పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దిగ్విజయంబు

దిగ్విజయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దిగ్విజయంబు)
రచయిత: పోతన


తెభా-10.2-697-సీ.
రణీశ! యొకనాఁడు ర్మతనూజుండు-
ప్రవిమల నిజసభావన మందు
హితులు, మంత్రులు, పురోహితులును, సుతులును-
మిత్రులు, బంధువుల్‌, క్షత్రవరులుఁ,
రిచారకులు, సూత, పాఠక, కవి, బుధ-
రులును, మునులును రుసఁ గొలువఁ
జిరలీల నవరత్న సింహాసనస్థుఁడై-
గొలువుండి వినతుఁడై నలిననాభు,

తెభా-10.2-697.1-తే.
భువనరక్షణదక్షు, నద్భుతచరిత్రు,
దుకులేశ్వరు, మురదైత్యదవిభేది,
నాప్తు, నయవేదిఁ, జతురుపాప్రవీణుఁ
జూచి యిట్లని పలికె నస్తోకచరిత!

టీక:- ధరణీశ = రాజా; ఒక = ఒకానొక; నాడున్ = రోజున; ధర్మతనూజుండు = ధర్మరాజు; ప్రవిమల = అతినిర్మలమైన; నిజ = తన; సభాభవనము = సభామండపము; అందున్ = లో; హితులు = ఆప్తులు; మంత్రులు = మంత్రులు; పురోహితులునున్ = పురోహితులు; సుతులునున్ = కొడుకులు; మిత్రులు = మిత్రులు; బంధువుల్ = బంధువులు; క్షత్ర = రాజ; వరులున్ = శ్రేష్ఠులు; పరిచారకుల = సేవకులు; సూతపాఠక = వంశావళి పాడువారు; కవి = కవితలు చదువువారు; బుధ = జ్ఞానులు; వరులును = ఉత్తములు; మునులును = మునులు; వరుసన్ = క్రమముగా; కొలువన్ = సేవించుచుండగా; చిర = మిక్కిలి; లీలన్ = విలాసముతో; నవరత్న = నవరత్నములు పొదిగిన {నవరత్నములు - 1మౌక్తికము 2పద్మరాగము 3వజ్రము 4ప్రవాళము 5మరకతము 6నీలము 7గోమేధికము 8పుష్యరాగము 9వైడూర్యము}; సింహాసనస్థుడు = సింహాసనమునకూర్చున్నవాడు; ఐ = అయ్యి; కొలువుండి = సభదీరిఉండి; వినతుడు = వినయముగానున్నవాడు; ఐ = అయ్యి; నలిననాభున్ = కృష్ణుని {నలిననాభుడు - పద్మము నాభియందు కలవాడు, విష్ణువు}; భువనరక్షదక్షున్ = కృష్ణుని {భువనరక్షదక్షుడు - జగత్తును రక్షించు సమర్థత కలవాడు, విష్ణువు}; అద్భుతచరిత్రున్ = కృష్ణుని {అద్భుతచరిత్రుడు - అద్భుతమాన నడవడిక కలవాడు, కృష్ణుడు}; యదుకులేశ్వరున్ = కృష్ణుని {యదుకులేశ్వరుడు - యదు వంశమునందలి ప్రభువు, కృష్ణుడు}; మురదైత్యమదవిభేదిన్ = కృష్ణుని {మురదైత్యమదవిభేది - మురాసురునిగర్వమును తొలగించిన వాడు, కృష్ణుడు}; ఆప్తున్ = కృష్ణుని {ఆప్తు - సర్వహితుడు, విష్ణువు}; నయవేదిన్ = కృష్ణుని {నయవేది - నీతి తెలిసినవాడు, కృష్ణుడు}; చతురుపాయప్రవీణున్ = కృష్ణుని {చతురుపాయప్రవీణుడు - చతురుపాయములు (1సామ 2దాన 3భేద 4దండములు) అందు సమర్థుడు, కృష్ణుడు}; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అని = అని; పలికెన్ = పలికెను; అస్తోక = గొప్ప; చరిత = వర్తన కలవాడా.
భావము:- పరీక్షిన్మహారాజా! ఒకనాడు తన సభాభవనంలో హితులూ, పురోహితులూ, పుత్రులూ, మిత్రులూ, సామంతులూ, చుట్టాలూ, సోదరులూ, స్తుతిపాఠకులూ, మునీశ్వరులూ పరివేష్టించి ఉండగా నిండుకొలువులో సింహాసనంపై ధర్మరాజు కూర్చుని ఉన్నాడు. పద్మనాభుడు, జగద్రక్షకుడు, మరాసురాది రాక్షసుల గర్వం సర్వం అణచిన వాడు, ఆత్మీయుడు, యదుకులేశ్వరుడు, సామ దాన భేద దండ ఆది చతురోపాయ పారాయణుడు అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

తెభా-10.2-698-తే.
"నఘచారిత్ర! రాజసూయాధ్వరంబుఁ
నెమ్మిఁ గావించు వేడుక నెమ్మనమున
నెనయుచున్నది యది నిర్వహింప నీవ
కాక నా కాత్మబంధువుల్‌ లరె యొరులు?

టీక:- అనఘచారిత్ర = కృష్ణా {పుణ్య వర్తనుడా}; రాజసూయాధ్వరంబున్ = రాజసూయ యాగమును; నెమ్మి = ప్రీతితో; కావించు = చేయవలెనని; వేడుక = ఇచ్ఛ; నెఱి = నిండు; మనమునన్ = మనసు నందు; ఎనయుచున్నది = కలుగుతున్నది; అది = దానిని; నిర్వహింపన్ = కాపాడుటకు; నీవ = నీవు మాత్రమే; కాక = తప్పించి; నా = నా; కున్ = కు; ఆత్మబంధువులు = దగ్గరి చుట్టములు; కలరె = ఉన్నారా, లేరు; ఒరులు = ఇతరులు.
భావము:- “పుణ్యచరితా! కృష్ణా! రాజసూయయాగం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. దానిని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు?

తెభా-10.2-699-ఉ.
వ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తి నిష్ఠులై,
యెవ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై,
వ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసౌఖ్యముల్‌
నివ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే! "

టీక:- ఎవ్వరు = ఎవరైతే; నీ = నీ యొక్క; పద = పాదములు అను; అంబుజములున్ = పద్మములను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; కొల్తురు = సేవింతురో; భక్తి = భక్తియందు; నిష్ఠులు = అనన్యమైన దీక్ష కలవారు; ఐ = అయ్యి; ఎవ్వరున్ = ఎవరైతే; నిన్నున్ = నిన్ను; ప్రేమన్ = ప్రేమతో; నుతియింతురు = స్తుతించెదరో; భూరి = ఉత్కృష్ఠమైన; వివేకశాలురు = వివేకము కలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; విమల = పరిశుద్ధమైన; ఆత్ములు = మనసుకలవారు; అందుదురు = పొందగలరు; ఉదంచిత = మిక్కిలి చక్కనైన; శోభన = శుభకరమైన; నిత్య = శాశ్వతములైన; సౌఖ్యముల్ = సుఖములను; నివ్వటిలంగన్ = అతిశయించునట్లుగా; కృష్ణ = కృష్ణా; నిను = నిన్ను; నేర్చి = నేర్పు కలిగి; భజించినన్ = సేవించినచో; రిత్తపోవునే = వ్యర్థ మగునా, కాదు.
భావము:- కృష్ణా! భక్తితో నీ పాదపద్మాలను ధ్యానించే వారు, మంచి బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో సన్నుతించు వారు సదా సుఖసంతోషాలను పొందుతారు. నిన్ను శ్రద్దగా పూజించటం ఎన్నటికీ వ్యర్థంకాదు కదా.”

తెభా-10.2-700-వ.
అనినఁ గృష్ణుండు ధర్మనందనున కిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; కృష్ణుండు = కృష్ణుడు; ధర్మనందనున్ = ధర్మరాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా పలికిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు....

తెభా-10.2-701-చ.
"గుణశాలి! పాండునృపనందన! నీ తలఁ పొప్పు నీక్రతు
క్రి మునిదేవతాపితృ సుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ
క్షమును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్
ము నొసంగు దీనిఁ గురుత్తమ! వేగ యుపక్రమింపవే!

