మహాప్రస్థానం/పేదలు
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
అంతేలే, పేదల గుండెలు !
అశ్రువులే నిండిన కుండలు !
శ్మశానమున శశికాంతులలో
చలిబారిన వెలి రాబండలు !
అంతేలే, పేదల మూపులు !
అణగార్చిగ విధి త్రోద్రోపలు,
పయోధితట కుటీరములవలె
భరియించవు బాధల మోపులు !
అంతేలే, పేదల చేతులు !
శ్లథశైశిర పలాశరీతులు !
విశుష్కములు, పరిపాండురములు !
విచలించెడు విషాదహేతులు !
అంతేలే, పేదల కన్నులు !
వినమ్రములు, వెతల వ్రణమ్ములు !
తుపానులో తడిసిన, జడిసిన
గోమాతల కన్నుల తమ్ములు !
అంతేలే, పేదల కన్నులు !
తిరిపెమునకు పిడికెడు మెతుకులు !
తిరువెరుగని దీర్ఘ రాత్రిలో
తల పగిలెడి తలపుల గతుకులు !