పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జరాసంధుని వధింపఁ బోవుట

జరాసంధుని వధింపఁ బోవుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జరాసంధుని వధింపఁ బోవుట)
రచయిత: పోతన


తెభా-10.2-718-వ.
ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగా; కృష్ణ = కృష్ణుడు; భీమ = భీముడు; అర్జునులు = అర్జునులు; బ్రాహ్మణ = బ్రాహ్మణులవలె; వేషంబులున్ = వేషములను; తాల్చి = ధరించి; త్రేతాగ్నులున్ = త్రేతాగ్నులు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము (గృహస్థునికి సంబంధించినది) 2దక్షిణాగ్ని (పితృదేవతలకి ఉద్దేశించినది) 3ఆహవనీయము (యజ్ఞమున బలి ఇవ్వ యోగ్యమైనది) అను శ్రౌతాగ్నులు మూడు}; పోలెన్ = సరిపోలుతు; తమ = వారి యొక్క; శరీర = దేహ; తేజః = తేజస్సు యొక్క; విశేషంబులున్ = అతిశయములు; వెలుంగన్ = ప్రకాశించుచుండగా; అతి = మిక్కిలి; త్వరిత = వేగము గల; గతిన్ = గమనములతో; చని = వెళ్ళి; గిరివ్రజంబున్ = గిరివ్రజము అను పట్టణము నందు {గిరివ్రజము - జరాసంధుని పట్టణము}; చొచ్చి = ప్రవేశించి; అందున్ = దానిలో; అతిథి = అతిథులకు చేయు; పూజలు = మర్యాదలు; శ్రద్ధా = శ్రద్ధచేత, మిక్కిలి ఆసక్తిచేత; గరిష్ఠ = శ్రేష్ఠమైన; చిత్తుండు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; కావించుచున్న = చేస్తున్న; జరాసంధునిన్ = జరాసంధుడిని; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.
భావము:- అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ అతి శీఘ్రంగా గిరివ్రజానికి వెళ్ళారు. మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేస్తున్న జరాసంధుడితో ఇలా అన్నారు.

తెభా-10.2-719-క.
"ధణీశ! యతిథిపూజా
రుఁడవు నీ వనుచు దిశలఁ లుకఁగ విని మే
రుదెంచితిమి మదీప్సిత
సేయక యిమ్ము సువ్రతాచారనిధీ!

టీక:- ధరణీశ = రాజా; అతిథి = అతిథులకు చేయు; పూజా = పూజించుట యందు; పరుడవు = నిష్ఠ కలవాడు; నీవు = నీవు; అనుచున్ = అంటు; దిశలన్ = నలుదిక్కు లందు; పలుకగన్ = చెప్పుకొనుచుండగ; విని = విని; మేము = మేము; అరుదెంచితిమి = వచ్చాము; మత్ = మా యొక్క; ఈప్సితమున్ = కోరికను; అఱచేయక = అగౌరవపరచకుండ; ఇమ్ము = ఒసగుము; సు = మంచి; వ్రతా = వ్రతమును; ఆచార = నడపుట యందు; నిధీ = స్థానమైనవాడా.
భావము:- “ఓ మగధరాజా! జరాసంధా! ఓ సదాచార సంపన్నా! అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని, నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు.

తెభా-10.2-720-క.
తిథిజనంబుల భక్తిన్
తముఁ బూజించి యుచితత్కారము లు
న్నతి నడపు సజ్జనులు శా
శ్వకీర్తులు ధరణిఁబడయఁజాలుదు రనఘా!

టీక:- అతిథి = అతిథిగా వచ్చిన; జనంబులన్ = వారిని; భక్తిన్ = భక్తితో; సతతము = ఎల్లప్పుడు; పూజించి = పూజించి; ఉచిత = తగిన; సత్కారములు = మర్యాదలు; ఉన్నతిన్ = గౌరవముతో; నడపు = చేసెడి; సజ్జనులు = ఉత్తములు; శాశ్వత = ఎన్నడు చెడని; కీర్తులున్ = యశస్సును; ధరణిన్ = ప్రపంచము నందు; పడయజాలుదురు = పొందగలరు; అనఘా = పుణ్యుడా.
భావము:- ఓ పుణ్యాత్మా! అతిథి జనాన్ని ఎల్లప్పుడూ భక్తితో సేవించి, వారికి ఉచిత సత్కారాలు చేసే సత్పురుషులు లోకంలో శాశ్వతకీర్తిని పొందుతారు.

