పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/శంఖచూడుని వధ

తెభా-10.1-1123-వ.
ఇట్లు సకలభూతసమ్మోహనంబగు గానంబు సేయుచు, నిచ్ఛావర్తనంబులం బ్రమత్తుల చందంబున రామకృష్ణులు క్రీడింపఁ గుబేరభటుండు శంఖచూడుం డనువాఁడు రామకృష్ణ రక్షితులగు గోపికలం దన యోగబలంబున నుత్తరపు దిక్కునకుం గొనిపోవ నయ్యోషిజ్జనంబులు "రామకృష్ణేతి"భాషణంబులం జీరి పులికి నగపడిన మొదవుల క్రియ మొఱయిడిన విని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సకల = సమస్తమైన; భూత = జీవులకు; సమ్మోహనంబు = మోహము పుట్టించునది; అగు = ఐన; గానంబు = పాట; చేయుచున్ = పాడుచు; ఇచ్ఛావర్తనంబులన్ = ఇష్టమువచ్చినట్లు; ప్రమత్తుల = మిక్కిలి మత్తులోపడ్డ వారి; చందంబునన్ = విధముగా; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణులు; క్రీడింపన్ = వినోదించుచుండగ; కుబేర = కుబేరుని; భటుండు = బంటు; శంఖచూడుండు = శంఖచూడుడు; అనువాడు = అనెడివాడు; రామ = బలరాముడు; కృష్ణ = కృష్ణులచే; రక్షితలు = రక్షింపబడువారు; అగు = ఐన; గోపికలన్ = యాదవస్త్రీలను; తన = తన యొక్క; యోగ = మాయా; బలంబునన్ = శక్తిచేత; ఉత్తరపు = ఉత్తరము; దిక్కున్ = దిశ; కున్ = కు; కొనిపోవన్ = తీసుకొనిపోగా; ఆ = ఆ యొక్క; యోషిజ్జనంబులు = స్త్రీజనము; రామ = బలరామ; కృష్ణ = కృష్ణా; ఇతి = అనెడి; భాషణంబులు = కేకలు; పలుకుచు = వేయుచు; పులి = పులి; కిన్ = కి; అగపడిన = కనబడినట్టి; మొదవుల = ఆవుల; క్రియన్ = వలె; మొఱయిడినన్ = మొరపెట్టగా; విని = విని.
భావము:- ఇలా సకల ప్రాణులకూ సమ్మోహం కలిగించేలా గానం చేస్తూ, బలరామకృష్ణులు మత్తిల్లినవారిలా ఆ వనంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఆ సమయంలో కుబేరుని భటుడు శంఖచూడుడు అనే ఒకడు రామకృష్ణుల రక్షణలో ఉన్న గోపకాంతలను తన యోగబలంతో బలాత్కారంగా ఉత్తరదిశకు పట్టుకుపోసాగాడు. అప్పుడా, భామినులు “బలరామా! శ్రీకృష్ణా!” అంటూ బెబ్బులిబారిన పడ్డ ఆవుల వలె ఆక్రందనలు చేసారు. రామకృష్ణులు వారి మొరలు ఆలకించారు.

తెభా-10.1-1124-ఉ.
గ్రద్దన సాలవృక్షములు గైకొని బల్లిదు లన్నదమ్ము లా
యిద్దఱు కాలమృత్యువుల యేపున వే చని “యోడకుండుఁ డో!
ముద్దియలార!” యంచుఁ దను ముట్టినఁ జూచి కలంగి గుహ్యకుం
డుద్దవడిం దగం బఱచె నుత్తర మింతుల డించి భీతుఁడై.

టీక:- గ్రద్దనన్ = శీఘ్రముగ; సాల = మద్ది; వృక్షములున్ = చెట్లను; కైకొని = చేతబట్టి; బల్లిదులు = బలవంతులు; అన్నదమ్ములు = అన్నదమ్ములు; ఆ = ఆ ప్రసిద్ధమైన; ఇద్దఱు = ఇద్దరు; కాల = యముడు; మృత్యువుల = మృత్యుదేవతల; ఏపునన్ = వలె; వేచని = వేగముగా పోయి; ఓడకుండు = బెదిరిపోకండి; ఓ = ఓ; ముద్దియలార = ముగ్ధలు; అంచున్ = అనుచు; తను = అతనిని; ముట్టినన్ = తాకగ, ఎదుర్కొనగా; చూచి = చూసి; కలంగి = కలవరపడి; గుహ్యకుండు = గుహ్యకుడు; ఉద్దవడిన్ = మిక్కిలి వేగముగా; తగన్ = చటుక్కున; పఱచెన్ = పారిపోయెను; ఉత్తరము = ఉత్తరదిక్కునకు; ఇంతులన్ = స్త్రీలను; డించి = దిగవిడిచి; భీతుడు = భయపడినవాడు; ఐ = అయ్యి.
భావము:- బలవంతులైన ఆ ఆన్నదమ్ములు ఇరువురూ వెంటనే మద్దిచెట్లను చేత పట్టుకొన్నారు. కాలుడు మృత్యువు వలె చెలరేగి సరభసంగా వెళ్ళి “ఓ ముగ్ధలారా! భయపడకండి” అంటూ గోపికలకు ధైర్యం చెప్పి గుహ్యకునితో తలపడ్డారు. వాడు రామకృష్ణులను చూసి కంగారుపడి, ఆ వనితలను అక్కడే వదలి తత్తరపాటుతో ఉత్తర దిక్కుకు పరుగెత్తసాగాడు.

తెభా-10.1-1125-వ.
ఇట్లు గుహ్యకునిచేత విడివడిన గోపికలను "రక్షించుకొని యుండు"మని బలభద్రునిం బలికి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గుహ్యకుని = గుహ్యకుని; చేత = నుండి; విడివడిన = విడువబడిన; గోపికలను = గోపస్త్రీలను; రక్షించుకొని = కాపాడుకొనుచు; ఉండుము = ఉండుము; అని = అని; బలభద్రునిన్ = బలరామునితో; పలికి = చెప్పి.
భావము:- అప్పుడు కృష్ణుడు గుహ్యకుని చెర తప్పించుకున్న గోపికలను కాపాడుతూ ఉండ మని బలరామునితో చెప్పి. . . .

తెభా-10.1-1126-శా.
"రీ! గుహ్యక! పోకుపోకు"మని రోషోక్తిం బకారాతి వాఁ
డే రూపంబున నెందుఁ జొచ్చె నెటు బోయెం దోడఁ దా నేగి దు
ర్వారోదంచిత ముష్టి వాని తలఁ ద్రెవ్వంబెట్టి తద్వీరు కో
టీభ్రాజిత రత్నముం గొనియె దండిన్ గోపికల్ జూడగన్.

టీక:- ఓరి = ఓరి; గుహ్యక = గుహ్యకుడ; పోకుపోకుము = పారిపోకు; అని = అని; రోష = కోపముతోకూడిన; ఉక్తిన్ = మాటలతో; బకారాతి = కృష్ణుడు {బకారాతి - బకాసురుని శత్రువు, కృష్ణుడు}; వాడు = అతడు; ఏ = ఎటువంటి; రూపంబునన్ = ఆకారముతో; ఎందున్ = దేనిలో; చొచ్చెన్ = ప్రవేశించినను; ఎటు = ఏ వైపునకు; పోయెన్ = వెళ్ళినను; తోడన్ = కూడా; తాను = అతను; ఏగి = వెళ్ళి; దుర్వార = అడ్డగింపరాని; ఉదంచిత = పైకెత్తిన; ముష్టిన్ = పిడికిటితో; వాని = అతడి (గుహ్యకుని); తల = తలను; త్రెవ్వన్ = పగులునట్లుగా; పెట్టి = పొడిచి; తత్ = ఆ; వీరు = వీరుని యొక్క; కోటీర = కిరీటము నందు; భ్రాజిత = ప్రకాశించుచున్న; రత్నమున్ = రత్నమును; కొనియెన్ = తీసుకొనెను; దండిన్ = గొప్పదనముతో; గోపికల్ = గోపికలు; చూడగన్ = చూచుచుండగా.
భావము:- బకాసురుణ్ణి భంజించిన ఆ పరమాత్ముడు “ఓరీ! యక్షుడా! పారిపోకు. పారిపోకు” అని రోషంగా అరుస్తూ గుహ్యకుడు ఏ రూపంతో ఎక్కడ ప్రవేశిస్తున్నా ఎక్కడకి వెళ్ళినా వెన్నాడి వాడిని పట్టుకున్నాడు. సాటిలేని తన పెను పిడికిటిపోటుతో వాడి తల బద్దలయ్యేలా పొడిచాడు. గోపికలు చూస్తూండగా ఆ శూరుడి కిరీటంలో పొదిగిన ప్రకాశవంతమైన మణిని తీసేసుకొన్నాడు.

తెభా-10.1-1127-వ.
ఇట్లు శంఖచూడునిం జంపి వాని శిరోరత్నంబుఁ దెచ్చి బలభద్రున కిచ్చి మెప్పించె మఱియు నొక్కదినంబునం గృష్ణుండు వనంబునకుం జనిన నతని లీలలు పాడుచు నిండ్లకడఁ దద్విరహవేదనానల భరంబు సహింపక గోపికలు తమలో నిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శంఖచూడునిన్ = శంఖచూడుని; చంపి = సంహరించి; వాని = అతని; శిరోరత్నంబున్ = తలమీదిరత్నమును; తెచ్చి = తీసుకు వచ్చి; బలభద్రున్ = బలరాముని; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; మెప్పించె = మెప్పించెను; మఱియునొక్క = ఇంకొక; దినంబునన్ = రోజున; కృష్ణుండు = కృష్ణుడు; వనంబున్ = అడవి; కున్ = కి; చనిన = వెళ్ళగా; అతని = అతని యొక్క; లీలలున్ = లీలలను; పాడుచున్ = పాడుతు; ఇండ్ల = ఇళ్ళ; కడన్ = వద్ద; తత్ = అతని; విరహ = ఎడబాటువలని; వేదనా = బాధ అనెడి; అనల = తాపము యొక్క; భరంబున్ = అతిశయమును; సహింపక = ఓర్చుకొనలేక; గోపికలు = గొల్లస్త్రీలు; తమలోన్ = వారిలోవారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇలా కృష్ణుడు శంఖచూడుని సంహరించి వాడి చూడామణిని తీసుకొని వచ్చి బలరాముడికి ఇచ్చి అన్నను సంతోషపెట్టాడు. ఆ తరువాత ఇంకొక రోజు శ్రీకృష్ణుడు వనం లోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన లీలలనే ఇండ్లలో పాడుకుంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు.