నా జీవిత యాత్ర-1
NAA JEEVIFA YATRA - Vol. I (Auto Biography of Andhra Kesari
Prakasam Pantulu in Four Volumes)
By
TANGUTURI PRAKASAM Publishers : M. SESHACHALAM & CO.
First Edition :
EMESCO POCKET BOOKS July 1972
Cover Design :
BAPU
Printers :
KRANTI PRESS, Madras-1.
Distributors :
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS,
RASHTRAPATHI ROAD, SECUNDERABAD.
Price Rs. 2-50
Four Volumes bound in one hard Cover Edition. Rs. 15/-
ప్రస్తావన
రాష్ట్రపతి డాక్టర్ వరాహగిరి వెంకటగిరి
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు ఒక్క వ్యక్తి కాదు; అర్ధ శతాభ్దికి పైగా ఆంధ్ర రాజకీయ ప్రజాహిత జీవన రంగంలో ఆయన ఒక మహా సంస్థ. ఆయన వ్యక్తిత్వం మహా గోపుర శిఖరోన్నతం. ఆయన జీవిత గాథ బహుముఖ ప్రకాశం గలది; బహురస సంపన్నమైనది. బొడ్డున మాణిక్యం పెట్టుకొని పుట్టిన భాగ్యశాలి కారు ఆయన. అతి సామాన్య స్థితి - కాదు, నిరుపేద దశ -లో నుండి ఎదిగి ఎదిగి మహద్వైభవ శృంగాన్ని అందుకొన్న అతిసత్త్వుడాయన. ఉజ్జ్వల దేశ భక్తి, నిరుపమ త్యాగశీలం, అన్నింటికన్న ముఖ్యంగా ఆయన అక్షయ శక్తి, స్వభావ సౌష్టవం....ఆయన విజయ హేతువులు. ప్రకాశం గారు నాకు మరీ సన్నిహితులు; మన స్వాతంత్ర్య సమర చరిత్రలో అతిక్లిష్ట దశలో అయన నాయకత్వాన ఆయనకు అత్యంత సన్నిహితుడనై పనిచేసే భాగ్యం నాకు కలిగింది. అటువంటి ఆప్తుని గురించి వ్రాయటం కష్టం. ఆ రోజులు తలుచుకుంటే, వాస్తవంగా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ సంరంభాలు, ఆ సంచలనాలు, ఆ సంఘటనలు ఇప్పటికీ నాకు అపరిమితమైన ఆనందం, ఉత్సాహం కలిగిస్తాయి.
నాకు పదేళ్ళు వచ్చిన నాటినుంచి ప్రకాశంగారిని ఎరుగుదును. మా నాయనగారు, ప్రకాశంగారు సమకాలికులు, ఆజీవ మిత్రులు, ఇద్దరూ న్యాయవాద వృత్తిలో ప్రముఖులు. గాంధి మహాత్ముని నాయకత్వాన సాగుతున్న స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించక పూర్వం ప్రకాశం పంతులుగారు మద్రాసులో ప్రముఖ న్యాయవాదిగా ప్రాక్టీసుచేస్తూ అమి తంగా ఆర్జిస్తూ ఉండేవారు. చిరకాలం మా నాయనగారు, ప్రకాశంగారూ ప్రక్క ప్రక్కనే ప్రవహిస్తూన్న రెండు నదుల్లాగ సారవంతమైన మన తెలుగు నేలను ఫలవంతం చేశారు. ఇద్దరూ ఇంచుమించు ఏకకాలంలో జన్మించారు. ఒకే కళాశాలలో - రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్‌లో - ప్రిన్‌స్పాల్ మెట్ కాఫ్ గారి వద్ద చదువుకున్నారు. 1891 సుమారులో ఇద్దరూ ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్ పరీక్షకు చదివి, గంజాం, గోదావరి జిల్లా కోర్టులలో ప్రాక్టీసు చేశారు. 1927-29 లో ఇద్దరూ మాన్యులైన పండిత మోతీలాల్ నెహ్రూగారి నాయకత్వాన మన దేశంలో నాటి పెద్దలంతా ఉన్న స్వరాజ్య పార్టీ పక్షాన కేంద్ర శాసన సభకు ఎన్నిక అయ్యారు. 1937 --39లలో ఇద్దరూ మద్రాసు శాసన సభా కాంగ్రేసు పక్షంలో ప్రకాశం గారు శాసన సభలోను, మా నాయనగారు శాసన మండలిలోను --సభ్యులుగా ఉండేవారు. ఈ సమయంలోనే నేను అనేక పర్యాయాలు ఆ మహా మానవుణ్ణి దర్శించగలిగాను. జీవితం పొడుగునా నేను ప్రకాశంగారిని మాననీయులైన మా తండ్రిగారితో సమానులుగానే చూసుకున్నాను. ఆయన విజ్ఞానము, ఆయన జీవితానుభవము నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయనీ, పదేళ్ళ పసితనం నించీ నేను ఆయనను మన మహా నాయకులలో ఒకరుగా భావిస్తూ, ప్రజా సేవారంగంలో ఆయన కార్యక్రమాలను అమితాసక్తితో గమనిస్తూ ఎంతో లాభం పొందానని చెప్పుకుంటున్నాను.
ప్రకాశంగారు రాజకీయాలలో ప్రవేశించక పూర్వం గొప్ప సంఘ సంస్కరణవాది. మన సంఘంలోని మూఢాచారాలను, కుల, వర్గ, వర్ణ విభేదాలను రూపు మాపడంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. పందొమ్మిదవ శతాబ్దిలో భారతదేశంలో అవతరించిన మహా పురుషులలో ఆయన ఒకరు. అమృతసర్‌లో దారుణ హత్యాకాండ జరిగిన తరువాత గాంధి మహాత్ముడు సహాయనిరాకరణోద్యమం ప్రారంభించిన మీదట, సైమన్ కమీషను భారతదేశం వచ్చినప్పుడు మద్రాసులో పెద్దగా ఆందోళన జరిపారు. ప్రకాశంగారు 144 వ సెక్షను ధిక్కరించి నప్పుడు, బ్రిటిష్ సైనికులు తుపాకులు చూపి ఆయనను సవాల్‌చేయగా, వెంటనే ప్రకాశంగారు తన ఎదురు రొమ్ము చూపి, 'కాల్చుకో'మని ఎదురు సవాల్ చేశారు. దాంతో, ఆ సైనికులు స్తబ్దులై నిలబడిపోయి, ప్రకాశంగారిని ముందుకు పోనిచ్చారు. ఈ నిర్భయతే, ఈ గుండెలు దీసిన బంటు తనమే ప్రకాశంగారి 'ఆంధ్ర కేసరి' బిరుదుకు కారణమయింది. ఆయన దక్షిణ భారత నాయకాగ్రణి అయారు.
మొదట మంత్రిగాను, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముఖ్య మంత్రిగాను ప్రకాశంగారు గురుతర నూతన బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినప్పుడు, ఆయన ఇంకా ఎత్తుగా పెరిగి, అత్యంత సమర్థులు, ప్రజానురంజకులు అయిన కాంగ్రెస్ మంత్రులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి చెన్నరాష్ట్రంలో రాజాజీ మంత్రి వర్గంలో ప్రకాశంగారు, నేనూ మంత్రులం. 1946 లో మరల కాంగ్రెస్ మంత్రి వర్గాలు ఏర్పడినప్పుడు నేను ముఖ్య మంత్రిగా ఉంటే రాష్ట్రానికి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదనే ఒక అభిప్రాయం వ్యక్తమయింది. నేను ఎంత త్యాగమైనా చేసి ప్రకాశంగారి నాయకత్వాన్నే బలపరుస్తాననీ, ఆయన కోరితే తప్ప నేను ముఖ్య మంత్రిత్వం స్వీకరించననీ, నేను ముఖ్య మంత్రిని కావాలని సూచించిన నాయకులందరికీ ఒక విధమైన కృతజ్ఞతా పూర్వక నమ్ర భావంతో స్పష్టంగా చెప్పాను. అ మాట నిలబెట్టుకుని, నాకు కొన్ని ప్రమాదాలు, కష్టాలూ ఎదురైనా చెదరిపోకుండా నిలబడి, ప్రకాశంగారు నాటి ఉమ్మడి చెన్నరాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నిక అవడానికి సాయపడ్డాను. అయితే, ఆ మంత్రివర్గం ఒక్క సంవత్సరంకన్న నిలవలేక పోయింది. తమ నాయకత్వంలో రెండవస్థానం నాది అని ఎప్పుడూ ప్రకాశంగారి విశ్వాసం. అ విశ్వాన్ని నిలుపుకోవడానికి నేను నా శక్తివంచన లేకుండా పనిచేస్తూ, ఆయన ఆశయాలను, ప్రభుత్వం నడపడంలో ఆయన విథానాలను బలపరుస్తూ ఉండేవాణ్ణి. వాస్తవంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ పిత అయిన ఆ మహానాయకునిపట్ల ఈ విధంగా, గాఢ కృతజ్ఞతాభావంతో నా ఋణం తీర్చుకున్నాననే సంతృప్తి నాకు ఉంది.
ప్రకాశంగారు ఎప్పుడూ దూరదృష్టిగల ప్రజానాయకుడు. సామాన్య ప్రజల సౌకర్యాలు, శ్రేయస్సు ఆయన నిరంతర ధ్యేయాలు. అందుకే, ప్రకాశంగారిపట్ల ఆయన జీవితం పొడుగునా ప్రజలు అపారమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించడంలో ఆశ్చర్యమేమి లేదు.
ప్రకాశంగారు తమ జీవిత కాలంలోనే భారత స్వాతంత్ర్యం సిద్ధించడం, సర్వతంత్ర స్వతంత్ర గణతంత్రంగా ప్రకటించటం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ప్రాప్తించటం-అన్నీ స్వయంగా చూసి, ఏళ్ళు నిండిన పండు వయస్సులో , పరిపూర్ణ గౌరవాలతో పరమపదించారు.
ప్రకాశంగారి నిర్భీకత, నిస్వార్థ త్యాగశీలం ఎప్పటికన్న ఎక్కువగా ఈనాడు మన దేశీయులకు అవశ్యక సుగుణాలు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర తరతరాలుగా మన యువజనులకు ఉత్తేజం కలిగించగల దనటంలో నా కేవిధమైన సందేహం లేదు.
రాష్ట్రపతి భవన్ 6-7-1972 |
(సం) వి. వి. గిరి భారత రాష్ట్రపతి |
ప్రకాశిక
ఆంధ్రకేసరి ప్రకాశంపంతులుగారు మహా పురుషులు. నూటికి కోటికి ఒక్కడుగ జన్మించే మహా మానవుల కోవలోని వారు ఆయన. ఈ సంవత్సరం ఆయన శతజయంతి ఉత్సవం దేశమంతటా వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ మహోత్సవ సందర్భంలో పంతులుగారి సమగ్ర జీవిత చరిత్ర ఆంధ్రులకు అందజేయ గలుగుతున్నందుకు ఆనందిస్తున్నాం.
ఇటీవలే, ఎమెస్కో పాకెట్ పుస్తక ప్రచురణలలో ద్విశతమానం (200) పూర్తిచేయ గలిగామని మా పాఠకులకు తెలుసు. ఈ విజయానికి కారకులైన మా పాఠకులను, ఈ పుస్తకాలు పంపకం చేసే మా ఏజెంట్లను ఈ సందర్భంలో మేము హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాము. కాగితము కొరత, కాగితపు ధరలతోపాటు ప్రచురణకు సంబంధించిన ఖర్చులన్నీ పెరిగిపోతూండటం, ఏమైనా ఈ పుస్తకాల వెలలు పెంచరాదన్న నియమం-మొదలైన ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఇంతవరకు ఈ ప్రచురణ కార్యక్రమాన్ని సాగించ గలగడానికి నిశ్చయంగా మా పాఠకుల, ఏజంట్ల ప్రోత్సాహాదరణలే కారణం.
