిలు , పనారతమును నీ
చేయుపనుల ననుఁ జూడుమ ,
ఆయువుఁ దొలగంగ నన్నె యందెదు పార్ధా ! ౭

ఓ అర్జునా ! ఎవరు సమస్తకర్మలను నాయందు సమర్పించి , నన్నే పరమగతిగ దలంచినవారై , అనన్యచిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో , నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను .

అ.
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః|| 12-8 ||

కందము.
నిరతిశయమ్ముగ నెప్పుడు
స్ధిర చిత్తము కుదురు టెటులొ తెలియనిచో , నా
సురుచిర మభ్యాస గతిన్
నెరప , సుయోగమ్ము నొంద నేర్తువు తుదకున్ . ౮

నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము . నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము . పిమ్మట నాయందే నివసింతువు . సందేహము లేదు .

అ.
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనఞ్జయ|| 12-9 ||

ఆట వెలది .
ఆచరించుటకును నభ్యాసయోగమ్ము
నలవి కాదటన్న , నదియు వలదు ;
సకల కర్మములను సలుపు నా ప్రీతికై ,
అవల సిద్ధి నొంద నవును పార్థ ! ౯

ఓ అర్జునా ! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగనిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తఱి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము . ( అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైన సాధింపుమని భావము ) .

అ.
అభ్యాసేऽప్యసమర్థోऽసి
మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి
కుర్వన్సిద్ధిమవాప్స్యసి|| 12-10 ||

ఆట వెలది .
అదియు నాచరింప నలవి కాదందువా ,
కర్మయోగ సరణిఁ గాంచుమయ్య ;
సర్వ కర్మ ఫలము , నిర్వాహ ధాతనౌ
నాకె ఫలము లర్పణమ్ముఁ జేసి . ౧౦

ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీ వసమర్థుడవై తివేని నా సంబంధమైన కర్మలఁ జేయుటయం దాసక్తిగలవాడవు కమ్ము . అట్లు నాకొఱకు కర్మలను జేయుచున్ననుగూడ నీవు మోక్షసిద్ధిని బడయగలవు .

అ.
అథైతదప్యశక్తోऽసి
కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్|| 12-11
అ.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్
జ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ! |
ధ్యానాత్కర్మఫలత్యాగ
స్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్|| 12-12 ||

తేటగీతి.
జ్ఞాన మభ్యాస యోగమ్ము కంటె మెఱుగు ;
ధ్యాన యోగమ్ము శ్రేయమ్ము జ్ఞానమునకు ;
కర్మల ఫలమ్ము త్యజియింప ఘనతమమ్ము ;
త్యాగియౌవాఁడె శాంతినిఁ దోగుచుండు . ౧౧

ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించినవాడవై దీనినిగూడ నాచరించుటకు శక్తుడవు కానిచో అటుపిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మములయొక్క ఫలములను త్యజించివేయుము. ( వివేకముతో గూడని ) అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదికదా ! ( శాస్త్రజన్య ) జ్ఞానముకంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది . ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనస్థితి ) కంటె కర్మఫలమును విడచుట ( ప్రవృత్తియందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది . అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగ ( చిత్త ) శాంతి లభించుచున్నది .

అ.
అద్వేష్టా సర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ|
నిర్మమో నిరహఙ్కారః
సమదుఃఖసుఖః క్షమీ|| 12-13
అ.
సన్తుష్టః సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పితమనోబుద్ధి
ర్యో మద్భక్తః స మే ప్రియః|| 12-14 ||

ఉత్పలమాల .
భూతచయమ్ము లన్నిట , ప్రపూర్ణ దయార్ద్ర హృదంతరమ్మునన్ ,
బ్రీతి యొనర్చు వాఁడును , లభించిన దానన దుష్టి నొందుచున్ ,
గాతర హంకృతుల్ విడిచి , కష్టసుఖమ్ముల , ద్వంద్వ భావముల్ ,
శీతువు చేత , నాతపముచేఁ జలియింపని వాఁడె ప్రీతుడౌ . ౧౨
చంపకమాల .
సతతముఁ దుష్టిఁ జెంది , నను సంస్మరణం బొనరింపగన్ దృఢ
వ్రత విజితేంద్రియుండయి , ధృవమ్మగు బుద్ధి మనోగతమ్ము ల
ర్పిత మొనరించి , నిశ్చలతఁ బ్రీతి భజించెడు సంయమీంద్రుఁ , డ
య్యతియె మదీయ భక్త గణమందుఁ గడింది ప్రియుండు ఫల్గునా ! ౧౩

సమస్త ప్రాణులయెడల ద్వేషము లేనివాడును , మైత్రి , కరుమ గలవాడును , అహంకారమమకారములు లేనివాడును , సుఖదుఃఖములందు సమభావముగలవాడును , ఓర్పుగలవాడును , ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును , యోగయుక్తుడును , మనస్సును స్వాధీనపఱచుకొనినవాడును , దృఢమైన నిశ్చయము గలవాడును , నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును , నాయందు భక్తిగలవాడును , ఎవడు కలడో , అతడు నాకు ఇష్టుడు .

అ.
యస్మాన్నోద్విజతే లోకో
లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగై
ర్ముక్తో యః స చ మే ప్రియః|| 12-15 ||

ఉత్పలమాల .
లోకులకున్ భయమ్మెవఁడు లోఁ గొనకుండునొ , లోకులెవ్వరున్
వ్యాకుల మొంద రెవ్వని సమక్ష పరోక్షములందునన్ , భయో
ద్రేక మసూయ తోసము మదిన్ దలపోసి చలింపకుండునో ,
నాకుఁ బ్రియుండతండగు ధనంజయ ! భక్తగణంబు లందఱన్ . ౧౪

ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమునుబొందదో , లోకమువలన ఎవడు భయమును బొందడో , ఎవడు సంతోషము , క్రోధము , భయము , మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు .

అ.
అనపేక్షః శుచిర్దక్ష
ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ
యో మద్భక్తః స మే ప్రియః|| 12-16 ||

చంపకమాల .
ఎవఁడు జితేంద్రియుండు , విషయేచ్ఛల నిస్పృహ భావమందునో ,
యెవఁడు శుచివ్రతా నిరతుఁ డెవ్వఁడు కార్యకలాప దక్షుఁడో ,
యెవఁడు తటస్థ మాత్ర పరి దృశ్యుఁడు మిత్రరిపు వ్రతంబుల ,
న్నెవఁడు ఫలాఫలమ్ములఁ ద్యజించునొ , వాఁడె ప్రియుండు ఫల్గునా ! ౧౫

కోరికలు లేనివాడును , బాహ్యాభ్యంతరశుద్ధి గలవాడును , కార్య సమర్థుడును , ( సమయస్ఫూర్తిగలవాడును ) తటస్థుడును , దిగులు ( దుఃఖము ) లేనివాడును , సమస్తకార్యములందు కర్తృత్వమును వదలినవాడును , ( లేక సమస్త కామ్యకర్మలను శాస్త్రనిషిద్ధ కర్మలను త్యజించినవాడును ) నాయందు భక్తి గలవాడును , ఎవడు కలడో , అతడు నాకు ఇష్టుడు .

అ.
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాఙ్క్షతి|
శుభాశుభపరిత్యాగీ
భక్తిమాన్యః స మే ప్రియః|| 12-17 ||

కందము.
శోకింపఁడు , కాంక్షింపఁడు ,
లేకున్నను రాకయున్న లేశమ్మైనన్ ,
జేకూర సంతసింపఁడు ,
నేకాకృతిఁ జూచు , శుభ శుభేతరమందున్ . ౧౬

ఎవడు సంతోషింపడో , ద్వేషింపడో , శోకమును బొందడో , ఎవడు శుభాశుభములను వదలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు .

అ.
సమః శత్రౌ చ మిత్రే చ
తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు
సమః సఙ్గవివర్జితః|| 12-18
అ.
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ
సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతి
ర్భక్తిమాన్మే ప్రియో నరః|| 12-19 ||

కందము .
సమముగ మిత్రుల , శత్రుల
సమముగ మానావమాన సరణిన్ , శీతో
ష్ణము , సుఖ దుఃఖమ్ములఁ దు
ల్య మనం బూనెడు , విషయ పరాఙ్ముఁఖు డగుచున్ . ౧౭
కందము.
నిందా స్తుతులకుఁ దుల్యం
బంది , నిరావాసియై , ఫలాప్తికిఁ దృప్తిం
జెందడు , మౌని వరుఁడె , నా
డెందమునకు ప్రీతియౌ కడింది కిరీటీ ! ౧౮

శత్రువునందును , మిత్రునియందును , మానావమానములందును , శీతోష్ణ సుఖదుఃఖములందును , సమముగా నుండువాడును , దేనియందును సంగము ( ఆసక్తి , మనస్సంబంధము ) లేనివాడును , నిందాస్తుతులందు సమముగా నుండువాడును , మౌనముతో నుండువాడును , ( లేక మననశీలుడును ) , దేనిచేతనైనను ( దొరికిన దానితో ) తృప్తిని బొందువాడును , నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును ( లేక గృహాదులం దాసక్తి లేనివాడును ) , నిశ్చయమగు బుద్ధిగలవాడును , భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు .

అ.
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే|
శ్రద్దధానా మత్పరమా
భక్తాస్తేऽతీవ మే ప్రియాః|| 12-20 ||

కందము .
ఎవ్వరు నన్నీవిధమున ,
మువ్వేళల శ్రద్ధతోడ ముమ్మర భక్తిన్ ,
నివ్వటిలఁ గొల్చువారలె ,
కవ్వడి ! ప్రియతములు భక్త గణముల నాకున్ . ౧౯

ఎవరైతే శ్రద్ధావంతులై , నన్నే పరమగతిగ నమ్మి ( నాయందాసక్తి గలవారై ) ఈ అమృతరూపమగు ( మోక్ష సాధనమైన ) ధర్మమును ( ఇప్పుడు ) చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః|| 12 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
ష్రీ భక్తి యోగమను ద్వాదశ తరంగము
సంపూర్ణము .
శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు .

ఇది ఉపనిషత్ప్రతిపాదకమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,

శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు భక్తియోగమను పండ్రెండవ అధ్యాయము సంపూర్ణం . ఓమ్ తత్ సత్ .


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము