నా జీవిత యాత్ర-1/కుటుంబ స్థితిగతులు
18
కుటుంబ స్థితిగతులు
నేను 1907 లో ఇంగ్లండునించి తిరిగి వచ్చి మద్రాసు చేరే సరికి, అప్పటి నా కుటుంబం స్థితి గతులూ, అనంతర పరిస్థితులూ కొంచెం వ్రాస్తాను. నాకు అప్పటికి సంతానం లేదు. నా కోసం ఎంతో శ్రమించిన మా అమ్మగారికి అది ఒక పెద్ద ఆదుర్దాకి కారణం అయింది. అప్పట్లో స్త్రీ చాపల్యంవల్ల నా సంసార జీవితంలో నాకు సౌఖ్యం లేదనే చెప్పవలసి ఉంటుంది. తత్పలితంగా నా భార్యకి అనారోగ్యం కలిగింది. ఆ రోజుల్లోనే నాకు తొట్టి వైద్యం అంటే బాగా గురి కుదిరింది. అందుచేత అప్పటికి ఆ వైద్యాన్ని గురించి కృషిచేసిన ద్రోణంరాజు వెంకట రమణారావుగారి దగ్గిర ఆ విషయమైన భోగట్టాలన్నీ తెలుసుకుని, నేనూ నా భార్యకూడా తొట్టి వైద్యం ప్రారంభించాము.
తరవాత ఇంగ్లండునించి తిరిగి వచ్చి మద్రాసులో కొండిచెట్టి వీథిలో ఉన్నప్పుడు కూడా ఆ వైద్యమే నమ్ముకున్నాను. నేను ఇంగ్లండు నించి వచ్చిన కొద్ది కాలానికే నా భార్య గర్భవతి అయింది. అప్పటి వరకూ జీవించి ఉన్న మా అమ్మగారు ఆ వార్తకి చాలా సంతోషించింది. ఆవిడకి లోకంతోపాటే మనమల్ని ఎత్తుకోవాలని ఆశ. కాని ఆ సంతోషానికి ఆవిడ నోచుకోలేదు. కొండిచెట్టి వీథిలో ఉండగానే ఆమె పక్షవాతంవల్ల మరణించింది. అప్పటికి ఆమె వయస్సు 60.
చనిపోయేటప్పుడు ఆమె నన్ను పిలిచి తను చిరకాలం కిందటనించీ జాగ్రత్తగా దాచి ఉంచుకున్న 800 రూపాయలమూటా నాకు అప్పగించింది. ఆమె అతిప్రయాసం మీద నన్ను, నా తమ్ముల్ని వృద్ధిలోకి తీసుకురావడమే కాకుండా ఈ రీతిగా ధనం సేకరించి నాకు అప్పచెప్పడం చాలా ఆశ్చర్యకరమయిన విషయం! ఆమె పడ్డ శ్రమకి ఆమె ఋణం తీర్చుకుందాం అంటే ఆఖరికి అంత్యక్రియలలోనైనా ఆ అవకాశం లభించింది కాదు. ఆమె ధన్యాత్మురాలు.
తరవాత మేము కొండిచెట్టి వీథినించి శుంకురామచెట్టి వీథిలోని జి. ఏ. నటేశను ఇంటిలోకి మారాము. అప్పుడే నాకు ప్రథమ పురుష సంతానం కలిగింది. కాని ప్రసవ సమయంలో ఫోర్‌సెఫ్స్ ఉపయోగించ వలసివచ్చింది. ఆ ఉపయోగించడంలో జరిగిన ప్రమాదంవల్ల ఆ కుర్రవాడు రెండు సంవత్సరాలు జీవించి చనిపోయాడు. మళ్ళీ రెండోసారి ప్రసవ సమయానికి నేను శాంతోమ్‌లోని సీవ్యూ అనే భవనం ఒకటి అద్దెకి తీసుకుని అందులోకి మారాను. మళ్ళీ నాకు మగపిల్లవాడు కలిగాడు. మరి ఒకటిన్నర సంవత్సరాలకి రెండో కుమారుడు జన్మించాడు. నేను అప్పటికే మదరాసులోని ఎల్లపదుమాడకోవెల వీథిలో ఉన్న ఇల్లు కొన్నాను. నెలకి నూరు రూపాయలు అద్దె యివ్వడంకన్న ఒక ఇల్లు ఉంటే మంచిదనే ఆలోచన కలిగింది. కాని నా దగ్గిర డబ్బు నిలవ ఉండే పద్ధతి లేదు. అప్పుడే నా మిత్రుడు కె. యస్. రామచంద్రరావు ఆరువేల రూపాయలు ఇచ్చి అ యిల్లు నాకోసం కొన్నాడు. అది సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో ఉంది. ఆ ఇల్లు అంతా నేను తరవాత వృద్ధిచేసి కట్టినదే. ఆ తరవాత, చాలాకాలానికి నేను వడ్డీ తోనూ, అద్దెతోనూ రామచంద్రరావుగారికి సుమారు ఇరవైవేలు తిరిగి ఇచ్చి ఆ ఇల్లు పూర్తిగా నాపేర స్వాధీన పరుచుకున్నాను.
నా పెద్ద తమ్ముడు శ్రీరాములు చిన్నప్పటినించీ కొంచెం నెమ్మదైనవాడు. అతను ఒంగోలులో హైస్కూలు చదువు చదివాడు. అప్పుడు కొంచెం పేకాట దృష్టిలో పడి మెట్రిక్యులేషన్ రెండుసార్లు తప్పాడు. నేను రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు పెట్టిన తరవాత రాజమహేంద్రవరం వచ్చాడు. అక్కడ యఫ్. ఏ. చదివి; మద్రాసులో క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ. చదివాడు. యఫ్. ఏ. దగ్గిరనించి చురుగ్గా చదివి డిగ్రీపొందిన తరవాత ఫస్టుగ్రేడు పాసయి రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు చేశాడు. అతని అభిమాన విద్య వేదాంతం. క్రిస్టియన్ కాలేజీలో స్కిన్నర్‌వద్ద ఫిలాసఫీ చదువుకున్న రోజుల్లో అతను క్రైస్తవ సిద్ధాంతంలోకి మారాడు. అతను చదువుకున్న వేదాంతం కేవలం పుస్తకాలతో అంతం కానియ్యకుండా ఆచరణలో కూడా పెట్టేవాడు. కొంతకాలం నా దగ్గిరే ప్రాక్టీసు చేశాడు. తరవాత కొంతకాలం అత్తవారి ఊరు అయిన కాకినాడలో ప్రాక్టీసుచేసి, మళ్ళీ రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అతను రాజమహేంద్రవరంలో ప్రాక్టీసుచేసే రోజుల్లో మంచి బుద్ధి సూక్ష్మతా, వాదనా శక్తీ చూపించాడు. కాని, కేసుల్లో ఏమాత్ర న్యాయమూ, సత్యమూ లేకపోయినా వాటిని నిరాకరించడంవల్ల అంతగా ప్రయోజకుడు కాలేకపోయాడు.
ఒకసారి నేను ఊళ్ళో లేనప్పుడు ఒక ప్రముఖుడైన క్లయంటు అతని దగ్గిరికి వచ్చి ఒక కేసులో సాక్షులు ఏమి చెప్పాలో కొంచెం ముందుగా చెప్పించమని అడిగాడు. వెంటనే అతను, "అది నా పనికాదు, నేను సాక్షుల్ని తయారుచేసే ప్లీడర్ని కాను," అన్నాడు. అదీ అతని తరహా! అతను సంఘ సంస్కా రాందోళన రోజుల్లో వీరేశలింగంగారి శిష్యుడు అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనకి ముఖ్యులైన వాళ్ళలో ఒకడుగా ఉండేవాడు. కాని తరవాత ఆయనతో తగాదాలు పడిన వాళ్ళలో అగ్రగణ్యుడు అయ్యాడు! అతనికి పత్రికా రచన అంటే ఇష్టం. అప్పుడే 'కార్లీ లియను' అనే పత్రిక ఒకటి నడిపించేవాడు. ఆ కార్లీలియను పత్రికలో భయం అనేది లేకుండా మంచి జోరుగా వ్రాసేవాడు. ఆ పత్రిక అప్పటి ప్రజా జీవితంలో ఉండే వాళ్ళకి గుండె బెదురుగా ఉండేది. అతను తెలుగులో వివేకవర్దని, ఇంగ్లీషులో కార్లీ లియను నడిపేవాడు. నేను మద్రాసులో ప్రాక్టీసు పెట్టిన 5, 6 సంవత్సరాలకి కాబోలు, ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నాడు.