పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వ్యోమాసురుని సంహారించుట

తెభా-10.1-1183-వ.
అని వినుతించి వీడుకొని నారదుం డరిగె; నంత నొక్కనాడు కృష్ణ సహితులై గోపకుమారు లడవికిం జని పసుల మేపుచు నొక్క కొండదండ నిలాయనక్రీడ చేసి; రందు.
టీక:- అని = అని; వినుతించి = స్తోత్రముచేసి; వీడుకొని = సెలవుతీసుకొని; నారదుండు = నారదుడు; అరిగెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అటుతరువాత; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; కృష్ణ = కృష్ణునితో; సహితులు = కూడియున్నవారు; ఐ = అయ్యి; గోప = గొల్లల; కుమారకులు = పిల్లలు; అడవి = అడవి; కిన్ = కి; చని = వెళ్ళి; పసులన్ = పశువులను; మేపుచున్ = కాచుచు; ఒక్క = ఒకానొక; కొండ = కొండ; దండన్ = వద్ద; నిలాయనక్రీడ = బాలుర క్రీడా విశేషము, దాగుడుమూతలాట {నిలాయన, నిలయన - దాగుడుమూతలు }; చేసిరి = ఆడిరి; అందు = దానిలో.
భావము:- అలా గోవిందుడిని స్తుతించి, సెలవు తీసుకుని నారదమహర్షి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట, ఒక రోజు గోపబాలురు కృష్ణుడితో కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ పశులను మేపుతూ ఒక పర్వతం దగ్గర దాగుడుమూతలు ఆడటం ప్రారంభించారు.

తెభా-10.1-1184-క.
కొంఱు గొఱియల మంచునుఁ
గొంఱు పాలకుల మంచుఁ గుటిలత్వమునం
గొంఱు దొంగల మనుచునుఁ
జెంది కుమారకులు క్రీడఁజేసిరి తమలోన్.

టీక:- కొందఱు = కొంతమంది; గొఱియలము = గొఱ్ఱెలము; అంచును = అని; కొందఱు = కొంతమంది; పాలకులము = గొఱ్ఱెలకాపరులము; అంచున్ = అని; కుటిలత్వమునన్ = వంకరబుద్ధితో; కొందఱు = కొంతమంది; దొంగలము = చోరులము; అనుచును = అనుచు; చెంది = భావములు పొంది; కుమారకులు = బాలురు; క్రీడజేసిరి = ఆటలాడిరి; తమలోన్ = వారిలోవారు.
భావము:- ఆ దాగుడుమూతలాటలో కొందరు గొఱ్ఱెలుగా కొందరు కాపరులుగా కొందరు దొంగలుగా ఏర్పడి గోపబాలురు తమలో తాము ఆడుకోసాగారు.

తెభా-10.1-1185-శా.
లో దొంగలలో మయాసురసుతుం డాద్యుండు వ్యోముండు గో
పాలుండై చని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు త
ద్బా వ్రాతము నెల్ల మెల్లనఁ జతుఃపంచావశిష్టంబుగా
శైలాంతర్గుహలోనికిం గొనిచనెం జౌర్యం బవార్యంబుగన్.

టీక:- ఆలోన్ = ఆలోపల; దొంగల = చోరుల; లోన్ = అందు; మయా = మయుడను; అసుర = రాక్షసుని; సుతుండు = కొడుకు; ఆద్యుండు = మొదటివాడు; వ్యోముండు = వ్యోముడనువాడు; గోపాలుండు = గొల్లవానివలె; ఐ = అయ్యి; చని = వెళ్ళి; మేష = గొఱ్ఱెలను; కల్పనలు = కల్పించుకొనుటల; తోన్ = తోటి; భాసిల్లి = అతిశయించి; క్రీడించు = ఆడుచున్నట్టి; తత్ = ఆ యొక్క; బాల = పిల్లల; వ్రాతమున్ = సమూహము; ఎల్లన్ = అంతటను; మెల్లనన్ = మెల్లిమెల్లిగా; చతుః = నలుగురు; పంచః = ఐదుగురు; అవశిష్టంబు = మాత్రమే మిగులుట; కాన్ = అగునట్లు; శైల = కొండ; అంతర్ = లోని; గుహ = గుహ; లోని = లోపలి; కిన్ = కి; కొని = తీసుకొని; చనెన్ = పోయెను; చౌర్యంబు = దొంగతనపునేర్పు; అవార్యంబు = అడ్డులేనిది; కాన్ = అగునట్లు.
భావము:- అంతలో మయుడనే రాక్షసుడి పెద్ద కొడుకు వ్యోమాసురుడు గొల్లపిల్లాడి రూపం ధరించి, దొంగగా ఏర్పడిన వారిలో చేరాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురు ఐదుగురిని తప్పించి మిగిలిన వారిని అందరినీ మెల్లగా ఒక పర్వతగుహలోకి తీసుకుపోయాడు.

తెభా-10.1-1186-వ.
ఇట్లు కొండగుహలోనఁ గ్రమక్రమంబున గోపకుమారుల నిడి యొక్క పెనుఱాతఁ దద్ద్వారంబుఁ గప్పి యెప్పటియట్ల వచ్చిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కొండ = కొండ యొక్క; గుహ = గుహ; లోనన్ = లోపల; క్రమక్రమంబునన్ = ఒకరి తరువాత నొకరిని; గోప = గొల్ల; కుమారులన్ = బాలురను; ఇడి = పెట్టి; ఒక్క = ఒకానొక; పెను = పెద్ద; ఱాతన్ = రాతితో; తత్ = దాని; ద్వారంబున్ = ప్రవేశద్వారమును; కప్పి = మూసి; ఎప్పటి = ఎప్పటి; అట్లి = లాగ; వచ్చినన్ = రాగా.
భావము:- వాడు క్రమక్రమంగా గోపబాలురను ఆ కొండ గుహలో చేర్చి పెద్దబండరాయితో దారి మూసేసి, మునుపటి లాగే అక్కడి ఆటలోకి వచ్చిచేరాడు.

తెభా-10.1-1187-ఉ.
వీరుఁడు మాధవుం డఖిలవేది నిశాచరభేది నవ్వుతో
"నౌ! నిశాట! దొంగతన చ్చుపడెన్ నెఱదొంగ వౌదు; వా
భీరుల నెల్ల శైలగుహఁ బెట్టితి చిక్కినవారిఁ బెట్టరా;
రా" యటంచుఁ బట్టె మృగరాజు వృకాఖ్యముఁ బట్టు కైవడిన్.

టీక:- వీరుడు = కృష్ణుడు {వీరుడు - వీరత్వము అదికముగా కలవాడు, కృష్ణుడు}; మాధవుండు = కృష్ణుడు {మాధవుడు - మా (లక్ష్మీదేవి) ధవుడు (భర్త), విష్ణువు}; అఖిలవేది = కృష్ణుడు {అఖిలవేది – సమస్తము నెఱిగిన వాడు, విష్ణువు}; నిశాచరభేది = కృష్ణుడు {నిశాచరభేది - రాక్షసులను హింసించువాడు, విష్ణువు}; నవ్వుతోన్ = నవ్వుతూ; ఔరా = అబ్బో; నిశాట = రాక్షసుడ; దొంగతనము = చోరకళ; అచ్చుపడెన్ = బహు చక్కగా కుదిరినది; నెఱదొంగవు = గొప్పదొంగవు; ఔదువు = అయినవాడవే; ఆభీరులన్ = గోపకులను; ఎల్లన్ = అందరను; శైల = కొండ; గుహన్ = గుహలో; పెట్టితి = పెట్టావు; చిక్కిని = మిగిలిన; వారిన్ = వారినికూడ; పెట్టరా = పెట్టుము; రార = తొందరగా రమ్ము; అటన్ = అని; అంచున్ = అనుచు; పట్టెన్ = పట్టుకొనెను; మృగరాజు = సింహము {మృగరాజు - మృగములందు రాజువంటిది, సింహము}; వృకాఖ్యమున్ = తోడేలులాంటి వానిని; పట్టు = పట్టుకొనెడి; కైవడిన్ = విధముగ.
భావము:- సర్వజ్ఞుడూ, గర్వాంధులైన దానవులను రూపుమాపే వాడూ, మహావీరుడూ, అయిన కృష్ణ మాధవుడు నవ్వుతూ “ఓరోరీ! రాక్షసా! నీ గుట్టు బట్టబయలైంది. నీవు గడిదేరిన గజదొంగవి. గొల్లపిల్లలను అందరినీ కొండగుహలో దాచిపెట్టావు. మిగతావాళ్ళని కూడా దాచేద్దువుగాని. రారా” అంటూ సింహము తోడేలును పట్టుకున్నట్లు వాడిని ఒడిసి పట్టుకున్నాడు.

