నా జీవిత యాత్ర-1/కలకత్తా కాంగ్రెస్ (1917)
25
కలకత్తా కాంగ్రెస్ (1917)
కలకత్తాలో 1917 లో బిసెంటమ్మ అధ్యక్షతకింద జరిగిన కాంగ్రెస్‌కి నేనూ హాజరు అయ్యాను. ఆ సంవత్సరంలో బిసెంటమ్మ చేసిన ఆందోళనా, తత్ఫలితంగా ఆమెకి ఇచ్చిన మన్నింపూ ఏకమై ప్రజలలో ఆమెకి ఉన్న పలుకుబడి బాగా వృద్ధి చేశాయి. తత్ఫలితంగా ప్రజల చేతిలో ఉన్న మహత్తర పదవి అయిన కాంగ్రెస్ అధ్యక్షత ఆమెకి లభించింది. బిసెంటమ్మ రాజకీయ తీవ్రత ఆమె విడుదలతోనే కొంచెం మార్పు చెందిందని అనేవారు. తరవాత విషయాలని బట్టి చూస్తే ఆ సంగతి నిర్ధారణ అయింది.
చిత్తరంజన్‌దాస్ కలకత్తా కాంగ్రెసునాటికి బాగా రాజకీయాల్లో ప్రవేశించాడు. యువకుల్లో ఆయనకి బాగా పలుకుబడి ఉండేది. అంత వరకూ విఖ్యాతి వహించిన సురేంధ్రనాథ్‌బెనర్జీ మెల్లిగా వెనకబడ్డం ప్రారంభించాడు. కలకత్తాలో జాతీ యోద్వేగమే బాగా ప్రస్ఫుటం అయింది. ఆనాడు లోకమాన్యుడికి జరిగిన సమ్మానం కాంగ్రెస్ చరిత్రలో అపూర్వమైనది. జాతీయవాంఛ అయిన స్వరాజ్యంకోసం ప్రజలలో ఆవేశం ఎంత హెచ్చయిందంటే - ఆ సమయంలో మితవాద ప్రముఖుడై, బెంగాలులో ఒకప్పుడు అడ్డులేని నాయకత్వం వహించిన సురేంద్రనాథ బెనర్జీ మాట వినేవాళ్ళు కూడా లేకపోయారు.
కలకత్తా మహాసభకి మోహన్‌దాస్ గాంధీ హాజరు అయ్యాడు. దక్షిణాఫ్రికా సత్యాగ్రహ విజయానంతరం గాంధీ స్మట్సు రాజీ అయిన తరవాత. గాంధీ విజేత అయి ఈ దేశానికి వచ్చాడు. ఆయన లక్నో కాంగ్రెస్‌లో ఏ ప్రముఖస్థానమూ ఆక్రమించలేదు. విషయనిర్ధారణ సభా సభ్యత్వానికి జరిగిన పోటీలో ఓడిపోయినా, లోకమాన్యుడు ఆయన్ని గెల్పించాడు. ఆయన కలకత్తాలో గుడ్డ బొందుల చొక్కా వేసుకుని, ఫర్తు గుజరాతీ తలపాగాతో వేదికమీద కూర్చున్నాడు. అంతకిపూర్వం వెస్టు మినిష్టరు పాలెస్ హోటల్లో ఆయన్ని చూసిన నాకు ఈ అవతారం ఆశ్చర్యం కలిగించింది. ఆయన కప్పటికీ ఉపన్యాస ధోరణి కూడా బాగా లేదు. నెమ్మదిగా వినిపించీ వినిపించనట్లు మాట్లాడేవాడు. రాజకీయాల్లో అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాల్ని గురించి అపూర్వమైన ప్రచారం ప్రారంభించినా, వంగదేశంలోని విప్లవవాదులు మహత్తరమైన దేశభక్తులే అనీ, కాని వారి దేశభక్తి వక్రమార్గం పట్టిందనీ బహిరంగంగా చాటగలిగాడు.
అందుచేతనే బిసెంటు ప్రభృతులికి కొంత ఆగ్రహం కూడా వచ్చింది. ఆయన అప్పటినించే భారత రాజకీయాల్లో కాలు నిలవదొక్కుకోడానికి ప్రారంభించాడు. కాని, ఆయన అచిరకాలంలోనే దేశంలో ఇంత ఆవేశం రేకేతిస్తాడనిగాని, వేలకివేల ప్రజల్ని ఈ మహా యజ్ఞంలో ఆహుతి చేయగలుతాడని ఎవరూ అనుకోలేదు. గుజరాతులోనూ, బీహారులోనూ ఆయన ధైర్యం వహించి నడిపించిన సత్యాగ్రహపోరాటాలు సుప్రసిద్ధాలే! ఆ విజయాలు కూడా ఆయనకి తోడ్పడ్డాయి. ఎంతయినా ఆర్భాటంలేని మనిషి అవడంచేత, ఆయన వచ్చిందీ, పోయిందీ కూడా ఎవరూ కనిపెట్టలేక పోయేవారు.
నా మిత్రుడు దేశబంధుదాసు సంగతి కొద్దిగా ఇదివరకు వ్రాశాను. ఆయల లక్షలు ఆర్జించి, వెచ్చించి, బాగా పలుకుబడి సంపాదించాడు. ఆయన జీవితపద్ధతి అంతా పూర్తిగా ఆంగ్లానుకరణంగా ఉండేది. బిసెంటు తన అధ్యక్షోపన్యాసంలో, "మీరు నన్ను సైన్యాధిపతిగా ఎన్నుకున్నారు కనక, నా ఆజ్ఞలు శిరసావహించవలసిందే!" అని గర్జించింది. ఆ మాటలకి దాసు, బిపిన్‌చంద్రపాలూ కూడా కొంచెం కటకటపడ్డారు. దాసు నాతో "చూడండి! ఆమె అహంకారం! ప్రజాస్వామిక సంఘంలో ఇదివరకు ఎవరు ఇల్లాగ అనగలిగారు!" అన్నాడు. నేను "ఆమె మన దగ్గిరనించి అట్టి శిక్షణ ఆశించడంలో తప్పేమిటి?" అన్నాను. కాని, దాసు ఆ అధికారపు అభిప్రాయానికి హర్షించలేదు. దానికి కారణాలని గురించి తర్జనభర్జన చెయ్యడంకంటె, ఆయన మనస్తత్వం అల్లాంటిది అని అనుకోవడం మంచిది. అంతేకాదు; నాయకత్వం కోసం అంచనాలు వేసే నాయకుల మనస్తత్వాలు అల్లాగే ఉంటాయి. అందులో అంతగా వైపరీత్యం కూడా లేదు. ఏ వృత్తి లోనైనా పోటీ చెయ్యడంకోసం ఎత్తుపై ఎత్తులు వెయ్యడం చూస్తూనే ఉన్నాంగదా! అది రాజకీయాల్లో మరీ ఎక్కువ. మహా నాయకులైనవారు ఆ సుడిగుండంలో పడిపోయినప్పుడు చూడడంలో మరీ విశేషం ఉంది!