తెభా-10.1-425-వ.
అని పలుకు నుపనందుని పలుకుల కార్యులైన గోపకు “లిదియ కార్యంబు మందల” యని కొందల మందక యాలమందల నమంద గమనంబున ముందఱ నడవం బనిచి పిఱుందం గ్రందుకొనకుండ, బాల వృద్ధ నారు లెక్కిన తేరులు సాగించి తారు తను త్రాణ తూణీర బాణధరులై విండ్లు బట్టుకొని నడవ, బండ్ల వెనుకం గొమ్ము లిమ్ములం బూరించుచు నవార్యంబులగు తూర్యరవంబులు సెలంగ, నార్య, పురోహిత సమేతులై వేడుకలు కొనలునిగుడ మొన లేర్పఱచుకొని పావనం బగు బృందావనంబునకుం జని రప్పుడు.
టీక:- అని = అని; పలుకు = చెప్పెడి; ఉపనందుని = ఉపనందుని యొక్క; పలుకుల్ = మాటల; కున్ = కు; ఆర్యులు = పెద్దలు; ఐన = అయిన; గోపకులు = యాదవులు; ఇదియ = ఇదే; కార్యంబు = మన కర్తవ్యము; మందలన్ = మన ఊరికి; అని = అని; కొందలము = సంకటములు; అందక = పడక; ఆలమందలన్ = పశువుల గుంపును; అమంద = వడిగల; గమనంబులన్ = నడకలతో; ముందఱన్ = ముందు; నడవన్ = నడవవలెనని; బనిచి = పంపించి, నియమించి; పిఱుందన్ = వెనుకనే; క్రందుకొనకుండన్ = సందడిచేయకండ; బాల = చిన్నపిల్లలు; వృద్ధ = ముసలివారు; నారులు = స్త్రీలు; ఎక్కిన = అధిరోహించిన; తేరులు = బండ్లు, రథములు; సాగించి = నడిపించి; తారు = తాము; తనుత్రాణ = కవచములు; తూణీర = అమ్ములపొదులు; బాణ = అమ్ములు; ధరులు = ధరించినవారు; ఐ = అయ్యి; విండ్లున్ = విల్లులను; పట్టుకొని = చేతులలో పట్టుకొని; నడవన్ = నడుస్తుండగా; బండ్ల = బండ్లు; వెనుకన్ = వెనకాతల; కొమ్ములు = కొమ్ముబూరాలు; ఇమ్ములన్ = గట్టిగా; పూరించుచున్ = ఊదుచు; అనివార్యంబు = అడ్డగింపరానివి; అగు = ఐన; తూర్య = వాద్యముల; రవంబులున్ = ఘోషలు, ధ్వనులు; ఆర్య = పెద్దలు; పురోహిత = పురోహితులు; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; వేడుకలు = ఉత్సాహములు; కొనలునిగుడన్ = అతిశయించుచుండగా; మొనలు = నాయకులను, బారులు; ఏర్పఱచుకొని = నియమించుకొని, తీర్చి; పావనంబు = పరిశుద్ధమైనది; అగు = ఐన; బందావనంబున్ = బృందావనమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అప్పుడు = అప్పుడు.
భావము:- ఉపనందుడిలా చెప్పగానే పెద్దలూ పూజ్యులైన గోపకులు అందరూ అంగీకరించారు ఒక క్రమపద్దతిలో ముందుగా ఆవుల మందలను వేగంగా బృందావనానికి తోలించారు. వాటికి రక్షగా వెనుకనే వారి బండ్లు బయలుదేరాయి. వాటిలో బాలకులు స్త్రీలు వృద్ధులు పయనించసాగారు. వాటి పక్కనే గోపాలురు కవచాలు, ధనుర్భాణాలు, అమ్ములపొదులు పట్టుకుని బయలుదేరారు. బండ్లకు వెనుకగా బాకాలు తూర్యములు మ్రోగుతూ ఉండగా పూజ్యులైన పురోహితులు వెంట నడువగా పల్లెలోని మిగిలినవారు అందరూ బయలుదేరారు. అలా గుంపులు గుంపులుగా ఈ మొత్తం అంతా ఉత్సాహంతో బృందావనానికి బయలుదేరారు.

తెభా-10.1-426-త.
సుపు లాడి యురోజకుంకుమ పంకశోభితలై లస
ద్వనలై కచభారచంపకదామలై సు లలామలై
సిఁడిమాడల కాంతు లఱ్ఱులఁ ర్వఁ దేరులమీఁద బెం
పెసఁగ బాడిరి వ్రేత లా హరిహేల లింపగు నేలలన్.

టీక:- పసుపులాడి = పసుపులు రాసుకొని స్నానములు చేసి; ఉరోజ = రొమ్ముల పైన పూసుకొన్న; కుంకుమ = కుంకుమ; పంక = పల్చటి లేహ్యము, పాలుతో; సం = చక్కగా; శోభితలు = ప్రకాశించువారు; ఐ = అయ్యి; లసత్ = అందమైన; వసనలు = వస్త్రములు ధరించినవారు; ఐ = అయ్యి; కచభార = జుట్టుముడులలో; చంపక = సంపెగపూల; దామలు = దండలు కలవారు; ఐ = అయ్యి; సు = చక్కగా; లలామలు = తిలకము ధరించినవారు; ఐ = అయ్యి; పసిడి = బంగారు; మాడల = మాడల యొక్క; కాంతులు = మెరుపులు; అఱ్ఱులన్ = మెడల యందు; పర్వన్ = పరచుకొనుచుండగా; తేరులు = రథములు, బండ్లు; మీదన్ = పైననుండి; పెంపు = ఉత్సాహములు; ఎసగన్ = అతిశయించగా; పాడిరి = పాటలు పాడిరి; వ్రేతలు = గోపికలు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హరి = శ్రీకృష్ణుని; హేలలు = లీలలను; ఇంపగు = మనోజ్ఞమైన; నేలలన్ = ప్రదేశములలో.
భావము:- గోపికలు చక్కగా పసుపులు రాసుకుని, స్నానాలు చేసి, ఆపైన పాలిండ్ల మీద కుంకుమ పూతలు పూసుకుని, మెరుపుల వస్త్రాలు ధరించారు, అందంగా తిలకాలు దిద్దుకున్నారు. పెద్ద కొప్పులపై సంపెంగ పూలదండలు ధరించారు. ధరించిన బంగారు కాసులపేరు కాంతులు మెడలో ప్రకాశిస్తున్నాయి. వారు బండ్లలో ఎక్కి కూర్చుని చక్కని కంఠాలతో మాధవుడిమీద పాటలు పాడుతూ ఉన్నారు.