శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు)
|
శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
|
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము
కాళహస్తి(1979)
|
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
పరం భూయః ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యజ్జ్ఞాత్వా మునయః సర్వే
పరాం సిద్ధిమితో గతాః|| 14-1 ||
|
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి .
మునులు , సంయమీంద్రులు మోక్షమును గమించి ,
రెట్టి సుజ్ఞానమును బొంది , రట్టి నిరుప
మాన ముత్తమ జ్ఞాన విధాన మెల్లఁ ,
దిరిగి చెప్పెద నీకుఁ , గుంతీ కుమార ! ౧
|
శ్రీ భగవంతుడు చెప్పెను .
( ఓ అర్జునా ! ) దేనిని తెలిసికొని మునులందఱును ఈ సంసారబంధమునుండి ( విడివడి ) సర్వోత్తమమగు మోక్షసిద్ధిని బడసిరో అట్టి - పరమాత్మవిషయికమైనదియు , జ్ఞానములలోకెల్ల నుత్తమమైనదియు నగు జ్ఞానమును మఱల చెప్పుచున్నాను .
|
అనుష్టుప్.
ఇదం జ్ఞానముపాశ్రిత్య
మమ సాధర్మ్యమాగతాః|
సర్గేऽపి నోపజాయన్తే
ప్రలయే న వ్యథన్తి చ|| 14-2 ||
|
కందము .
సలలితమగు నా జ్ఞానం
బలవడి మద్భావమంది యలరి రనేకుల్ ;
గలుగవు పుట్టుక చావులు
ప్రళయంబులనైన చ్యుతిని వడయరు వారల్ . ౨
|
ఈ జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యము నొందినవారై ( నా స్వరూపమును బడసి ) సృష్టికాలమున జన్మింపరు . ప్రళయకాలమున నశింపరు ( జనన మరణ రహితులై పునరావృత్తి లేక యుందురని భావము ) .
|
అనుష్టుప్.
మమ యోనిర్మహద్ బ్రహ్మ
తస్మిన్గర్భం దధామ్యహమ్|
సమ్భవః సర్వభూతానాం
తతో భవతి భారత|| 14-3 ||
|
ఆటవెలది .
అపరప్రకృతి యోని యజుని బీజము గాగ
నునిచి , సృష్టి గర్భ మొనరఁ జేసి ,
సర్వభూత తతుల సంభవింపగఁ జేతు ,
మామకీనమైన మాయచేత . ౩
|
అర్జునా ! గొప్పదైన మూలప్రకృతి ( మాయ ) నాయొక్క సర్వభూతోత్పత్తి స్థానము . అద్దానియందు నేను గర్భకారణమైన చైతన్యరూపమగు బీజము నుంచుచున్నాను .
|
అ.
సర్వయోనిషు కౌన్తేయ !
మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోని
రహం బీజప్రదః పితా|| 14-4 ||
|
ఆటవెలది .
అపరప్రకృతి యోని నల బ్రహ్మదేవుండు
వృద్ధియౌ పరాప్రకృతి , కిరీటి !
ఈ జగమున సృష్టి బీజ ప్రదాతను ,
పితను నేనె భూత తతుల కెల్ల . ౪
|
అర్జునా ! ( దేవమనుష్యాది ) సమస్తజాతులందును ఏ శరీరము లుద్భవించుచున్నవో వానికి మూలప్రకృతి ( మాయ ) యే మాతృస్థానము ( తల్లి ) , నేను బీజ ముంచునట్టి తండ్రిని .
|
అ.
సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసమ్భవాః|
నిబధ్నన్తి మహాబాహో !
దేహే దేహినమవ్యయమ్|| 14-5 ||
|
తేటగీతి .
సత్త్వము రజస్తమంబులు , సంభవంబు
నందుచుండును ప్రకృతి మాయను , గిరీటి !