ఎమెస్కో పోకెట్ పుస్తక పరంపరలో ఇంతవరకు ప్రచురిస్తూన్న నవలలు, కథలు, ఆధునిక సాహిత్యం లోను, కావ్యాలలోను ఎన్నికైన ప్రముఖ రచనల ఎమెస్కో ముద్రణలు, సంప్రదాయ సాహిత్యం వగైరాలతో పాటు మహాపురుషుల జీవిత చరిత్రలు కూడా ప్రచురించడం మంచిదని, ఆవశ్యకమనీ మిత్రులు, అభిమానులు కొంత కాలంగా మాకు చేస్తూ వచ్చిన సూచనను ఇప్పుడు కార్యరూపంలో పెట్ట గలుగుతున్నాం.
ఈ ఎమెస్కో చరిత్రల పరంపరలను ఆంధ్రమహానాయకులలో అగ్రగణ్యులైన ప్రకాశం పంతులుగారి ఆత్మకథ "నా జీవితయాత్ర"తో శుభారంభం చేయగలగటం అదృష్టం.
ప్రకాశం పంతులుగారు 1942 లో క్విట్టిండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వపు అతిథిగా కారగారవాసం చేస్తూన్న సమయంలో ఈ గ్రంథం రచించారు. అనంతరం 1945 లో ఆయన విడుదల అయి వచ్చి; 1946 లో చెన్నరాష్ట్ర, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయిన తరువాత ఈ ఆత్మకథలో ప్రథమఖండం మాత్రం 'శిల్పి' ప్రచురణల వారు ప్రకటించారు. మిగిలిన వ్రాతప్రతి యావత్తూ అచ్చు కాకుండా అలాగే ఉండిపోయింది. ఆ వ్రాతప్రతిని ఇప్పుడు మాకు అందించిన మిత్రులు శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావు (అద్దేపల్లి అండ్‌కో, సర్వస్వతీ పవర్ ప్రెస్, రాజమహేంద్రవరం) గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
అయితే, పంతులుగారి "నా జీవితయాత్ర" రచన 1940 - 41 వరకు సాగిన చరిత్రతోనే ఆగిపోయింది. "మిగిలిన కథ నా స్నేహితులెవరైనా వ్రాసి పూర్తిచేస్తారు" అని పంతులుగారు 3 వ ఖండం చివర రాశారు. పంతులుగారి సంకల్పానుసారంగానే ఇప్పుడు ప్రకాశంగారి పరిశిష్ట జీవిత చరిత్ర రచించి ఈయవలసినదిగా మేము పంతులుగారి సన్నిహిత అనుచరులై, చిరకాలం ఆయనకు కుడిభుజంగా ప్రస్తుతిగన్న శ్రీ తెన్నేటి విశ్వనాథం గారిని కోరగా, వారు ఎంతో సంతోషంగా ఈ పనికి పూనుకుని, పంతులుగారి శేషరాజకీయ జీవిత విశేషాలే కాక, 1, 2, 3 ఖండాలలో పంతులుగారు వ్రాయకుండా వదలివేసిన 1937 లో చెన్నరాష్ట్ర మంత్రివర్గంలో ఉపనాయకులుగాను, రెవిన్యూ మంత్రిగాను పనిచేసిన కాలపు విశేషాలు వగైరాలు కూడా ఈ అనుబంధ సంపుటిలో అభివర్ణించారు. ఉత్సాహంతో, దీక్షగా, స్వల్పకాలంలో ఈ అనుబంధ సంపుటిని రచించి ఇచ్చిన శ్రీ తెన్నేటి విశ్వనాథం గారికి మా ధన్యవాదాలు.
ప్రకాశం శతజయంతి సందర్బంలో ఆ మహనీయుని సంస్మరణ చిహ్నంగా ఈ ప్రచురణను వెలువరించ దలచుకొన్నామని మా సంకల్పం తెలిపి ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రచించ వలసినదిగా పంతులుగారి ముఖ్యసహచరులైన రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిగారిని, ప్రస్తావనవ్రాయ వలసినదిగా ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి, విద్వాంసులూ అయిన శ్రీ పి. వి. నరసింహారావు గారిని మేము అర్థించగానే ఆ ప్రముఖ నాయకు లిద్దరూ ఈ ప్రయత్నానికి హర్షించి ఈ గ్రంథానికి పరిచయ వ్యాసాలు రచించి మాకు సకాలంలో అందజేసినందుకు వారికి మా కృతజ్ఞతా పూర్వక అభివందనములు.
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారి అమర స్మృతికి ఇది ఎమెస్కో అంజలి!
భవదీయులు,
యం. శేషాచలం అండ్ కో. |
ప్రస్తుతి
శ్రీయుతులు ఎం. శేషాచలం అండ్ కంపెనీ వారు కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి సమగ్ర జీవిత చరిత్రను నాలుగు సంపుటములుగా ప్రకటింప బూనుకొనుట ముదావహము.
మొదటి మూడు సంపుటములు ప్రకాశంగారు స్వయముగ రచించినవి. ఆ కథ 1940 - 41 వరకే సాగినది. అనంతర చరిత్రగల 'అనుబంధ సంపుటి' యను నాల్గవ సంపుటము పంతులుగారి సన్నిహిత అనుచరులగు శ్రీ తెన్నేటి విశ్వనాథముగారు రచించినది.
తెలుగు పాఠకులు హెచ్చుమంది ఈ సంపుటములను సంపాదించుకొని చదివి, ఇంటింట పదిల పరచుకొన గలుగుటకు అనువుగ ఒక్కొక్క సంపుటము వెల రూ. 2-50 లుగ నిర్ణయించిరి. ఆంధ్ర కేసరి శతజయంత్వుత్సవ పురస్కృతిగ ఈ గ్రంథమును ప్రకటించు చున్నందులకు ఈ ప్రకాశకులను నే నభినందించుచున్నాను.
తెలుగు మాటాడు ప్రజల ముఖ్య లక్షణములు ప్రకాశము పంతులుగారిలో పుంజీభవించినవి. రాజఠీవి గల పురుష సింహుడు ఆయన. పాత పద్దతులను అంటిపట్టుకొనని విప్లవవాది. ప్రాచీన దురాచార విరోధి. స్వాభావికముగ ఆయనది విప్లవ ప్రకృతి. 1953 లో ఆంధ్ర రాష్ట్రావతరము శుభసమయమున కారాగారములలో నుండిన బందీ లందరికి విమోచనము కలిగించుచు ఆయన చేసిన ఉత్తరువు చరిత్రాత్మకమైనది. ఆయనయెడల ప్రజల భక్తి విశ్వాసములు ఆయన వైయక్తిక గుణ వైభవ ప్రేరితములు. ఆయన పార్టీలు మారి నను, ఆయనపట్ల ప్రజల అభిమానమున కెన్నడు కొదువలేదు. రాజకీయ రంగమున హాలాహలమును మ్రింగి నిర్వికారముగ నిలిచిన సదాశివు డాయన. అది ప్రకాశంగారి విశిష్టత. ఉదాత్తత, ఔదార్యము గూడు కట్టుకొనిన స్వర్ణహృదయ మాయనది. ఆయన పటిమ సాటిలేనిది. మన రాజకీయ రంగమున ఆయనదొక మహామానవ పాత్ర. బహుముఖ వైభవోజ్జ్వలమైన జీవిత మది. హిమాలయమువలె అత్యున్నతమైన, అతి గంభీరమైన, అక్షయ క్షమాపూర్ణమైన మహౌదార్య మూర్తి అయన. ప్రకాశము ప్రజల ఆప్త బంధువు. ఆంధ్ర ప్రజానీకమున ఆయన పలుకుబడి, అఖిలభారతమున జవహర్‌లాల్ పలుకుబడితో పోలిక చెప్పదగినది.
మన ప్రియ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధిగారు ప్రకాశముగారిని "ఆధునికాంధ్ర ప్రదేశ పిత" అనియు, "మన జాతీయ ఉద్యమ ప్రముఖ నాయకులలో ఆయన ఒక" రనియు ప్రస్తుతించుట ఎంతయు సముచితముగ నున్నది. పేరునకు దగినట్లు ప్రకాశము ఆంధ్ర దిక్చక్రమున అనుపమోజ్జ్వల తారగ ప్రకాశించెను. ఆయన ఎల్లప్పుడు క్రొత్తబాటలనే తీర్చుకొనుచుండెను. ప్రజల భక్తి విశ్వాసములపై ఆయనకు గల ప్రభుత్వము గాఢమైనది, అగాధమైనది. కనుకనే ఆయనను గూర్చిన విమర్శను లేశమైనను ప్రజలు సహింపకుండిరి. స్వాతంత్ర్యము కొరకు ఆయన చేసిన త్యాగము మహనీయమైన దగుటచే, ప్రజలాయన లోపముల నెన్న నిరాకరించిరి. 1952 లో చెన్నరాష్ట్ర ఉభయ శాసన సభల సంయుక్త సమావేశమున ఉపన్యసించుటకు గవర్నరు అధికారమును ఆయన సవాలుచేయుట పెద్ద సంచలనము కలిగించినది. నాటి మంత్రులపై ఆయన తెచ్చిన అభియోగ ములను వివరించుచు శాసన సభలో ఆయన మూడు దినములు వరుసగ నుపన్యసించుట అది ఒక కొత్త రికార్డు. 1953 లో ప్రత్యేకాంధ్రరాష్ట్రము ఏర్పడినప్పుడు ప్రకాశము పంతులుగారే ప్రథమాంధ్ర ముఖ్యమంత్రిగ నుండవలెనని సూచించుటతో నెహ్రూజీ ప్రకాశముగారికి రాజకీయ చరిత్రలో నెందును కని విని యెరుగని సత్కారము చేసిరి. నిజమునకు ఆనాడు ప్రకాశము గారు ఏ రాజకీయ పక్షమునకు చెందిన వారు కారు. సంఖ్యాధిక్యముగల పక్షమునకు ఆయన నాయకుడు కారు. ఆయన రాజకీయ స్థాయికి, స్వాతంత్ర్యముకొరకు ఆయన చేసిన అనుపమ త్యాగమునకు కృతజ్ఞతా ప్రకటన మది. ప్రకాశము తెలుగు ప్రజల స్వతస్సిద్ద నాయకుడు. ఆయన ప్రజల మనిషి. నిత్యము ప్రజల నాడిని పట్టి చూచుచు, వారికి హితవైన కార్యములనే ఆయన చేపట్టు చుండెను.
ప్రకాశము పంతులుగారి స్వస్థలము ఒంగోలు. ఒంగోలు కేంద్రముగ ప్రత్యేకముగ ఒక జిల్లాను ఏర్పరుప వలెనని ఆయన చిరసంకల్పము. ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ఆ సంకల్పమును సఫలము చేయుటయే కాక, దివంగతుడైన ఆ మహానాయకుని యెడ కృతజ్ఞతా సంస్మృతి చిహ్నముగ దానికి "ప్రకాశము జిల్లా" యని నామకరణము చేసినది. ప్రకాశము మిగుల దూరదృష్టిగల నేత. ఆయన ప్రవేశపెట్టిన ఫిర్కా డెవలెప్మెంట్ కార్యక్రమమును ఆనాడు చాలామంది అపార్థము చేసికొనిరి. కాని, అదియే నేటి మన పంచాయతి రాజ్య ప్రణాళికకు మార్గదర్శి అయి, అందరికి కనువిప్పు కలిగించినది. జమీందారీల రద్దు ప్రణాళిక ప్రకాశ కర్తృకము. పేద ప్రజల సంక్షేమమే సదా ప్రకాశముగారి ప్రధానాశయముగ నుండెను. తెలుగు జాతి ఆశయాదర్శములకు రూపు కట్టిన ఉజ్జ్వలమూర్తి, తెలుగు జాతియతకు ప్రతీక, ఆంధ్ర ప్రదేశ నిర్మాత, నవీనాంధ్ర పిత - ప్రకాశము పంతులుగారు. యావదాంధ్ర దేశముతో, అందలి మూల మూలల గ్రామములతో, గూడెములతో, ముఖ్యముగ అందలి బహు వర్గముల ప్రజలతో అంత విస్తృత పరిచయముగల నాయకుడు బహుశ: మరొకడు లేడు. దారిద్ర్యమును, అవిద్యను, మూఢ విశ్వాసములను రూపుమాపవలెనను ఆయన ఆశయ సిద్ధికి దీక్షతో కృషిసేయు సజీవాంధ్ర స్త్రీ పురుష ప్రజానీకమే ఆ మహానాయకునికి ఉత్తమ స్మారక చిహ్నము. అన్యస్మారక చిహ్నమేదియు ఆయనకు అంత సంతృప్తి కల్గింపజాలదు.
హైదారాబాదు, 12-6-72. |
(సం.) పి. వి. నరసింహారావు |
'నా జీవితయాత్ర' ప్రథమ ఖండము
ప్రథమ ముద్రణ (1946)కు
శ్రీ తల్లావఝల శివశంకరశాస్త్రి
పరిచయము
అమెరికా దేశీయుడు ఒకడు స్వీయచరిత్రకు Education అని పేరు పెట్టినాడు. ఆంగ్లేయ స్త్రీ My Apprenticeship అనీ, ఐర్ దేశీయుడు Summing up అనీ తమ చరిత్రలకు నామములుంచి నారు. వారి ఉద్దేశానుసారముగా ఆ నామకరణము అనుగుణమైనది. మన నాయకుడు ఆంధ్రకేసరి పూజ్యశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు "నా జీవితయాత్ర" అని స్వీయచరిత్రకు పేరు పెట్టడమువల్ల జీవితాన్ని యాత్రగా భావించినట్టు కనిపిస్తున్నది. ఒక దృష్టితో చూస్తే జీవితము యాత్రాప్రాయమే. కొందరు యాత్రికులు లక్ష్య శుద్ధితో బయలుదేరి గమ్యస్థానము చేరుతారు. చాలమంది యాత్రచేస్తూ అవాంతర విషయాలలో అడుగు పెట్టడమూ, కొంత దూరము పోవడమూ, పక్కకు తిరగడమూ, కడకు గమ్యస్థానము చేరడమూ సంభవిస్తుంది. ప్రకాశం పంతులు ద్వితీయ శ్రేణిలో చేరిన యాత్రికుడు. నలుగురితో పాటు జీవయాత్ర ప్రారంభము చేసినప్పటికీ క్రమేణ నాయకుడై ఆఖరుకు ఆంధ్రకేసరి అయినాడు.
పూవు పుట్టగానే పరిమళము అన్నట్టు పంతులు బాల్యమునుంచీ ప్రముఖుడే. పల్లెపట్టున గాని, పట్టణాలలో గాని, ప్రధాన నగరములో గాని, చివరకు పరదేశములో గాని ఆయన ప్రాముఖ్యము ఎప్పుడూ ప్రకట మవుతూనే ఉన్నది. సహజముగానే దృఢగాత్రు డైన వానికి బుద్ధివైభవము తో డైనప్పుడు ప్రాముఖ్యము కలగక తప్పదు. కృష్ణానదికి దక్షిణమున రాతి భూమిలో పుట్టుక, సావాసగాండ్లతో సాము గరిడీలు, స్వచ్ఛందవృత్తి, అనూచాన సంపదను బట్టి ఆరువేల నియోగికి సంక్రమించే సహజదర్పము, ప్రథమములో సౌఖ్యము, అనంతరము అర్థనాశము, అధిక కష్టములు, ఆత్మోద్ధరణ వాంఛ - ఇవి అన్నీ కదంబ ప్రాయము అయి పంతులు అద్భుత వ్యక్తి అయినాడు. దు:ఖాభి భూతుడు కానివాడు ధీరుడు కాలేడు. ఆదినుంచి నేటివరకు ఆంధ్ర కేసరికి వివిధ వ్యథలు కలుగుచునే ఉన్నవి. అందుచేతనే అంతటి ద్రఢిమ ఏర్పడి అంతరాయములలో ఆయన ప్రముఖుడే కాని, పరాఙ్ముఖుడు కావడము లేదు.
మొన్న మొన్నటి వరకు ఆంధ్రుడికి సంపన్న న్యాయవాదే గణ్యుడు. అందుచేతనే ఆనాడు పంతులు న్యాయవాద వృత్తిమీద మనసుపోయి మదరాసు లా కాలేజీలో చదవడమూ, రాజమహేంద్రవరములో వకీలుగా ఉండడమూ సంభవించినది. ఊర్ద్వదృష్టి ఉన్నవాడు ఊరుకో లేడు. ఆయన ఉత్త ప్లీడరుగా ఉండక న్యాయ విద్యలో ప్రశస్తమైన బారిష్టరు పట్టము తెచ్చుకొని రాజధానికే పోయి నిరుత్సాహ చ్ఛాయ దగ్గరకు రానీయక ధైర్యముతో అడ్డంకులను అన్నిటినీ ప్రతిఘటించి అన్ని విధముల ప్రాభవము పొందినాడు. సడలని పట్టుదల వల్లనే జయము సమకూరుతున్నది.
అభిమానవంతుడు, ఆత్మోద్ధర ణాభిలాషి, అన్య జన లక్ష్యము లేనివాడు. అగ్రగణ్యుడు అయినప్పటికీ ప్రకాశ ప్రధాని బాల్యములో పడిన అవమానములు, అనుభవించిన కష్టములు, చేసిన చిలిపి పనులు, శృంగార చేష్టలు దాచిపెట్టకుండా నిజముగా ఉద్ఘాటించి నాడు. సహజముగా స్వచ్ఛ బుద్ధి కలవారు, ధైర్యస్థైర్యములు ఉన్నవారూ ఉన్నది ఉన్నట్టుగా సత్యము చెప్పగలరు. పంతులు ప్రకటము చేసిన విషయములు ఆయనమీద ఆదరము కలిగించడమే కాక, అన్యులకు ఆదర్శము కూడా అవుతవి. కృతజ్ఞతా మాధుర్యము "జీవిత యాత్ర"లో చాలా తావుల వెల్లివిరిసింది. ప్రత్యుపకార పరిమళము బహుస్థానాలలో వాసించినది. పురుష పుంగవము ఆత్మ లాభముతో సంతుష్టి చెందక అన్య క్షేమము ఆకాంక్షిస్తుంది. ఉత్తముడు దేశ సౌభాగ్యము కోసము నిజశక్తులు వినియోగిస్తాడు. దేశసేవ వివిధ విదాల జరుగుతుంది. ఉత్తేజకములైన ఉపన్యాసములవల్ల గాని, ఉత్తమ పత్రికా నిర్వహణమువల్ల గాని, ఉదారాచరణవల్ల గాని పురుషుడు కర్మవీరుడు కాగలుగుతాడు. పంతులు వీ టన్నిటిలో పరిశ్రమ చేసి కలికాప్రాయముగా అంతర్నిహితమైన దేశభక్తిని కమనీయ కుసుమముగా వికసింపజేసినాడు. మహాపురుషుల సాంగత్యమువల్లను, సహజ ప్రతిభవల్లను ఆంధ్రకేసరికి పంచాశద్వర్ష ప్రాంతములో జీవ యాత్రలో లక్ష్యము గోచరించింది.
ఈ గ్రంథములో వివృతమైన వ్యక్తికీ, నాకు సుపరిచితమైన మూర్తికీ వ్యత్యాసము కనపడడము లేదు. ఆయన మాటల వలెనే ఇందులో పలుకులు కూడా తేటలు. రచన సానపెట్టిన రత్నమువలె రమణీయము. విస్తరించి విశేషములు చెప్పినట్లయితే మరింత దీప్తి కలిగేది తాత్పర్యార్థము తలపోసినట్ట యితే కథానాయకుడు ఆంధ్ర కేసరి అని అన్వర్థము అవుతుంది.
ఇతి శివమ్!
సాహితీ సమితి, తెనాలి, 1946 ఆగష్టు 20.. |
శివ శంకర శాస్త్రి |
బారిస్టరు శ్రీ ప్రకాశం పంతులు |
విషయసూచిక
మార్చునా జీవిత యాత్ర
ప్రథమ ఖండం
1 |
11 |
15 |
18 |
27 |
30 |
57 |
62 |
85 |
92 |
96 |
100 |
102 |
108 |
111 |
113 |
118 |
126 |
129 |
131 |
134 |
142 |
147 |
148 |
154 |
156 |
162 |
ఇతర సంపుటాలు
మార్చుThis work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.