తెభా-10.2-721-క.
రికింపఁగ దేహం బ
స్థిమని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి
స్ఫుణం బ్రస్తుతి కెక్కని
పురుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా!

టీక:- పరికింపన్ = విచారించినచో; దేహంబు = శరీరము {దేహము - వ్యు. దహయింతి ఇతి దేహ, నశించేదె దేహము}; అస్థిరము = శాశ్వతముగా ఉండునది కాదు {శరీరము - శర (మార్పు) చెందునది శరీరము}; అని = అని; నిజ = తన; బుద్ధిన్ = బుద్ధి అందు; తలచి = ఎంచి; చిరతర = మిక్కిలి అధకమైన; కీర్తి = యశస్సు యొక్క; స్ఫురణన్ = ప్రకాశముచేత; ప్రస్తుతి = ప్రఖ్యాతి; కిన్ = కి; ఎక్కని = పొందనట్టి; పురుషుడు = మానవుడు; జీవన్మృతుండు = బతికియు చచ్చినవాడు; భూరి = ఉత్కృష్ఠమైన; వివేకా = తెలివి కలవాడా.
భావము:- ఓ మిక్కిలి తెలివైన వాడా! జరాసంధా! మానవుడు ఈ దేహం శాశ్వతం కాదని గ్రహించి, శాశ్వతమైన యశస్సును సంపాదించాలనే ఆసక్తి కలిగి మహాదాతగా ప్రసిద్ధి కెక్కవలెను. లేకపోతే, వాడు బ్రతికి ఉన్నా కూడా చచ్చినవాడితో సమానం.

తెభా-10.2-722-క.
ధారుణిలోన వదాన్యుల
కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే
కోరినఁ దన మే యెముకలు
ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే?

టీక:- ధారుణి = భూమి, ప్రపంచము; లోనన్ = అందు; వదాన్యుల = దాతల; కిన్ = కి; ఈరాని = ఇవ్వ తగని; పదార్థము = వస్తువు; ఒక్కటేనిన్ = ఒక్కటైనాసరే; కలదే = ఉన్నదా, లేదు; కోరినన్ = అడిగినచో; తన = తన యొక్క; మేను = దేహములోని; ఎముకలున్ = ఎముకలను; ధీరుండు = ధైర్యము కలవాడు; ఐ = అయ్యి; ఇచ్చెను = ఇచ్చెను; అని = అని; దధీచిని = దధీచిమహామునిని; వినమే = వినలేదా, విన్నాముకదా.
భావము:- చేసే బుద్ధి ఉండాలి కానీ, దాతలకు దానం చేయరాని వస్తువు ఏమి ఉంటుంది? దేవతలు వచ్చి, తన శరీరంలోని ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గూర్చి మనం వినలేదా?

తెభా-10.2-723-క.
డిగిన వృథసేయక తన
యొ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే
ర్ప నిచ్చి కీర్తిఁ గనె నని
పుమిన్ మును వినమె యల కపోతము ననఘా!

టీక:- అడిగినన్ = కోరినచో; వృథ = వ్యర్థము; చేయక = చేయకుండ; తన = తన యొక్క; ఒడలు = దేహమును; ఆకలిగొన్న = ఆకలి వేస్తున్నట్టి; ఎఱుకు = బోయవాని; కున్ = కి; ఓగిరముగన్ = అన్నముగా, ఆహారముగ; ఏర్పడన్ = అగునట్లుగా; ఇచ్చి = దానముచేసి; కీర్తిన్ = కీర్తిని; కనెను = పొందెను; అని = అని; పుడమిన్ = లోకము నందు; మును = పూర్వము, మునుపు; వినమె = వినమె, విన్నాము కదా; అల = ఆ ప్రసిద్ధమైన; కపోతమున్ = పావురమును; అనఘా = పుణ్యుడా, జరాసంధుడా.
భావము:- అడిగిన వెంటనే కాదనకుండా ఆకలిగొన్న బోయవాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించి కీర్తిని పొందిన పావురం కథ మనం వినలేదా?

తెభా-10.2-724-క.
యింద్రాగ్నులు శ్యేనక
వాస రూపములఁ దన్ను లఁతిగ వేఁడన్
ధీయుతుఁడై మును శిబి తన
కాము గోసిచ్చె నన జగంబుల వినమే!

టీక:- ఆ = ఆ; ఇంద్ర = ఇంద్రుడు; అగ్నులు = అగ్నిదేవుడు; శ్యేనక = డేగ; వాయస = కాకి; రూపములన్ = వేషములతో; తన్నున్ = తనను; వలతిగ = నేర్పుగా, తెలివిగా; వేడగన్ = కోరగా; ధీ = గొప్పబుద్ధి; యుతుండు = కలవాడు; ఐ = అయ్యి; మును = పూర్వము; శిబి = శిబిచక్రవర్తి; తన = తన యొక్క; కాయమున్ = దేహమును; కోసి = కత్తిరించి; ఇచ్చెన్ = ఇచ్చను; అనన్ = అనగా; జగంబులన్ = సర్వలోకములందు; వినమే = వినలేదా, విన్నాము కదా.
భావము:- ఆ ఇంద్రుడు డేగ రూపంలో, అగ్ని కాకి రూపంలో వచ్చి తనను కోరగా శిబిచక్రవర్తి గొప్ప బుద్ధితో తన దేహాన్నే కోసి ఇచ్చాడని మనం వినలేదా?

తెభా-10.2-725-ఆ.
ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర
లులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని
మున్ను సెప్ప వినమె? న్నుతచరితులు
న్న నైన నేఁడు నున్నవారు. "

టీక:- ధీర = స్వతంత్రమైన; మతులు = బుద్ధి కలవారు; రంతిదేవ = రంతిదేవుడు; హరిశ్చంద్ర = హరిశ్చంద్రుడు; బలులు = బలిచక్రవర్తులు; ఉంఛవృత్తిన్ = బిచ్చమెత్తు కొను జీవనము కల; బ్రాహ్మణునిని = విప్రుని (గురించి); మున్ను = మునుపు; చెప్ప = చెప్పగా; వినమె = వినలేదా, విన్నాము కదా; సన్నుత = కొనియాడదగిన; చరితులు = నడవడికలు కలవారు; సన్నన = చనిపోయివారు, తక్కువమంది; ఐనన్ = అయినప్పటికి; నేడున్ = ఇవాళకూడ; ఉన్నవారు = ఉన్నారు.
భావము:- మహా ధీరులు అయిన రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుడు సక్తుప్రస్థుడు మున్నగువారి గురించి చెప్పుకోవటం పూర్వం నుంచీ వింటున్నాం కదా. స్తుతిపాత్రమైన చరితార్థులు ఆ మహనీయులు ఎప్పుడో మరణించినా, ఈనాటికీ బ్రతికి ఉన్నవారే.”

తెభా-10.2-726-వ.
అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీర భాషణంబులును, గుణకిణాంకంబులును మహాప్రభావంబులునుం జూచి తన మనంబున “వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు” రని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబులేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుండయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స” యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; జరాసంధుండు = జరాసంధుడు; వారల = వారి యొక్క; రూపంబులునున్ = స్వరూపములు; మేఘ = మేఘమువలె; గంభీర = గంభీరమైన; భాషణంబులును = పలుకు మాటలు; గుణ = వింటినారు; కిణ = ఒరయుటచే కలుగు కాయల; అంకంబులును = గుర్తులు; మహా = గొప్ప; ప్రభావంబులును = మహిమలను; చూచి = చూసి; తన = తన యొక్క; మనంబునన్ = మనసు నందు; వీరలు = వీరు; బ్రాహ్మణ = విప్రులవలె; వేష = వేషములు; ధారులు = ధరించినవారు; ఐన = అయినట్టి; రాజ = రాజ; ఇంద్రలు = శ్రేష్ఠులు; కానోపుదురు = ఐ ఉంటారు; అని = అని; తలంచి = ఎంచి; ఈ = ఈ; మహాత్ములు = గొప్పవారు; కోరినన్ = అడిగినట్టి; పదార్థంబు = వస్తువే; కాదు = కాదు; ప్రాణంబులు = ప్రాణాలు; ఏనియున్ = అయినను; ఇత్తును = ఇచ్చెదను; అదియునున్ = అంతే; కాక = కాకుండ; తొల్లి = పూర్వకాలము నందు; బలీంద్రుండు = బలిచక్రవర్తి; విప్ర = బ్రాహ్మణుడు అను; వ్యాజంబునన్ = నెపముతో; అడిగినన్ = అడిగినట్టి; విష్ణుదేవున్ = విష్ణుమూర్తి; కున్ = కి; ఆత్మ = తన యొక్క; పద = పదవి; భ్రష్ఠత్వంబు = చెడిపోవుట; ఎఱింగియున్ = తెలిసినప్పటికి; విచారింపక = ఆలోచింపక, బాధపడకుండ; జగత్రయంబున్ = ముల్లోకములను; ఇచ్చి = ధారపోసి; కీర్తి = కీర్తికి; పరుండు = చెందినవాడు; అయ్యెన్ = అయ్యెను; క్షత్రబంధుండు = క్షత్రబంధుడు; అను = అనెడి; వాడు = వాడు; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; అర్థంబున్ = కొఱకు; నిజ = తన యొక్క; ప్రాణ = ప్రాణమును; పరిత్యాగంబున్ = విడుచుట; చేసి = చేసి; నిర్మలంబు = స్వచ్ఛమైనది; అగు = ఐన; యశంబున్ = కీర్తిని; పడసెన్ = పొందెను; అదికావునన్ = కాబట్టి; అనిత్యంబు = అశాశ్వతమైనట్టిది; ఐన = అగు; కాయంబున్ = దేహమును; విచారణీయంబు = విచారించతగినది, ఎంచతగినది; కాదు = కాదు; కీర్తి = యశస్సును; వడయుటన్ = పొందుట; లెస్స = మేలు; అని = అని; తలంచి = భావించి; ఉదారుండు = ఈవి యందు వెనుదీయనివాడు; ఐ = అయ్యి; కృష్ణ = కృష్ణుడు; అర్జున = అర్జునుడు; భీములన్ = భీములను; కని = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ మాదిరి పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలనూ, గంభీరమైన కంఠాలనూ, అల్లెత్రాటి వలన భుజాలమీద ఏర్పడ్డ గుర్తుల్ని గమనించి, “వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలుతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు, పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా, ఏమాత్రం లెక్కచెయ్యకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగంచేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కర లేదు. కీర్తిని పొందటమే ఉచితం” అని ఆలోచించుకొని, కృష్ణార్జునభీములతో ఇలా అన్నాడు.

తెభా-10.2-727-క.
"భూరిగుణులార! మీ మదిఁ
కోరిక యెఱిఁగింపుఁ డేమి కోరిననైనన్
ధీత నొసఁగుటయే కా
దాయ నా శిరము ద్రుంచి యైనను నిత్తున్. "

టీక:- భూరి = ఉత్కృష్టములైన; గుణులారా = సుగుణములు కలవారా; మీ = మీ; మదిన్ = మనస్సున కల; కోరిక = కోరికను; ఎఱిగింపుడు = తెలియజెప్పండి; ఏమి = ఏమి; కోరిననైనన్ = కోరినప్పటికి; ధీరతన్ = ధైర్యముతో; ఒసగుటయ = ఇచ్చుటయే; కాదు = కాదు; అరయన్ = విచారించగా; నా = నా యొక్క; శిరమున్ = తలను; త్రుంచి = కత్తిరించి; ఐనను = అయినప్పటికి; ఇత్తున్ = ఇచ్చెదను;
భావము:- “ఓ గుణవంతులారా! మీ మనస్సులోని కోరిక ఏమిటో చెప్పండి. మీరేది కోరినా ధైర్యంతో ఇచ్చేస్తాను. అంతేకాదు కోరితే చివరకు నా తల తఱిగి ఇమ్మన్నా ఇచ్చేస్తాను.”

తెభా-10.2-728-ఉ.
నావుడుఁ గృష్ణుఁ డమ్మగధనాథున కిట్లను "భూవరేణ్య! నీ
భాము సూనృతవ్రతశుస్థితిఁ జెందు టెఱుంగవచ్చె; మా
కీలె నాజిభిక్ష; యితఁ డింద్రతనూభవుఁ; డే నుపేంద్రుఁడం;
బాని యీతఁ; డిం దొకనిఁ బైకొని యెక్కటి పోరఁగాఁ దగున్."

టీక:- నావుడు = అనగా; కృష్ణుడు = కృష్ణుడు; ఆ = ఆ; మగధనాథు = జరాసంధుని; కు = కు; ఇట్లు = ఈ విధముగా; అనియె = చెప్పెను; నీ = నీ యొక్క; భావమున్ = మనస్సు; సూనృత = నిజమే పలుకు; వ్రత = వ్రతముచేత; శుభస్థితిన్ = మేలిమిస్థితి; ఎఱుంగవచ్చెన్ = తెలియవచ్చినది; మా = మా; కున్ = కు; ఈవలెన్ = ఇవ్వవలెను; ఆజి = యుద్ధము అను; భిక్షన్ = భిక్షను; ఇతడు = ఇతను; ఇంద్రతనూభవుడు = అర్జునుడు {ఇంద్ర తనూభవుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు}; ఏను = నేను; ఉపేంద్రుండన్ = కృష్ణుడను {ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు, విష్ణువు}; పావని = భీముడు {పావని - వాయువు కొడుకు, భీముడు}; ఈతడు = ఇతడు; ఇందు = వీరిలో; ఒకని = ఒకడిని; పైకొని = ఎదిరించి; ఎక్కటిన్ = ఒంటిగా; పోరగాన్ = యుద్ధము చేయుట; తగున్ = తగును.
భావము:- అలా అన్న జరాసంధుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “మహారాజా! నీ సత్యవ్రత నిష్ఠ మాకు అవగతమైంది. మేము రణభిక్ష కోరుతున్నాం. ఇతడు వాయు పుత్రుడు భీమసేనుడు; ఇతడు ఇంద్రపుత్రుడు అర్జునుడు; నేను కృష్ణుడిని; మాలో ఎవరో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి.”

తెభా-10.2-729-చ.
విని వాఁడు నవ్వి "యహహా! విన వింతలుపుట్టె మున్ను న
న్ననిమొన నోర్వఁజాలక భయంబునఁ బాఱితి పెక్కుమార్లు; వం
మథురాపురిన్ విడిచి సాగరమధ్యమునందు డాఁగవే?
రుహనాభ! నీ బిరుదు వాఁడితనంబును నాకు వింతయే?

టీక:- అనన్ = అనగా; విని = విని; వాడు = అతడు; నవ్వి = పరిహాసముగా నవ్వి; అహహా = ఔరా; వినన్ = వినుటకే; వింతలు = ఆశ్చర్యకర విషయములు; పుట్టె = కలిగాయి; మున్ను = మునుపు; నన్నున్ = నన్ను; అని = యుద్ధ; మొనన్ = ముఖముగా; ఓర్వజాలక = ఓడించలేక; భయంబునన్ = భయముతో; పాఱితి = పారిపోయితివి; పెక్కు = అనేక; మార్లు = సార్లు; వంచనన్ = మోసముతో; మథురాపురిన్ = మథురాపట్టమమును; విడిచి = వదలిపెట్టి; సాగర = సముద్రము; మధ్యమున్ = నడుమ ప్రదేశము; అందున్ = లో; డాగవే = దాగికొనలేదా; వనరుహనాభ = కృష్ణా; నీ = నీ యొక్క; బిరుదు = శూరత్వము; వాడితనంబునున్ = పరాక్రమములను; నా = నా; కున్ = కు; వింతయే = కొత్త విషయమా.
భావము:- శ్రీకృష్ణుడి మాటలు విని, జరాసంధుడు నవ్వి “అహో ఎంత ఆశ్చర్యం. నన్ను యుద్ధరంగంలో తట్టుకోలేక భయంతో చాలా పర్యాయాలు పారిపోయావు. మథురను వదలిపెట్టి సముద్రం మధ్యలో దాక్కున్నావు కదా. నీ పరాక్రమం నీ మగతనం ఏపాటివో నాకు తెలియనిది కాదులే కృష్ణా!

తెభా-10.2-730-క.
న్నేల సెప్ప? మాయలఁ
న్నినఁ బో విడువ గోపబాలక! బల సం
న్నుని మాగధభూవరు
న్నెఱుఁగవె తొల్లి నందనందన! పోరన్?

టీక:- ఇన్ని = ఇన్ని మాటలు; ఏలన్ = ఎందుకు; చెప్పన్ = చెప్పుట; మాయలన్ = మాయ వేషాలను; పన్నినన్ = వేసినను; పోన్ = పారిపోవుటకు; విడువన్ = వదలిపెట్టను; గోపబాలక = కృష్ణా; బల = బలము; సంపన్నుని = కలిమి కలవానిని; మాగధ = మగధదేశపు; భూవరున్ = రాజును; నన్నున్ = నన్ను; ఎఱుగవె = ఎరుగవా, ఎరుగుదువుకదా; తొల్లి = మునుపు; నందనందన = కృష్ణా; పోరన్ = యుద్ధము చేయుట యందు.
భావము:- ఇన్ని మాటలు దేనికి కానీ? ఓ యాదవ బాలుడా! ఎన్ని మాయలు పన్నినా నిన్ను వదలను. యుద్ధరంగంలో జరాసంధుడంటే ఏమిటో నీకు బాగా తెలుసు కదా.

తెభా-10.2-731-ఉ.
కా రణోర్వి నన్నెదురఁ ష్టము గాన తలంగు; గోత్రభి
త్సూనుఁడుభూరిబాహుబలదుర్దముఁడయ్యునుఁ బిన్న; యీమరు
త్సూనుఁడు మామకప్రకటదోర్బలశక్తికిఁ జూడఁ దుల్యుఁడౌ;
వీనినెదుర్తు"నంచుఁ జెయివీచె జరాసుతుఁ డుగ్రమూర్తియై.

టీక:- కాన = కాబట్టి; రణ = యుద్ధ; ఉర్విన్ = భూమిని; నన్నున్ = నన్ను; ఎదురన్ = ఎదిరించుటకు; కష్టము = చాలా కష్టము; కానన్ = కనుక; తలంగు = తొలగుము; గోత్రభిత్సూనుడు = అర్జునుడు {గోత్రభి త్సూనుడు - పర్వతముల రెక్కలను భేదించువాని (ఇంద్రుని) సూనుడు (కొడుకు), అర్జునుడు}; భూరి = ఉత్కృష్టమైన; బాహుబల = భుజబలముచేత; దుర్దముడు = అణచరానివాడు; అయ్యున్ = అయినప్పటికి; పిన్న = చిన్నవాడు; ఈ = ఈ; మరుత్సూనుడు = భీముడు {మరు త్సూనుడు - మరుత్ (వాయుదేవుని) సూనుడు (పుత్రుడు), భీముడు}; మామక = నా యొక్క; ప్రకట = ప్రసిద్ధమైన; దోర్బల = భుజబలముయొక్క; శక్తి = సామర్థ్యమున్; కిన్ = కు; చూడన్ = విచారించినచో; తుల్యుడు = సాటివచ్చువాడు; ఔ = అవుతాడు; వీనిన్ = ఇతనిని; ఎదుర్తున్ = ఎదిరించెదను; అంచున్ = అనుచు; చెయి = చేతిని; వీచెన్ = ఊపెను; జరాసుతుడు = జరాసంధుడు; ఉగ్ర = భయంకరమైన; మూర్తి = ఆకృతి కలవాడు; ఐ = అయ్యి.
భావము:- ఓ కృష్ణా! రణంలో నన్ను ఎదిరించటం నీకు చాలా కష్టం కనుక నీవు తప్పుకో. అర్జునుడు బలశాలే కానీ చిన్నవాడు. ఈ భీముడు చూడటానికి నా బాహుబలానికి సమ ఉజ్జీలా ఉన్నాడు. కనుక వీడిని ఎదుర్కొంటాను” అని భయంకరాకారుడైన జరాసంధుడు భీముడితో యుద్ధానికి చేయి ఊపాడు.

తెభా-10.2-732-క.
రువలిసుతునకు నొక భీ
గద నిప్పించి యొక్కదఁ దనకేలన్
రియించి నలువురును గ్ర
చ్చఱఁ బురి వెలి కేగి యచట మతలభూమిన్.

టీక:- కరువలిసుతున్ = భీముని {కరువలి సుతుడు - కరువలి (వాయువు) సుతుడు, భీముడు}; కున్ = కి; ఒక = ఒకానొక; భీకర = భయంకరమైన; గదన్ = గదాయుధమును; ఇప్పించి = ఇప్పించి; ఒక్క = ఒకానొక; గదన్ = గదను; తన = తన యొక్క; కేలన్ = చేతిలో; ధరియించి = పట్టుకొని; నలువురును = నలుగురు (కృష్ణార్జున భీమ జరాసంధులు); క్రచ్ఛఱన్ = శీఘ్రముగా; పురి = పట్టణము; వెలి = బయట; కున్ = కు; ఏగి = వెళ్ళి; అచటన్ = అక్కడ; సమతల = మిట్టపల్లాలులేని సమమైన; భూమిన్ = ప్రదేశము నందు.
భావము:- వాయునందను డైన భీముడికి జరాసంధుడు ఒక భయంకరమైన గదను ఇప్పించాడు. తాను ఒక గదను చేబట్టాడు. పిమ్మట నలుగురూ పట్టణానికి బయట ఒక సమతల ప్రదేశానికి వెళ్ళి....