మహాప్రస్థానం/మానవుడా!
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
రాశి చక్రగతులలో
రాత్రిందివాల పరిణామాలలో,
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో,
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో,
ప్రభవం పొందినవాడా!
మానవుడా! మానవుడా!
సౌందర్యం ఆరాధించేవాడా!
కవితలో, శిల్పంలో-
పురుగులో, పుష్పంలో-
మెరుపులో, మేఘంలో
సౌందర్యం ఆరాధించేవాడా!
జీవించేవాడా!
సుఖించేవాడా! దుఖించేవాడా!
విహ్వలుడా! వీరుడా!
ప్రేమించేవాడా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకసంలో, సముద్రంలో
అన్వేషించేవాడా!
అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా!
ఊర్ధ్వదృష్టీ! మహామహుడా!
మహా ప్రయాణికుడా!
మానవుడా! మానవుడా!
కాట్లాడుకునేవాడా!
ఓర్వలేనివాడా!
సంకుచిత స్వభావుడా!
అయ్యో! మానవుడా!
ఓహో! మానవుడా!
ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా!
అన్యాయం భరించలేని వాడా!
ఆదర్శజీవి! మహాత్మా! మానవుడా!
ఆసియా, అమెరికా, యూరప్,
ఆఫ్రికా, ఆస్ట్రేలియాలలో
సముద్ర ద్వీపాలలో,
ధ్రువప్రాంతాలలో
పట్టణాలలో, పల్లెలలో,
ధనివో, దరిద్రుడవో,
వృద్ధుడవో, యువకుడవో,
తెల్లని, నల్లని, ఎర్రని, పచ్చని రంగో,
బలవంతుడివో! బలహీనుడివో
బ్రదికేవాడా! పాడేవాడా! మానవుడా! మానవుడా!
అవిభక్తకుటుంబీ!
ఏకరక్తబంధూ!
మానవుడా! మానవుడా!
అనేకభాషలు మాట్లాడేవాడా!
అనేకస్థలలో తిరిగేవాడా!
అనేక కాంతులు వెదజల్లేవాడా
సహృదయా! సదయా! సన్మార్గగామీ!
సముద్రాలు దాటేవాడా
ఎడారులూ, పర్వతాలూ గడచేవాడా!
ఆకాశాలను వెదికేవాడా!
నక్షత్రాలను శోధించేవాడా!
పిపాసీ, తపస్వీ!
వంతెనలు నిర్మించినవాడా!
వైద్యశాలలు, వస్తుప్రదర్శనశాలలు,
గ్రంథాగారాలు, పరిశ్రమాలయాలు,
ధూమశకటాలూ, నౌకలూ, విమానాలూ
నిర్మించినవాడా!
దూరదృష్టి, దూరశ్రవణశక్తులు
సాధించినవాడా!
మానవుడా! మానవుడా!
రసైకజీవీ!
కవీ! నటుడా! శిల్పాచార్యా!
గానకళాకోవిదుడా! వేదాంతీ!
విజ్ఞానధనీ! భవధునీ!
దుఃఖమయా! దయాళూ! పరదుఃఖా సహనశీలీ!
చీమనుకూడా చంపడానికి
చేతులురానివాడా!
బుద్ధమూర్తీ!
జీసస్!
సంఘపశూ! శ్రమైకజీవీ!
శరీర పరీవృతుడా!
ఘర్మవర్ష పయోధుడా!
రక్తకణ సమష్టి కుటుంబీ!
కష్టజీవి! కార్మికుడా! మానవుడా!
కూలీ! మాలీ! రైతూ!
గుడిసెలలో బ్రదికేవాడా!
గంజినీళ్లు తాగి కాలం గడిపేవాడా!
కడుపెడు సంతానం కలిగినవాడా!
ఆకలికన్నూ! మానవుడా!
తిరగబడేవాడా! ప్రశ్నించేవాడా!
అన్యాయాలకు ఆహుతి కావడానికైనా
జంకనివాడా!
ఖైదీ!
రౌడీ!
ఖూనీకోర్!
బేబి!
మానవుడా! మానవుడా!