అవ్యయంబగు దేహి సుఖానుబంధ
మొందు చుండును దేహంబులందు నెపుడు . ౫
|
గొప్ప భుజములుగల ఓ అర్జునా ! ప్రకృతివలనబుట్టిన సత్త్వరజస్తమోగుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు ( లేక దేహమునకు ) బంధించివైచుచున్నవి .
|
అ.
తత్ర సత్త్వం నిర్మలత్వా
త్ప్రకాశకమనామయమ్|
సుఖసఙ్గేన బధ్నాతి
జ్ఞానసఙ్గేన చానఘ|| 14-6 ||
|
కందము.
నిరుపద్రవ , నిర్మల , భా
సుర సత్త్వ గుణాళి దేహి , సుఖ సంగమునన్
నిరుపమ సుజ్ఞానమునన్
దిరముగ బందీకృతుండు , దేహము నందున్ . ౬
|
పాపరహితుడవగు ఓ అర్జునా ! ఆ సత్త్వాది గణములలో సత్త్వగుణము నిర్మలమైనదగుటవలన ప్రకాశమును గలుగజేయునదియు . ఉపద్రవములేనిదియు , ( అగుచు ) ( ఇంద్రియ ) సుఖమునందలి ఆసక్తి చేతను , ( వృత్తి ) జ్ఞానమునందలి ఆసక్తి చేతను జీవుని బంధించుచున్నది .
|
రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ
కర్మసఙ్గేన దేహినమ్|| 14-7 ||
|
కందము .
రాగాత్మికము రజోగుణ
మాగక , తృష్ణా వివృద్ధమగుచున్ , కార్యో
ద్వేగమున దేహముల క
ర్మాగారల దేహి కర్మ రజ్జుల నుండున్ . ౭<
|
ఓ అర్జునా ! రజోగుణము దృశ్యవిషయములయెడల ప్రీతినిగలుగజేయునదియు , తృష్ణను ( కోరికను ) , ఆసక్తిని గలుగజేయునదియు ( అని ) యెఱుఁగుము . అయ్యది కర్మములందలి ఆసక్తి చేత ( కర్మ సంబంధము చేత ) ఆత్మను ( జీవుని ) లెస్సగ బంధించివేయుచున్నది .
|
అ.
తమస్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభి
స్తన్నిబధ్నాతి భారత|| 14-8 ||
|
కందము .
తమసం బజ్ఞానజమగు ,
దమము ప్రమాదంబు నిద్ర తన్మయమును మో
హముల బిగించును దేహిన్ ,
దమో గుణములివ్వి బంధన మ్మొనరింపన్ . ౮
|
ఓ అర్జునా ! తమోగుణము అజ్ఞానమువలన కలుగునదియు , సమస్త ప్రాణులకును మోహమును ( అవివేకమును ) గలుగ జేయునదియునని యెఱుఁగుము . అయ్యది మఱపు ( పరాకు ) , సోమరితనము , నిద్ర , మొదలగువానిచే జీవుని లెస్సగ బంధించివేయుచున్నది .
|
అ.
సత్త్వం సుఖే సఞ్జయతి
రజః కర్మణి భారత ! |
జ్ఞానమావృత్య తు తమః
ప్రమాదే సఞ్జయత్యుత|| 14-9 ||
|
తేటగీతి .
సత్త్వగుణము సుఖంబునే సంతరించు ;
నల రజోగుణ మెపుడు కర్మలనె ద్రిప్పు ;
తామస గుణము కడు ప్రమాదమును గూర్చి ,
జ్ఞాన మెల్లనుఁ గప్పు నిశ్చయము , పార్థ ! ౯
|
ఓ అర్జునా ! సత్త్వగుణము సుఖమునందును , రజోగుణము కర్మమునందును , తమోగుణము జ్ఞానమును ( వివేకమును ) కప్పివైచి ప్రమాదము ( పొరపాటు ) నందును జీవుని చేర్చుచున్నవి ( కలుపు చున్నవి ) , ఆశ్చర్యము 1
|
అ.
