పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/యోగమాయ నాఙ్ఞాపించుట
తెభా-10.1-58-వ.
అయ్యవసరంబున విశ్వరూపుం డగు హరి దన్ను నమ్మిన యదువులకుఁ గంసునివలన భయంబు గలుగు నని యెఱింగి యోగమాయాదేవి కిట్లనియె.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; విశ్వరూపుండు = విశ్వమే తా నైనవాడు; అగు = ఐన; హరి = విష్ణుమూర్తి; తన్నున్ = అతనిని; నమ్మిన = విశ్వసించిన; యదువుల్ = యాదవుల; కున్ = కు; కంసుని = కంసుని; వలనన్ = చేత; భయంబున్ = అపాయములు; కలుగును = సంభవించును; అని = అని; ఎఱింగి = తెలిసి; యోగమాయ = యోగమాయ అనెడి; దేవి = దేవతలు; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఆసమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు.
తెభా-10.1-59-సీ.
గోపికా జనములు గోపాలకులు నున్న-
పసులమందకుఁ బొమ్ము భద్ర! నీవు
వసుదేవుభార్యలు వరుసఁ గంసుని చేత-
నాఁకల బడియుండ నందుఁ జొరక
తలఁగి రోహిణి యను తరళాక్షి నంద గో-
కుల మందు నున్నది గుణగణాఢ్య
దేవకికడుపున దీపించు శేషాఖ్య-
మైన నా తేజ మీ వమరఁ బుచ్చి
తెభా-10.1-59.1-ఆ.
నేర్పు మెఱసి రోహిణీదేవి కడుపునఁ
జొనుపు దేవకికిని సుతుఁడ నగుదు
నంశభాగయుతుఁడనై యశోదకు నందు
పొలఁతి కంత మీద బుట్టె దీవు.
టీక:- గోపికా = గోపికాస్త్రీలైన; జనములు = వారు; గోపాలకులున్ = గోపాలురు {గోపాలకులు - గోవులను పాలించెడివారు, యాదవులు}; ఉన్న = ఉన్నట్టి; పసుల = పశువల; మంద = గుంపులన్న వ్రేపల్లె; కున్ = కు; పొమ్ము = వెళ్ళు; భద్ర = నిత్యమంగలస్వరూపి; నీవున్ = నీవు; వసుదేవు = వసుదేవుని యొక్క {వసుదేవునిభార్యలు - 1ధృతదేవ 2ఉపదేవ 3దేవరక్షిత 4శ్రీదేవి 5శాంతిదేవి 6సహదేవి 7దేవకీదేవి}; భార్యలున్ = భార్యలు; వరుసన్ = వరసపెట్టి; కంసుని = కంసుని; చేతన్ = వలన; ఆకలన్ = చెఱ యందు; పడియుండన్ = బంధీలైపడి యుండగా; అందున్ = వారిలో; చొరకన్ = చేరకుండగ; తలగి = తప్పుకొని; రోహిణి = రోహిణి; అను = అనెడి; తరళాక్షి = సౌందర్యవతి {తరళాక్షి - చలించుచున్నకన్నులు గలామె, స్త్రీ}; నంద = నందుని యొక్క; గోకులము = వ్రేపల్లె {గోకులము - గోపాలుర ఆవాసము, వ్రేపల్లె}; అందున్ = లో; ఉన్నది = ఉంది; గుణ = సుగుణములచే; గణా = లెక్కించదగిన; ఆఢ్య = ఉత్తమురాల; దేవకి = దేవకీదేవి; కడుపునన్ = గర్భమునందు; దీపించు = ప్రకాశించెడి; శేష = శేషుడు అనెడి; ఆఖ్యము = పేరుగలది; ఐన = అయినట్టి; నా = నా యొక్క; తేజమున్ = కళను; ఈవ = నీవు; అమరన్ = చక్కగ; పుచ్చి = వెలుదీసి.
నేర్పు = సామర్థ్యము; మెఱసి = అతిశయించగా; రోహిణీ = రోహిణి యనెడి; దేవి = ఉత్తమురాలి; కడుపునన్ = గర్భమునందు; చొనుపు = ప్రవేశపెట్టుము; దేవకి = దేవకీదేవి; కిని = కి; సుతుడను = పుత్రుడను; అగుదున్ = ఐ పుట్టెదను; అంశ = కళల యందు; భాగము = భాగములతో; యుతుడన్ = కూడినవాడను; ఐ = అయ్యి; యశోద = యశోదాదేవి; కున్ = కి; నందు = నందుని యొక్క; పొలతి = భార్య; అంతమీద = అటుపిమ్మట; పుట్టెదవు = జన్మించెదవు; ఈవు = నీవు.
భావము:- “భద్రా! మాయాదేవీ! నీవు గోపాలకులు గోపికలు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలు అందరూ కంసునిచేత బంధీలు అయి జైలులో ఉన్నారు. కానీ, రోహిణి మాత్రం నందుని గోకులంలో తలదాచుకుంది. ఆమె చక్కని గుణగుణాలు కలది. దేవకి కడుపులో ఉన్న శేషుడు అనే తేజస్సును నీవు బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆతరువాత నీవు నందుని ఇంట యశోదాదేవికి బిడ్డగా పుట్టగలవు.
తెభా-10.1-60-క.
నానావిధ సంపదలకుఁ
దానకమై సర్వకామదాయిని వగు నిన్
మానవులు భక్తిఁ గొలుతురు
కానికలును బలులు నిచ్చి కల్యాణమయీ!
టీక:- నానా = అనేక; విధ = రకముల; సంపదల్ = ఐశ్వర్యముల; కున్ = కు; తానకము = ఉనికిపట్టు; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; కామ = కోరికలను; దాయినివి = ఇచ్చెడిదానివి; అగు = ఐన; నిన్ = నిన్ను; మానవులు = నరులు; భక్తిన్ = భక్తితో; కొలుతురు = సేవించెదరు; కానికలనున్ = ముడుపులు; బలులున్ = బలులు, నైవేద్యములు; ఇచ్చి = సమర్పించుకొని; కల్యాణమయి = మంగళస్వరూపీ.
భావము:- మాయాదేవీ! కల్యాణమయీ! నీవు అన్నిరకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవనీ, మానవులు నిన్ను భక్తితో పూజిస్తుంటారు. నీకు కానుకలు, బలులు ఇస్తారు.
తెభా-10.1-61-వ.
మఱియు నిన్ను మానవులు దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి యీశాన శారద యంబిక యను పదునాలుగు నామంబులం గొనియాడుదు రయ్యై స్థానంబుల యం”దని యెఱింగించి సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన మహాప్రసాదం బని యయ్యోగనిద్ర యియ్యకొని మ్రొక్కి చయ్యన ని య్యిల కయ్యెడ బాసి వచ్చి.
టీక:- మఱియున్ = ఇంకను; నిన్ను = నిన్ను; మానవులు = నరులు; దుర్గ = దుర్గాదేవి {దుర్గ - కాశీక్షేత్రమున దుర్గ (వనాది దుర్గమ స్థావరములు కలది, ఎరుగుటకు చాలా కష్టమై నామె)}; భద్రకాళి = భద్రకాళి {భద్రకాళి - భద్రేశ్వర క్షేత్రమున భద్రకాళి (నిత్యమంగళ స్వరూపము నీలవర్ణము కలామె)}; విజయ = విజయ {విజయ - వరాహశైల క్షేత్రమున విజయ (చండ మండ భండాసురులను గెల్చినామె)}; వైష్ణవి = వైష్ణవీదేవి {వైష్ణవి - మాతృకాక్షేత్రమున వైష్ణవి (సర్వ లోకములకు వెలుపల లోపల ఉండెడియామె)}; కుముద = కుముద {కుముద - మానసక్షేత్రమున కుముద (భూమికి సంతోషమును కలుగజేయునామె, భూలోకులకు ఆనందము కలిగించెడియామె, రాక్షసులను నవ్వుచునే (వంచనతో కూడిన) చంపెడి యామె)}; చండిక = చండికాదేవి {చండిక - అమరకుండకక్షేత్రమున చండిక (కోపము గలామె, చండాసురుని చంపినామె)}; కృష్ణ = కృష్ణ {కృష్ణ - హస్తినాపురక్షేత్రమున కృష్ణ (సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనెడి పంచ (5) కృత్యములు చేసెడి యామె, మహామునుల మనసులను ఆకర్షించెడి యామె)}; మాధవి = మాధవి {మాధవి - శ్రీశైలక్షేత్రమున మాధవి (మధ్నాతీతి మాధవి, శత్రువులైన రాక్షసులను శిక్షించునామె)}; కన్యక = కన్యక {కన్యక - కన్యాకుబ్జక్షేత్రమున కన్యక (సకల జనులచేత కోరబడెడియామె)}; మాయ = మాయ {మాయ - మాయానగరక్షేత్రమున మాయ (లక్ష్మీదేవిచే కొలువబడెడి యామె, అజ్ఞానులకు కనబడని యామె)}; నారాయణి = నారాయణి {నారాయణి - సుపార్శ్వక్షేత్రమున నారాయణి (సర్వులందు విజ్ఞానరూపమున ఉండునామె)}; ఈశాన = ఈశాన {ఈశాన - రుద్రకోటిక్షేత్రమున ఈశాన (ఐశ్వర్యములు కలామె)}; శారద = శారద {శారద - బ్రహ్మక్షేత్రమున శారద (నలుపు (తమోగుణము) తెలుపు (సత్త్వగుణము) ఎరుపు (రజోగుణము) లను శారను కలిగించునామె)}; అంబిక = అంబిక {అంబిక - సిద్ధవనక్షేత్రమున అంబిక (సర్వ మాతృ రూపిణి)}; అను = అనెడి; పదునాలుగు = పద్నాలుగు (14); నామంబులన్ = పేర్లతో; కొనియాడుదరు = కీర్తింతురు; అయ్యై = ఆయా; స్థానంబులన్ = క్షేత్రము; అందున్ = అందు; అని = అని; ఎఱింగించి = తెలిపి; సర్వేశ్వరుండు = జగదీశ్వరుడు; అగు = ఐన; హరి = విష్ణుమూర్తి; పొమ్ము = వెళ్ళు; అని = అని; ఆనతిచ్చినన్ = చెప్పగా; మహాప్రసాదంబు = మహాప్రసాదము; అని = అని; ఆ = ఆ; యోగనిద్ర = యోగమాయ; ఇయ్యకొని = అంగీకరించి; మ్రొక్కి = నమస్కరించి; చయ్యన = శ్రీఘ్రముగ; ఈ = ఈ; ఇలకున్ = భూలోకమునకు; ఆ = ఆ; ఎడన్ = విష్ణులోకమును; పాసి = వదలి; వచ్చి = వచ్చి.
భావము:- దేశంలో వివిధ ప్రాంతలలో ఉన్న మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పద్నాలుగు పేర్లతో సేవిస్తారు. ఇక వెళ్ళిరా” అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగ నిద్రాదేవి “మహప్రసాద” మని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది.