పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/శరదృతు వర్ణనము
తెభా-10.1-764-వ.
ఇట్లు కృష్ణుండు విహితవిహారంబుల వర్షాకాలంబుఁ బుచ్చె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కృష్ణుండు = కృష్ణుడు; విహిత = తగినట్టి; విహారంబులన్ = నడవడికలతో; వర్షాకాలంబున్ = వానాకాలమును; పుచ్చెన్ = గడపెను; అంత = అంతట.
భావము:- ఇలా ఆ నందనందనుడు యథోచిత విహారాలతో వర్షాకాలం గడిపాడు. పిమ్మట, శరదృతువు వచ్చింది.
తెభా-10.1-765-క.
జొంపములు గొనియె వనములు;
రొంపు లిగిరె; నెమలిగముల రొద లుడిగె; నదుల్
పెంపులకుఁ బాసె; నుఱుముల
శంపల సంపదలు మానె శారదవేళన్.
టీక:- జొంపములున్ = గుబురులు; కొనియెన్ = కట్టెను; వనములు = అడవులు; రొంపులు = బురదలు; ఇగిరెన్ = ఎండిపోయినవి; నెమలి = నెమళ్ళ; గములన్ = సమూహము లందు; రొదలు = కేకలిడుట; ఉడిగెన్ = తగ్గెను; నదుల్ = నీటిప్రవాహములు; పెంపుల్ = వరదల; కున్ = కు; పాసెన్ = దూరమయ్యెను; ఉఱుములన్ = ఉరుముల యొక్క; శంపల = మెరుపుల యొక్క; సంపదలు = సమృద్ధులు; మానెన్ = తొలగెను; శారదవేళన్ = శరదృతువు నందు.
భావము:- ఆ శరత్కాలంలో అరణ్యాలన్నీ గుబురుగా పెరిగాయి; బురదలు ఎండిపోయాయి; నెమలి గుంపుల కేక ధ్వనులు ఆగాయి; ఉరుముల మెరుపుల ఆడంబరాలు అణిగాయి.
తెభా-10.1-766-వ.
మఱియు జీవనంబులు విడిచి, విమలజ్ఞానవశంబున ముక్తులగు పురుషరత్నంబులచెన్నునఁ జెన్ను వదలి, మిన్ను విడిచి, వాయువశంబులై, వెల్లివిరిసి చను మేఘంబులును, మేఘపటల రహితంబును, గలశభవముని సహితంబునునయి, విజ్ఞానదీప విలసితం బగు యోగిహృదయంబు చందంబున శుభం బైన నభంబును, నభంబున నీలదుకూల వితాన సంయుక్త ముక్తాఫలంబుల వడువున నెగడు నుడుగణంబులును, నుడుగణ మయూఖంబు క్రొవ్వు లువ్వెత్తుగఁ గొని నివ్వటిల్లుచు బ్రహ్మాండ కరండ కర్పూర ఖండాయమానంబు లగు చంద్రకిరణంబులును, జంద్రకిరణ సమ్మర్శనంబున సగర్భంబులై భూమికి దుర్భరంబు లగుచు నిండి పండి హాలిక కర నిశిత లవిత్ర ధారా సంరంభంబుఁ దలంచి తల్లడిల్లి వెలవెలకంబాఱుచుఁ దల్లియగు విశ్వంభరకు మునుకొని ప్రణతంబులై వడంకుచు నెఱుంగ మొఱయిడుచున్న పెంపున సంపన్నంబులైన యెన్నులవ్రేగున వ్రాలి గాలిం దూలుచు మర్మర ధ్వనుల సారస్యంబు లగు కలమాది సస్యంబులును సస్య మంజరీ పుంజంబులం గొంచక చంచువులఁ ద్రుంచి కబళించి పిల్లపెంటి తండంబులం గూడి కడుపులు నిండ మెక్కి విక్కవిరిసి చొక్కుచుఁ ద్రిక్కలుగొని మహోత్తుంగ సమంచిత మంచప్రదేశంబు లెక్కి సంచరించుచు వెన్నుల కావలియున్న యన్నుల కెమ్మోవులు బింబఫలంబు లని కఱచి తత్కరాస్ఫాలనంబుల నులికి పడి యెగసి చను శుకనికరంబుల కలకలంబులును, గలహంస కోక సారస కోలాహల మండితంబులై నిండిన నిర్మల జలంబులు గల జలాశయంబులును, జలాశయముల జలము లనుదినము నిగుర గృహములఁ బ్రతుకు దినములు చనుట యెఱుంగని మనుజుల గమనికం దిరుగు జలచరంబులును, జలచర హృదయముల బెగడుగదుర డొంకి యింకిన నదులును, నదులందుఁ గర్పూర మండపంబుల తెఱంగున, మణికుట్టిమంబుల మాడ్కిని సౌధసోపానమార్గంబుల జాడను, విలోకితంబులగు నూతన సైకతంబులును సైకత ప్రదేశంబుల నుదయ వేళల నిత్యకర్మానుష్ఠాన నిరతులగు మునులును, మునికన్యకాకర కలశ సలిలాభిషిక్తమూలంబులగు తపోవన బాలరసాల సాలంబులును, సాలవిటపి వాసంతికా కుంజపుంజంబుల తఱచున నిముడుకొని దినకర కిరణములకుం గరువలికిం జొర వెరవుపడని వనమ్ములును, వనమ్ములం దరులకొమ్మల నాకలమ్ములు నేకలమ్ములై మెసంగి మసరుకవిసి క్రొవ్వి కొమ్ముకొనల సూటి యేటిదరులు త్రవ్వి చిమ్మి కుమ్మి కోరాడెడు వనగజంబులును, గజకుంభ కనకకుంభ రుచిర కుచభార భీరుమధ్య సమంచిత లగు చెంచితలును, జెంచితల క్రూరమ్ము లగు వాలమ్ముల సారములుచెడి బెడిదంబుగఁ బాదంబులు దొట్రుపడఁ బెనుగాతమ్ములం బడు వరాహ పుండరీకంబులును, బుండరీక కుంద కుముద కురంటకాది కుసుమ మకరందంబులు గ్రోలి తేలి సోలి వాలి మహాహంకృతుల ఝంకృతులు జేయు తేఁటికదుపులును, గదుపులం గలయక యెదగలిగి మదమున నదనుపద నెఱింగి మదనమార్గణ ప్రేరితంబులై పెంటితుటుముల వెంటం జని యొండొంటి గెంటించుచుఁ దగుల నెక్కి గర్భంబులు నెక్కొలుపు మృగవృషభ రాజంబులును గలిగి రాజరాజ గృహంబు పగిది విలసిత కుంద పద్మ సౌభాగ్యం బై, భాగ్యహీను కర్మంబు రేఖ నశ్రుత నీలకంఠ శబ్దంబై, శబ్దశాస్త్రవేది హృదయంబు బాగున విశదప్రకాశాభిరామంబై, రామసంగ్రామంబు కైవడి బాణాసనాలంకృతంబై, కృతాంత హృదయంబు కరణి నపంకంబై, పంకజాసను గేహంబు సొంపున రాజహంస విరాజమానంబై, మానధనుని చరిత్రంబు సొబగున నకల్మషజీవనంబై, వననిధి పొలుపున సమ్మిళిత భూభృద్వాహినీ సంకులంబై, కులవధూరత్నంబు చెలువున నదృష్ట పయోధరంబై ధరణికిం దొడ వగుచు శరత్కాలంబు వచ్చె; నందు.
టీక:- మఱియున్ = ఇంకను; జీవనంబులు = ఉపాధులను; విడిచి = వదలిపెట్టి; విమల = పంచమలములు తొలగిన {పంచమలములు - 1ఆణవ 2కార్మిక 3మాయిక 4మాయేయ 5తిరోధానములు అనెడి ఆధ్యాత్మవిధ్యార్జనలో కలిగెడి మలములు}; జ్ఞాన = విజ్ఞానము; వశంబునన్ = చేత; ముక్తులు = మోక్షము పొందినవారు; అగు = ఐన; పురుష = పురుషులలో; రత్నంబుల = శ్రేష్ఠమైనవారి; చెన్నునన్ = విధముగ; చెన్ను = చక్కగనుండుటను; వదలి = విడిచిపెట్టి; మిన్నున్ = ఆకాశమును; విడిచి = వదలిపెట్టి; వాయు = గాలివాటు; వశంబులు = అనుగుణముగా పోవునవి; ఐ = అయ్యి; వెల్లివిరిసి = చెదిరి; చను = పోవు; మేఘంబులును = మేఘములు; మేఘ = మేఘముల; పటల = సమూహములు; రహితంబును = లేనిది; కలశభవ = అగస్త్య; ముని = ఋషితో; సహితంబును = కూడినది; అయి = ఐ; విజ్ఞాన = విమలజ్ఞానము అనెడి; దీప = దీపముచేత; విలసితంబు = ప్రకాశించునట్టిది; అగు = ఐన; యోగి = ఋషుల; హృదయంబు = మనసు; చందంబునన్ = వలె; శుభంబు = పరిశుద్ధమైనది; ఐన = అయిన; నభంబును = ఆకాశమున; నభంబునన్ = ఆకాశము నందు; నీల = నల్లనైన; దుకూల = మురికిలేని వస్త్రముల; వితాన = మేలుకట్టు నందు; సంయుక్త = కూడుకొని ఉన్న; ముక్తాఫలంబుల = ముత్యముల; వడువునన్ = వలె; నెగడుచున్ = అతిశయించునట్టి; ఉడు = నక్షత్రముల యొక్క; గణంబులును = సమూహముల; ఉడు = నక్షత్ర; గణ = సమూహముల; మయూఖంబున్ = కాంతుల యొక్క; కొవ్వులు = మదములను; ఉవ్వెత్తుగన్ = బహు మిక్కిలిగా; కొని = అపహరించి; నివ్వటిల్లుచున్ = అతిశయించుచు; బ్రహ్మండ = బ్రహ్మాండము అనెడి; కరండ = భాండము నందలి; కర్పూర = పచ్చకర్పూరపు; ఖండాయమానంబులు = పలుకులో అనదగినవి; అగు = ఐన; చంద్ర = చంద్రుని యొక్క; కిరణంబులును = కిరణములు; చంద్రకిరణ = వెన్నెలల; సమ్మర్శనంబునన్ = బాగుగా సోకుట చేత; సగర్భంబులు = పొట్టలు గలవి; ఐ = అయ్యి; భూమి = నేల; కిన్ = కు; దుర్భరంబులు = భరింపరానివి; అగుచున్ = ఔతు; నిండి = నిండుగా; పండి = ఫలించి; హాలిక = సేద్యగాని, రైతు యొక్క; కర = చేతి యందలి; నిశిత = వాడియైన; లవిత్ర = కొడవలి; ధారా = పదును యొక్క; సంరంభంబున్ = ఆటోపమును; తలంచి = తలచుకొని; తల్లడిల్లి = కంగారుపడిపోయి; వెలవెలకన్ = తెలతెల్లగా; పాఱుచున్ = ఐపోతూ; తల్లి = తల్లి; అగు = ఐన; విశ్వంభర = భూదేవి; కున్ = కి; మునుకొని = పూని; ప్రణతంబులు = మొక్కునవి; ఐ = అయ్యి; వడంకుచున్ = వణికిపోతూ; ఎఱుంగన్ = తెలియునట్లు; మొఱయిడుచున్న = మొరపెట్టుకొంటున్న; పెంపునన్ = విధముగా; సంపన్నంబులు = సమృద్ధిగా ఉన్నవి; ఐన = అయిన; ఎన్నుల = వెన్నుల, కంకుల; వ్రేగునన్ = బరువు వలన; వ్రాలి = నేలకు వంగి; గాలిన్ = గాలివాటునకు; తూలుచున్ = చలించుచు; మర్మర = మరమర మనెడి{మర్మర – గాలికి వస్త్రములు, ఆకులు చేసెడి ధ్వన్యనుకరణ}; ధ్వనులన్ = చప్పుళ్ళతో; సారస్యంబులు = రసవంతము లైనవి; అగు = ఐన; కలమ = వరి; ఆది = మున్నగు; సస్యంబులు = పైర్లు; సస్య = పైరుల; మంజరీ = కంకుల; పుంజంబులన్ = గుత్తులను; కొంచక = సంకోచింపకుండా; చంచువులన్ = ముక్కులతో; త్రుంచి = తుంచుకొని; కబళించి = మింగి; పిల్ల = పిల్లపక్షులు; పెంటి = ఆడపక్షుల; తండంబులన్ = సమూహములతో; కూడి = కలిసి; కడుపులు నిండ = సంతుష్టిగా; మెక్కి = మిక్కిలిగా తిని; విక్కవిరిసి = మిక్కిలి ఉప్పొంగి; చొక్కుచున్ = దేహములు మరచుచు; త్రిక్కలుగొని = తిక్కెత్తి, వెఱ్ఱెత్తి; మహా = గొప్ప; ఉత్తుంగ = ఎత్తైన; సమంచిత = చక్కటివి యైన; మంచ = మంచెలపై; ప్రదేశంబులు = చోట్లకు; ఎక్కి = ఎక్కి; సంచరించుచున్ = మెలగుచు; వెన్నుల = కంకులకు; కావలి = కాపలాకాయుచు; ఉన్న = ఉన్నట్టి; అన్నులన్ = స్త్రీల యొక్క; కెంపు = ఎఱ్ఱని; మోవులున్ = పెదవులను; బింబఫలంబులు = దొండపండ్లు; అని = అని; కఱచి = ముక్కులతో పొడిచి; తత్ = వారి; కర = చేతుల; ఆస్ఫానంబులన్ = చప్పట్ల వలన; ఉలికిపడి = అదరిపడి; ఎగసి = ఎగిరి; చను = పోవునట్టి; శుక = చిలుకల; నికరంబుల = సమూహముల; కలకలంబులును = కలకల ధ్వనులు; కలహంస = రాజహంసల; కోక = చక్రవాకములు; సారస = బెగ్గురుపక్షులు; కోలాహల = కలకల ధ్వనులచే; మండితంబులు = అలంకరింపబడినవి; ఐ = అయ్యి; నిండిన = నిండుగా ఉన్న; నిర్మల = స్వచ్ఛమైన; జలంబులు = నీరు; కల = కలిగిన; జలాశయంబులును = చెరువులు; జలాశయముల = చెరువులలోని; జలములు = నీళ్ళు; అనుదినము = ప్రతిరోజు; ఇగురన్ = ఎండిపోతుండగా; గృహములన్ = ఇండ్లలో; బ్రతుకు = జీవించగల; దినములు = రోజులు; చనుట = గడచిపోవుచుండుట; ఎఱుంగని = తెలిసికొనని; మనుజుల = మానవుల; గమనికన్ = వలె; తిరుగు = మెలగెడి; జలచరములు = చేపలు మున్నగు జీవులు; జలచర = చేపలు మున్నగు జీవుల; హృదయముల = మనసులలో; బెగడు = బెదురు; కదురన్ = నెలకొనునట్లు; డొంకి = అడుగంటి; ఇంకిన = ఎండిపోయిన; నదులును = ఏరులు; నదుల = ఏరుల; అందున్ = లో; కర్పూర = కర్పూరపు; మండపంబుల = మండపముల; తెఱంగున = విధముగ; మణి = రత్నాల; కుట్టిమంబుల = అరుగుల; మాట్కిని = వలె; సౌధ = భవనముల; సోపాన = మెట్ల; మార్గంబుల = దారుల; జాడను = వలె; విలోకితంబులు = కనబడునవి; అగు = ఐన; నూతన = కొత్త; సైకతంబులును = ఇసుకదిబ్బలు; సైకత = ఇసుకదిబ్బలపై; ప్రదేశంబులను = స్థలము లందు; ఉదయ = పొద్దుటి; వేళలన్ = పూట; నిత్యకర్మ = ప్రతిరోజు చేయు కర్మలు {నిత్యకర్మలు - సంధ్యావంద నాది విహిత కర్మలు}; అనుష్ఠాన = నడుపుట యందు; నిరతులు = మిక్కిలి నిష్ఠ గలవారు; అగు = ఐన; మునులును = ఋషులు; మునికన్యకా = ఋషికన్యల యొక్క; కర = చేతి యందలి; కలశ = కుండలలోని; సలిలా = నీటిచేత; అభిషిక్త = తడుపబడిన; మూలంబులు = మొదళ్ళు కలవి; అగు = ఐన; తపోవన = మునివాటికలలోని; బాల = లేత; రసాల = మామిడి; సాలంబులును = చెట్లు; సాల = మద్ది; విటపి = చెట్లు; వాసంతికా = పూలగురివింద; కుంజ = పొదల; పుంజంబులన్ = సమూహముల యొక్క; తఱచున = దట్టమై ఉండుటచేత; ఇముడుకొని = చేరుకొని; దినకర = సూర్యుని; కిరణముల్ = కిరణములు; కున్ = కు; కరువలి = గాలి; కిన్ = కి; చొరన్ = ప్రవేశించుటకు; వెరవు = వీలు; పడని = కాని; వనములును = అడవులు; వనములన్ = అడవులందు; తరుల = చెట్ల; కొమ్మలన్ = కొమ్మలందు; ఆకలములున్ = ఆకులు అలములు; ఏకలమ్ములు = చుట్టబెట్టినవి; ఐ = చేసి; మెసంగి = మేసి; మసరుకవిసి = బలమెక్కి; క్రొవ్వి = మదించి; కొమ్ము = దంతముల; కొనల = చివర్ల; సూటి = వాడిదనముతో; ఏటి = కాలువల; దరులున్ = గట్లను; త్రవ్వి = తవ్వి; చిమ్మి = చెదరగొట్టి; కుమ్మి = కమ్ములతో పొడిచి; కోరాడెడు = మట్టి ఎగజల్లెడు; వనగజంబులును = అడవి ఏనుగులు; గజ = ఏనుగుల యొక్క; కుంభ = కుంభస్థలమువంటి; కనక = బంగారు; కుంభ = కుండలవంటి; రుచిర = ప్రకాశము కలిగిన; కుచ = స్తనముల; భార = బరువుచేత; భీరు = భయపడుచున్నట్టి; మధ్య = నడుములుతోటి; సమంచితలు = చక్కగా ఉన్నవారు; అగు = ఐన; చెంచితలును = చెంచుస్త్రీలు; చెంచితల = చెంచుస్త్రీల; క్రూరమ్ములు = భయంకరమైనవి; అగు = ఐన; వాలమ్ముల = బాణముల; సారముల = సత్తువలవలన; చెడి = నశించి; బెడిదంబుగన్ = మిక్కిలిగా; పాదంబులున్ = కాళ్ళు; తొట్రుపడన్ = తడబడగా; పెను = పెద్దపెద్ద; గాతమ్ములన్ = పల్లములలో, గోతులలో; పడు = పడిపోయెడి; వరాహ = అడవిపందులు; పుండరీకంబులును = పెద్దపులులు; పుండరీక = తెల్లతామరల; కుంద = కొండమల్లెల; కుముద = తెల్లకలువపూల; కురంటక = పచ్చగోరింట; ఆది = మున్నగు; కుసుమ = పూల యొక్క; మకరందంబు = తేనెలను; క్రోలి = తాగి; తేలి = తనిసి; సోలి = చొక్కి; వాలి = అతిశయించి; మహా = గొప్ప; అహంకృతులన్ = అహంకారములతో; ఝంకృతులున్ = ఝాంకారములను; చేయు = చేసెడి; తేటి = తుమ్మెదల; కదుపులును = సమూహములు; కదుపులన్ = గుంపులలో; కలయకు = కూడకుండా; ఎదకలిగి = ఎదకట్టి; మదమునన్ = కామమదముచేత; అదను = తగిన సమయము; పదను = పరిపాకములను; ఎఱింగి = తెలిసికొని; మదన = మన్మథుని; మార్గణ = బాణములచే; ప్రేరితంబులు = ప్రేరేపింపబడినవి; ఐ = అయ్యి; పెంటి = ఆడజంతువుల; తుటుముల = సమూహముల; వెంటన్ = వెంబడి; చని = పోయి; ఒండొంటిన్ = ఒక్కొక్కదానిని; గెంటించుచన్ = దాటుతు; తగులన్ = ఆనిగా నెక్కి; గర్భంబులున్ = చూలులను; నెక్కొలుపు = నిలబడజేయు; మృగ = మృగములును; వృషభరాజంబులు = ఆంబోతులు; కలిగి = కలిగినదై; రాజరాజ = కుబేరుని; గృహంబున్ = ఇంటి; పగిదిన్ = వలె; విలసిత = ప్రకాశించునట్టి; కుంద = మొల్లలతో, కుందనిధి; పద్మ = కమలములతో, పద్మనిధి; సౌభాగ్యంబు = కోరదగినది, సంపద కలది; ఐ = అయ్యి; భాగ్యహీను = దురదృష్టవంతుని; కర్మంబు = పని; రేఖన్ = వలె; అశ్రుత = వినబడని; నీలకంఠ = నెమళ్ళ, శివుడు అనెడి; శబ్దంబు = కేకలు గలది, పేరు గలది; ఐ = అయ్యి; శబ్దశాస్త్రవేది = వ్యాకరణవేత్త యొక్క; హృదయంబు = మనసు; బాగునన్ = వలె; విశద = నిర్మలమైన, స్పష్టమైన; ప్రకాశ = వెలుగులచే, వ్యక్తీకరణలతో; అభిరామంబు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; రామ = శ్రీరాముని; సంగ్రామంబు = యుద్ధము; కైవడిన్ = వలె; బాణ = నల్లగోరింట వేగిసలచే, విల్లులచే; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయ్యి; కృతాంత = యముని; హృదయంబు = మనసు; కరణిన్ = వలె; అపంకంబు = బురద లేనిది, పాపము లేనిది; ఐ = అయ్యి; పంకజాసను = బ్రహ్మదేవుని; గేహంబు = నివాసము; సొంపునన్ = వలె; రాజహంస = రాయంచలచే, గొప్ప ఆత్మజ్ఞానులచే; విరాజమానంబు = విరాజిల్లునది; ఐ = అయ్యి; మానధనుని = ఆత్మాభిమానము గలవాని; చరిత్రంబు = నడవడిక; సొబగునన్ = వలె; అకల్మష = స్వచ్ఛమైన, కపటములేని; జీవనంబు = నీరు గలది, జీవితము కలది; ఐ = అయ్యి; వననిధి = సముద్రము {వననిధి - వనము (నీటికి) నిధి (గనివంటిది), కడలి}; పొలుపునన్ = సొంపుతో; సమ్మిళిత = సమృద్ధిగా కలిగిన; భూభృత్ = కొండ, రాజుల; వాహినీ = వాగులతో, సేనావాహినితో; సంకులంబు = కలకలము గలది; ఐ = అయ్యి; కుల = మంచివంశపు; వధూ = ఇల్లాళ్ళలో; రత్నంబు = శ్రేష్ఠురాలి; చెలువునన్ = వలె; అదృష్ట = కనబడని; పయోధరంబు = మేఘము కలది, పాలిండ్లు కలామె; ఐ = అయ్యి; ధరణి = భూమి; కిన్ = కి; తొడవు = అలంకారము; ఐ = అయ్యి; శరత్కాలంబు = శరదృతువు; వచ్చెన్ = వచ్చినది; అందున్ = అప్పుడు.
భావము:- ఇంకా శరత్కాల సమయంలో, బ్రతుకు తెరువులు వదలి నిర్మల జ్ఞాన ప్రభావంతో ముక్తికేగు పురుష పుంగవుల మాదిరి మేఘాలు గాలివాలుకి ఆకాశంలో వికావికలై వెళ్ళిపోయాయి; విజ్ఞానం అనే దీపంతో వెలుగొందే యోగిచిత్తం లాగ ఆకాశ మండలం మబ్బులు వీడి అగస్త్య నక్షత్రంతో కూడి స్వచ్ఛంగా అయి ప్రకాశించింది; అలాంటి ఆకాశ వీధిలో చుక్కల గుంపులు అకాశం చాందినికి గూర్చిన ముత్యాల విధంగా విలసిల్లసాగాయి; ఆ నక్షత్రకాంతుల విజృంభణం అరికడుతూ చంద్రకిరణాలు బ్రహ్మాండమనే పేటికలో కర్పూరఖండాలై రంజిల్లాయి; ఆ చంద్రకిరణాలు సోకి పంటకు వచ్చిన వరి మొదలైన పైరులు బాగా పండి భూమికి నిండుతనం చేకూర్చసాగాయి; అవి రైతుల చేతి కరుకైన వాడి కొడవళ్ళ పదనును తలచి తల్లడం చెంది వెలవెలబారాయి; నిండైన వెన్నుల భారంతో వ్రాలి గాలికి తూగుతూ మర్మర ధ్వనులు సల్పుచున్న ఆ వరిపంట పుడమితల్లికి ప్రణమిల్లి వడవడ వణుకుతూ రక్షింపమని మొరపెట్టుకుంటున్నట్లు అనిపిస్తోంది; చిలుకల బారులు వరివెన్నుల గుంపులను త్రుంచి ముక్కులతో కబళించి తమ పిల్లలతో పెంటి గుంపుతో చేరి కడుపార మెక్కి సొక్కుతూ సోలుతూ పయనించసాగాయి; అలా పోతూ పోతూ ఎత్తైన మంచె మీద ఎక్కి అటూ ఇటూ తిరుగుతూ పైర్లకు కాపలా ఉన్న పడతుల ఎఱ్ఱని పెదవులు దొండపండ్లని భ్రమంచి కరిచాయి; అలా కరిచి ఆ చెలుల చేతి విసురుకు ఉలికిపడి కిలకిల ధ్వనులు గావిస్తూ రివ్వున ఎగిరిపోయాయి; తేటనీటితో నిండిన సరస్సులు కలహంసలు చక్రవాకాలు బెగ్గురుపక్షుల కలకల నినాదంతో చెలువారాయి; ఇండ్ల లోపల ఇంకెన్నాళ్ళు జీవించడమో తెలియని మనుజుల మాదిరి తటాకాలలోని జలం దినదినానికీ ఇంకిపోవడం గమనింపక జలచరాలు అందులోనే చరించసాగాయి; ఆ జలచరాల చిత్తాలలో భీతి జనింపగా నదులు నానాటికి తగ్గి ఇంకసాగాయి; ఆ నదులలో క్రొత్తగా మేటలేసిన ఇసుకతిన్నెలు కర్పూర మండపాల లాగ మణులు తాపిన స్థలాల మాదిరిగా మేడమెట్ల పోలికగా చూడ సొబగై ఉన్నాయి; ఆ సైకత ప్రదేశాలలో తెల్లవారగట్ల సమయంలో మునులు నిత్యకర్మాచరణలో నిమగ్నులయ్యారు; అక్కడి తపోవనాల లోని గున్నమామిడిచెట్ల పాదులలో మునికన్యలు చేతిబిందెలతో నీళ్ళు పోయసాగారు; ఆ వనాలు మద్దిచెట్లు మొల్లతీవెలు అల్లిబిల్లిగా అల్లుకోవడం వలన సూర్యకిరణాలకూ పవనాలకూ బొత్తిగా చొరవీలుకానివి అయ్యాయి; అడవి ఏనుగులు అడవి చెట్లకొమ్మల లోని ఆకులు అలములు యధేచ్ఛగా మేసి క్రొవ్వెక్కి దంతాగ్రాలతో ఏటిగట్లు క్రుమ్మి క్రుచ్చి పోరాడాయి; అక్కడ చెంచితలు ఏనుగు కుంభాలు బంగారు కలశాల వంటి చక్కని చనుగుబ్బల బరువుకు వణుకుతున్న సన్నని నడుములు కలవారై ఉన్నారు; ఆ బోయతల వాడి బాణాల ఘాతాలకి చేవ గోల్పోయి అడవిపందులు పులులు దుఃఖంతో కాళ్ళు తొట్రుపడగా వెళ్ళి పెద్ద గుంటలలో పడిపోసాగాయి; తుమ్మెద కదుపులు కమలములు కలువలు గోరింటలు మొదలైన పూలలోని తీయతేనెలు గ్రోలి మత్తెక్కి సొక్కి సోలుతూ జుంజుమ్మని రొదచేయసాగాయి; మృగశ్రేష్ఠాలు వృషభరాజాలు మందలతో చేరక మదమెక్కి దూరంగా సంచరిస్తూ కామప్రేరితాలై ఒకదాని నొకటి త్రోసుకుంటూ పెంటిగుంపు వెంటబడి వాటిని దాటసాగాయి; ఆ శరత్కాలం కుందము పద్మము అనే నిధులతో నివ్వటిల్లే కుబేరుని మందిరం లాగ మొల్లలతో తామరలతో ఒప్పారింది; శివశబ్దం విన నోచని అభాగ్యుని చెవి లాగ నెమళ్ళ రవళి వినబడనిది అయిపోసాగింది; విశ్వప్రకాశమనే నిఘంటువుతో చెలువారే వ్యాకరణ శాస్త్రవేత్త హృదయంలాగ విశ్వమును విలసింప జేయుట చేత మనోహరం అయింది; ధనుస్సుతో చెలువారిన రాముని యుద్ధం లాగ నల్లగోరింట వేగిసచెట్లతో విలసిల్లింది; పాపరహితమైన యమధర్మరాజు మనస్సు లాగ బురదలేనిది అయింది; రాజహంసలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధం లాగ రాయంచలతో విలసిల్లింది; పాపరహితమైన జీవనంతో చెలువారే మానధనుడి నడవడి లాగ నిర్మలమైన నీరు కలది అయి నివ్వటిల్లింది; పర్వతాలతోను నదులతోనూ కూడిన కడలిలాగ కలిసికొన్న రాజసేవలు కలది ఐనది; చనుకట్టు కనబడనీయని ఇల్లాలి లాగ కనరాని మబ్బులు కలది అయింది; అలా శరదృతువు అవనీ మండలానికే అలంకారమయింది.