రజస్తమశ్చాభిభూయ
సత్త్వం భవతి భారత ! |
రజః సత్త్వం తమశ్చైవ
తమః సత్త్వం రజస్తథా|| 14-10 ||
|
తేటగీతి .
సత్త్వము రజస్తమంబులన్ సడల నడచు ;
రజము సత్త్వతమముల నీరవముఁ జేయు ;
దమము సత్త్వరజముల నింధన మొనర్చుఁ ;
ద్రిగుణములు పరస్పర శత్రులగుచు నుండు . ౧౦
|
ఓ అర్జునా ! సత్త్వగుణము ( బలము కలిగియుండునపుడు ) రజోగుణ తమోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును . అట్లే రజోగుణము సత్త్వగుణ తమోగుణములను - తమోగుణము సత్త్వగుణ రజోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును .
|
అ.
సర్వద్వారేషు దేహేऽస్మి
న్ప్రకాశ ఉపజాయతే|
జ్ఞానం యదా తదా విద్యా
ద్వివృద్ధం సత్త్వమిత్యుత|| 14-11 ||
|
కందము.
సకలేంద్రియముల దేజము
వికసిల్లి విభాసమొంది , విజ్ఞానముతో
ప్రకటిత మగునప్పుడు స
త్త్వ కళోన్నతిఁ గాగ నెఱుఁగ దగుఁ , గౌంతేయా ! ౧౧
|
ఎప్పుడీ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియద్వారము లన్నిటియందును ప్రకాశరూపమగు ( బుద్ధివృత్తిరూపమగు ) జ్ఞానము కలుగుచున్నదో , అప్పుడు సత్త్వగుణము బాగుగ వృద్ధినొందియున్నదని తెలిసికొనవలెను .
|
అ.
లోభః ప్రవృత్తిరారమ్భః
కర్మణామశమః స్పృహా|
రజస్యేతాని జాయన్తే
వివృద్ధే భరతర్షభ ! || 14-12 ||
|
కందము.
పరధన హరణాసక్తియు ,
నిరత వ్యవహార కర్మ నిరతిఁ గనుటయున్ ,
దురిత మనము , విషయేచ్ఛయు
నురవందు రజోగుణమ్ము లో కౌంతేయా ! ౧౨
|
భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! రజోగుణ మభివృద్ధి నొందునపుడు మనుజునియందు లోభత్వము , కార్యములందు ప్రవృత్తి , ( కామ్య , నిషిద్ధ ) కర్మములను ప్రారంభించుట , మనశ్శాంతి లేకుండుట , ( లేక ఇంద్రియనిగ్రహము లేకుండుట ) ఆశ అను నివి పుట్టుచుండును .
|
అ.
అప్రకాశోऽప్రవృత్తిశ్చ
ప్రమాదో మోహ ఏవ చ|
తమస్యేతాని జాయన్తే
వివృద్ధే కురునన్దన|| 14-13 ||
|
కందము .
అవివేక , మూఢ భావ
మ్మవకార్యము , మంద బుద్ధి , అలసత్వము , బు
ట్టువ గనుచు తమోగుణమున ,
వివృతములై మోహమునఁ దపింపగ జేయున్ . ౧౩
|
కురువంశీయుడవగు ఓ అర్జునా ! తమోగుణము అభివృద్ధి నొందినదగుచుండగా మనుజునియందు అవివేకము ( బుద్ధిమాంద్యము ) , సోమరితనము , అజాగ్రత , అజ్ఞానము , మూఢత్వము, ( లేక , విపరీత జ్ఞానము ) అను నివి కలుగుచున్నవి .
|
అ.
యదా సత్త్వే ప్రవృద్ధే తు
ప్రలయం యాతి దేహభృత్|
తదోత్తమవిదాం లోకా
నమలాన్ప్రతిపద్యతే|| 14-14 ||
|
తేటగీతి .
