నా జీవిత యాత్ర-1/రాజమహేంద్రవరం రాక

12

రాజమహేంద్రవరం రాక

అప్పటికి రాజమహేంద్రవరంలో వీరేశలింగంగారి ప్రభ బాగా వెలుగుతోంది. అప్పటికే సుబ్బారావుపంతులు ప్రభృతులు ఆయనకి విరోధులు అయ్యారు. వితంతు వివాహాలు ప్రోత్సహించిన సుబ్బారావు పంతులుగారు, తీరా తన తమ్ముడే కందుకూరివారి ప్రోత్సాహంచేత కొమ్మూరి నరసింహారావుగారి చెల్లెల్ని వివాహమాడేసరికి, పంతులు గారికి ఎదురు తిరిగి హిందూసమాజం స్థాపించారు. నూతన వైష్ణవానికి పంగనామాలు పెద్దన్నట్లు పంతులుగారి సనాతన హిందూధర్మం చాలా కరుడు గట్టింది. చివరికి ఆ సనాతన ధర్మం అంతా భయంకరంగా నా మీదికి తిరిగింది.

నేను ఇంగ్లండునించి వచ్చాక ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కాని ఇంట్లో కలవడానికి వీలులేదన్నారు. నేను దానికి వల్లకాదన్నాను. మా తమ్ముడు శ్రీరాములు అప్పుడు వీరేశలింగంగారి శిష్యులలో ముఖ్యుడు. అతను ముందే వద్దని పట్టుపడ్డాడు. కందుకూరి వెంకటరత్నం, దామెర్ల రమణారావు ప్రభృతులు కూడా వద్దనే వాళ్ళలోవాళ్ళే, కొందరు మిత్రులు నేను తిరిగి వచ్చిన కొత్తరికంలో విందులు చేశారు. ఆ విందులో పాల్గొన్నవా ళ్ళందరికీ సంఘబహిష్కారం అన్నారు. ఈ బహిష్కారం గందరగోళంవల్ల నేను ఎక్కడ లొంగిపోతానో అని వీరేశలింగంగారికి బాగా ఆత్రతగా ఉండేది. అందుచేత ఆయన ఒకసారి నేను ధార్వాడ కృష్ణారావుగారి ఇంట్లో కూర్చుని ఉండగా వచ్చి నన్ను హెచ్చరించిపోయారు. బహిష్కరణ వాదులంతా ఒక సభ చేసి, నా విషయము, నాతో భోజనం చేసిన ఇతరుల విషయమూ గుదిగుచ్చి, శంకర పీఠాధిపతులైన రాణీచయనులు స్వాములవారికి ఫిర్యాదు చేశారు.

దానిమీద ఆయన నాకు ఒక రిజిస్టరు నోటీసు పంపించారు. సముద్ర యానం హిందూ మతానికి విరుద్దం కనక, తగిన ప్రాయశ్చిత్తం లేనిదే హిందూ సంఘంలో కలవ కూడదనీ, వెంటనే తన ఎదట హాజరు కమ్మనీ నా కొక తాఖీదు ఇచ్చారు. దానికి వెంటనే నేను జవాబు ఇచ్చాను. గత 25 సంవత్సరాలనించీ ఆయన్ని ఎప్పుడూ మేము ఎరగమనీ, మా పెద్దలు అయినా ఆయన అధికారాన్ని ఎప్పుడూ అంగీకరించలేదనీ, నా కల్లాంటి తాఖీదు ఇవ్వడానికి ఆయనకి అధికారం లేదనీ వ్రాసి పంపించాను. అ బహిష్కారపు గందరగోళం ఒక పెద్ద ఆందోళనకి కారణం అయింది. నేను మళ్ళీ అక్టోబరునెలలో లండన్ వెళ్ళిపోయాక సుబ్బారావుపంతులు ప్రభృతుల ప్రోత్సాహంవల్ల స్వాములవారు రాజమహేంద్రవరం వచ్చారు. ఆయన్ని ఏనుగుమీద ఊరేగించి మార్కండేయస్వామి గుడిలో ఒక పెద్ద సభ చేశారు.

ఆ సభలో నా విషయమూ, నాతో విందు ఆరగించినవారి విషయమూ తీర్పు చెయ్యడానికి ఉపక్రమిస్తూ ఉండగా, కొండేపూడి భద్రిరాజు ప్రభృతులు లోపలికి వెళ్ళి స్వాములవారిని అడ్డుప్రశ్నలు వెయ్యడం లంకించుకున్నారు. "స్వామీ! తమ రెన్నడూ రాజమహేంద్రవరం రాలేదే! ఇప్పుడు తమర్ని ఎవరు రమ్మన్నారు? ఏమిటి సమాచారం? ఈ వ్యవహారమంతా ఏమిటి?" అని ప్రశ్నలు వేస్తూ ఆయన గౌరవార్థం వెలిగించిన దీపాలు ఊదివెయ్యడం ఆరంభించారు. దాంతో స్వాములవారు కంగారుపడి పావుకోళ్ళు చేత్తో పట్టుకుని, "బ్రతుకు జీవుడా!" అని పలాయనం చిత్తగించారు. ఈ విషయం అంతా వివేకవర్థనిలో ప్రచురించబడింది. నేను లండన్‌లో ఉండగా వీరేశలింగంగారు నాకు ఈ పేపరు కటింగు పంపించారు.

నేను జూలై, అక్టోబరు నెలలకి మధ్య రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రాక్టీసు చేశాను. ముఖ్యంగా పోతునూరు కేసు నాకు పూర్తిగా పని చెప్పింది. పోతునూరులో చెలసాని పట్టాభిరామయ్యగారి భార్య రామమ్మగారిమీద (మాగంటి బాపినీడు అక్కగారు), దాయాదులు ఆస్తి జబర్‌దస్తీగా స్వాధీనపరుచుకున్నారని నేరం మోపి క్రిమినల్ ప్రొసీజరుకోడు 145 సెక్షను ప్రకారం చార్జీ ఇచ్చారు. నేను ఇంగ్లండు వెళ్ళబోయే టప్పటికి అ కేసు ఆరంభం అయింది. అది నేను తిరిగి వచ్చేవరకూ నడుస్తూనే ఉంది. అవతల పార్టీవాళ్ళు డాక్టర్ స్వామినాధన్‌ని తీసుకువచ్చి కేసు నడిపిస్తున్నారు. నేను తిరిగి వచ్చాక అ కేసులో స్వామినాధన్‌కి వ్యతిరేకంగా పనిచేసి కొట్టివేయించాను. తరవాత అది సివిల్‌కేసుగా పరిణమించింది. నేను ఆ కేసులో ప్లెయింటు దాఖలుచేసి మళ్ళీ ఇంగ్లండు వెళ్ళిపోయాను. ఆ కేసు 5, 6, సంవత్సరాలపాటు కిందుమీదులు పడి చివరికి ఆమె పక్షం అయింది. మొట్టమొదట ఆమెదగ్గిర కేసు ఖర్చులికి కూడా డబ్బు లేకుండా ఉన్న రోజుల్లో నేను ఆ కేసు పట్టి పనిచేశాను. ఆ ఆస్తి సుమారు పది లక్షల రూపాయల విలువగలది. ఆస్తి ఆమె స్వాధీనం అయ్యాక ఆమె నాకు 70 వేల రూపాయల ఫీజు ఒక్కసారిగా ఇచ్చింది.