మహాప్రస్థానం/నవ కవిత
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సిందూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రజెండా,
రుద్రాలిక నయనజాలిక,
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి--
ఘాటెక్కిన గంధక ధూమం,
పోటెత్తిన సప్త సముద్రాల్,
రగులుకొనే రాక్షసబొగ్గూ,
బుగులుకొనే బుక్కాగుండా,
వికసించిన విద్యుత్తేజం,
చెలరేగిన జనసమ్మర్దం
కావాలోయ్ నవకవనానికి--
రాబందుల రెక్కల చప్పుడు,
పొగగొట్టపు భూంకార ధని
అరణ్యమున హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గమృగోదగ్రవిరావం,
ఝంఝానిల షడ్జధ్వానం
కావాలోయ్ నవకవనానికి--
కదిలేది కదిలించేదీ,
మారేది మార్పించేదీ,
పాడేదీ పాడించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ
కావాలోయ్ నవకవనానికి-