మరొక ముక్తగ్రస్తాలంకారం.......
తెభా-10.1-767-క.
వాజుల నీరాజనములు
రాజుల జయగమనములును రాజిత లక్ష్మీ
పూజలు దేవోత్సవములు
రాజిల్లెను జగతి యందు రాజకులేంద్రా!
టీక:- వాజుల = గుఱ్ఱములకిచ్చెడి {వాజుల నీరాజనములు - యుద్ధములకు పోబోవునప్పుడు గుఱ్ఱములు ఏనుగులు రథములు మున్నగు వానికి నీరాజనము (హారతి) ఇచ్చి హారతి మంటలు సవ్యముగా చలించిన జయము కలుగును అని భావించెడి వాడుక కలదు దానిని వాజుల నీరాజనము అందురు}; నీరాజనములు = హారతులను శాంతికర్మలు; రాజుల = రాజుల యొక్క; జయగమనములును = దిగ్విజయ యాత్రలు; రాజిత = ప్రకాశించెడి; లక్ష్మీ = లక్ష్మీదేవికి చేసెడి; పూజలున్ = పూజలు; దేవ = నానాదేవతల యొక్క; ఉత్సవములు = పండగలు; రాజిల్లెన్ = విలసిల్లెను; జగతిన్ = లోకము; అందున్ = లో; రాజకులేంద్రా = మహారాజా.
భావము:- ఓ పరీక్షిత్తు రాజపుంగవా! శరత్కాలంలో అశ్వాలకు హారతులెత్తారు. రాజుల విజయప్రస్థానాలు, లక్ష్మీపూజలు, దేవోత్సవాలు జరుగసాగాయి.
తెభా-10.1-768-క.
చేగ గల చెఱకువింటను
బాగుగ నీలోత్పలంబు బాణంబుగ సం
యోగంబు చేసి మదనుఁడు
వేగంబున విరహిజనుల వేటాడె నొగిన్.
టీక:- చేగ = చేవ, పటువైన; చెఱుకు = చెరుకుగడ; వింటను = విల్లు నందు; బాగుగున్ = చక్కగా; నీలోత్పలంబున = నల్ల కలువపూవును; బాణంబుగా = అమ్ముగా; సంయోగంబు = సంధించుట; చేసి = చేసి; మదనుడు = మన్మథుడు; వేగంబునన్ = వడిగా; విరహిజనులన్ = విరహము (ప్రియుల ఎడబాటు) గలవారిని; వేటాడెన్ = వేటాడెను; ఒగిన్ = పూనికతో.
భావము:- మన్మథుడు తన చేవగల చెరకువింట నల్లకలువను శరంగా సంధించి బహు వేగంగా విరహము గలవారలను వేటాడసాగాడు.
తెభా-10.1-769-వ.
ఇట్లు భాసురంబైన శరద్వాసరంబుల గోవిందుండు గోబృంద సమేతుండై బృందావనంబునం బసులఁ బొసంగ మేపుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భాసురంబు = ప్రకాశవంతమైనది; ఐన = అయినట్టి; శరత్ = శరదృతువు నందలి; వాసరంబులన్ = దినములలో; గోవిందుడు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; గోప = గోపకుల; బృంద = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; బృందావనంబుననన్ = బృందావనములో; పసులన్ = పశువులను; పొసగన్ = చక్కగా; మేపుచు = పాలించుచు.
భావము:- ఈవిధంగా పసందైన కనువిందైన ఆ శరత్కాలపు రోజులలో శ్రీ కృష్ణుడు హాయిగా ఆలమందలతో కూడి బృందావనంలో పశువులను మేపాడు.