తెభా-10.1-427-వ.
అప్పుడు రోహిణీయశోద లేక రథంబునఁ బరిపూర్ణమనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకుఁ బ్రమోదంబు నొందుచుండి; రిట్లు గోపకులు బృందావనంబు జొచ్చి యం దర్ధచంద్రాకారంబుగ శకట సందోహంబు నిలిపి మందలు విడియించి వసియించిరి.
టీక:- అప్పుడు = ఆ సమయమునందు; రోహిణి = రోహిణీదేవి; యశోదలు = యశోదాదేవిలు; ఏక = ఒకే; రథంబునన్ = రథముపైన; పరిపూర్ణమనోరథులు = తృప్తితో ఉన్నవారు; ఐ = అయ్యి; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; ముందటన్ = ఎదుట; ఇడుకొని = కూర్చోబెట్టుకొని; వారల = వారు చేయు; వినోదంబుల్ = వినోదపుపనుల; కున్ = కు; ప్రమోదంబున్ = సంతోషము; ఒందుచుండిరి = పొందుచుండిరి; ఇట్లు = ఈ విధముగ; గోపకులు = యాదవులు; బృందావనంబున్ = బృందావనమును; చొచ్చి = ప్రవేశించి; అందున్ = అక్కడ; అర్ధచంద్ర = అర్ధచంద్రుని, అర్ధవృత్త; ఆకారంబుగ = ఆకృతిలో; శకట = బండ్ల; సందోహంబున్ = సమూహమును; నిలిపి = ఆపికొని; మందలు = పశువుల గుంపును; విడియించి = కుదురుగ ఉంచి; వసియించిరి = నివసించిరి.
భావము:- రోహిణీ దేవి, యశోదాదేవి ఎంతో సంతృప్తితో ఒకే బండిలో కూర్చున్నారు. బలరామకృష్ణులను ఎదుట కూర్చోపెట్టుకుని, వారి ఆటపాటలతో ఆనందిస్తూ ప్రయాణం సాగించారు. ఈ విధంగా గోకులంలోని ప్రజలు అందరూ బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. అలాగే ఇండ్లను కూడా కట్టుకుని అక్కడ నివసించారు.

తెభా-10.1-428-క.
చెందిరి బలమాధవు లభి
నందించుచుఁ బరమ పావము సంచిత కా
ళిందీ సంజీవనమున్
బృందావనమున్ మునీంద్రబృందావనమున్.

టీక:- చెందిరి = చేరిరి; బల = బలరామ; మాధవులు = కృష్ణులు {మాధవుడు - మాధవి (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; అభినందించుచున్ = కొనియాడుతు; పరమ = అతిమిక్కిలి; పావనమున్ = పరిశుద్ధమైన; సంచిత = కూడిన; కాళిందీ = యమునానది యొక్క; సంజీవనమున్ = మరల జీవింప జేసినది; బృందావనమున్ = బృందావనమును; ముని = ఋషులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; బృంద = సమూహములను; అవనమున్ = రక్షించెడి దానిని.
భావము:- ఇలా బలరామకృష్ణులు సంతోషంతో పరమ పావనమైన బృందావనంలో ప్రవేశించారు. ఆ బృందావనం కాళింది నదికి ప్రాణాలు పోసినట్లుగా ఉంది. అది మునీంద్రులు అందరినీ రక్షించేది.

తెభా-10.1-429-వ.
ఇట్లు బృందావనంబు చెంది, కొంత కాలంబునకు రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడుకొని వేడుక లూదుకొన దూడలఁ గాచుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బృందావనంబున్ = బృందావనము నందు; చెంది = స్థిరపడినవారై; కొంత = కొన్ని; కాలంబున్ = నాళ్ళు; కున్ = కి; రామ = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు; సమానవయస్కులు = తమ ఈడువారు; ఐన = అయినట్టి; గోప = గొల్ల; బాలకులన్ = పిల్లవారిని; కూడుకొని = కలుపుకొని; వేడుకలు = ఉత్సాహములు; ఊదుకొనన్ = అలముకొనగా, వ్యాపించగా; దూడలన్ = ఆవుదూడలను; కాచుచున్ = మేపుచు.
భావము:- ఇలా బృందావనం చేరిన కొన్నాళ్ళ పిమ్మట, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలసి ఆనందంగా దూడలను కాయసాగారు.

తెభా-10.1-430-సీ.
వేణువు లూఁదుచు వివిధ రూపములతో-
గంతులు వైతురు గౌతుకమున;
గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని-
రవృషభము లని ప్రతిభటింతు;
ల్లులు దట్టించి యంఘ్రుల గజ్జలు-
మొఱయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
న్నిదంబులు వైచి లమంజరులు గూల్చి-
వేటు లాడుదురు ప్రావీణ్య మొప్ప;

తెభా-10.1-430.1-తే.
న్య జంతు చయంబుల వానివాని
దురు పదురుచు వంచించి ట్టఁబోదు;
రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు;
రా కుమారులు బాల్యవిహారు లగుచు.

