పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/నారదుడు కృష్ణుని దర్శించుట

తెభా-10.1-1179-వ.
ఆ సమయంబునం బుష్పవర్షంబులు గురియించి సురలు వినుతించి; రంత హరిభక్తి విశారదుండైన నారదుండు వచ్చి గోవిందుని సందర్శించి రహస్యంబున నిట్లనియె.
టీక:- ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు; పుష్ప = పూల; వర్షంబున్ = వానను; కురియించి = కురిపించి; సురలు = దేవతలు; వినుతించిరి = కీర్తించిరి; అంతన్ = అప్పుడు; హరి = విష్ణుని యెడల; భక్తి = భక్తి కలిగియుండుటలో; విశారదుండు = మిక్కిలి నేర్పు కలవాడు; ఐన = అయినట్టి; నారదుండు = నారదుడు; వచ్చి = వచ్చి; గోవిందుని = కృష్ణుని; సందర్శించి = చూసి; రహస్యంబునన్ = ఏకాంతము నందు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ సంతోష సమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. స్తోత్రాలు చేసారు. అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి, గోపాలకృష్ణుడిని దర్శించి ఏకాంతంగా ఇలా అన్నాడు.

తెభా-10.1-1180-సీ.
గదీశ! యోగీశ! ర్వభూతాధార!-
కలసంపూర్ణ! యీశ్వర! మహాత్మ!
కాష్ఠగతజ్యోతి కైవడి నిఖిల భూ-
ము లందు నొకఁడవై నరు దీవు
ద్గూఢుఁడవు; గుహాయుఁడవు సాక్షివి-
నీ యంతవాఁడవై నీవు మాయఁ
గూడి కల్పింతువు గుణముల; వానిచేఁ-
బుట్టించి రక్షించి పొలియఁజేయుఁ

తెభా-10.1-1180.1-ఆ.
దీ ప్రపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు
రాజమూర్తులైన రాక్షసులను
సంహరించి భూమిక్రంబు రక్షింప
వతరించినాఁడ య్య! కృష్ణ!

టీక:- జగదీశ = కృష్ణ {జగదీశుడు - సర్వలోకప్రభువు, విష్ణువు}; యోగీశ = కృష్ణ {యోగీశుడు - యోగులకు ప్రభువు, విష్ణువు}; సర్వభూతాధార = కృష్ణ {సర్వభూతాధారుడు - సమస్తమైన (స్థావర జంగమ) జీవులకు ఆధారభూతమైనవాడు, విష్ణువు}; సకలసంపూర్ణ = కృష్ణ {సకలసంపూర్ణుడు - సమస్తమునందు నిండి యుండువాడు, విష్ణువు}; ఈశ్వర = కృష్ణ {ఈశ్వర - సర్వనియామకుడు, విష్ణువు}; మహాత్మ = కృష్ణ {మహాత్ముడు - మహత్వమే తానైన వాడు, విష్ణువు}; కాష్ఠ = కట్టలలో; గతః = ఉండెడి; జ్యోతి = నిప్పు; కైవడిన్ = వలె; నిఖిల = సమస్తమైన; భూతములు = జీవుల; అందున్ = లోను; ఒక్కడవు = రెండవదిలేనివాడవు; ఐ = అయివుండి; తనరుదు = అతిశయింతువు; ఈవు = నీవు; సత్ = మంచివారియందు; గూఢుడవు = దాగియుండువాడవు; గుహా = ప్రాణులహృదయమున; ఆశయుడవు = ఉండువాడవు; సాక్షివి = అన్నిటిని దర్శించువాడవు; నీయంతవాడవు = నీకు సమానులు నీవే; ఐ = అయ్యి; నీవు = నీవు; మాయన్ = మూలప్రకృతితో {మాయ - కార్యకారణోపాధులకు కారణభూతమైనది, మూలప్రకృతి}; కూడి = చేరి; కల్పింతువు = సృష్టించెదవు; గుణములున్ = త్రిగుణములను {త్రిగుణములు - సత్వరజస్తమోగుణములు}; వాని = వాటి; చేన్ = వలన; పుట్టించి = సృష్టించి {పుట్టించెదవు - చతుర్ముఖబ్రహ్మ రూపమున రజోగణముచే సృష్టించెదవు}; రక్షించి = కాపాడి {రక్షించెదవు - విష్ణుమూర్తి రూపమున సత్వదుణముతో లోకములను పాలించెదవు}; పొలియజేయుదు = నశింపజేయుజేసెదవు {పొలియజేయుదువు - రుద్ర రూపమున సర్వమును తమోగుణముతో లయము చేసెదవు}; ఈ = ఈ యొక్క.
ప్రపంచము = లోకములు; ఎల్లన్ = అఖిలమును; ఇట్టి = ఇటువంటి; నీవు = నీవు; ఇప్పుడు = ప్రస్తుతకాలమునందు; రాజ = ఏలికల యొక్క; మూర్తులు = ఆకృతులు కలిగినవారు; ఐన = అయినట్టి; రాక్షసులను = రాక్షసులను; సంహరించి = చంపి; భూమిచక్రంబున్ = భూమండలమును; రక్షింపన్ = కాపాడుటకై; అవతరించినాడవు = పుట్టితివి; అయ్య = తండ్రి; కృష్ణ = కృష్ణుడ.
భావము:- “కృష్ణా! జగదీశ్వరా! యోగీశ్వరా! సకల ప్రాణులకు ఆధారమైన వాడా! నిఖిలమునందూ నిండి ఉండువాడా! ఓ మహానుభావా! కట్టెలలో అగ్నిలా సమస్త ప్రాణులలోనూ ఏకరూపుడవై విలసిల్లుతూ ఉంటావు. హృదయ కుహర మందు గూఢంగా ఉంటావు. జీవులు ఆచరించే సకల క్రియాకలాపములకు కేవలం సాక్షీభూతుడవై ఉంటావు. సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమై ఉండే మాయాశక్తిచే సత్వ్తరజస్తమో గుణాలను కల్పిస్తుంటావు. ఈ త్రిగుణాలచేత జగత్తును సృష్టి స్థితి లయాలు చేస్తుంటావు. రాజుల రూపాలలో ఉన్న రాక్షసులను నిర్మూలించి భూమండలాన్ని కాపాడడటం కోసం నీవు అవతరించావు స్వామీ.

తెభా-10.1-1181-వ.
దేవా! నీచేత నింక చాణూర ముష్టిక గజ శంఖ కంస యవన ముర నరక పౌండ్రక శిశుపాల దంతవక్త్ర సాల్వ ప్రముఖులు మడిసెదరు; పారిజాతం బపహృతం బయ్యెడిని; నృగుండు శాపవిముక్తుం డగు; శ్యమంతకమణి సంగ్రహంబగు; మృత బ్రాహ్మణపుత్ర ప్రదానంబు సిద్ధించు; నర్జునసారథివై యనేకాక్షౌహిణీ బలంబుల వధియించెదవు; మఱియును.
టీక:- దేవా = భగవంతుడా; నీ = నీ; చేతన్ = వలన; ఇంక = ఇకపైన; చాణూర = చాణూరుడు (మల్లుడు); ముష్టిక = ముష్టికుడు (మల్లుడు); గజ = కువలయాపీడ (ఏనుగు); శంఖ = శంఖచూడుడు (యక్షుడు); కంస = కంసుడు; యవన = కాలయవనుడు; ముర = మురాసురుడు; నరక = నరకాసురుడు; పౌండ్రక = పౌండ్రక వాసుదేవుడు; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్ర = దంతవక్త్రుడు; సాల్వ = సాల్వుడు; ప్రముఖులు = మొదలగువారు; మడిసెదరు = మరణింతురు; పారిజాతంబు = పారిజాతపూల వృక్షము; అపహృతంబు = సంపాదింపబడినది; అయ్యెడిని = అగును; నృగుండు = నృగు మహారాజు; శాప = శాపమునుండి; విముక్తుండు = విడుదలైనవాడు; అగున్ = అగును; శ్యమంతక = శ్యమంతకము అనెడి; మణి = రత్నము; సంగ్రహంబు = సంపాదింపబడినది; అగున్ = అగును; మృత = మరణించిన; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; పుత్ర = కొడుకు; ప్రదానంబున్ = తెచ్చి యిచ్చుట; సిద్ధించున్ = జరుగును; అర్జున = అర్జునికి; సారథివి = రథము తోలువాడవు; ఐ = అయ్యి; అనేక = పెక్కు; అక్షౌహిణీ = అక్షౌహిణులమేర; బలంబులు = సైన్యములను; వధియించెదవు = సంహరించెదవు; మఱియును = ఇంకను.
భావము:- ఓ ప్రభూ! ఇంక ముందు చాణూరుడు, ముష్టికుడు, గజుడు, శంఖుడు, కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు సాల్వుడు మొదలైనవారు నీ చేతిలో మరణిస్తారు. దేవలోకం నుంచి పారిజాతవృక్షం సంగ్రహించబడుతుంది. నృగునకు శాపవిముక్తి కలుగుతుంది. శమంతకమణి లభిస్తుంది. మృతులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అర్జునుడికి సారథివిగా ఉండి అనేక అక్షౌహిణుల సేనలు సంహరిస్తావు. అంతేకాకుండా. . . . .

తెభా-10.1-1182-శా.
కృష్ణా! నీ వొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండె? వ
ర్ధిష్ణుండైన విధాత మూఁడుగుణముల్ దీపించు లోపించు రో
చిష్ణుత్వంబున నుండు నీవలన; నిస్సీమంబు నీ రూపు నిన్
విష్ణున్ జిష్ణు సహిష్ణు నీశు నమితున్ విశ్వేశ్వరున్ మ్రొక్కెదన్."

టీక:- కృష్ణా = కృష్ణుడా; నీవున్ = నీవు; ఒనరించు = చేయు; కార్యములున్ = పనులను; లెక్కింపన్ = గణించుటకు; సమర్థుండె = శక్తిగలవాడా, కాదు; వర్ధిష్ణుండు = పెరిగెడి శీలము కలవాడు {వర్ధిష్ణుడు - వృద్ధి చేయు స్వభావము కలవాడు, పెరిగెడివాడు}; ఐన = అయినట్టి; విధాత = బ్రహ్మదేవుడు; మూడుగుణముల్ = త్రిగుణములు {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; దీపించున్ = వృద్ధిచెందును; లోపించున్ = నశించును; రోచిష్ణత్వంబునన్ = మిక్కిలి ప్రకాశించుటకలిగి; ఉండున్ = ఉండును; నీ = నీ; వలనన్ = చేత; నిస్సీమంబు = మేరలేనిది; నీ = నీ యొక్క; రూపు = స్వరూపము; నిన్ = నిన్ను; విష్ణున్ = విష్ణుమూర్తిని {విష్ణువు – సమస్తము నందు వ్యాపించు లక్షణము కలవాడు, విష్ణువు}; జిష్ణున్ = జయశీలుని {జిష్ణువు - జయించు స్వభావము కలవాడు, విష్ణువు}; సహిష్ణున్ = సహనశీలుని {సహిష్ణువు - సహించు స్వభావము కలవాడు, విష్ణువు}; ఈశున్ = సర్వనియామకుని {ఈశుడు - సర్వనియామకుడు, విష్ణువు}; అమితున్ = అష్టప్రమాణాతీతుని {అమితుడు - అష్టప్రమాణము (1ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శబ్దము (లేదా ఆగమము) 5అర్థాపత్తి 6అనుపలబ్ధి 7సంభవము 8ఐతిహ్యము) లకు అందనివాడు, విష్ణువు}; విశ్వేశ్వరున్ = జగత్తుకే ప్రభువుని {విశ్వేశ్వరుడు - జగత్తు అంతటికి ఈశ్వరుడు, విష్ణువు}; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.
భావము:- ఓ కృష్ణా! సృష్టిని సమృద్దిగా చేసే బ్రహ్మదేవుడు కూడా నీవు చేసే పనులను లెక్కించడానికి సమర్ధుడు కాడు. నీ వలననే సత్త్వరజస్తమోగుణములు జనించి, వృద్ధిపొంది, అణగిపోతాయి. నీ రూపమునకు మేర లేదు. నీవు సర్వవ్యాపివి, జయ శీలుడవు, సహన శీలివి, పరమేశ్వరుడవు, ప్రమాణ రహితుడవు, ప్రపంచ నియామకుడవు. అటువంటి నీకు నమస్కరిస్తాను.”