మహాప్రస్థానం/భిక్షువర్షీయసి

శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

దారిపక్క, చెట్టుకింద,

ఆరిన కుంపటి విధాన

కూర్చున్నది ముసల్దొకతె

మూలుగుతూ, ముసురుతున్న

ఈగలతో వేగలేక.

ముగ్గుబుట్టవంటి తలా,

ముడుతలు తేరిన దేహం,

కాంతిలేని గాజుకళ్లు,

తన కన్నా శవం నయం.

పడిపోయెను జబ్బుచేసి;

అడుక్కునే శక్తిలేదు;

రానున్నది చలికాలం;

దిక్కులేని దీనురాలు.

ఏళ్లు ముదిరి కీళ్లు కదిలి,

బతుకంటే కోర్కె సడలె-

పక్కనున్న బండరాతి

పగిదిగనే పడి ఉన్నది.

"ఆ అవ్వే మరణిస్తే

ఆ పాపం ఎవ్వరి"దని

వెర్రిగాలి ప్రశ్నిస్తూ

వెళ్లిపోయింది!

ఎముక ముక్క కొరుక్కుంటు

ఏమీ అనలేదు కుక్క.

ఒక ఈగను పడవేసుకు

తొందరగా తొలగె తొండ

క్రమ్మె చిమ్మచీకట్లూ,

దుమ్మురేగె నంతలోన.

"ఇది నా పాపం కా"దనె

ఎగిరి వచ్చి ఎంగిలాకు.