టీక:- వేణువులు = పిల్లనగ్రోవులు; ఊదుచున్ = పూరించుచు; వివిధ = అనేకమైన; రూపముల్ = ఆకృతుల; తోన్ = తోటి; గంతులు = చిందులు; వైతురు = వేసెదరు; కౌతుకమునన్ = కుతూహలముతో; గురు = పెద్దపెద్ద; కంబళ = కంబళ్ళు; ఆదులన్ = మున్నగువానితో; గోవృషభంబులన్ = ఆబోతులను; పన్ని = ఏర్పరచి; పర = ఇతరుల; వృషభములు = ఆబోతులు; అని = అని; ప్రతిభటింతురు = ఎదురింతురు; అల్లులున్ = చల్లడములను, భుజాలు {చల్లడము - తొడలకు సగమువరకు వచ్చునట్లు కట్టుకొనెడి వస్త్రవిశేషము}; దట్టించి = బిగియగట్టి, చరచికొని; అంఘ్రుల = కాళ్ళ; గజ్జలు = గజ్జలు; మొఱయన్ = మోగుతుండగా; తన్నుదురు = కాళ్ళతో తన్నెదరు; ఓలిన్ = వరుసగా; ముమ్మరముగన్ = అధికముగా; పన్నిదంబులున్ = పందెములు; వైచి = వేసుకొని; ఫల = పండ్లను; మంజరులున్ = పూలగుత్తులను; కూల్చి = రాలగొట్టి; వేటులు = కొట్టుకొనెడి ఆటలు; ఆడుదురు = ఆడెదరు; ప్రావీణ్యము = నేర్పులు; ఒప్పన్ = ఒప్పునట్లుగా.
వన్య = అడవి; జంతు = జంతువుల; చయంబులన్ = సమూహములను; వానివాని = ఆయాజంతువుల; పదురు = కూతలను; పదురుచున్ = అనుకరించికూయుచు; వంచించి = మోసగించి; పట్టన్ = పట్టుకొన; పోదురు = వెళ్ళెదరు; అంబుజాకారములన్ = తామరకొలనులలో {అంబుజాకరము - అంబుజ (పద్మముల) ఆకరము (నివాసము), చెరువు, కొలను}; చల్లులాడన్ = జలకాలాడుటకు; చనుదురు = వెళ్ళెదరు; ఆ = ఆ ప్రసిద్ధులైన; కుమారులు = బాలకులు; బాల్య = పసితనపు; విహారులు = క్రీడలు క్రీడించువారు; అగుచున్ = ఔతూ.
భావము:- ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గెంతులు వేయసాగారు; పెద్దపెద్ద కంబళ్ళతో వృషభాలరూపాలు తయారుచేసి, వాటిని శత్రు వృషభాలు అని వాటితో యుద్ధం చేయసాగారు; గుడ్డలతో బొమ్మలుచేసి వాటిని గట్టిగా తన్నుతుండేవారు, అలా కాలిగజ్జెలు ఘల్లుఘల్లు మంటూ మ్రోగసాగాయి; పందాలు వేసుకుని మరీ పండ్లగుత్తులను రాళ్ళతో కొడుతూ ఉంటారు; అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువులు దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు. తామరపూల కొలనులలో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇలా ఆ రాకుమారులు గోపబాలకులై బాల్యక్రీడలలో చరించసాగారు.

తెభా-10.1-431-క.
పోరుదురు గికురు పొడుచుచు;
దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్;
జాఱుదురు ఘనశిలాతటి;
మీఱుదు రెన్నంగరాని మెఁలకువల నృపా!

టీక:- పోరుదురు = దెబ్బలాడుకొనుచు; కికురుపొడుచుచున్ = తోసుకొనుచు; దూఱుదురు = చొరబడెదరు; భయంబున్ = బెదురు; లేక = లేకుండ; తోరపు =పెద్దపెద్ద; ఇరవుల్ = పొదరిండ్లలోకి; జాఱుదురు = జారెదరు; ఘన = పెద్దపెద్ద; శిలాతటిన్ = చాపరాళ్ళమీద; మీఱుదురు = ఒకరినొకరు మించుదురు; ఎన్నంగరాని = ఎంచ వీలుకాని; మెలకువలన్ = మెలకువలతో; నృపా = రాజా.
భావము:- ఒకరితో ఒకరు యుద్ధాలు ఆటలు ఆడుతూ, దొంగదెబ్బలు కొట్టుకుంటారు. అందమైన స్థలాల లోనికి జంకులేకుండా ప్రవేశిస్తూ ఉంటారు. పెద్ద బండరాళ్ళపైకి ఎక్కి జారుతూ ఉంటారు పెద్దలకి ఊహించరాని నేర్పరితనాలలో ఒకరి నొకరు మించిపోతూ ఉంటారు.