టీక:- నయ = మేలైన; గుణశాలి = సుగుణములు కలవాడ; పాండునృపనందన = ధర్మరాజా {పాండునృప నందన - పాండురాజు కొడుకు, ధర్మరాజు}; నీ = నీ యొక్క; తలపు = తలచిన పని; ఒప్పు = చక్కటిది; నీ = నీవు చేయు; క్రతు = యజ్ఞ; క్రియన్ = కార్యము; ముని = మునులకు; దేవతా = దేవతలకు; పితృ = పితృదేవతలకు; సుకృతమును = మంచిపని; ఐ = అయ్యి; నిఖిల = ఎల్ల; ఉగ్ర = భయంకరమైన; శాత్రవ = శత్రువుల; క్షయమునున్ = నాశమును; బాంధవ = బంధువులకు; ప్రియమున్ = ప్రీతిని; సంచిత = కూర్చబడు {సంచిత - జన్మజన్మములకు పోగుచేయబడు పుణ్యము, పాపము}; పుణ్యమున్ = పుణ్యమును; నిత్య = శాశ్వతములైన; కీర్తియున్ = యశస్సు; జయమున్ = జయములు కలుగుట; ఒసంగున్ = కలుగజేయును; దీనిన్ = దీనిని; కురుసత్తమ = ధర్మరాజా {కురు సత్తముడు - కురువంశమున శ్రేష్ఠుడు, ధర్మరాజు}; వేగన్ = శీఘ్రమే; ఉపక్రమింపవే = మొదలిడుము.
భావము:- “ఓ పాండురాజు కుమారా! ధర్మరాజా! కురువంశ శ్రేష్ఠుడా! రాజనీతి విశారదుడవు నీ ఆలోచన సమంజసంగా ఉంది. ఈ రాజసూయ ప్రక్రియ మునులకు, దేవతలకు, పితృదేవతలకు అభీష్టమైనది. అది సమస్త శత్రు క్షయాన్ని, సకల బంధువు ప్రియాన్ని, సమధికమైన పుణ్యాన్ని, శాశ్వతమైన కీర్తిని, విజయాన్ని, సిద్ధింప చేస్తుంది. కాబట్టి శీఘ్రమే ఈ యాగాన్ని ప్రారంభించు.

తెభా-10.2-702-క.
నుచరిత! నీ సహోదరు
నుపమ దివ్యాస్త్రవేదు లాహవభూమిం
జెకిన వైరినృపాలురఁ
దునుమఁగఁ జాలుదురు శౌర్యదుర్దమ భంగిన్.

టీక:- మనుచరిత = ధర్మరాజ {మనుచరిత - శాశ్వతముగా జీవించు వర్తన కలవాడు, ధర్మరాజు}; నీ = నీ యొక్క; సహోదరులు = తోడబుట్టినవారు; అనుపమ = సాటిలేని; దివ్య = దివ్యమైన; అస్త్ర = అస్త్రములు; వేదులు = ఎఱిగినవారు; ఆహవ = యుద్ధ; భూమిన్ = భూమి అందు; చెనకిన = ఎదిరించు; వైరి = శత్రు; నృపాలురన్ = రాజులను; తునుమగన్ = చంప; చాలుదురు = సమర్థులు; శౌర్య = శూరత్వముతో; దుర్దమ = అణపరాని; భంగిన్ = విధముగా.
భావము:- ఓ యుధిష్టరా! నీ తమ్ముళ్ళు దివ్యమైన ఎదురులేని అస్త్రవిద్యా విశారదులు; యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజులను సంహరించడంలో చక్కని సామర్థ్యం కలవారు.

తెభా-10.2-703-క.
గెలువుము విమతనృపాలుర
వెయుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్
నిలుపుము నిఖిలధరా మం
లిని భవచ్ఛాసనము దృఢంబుగఁ జెల్లన్.

టీక:- గెలువుము = జయింపుము; విమత = శత్రు; నృపాలుర = రాజుల; వెలయుము = ప్రసిద్ధిని వహింపుము; బుధ = జ్ఞానులచేత; వినుతము = కొనియాడబడినది; ఐన = అయిన; విశ్రుత = మిక్కిలి ప్రసిద్ధమైన కీర్తిని; నిలుపుము = స్థాపింపుము; నిఖిల = ఎల్ల; ధరామండలిని = భూమండలము నందు; భవత్ = నీ యొక్క; శాసనము = ఆజ్ఞను; దృఢంబుగన్ = గట్టిగా; చెల్లన్ = చెల్లునట్లు.
భావము:- శత్రురాజులను జయించు; శాశ్వతమైన యశస్సుతో ప్రకాశించు; సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేలాగ స్థిరంగా స్థాపించు.

తెభా-10.2-704-క.
నీ పంచుకార్య మొరులం
జూక యేఁ జేయ నిన్ను జుట్టన వ్రేలం
జూపఁగ వచ్చునె! సకల ధ
రాతులకు నీకుఁ జేయరానిది గలదే! .

టీక:- నీ = నీవు; పంచు = చేయు మన్న; కార్యమున్ = పనిని; ఒరులన్ = ఇతరులకు; చూపక = చూపించకండా; యే = నేను; చేయన్ = నే చేయుచుండగా; నిన్నున్ = నిన్ను; జుట్టన = చూపుడు; వ్రేలన్ = వేలితో; చూపగన్ = చూపించుటకు; వచ్చునా = శక్య మగునా; సకల = ఎల్ల; ధరాపతుల్ = రాజుల; కున్ = కు; నీకున్ = నీకు; చేయరానిది = చేయననెడి పని; కలదే = ఉన్నదా, లేదు.
భావము:- నీవు ఏ కార్యం చెప్తే దానిని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను వేలెత్తి చూపడానికి ఈ లోకంలో రాజులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం కాని కార్యం లేదు.

తెభా-10.2-705-వ.
కావున.
టీక:- కావున = కాబట్టి.
భావము:- అందుచేత.....

తెభా-10.2-706-క.
విలమతి నిట్టి మఖ రా
మునకుఁ దెప్పింపవలయు సంభారంబుల్‌
కూర్పుము; నీ యనుజుల
దగతిం బంపు నిఖిలత్రుల గెల్వన్."

టీక:- విమల = నిర్మలమైన; మతిన్ = బుద్ధితో; ఇట్టి = ఇటువంటి; మఖ = యజ్ఞ; రాజమున్ = శ్రేష్ఠమున; కున్ = కొరకు; తెప్పింపవలయున్ = తెప్పించవలసిన; సంభారముల్ = వస్తువులను; సమకూర్చుము = తెప్పించి చేర్చుము; నీ = నీ యొక్క; అనుజులన్ = సోదరులను; సమద = మదముతో కూడిన; గతిన్ = విధముగా; పంపు = పంపించుము; నిఖిల = ఎల్ల; శత్రులన్ = శత్రువులను; గెల్వన్ = గెలుచుటకు.
భావము:- బహు గొప్పదైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులు అందరినీ జయించడానికి నీ సహోదరులను పంపించు.”

తెభా-10.2-707-క.
ను మాటలు విని కుంతీ
యుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్
వినుతించి శౌర్యకలితుల
నుజుల దెసఁ జూచి పలికె ర్షముతోడన్.

టీక:- అను = అనెడి; మాటలు = మాటలను; విని = విని; కుంతీతనయుడు = ధర్మరాజు; మోదమునన్ = సంతోషముతో; పొంగి = అతిశయించి; తామరసాక్షున్ = కృష్ణుని; వినుతించి = స్తుతించి; శౌర్య = వీరత్వము; కలితులన్ = కలవారిని; అనుజుల = తమ్ముళ్ళ; దెసన్ = వైపు; చూచి = చూసి; పలికెన్ = చెప్పెను; హర్షము = సంతోషము; తోడన్ = తోటి.
భావము:- ఈవిధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి, పద్మాక్షుడిని ప్రస్తుతించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు.

తెభా-10.2-708-క.
"సృంయభూపాలకులునుఁ
గుంర రథ వాజి సుభట కోటులు నినుఁ గొ
ల్వం ను"మని సహదేవుని
నంక పొమ్మనియె దక్షిణాశ జయింపన్.

టీక:- సృంజయ = సృంజయదేశపు; భూపాలకులును = రాజులు; కుంజర = ఏనుగులు; రథ = రథములు; వాజి = గుఱ్ఱములు; సుభట = కాల్బలము; కోటులు = సమూహములు; నినున్ = నిన్ను; కొల్వన్ = సేవిస్తుండగా; చనుము = తీసుకువెళ్ళు; అని = అని; సహదేవుని = సహదేవుడిని; అంజక = వెనుదీయకుండ; పొమ్ము = వెళ్ళు; అనియెన్ = అని చెప్పెను; దక్షిణ = దక్షిణపు; ఆశన్ = దిక్కును; జయింపన్ = గెలుచుటకు;
భావము:- “సహదేవా! నీవు సృంజయ రాజులూ, చతురంగబలాలూ నిన్ను కొలుస్తూ వస్తారు. వారిని తీసుకు వెళ్ళి దక్షిణ దిక్కును జయించి రమ్ము” అని సహదేవుడిని ఆజ్ఞాపించాడు.

తెభా-10.2-709-క.
ప్రటచతుర్విధ సేనా
ప్రరంబులు గొలువఁ బంచెఁ డమటిదిశకున్
కులున్ విదళిత రిపు భూ
కులున్ శౌర్యంబు మెఱసి పార్థివముఖ్యా!

టీక:- ప్రకట = ప్రసిద్ధములైన; చతుర్విధసేనా = చతుర్విధబలముల; ప్రకరంబులున్ = సమూహములను; కొలువన్ = సేవిస్తుండగా; పంచెన్ = పంపించెను; పడమటి = పశ్చిమ; దిశ = దిక్కున; కున్ = కు; నకులున్ = నకులుడిని; విదళిత = నరకబడిన; రిపు = శత్రు; భూపకులున్ = రాజులు కలవానిని; శౌర్యంబున్ = వీరత్వము; మెఱసి = ప్రకాశింపజేసి; పార్థివముఖ్యా = మహారాజా.
భావము:- ఓ మహారాజా! పరీక్షిత్తూ! ప్రసిద్ధులైన రథ, గజ, తురగ, పదాతు లనబడే నాలుగు విధాల సైన్యాలతో పడమటిదిక్కును జయించి రమ్మని నకులుడిని పంపించాడు.

తెభా-10.2-710-క.
దుర్జనభంజను శౌర్యో
పార్జితవిజయప్రకాండు నాహవనిపుణు
న్నర్జునమహితయశోనిధి
ర్జును నుత్తరపు దిశకు నిచె నరేంద్రా!

టీక:- దుర్ = చెడ్డ; జన = వారిని; భంజనున్ = శిక్షించువానిని; శౌర్య = శూరత్వముతో; ఉపార్జిత = సంపాదింపబడిన; విజయ = గెలుపుల; ప్రకాండున్ = సమూహములు కలవానిని; ఆహవ = యుద్ధము నందు; నిపుణున్ = నేర్పు కలవానిని; అర్జున = తెల్లని, స్వచ్ఛమైన; మహిత = గొప్ప; యశః = కీర్తికి; నిధిన్ = స్థానమైనవానిని; అర్జునున్ = అర్జునుడిని; ఉత్తరపు = ఉత్తరము; దిశ = దిక్కున్; కున్ = కు; అనిచె = పంపించెను; నరేంద్రా = రాజా.
భావము:- దుర్మార్గుల్ని శిక్షించేవాడూ,మహా శౌర్యోపేతుడూ, విజయశీలుడూ, గొప్ప యుద్ధనిపుణుడూ, స్వచ్ఛమైన కీర్తి కలవాడూ అయిన అర్జునుడిని ఉత్తర దిక్కును జయించడానికి నియోగించాడు.

తెభా-10.2-711-ఆ.
హితశౌర్యనిధులు త్స్య కేకయ మద్ర
భూలేంద్రబలసమేముగను
ర్పమొప్ప బంచెఁదూర్పుదిక్కునకు ను
ద్దామనిహిత వైరిధాము భీము.

టీక:- మహిత = గొప్ప; శౌర్య = శూరత్వమునకు; నిధులు = స్థానమైనవారు; మత్స్య = మత్స్య దేశపు; కేకయ = కేకయ దేశపు; మద్ర = మద్ర దేశపు; భూతలేంద్ర = రాజుల; బల = సైన్యములతో; సమేతముగను = కూడినవాడుగా; దర్పము = పరాక్రమము; ఒప్పన్ = కనబరచుటకు; పంచెన్ = పంపించెను; తూర్పు = తూర్పు; దిక్కున = దిక్కున; కునున్ = కు; ఉద్దామ = అధికులైన; నిహిత = చంపబడిన; వైరి = శత్రువుల; ధామున్ = తేజస్సులు కలవానిని; భీమున్ = భీమసేనుని.
భావము:- తూర్పుదిక్కును జయించడానికి గొప్ప శౌర్యవంతు లైన మత్స్య, కేకయ, మద్ర రాజులతో కలిసి శత్రువుల తేజస్సులు హరించుటలో మేటి ఐన భీముడిని వెళ్ళమని ధర్మరాజు పంపించాడు.

తెభా-10.2-712-చ.
నిచిన వార లేగి ఘనబాహుపరాక్రమ విక్రమంబుల
న్ననుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌
క వినూత్న రత్న తురప్రముఖాఖిల వస్తుజాతముల్‌
గొని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్త చిత్తులై. ,

టీక:- పనిచినన్ = పంపించగా; వారలు = వారు; ఏగి = వెళ్ళి; ఘన = గొప్ప; బాహు = భుజబలము; పరాక్రమ = పరాక్రమము; విక్రమంబులన్ = శూరత్వములచే; అనుపమ = సాటిలేని; శౌర్యులు = వీరులు; ఐన = అయిన; చతుః = నాలుగు; అంత = దిక్కు లందలి; మహీశులన్ = రాజులను; ఓర్చి = ఓడించి; కప్పముల్ = కప్పములుగా; కనక = బంగారు; వినూత్న = సరికొత్త; రత్న = మణులు; తురగ = గుఱ్ఱములు; ప్రముఖ = మున్నగు; అఖిల = సమస్తమైన; వస్తు = సంపదల; జాతముల్ = సమూహములను; కొని = తీసుకొని; చనుదెంచి = వచ్చి; ధర్మజున్ = ధర్మరాజున {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కున్ = కు; ప్రణమిల్లి = నమస్కరించి; ఉదాత్త = గంభీరమైన; చిత్తులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఇలా ధర్మరాజు పంపించగా వెళ్ళిన భీమార్జున నకుల సహదేవులు మహాపరాక్రమవంతు లయిన ఆయా దిక్కులలోని రాజులను ఓడించి; వారిచేత కప్పాలు కట్టించుకుని; బంగారం, మణులు, గుఱ్ఱాలు మొదలైన వస్తు సమూహాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజునకు నమస్కారం చేసి అర్పించారు.

తెభా-10.2-713-చ.
తమ పోయివచ్చిన విధంబుల భూపతులన్ జయించుటల్‌
క్రముగఁ జెప్ప నందుల జరాతనయుం డరివెట్టఁ డయ్యె నం
రవరేణ్యనందనుఁ డహంకృతి దక్కఁగ విన్నవించినన్
సుతుఁడూరకుండెవికలాత్మకుఁడై విని యంతఁ గృష్ణుఁడున్

టీక:- తమతమ = తాము ఒక్కొక్కరు; పోయి = వెళ్ళి; వచ్చిన = వచ్చినట్టి; విధంబులన్ = రీతులను; భూపతులన్ = రాజులను; జయించుటల్ = గెలుచుటలు; క్రమముగన్ = వరుసగా; చెప్పె = చెప్పెను; అందులన్ = వారిలో; జరాతనయుండు = జరాసంధుడు {జరా తనయుడు - బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు}; అరి = కప్పములు; పెట్టడు = కట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; అంచున్ = అనుచు; అమరవరేణ్యనందనుడు = అర్జునుడు; అంహంకృతి = గౌరవము; తక్కగన్ = తక్కువ కాగా; విన్నవించినన్ = తెలుపగా; యమసుతుడు = ధర్మరాజు; ఊరకుండెన్ = మౌనము ధరించెను; వికల = కలత చెందిన; ఆత్మకుడు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; విని = విని; అంతన్ = అంతట; కృష్ణుడున్ = కృష్ణుడు.
భావము:- తాము వెళ్ళివచ్చిన విధానములూ రణరంగంలో రాజులను జయించిన వివరాలూ అన్నగారికి వివరించారు. అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు చెప్పగా విని ధర్మరాజు వికలమైన మనస్సు కలవాడై మౌనం వహించాడు. అప్పుడు కృష్ణుడు.....

తెభా-10.2-714-తే.
ర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ
లికె "మాగధుఁ బోరఁ జంపఁగ నుపాయ
మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు
నాకుఁ జెప్పిన చందంబు యచరిత్ర!

