మహాప్రస్థానం/మిథ్యావాది
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ!
ఏ మంటావు?
మయంటావూ? లోకం
మిథ్యంటావూ? కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ! మాయ!
మాయంటావూ? అంతా
మిథ్యంటావూ?
జమీందారు రోల్సుకారు
మాయంటావు? బాబూ
ఏమంటావు?
మహారాజు మనీపర్సు
మాయంటావూ? స్వామీ
ఏమంటావూ?
మరఫిరంగి, విషవాయువు
మాయంటావూ? ఏం,
ఏ మంటావు?
పాలికాపు నుదుటి చెమట,
కూలి వానిగుండె చెరువు
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావు?
తుపానులూ, భూకంపం,
తిరుగుబాట్లు, సంగ్రామం,
సంగ్రామం, సంగ్రామం,
మాయంటావూ? ఏయ్
ఏమంటావు?
జగతి మరపు, స్వప్నం, ని
శ్శబ్దం, ఇది
మాయ! మాయ!
మాయ! మాయ!
మాయ! మాయ!
మాయంటావూ? అంతా
మిథ్యంటావూ?