తెభా-10.1-432-వ.
అంత నొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపం దలంచి.
టీక:- అంతన్ = అప్పుడు; యమునా = యమునానదీ; తీరంబునన్ = తీరమునందు; ఆ = ఆ; కుమారులు = బాలకులు; గోపకుమారులున్ = గొల్లపిల్లలు; తారును తాము; క్రేపులన్ = దూడలను; మేపన్ = మేపుతుండగ; ఒక్క = ఒకానొక; రక్కసుండు = రాక్షసుడు; క్రేపు = ఆవుదూడ; రూపంబునన్ = ఆకృతితో; వచ్చి = చేరి; వారలన్ = వారిని; హింసింపన్ = సంహరించవలెనని; తలంచి = భావించి.
భావము:- ఒకరోజు బలరామకృష్ణులు యమునానదీతీరాన గోపాలకులతో కలసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు.

తెభా-10.1-433-క.
క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ
గ్రేపులలో నిదియె మంచి క్రేపనఁగఁ గడుం
జూట్టి భక్త సంగతిఁ
గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్.

టీక:- క్రేపుల = ఆవుదూడల; అఱ్ఱులున్ = మెడలను; నాకుచున్ = నాకుతూ; క్రేపుల = అన్ని దూడలలోను; ఇదియె = ఇదే; మంచి = మంచి; క్రేపు = దూడ; అనగన్ = అన్నట్లుగా; కడున్ = మిక్కిలి; చూపట్టి = కనబడి; భక్త = తన భక్తుల; సంగతిన్ = వెంట; క్రేపు = దూడ; ఐ = అయ్యి; చనువాని = వెళ్ళెడివానిని; మ్రోలన్ = ఎదుట; క్రేపు = దూడ; ఐ = అయ్యి; తిరిగెన్ = సంచరించెను.
భావము:- వాడు దూడలలో దూడ రూపం దాల్చి వాటితో కలసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ; ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అన్నట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలె సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగసాగాడు.

తెభా-10.1-434-వ.
వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి
టీక:- వానిన్ = అతనిని; ఎఱింగి = తెలిసికొని; కృష్ణుండు = కృష్ణుడు; రామున్ = బలరామున; కున్ = కు; చెప్పి = చెప్పి.
భావము:- ఆ వత్సాసురుడి విషయం ఎరిగిన కృష్ణుడు బలరాముడుకి చెప్పి. . .

తెభా-10.1-435-చ.
"ది యొక మంచిలేగ; వినుఁ డెంతయు నొప్పెడి"నంచు దాని త
త్పములు తోఁకయున్ బిగియఁట్టి చెలంగి వెలంగ మ్రానితోఁ
దియఁగ నొక్క పెట్టుగొని చంపెఁ గుమారుఁడు లేఁగరక్కసుం
గుదులుకొనంగ బాలకులు గోయని యార్వ నఖర్వ లీలతోన్.

టీక:- ఇది = ఇది; ఒక = ఒకానొక; మంచి = మంచి; లేగ = లేగదూడ; వినుండు = వినండి; ఎంతయున్ = మిక్కిలి; ఒప్పెడిన్ = అందముగ ఉంది; అంచున్ = అనుచు; దాని = దానిని; తత్ = ఆ; పదములున్ = కాళ్ళు; తోకయున్ = తోక; బిగియన్ = గట్టిగా; పట్టి = పట్టుకొని; చెలంగి = చెలరేగి; వెలంగ = వెలగ; మ్రాని = చెట్టుబోదె; తోన్ = తోటి; చదియగన్ = నలియునట్లు; ఒక్క = ఒకానొక; పెట్టు = దెబ్బ; కొని = కొట్టి; చంపెన్ = సంహరించెను; కుమారుడు = బాలకృష్ణుడు; లేగరక్కసున్ = వత్సాసురుని; కుదులుకొనంగ = కూలిపోయేలా; బాలకులు = గోపబాలురు; కో = కో; అని = అని; ఆర్వన్ = అరచుచుండగ; అఖర్వలీల = విస్తారమైన లీల; తోన్ = తోటి.
భావము:- కృష్ణుడు “ఆహా ఈ దూడ ఎంత మంచిదో చూసారా; ఎంత చక్కగా ఉందో చూడండి” అంటూ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు. గభాలున దాని కాళ్ళు తోక పట్టుకుని పైకెత్తి పెద్దపెట్టున వెలగచెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడి అయిపోయింది. ఈ విధంగా దూడరూపంలో వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు గిలగిల కొట్టుకుని చచ్చి పోయాడు. గోపాలకులు ఆనందంతో ఒక్కపెట్టున పెద్దగా కేకలు వేసారు.

తెభా-10.1-436-వ.
ఇట్లు రక్కసుండు వ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలం గూలెను; అప్పుడు
టీక:- ఇట్లు = ఈ విధముగ; రక్కసుండు = రాక్షసుడు; వ్రేటుపడి = చనిపోయి; విశాలంబు = పెద్దది; అగు = ఐన; సాలంబు = మాను; తోన్ = తోటి; నేలంగూలెన్ = మరణించెను; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- అలా అ రాక్షసుడు దెబ్బ తిని నేలకూలాడు ఆ దెబ్బకు అంత పెద్ద చెట్టు సైతం కూలిపోయింది. .

