మహాప్రస్థానం/బాటసారి

(బాటసారి నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

కూటికోసం, కూలికోసం

పట్టణంలో బ్రతుకుదామని-

తల్లిమాటలు చెవిన పెట్టక

బయలుదేరిన బాటసారికి,

మూడురోజులు ఒక్కతీరుగ

నడుస్తున్నా దిక్కుతెలియక-

నడిసముద్రపు నావరీతిగ

సంచరిస్తూ సంచలిస్తూ,

దిగులు పడుతూ, దీనుడౌతూ

తిరుగుతుంటే-

చండచండం, తీవ్రతీవ్రం

జ్వరం కాస్తే,

భయం వేస్తే,

ప్రలాపిస్తే-

మబ్బుపట్టీ, గాలికొట్టీ,

వానవస్తే, వరదవస్తే,

చిమ్మచీకటి క్రమ్ముకొస్తే

దారితప్పిన బాటసారికి

ఎంత కష్టం!

కళ్లు వాకిట నిలిపిచూచే

పల్లెటూళ్లో తల్లి ఏమని

పలవరిస్తోందో...?

చింతనిప్పులలాగు కన్నుల

చెరిగిపోసే మంటలెత్తగ,

గుండుసూదులు గ్రుచ్చినట్లే

శిరోవేదన అతిశయించగ,

రాత్రి, నల్లని రాతి పోలిక

గుండె మీదనె కూరుచుండగ,

తల్లిపిల్చే కల్లదృశ్యం

కళ్లముందట గంతులేయగ

చెవులు సోకని పిలుపులేవో

తలచుకుంటూ, కలతకంటూ-

తల్లడిల్లే,

కెళ్లగిల్లే

పల్లటిల్లే బాటసారికి

ఎంత కష్టం!

అతని బ్రతుకున కదే ఆఖరు!

గ్రుడ్డి చీకటిలోను గూబలు

ఘాకరించాయి;

వానవెలసీ మబ్బులో ఒక

మెరుపు మెరిసింది;

వేగుజామును తెలియజేస్తూ

కోడి కూసింది;

విడిన మబ్బుల నడుమనుండీ

వేగుజుక్కా వెక్కిరించింది;

బాటసారి కళేబరంతో

శీతవాయువు ఆడుకుంటోంది!

పల్లెటూళ్లో తల్లికేదో

పాడుకలలో పేగు కదిలింది!