పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలతో జలక్రీడలాడుట

తెభా-10.1-1101-వ.
ఇట్లు హరి రాసకేళి చాలించి, కరకాంచితలగు తటిల్లతల చెలువున ఘర్మ సలిలకణాక్రాంత లగు కాంతలంగూడి జలక్రీడా కుతూహలుండై యమునాజలంబుఁ జొర, నందు ముందర సుందరులు జొచ్చి పదప్రమాణంబు, జానుదఘ్నంబు, కటిద్వయసంబు, మధ్యమాత్రంబు, కుచంబులబంటి యని పలుకుచుం గుచ నయన నాభివివర కుంతలంబులు చక్రవాక జలచరావర్త శైవాలంబుల చందంబున నందంబుగ నీడుపొందిన యేఱులని కళిందనందన కరంబులు చాచి పరిరంభంబులకు నారంభించుకైవడి నెదురు చనుదెంచి తాఁకు తరంగంబులకు నులుకుచు, సారసంబులకుం గరంబులు చాఁచుచు మరాళంబులం జోపుచుఁ జెన్నుమిగిలిన చన్నుల యెత్తువత్తు మను నెపంబులఁ దపంబుల నీటఁ గావించు మాడ్కిని సంచరించు చక్రవాకంబులం దోలుచు నితాంతకాంతి సదనంబు లగు వదనంబులకు నోడి వ్రీడంజెంది కంది చందురుఁడు చలమ్ముడిగి జలమ్మునం బడి కంపించు కరణి, నిజకరచలితజలప్రతిఫలితుండై కదలు చంద్రునిం గని మెచ్చి సోలుచు, సలిలావగాహసమయ సముచ్చలిత వారి శీకర పరంపరలవలన మకరందపానమత్త మధుకర పక్షవిక్షేపణ సంజాతవాత సముద్ధూత కుముదాది పరాగపటలంబులం జేరుచు మోముదమ్ముల కమ్మఁదనమ్ములకు మూఁగి, జుమ్మురను తుమ్మెదలకు వెఱచుచుఁ గరంబుల నీ రెగయం జఱచుచు నీలనీరద నిపతిత పయోబిందు సందోహంబులం దడియు పువ్వుదీవియల బాగునఁ గృష్ణు కరద్వయంబునం జిలుకు తోయంబులం దడియుచుఁ గ్రందుకొని సుడియుచు, నసమబాణుని పులుకడిగినకుసుమబాణంబుల పగిది మేనులు మెఱయ సలిలావగాహనపరాయత్త చిత్త లగుచు మొత్తంబులై సరస భాషణంబులం ద్రుళ్ళుచు బాహుల నీరు నించుచు హరిమీఁదం జల్లుచుఁ జల్లునెడం దడఁబడ దాఁటుచు దాఁటి చనక నిలువరించుచు వినోదింప, హరియుం గరేణుకర వికీర్ణ నీరధారాభిషిక్తంబగు శుండాలంబు లీల నాభీరకామినీకర సముజ్ఝిత జలాసారంబులం దోఁగుచు, వ్రజవధూజన హస్తప్రయుక్త కల్హార కైరవ పరాగపటలంబువలన భూతిభూషణసిరి వహించుచు గోపికాజన పాణికిసలయ సమున్ముక్త కమలదళంబుల వలన సహస్రనయనుని రూపుఁ జూపుచు గోపాలబాలికా కుచకలశ కుంకుమ పంకంబువలనఁ బ్రభాతబాలభానుని భంగి భాసిల్లుచు, ఘోషయోషా కటాక్ష విక్షేపణంబులవలన మధుపపరివృత హరిచందన సౌందర్యంబు నొందుచు, వల్లవీహాసరుచుల వలనఁ జంద్రికా ప్రభాభాసిత నీలశైలంబు క్రియ నమరె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; రాసకేళి = రాసము ఆడుట; చాలించి = ఆపి; కరక = వడగండ్లుచే; అంచితలు = అలంకరిపంబడినవి; అగు = అయినట్టి; తటిల్లతల = మెరుపుతీగల; చెలువున = అందముతో; ఘర్మ = చెమట; సలిలకణ = బిందువులచేత; ఆక్రాంతలు = నిండినవారు; అగు = ఐన; కాంతలన్ = పడతులతో {కాంత - కోరదగినామె, స్త్రీ}; కూడి = కలిసి; జల = నీళ్ళ యందు; క్రీడా = క్రీడించవలెనని; కుతూహలుండు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; యమునా = యమునానది యొక్క; జలంబున్ = నీటిలోనికి; చొరన్ = ప్రవేశించగా; అందున్ = అప్పుడు; ముందర = ముందుగా; సుందరులున్ = అందగత్తెలు; చొచ్చి = ప్రవేశించి, నీటిలోదిగి; పదప్రమాణంబు = అడుగు లోతు; జానుదఘ్నంబు = మోకాలిబంటి లోతు; కటిద్యయసంబు = పిరుదులజం టంత లోతు; మధ్యమాత్రంబు = నడుము లోతు; కుచంబులబంటి = రొమ్ముబంటి; అని = అని; పలుకుచు = చెప్పుచు; కుచ = స్తనములు; నయన = కన్నులు; నాభివివర = బొడ్డుసుడి; కుంతలంబులు = శిరోజములు; చక్రవాక = చక్రవాకపక్షులు; జలచర = చేపలు; ఆవర్త = సుగిగుండములు; శైవాలంబుల = నాచుల; చందంబునన్ = వలె; అందంబుగన్ = సుందర మగుట యందు; ఈడుపొందిన = సామ్యము కలిగిన; ఏఱులు = ఉపనదులు; అని = అని; కాళిందనందన = యమునానది {కాళిందనందన - కాళింద పర్వతమునందు పుట్టినది, యమునానది}; కరంబులన్ = చేతులను; చాచి = చాచి; పరిరంభంబులు = కౌగలింతల; కున్ = కు; ఆరంభించు = మొలు పెట్టెడు; కైవడిన్ = విధముగ; ఎదురు = ఎదురుగా; చనుదెంచి = వచ్చి; తాకు = తాకెడి; తరంగంబుల్ = అలల; కున్ = కు; ఉలుకుచు = ఉలుక్కిపడుతు; సారసంబుల్ = పద్మముల {సారసంబు - సరస్సుల ఉండునవి, తామరలు}; కున్ = కోసము; కరంబులు = చేతులు; చాచుచున్ = చాస్తూ; మరాళంబులన్ = హంసలను; జోపుచున్ = తోలుతూ; చెన్ను = అందము; మిగిలిన = అతిశయించిన; చన్నులన్ = స్తనములతో; ఎత్తువత్తుము = సమాన మగుదుము; అను = అనెడి; నెపంబులన్ = తలపు లనెడి కారణాలచే; తపంబులన్ = తపస్సులను; నీటన్ = నీటిలో; కావించు = చేయుచున్న; మాడ్కిని = విధముగా; సంచరించు = మెలగెడి; చక్రవాకంబులన్ = చక్రవాకపక్షులను; తోలుచు = తరిమివేయుచు; నితాంత = మిక్కుటములైన; కాంతి = కాంతులకు; సదనంబులు = ఉనికిపట్లు; అగు = ఐన; వదనంబుల్ = ముఖముల; కున్ = కు; ఓడి = సాటిరాలేక; వ్రీడంజెంది = సిగ్గుపడి; కంది = ఎఱ్ఱబారి; చందురుడు = చంద్రుడు; చలమ్ము = పట్టుదల; ఉడిగి = విడిచిపెట్టి; జలమ్మునన్ = నీటిలో; పడి = పడిపోయి; కంపించు = వణకిపోయెడి; కరణిన్ = విధముగా; నిజ = తన యొక్క; కర = కిరణములచే; చలిత = కదలింపబడిన; జల = నీటిలో; ప్రతిఫలితుండు = ప్రతిబింబించినవాడు; ఐ = అయ్యి; కదలు = కదలెడి; చంద్రునిన్ = చంద్రుని; కని = చూసి; మెచ్చి = మెచ్చుకొని; సోలుచున్ = మైమరచిపోతూ; సలిల = నీటి యందు; అవగాహ = మునిగెడి; సమయ = సమయము నందు; సమ = మిక్కిలి; ఉచ్చలిత = ఎగజిమ్మిన; వారి = నీటి; శీకర = తుంపరల; పరంపరల = సమూహముల; వలన = వలన; మకరంద = పూదేనెలను; పాన = తాగుటచేత; మత్త = మదించిన; మధుకర = తుమ్మెదల; పక్ష = రెక్కలచే; విక్షేపణ = విసరబడుటచేత; సంజాత = పుట్టిన; వాత = గాలిచేత; సముద్ధూత = ఎగురకొట్టబడిన; కుముద = తెల్లకలువలు; ఆది = మున్నగువాని; పరాగ = పుప్పొళ్ళ; పటలంబులన్ = సమూహములను; చేరుచు = చేరుచు; మోము = ముఖములు అనెడి; తమ్ములన్ = పద్మముల యొక్క; కమ్మదనమ్ముల్ = సువాసనల; కున్ = కు; మూగి = ముసరుకొని; జుమ్మురు = ఝంకారములు; అను = చేసెడి; తుమ్మెదల = తుమ్మెదల; కున్ = కు; వెఱచుచు = బెదురుతు; కరంబులన్ = చేతులతో; నీరు = నీటిని; ఎగయన్ = ఎగురునట్లు; చఱచుచున్ = అరచేతులతో కొట్టుతు; నీల = నల్లని; నీరద = మేఘములనుండి; నిపతిత = పడుతున్న; పయస్ = నీటి; బిందు = బొట్ల యొక్క; సందోహంబులన్ = సమూహములందు; తడియు = తడిసిపోయెడి; పువ్వు = పూల; తీవియల = తీగల; బాగునన్ = వలె; కృష్ణు = కృష్ణుని; కర = చేతులు; ద్వయంబునన్ = రెంటిచేతను; చిలుకు = జల్లబడెడి; తోయంబులన్ = నీటి యందు; తడియుచున్ = తడిసిపోతు; క్రందుకొని = సందడిచేస్తూ; సుడియుచున్ = సోలిపోతూ; అసమబాణుని = మన్మథుని {అసమబాణుడు - బేసిసంఖ్యగల (ఐదు, 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము లేదా 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంబన 5సమ్మోహనము) బాణములు కలవాడు, మన్మథుడు}; పులుకడిగిన = పరిశుభ్రమైన {పులుకడిగిన - పరిశుభ్రమైన, మురికి పోగొట్టబడిన}; కుసుమ = పూల; బాణంబులన్ = బాణముల; పగిది = వలె; మేనులు = శరీరములు; మెఱయన్ = మెరిసిపోతుండగ; సలిల = నీళ్ళ యందు; అవగాహ = స్నానములు చేయుటలో; పరాయత్త = ఆసక్తములైన; చిత్తలు = మనసులు కలవారు; అగుచున్ = ఔతు; మొత్తంబులు = గుంపులు గుంపులగా; ఐ = అయ్యి; సరస = సరాగపు; భాషణంబులన్ = మాటలతో; త్రుళ్ళుచున్ = సందడిచేస్తూ; బాహులన్ = చేతులలో, దోసిళ్ళలో; నీరున్ = నీటిని; నించుచు = నింపుకొనుచు; హరి = కృష్ణుని; మీదన్ = పైన; చల్లుచున్ = చిలుకుతు; చల్లున్ = చల్లెడి; ఎడన్ = అప్పుడు; తడబడన్ = తత్తరపాటుతో; దాటుచున్ = తప్పించుకొనుచు; దాటిచనక = తప్పించుకోకుండగ; నిలువరించుచున్ = ఆపుతు; వినోదింపన్ = వేడుకగా ఉండగ; హరియున్ = కృష్ణుడు; కరేణు = ఆడ ఏనుగుల; కర = తొండములచే; వికీర్ణ = వెదజల్లబడిన; నీర = నీటి; ధారా = ధారలచే; అభిషిక్తంబు = తడిసినది; అగు = ఐన; శుండాలంబు = మగ ఏనుగు; లీలన్ = వలె; ఆభీర = గొల్ల; కామినీ = భామల; కర = చేతులచేత; సముజ్జిత = చల్లబడిన; జలా = నీటి; ఆసారంబులన్ = జల్లులలో; తోగుచున్ = తడియుచు; వ్రజ = గోపికా; వధూజన = స్త్రీల; హస్త = చేతులచేత; ప్రయుక్త = ప్రయోగింపబడిన; కల్హార = చెంగలువల; కైరవ = తెల్లకలువల; పరాగ = పుప్పొడి; పటలంబు = సమూహము; వలన = వలన; భూతిభూషణ = శంకరుని {భూతిభూషణుడు - విభూతిచే అలంకరింపబడిన వాడు, శివుడు}; సిరిన్ = శోభను; వహించుచు = పొందుతు; గోపికాజన = గోపికాస్త్రీల; పాణి = చేతులు అనెడి; కిసలయ = చిగుళ్ళనుండి; సమున్ముక్త = బాగా విడువబడిన; కమల = పద్మముల; దళంబుల = రేకుల; వలన = వలన; సహస్రనయనుని = ఇంద్రుని యొక్క {సహస్ర నయనుడు - వెయ్యి కన్నులు కలవాడు, ఇంద్రుడు}; రూపున్ = ఆకృతిని; చూపుచున్ = కనబరచుచు; గోపాల = గోపికా; బాలికా = యువతుల యొక్క; కుచ = స్తనములనెడి; కలశంబు = కలశము లందలి; కుంకుమపంకంబు = కుంకుమపువ్వు లేపనము; వలన = వలన; ప్రభాత = ఉదయమున; బాల = ఉదయించుచున్న; భానుని = సూర్యుని {భానుడు - ప్రకాశించువాడు, సూర్యుడు}; భంగిన్ = వలె; భాసిల్లుచున్ = ప్రకాశించుచు; ఘోష = వ్రేపల్లెలోని; యోషా = స్త్రీల యొక్క; కటాక్ష = కడగంటి చూపుల; విక్షేపంబుల = పరివ్యాప్తులచే; మధుప = తుమ్మెదలచే; పరివృత = ఆవరింపబడిన; హరిచందన = కల్పవృక్షము, మంచిగంధముచెట్టు; సౌందర్యంబున్ = చక్కదనమును; ఒందుచున్ = పొందుతు; వల్లవీ = గోపికల; హాస = నవ్వుల యొక్క; రుచుల = కాంతుల; వలనన్ = వలన; చంద్రికా = వెన్నెలల; ప్రభా = కాంతులచే; భాసిత = ప్రకాశించుతున్న; నీలశైలంబు = నీలగిరి; క్రియన్ = వలె; అమరెన్ = ఒప్పెను; అంత = అటుపిమ్మట.
భావము:- ఈ విధంగా కృష్ణుడు రాసలీల చాలించి వడగండ్లతో ఒప్పే మెరుపుతీగ వలె చెమట బిందువుల దోగిన ఆ అందగత్తెలతో కూడి జలక్రీడలు ఆడటానికి ఉత్సాహంతో, కాళిందీ జలాలలోకి దిగాడు. అతని కంటె ముందుగా గోపాంగనలు యమునలో ప్రవేశించి “ఇక్కడ అడుగు లోతు; ఇక్కడ మోకాలిలోతు; ఇక్కడ నడుములోతు; ఇక్కడ రొమ్ములలోతు” అంటూ ఏటి నీటిలోకి దిగారు ఆ సుందరీమణుల చనులకు చక్రవాకాలతో, కండ్లు మీనాలతో, బొడ్డు సుడులతో, తలవెంట్రుకలు నాచుతో సరిపోలడంతో; వారూ కూడ తన వంటి వారే అని భావించి ఆలింగనం చేసుకుందాం అని యమున చేతులు చాచిందా అన్నట్లు తరంగాలు ఎదురుగా వచ్చి వారిని తాకాయి. వారు ఉలికిపడి చూసారు. అక్కడి బెగ్గురు పక్షులను పట్టడానికి ఆ చెలులు చేతులు సాచారు, హంసలను తోలారు, సొబగు మీరిన ఆ సుదతుల స్తనాలకు సాటి రాగలమని నీటిలో తపమాచరిస్తున్నయా అన్నట్లు అక్కడ సంచరిస్తున్న జక్కన పిట్టలను వారు తరిమి వేసారు. ఆ మగువలు చేతులతో చెదరుగొట్టిన జలాలలో ప్రతిఫలించిన చంద్రుడి అధికమైన కాంతికి పోటీగా ఉన్న ఆ నెలతల ముఖాలకు ఓడి సిగ్గుతో వెలవెలబారుతూ సిగ్గుపడి నీటిలో పడి వణుకుతున్నాడా అన్నట్లు చంద్రుడు ఉన్నాడు. అతణ్ణి జూచి వారు పరవశించారు. తేనె త్రాగి మదించిన తుమ్మెదల రెక్కలగాలికి రేగుతున్న కలువలు మొదలైన పూలపుప్పొడి వారు నీటమునిగి నప్పుడు పైకి చెదరిన నీటితుంపరల వలన అణగిపోయింది. తమ ముఖపద్మ సౌరభానికి మూగి జుంజుమ్మనే భ్రమరాలను జూసి వారు భయపడ్డారు. అవి పైకెగిరేలా అరచేతులతో నీటిని చరిచారు. నీలిమబ్బుల నుండి రాలిన జలధారల వలన పూలతీగల వలె వారు శ్రీకృష్ణుడు దోసిటితో చల్లే నీటితో బాగా తడిసిపోయారు. గుంపులు కట్టి త్రొక్కిసలాడారు. మన్మథుని మాలిన్యం వెడలిన పుష్పశరాల వలె తళతళ మెరుస్తున్న మేనులు కల ఆ మెలతలు నీట మునగటానికి ఉబలాటపడ్డారు. వారు సరససల్లాపాలతో త్రుళ్లిపడుతూ చేతుల నిండా నీరు తీసుకొని తొట్రుపడుతూ నల్లనయ్య మీద చల్లారు. ఒకరి కంటే ఒకరు ముందుకు వచ్చి శ్రీకృష్ణుని దాటి వెళ్ళనీక వినోదించారు. ఆడ ఏనుగులు తొండాలతో విరజిమ్మిన నీటిజల్లులలో మదపుటేనుగు వినోదించిన మాదిరి శ్రీకృష్ణుడు, వ్రజస్త్రీలు ఎగజిమ్మిన జలధారలతో తడిసిపోయారు. గోపవధూటులు చేతులతో కృష్ణుని మీదికు ఎఱ్ఱ తెల్లకలువలు విసిరారు. ఆ పువ్వుల పుప్పొడి నెమ్మేని కంటుకుని ఆయన విభూతి ధరించిన పరమశివుడిలా భాసించాడు. ఆ అందగత్తెలు చిగురుటాకుల వంటి చేతులతో తామరపూరేకులు విభుని మీదకి చల్లారు. అప్పుడు కృష్ణుడు వేయికన్నుల దేవవిభుడు ఇంద్రుడు వలె వెలుగొందాడు. ఆ కాంతలు కుంకుమ పూసిన కుంభాలవంటి తమ కుచాలతో కృష్ణుని ఆలింగనం చేసుకోగా, ఆయన ఉదయకాల సమయ బాలభాస్కరుని వలె ప్రకాశించాడు. ఆ వనితలు తమ కడగంటి చూడ్కులు రమణుని మీద ప్రసరింప చేయగా, ఆయన తుమ్మెద కదుపులు ముసిరిన పచ్చని గంధంవృక్షంలా పరిఢవిల్లాడు. ఆ గోపికలు చిరునవ్వు నిగ్గులు చెలికానిపై వెల్లిగొల్పగా, ఆయన వెన్నెల వెలుగులలో విలసిల్లెడి అంజనాద్రి వలె మెరిసాడు.