పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వేణువిలాసంబు

తెభా-10.1-770-సీ.
ర్ణావతంసిత ర్ణికారప్రభ-
గండభాగద్యుతిఁ డలుకొలుప
భువనమోహనమైన భ్రూవిలాసంబుతో-
వామభాగానతదన మొప్ప
పసవ్యకర మృదులాంగుళీ చాతురి-
డ్జధ్వనికి మర్మరణిఁ జూప
డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన-
దనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ

తెభా-10.1-770.1-తే.
మౌళిపింఛముఁ గంఠదామును మెఱయ
విలసితగ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వగీతంబు రఁగఁ జేసెఁ
తురనటమూర్తి గోపాలక్రవర్తి.

టీక:- కర్ణా = చెవియందు; అవతంసిత = సిగపువ్వుగాతురిమిన; కర్ణికార = కొండగోగిపువ్వు; ప్రభ = కాంతి; గండభాగ = చెక్కిలిపలకల; ద్యుతిన్ = కాంతిని; కడలుగొలుప = ఓడించగా; భువన = లోకములను; మోహనము = మోహింపజేయునది; ఐన = అయినట్టి; భూ = కనుబొమల; విలాసంబు = చక్కటికదలికల; తోన్ = తోటి; వామ = ఎడమ; భాగ = పక్క; ఆనత = వంచబడిన; వదనము = మోము; ఒప్పన్ = అందగించుచుండగ; అపసవ్య = కుడి; కర = చేతి యొక్క; మృదుల = మృదువైన; అంగుళీ = వేళ్ళ యొక్క; చాతురి = నేర్పు; షడ్జమ = షడ్జమస్వరము యొక్క; ధ్వని = ధ్వని; కిన్ = కి; మర్మ = రహస్య; సరణిన్ = మార్గమును; చూపన్ = చూపుచుండగా; డాకాలి = ఎడమకాలి; మీదన్ = మీద; అడ్డమున్ = అడ్డముగా; చాచి = చాపి; నిల్పిన = ఉంచినట్టి; పద = కాలి; నఖ = గోర్ల; ద్యుతిన్ = కాంతి; భూమిన్ = నేలపైన; ప్రబ్బికొనగా = వ్యాపించగా.
మౌళి = సిగయందలి; పింఛమున్ = నెమలి పింఛము; కంఠ = మెడలోని; దామమున్ = వనమాల; మెఱయన్ = ప్రకాశించుచుండగా; విలసిత = ప్రకాశవంతమైన; గ్రామమునన్ = సంగీతవిన్యాసముతో, షడ్జము మొదలైన స్వరముల సముదాయముతో కూడిన; ఒక్క = ఒకానొక; వేణువు = పిల్లనగ్రోవి యందు; బ్రహ్మ = గొప్ప, వేదసంబంధమైన; గాంధర్వగీతంబు = అతిచక్కటిగానమును; పరగన్ = ప్రకాశింప; చేసెన్ = చేసెను; చతురనటమూర్తి = శ్రీకృష్ణుడు {చతురనటమూర్తి - చతుర (మిక్కిలినేర్పుగల) నటుని వంటి మూర్తి (స్వరూపము కలవాడు), కృష్ణుడు}; గోపాలచక్రవర్తి = శ్రీకృష్ణుడు {గోపాలచక్రవర్తి - గోపకులకు మహారాజు, కృష్ణుడు}.
భావము:- మిక్కిలి చమత్కారమైన నటనాలతో మనసు లలరించే గోపాల చక్రవర్తి యైన శ్రీకృష్ణమూర్తి చెవిసందులో తురిమిన కొండగోగుపూల అందం, చెక్కిళ్ళ శోభను ఇనుమడిస్తుండగా; విశ్వాన్నంతటిని మోహింపజేసే బొమముడి సోయగా, లొప్పుతుండగా; ఎడమ పక్కకి వంచిన తల, చక్కదనాలు చిందిస్తుండగా; కోమలమైన కుడిచేతి వ్రేళ్ళ నైపుణ్యాలు షడ్ఝస్వరానికి, నర్మగర్భ అందాలు అద్దుతుండగా; ఎడమ కాలిమీద అడ్డంగా సాచి ఉంచిన కుడి కాలిగోర్లు, మేదిని మెరుపులు మెదుపుతుండగా; సిగలోని నెమలి పింఛము, మెడలోని వైజయంతీమాలల మిలమిలలు, మించుతుండగా; మురళిని మోవిపై ఆనించి గ్రామ మూర్చను లనే స్వరభేదాలు స్వచ్ఛంగా వెలయిస్తూ; బ్రహ్మగాంధర్వగీత మనే సామవేదగానం (ఆ శారదాదినాలలో గోవుల మేపుతూ) ఆలపించాడు.

తెభా-10.1-771-వ.
ఇట్లు హరి వేణునాదంబు పూరింపఁగ మారవికారహేతు వగు తద్గీతం బాలించి సిగ్గులు చాలించి మక్కువలు చెక్కులొత్త గోపిక లోపికలు లేక తమతమ పొత్తుకత్తెలుం దారును దత్తఱంబునం బదుగురు నేగురుం దుటుములు గట్టి జిలిబిలి ముచ్చటలకుం జొచ్చి తమలోన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; వేణు = మురళీ; నాదంబున్ = రవమును; పూరింపగన్ = ఊదుతుండగా; మార = మన్మథ; వికార = వికారములకు; హేతువు = కారణము; అగు = ఐన; తత్ = ఆ యొక్క; గీతంబున్ = గానమును; ఆలించి = విని; సిగ్గులు = లజ్జలను; చాలించి = వదలివేసి; మక్కువలు = అనురాగములు; చెక్కులొత్తన్ = అతిశయించగా; గోపికలు = గోపికాస్త్రీలు; ఓపికలు = తాలుములు; లేక = లేకపోవుటచేత; తమతమ = వారివారి; పొత్తుకత్తెలున్ = స్నేహితులు; తారును = తాము; తత్తఱంబునన్ = తబ్బిబ్బుతో; పదుగురున్ = పదేసిమంది; ఏగురున్ = ఐదేసిమంది; తుటుములు = గుంపులుగ; కట్టి = ఏర్పడి; జిలిబిలి = శృంగార ప్రయుక్తమైన; ముచ్చటలు = కబుర్లుచెప్పుకొనుట; కున్ = కు; చొచ్చి = ఆరంభించి; తమలోనన్ = వారిలోవారు.
భావము:- ఇలా కృష్ణుడు మురళి ఊదుతుంటే కామోద్దీపకమైన ఆ పిల్లనగ్రోవి పాట విని గొల్లచేడియలు సిగ్గులు వదిలిపెట్టారు. వలపులు చిగురించగా ఆ గోపికలు ఓపిక వహింప లేక తమ తమ చెలికత్తలతో సంభ్రమంగా గుంపులుగా కూడి తమలోతాము సరసపు ముద్దుముచ్చటలకు ఉపక్రమించి...