టీక:- ధర్మనందనున్ = యమధర్మరాజును; చూచి = చూసి; ఉత్కలికన్ = ఉత్కంఠము; తోడన్ = తోటి; పలికెన్ = చెప్పెను; మాగధున్ = జరాసంధుని {మాగధుడు - మగధదేశస్థుడు, జరాసంధుడు}; పోరన్ = యుద్ధము నందు; చంపగన్ = సంహరించుటకు; ఉపాయము = కిటుకు; ఒకటి = ఒకా నొకటి; కలదు = ఉంది; అది = దానిని; చెప్పెదను = తెలుపుతాను; ఉద్ధవుండు = ఉద్ధవుడు; నా = నా; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; చందంబున్ = విధమును; నయచరిత = ధర్మరాజ {నయచరిత - నీతిగల నడవడిక కలవాడు, ధర్మరాజు}.
భావము:- ధర్మరాజుతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “ఓ ధర్మరాజా! జరాసంధుడిని చంపడానిక ఒక ఉపాయం ఉంది. నాకు ఉద్ధవుడు చెప్పిన ఆ ఉపాయం వివరిస్తాను విను.

తెభా-10.2-715-చ.
విను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళియందు భక్తియున్
వియముఁ గల్గి యెద్దియును వేఁడినచో వృథసేయ కిచ్చుఁగా
వు విజయుండునుం బవనపుత్రుఁడు నేనును బ్రాహ్మణాకృతిం
ని రణభిక్ష వేఁడిన వశంవదుఁడై యతఁ డిచ్చుఁ గోరికల్.

టీక:- విను = వినుము; మగధేశ్వరుండు = జరాసంధుడు; ఎపుడున్ = ఎప్పుడు; విప్ర = బ్రాహ్మణులైన; జన = వారి; ఆవళి = సమూహము, ఎల్లరి; అందున్ = అందు; భక్తియున్ = భక్తి; వినయమున్ = వినయము; కల్గి = ఉండి; ఎద్దియున్ = ఏదైనాసరే; వేడినచోన్ = అడిగిన ఎడల; వృథచేయక = వ్యర్థపుచ్చక; ఇచ్చున్ = ఇచ్చును; కావున = కాబట్టి; విజయుండును = అర్జునుడు; పవనపుత్రుడు = భీముడు; నేనునున్ = నేను; బ్రాహ్మణ = విప్రుల; ఆకృతిన్ = రూపములతో; చని = వెళ్ళి; రణ = యుద్ధమును (ద్వంద్వయుద్ధము); భిక్షన్ = భిక్షగా; వేడినన్ = కోరినచో; వశంవదుడు = అనుకూలుడు; ఐ = అయ్యి; అతడు = అతను; ఇచ్చున్ = ఇచ్చును; కోరికల్ = అడిగిన వాటిని (ద్వంద్వయుద్ధమును).
భావము:- మగధరాజైన జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే భక్తివిశ్వాసాలు అధికం. వారేది అడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. కనుక, నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాడిని యుద్ధభిక్ష కోరతాము. అతడు తప్పకుండా అంగీకరిస్తాడు.

తెభా-10.2-716-వ.
అట్టియెడ.
టీక:- అట్టి = ఆ; ఎడన్ = సమయము నందు.
భావము:- అలా జరాసంధుడు యుద్ధానికి అంగీకరించాక...

తెభా-10.2-717-తే.
విలి యప్పుడు మల్లయుద్ధమున వానిఁ
బిలుకుమార్పింప వచ్చును భీముచేత!"
నిన ధర్మజుఁ "డదిలెస్స"నిన విప్ర
వేషములు దాల్చి యరిగిరి విశదయశులు.

టీక:- తవిలి = పూని; అప్పుడు = అప్పుడు; మల్లయుద్ధమునన్ = కుస్తీపోరాటము నందు; వానిన్ = అతనిని; పిలుకుమార్పింపవచ్చును = చంపవచ్చును; భీమున్ = భీమసేనుని; చేతన్ = చేత; అనినన్ = అనగా; ధర్మజుడు = ధర్మరాజు; అది = అలాచేయుట; లెస్స = సరియైనది; అనినన్ = అనగా; విప్ర = బ్రాహ్మణుల; వేషములున్ = వేషములను; తాల్చి = ధరించి; అరిగిరి = వెళ్ళిరి; విశద = ప్రసిద్ధమైన; యశులు = కీర్తి కలవారు.
భావము:- మల్లయుద్ధంలో భీముడిచేత అతడిని చంపించవచ్చు” అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మరాజు “ఇది బాగుం” దని అంగీకరించాడు. అంతట మహా కీర్తిశాలురు అయిన కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి బయలుదేరారు.