మహాప్రస్థానం/అద్వైతం
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే----
అనురాగపు టంచులు చూస్తాం,
ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో---
నీ మదిలో డోలు తూగీ,నా హృదిలో జ్వాలలు రేగీ---
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే---
మరణానికి ప్రాణం పోస్తం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం.
హసనానికి రాణివి నీవై,
వ్యసనానికి బానిస నేనై---
విషమించిన మదీయ ఖేదం,
కుసుమించిన త్వదీయ మోదం---
విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే---
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం.
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై---
నీ ఎగిరిన జీవవిహంగం
నా పగిలిన మరణమృదంగం
చిగురించిన తోటలలోనో---
చితులుంచిన చోటులలోనో---
వలయుములై జ్వలించినపుడే,
విలయుములై జ్వలించినపుడే---
కాలానికి కళ్ళేం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం
నీ మోవికి కావిని నేనై,
నా భావికి దేవివి నీవై---
నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో,
ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే---
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం.