పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలతోడ క్రీడించుట

తెభా-10.1-1102-మ.
తులుందానును నీటిలో వెడలి భూషా గంధ చేలాద్యలం
కృతుఁడై కుంభికరేణుయూధములతోఁ గ్రీడించు చందంబునన్
లందుం దరులందుఁ బుష్పమయ లీలాశయ్యలందున్ సుఖో
న్నతుఁడై కృష్ణుఁడు క్రీడలం దనిపె నా నారీలలామంబులన్.

టీక:- సతులున్ = స్త్రీలు; తానును = అతను; నీటి = నీటి; లోన్ = నుండి; వెడలి = బయటకి వచ్చి; భూషా = ఆభరణములు; గంధ = సుగంధలేపనములు; చేలా = వస్త్రములు; ఆది = మున్నగువానిచే; అలంకృతుడు = అలంకరింపబడినవాడు; ఐ = అయ్యి; కుంభి = మగ ఏనుగు; కరేణు = ఆడ ఏనుగుల; యూధంబుల = సమూహముల; తోన్ = తోటి; క్రీడించు = విహరించెడి; చందంబునన్ = విధముగ; లతలు = తీగల, పాదుల; అందున్ = అందు; తరులు = చెట్ల; అందున్ = అందు; పుష్ప = పూలచే; మయ = ఐన; లీలా = విలాసపు; శయ్యలు = పరుపుల; అందున్ = అందు; సుఖ = సుఖముచేత; ఉన్నతుడు = అతిశయించినవాడు; ఐ = అయ్యి; కృష్ణుడు = కృష్ణుడు; క్రీడలన్ = వినోదములందు; తనిపెన్ = తృప్తిపరచెను; ఆ = ఆ యొక్క; నారీ = స్త్రీలలో; లలామంబులన్ = శ్రేష్ఠులను.
భావము:- అప్పుడు అతిశయించిన ఆనందంతో కృష్ణుడు నందనందనుడు వ్రజవనితలతో నీటి నుండి వెడలివచ్చి ఆభరణాలు, మంచిగంధము, వస్త్రములు మొదలైనవి అలంకరించుకున్నాడు. గజరాజు ఆడు ఏనుగుల గుంపుతో క్రీడించే విధంగా, తీగలు పొదరిండ్లలో చిక్కని చెట్ల నీడలలో చక్కని పూసెజ్జలలో ఆ కన్యారత్నములతో క్రీడించి వారిని సంతోషపెట్టాడు.

తెభా-10.1-1103-వ.
ఇట్లు శరత్కాలంబున వెన్నుం డింద్రియస్ఖలనంబు చేయక గోపికల తోడ రమించె” నని చెప్పిన మునివరునకు భూవరుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శరత్కాలంబునన్ = శరదృతువు నందు; వెన్నుండు = కృష్ణుడు; ఇంద్రియస్ఖలనంబు = ఇంద్రియస్ఖలనంబు; చేయక = చేయకుండ; గోపికల = గోపికాస్త్రీల; తోడన్ = తోటి; రమించెను = క్రీడించెను; అని = అని; చెప్పిన = చెప్పగా; ముని = ఋషులలో; వరున్ = శ్రేష్ఠున; కున్ = కు; భూవరుండు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా గోవిందుడు ఆ శరత్కాలంలో అస్ఖలితేంద్రియుడై రమణులతో రమించాడు” అని చెప్పగా శుకయోగీంద్రునితో పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

తెభా-10.1-1104-మత్త.
"ర్మకర్తయు ధర్మభర్తయు ర్మమూర్తియు నైన స
త్కర్ముఁ డీశుఁ డధర్మశిక్షయు ర్మరక్షయుఁ జేయఁగా
ర్మిలిన్ ధరమీఁదఁ బుట్టి పరాంగనాజనసంగ మే
ర్మమంచుఁ దలంచి చేసె? నుదాత్తమానస! చెప్పుమా."

టీక:- ధర్మ = ధర్మమును; కర్తయున్ = నడపువాడు; ధర్మ = ధర్మమునకు; భర్తయున్ = ప్రభువు; ధర్మ = ధర్మమే; మూర్తియున్ = స్వరూపమైనవాడు; ఐన = అయిన; సత్ = మంచి; కర్ముడు = పనులు చేయువాడు; ఈశుడు = కృష్ణుడు; అధర్మ = అధర్మమును; శిక్షయున్ = శిక్షించుట; ధర్మ = ధర్మమును; రక్షయున్ = కాపాడుట; చేయగాన్ = చేయుటకై; అర్మిలిన్ = ప్రేమతో; ధర = భూమి; మీదన్ = పైన; పుట్టి = అవతరించి; పర = ఇతరుల; అంగనాజన = స్త్రీజనములతో; సంగము = కూడుట; ఏ = ఎట్టి; ధర్మము = ధర్మము; అంచున్ = అని; తలంచి = భావించి; చేసెను = చేసెను; ఉదాత్తమానస = శుకమహర్షి {ఉదాత్తమానసుడు - గొప్ప మనస్సు కలవాడు, శుకుడు}; చెప్పుమా = తెలియజెప్పుము.
భావము:- “మహాత్మా! పరమేశ్వరుడు ధర్మమునకు కర్త; ధర్మమునకు భర్త; ధర్మమే స్వరూపముగా కలవాడు; సత్కర్మలు ఆచరించువాడు; ధర్మమును రక్షించుటకూ అధర్మమును శిక్షించుటకూ భూలోకంలో అవతరించువాడు కదా! అట్టి భగవంతుడే ఇదేం ధర్మమని పరసతులతో సంగమించాడో దయచేసి నాకు చెప్పవలసినది.”

తెభా-10.1-1105-వ.
అనిన శుకుండిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- మహారాజు మాటలు వినిన శుకుడు ఇలా ఇన్నాడు.

తెభా-10.1-1106-ఆ.
"ర్వభక్షుఁ డగ్ని ర్వంబు భక్షించి
దోషిగాని పగిది దోష మైనఁ
జేసి దోషపదముఁ జెందరు తేజస్వు
గుటఁ జంద్ర వాసవాదుఁ లధిప!

టీక:- సర్వభక్షుడు = అన్నిటిని భక్షించువాడు; అగ్ని = అగ్నిదేవుడు; సర్వంబున్ = సమస్తమును; భక్షించి = తినివేసినను; దోషి = అపరాధి; కాని = కానట్టి; పగిదిన్ = వలె; దోషము = తప్పు; ఐనన్ = అయినప్పటికిని; చేసి = చేసి; దోషపదమున్ = నీచస్థానమును; చెందరు = పొందరు; తేజస్వులు = తేజస్సు కలవారు; అగుటన్ = ఐ ఉండుటచేత; చంద్ర = చంద్రుడు; వాసవ = ఇంద్రుడు; ఆదులు = మున్నగువారు; అధిప = రాజా;
భావము:- “రాజా! సర్వభక్షకుడైన అగ్ని సమస్తమూ భుజించి కూడ దోషికాడు. అలాగే చంద్రుడు, ఇంద్రుడు మొదలైన తేజస్వరూపులు దోషయుక్తములైన కార్యాలు చేసినప్పటికీ దోష ఫలం పొందరు.

తెభా-10.1-1107-క.
శ్వరుఁడు గానివాఁడు న
రేశ్వర! పరకాంతఁ దలఁచి యెట్లు బ్రదుకు? గౌ
రీశ్వరుఁడు దక్క నన్యుఁడు
విశ్వభయదవిషము మ్రింగి వెలయంగలఁడే?

టీక:- ఈశ్వరుడు = భగవంతుడు; కానివాడు = కానట్టివాడు; నరేశ్వర = రాజా {నరేశ్వరుడు - మానవులను ఏలువాడు, రాజు}; పర = ఇతరుల; కాంతన్ = భార్యను; తలచి = తలచి; ఎట్లు = ఏ విధముగా; బ్రదుకు = నశించకుండా ఉండును; గౌరీశ్వరుడు = పరమశివుడు {గౌరీశ్వరుడు - గౌరీదేవి భర్త, శివుడు}; తక్కన్ = తప్పించి; అన్యుడు = మరియొకడు; విశ్వ = సర్వలోకములకు; భయద = భయమును కలిగించెడి; విషమున్ = విషమును; మ్రింగి = భక్షించి; వెలయంగలడే = ప్రసిద్ధినిపొందకలడా.
భావము:- ఓ రాజోత్తమా! భగవంతులైన వారు శాస్త్రవశ్యులు కారు. తమ ఇష్టమును అనుసరించి ప్రవర్తిస్తుంటారు. శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. వారికది తప్పు కాదు. ఈశ్వరులు కాని వారు అలా పరపత్నులను తాకి బ్రతకగలరా? గౌరీపతి తప్ప మరొకడు లోకభయంకర మైన హాలాహలం మ్రింగి జీవించగలడా? ఈశ్వరుడు కాలకూట విషం ఆరగించాడని శాస్త్రవశ్యుడు కర్మవశ్యుడు అయిన అనీశ్వరుడు అలా చేయగలడా?

తెభా-10.1-1108-క.
త్యము ప్రభువుల వచనము
నిత్యము తద్వచన వీధి నిలుతురు పెద్దల్;
త్యాసత్యము గావున
త్య మనుచుఁ జనరు వారి రితమును నృపా!

టీక:- సత్యము = యథార్థమైనది; ప్రభువుల = అధిపుల; వచనము = మాట; నిత్యము = ఎల్లప్పుడు; తత్ = వారి; వచన = మాట; వీధిన్ = ప్రకారముగా; నిలుతురు = వర్తించెదరు; పెద్దల్ = జ్ఞానులు; సత్య = యథార్థమైనది; అసత్యమున్ = అసత్యమైనది; కావునన్ = కావచ్చును కనుక; సత్యము = యథార్థమే; అనుచున్ = అంటూ; చనరు = వర్తించరు; వారి = వారి యొక్క; చరితమును = ప్రవర్తనను; నృపా = రాజా.
భావము:- ఈశ్వరుల వచనం మాత్రమే సత్యం. అదే ప్రమాణం. కాని వారి చేష్టితం కాదు. వారి మాటలను మాత్రమే ఆర్యులు ఎప్పుడూ అనుసరిస్తారు తప్ప, ఆచారాన్ని కాదు. ఒకప్పుడు వారి చేష్టితం వారి మాటకు విరుద్ధంగానూ ఉంటుంది. ఒకప్పుడు అనుకూలంగానూ ఉంటుంది. అనుసరించాల్సి వస్తే వారి మాటకు వ్యతిరేకం కాని చర్యనే అనుసరించాలి. వారి చేష్టలన్నీ సత్యమని అనుసరించ కూడదు.

తెభా-10.1-1109-మ.
నులై యెవ్వని పాదపంకజపరాధ్యానసంప్రాప్త యో
నిరూఢత్వముచే మునీంద్రులు మహార్మంబులం బాసి బం
నిరోధంబులు లేక విచ్చలవిడిం ర్పింతు, రా దివ్య శో
నుఁ డెట్లుండిన నుండెఁ గాక; కలవే బంధంబు లుర్వీశ్వరా!

టీక:- ఘనులు = గొప్పవారు; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని యొక్క; పాద = పాదము లనెడి; పంకజ = పద్మముల; పరాగ = పుప్పొడి అనెడి దుమ్మును; ధ్యాన = ధ్యానించుట; సంప్రాప్త = పొందబడుట; యోగ = లభించిన; నిరూఢత్వము = ప్రసిద్ధి; చేన్ = చేత; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; మహా = గొప్పవి యైన; కర్మంబులన్ = కర్మబంధములను; పాసి = తొలగించుకొని; బంధ = ఎట్టి బంధములు; నిరోధంబులు = అడ్డంకులు; లేక = లేకుండ; విచ్చలవిడిన్ = యథేచ్ఛముగా; దర్పింతురు = అతిశయించెదరో; ఆ = అట్టి; దివ్య = దివ్యమైన; శోభనుండు = శుభ స్వరూపుడు; ఎట్లు = ఏ విధముగ; ఉండినన్ = ఉన్నను; ఉండెగాక = ఉండివచ్చును; కలవే = ఉంటాయా (అతనికి); భంధంబులు = సంసారాది బంధములు; ఉర్వీశ్వరా = రాజా {ఉర్వీశ్వరుడు - ఉర్వి (రాజ్యమునకు) ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.
భావము:- ఓ రాజేంద్రా! నారాయణుని చరణారవింద పరాగముల ధ్యానయోగ సామర్థ్యంతో సనకసనందాది యోగీశ్వరులు కర్మబంధాలు వీడి ఎట్టి కట్టుబాటులు లేక ఇచ్చకొలదీ మెలుగుతుంటారని చెబుతుంటారు. అటువం టప్పుడు క్రీడార్థమై శుద్ధసత్త్వమయ శరీరం స్వీకరించిన ఆ దివ్యమంగళ విగ్రహుడు ఎలా నడుచుకుంటే నేమిటి? ఏమి చేసినప్పటికిన్నీ ఆయనకు బంధాలు లేవు.

తెభా-10.1-1110-ఆ.
గోపజనములందు గోపికలందును
కలజంతులందు సంచరించు
నా మహాత్మునకుఁ బరాంగన లెవ్వరు?
ర్వమయుఁడు లీల లిపెఁ గాక."

టీక:- గోప = గొల్ల; జనము = వారి; అందున్ = అందు; గోపికలు = గొల్లస్త్రీల; అందును = అందు; సకల = సమస్తమైన; జంతులు = జీవుల; అందున్ = అందు; సంచరించున్ = మెలగును; ఆ = అట్టి; మహాత్మున్ = గొప్పవాని; కున్ = కి; పరాంగనలు = పరస్త్రీలు; ఎవ్వరు = ఎవరు; సర్వమయుడు = సర్వము తానైనవాడు; లీలన్ = లీలలు; సలిపెన్ = చేసెను; కాక = తప్పించి.
భావము:- గోపాలకులలో గోపికలలో తక్కిన జీవరాసులలో ఎవడు అంతరాత్మ అయి వ్యవహరిస్తున్నాడో ఆ పరమ పురుషుడికి పరాంగనలు ఎవరు? క్రీడార్ధం అవతరించిన ఆ సర్వవ్యాపి ఇలా క్రీడించాడే తప్ప, ఇందులో దోషం ఏమీ లేదు.”

తెభా-10.1-1111-వ.
అని చెప్పి శుకుం డిట్లనియె "నంత బ్రాహ్మ్యముహూర్తంబునం గృష్ణు వీడ్కొని గోపిక లిచ్చలేకయు నిండ్ల కడకేగినం గృష్ణమాయామోహితులై గోపకులు వారలం గోపింపనేరరై రివ్విధంబున.
టీక:- అని = అని; చెప్పి = తెలియజెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అంత = ఆ తరువాత; బ్రహ్మ్య ముహుర్తంబునన్ = తెల్లవారుజామున; కృష్ణున్ = కృష్ణుని; వీడ్కొని = సెలవుతీసుకొని; గోపికలు = గొల్లభామలు; ఇచ్చ = ఇష్టము; లేకయున్ = లేకపోయినను; ఇండ్ల = ఇళ్ళ; కడ = వద్ద; కిన్ = కు; ఏగినన్ = వెళ్ళగా; కృష్ణ = కృష్ణుని యొక్క; మాయా = మాయవలన; మోహితులు = మాయలోపడినవారు; ఐ = అయ్యి; గోపకులు = గొల్లలు; వారలన్ = వారిని; కోపింపనేరరు = కోపించజాలనివారు; ఐరి = అయ్యిరి; ఈ = ఈ; విధంబునన్ = ప్రకారంగా.
భావము:- అని చెప్పి శుకయోగి మళ్ళీ పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు. “తెల్లవారుజామున ఇష్టం లేకున్నా ఎలాగో కష్టం మీద గోపాంగనలు కృష్ణుడిని వదలి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అతని మాయ వలన భ్రాంతి పొందిన గోపాలురు గోపికలను కోపగించుకోలేదు. ఈ విధంగా. . . . .

తెభా-10.1-1112-ఇం.
గోపాలకృష్ణుండును గోపకాంతల్
ప్రాపించి క్రీడించిన భంగు లెల్లన్
రూపించి వర్ణించి నరుండు హృత్సం
తాపంబులం బాయును త్ప్రసక్తిన్.

టీక:- గోపాలకృష్ణుండును = శ్రీకృష్ణుడు; గోపకాంతలు = గోపికాస్త్రీలు; ప్రాపించి = పొంది; క్రీడించిన = విహరించిన; భంగులు = విధములు; ఎల్లన్ = అన్నిటిని; రూపించి = స్మరించి; వర్ణించి = స్తుతించి; నరుండు = మానవుడు; హృత్ = హృదయము లందలి; సంతాపములన్ = దుఃఖరూపములు; పాయున్ = విడిచిపెట్టును; తత్ = ఆ యొక్క; ప్రసక్తిన్ = స్మరించుటచేత;
భావము:- గోపీకృష్ణుడూ గోపికలూ సలిపిన రాసక్రీడ వృత్తాంతాన్ని చక్కగా అభివర్ణించే, వినే మానవుడు సమస్త మనస్తాపాల నుండి విముక్తుడు అవుతాడు.