పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/దేవకీవసుదేవుల చెరసాల

తెభా-10.1-54-మ.
లఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుడై పట్టి బ
ద్ధులఁ గావించి హరిం దలంచి వెస తోడ్తో వారు గన్నట్టి పు
త్రులఁ జంపెన్; గురు నుగ్రసేను యదుఁ దద్భోజాంధకాధీశు ని
ర్మలు బట్టెం గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్.

టీక:- కలగన్ = కలత; పాఱి = పడి; మఱందిన్ = చెల్లెలు భర్తను; చెల్లెలిన్ = చెల్లెలిన్; ఉదగ్ర = రెచ్చిపోయిన; క్రోధుడు = కోపము కలవాడు; ఐ = అయ్యి; పట్టి = పట్టుకొని; బద్ధులన్ = బంధింపబడినవారినిగా; కావించి = చేసి; హరిన్ = నారాయణుని {హరి - భక్తుల దుఃఖములు హరించువాడు, విష్ణువు}; తలంచి = తలచుకొని; వెసన్ = త్వరగా; తోడ్తోన్ = వెంటనే; వారు = వాళ్ళు; కన్న = జన్మనిచ్చిన; అట్టి = అటువంటి; పుత్రులన్ = కుమారులను; చంపెన్ = వధించెను; గురున్ = తండ్రిని; ఉగ్రసేనున్ = ఉగ్రసేనుని; యదున్ = యదువంశవానిని; తత్ = ఆ; భోజ = భోజదేశము; అంధక = అంధక దేశములకు; అధీశున్ = ప్రభువును, రాజును; నిర్మలున్ = పరిశుద్ధమైనవానిని; పట్టెన్ = బంధించెను; కడు = మిక్కిలి; వాలి = మించి, అతిశయించి; ఏలెన్ = పరిపాలించెను; చలము = పట్టుదల; ఆరన్ = అతిశయించగా; శూరసేనంబులన్ = శూరసేన దేశములను.
భావము:- ఈవిధంగా తలచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు.విజృంభించి యదు భోజ అంధక దేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి శూరసేనదేశాలకు తానే రాజై పరిపాలించాడు.

తెభా-10.1-55-ఆ.
ల్లిఁ దండ్రి నైనఁ మ్ము లనన్నల
ఖుల నైన బంధునుల నైన
రాజ్యకాంక్షఁ జేసి రాజులు చంపుదు
వనిఁ దఱచు జీవితార్థు లగుచు.

టీక:- తల్లిదండ్రిన్ = తల్లిదండ్రులను; ఐనన్ = అయినను; తమ్ములన్ = చిన్నవారైన సోదరులను; అన్నలన్ = పెద్దవారైన సోదరులను; సఖులన్ = స్నేహితులను; ఐనన్ = అయినను; బంధుజనులన్ = చుట్టములను; ఐనన్ = అయినను; రాజ్య = రాజ్యాధికారముపైని; కాంక్షన్ = గాఢమైన ఆశ; చేసి = వలన; రాజులు = రాజులు; చంపుదురు = వధించెదరు; అవనిన్ = భూమండలముపై; తఱచున్ = మాటిమాటికి; జీవిత = జీవితమును; అర్థులు = కోరువారు; అగుచున్ = ఔతూ.
భావము:- రాజులు ఈ లోకంలో రాజ్యకాంక్షతో తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, తల్లితండ్రులు ఎవరినైనా వారు వదలిపెట్టరు.

తెభా-10.1-56-వ.
మఱియును బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టి కారిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై కంసుండు కదనంబున మదంబు లడంచిన వదనంబులు వంచికొని, సదనంబులు విడిచి యదవలై, యదువులు, పదవులు వదలి నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశంబులుఁ జొచ్చిరి; మచ్చరంబులు విడిచి కొందరు కంసునిం గొలిచి నిలిచి; రంత.
టీక:- మఱియును = ఇంకను; బాణ = బాణుడు; భౌమ = భౌముడు; మాగధ = మాగధుడు; మహాశన = మహాశనుడు; కేశి = కేశి; ధేనుక = ధేనుకుడు; బక = బకుడు; ప్రలంబ = ప్రలంబుడు; తృణావర్త = తృణావర్తుడు; చాణూర = చాణూరుడు; ముష్టిక = ముష్టికుడు; అరిష్ట = అరిష్టుడు; ద్వివిధ = ద్వివిధుడు; పూతన = పూతన; ఆది = మున్నగువారి; సహాయ = సహాయములు; సమేతుండు = కలిగినవాడు; ఐ = అయ్యి; కంసుండు = కంసుడు; కదనంబునన్ = యుద్ధములలో; మదంబులడంచినన్ = ఓడించగా; వదనంబులు = మోములు; వంచికొని = వంచుకొని; సదనంబులు = నివాసములు; విడిచి = వదలి; అదవలు = వలసపోవువారు; ఐ = అయ్యి; యదువులు = యాదవులు; పదవులు = అధికారములను; వదలి = వదలిపెట్టి; నిషధ = నిషధ; కురు = కురు; కోసల = కోసల; విదేహ = విదేహ; విదర్భ = విదర్భ; కేకయ = కేకయ; పాంచాల = పాంచాల; సాల్వ = సాల్వ; దేశంబులున్ = రాజ్యములను; చొచ్చిరి = చేరిరి; మచ్చరంబులు = పగలు; విడిచి = మాని; కొందరు = కొంతమంది; కంసునిన్ = కంసుని; కొలిచి = సేవించుచు; నిలిచిరి = ఆగిపోయిరి; అంత = అప్పుడు.
భావము:- ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మొదలైన రాక్షసులను కలుపుకున్నవాడై యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయినవాళ్ళు అవమానంతో తమ ఇండ్లు వదలి పదవులు వదలి దీనులై నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలు పట్టిపోయారు. కొందరు మాత్రం కంసుని సేవిస్తూ మధురలో ఉండిపోయారు.

తెభా-10.1-57-క.
తొడితొడిఁ గంసుడు దేవకి
కొడుకుల నార్వుర వధింప గురుశేషాఖ్యం
బొవగు హరిరుచి యా సతి
డుపున నేడవది యైన ర్భం బయ్యెన్.

టీక:- తొడితొడిన్ = వెంటవెంటనే; కంసుడు = కంసుడు; దేవకి = దేవకీదేవి యొక్క; కొడుకులన్ = పుత్రులను; ఆర్వురన్ = ఆరుగురిని (6); వధింపన్ = చంపగా; గురు = గొప్ప; శేష = శేషుడు అనెడి; ఆఖ్యన్ = పెరుతో; పొడవు = ఉన్నతమైనవాడు; అగు = ఐన; హరి = విష్ణుని; రుచిన్ = కళ; ఆ = ఆ; సతి = ఇల్లాలు; కడుపునన్ = గర్భమున; ఏడవది = ఏడవది (7); ఐనన్ = అయినట్టి; గర్భంబున్ = గర్భస్థపిండముగ; అయ్యెన్ = అయ్యెను.
భావము:- దేవకీదేవి కొడుకులు ఆరుగురిని వెంటవెంటనే కంసుడు వధించాడు. మహనీయమైన మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు అయిన ఆదిశేషుడనే పేర ప్రసిద్ధుడు దేవకీదేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించింది.