తెభా-10.1-1361-క.
ధృతిచెడి లోఁబడె మల్లుం
తులిత భవజలధితరికి తరిపు పురికిన్
జికరికిన్ ధృతగిరికిం
హరిరవ భరిత శిఖరిరికిన్ హరికిన్.

టీక:- ధృతి = ధైర్యము; చెడి = నష్టపోయి; లోబడెన్ = లొంగిపోయెను; మల్లుండు = మల్లవీరుడు; అతులిత = సరిపోల్చరాని; భవ = సంసారము అనెడి; జలధి = సముద్రమునకు; తరి = ఓడ యైనవాని {తరి - దాటించునది, ఓడ}; కిన్ = కి; హత = కొట్టబడిన; రిపు = శత్రువుల; పురి = పట్టణములు కలవారి; కిన్ = కి; జిత = జయించు; కరి = ఏనుగు (కువలయాపీడము)కల వాని; కిన్ = కి; ధృత = ధరించిన; గిరి = కొండగలవాని; కిన్ = కి; తత = పెద్ద; హరి = సింహ; రవ = నాదముచే; భరిత = నిండిన; శిఖరి = కొండ; దరి = గుహలు కలవాని; కిన్ = కు; హరి = కృష్ణున; కిన్ = కు.
భావము:- సాటిలేని సంసారసాగరాన్ని దాటడానికి నావ వంటివాడూ; శత్రుపురాలను ధ్వంస మొనర్చినవాడూ; కువలయాపీడ గజాన్నిఓడించినవాడూ; గోవర్ధనగిరిని ఎత్తినవాడూ; గొప్ప సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడూ అయిన శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యంచెడి లోబడిపోయాడు.

తెభా-10.1-1362-క.
రికిని లోఁబడి బెగడక
రి యురము మహోగ్రముష్టి హితుఁడు పొడువన్
రి కుసుమమాలికాహత
రి భంగిఁ బరాక్రమించెఁ లహోద్ధతుఁడై.

టీక:- హరి = కృష్ణున; కిని = కి; లోబడి = అధీనుడై; బెగడక = బెదిరిపోకుండ; హరి = కృష్ణుని; ఉరమున్ = వక్షమును; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; ముష్టిన్ = పిడికిలితో; అహితుడు = పగవాడు; పొడువన్ = పొడవగా; హరి = కృష్ణుడు; కుసుమ = పూల; మాలికా = దండలచేత; హత = కొట్టబడిన; కరి = ఏనుగు; భంగిన్ = వలె; పరాక్రమించెన్ = పరాక్రమము జూపెను; కలహ = కలహము నందు; ఉద్ధతుడు = చెలరేగినవాడు; ఐ = అయ్యి.
భావము:- విరోధి చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ, భయపడక అతడి రొమ్ముపై మహా భయంకరమైన పిడికిలిపోటు పొడిచాడు. పూదండచే కొడితే ఏనుగు లెక్కచెయ్యని విధంగా, వాడి పోటును లెక్కచేయక శ్రీహరి విజృంభించి ఆ పోరులో పరాక్రమం చూపించాడు.

తెభా-10.1-1363-క.
శౌరి నెఱిఁజొచ్చి కరములఁ
గ్రూగతిం బట్టి త్రిప్పి కుంభిని వైచెన్
శూరుం గలహ గభీరున్
వీరుం జాణూరు ఘోరు వితతాకారున్.

టీక:- శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; నెఱిన్ = నిండుగా; చొచ్చి = చొరవచూపి; కరములన్ = చేతులతో; క్రూర = క్రూరమైన; గతిన్ = విధముగా; పట్టి = పట్టుకొని; త్రిప్పి = తిప్పి; కుంభినిన్ = నేలపైన; వైచెన్ = పడవేసెను; శూరున్ = మహావీరుని; కలహ = పోరాటమునందు; గభీరున్ = గాంభీర్యము కలవానిని; వీరున్ = సత్తా కలవానిని; చాణూరున్ = చాణూరుని; ఘోరున్ = భయంకరుడైనవానిని; వితత = గొప్ప; ఆకారున్ = రూపము కలవానిని.
భావము:- పరాక్రమవంతుడూ, యుద్ధమందు గంభీరుడూ, భీతిగొలిపేవాడూ, దొడ్డ దేహం కలవాడూ, వీరుడూ అయిన చాణూరుడిని కృష్ణుడు చొరవగా చొచ్చుకుపోయి కర్కశంగా వాడి చేతులు పట్టుకుని గిరగిర త్రిప్పి నేలపై పడదోసాడు.

తెభా-10.1-1364-క.
శోణితము నోర నొలుకఁగఁ
జాణూరుం డట్లు కృష్ణ సంభ్రామణ సం
క్షీణుండై క్షోణిం బడి
ప్రాణంబులు విడిచెఁ గంసు ప్రాణము గలఁగన్.

టీక:- శోణితము = రక్తము; నోరన్ = నోటినుండి; ఒలుకగన్ = కారుతుండగా; చాణూరుండు = చాణూరుడు; అట్లు = ఆ విధముగ; కృష్ణ = కృష్ణుని చేత; సంభ్రామణ = త్రిప్పబడుట చేత; సంక్షీణుండు = మిక్కిలి నీరసించిన వాడు; ఐ = అయ్యి; క్షోణిన్ = నేలపై; పడి = పడిపోయి; ప్రాణంబులున్ = ప్రాణములను; విడిచెన్ = వదిలెను; కంసు = కంసుని యొక్క; ప్రాణమున్ = ప్రాణులు; కలగన్ = కలచెందగా.
భావము:- అలా కృష్ణుడిచేత గిరగిర త్రిప్పబడిన చాణూరుడు బలమంతా క్షీణించినవాడై నోటిలోనుండి రక్తం కారుతుండగా నేలమీద పడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోడంతో కంసుడి ప్రాణం కలతబారింది.

తెభా-10.1-1365-క.
భద్రుండును లోకులు
భద్రుం డనఁగఁ బెనఁగి టుబాహుగతిన్
భేది మెచ్చఁ ద్రిప్పెను
వన్ముష్టికునిఁ గంసు లములు బెగడన్.

టీక:- బలభద్రుండును = బలరాముడు కూడ; లోకులు = ప్రజలు; బల = బలమునందు; భద్రుండు = మేలైనవాడు; అనంగన్ = అనునట్లుగా; పెనగి = పోరాడి; పటు = దృఢమైన; బాహు = భుజ; గతిన్ = విన్యాసములతో; బలభేది = ఇంద్రుడు; మెచ్చన్ = మెచ్చుకొనునట్లు; త్రిప్పెను = గిరగిర తిరుగునట్లు చేసెను; బలవన్ = బలవంతుడైన; ముష్టికునిన్ = ముష్టికుడిని; కంసు = కంసుని యొక్క; బలములు = సేనలు; బెగడన్ = భయము పొందగా.
భావము:- “బలభద్రుడు నిజంగా బలంలో భద్రుడే” అంటూ లోకులు అంటూండగా; బలాసురుని సంహరించిన ఇంద్రుడు “మేలు మే” లని మెచ్చుకోగా; బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడైన ముష్టికుడిని పట్టుకుని గిరగిరా త్రిప్పాడు. అది చూసిన కంసుడి సేన బెదిరిపోయింది.

తెభా-10.1-1366-ఆ.
త్రిప్పి నేలవైవ దిగ్గన రక్తంబు
దనగహ్వరమున ఱదవాఱ
ముష్టికుండు ఘోరముష్టి సత్వము చెడి
గూలె గాలిఁ దరువు గూలునట్లు.

టీక:- త్రిప్పి = గిరగిరతిప్పి; నేలన్ = నేలపైన; వైవన్ = పడవేయగా; దిగ్గనన్ = చటుక్కున; రక్తంబు = రక్తము; వదన = నోరు అనెడి; గహ్వరమునన్ = గుహనుండి; వఱద = వరదరూపమున; వాఱన్ = స్రవించగా; ముష్టికుండు = ముష్టికుడు; ఘోర = భయంకరమైన; ముష్టి = మల్లయుద్ధ; సత్వము = సమర్థత; చెడి = నశించి; కూలెన్ = పడిపోయెను; గాలి = గాలిచేత; తరువున్ = వృక్షము; కూలునట్లు = కూలిపోవువిధముగా.
భావము:- బలరాముడు అలా గిరగిరా త్రిప్పి నేలమీదకి దబ్బున పడవేయడంతో ముష్టికుడి గుహలాంటి నోటినుంచి రక్తం వరదలై పారింది. బలరాముడి ఘోరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ కోల్పోయి, పెనుగాలికి మహా వృక్షం కూలునట్లు, కూలిపోయాడు.

తెభా-10.1-1367-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా. . .

తెభా-10.1-1368-క.
పావమునఁ బలుపిడికిట
సూటిం బడఁబొడిచె బలుఁడు శోభిత ఘన బా
హాటోప నృపకిరీటుం
గూటున్ వాచాటు నధిక ఘోర లలాటున్.

టీక:- పాటవమునన్ = సమర్థతతో; బలు = పటువైన; పిడికిటి = ముష్టిచేత; సూటిన్ = గురిపెట్టి; పడన్ = పడిపోవునట్లుగా; పొడిచెన్ = కొట్టెను; బలుడు = బలరాముడు; శోభిత = ప్రకాశించునట్టి; ఘన = గొప్ప; బాహా = భుజముల; ఆటోపన్ = పరాక్రమముతో; నృప = రాజు (కంసుని)కి; కిరీటున్ = ముఖ్యమైనవానిని; కూటున్ = కూటుడు అనువానిని; వాచాటున్ = అతిగా వాగెడివానిని; అధిక = మిక్కిలి; ఘోర = భయంకరమైన; లలాటున్ = నుదురు కలవానిని.
భావము:- గొప్ప భుజబలాటోపంతో రాజునకు ముఖ్యమైన వాడూ, పరమ వదరుబోతూ, మిక్కిలి భయంకరమైన నుదురు కలవాడూ అయిన కూటుడు అనే మల్లుడిని బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచాడు.

తెభా-10.1-1369-వ.
అంత న ద్దనుజాంతకుండు చరణప్రహరణంబుల భిన్నమస్తకులం జేసి వాని చెలుల నంతకాంతికంబున కనిచిన.
టీక:- అంతన్ = ఆ పిమ్మట; ఆ = ఆ యొక్క; దనుజాంతకుండు = కృష్ణుడు {దనుజాంతకుడు - రాక్షసులకు యముని వంటివాడు, విష్ణువు}; చరణ = కాలి; ప్రహరణంబులన్ = తాపులచేత; భిన్న = పగిలిన; మస్తకులన్ = తలలు కలవారినిగా; చేసి = చేసి; వాని = అతడి; చెలులన్ = స్నేహితులను; అంతక = యముని; అంతికంబున్ = వద్ద; కున్ = కు; అనిచినన్ = పంపించగా.
భావము:- అటుపిమ్మట, రాక్షసుల పాలిటి యముడైన బలరాముడు, వాడి మిత్రులైన తోసలుడు శలుడు అనే వారిని తన కాలితాపులతో తలలు పగలకొట్టి, యముడి దగ్గరకు పంపేసాడు.

తెభా-10.1-1370-క.
"వల్లవబాలకు లని మన
ల్లవరులు పెనఁగి నేడు డిసిరి వీరల్
ల్లిదులు; తలఁడు తలఁ"డని
చెల్లాచెదరైరి పాఱి చిక్కిన మల్లుల్.

టీక:- వల్లవ = గొల్ల; బాలకులు = పిల్లవారు; అని = అని; మన = మన యొక్క; మల్ల = జెట్టీ; వరులు = శ్రేష్ఠులు; పెనగి = పోరి; నేడు = ఇవాళ; మడిసిరి = చచ్చిపోయిరి; వీరల్ = వీరు; బల్లిదులు = మిక్కిలి బలవంతులు; తలడుతలడు = తొలగిపొండి; అని = అని; చెల్లాచెదురు = మిక్కిలి చెదిరినవారు; ఐరి = అయ్యారు; పాఱి = పారిపోయి; చిక్కిన = మిగిలిన; మల్లుల్ = మల్లవీరులు.
భావము:- కేవలం గోపాలబాలకులు అనుకుని వారితో యుద్ధం చేసి మన మల్లశ్రేష్ఠులు మరణించారు. ఈ రామకృష్ణులు చాలా బలవంతులు. “దూరంగా పొండి” అంటూ తక్కిన మల్లురు అందరూ చెల్లాచెదరై పారిపోయారు.

తెభా-10.1-1371-ఉ.
ల్లురఁ జంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శో
భిల్లఁగఁ బాదపద్మములఁ బెల్లుగ నందెలు మ్రోయ వచ్చు నా
ల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు ల
ల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగఁ గంసుఁడు దక్క నందఱున్.

టీక:- మల్లురన్ = మల్లవీరులను; చంపి = సంహరించి; గోపక = గొల్లవారి; సమాజము = సమూహము; లోన్ = అందు; మృగరాజు = సింహము {మృగరాజు - మృగములలో రాజు వంటిది, సింహము}; రేఖన్ = వలె; శోభిల్లగన్ = ప్రకాశించగా; పాద = పాదములు అనెడి; పద్మములన్ = పద్మము లందు; పెల్లుగన్ = అధికముగా; అందెలు = కాలి కడియములు; మ్రోయన్ = మోగుతుండగా; వచ్చు = వచ్చుచున్న; ఆ = ఆ యొక్క; వల్లవరాజనందనుల = బలరామ కృష్ణులను {వల్లవరాజనందనులు - వల్లవరాజు (నందుని) నందనులు, బలరాముడు కృష్ణుడు}; వారక = ఉపేక్షింపకుండ; చూచి = చూసి; మహీసుర = బ్రాహ్మణులు {మహీసురుడు - భూమిపై దేవత, విప్రుడు}; ఆదులు = మున్నగువారు; అల్లల్లన = మెల్లిమెల్లిగా; సంస్తుతించిరి = కీర్తించిరి; ప్రియంబుగన్ = ఇష్ట పూర్తిగా; కంసుడు = కంసుడు; తక్కన్ = తప్పించి; అందఱున్ = ఎల్లవారు.
భావము:- గొల్లలరాజైన నందుడి నందనులు మల్లులను చంపి గొల్లలమధ్య సింహాలలా ప్రకాశిస్తూ, అందెలు మ్రోగుతున్న అడుగుదామరలతో అడుగులు వేస్తూ వస్తుంటే, ఒక్క కంసుడు తప్పించి బ్రాహ్మణులు మొదలైన వారు అందరూ రెప్పవాల్చక చూసి ప్రీతితో పొగడారు.

తెభా-10.1-1372-వ.
అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె.
టీక:- అంత = అప్పుడు; సభా = సభలోని; జనంబుల = ప్రజల యొక్క; కలకలంబున్ = కోలహలమును; నివారించి = అణచి; మంత్రులను = సచివులను; చూచి = చూసి; కంసుండు = కంసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అప్పుడు సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూసి ఇలా అన్నాడు.

తెభా-10.1-1373-ఉ.
"ల్లవబాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగఁ ద్రొబ్బుఁ; డీ
గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టు; డుర్వికిం
దెల్లముగాఁగ నేడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ
డెల్లవిధంబులం; బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్."

టీక:- వల్లవ = గొల్ల; బాలురన్ = పిల్లలను; నగరి = అంతఃపురపు; వాకిటి = ద్వారము; కిన్ = బైటికి; వెడలంగన్ = పోవునట్లు; ద్రొబ్బుడు = తోసివేయండి; ఈ = ఈ యొక్క; గొల్లలన్ = గోపకులను; ముట్టకోల్గొనుడు = ఆక్రమించండి; క్రూరుని = క్రూరుడైన; నందుని = నందుడిని; కట్టుడు = కట్టివేయండి; ఉర్వి = భూమి; కిన్ = కి; తెల్లము = స్పష్టము; కాగన్ = అగునట్లు; నేడు = ఇవాళ; వసుదేవుని = వసుదేవుడిని; చంపుడు = చంపండి; తండ్రి = తండ్రి; కాడు = కాదు; వీడు = ఇతడు; ఎల్ల = అన్ని; విధంబులన్ = రకములుగాను; పరుల్ = పగవారి; కిన్ = కి; ఇష్టుడు = కావలసినవాడు; కావకుడు = కాపాడకండి, చంపండి; ఉగ్రసేనునిన్ = ఉగ్రసేనుడిని.
భావము:- “ఈ గొల్లపిల్లలను నగరద్వారం బైటకి పడిపోయేలా నెట్టేయండి. ఈ యాదవులను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేలా, ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఈ ఉగ్రసేనుడు నాకు తండ్రి కాడు. అన్నివిధాలా శత్రువుకు ఇష్టమైనవాడు. వాడిని కాపాడకండి.”

తెభా-10.1-1374-వ.
అని పలుకు సమయంబున.
టీక:- అని = అని; పలుకు = అనుచుండెడి; సమయంబునన్ = సమయము నందు.
భావము:- ఇలా కంసుడు యాదవులను ముట్టడించమని అంటుండగా. .