పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికల విరహాలాపములు

తెభా-10.1-1128-శా.
"భ్రూవిక్షేపముతోడ దాపలి భుజంబుం జెక్కుఁగీలించి కె
మ్మోవిన్ వేణువుఁ గూర్చి సుస్వరముగా మ్రోయించుచు న్నంగుళీ
ప్రావీణ్యంబు విభుండు చూపఁ గని సప్రాణేశలై యుండియున్
నీవీబంధము లూడఁ జొక్కుదురుపో నింగిన్ నిలింపాంగనల్.

టీక:- భ్రూ = కనుబొమల; విక్షేపము = కదలికల; తోడన్ = తోటి; దాపలి = ఎడమ; భుజంబున్ = భుజముమీద; చెక్కున్ = చెక్కలిని; కీలించి = చేర్చి; కెంపు = ఎఱ్ఱని; మోవిన్ = కిందిపెదవి యందు; వేణువున్ = మురళిని; కూర్చి = అమర్చి; సు = మంచి; స్వరము = స్వరము; కాన్ = కలుగునట్లు; మ్రోయించుచున్ = వాయించుచు; అంగుళీ = వేళ్ళ యొక్క; ప్రావీణ్యంబున్ = నేర్పును; విభుండు = శ్రీకృష్ణుడు; చూపన్ = కనబరచగా; కని = చూసి; సప్రాణేశలు = భర్తలతో ఉన్నవారు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికి; నీవీబంధములు = నడుముకు వేసే చీరముడి; ఊడన్ = విడిపోగా; చొక్కుదురుపో = పరవశు లగుదురు కదా; నింగిన్ = ఆకాశము నందు; నిలింప = దేవతా; అంగనల్ = స్త్రీలు.
భావము:- “వేణుమాధవుడు ఎడమ భుజంమీద చెక్కిలి ఆనించి, ఎఱ్ఱని పెదవిపై వేణువును ఉంచి కనుబొమలు తిప్పుతూ, వ్రేళ్ళను పిల్లనగ్రోవి రంధ్రాల మీద నేర్పుతో సారిస్తూ, మధుర స్వరాలు ఒలికేలా గానం చేస్తుంటే, భర్తలతోపాటు ఆకాశంలో విహరిస్తూ చూస్తున్న దేవతా స్త్రీలు చీరముడులు జారగా మదనవేదన పాలవుతూ ఉంటారే.

తెభా-10.1-1129-మ.
మాధుర్యము గల్గు కృష్ణు మురళీ నాదామృతస్యందముల్
చెవులం జొచ్చి హృదంతరాళముల భాసిల్లన్ సవత్సంబులై
యువిదా! మేపులకుం దొఱంగి మృగ గోయూధంబు లుత్కంఠతో
దివికిం గంఠము లెత్తి లోవదలుఁబో దేహేంద్రియవ్యాప్తులన్.

టీక:- నవ = సరికొత్త; మాధుర్యము = రుచులు; కల్గు = కలిగినట్టి; కృష్ణు = కృష్ణుని యొక్క; మురళీ = వేణు; నాద = స్వరము అనెడి; అమృత = అమృతపు; స్యందముల్ = ధారలు; చెవులన్ = చెవు లందు; చొచ్చి = ప్రవేశించి; హృత్ = మనసు; అంతరాళములన్ = లోపలపొరలను; భాసిల్లన్ = ప్రకాశింపగా; సవత్సంబులు = దూడలతో ఉన్నవి; ఐ = అయ్యి; ఉవిదా = మగువా; మేపుల్ = మేత మేయుట; కున్ = కు; తొఱంగి = మాని; మృగ = లేళ్ళ; గో = ఆవుల; యూధంబులు = సమూహములు; ఉత్కంఠ = అధికమైన ఆసక్తి; తోన్ = తోటి; దివి = ఆకాశమువైపున; కిన్ = కు; కంఠములు = మెడలు; ఎత్తి = ఎత్తి; లో = లోలోపలనే; వదలుబో = అణచుకొనును సుమా; దేహ = శారీరక; ఇంద్రియ = ఇంద్రియముల; వ్యాప్తులన్ = వ్యాపారములను.
భావము:- ఓ నెలతా! నవనవీన మాధుర్యాలు పలికే మురారి మురళి నినాదమనే అమృతస్రావం వీనులలో జొరబడి హృదయంలోకి చేరగానే మేతలు మేయడం చాలించి, లేగల తోపాటు, ఆవులు, ఇతర మృగాలు అన్నీ పారవశ్యం చెందుతాయి. ఆకాశానికి మోరలెత్తుకుని దేహమునకు సంబంధించిన ఇంద్రియవ్యాపారాలు సర్వం వదలివేస్తాయి.