సత్త్వగుణుఁ డౌచు మరణింప తత్త్వ వేత్త
లొందు నిర్మల లోకమ్ము నందువాఁడు ;
అల రజోగుణుల్ కర్మలం దలము కొని గ
తించ , మానవుడౌచు , జనించు మఱల . ౧౪
|
ఎప్పుడైతే జీవుడు సత్త్వగుణ మభివృద్ధిని బొందినదగుచుండగా మరణించునో , అప్పు డతడు ఉత్తమజ్ఞానముగలవారియొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును .
|
అ.
రజసి ప్రలయం గత్వా
కర్మసఙ్గిషు జాయతే|
తథా ప్రలీనస్తమసి
మూఢయోనిషు జాయతే|| 14-15 ||
|
తేటగీతి .
తామస గుణ ప్రధానుఁడై తనువుఁ దొరగ ,
మూఢ యోనులలో జన్మముల మునుంగు ,
హేయ సూకర పశ్వాది హీన యోనిఁ
బుట్టుకలుఁ గాంచి నిరతమ్ముఁ గొట్టు కొంద్రు . ౧౫
|
రజోగుణము అభివృద్ధినొందియుండగా మరణించువాడు కర్మాసక్తులగు వారియందు జన్మించుచున్నాడు . అట్లే తమోగుణ మభివృద్ధినొందియుండగా మరణించువాడు పామరుల గర్భములందు , లేక పశుపక్ష్యాది హీనజాతులందు పుట్టుచున్నాడు .
|
అ.
కర్మణః సుకృతస్యాహుః
సాత్త్వికం నిర్మలం ఫలమ్|
రజసస్తు ఫలం దుఃఖ
మజ్ఞానం తమసః ఫలమ్|| 14-16 ||
|
ఆటవెలది .
సత్త్వ గుణము లిచ్చు స్వచ్ఛ జీవనమును ,
రాజసమ్ము దుఃఖ భాజనమ్ము ,
తామస గుణమిచ్చుఁ దన్మయం బజ్ఞాన
మూఢభావ మాది మోహజడము . ౧౬
|
సాత్త్వికమైన కర్మమునకు ( లేక పుణ్యకార్యములకు ) సత్త్వగుణసంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు , రజోగుణసంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు , తమోగుణసంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు ( పెద్దలు ) చెప్పుదురు .
|
అ.
సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ|
ప్రమాదమోహౌ తమసో
భవతోऽజ్ఞానమేవ చ|| 14-17 ||
|
తేటగీతి .
సత్త్వమున జనియించును జ్ఞాన సంపదల , ర
జో గుణమ్మున లోభ మెచ్చుగ జనించు ;
తామస గుణంబులం బ్రమాదమును , మోహ
మజ్ఞతలు పుట్టుచుండు , పృథా తనూజ ! ౧7
|
సత్త్వగుణమువలన జ్ఞానము , రజోగుణము వలన లోభము , తమోగుణము వలన అజాగ్రత (మఱపు ) , భ్రమ , అజ్ఞానము కలుగుచున్నవి .
|
అ.
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా
మధ్యే తిష్ఠన్తి రాజసాః|
జఘన్యగుణవృత్తిస్థా
అధో గచ్ఛన్తి తామసాః|| 14-18 ||
|
ఆటవెలది .
సత్త్వశీలుఁ డైన స్వర్గ లోకముఁ గాంచు ;
రాజసుఁడు మనుష్య బీజమందు ;
తామసుండు పుట్టుఁ దన్ను తా నెఱుఁగని ,
హీనయోనులం దనేక గతుల . ౧౮
|
సత్త్వగుణము గలవారు ( మరణానంతరము ) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు . రజోగుణము గలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు . నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు ( పాతాళాది ) అధోలోకములకు ( లేక , పశ్వాదిజన్మములకు ) జనుచున్నారు .
|
అ.
నాన్యం గుణేభ్యః కర్తారం
యదా ద్రష్టానుపశ్యతి|
గుణేభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోऽధిగచ్ఛతి|| 14-19 ||
|
తేటగీతి .
గుణ వికారమ్ము ప్రకృతి లక్షణ మటంచు
గుణములే కర్తలంచు బాగుగా నెఱింగి ;
గుణపరంబగు తత్త్వంబు గుఱుతెఱుంగు
నా మహాత్ముఁడు మద్భావ మందగలడు . ౧౯
|
ఎప్పుడు వివేకవంతుడు ( సత్త్వాది ) గుణములకంటె నితరమును కర్తగానెంచడో , మఱియు తన్ను గుణములకంటె వేఱగువానినిగ దెలిసికొనుచున్నాడో , అపు డాతడు నా స్వరూపమును ( మోక్షమును ) పొందుచున్నాడు .
|
అ.
గుణానేతానతీత్య త్రీన్
దేహీ దేహసముద్భవాన్|
జన్మమృత్యుజరాదుఃఖై
ర్విముక్తోऽమృతమశ్నుతే|| 14-20 ||
|
తేటగీతి .
త్రిగుణముల వికారముల నతిక్రమించి ,
త్రిగుణ సంగుఁడు కాకుండు ధీయుతుండు
తనువునందుండి ముక్తుఁడై , తనరుచుండు ,
జన్మమృత్యు జరాదుఃఖ సరణిఁ గనఁడు . ౨0
|
జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడు గుణములను దాటి ( దాటినచో ) పుట్టుక , చావు , ముసలితనము , దుఃఖములు - అనువానిచేత లెస్సగ విడువబడినవాడై , మోక్షమును ( మరణరహిత ఆత్మస్థితిని ) బొందుచున్నాడు .
|
అర్జున ఉవాచ
|అ.
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతా
నతీతో భవతి ప్రభో ! |
కిమాచారః కథం చైతాం
స్త్రీన్గుణానతివర్తతే|| 14-21 ||
|
అర్జును వాక్యము .
తేటగీతి .
ఈ గుణాతీతు నెట్టుల నెఱుఁగ వలయు ,
గుణముల నతిక్రమించు నిర్గుణ గరిష్టుఁ ,
డా గుణాతీతు నాచార మాది సకల
చిహ్నములు నాకు దయచేసి , చెప్పుమయ్య ! ౨౧
|
అర్జును డడిగెను .
ప్రభువగు ఓ కృష్ణా ! ఈ మూడు గుణములను దాటినవా డెట్టి లక్షణములతో గూడియుండును ? ఎట్టి ప్రవర్తన కలిగియుండును ? మఱియు ఈ మూడు గుణములను నాత డేప్రకారము దాటివేయగల్గును ?
|
శ్రీభగవానువాచ|
అ.
ప్రకాశం చ ప్రవృత్తిం చ
మోహమేవ చ పాణ్డవ ! |
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని
న నివృత్తాని కాఙ్క్షతి|| 14-22
అ.
ఉదాసీనవదాసీనో
గుణైర్యో న విచాల్యతే|
గుణా వర్తన్త ఇత్యేవ
యోऽవతిష్ఠతి నేఙ్గతే|| 14-23
అ.
సమదుఃఖసుఖః స్వస్థః
సమలోష్టాశ్మకాఞ్చనః|
తుల్యప్రియాప్రియో ధీర
స్తుల్యనిన్దాత్మసంస్తుతిః|| 14-24
అ.
మానాపమానయోస్తుల్య
స్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ
గుణాతీతః స ఉచ్యతే|| 14-25 ||
|
శ్రీ భగవానుల వాక్యము .
కందము .
త్రిగుణాత్మకమగు కర్మల
తగులము ద్వేషింపఁ బోడు , తరలిన దానన్
వగవఁడు , కాంక్షింపఁడు , క
ర్మ గతికిఁ జలియింపకుండు , మహితాత్ముండై . ౨౨
చంపకమాల .
గుణముల తీవ్రతన్ మదిని గూర్పక సుంతఁ జలింపకుండెడున్ ,
గుణములె యీవికారముల గోడుఁ దగుల్కొనె నంచుఁ జిత్తమం
దనయము నెంచి నిశ్చలత నందును ద్వంద్వములందు నెందునన్
మనము వికారమందక , విమత్సర చిత్తత నుండు ఫల్గుణా ! ౨౩
ఉత్పలమాల .