తెభా-10.1-1188-ఉ.
పంజలోచనుం డొడిసి ట్టిన శైలనిభాసురాకృతిన్
బింముతోడఁ బొంగి విడిపించుకొనంగ బలంబు లేమి లో
శంకిలి బిట్టు తన్నుకొనఁ క్కన నా రణభీము వ్యోమునిం
గొంకఁ గూల్చె న వ్విభుఁడు గోయని మింట సుపర్వు లార్వఁగన్.

టీక:- పంకజలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ఒడిసి = ఒడిసి; పట్టినన్ = పట్టుకొనగా; శైల = కొండను; నిభ = పోలిన; అసుర = రాక్షసుని; ఆకృతిన్ = రూపముతో; బింకము = బిగువు; తోడన్ = తోటి; పొంగి = పెరిగి; విడిపించుకొనంగన్ = విడిపించుకొనుటకు; బలంబు = శక్తి; లేమిన్ = లేకపోవుటచేత; లోన్ = మనసునందు; శంకిలి = జంకి; బిట్టు = అధికముగా; తన్నుకొనన్ = తన్నుకొనగా; చక్కనన్ = చటుక్కున; ఆ = ఆ యొక్క; రణ = యుద్ధము నందు; భీమున్ = భీకరమైనవానిని; వ్యోమునిన్ = వ్యోమాసురుని; కొంకకన్ = వెనుదీయకుండ; కూల్చెన్ = సంహరించెను; ఆ = ఆ యొక్క; విభుడు = ప్రభువు, కృష్ణుడు; కో = ఓహో; అని = అని; మింటన్ = ఆకాశము నందు; సుపర్వులు = దేవతలు {సుపర్వులు - శుభప్రదమైన ఉత్సవములు కలవారు, దేవతలు}; ఆర్వగన్ = అరచుచుండగా.
భావము:- పద్మాల వంటి కన్నులు కల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్లరూపం వదిలిపెట్టేసాడు. కొండంత రాక్షసాకారంతో ఉప్పొంగాడు. కాని, విడిపించుకునే శక్తి లేకపోడంతో లోలోపల సందేహిస్తూనే, గిజ గిజ గింజుకున్నాడు. అప్పుడు గోవిందుడు గొప్ప యుద్ధవీరుడు అయిన ఆ వ్యోముడిని జంకుగొంకు లేకుండా నేలకూల్చాడు. అప్పుడు ఆకాశం నుండి దేవతలు “ఓహో” అని హర్షధ్వానాలు చేసారు.

తెభా-10.1-1189-ఆ.
ఘోర దనుజు నేల గూల్చి పర్వతగుహ
వాత నున్న ఱాయి వ్రయ్యఁ దన్ని
గుహఁ జరించుచున్న గోపాలకులఁ గొంచు
ల్లిదుండు గోపల్లి కరిగె.

టీక:- ఘోర = భీకరుడైన; దనుజున్ = రాక్షసుని; నేలగూల్చి = సంహరించి; పర్వత = కొండ; గుహ = గుహ యొక్క; వాతన్ = గుమ్మము నందు; ఉన్న = ఉన్నట్టి; ఱాయిన్ = రాతిని; వ్రయ్యదన్ని = పగలగొట్టి; గుహన్ = గుహలో; చరించుచున్న = తిరుగుతున్న; గోపాలకులన్ = గోవులు కాయువారిని; కొంచున్ = తీసుకొని; బల్లిదుండు = మిక్కిలి బలము కలవాడు; గోపపల్లి = గొల్లపల్లె; కిన్ = కి; అరిగె = వెళ్ళిపోయెను.
భావము:- బలవంతుడైన కృష్ణుడు భయంకరుడైన దైత్యుడిని నేలగూల్చి, పర్వతగుహ ద్వారమును మూసి ఉంచిన రాతిని బద్దలుగొట్టాడు. గుహలో తిరుగాడుతున్న ఆ గొల్లపిల్లలను వెంటపెట్టుకుని గొల్లపల్లెకు వెళ్ళిపోయాడు.