తెభా-10.1-1130-శా.
! కంజేక్షణ! కృష్ణుఁ డుజ్జ్వలిత హారోద్దాముఁడై గానవి
ద్యాకౌతూహలతన్ మనోజ్ఞ మురళీ ధ్వానంబు గావింపఁగా
నార్ణించి సశంపమై మొఱయు నీలాభ్రంబుగాఁ జూచుచుం
గేకారావము లిచ్చుచున్ మురియుఁ బో కేకీంద్రసంఘాతముల్.

టీక:- ఓ = ఓ; కంజేక్షణ = సుందరీ {కంజేక్షణ - కంజ (పద్మము)వంటి ఈక్షణ (కన్నులుకలామె), స్త్రీ}; కృష్ణుడు = కృష్ణుడు; ఉజ్జ్వలిత = తళతళలాడుతున్న; హార = కంఠహారములతో; ఉద్దాముడు = స్వతంత్రుడు; ఐ = అయ్యి; గానవిద్యా = పాటలుపాడుట యందలి; కౌతూహలతన్ = కుతూహలముచే; మనోజ్ఞ = మనోసున కింపైన; మురళీ = వేణు; ధ్వానంబున్ = నాదమును; కావింపగాన్ = చేయగా; ఆకర్ణించి = విని; సశంపము = మెరుపుతీగలతో కూడినది; ఐ = అయ్యి; మొరయు = గర్జించు; నీల = నల్లని; అభ్రంబు = మేఘము; కాన్ = అయినట్లు; చూచుచున్ = భావించుచు; కేకారవములు = కేకలశబ్దములు; ఇచ్చుచున్ = చేయుచు; మురియుబో = మురిసిపోవును సుమా; కేకి = నెమలి; ఇంద్ర = శ్రేష్ఠముల; సంఘాతముల్ = సమూహములు.
భావము:- కలువకన్నుల సుందరీ! తళతళ లాడే ముత్యాలహారం ధరించిన శ్రీకృష్ణుడు గాంధర్వ విద్యపై ఆసక్తితో మనోహరమైన వేణుగానం చేస్తాడు. ఆ గానం ఆలకించి అతడిని మెరుపుతో కూడిన నీలమేఘం అనుకుని, కేకారావాలు చేస్తూ నెమళ్ళు అన్నీ, మైమరచి నాట్యాలు ఆడతాయి.

తెభా-10.1-1131-మ.
నా! యేటికి తెల్లవాఱె? రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ?
కాలంబు నహంబు గాక నిశిగాఁ ల్పింపఁ డా బ్రహ్మ దా
ఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;
దే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్.

