పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/సర్పరూపి శాపవిమోచనము
తెభా-10.1-1113-వ.
అంత నొక్కనాడు నందాదులైన గోపకు లంబికావనంబునకు శకటంబు లెక్కి జాతరకుం జని సరస్వతీనదీజలంబుల స్నానంబులు చేసి, యుమామహేశ్వరుల నర్చించి కానికలిచ్చి బ్రాహ్మణులకు గో హిరణ్య వస్త్రాన్న దానంబు లొసంగి, జలప్రాశనంబు చేసి, నియమంబున నుండ దైవయోగంబున నాఁకొని యొక్క మహోరగంబు నిదురబోయిన నందునిం గఱచి మ్రింగ నగ్గలింప నతఁడు "కృష్ణకృష్ణేతి"వచనంబులం దన్ను విడిపింపు మని మొఱయిడిన విని.
టీక:- అంతన్ = ఆ తరువాత; ఒక్కనాడు = ఒక రోజున; నంద = నందుడు; ఆదులు = మొదలగువారు; ఐన = అయిన; గోపకులు = యాదవులు; అంబికా = అంబిక అనెడి; వనంబున్ = అడవి; కున్ = కి; శకటంబులు = బళ్ళు; ఎక్కి = ఎక్కి; జాతర = ఉత్సవము చేసికొనుట; కున్ = కు; చని = వెళ్ళి; సరస్వతీ = సరస్వతి అనెడి; నదీ = నది యొక్క; జలంబులన్ = నీటి యందు; స్నానంబులు = స్నానములు; చేసి = చేసికొని; ఉమామహేశ్వరులన్ = పార్వతీపరమేశ్వరులను; అర్చించి = పూజించి; కానికలు = కానుకలు, దక్షిణలు; ఇచ్చి = చెల్లించి; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; వస్త్ర = బట్టలు; అన్న = అన్నములను; దానంబులు = దానములుగా; ఒసంగి = ఇచ్చి; జలప్రాశనంబు = ఉపవాసవిశేషము {జలప్రాశనంబు - నీరుమాత్రమే ఆహారముగా తీసుకొని ఉపవాసముండుట}; చేసి = చేసి; నియమంబునన్ = వ్రతనిష్ఠలో; ఉండన్ = ఉండగా; దైవయోగంబున = దైవికముగా; ఆకొని = ఆకలివేసి; ఒక్క = ఒకానొక; మహా = పెద్ద; ఉరగంబు = పాము; నిదురబోయిన = నిద్రపోతున్న; నందునిన్ = నందుడిని; కఱచి = కరిచి; మ్రింగన్ = మింగివేయుటకు; అగ్గలింపన్ = ప్రయత్నించుచుండగా; అతడు = అతను; కృష్ణకృష్ణ = కృష్ణా కృష్ణా; ఇతి = అనెడి; వచనంబులన్ = మాటలతో; తన్ను = తనను; విడిపింపుము = విడిపించుము; అని = అని; మొఱయిడినన్ = మొరపెట్టగా; విని = విని.
భావము:- అటుపిమ్మట ఒక రోజు నందుడు మొదలగు యాదవులు పశుపతి జాతర కోసం ఎడ్లబండ్లు ఎక్కి అంబికావనానికి వెళ్ళారు. వారక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి పార్వతీపరమేశ్వరులను పూజించి, కానుకలు అర్పించారు. విప్రులకు గోవులు, బంగారము, వస్త్రాలు, అన్నమూ దానాలు చేసారు. తాము నీరు మాత్రమే పుచ్చుకుని నియమంతో ఉన్నారు. అప్పుడు ఆకలితో ఉన్న ఒక మహాసర్పం దైవికంగా నిద్రపోతున్న నందుణ్ణి చుట్టిపట్టి మ్రింగడానికి ప్రయత్నించింది. అతడు “కృష్ణా! కృష్ణా! నన్ను విడిపించు” అని మొరపెట్టుకున్నాడు. ఆయన ఆక్రందనలు గోపకులు అందరూ విన్నారు.
తెభా-10.1-1114-క.
గోపకు లందఱు మేల్కొని
కోపముతోఁ బెద్దగుదెలఁ గొఱవుల మొత్తన్
తాపము నొందియు వదలక
పాపపు పెనుబాము నందుఁ బట్టె నృపాలా!
టీక:- గోపకులు = గొల్లవారు; అందఱున్ = ఎల్లరు; మేల్కొని = నిద్రలేచి; కోపము = రోషము; తోన్ = తోటి; పెద్ద = పెద్ద; గుదెలన్ = దుడ్డుకఱ్ఱలతో; కొఱవులన్ = మండుతున్నకఱ్ఱలతో; మొత్తన్ = బాదగా; తాపమున్ = బాధ; ఒందియున్ = కలిగినను; వదలక = వదిలిపెట్టకుండ; పాపపు = పాపిష్టి; పెను = పెద్ద; పాము = పాము; నందున్ = నందుని; పట్టెన్ = పట్టుకొనెను; నృపాల = రాజా.
భావము:- రాజా! పరీక్షిత్తు! నందుని ఆర్తానాదాలు వినిన గొల్లలు అందరూ మేలుకున్నారు. వారికి కోపం వచ్చి దుడ్డుకఱ్ఱలతో ఆ పామును మోదసాగారు. కానీ ఆ మహాసర్పం, ఆ కఱ్ఱ దెబ్బలు తగిలి నెప్పెడుతున్నా నందమహారాజును విడువ లేదు.
తెభా-10.1-1115-వ.
అ య్యవసరంబునఁ గృష్ణుండు దర్పించి పాద తాడనంబు సేసి త్రొక్కిన సర్పంబు సర్పరూపంబు విడిచి విద్యాధరేంద్ర రూపంబుఁ దాల్చి హరికిఁ మ్రొక్కిన నతనికి హరి యిట్లనియె.
టీక:- ఆ = ఆ; అవసరంబున = సమయము నందు; కృష్ణుండు = కృష్ణుడు; దర్పించి = అహంకరించి; పాద = కాలితో; తాడనంబు = తన్నుట; చేసి = చేసి; త్రొక్కినన్ = తొక్కగా; సర్పంబు = పాము; సర్ప = పాము యొక్క; రూపంబున్ = ఆకృతిని; విడిచి = వదలి; విద్యాధర = విద్యాధరుల; ఇంద్ర = ప్రభువు; రూపంబున్ = ఆకృతిని; తాల్చి = ధరించి; హరి = కృష్ణున; కిన్ = కు; మ్రొక్కినన్ = నమస్కరించగా; అతని = అతని; కిన్ = ఉద్దేశించి; హరి = కృష్ణుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అంతట శ్రీకృష్ణుడు విజృంభించి ఆ సర్పాన్ని కాలితో త్రొక్కి ఒక్క తన్ను తన్నాడు. వెంటనే అది పాము రూపు వదలి విద్యాధర నాయక రూపం ధరించి మురళీమోహనునికి నమస్కరించింది. శ్రీహరి ఆ విద్యాధరుడితో ఇలా అన్నాడు.
తెభా-10.1-1116-ఉ.
"మండిత మూర్తితోఁ గనకమాలికతో శుభలక్షణుండవై
యుండెడు నీకు దుష్టపు మహోరగదేహ మిదేల వచ్చె? నె
వ్వండవు? నామ మెయ్యది? భవంబున కెద్ది మిషంబు? నాకునొం
డొండ యెఱుంగఁ జెప్పుము బుధోత్తమ! నీపని చోద్యమయ్యెడిన్."
టీక:- మండిత = అలంకరింపబడిన; మూర్తి = స్వరూపము; తోన్ = తోటి; కనక = బంగారపు; మాలిక = గొలుసు; తోన్ = తోటి; శుభ = మంచి; లక్షణుండవు = లక్షణములు కలవాడవు; ఐ = అయ్యి; ఉండెడు = ఉన్నట్టి; నీ = నీ; కున్ = కు; దుష్టపు = చెడ్డదైన; మహా = పెద్ద; ఉరగము = పాము యొక్క; దేహము = దేహము; ఇది = ఇలా; ఏల = ఎందుకు; వచ్చెన్ = వచ్చినది; ఎవ్వండవు = ఎవరివి (నీవు); నామము = పేరు; ఎయ్యది = ఏమిటి; భవంబున్ = ఇలా జన్మించుట; కున్ = కి; ఎద్ది = ఏమిటి; మిషంబు = కారణము; నా = నా; కున్ = కు; ఒండొండ = ఒక్కొక్కటే; ఎఱుంగన్ = తెలియునట్లు; చెప్పుము = చెప్పుము; బుధ = పండితులలే; ఉత్తమ = ఉత్తముడా; నీ = నీ యొక్క; పని = విషయము; చోద్యము = వింతగా; అయ్యెడిన్ = అయ్యి ఉన్నది.
భావము:- “అలంకారాలతో కూడిన చక్కటి ఆకారంతో, బంగారు హారాలు ధరించి, శుభ లక్షణాలతో ఉన్న నీకు క్రూరమైన ఈ మహాసర్పము రూపు ఎందుకు వచ్చింది. నీవెవరు? నీ పేరేమిటి? ఇలాంటి పాము శరీరం నీకు కలగడానికి కారణము ఏమిటి? అర్థమయ్యేలా వివరించి చెప్పు. నీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది.”
తెభా-10.1-1117-వ.
అనిన వాఁడిట్లనియె “దేవా! యేను సుదర్శనుండను విద్యాధరుండ విమానారూఢుండ నై రూపసంపద్గర్వంబులం జొక్కి దిక్కులం జరించుచు నొక్కయెడ నాంగిరసులైన ఋషులం గురూపులైన వారలం గని నగిన వారును "నీవు రూపదర్పంబునం మమ్ము నగితివి గావున మహాసర్పంబ వై యుండు"మని శపించి పిదప నే వేడు కొనిన నిట్లనిరి.
టీక:- అనిన = అనగా; వాడు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దేవా = భగవంతుడా; ఏను = నేను; సుదర్శనుండు = సుదర్శనుడు; అను = అనెడి; విద్యాధరుండ = విద్యాధరుడను; విమాన = విమానమును; ఆరూఢుండను = ఎక్కినవాడను; ఐ = అయ్యి; రూప = మంచి రూపము; సంపద = ధనము కలిమివలని; గర్వంబులన్ = గర్వములచే; చొక్కి = పరవశుడనై; దిక్కులన్ = ఎల్ల దిక్కు లందు; చరించుచున్ = సంచరించుచు; ఒక్క = ఒకానొక; ఎడన్ = చోట; అంగిరసులు = బ్రహ్మమానసపుత్రులు, అంగిరసుని సంతతి వారు; ఐన = అయిన; ఋషులన్ = మునులను; కురూపులు = వికార రూపము కలవారు; ఐన = అయిన; వారలన్ = వారిని; కని = చూసి; నగినన్ = నవ్వగా; వారునున్ = వారు; నీవు = నీవు; రూప = మంచి రూపమువలని; దర్పంబునన్ = గర్వముచేత; మమ్మున్ = మమ్ములను; నగితివి = అపహసించితివి; కావునన్ = కనుక; మహా = పెద్ద; సర్పంబవు = పామువు; ఐ = అయ్యి; ఉండుము = ఉండు; అని = అని; శపించి = శాపము ఇచ్చి; పిదపన్ = తరువాత; నేన్ = నేను; వేడుకొనినన్ = ప్రార్థించగా; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- శ్రీకృష్ణుడి మాటలు విని అతడు ఇలా అన్నాడు. “నేను విద్యాధరుణ్ణి. నా పేరు సుదర్శనుడు. సౌందర్యగర్వంతో దర్పించి విమానమెక్కి, సకల దిక్కులలో తిరుగుతుండే వాడిని. ఒకరోజు అంగిరసుని సంతతి వారు వికార రూపం కలవారు అయిన ఋషులను చూసి నవ్వాను. వారు “ఓరీ! నీవు సౌందర్యమదంతో మమ్ము గేలిచేసావు కనుక, పెనుబామువుగా అయి పడివుండ” మని నన్ను శపించారు నేను వేడుకోగా ఇలా శాప విమోచనం చెప్పారు.
తెభా-10.1-1118-చ.
"యదుకులమందు భక్తుల భయంబు హరించుటకున్ జనార్దనుం
డుదయము నొంది యీ యడవి కొక్క దినంబున రాఁగలండు త
త్పదమున నీవు దన్నఁబడి పన్నగ దేహముతోడఁ బాసి నీ
మొదలిటి మేనుఁ గాంచెదవు మూఢుఁడ! పొ"మ్మని రో! దయానిధీ!
టీక:- యదు = యదువు యొక్క; కులము = వంశము; అందున్ = లో; భక్తుల = భక్తుల యొక్క; భయంబున్ = భయమును; హరించుటకు = పోగొట్టుట; కున్ = కోసము; జనార్దనుండు = విష్ణుమూర్తి; ఉదయంబున్ = అవతారమును; ఒంది = పొంది; ఈ = ఈ యొక్క; అడవి = అడవి; కిన్ = కి; ఒక్క = ఒకానొక; దినంబునన్ = రోజున; రాగలండు = వచ్చును; తత్ = అతని; పదమున = కాలితో; నీవు = నీవు; తన్నబడి = తన్నబడి; పన్నగ = పాము; దేహమున్ = శరీరము; తోడన్ = నుండి; పాసి = విడువడి; నీ = నీ యొక్క; మొదలిటి = మునుపటి; మేనున్ = దేహమును; కాంచెదవు = పొందెదవు; మూఢుడ = మూర్ఖుడా; పొమ్ము = వెళ్ళిపొమ్ము; అనిరి = అని చెప్పిరి; ఓ = ఓ; దయానిధీ = దయాసాగరుడా, కృష్ణా.
భావము:- ఓ కృపాసాగరా! ఆ విప్రులు “ఓ మూఢుడా! భక్తుల భయం నివారించడానికి యాదవ వంశంలో విష్ణువు అవతరించి, ఈ అడవికి ఒకరోజు వస్తాడు. అప్పుడాయన కాలితన్నుతో నీవు పన్నగ శరీరం విడచి మునుపటి దేహం పొందగలవు. పొమ్ము” అని అన్నారు.
తెభా-10.1-1119-మ.
నినుఁ జింతించిన విన్నఁ బేరుకొనినన్ నిర్మూలమై క్రుస్సి పా
పనికాయంబు వినష్టమౌ నఁట; భవత్పాదంబు నా మీఁదఁ బె
ట్టినఁ దద్భ్రాహ్మణశాపసంజనిత కౌటిల్యంబు దా నిల్చునే?
వనజాతేక్షణ! నేడు బాసె నురగత్వం బెల్ల నేఁ బోయెదన్."
టీక:- నినున్ = నిన్ను; చింతించినన్ = తలచినచో; విన్నన్ = నీ కథలు వినినను; పేరుకొనిన్ = నీ నామ ముచ్చరించినను; నిర్మూలము = మొదలంట నాశనమై; క్రుస్సి = కృశించి; పాప = పాపముల {పాపనికాయము - మనోవాక్కాయకర్మల చేత చేయబడిన పాపములు}; నికాయంబు = సమూహము; వినష్టము = మిక్కిలి నష్టము; ఔను = అగును; అట = ఇది ప్రసిద్ధము; భవత్ = నీ యొక్క; పాదంబు = కాలు; నా = నా; మీదన్ = పైన; పెట్టినన్ = పెట్టుటవలన; తత్ = ఆ యొక్క; బ్రాహ్మణ = విప్రుల; శాప = శాపముచేత; సంజనిత = కలిగిన; కౌటిల్యంబు = కుటిలునిగా నుండుట; తాన్ = అది; నిల్చునే = నిలబడగల్గునా, లేదు; వనజాతేక్షణ = పద్మాక్ష, కృష్ణా; నేడు = ఇవాళ; పాసెను = తొలగెను; ఉరగత్వంబు = సర్పదేహము; ఎల్లన్ = అంతయును; నేన్ = నేను; పోయెదన్ = వెళ్ళిపోవుదును.
భావము:- ఓ కమలాక్షా! నిన్ను ధ్యానించినా, నీ కథలు విన్నా నీ నామం కీర్తించినా పాపరాశి మొదలంటా క్షీణించి నశిస్తుందని చెప్తారు. మరి నీ పాదం తాకిన పిమ్మట, విప్రుల శాపం వలన ఏర్పడిన ఆ వికృతాకారం ఎలా నిలుస్తుంది? నీ దయవలన నాకు నేటితో ఆ సర్పజన్మ తొలగిపోయింది. నేనిక సెలవు తీసుకొంటాను.”
తెభా-10.1-1120-వ.
అని విన్నవించి హరికిఁ బ్రదక్షిణంబువచ్చి మ్రొక్కి, సుదర్శనుండు దివంబునకుం జనియె, సర్పంబు వలన నందుండు విముక్తుం డయ్యెఁ; దత్ప్రకారంబు విని వెఱఁగుపడి గోపకులు దేవతామహోత్సవంబు సమాప్తి నొందించి కృష్ణకీర్తనంబు సేయుచు మరల మందకుం జని; రంత.
టీక:- అని = అని; విన్నవించి = మనవిచేసి; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబువచ్చి = ప్రదక్షిణచేసి; మ్రొక్కి = నమస్కరించి; సుదర్శనుండు = సుదర్శనుడు; దివంబున్ = స్వర్గమున; కున్ = కు; చనియె = వెళ్ళిపోయెను; సర్పంబు = పాము; వలన = నుండి; నందుండు = నందుడు; విముక్తుండు = విడువబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; తత్ = ఆ యొక్క; ప్రకారంబున్ = విధమును; విని = విని; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; గోపకులు = గొల్లవారు; దేవతా మహోత్సవంబున్ = జాతరను; సమాప్తినొందించి = పూర్తిచేసి; కృష్ణ = కృష్ణుని; కీర్తనంబు = స్తోత్రములు; చేయుచున్ = చేస్తూ; మరల = తిరిగి; మంద = గొల్లపల్లె; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంత = అప్పుడు.
భావము:- అని విజ్ఞప్తి చేసి, సుదర్శను కృష్ణుడికి ప్రదక్షిణ నమస్కరాలు చేసి, దేవలోకానికి వెళ్ళిపోయాడు. నందమహారాజు పాము నుంచి విముక్తుడయ్యాడు. ఇలా శ్రీకృష్ణుని వలన సుదర్శన విద్యాధరుడి శాపవిమోచనం జరగడం చూసి గోపకులు ఆశ్చర్యపోయారు. దేవతా జాతర పూర్తి చేసుకొని దేవకీసుతుని స్తుతిస్తూ తిరిగి గోకులానికి వెళ్ళిపోయీరు.
తెభా-10.1-1121-చ.
మఱి యొకనాటి రాత్రి బలమాధవు లుజ్జ్వల వస్త్రమాలికా
ధరులును లేపనాభరణ ధారులునై చని మల్లికాది పు
ష్పరస నిమగ్నమైన మధుపంబుల గీతము వించుఁ దద్వనాం
తరమున వెన్నెలన్ వ్రజనితంబిను లుండగఁ బాడి రింపుగన్.
టీక:- మఱియున్ = ఇంకను; ఒక = ఒకానొక; నాటి = రోజు; రాత్రి = రాత్రి; బల = బలరాముడు; మాధవులు = కృష్ణులు; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; వస్త్ర = బట్టలు; మాలికా = పూలదండలు; ధరులును = ధరించినవారు; లేపనా = సుగంధపుపూతలు; ఆభరణ = భూషణములు; ధారులున్ = ధరించినవారు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; మల్లిక = మల్లెపూలు; ఆది = మున్నగు; పుష్ప = పూల; రస = మకరందము నందు; నిమగ్నము = ములిగినవి; ఐన = అయిన; మధుపంబుల = తుమ్మెదల; గీతము = గానము; వించున్ = వినుచు; తత్ = ఆ యొక్క; వన = అడవి; అంతరంబునన్ = లోపల; వెన్నెలన్ = వెన్నెల యందు; వ్రజ = గోపికా; నితంబినులు = స్త్రీలు {నితంబిని - గొప్ప పిరుదులు కలామె, స్త్రీ}; ఉండగన్ = ఉన్నప్పుడు; పాడిరి = పాటలు పాడిరి; ఇంపుగన్ = మనోజ్ఞముగా.
భావము:- మరొక రోజు రాత్రి వెన్నెల కాస్తున్నది. బలరాముడు శ్రీకృష్ణుడు శుభ్రమైన బట్టలూ, పూలదండలూ, ఆభరణాలూ ధరించారు. చందనం పూసుకున్నారు. మల్లె మొదలైన పూవుల మకరందం ఆస్వాదించి మత్తెక్కిన తుమ్మెదల ఝుంకారాలు వింటూ బృందావనంలో గోపసుందరీమణులు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మథుర గీతాలు ఆలపించారు.
తెభా-10.1-1122-క.
ఆ పాట చెవుల సోఁకిన
నేపాటియు దేహలతల నెఱుఁగక దృగ్వా
చాపాటవములు చెడి పడి
రా పాటలగంధు లెల్ల నటవీవీధిన్.
టీక:- ఆ = ఆ యొక్క; పాట = గీతము; చెవులన్ = చెవు లందు; సోకినన్ = వినబడగానే; ఏపాటియున్ = ఏమాత్రము; దేహ = శరీరము అనెడి; లతలన్ = తీగల యందు; ఎఱుగక = స్పృహ తెలియక; దృక్ = చూపుల యొక్క; వాక్ = మాటల యొక్క; పాటవములు = సామర్థ్యములు; చెడి = నశించి; పడిరి = పడిపోయిరి; ఆ = ఆ యొక్క; పాటలగంధులు = స్త్రీలు {పాటలగంధులు - కలిగొట్టు పూల వాసన కలామె, స్త్రీ}; ఎల్లన్ = అందరు; అటవీ = అడవి; వీధిన్ = మార్గమునందు.
భావము:- రామకృష్ణుల పాట చెవిని పడగానే కలిగొట్టుపూల వంటి దేహపరిమళాలు కల ఆ గోపస్త్రీలు కన్నూ నాలుకా మొదలగు ఇంద్రియముల వ్యాపారాలు కట్టుబడి పోగా ఏమాత్రమూ ఒడలెరుగక ఆ వనసీమలో అలా పారవశ్యంలో మునిగిపోయారు.