మహాప్రస్థానం/జగన్నాథుని రథచక్రాలు
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
పతితులార !
భ్రష్టులార !
బాధాసర్ప దష్టులార !
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శని దేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార !
హీనులార !
కూడు లేని, గూడు లేని
పక్షులార ! భిక్షులార !
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు---
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి !
మీరక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి.
ఓ వ్యథానివిష్టులార !
ఓ కథావశిష్టులార !
పతితులార !
భ్రష్టులార !
బాధాసర్పదష్టులార !
ఏడువకం డేడవకండి !
వస్తున్నా యొస్తున్నాయి...
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్ !
జన్నాథుని రథచక్రాల్ !
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రా
లోస్తున్నా యొస్తున్నాయి !
పతితులార !
భ్రష్టులార !
మొయిల్దారిని
బయల్దేరిని
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి !
సింహాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది---
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం...
మహానగా లెగురుతున్నాయి !
మహారథం కదులుతున్నాది !
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి !
పతితులార !
భ్రష్టులార !
బాధాసర్పదష్టులార !
రారండో ! రండో! రండి!
వూరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ---
గోనెలతో, కుండలతో,
ఎటు చూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటునిరాశ---
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య !
దగాపడిన తమ్ములార !
మీ బాధలు నే నెరుగుదును...
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పతితులార !
భ్రష్టులార !
దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టి ,
ఆకసపు దారులంట
అడావుడిగ వెళిపోయే,
అరుచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను !
భూకంపం పుట్టిస్తాను !
నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట !
నిటాలాగ్ని రగిలిందట !
నిటాలాగ్ని !
నిటాలాగ్ని !
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది !
అరెఝా ! ఝా!
ఝుటక్, ఫటక్ ...
హింసనణచ
ధ్వంసరచన
ధ్వంసరచన
హింసరచన
విషవాయువు, మరఫిరంగి,
టార్పీడో, టోర్నిడో!
అది విలయం,
అదిసమరం,
అటో యిటో తెగిపోతుంది ?
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ !
హాలహలం పొగ చూరింది !
కోలాహలం చెలరేగింది !
పతితులార !
భ్రష్టులార !
ఇది సవనం,
ఇది సమరం !
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
గోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్య్రం,
సమభావం,
సౌభ్రాత్రం
సౌహార్దం
పునాదులై ఇళ్లు లేచి,
జనావళికి శుభం పూచి---
శాంతి, శాంతి, శాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ స్వర్గం ఋజువవుతుంది !
పతితులార !
భ్రష్టులార !
బాధాసర్పదష్టులార !
దగాపడిన తమ్ములార !
ఏడవకం డేడవకండి !
వచ్చేశాయ్ , విచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండో!
ఈ లోకం మీదేనండి!
మీ రాజ్యం మీ రేలండి