టీక:- లలనా = పడతి {లలన – విలసనశీల యైనామె, స్త్రీ}; ఏటికిన్ = ఎందుకు; తెల్లవాఱెన్ = తెల్లవారినది; రవి = సూర్యుడు {రవి – రూయతేస్తూ యత ఇతి రవిః, సూర్యుడు}; ఏలా = ఎందుకు; తోచెన్ = కనబడెను; పూర్వా = తూర్పు; అద్రి = కొండ; పైన్ = మీద; కలకాలంబు = ఎల్లప్పుడు; అహంబు = పగలు; కాకన్ = కలుగకుండా; నిశి = రాత్రి; కాన్ = అగునట్లు; కల్పింపడు = కలుగజేయడు; ఆ = ఆ యొక్క; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; తాన్ = తాను; వలఱేడున్ = మన్మథుడును {మన్మథుడు – యత్ బుద్ధిః తాం మంథాతీతి మన్మథః};; కృపలేడు = దయలేనివాడు; కీరములు = చిలుకలు; దుర్వారంబులు = అడ్డగింపరానివి; ఎట్లోకదే = ఎలాగో ఏమిటో; కలదే = ఉన్నదా అసలు; మాపటి = రాత్రి; కాలము = సమయము; అందున్ = దానిలో; మన = మన; కున్ = కు; కంజాక్షు = పద్మాక్షునితో, కృష్ణునితో; సంభోగముల్ = కలియికలు.
భావము:- ఓ విలాసవతీ! ఎందుకు తెలవారిందే? తూర్పుకొండ మీద భానుడు ఎందుకు ఉదయించాడే? ఉన్న పగళ్ళన్నీ ఎప్పటికీ తెలవారని రాత్రిళ్ళుగా బ్రహ్మదేవు డెందుకు చేయడే? మన్మథుడు కూడా మరీ కరుణమాలినవాడు అయిపోయాడు. చిలుకలను వారించేవారే లేరు. ఎలాగమ్మా ఈ పగలు వేగించడం? మళ్ళీ రాత్రి అవుతుందా? పద్మాక్షుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా?
కృష్ణవిరహదుఃఖంతో ఓపికలులేక ఇళ్లల్లో వేగిపోతూ ఉన్న గోపికలలో ఒకామె తన స్నేహితురాలి దగ్గర ఇలా విలపిస్తోంది. తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం కలిగి మెళకువ అనుకుంటే, ‘ఇంద్రియాణాం మనశ్చాస్మి’ అని గీత కనుక రవి అంటే మనస్సు అనుకుంటే, పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని, అద్రి అంటే ఈ దేహం అనుకుంటే, మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు. అహము అంటే సంసార సంపాదనకై సంచారం చేసే పగలు అనుకుంటే నిశి అంటే నిర్వికల్ప స్థితిలో ఉండే సమయం రాత్రి అనుకుంటే. పగళ్ళు వద్దు రాత్రే కావాలి అనటం. ‘బుద్ధిః తాం మంథాతీతీ మన్మథః ’ అని వ్యుత్పత్తి. ఆ మన్మథుడు మనసుని బ్రహ్మజ్ఞానం తెలుసుకోమని మథించేస్తున్నాడుట, పోని సంసార లంపటంలో పడుతున్నాడు పడనీ అని జాలిపడకుండా. చిలకలు అంటే సమాధి కుదరకుండా చెదరగొట్టే బాహ్యాభ్యంతరంలో ‘తియ్యగా అనిపించే శబ్దప్రపంచం’ అనుకుంటే. దానిని ఆపే నాథుడు లేడని విసుగు కలుగుతోంది అనుకోవచ్చు. మాపటివేళ అంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానం స్పురించే సమాధిలో ఉండే సమయం. కంజాక్షుడు బ్రహ్మజ్ఞానమే చూపుగా కల ఆ పరబ్రహ్మతో కూడుట ఎప్పటికి లభిస్తుంది అని ఆత్రుతగా ఉంది అనుకోవచ్చు.

తెభా-10.1-1132-ఉ.
ప్పుడు ప్రొద్దు గ్రుంకు? హరి యెప్పుడు గోవుల మేపి వచ్చు? నా
కెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణ మబ్బు? నతండు వచ్చి న
న్నెప్పుడు గారవించుఁ? దుది యెప్పుడు మద్విరహాగ్నిరాశికిం?
జెప్పఁగదమ్మ! బోటి! మరుచేఁతల నుల్లము తల్లడిల్లెడిన్.

టీక:- ఎప్పుడు = ఎప్పుడు; ప్రొద్దుగ్రుంకున్ = సాయంకాల మగును; హరి = కృష్ణుడు; ఎప్పుడు = ఎప్పుడు; గోవుల = ఆవులను; మేపి = కాచి; వచ్చున్ = వచ్చును; నా = నా; కున్ = కు; ఎప్పుడు = ఎప్పుడు; తత్ = అతని; ముఖ = ముఖము అనెడి; అంబుజ = పద్మము యొక్క; సమీక్షణము = చక్కగా చూచుట; అబ్బున్ = కలుగును; అతండు = అతను; వచ్చి = వచ్చి; నన్నున్ = నన్ను; ఎప్పుడు = ఎప్పుడు; గారవించున్ = మన్నించును; తుదిన్ = పూర్తగుట; ఎప్పుడు = ఎప్పుడు; మత్ = నా యొక్క; విరహ = ఎడబాటువలని; అగ్ని = తాపముల; రాశి = సమూహమున; కిన్ = కు; చెప్పగద = చెప్పుము; అమ్మ = తల్లి; బోటి = ఇంతి; మరు = మన్మథుని; చేతలన్ = పనులవలన; ఉల్లము = మనసు; తల్లడిల్లెడిన్ = తత్తరపడుచున్నది.
భావము:- వనితా! ఎప్పుడు ప్రొద్దు గ్రుంకుతుందే? గోవులను మేపి గోపాలు డెప్పుడు వ్రేపల్లెకు వస్తాడు? ఎప్పుడు నాకు నాథుడి ముఖపద్మం దర్శనము అవుతుంది? చెంతకు చేరి అతడు నన్నెపుడు ఆదరిస్తాడు? నా విరహాగ్ని ఎప్పుడు చల్లారుతుందే? చెప్పవే. మదనుడు వాడి శరాలు గుప్పించడం వల్ల నా ఉల్లం తల్లడిల్లిపోతోంది.

తెభా-10.1-1133-మ.
చెలియా! కృష్ణుఁడు నన్నుఁ బాసి వనముం జేరంగ నయ్యా క్షణం
బులు నా కన్నియు నుండ నుండగఁ దగన్ బూర్ణంబులై సాగి లో
లఁ దోఁచుం బ్రహరంబులై దినములై క్షస్వరూపంబులై
నెలై యబ్దములై మహాయుగములై నిండారు కల్పంబులై."

టీక:- చెలియా = మగువా; కృష్ణుడు = కృష్ణుడు; నన్నున్ = నన్ను; పాసి = విడిచిపెట్టి; వనమున్ = అడవిని; చేరంగన్ = ప్రవేశించగా; అయ్యా = ఆయా; క్షణంబులు = క్షణములు; నా = నా; కున్ = కు; అన్నియున్ = అన్నికూడ; ఉండనుండగన్ = ఉండగా ఉండగా; తగన్ = చటుక్కున; పూర్ణంబులు = నిండుగా ఉన్నవి; ఐ = అయ్యి; సాగి = పొడవు పెరిగిపోయి; లోపలన్ = మనసులోపల; తోచున్ = తోచుచుండును; ప్రహరంబులు = జాములు; ఐ = అయ్యి; దినములు = రోజులు; ఐ = అయ్యి; పక్ష = పక్షముల; స్వరూపంబులు = స్వరూపము కలవి; ఐ = అయ్యి; నెలలు = మాసములు; ఐ = అయ్యి; అబ్దములు = సంవత్సరములు; ఐ = అయ్యి; మహాయుగములు = మహాయుగములు; ఐ = అయ్యి; నిండారు = నిండైన; కల్పంబులు = కల్పములు; ఐ = అయ్యి.
భావము:- చెలీ! శ్రీకృష్ణుడు నన్ను వదలి అడవికి వెళ్ళినప్పుడు, క్షణాలు అన్నీ అంతకంతకూ దీర్ఘములైపోయి సాగి సాగి జాములుగా, దినాలుగా, పక్షాలుగా, మాసాలుగా, సంవత్సరాలుగా, కల్పాలుగా గోచరిస్తున్నాయే.”