తుల్యము దుఃఖమున్ , సుఖము , తుల్యము మన్ను సువర్ణమున్ , శిలల్ ;
తుల్య మనిష్ట మిష్టములు , దుల్యము దూషణ భూషణమ్ములున్ ;
తుల్యము మిత్రులన్ రిపుల , తుల్యమనం బవమాన మాన్యతన్ ;
తుల్యుఁడు సర్వకర్మల విలోలుడు గాఁడు గుణోత్తరుండిటుల్ . ౨౪
|
ఓ అర్జునా ! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును ( సుఖమును ) గాని , రజోగుణసంబంధమగు కార్యప్రవృత్తినిగాని , తమోగుణ సంబంధ మగు మోహమును ( నింద్రాతంద్రతలను ) గాని ద్వేషింపడో , అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో , తటస్థునివలె ఉన్నవాడై గుణముల చేత ( గుణకార్యములగు సుఖాదులచేత ) చలింపడో , గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో , ( ఏ పరిస్థితులయందును ) చలింపక నిశ్చలముగ నుండునో , మఱియు ఎవడు సుఖదుఃఖములందు సమభావము గలవాడును , ఆత్మయందే స్థిరముగనున్నవాడును , మట్టిగడ్డ , ఱాయి , బంగారము - వీనియందు సమబుద్ధిగలవాడును , ఇష్టానిష్టములందు సమభావము గల్గియుండువాడును , ధైర్యవంతుడును , సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడును , ( లేక కామ్యకర్మల నన్నిటిని విడచువాడును , లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండువాడును ) అయియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును .
|
అ.
మాం చ యోऽవ్యభిచారేణ
భక్తియోగేన సేవతే|
స గుణాన్సమతీత్యైతాన్
బ్రహ్మభూయాయ కల్పతే|| 14-26 ||
|
చంపకమాల .
నను సతతంబు భక్తిని ననన్యముగా భజియించు భక్తుఁడే
గుణము లతిక్రమింపఁ గలుగున్ , సమభావ సమన్వితుండగున్ ,
ననుఁగన నర్హుఁ డౌ నతఁడె ; నా ప్రతిబింబ స్వరూప తేజుఁ , డ
య్యనఘుఁడె , బ్రహ్మభావ మలరారి విముక్తిని గాంచు ఫల్గునా ! ౨౫
|
ఎవడు నన్నే అచంచలమైన భక్తియోగముచేత సేవించుచున్నాడో , అత డీ గుణములన్నిటిని లెస్సగా దాటివైచి బ్రహ్మముగానగుటకు ( జీవన్ముక్తుడగుట కొఱకు ) సమర్థు డగు చున్నాడు .
|
అ.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహ
మమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య
సుఖస్యైకాన్తికస్య చ|| 14-27 ||
|
కందము .
అమృత , మ్మవ్యయ , శాశ్వత
మమల మ్మానంద రూపమగు నమర జ్యో
తి , మదీయ కళాన్విత భా
గముఁ గాదె , కిరీటి ! ప్రత్యగాత్మౌ నాకున్ . ౨౬
|
ఏలయనగా , నేను నాశరహితమును , నిర్వికారమును , శాశ్వతధర్మస్వరూపమును , ( దుఃఖమిశ్రితము కాని ) నిరతిశయ ( అచంచల ) ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును ( అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును ) అయియున్నాను .
|
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః|| 14 ||
|
ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ గుణత్రయ. విభాగయోగ మను
చతుర్దశ తరంగము సంపూర్ణము .
శ్రీ కృష్ణబ్రహ్మార్పణమస్తు .
|
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు గుణత్రయవిభాగయోగమను
పదునాల్గవ అధ్యాయము
సంపూర్ణము. ఓమ్ తత్ సత్.
|