తెభా-10.1-437-క.
గొండు లెగురఁగ వైచుచుఁ
జంగున దాఁటుచును జెలఁగి ప్పట లిడుచుం
బొంగుచుఁ గృష్ణుని బొగడుచు
ద్రుంగిన రక్కసునిఁ జూచి త్రుళ్ళిరి కొమరుల్.

టీక:- గొంగడులు = కంబళ్ళు, రగ్గులు; ఎగురగన్ = పైకెగురునట్లు; వైచుచున్ = వేయుచు; చంగునన్ = చెంగుమని; దాటుచునున్ = ఎగిరిదాటుతూ; చెలగి = విజృంభించి; చప్పటలు = చప్పట్లు; ఇడుచున్ = కొట్టుతూ; పొంగుచున్ = ఉప్పొంగుతు; కృష్ణుని = బాలకృష్ణుని; పొగడుచున్ = స్తుతించుచు; త్రుంగిన = చచ్చిపోయిన; రక్కసునిన్ = రాక్షసుని; చూచి = కనుగొని; త్రుళ్ళిరి = గర్వించి గంతులు వేసిరి; కొమరుల్ = బాలకులు.
భావము:- గోపకుమారులు చచ్చి పడిన రాక్షసుని చూసి పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగురవేసారు. ఎగిరి దూకారు. చప్పట్లు కొట్టారు. తృళ్ళింతలతో పొంగిపోయారు. కృష్ణుని బలాన్ని పొగిడారు.

తెభా-10.1-438-వ.
ఆ సమయంబున వేలుపులు విరులవానలు గురియించి రివ్విధంబున.
టీక:- ఆ సమయంబునన్ = అప్పుడు; వేలుపులు = దేవతలు; విరుల = పూల; వానలు = జల్లులు; కురియించిరి = కురిపించిరి; ఈ = ఈ; విధంబునన్ = విధముగ;
భావము:- అప్పుడు దేవతలు పూలవానలు కురిపించారు. ఇలా....

తెభా-10.1-439-క.
త్సముల పగిది జగముల
త్సలతన్ మనుపఁ జూచువాఁడై యుంటన్
త్సముల మేపు చుండియు
త్సాసురుఁ జంపె భక్తత్సలుఁ డధిపా!

టీక:- వత్సములన్ = ఆవుదూడలను {వత్సము - ఒక సంవత్సరములోపు దూడ}; పగిదిన్ = వలెనే; జగములన్ = లోకములను; వత్సలతన్ = వాత్సల్యముతో; మనుపన్ = కాపాడవలెనని; చూచువాడు = పూనునట్టివాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచే; వత్సములన్ = దూడలను; మేపుచుండియున్ = మేపుతున్నను; వత్సారున్ = వత్సుడు అనెడి రాక్షసుని; చంపెన్ = సంహరించెను; భక్తవత్సలుడు = శ్రీకృష్ణుడు {భక్త వత్సలుడు - భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు, విష్ణువు}; అధిపా = రాజా.
భావము:- పరీక్షిన్మహారాజా! ఆవు తన దూడను రక్షించు నట్లు ఈ లోకాలు అన్నింటిని వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు. కనుక భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేసాడు.

తెభా-10.1-440-వ.
మఱియు నొక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని యెండంబడి మెండుకొనిన దప్పిని బెండుపడిన తమ తమ లేఁగకదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబు లేని యొక్క కొలంకున నీరు ద్రావించి తారును జలపానంబు జేసి వచ్చునెడ నందు.
టీక:- మఱియున్ = ఇంకను; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; రేపకడ = ఉదయమే; గోపకుమారులు = గొల్లపిల్లలు; క్రేపులన్ = ఆవుదూడలను; కొంచున్ = తీసుకొని; అడవి = అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; ఎండన్ = ఎండకు; పడి = గురై; మెండుకొనిన = అధికమైన; దప్పిన్ = దాహముతో; బెండుపడిన = నీరసించిపోగా; తమతమ = వారివారి; లేగ = లేగదూడల; కదుపులన్ = సమూహములను; ఏర్పరించుకొని = విభజించుకొని; నిలువరించుకొని = నిలుపుకొని; కలంకంబు =ముఱికి, మాలిన్యము; లేని = లేనట్టి; ఒక్క = ఒకానొక; కొలంకునన్ = చెరువలో; నీరున్ = నీటిని; త్రావించి = తాగించి; తారును = వారుకూడ; జలపానంబు = నీళ్ళుతాగుట; చేసి = చేసి; వచ్చున్ = వచ్చెడి; ఎడన్ = సమయము; అందు = అందు.
భావము:- దినము ఉదయమే గోపబాలకులు వారి లేగదూడలను అడవికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎండకు గురై విపరీతమైన దాహము కలుగగా, అలసిపోయిన వారి లేగదూడలను వారిలో వారు విభజించుకొని ఒక మంచినీటి కొలనులో వాటి చేత నీరు తాగించి వారు కూడా నీరు తాగి వస్తున్న సమయంలో ....