తెభా-10.1-1134-వ.
అని మఱియుఁ గృష్ణవిరహ దుఃఖంబున బహువిధంబులఁ బశ్చాత్తాపంబు నొందుచు గోపిక లోపికలు లేక నెట్టకేలకు దివంబు గడిపి దినాంత సమయంబు నందు.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; కృష్ణ = కృష్ణునితో; విరహ = ఎడబాటువలని; దుఃఖంబునన్ = దుఃఖముతో; బహువిధంబులన్ = నానా విధములుగా; పశ్చాత్తాపము = పశ్చాతాపమును; ఒందుచున్ = పొందుతు; గోపికలు = గోపస్త్రీలు; ఓపికలు = సహనములు; లేక = నశించి; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; దివంబున్ = పగటిపూట; గడిపి = జరిపి; దినాంత = సాయంకాలము; సమయంబున్ = సమయము; అందున్ = లో.
భావము:- ఆవిధంగా శ్రీకృష్ణ వియోగ విషాదంతో రకరకాలుగా తపించిపోతూ మదనవేదన భరించలేక గోపికలు చివరికి ఎలాగో పగళ్ళు వెళ్ళబుచ్చి, సాయంకాలం అయ్యేసరికి. . .

తెభా-10.1-1135-మ.
దె భానుం డపరాద్రిఁ జేరె; నిదె సాయంకాల మేతెంచె; న
ల్లదె గోపాదపరాగ మొప్పెసఁగె; బృందారణ్యమార్గంబు నం
దిదె వీతెంచె వృషేంద్రఘోషము; ప్రియుం డేతెంచె రం డంచుఁ దా
మెదు రేతెంతురు మాపు కృష్ణునికి న య్యింతుల్ పరిభ్రాంతలై.

టీక:- అదె = అదిగో; భానుండు = సూర్యుడు; అపరాద్రిన్ = పడమటి కొండ యందు; చేరెన్ = చేరెను; ఇదె = ఇదిగో; సాయంకాలము = సాయంత్రము; ఏతెంచెన్ = వచ్చెను; అల్లదె = అదిగో; గో = గోవుల; పాద = కాలి; పరాగము = ధూళి; ఒప్పు = చక్కదనము; ఎసగెన్ = విజృంభించెను; బృందారణ్య = బృందావనము యొక్క; మార్గంబున్ = దారి; అందు = లో; ఇదె = ఇదిగో; వీతెంచెన్ = వీచింది; వృషేంద్ర = ఎద్దుల; ఘోషము = ఱంకెల చప్పుడు; ప్రియుండు = కృష్ణుడు; ఏతెంచెన్ = వచ్చెను; రండు = రండి; అంచున్ = అని; తాము = వారు; ఎదురు = ఎదురుగా; ఏతెంతురు = వస్తారు; మాపు = సాయంత్రపువేళ; కృష్ణుని = కృష్ణుని; కిన్ = కి; ఆ = ఆ; ఇంతులు = యువతులు; పరి = మిక్కిలి; భ్రాంతలు = భ్రాంతిపొందినవారు; ఐ = అయ్యి.
భావము:- సాయంకాలం కాగానే, అదిగో సూర్యుడు పడమటి కొండకు చేరుతున్నాడు. సాయంకాల మయింది. అదిగో గోధూళి రేగింది. బృందావన వీధుల నుండి ఎద్దుల రంకెలు వినిపిస్తున్నాయి. “వల్లభుడు వచ్చేస్తున్నాడు, రండమ్మా రండి!” అంటూ గోపకాంతలు సంభ్రమంతో సంతోషంతో కృష్ణుడికి ఎదురేగుతారు.

తెభా-10.1-1136-వ.
ఇట్లు తనకెదురు వచ్చిన మచ్చిక న చ్చెలువల నచ్యుతుం డిచ్ఛానువర్తనంబుల గారవించె నంత నొక్కనాడు.
టీక:- ఇట్లు = ఇలా; తన = అతని; కిన్ = కి; ఎదురు = ఎదురుగా; వచ్చినన్ = రాగా; మచ్చికన్ = ఇష్టముతో; ఆ = ఆ యొక్క; చెలువలన్ = స్త్రీలను; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, విష్ణువు}; ఇచ్ఛ = ఇష్టములను; అనువర్తనంబులన్ = అనుసరించిన విధముగ; గారవించెన్ = ఆదరించెను; అంతన్ = ఆ తరువాత; ఒక్క = ఒకానొక; నాడు = రోజు.
భావము:- అలా తనకు ఎదురువచ్చిన గోపికలను వారికి నచ్చే రీతిలో మచ్చికతో మాధవుడు, కృష్ణుడు ఆదరిస్తాడు, ఇలా ఉండగా ఒకరోజు. . . .