పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/జరాసంధ వధ
జరాసంధ వధ
←జరాసంధుని వధింపఁ బోవుట | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/జరాసంధ వధ) రచయిత: పోతన |
రాజబంధ మోక్షంబు→ |
తెభా-10.2-733-సీ.
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు-
మృగపతిద్వితయంబు వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు-
దలపడు వీఁక నుద్దండలీలఁ
గదిసి యన్యోన్యభీకరగదాహతులను-
గ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ-
ణములను సింహచంక్రమణములను
తెభా-10.2-733.1-తే.
గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
ఘనగదాఘట్టనధ్వని గగనమగల.
టీక:- పర్వత = కొండల; ద్వంద్వంబున్ = జంట; పాథోధి = సముద్రముల; యుగళంబు = జంట; మృగపతి = సింహములు; ద్వితయంబున్ = రెండు; వృషభ = ఆబోతులు; యుగమున్ = జత; పావక = అగ్నులు; ద్వయమున్ = రెండు; దంతావళ = ఏనుగుల; యుగళంబున్ = రెండు; తలపడు = పోరాడు; వీకను = రీతిని; ఉద్దండ = అతిశయముకల; లీలన్ = విధముగా; కదిసి = చేరి; అన్యోన్య = ఒకరినొకరు; భీకర = భయంకరమైన; గదా = గదల; ఆహతులను = కొట్టుటలుచేత; ఉగ్రంబుగన్ = భయంకరముగ; విస్ఫులింగములు = అగ్నిరవ్వలు; చెదరన్ = రాలగా; కెరలుచున్ = చెలరేగుచు; సవ్య = కుడినుండి ఎడమకు; దక్షిణ = ఎడమనుండి కుడికి; మండల = గుండ్రముగా; భ్రమణములను = తిరుగుటలు; సింహచంక్రమణములను = సింహమువలె దూకుటలు చేత; కదిసి = దగ్గరకువచ్చి; పాయుచున్ = తొలగిపోతూ; పాసి = తొలగి; డగ్గఱచున్ = దగ్గరకువస్తూ; మింటి = ఆకాశమున; కిన్ = కు; ఎగసి = ఎగిరి; క్రుంగుచున్ = వంగిపోతూ; క్రుంగి = వంగిపోయి; వేన్ = వేగముగా; ఎగసి = పైకి ఎగిరి; భూమిన్ = నేల; పగులన్ = బద్దలయ్యేలా; ఆర్చి = బొబ్బపెట్టి; ఛటత్ = ఛట; ఛటత్ = ఛట అను; ఉద్భట = అధికమైన; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; ఘన = పెద్ద; గదా = గదతోటి; ఘట్టన = కొట్టిన; ధ్వనిన్ = శబ్దము వలన; గగనము = ఆకాశము; అగలన్ = భేదిలగా.
భావము:- రెండు పర్వతాలూ, రెండు సముద్రాలూ, రెండు సింహాలూ, రెండు వృషభాలూ, రెండు అగ్నులూ, రెండు మత్తేభాలూ తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా, భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు.
తెభా-10.2-734-వ.
పోరునంత.
టీక:- పోరునంతన్ = పొరుచుండగా.
భావము:- అలా భీమ జరాసంధుల భీకర పోరు సాగుతుండగా...
తెభా-10.2-735-మ.
గద సారించి జరాతనూభవుఁడు హుంకారప్రఘోషంబులం
జద లల్లాడఁగఁ బాదఘట్టనములన్ సర్వంసహాభాగముం
గదలన్ వాయుజు వ్రేసె; వ్రేయ నతఁ డుగ్రక్రోధదీప్తాస్యుఁడై
యది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్ వాఁడు వోఁ దట్టుచున్.
టీక:- గద = గదను; సారించి = సాచిపెట్టి; జరాతనూభవుడు = జరాసంధుడు; హుంకార = హుం అను శబ్దము యొక్క; ప్రఘోషంబులన్ = గట్టి మోతతో; చదలు = ఆకాశము; అల్లాడన్ = చలించగా; పాద = కాలి; ఘట్టనంబులన్ = తాకిళ్ళుచేత; సర్వంసహా = భూమి; భాగమున్ = ప్రదేశములు; కదలన్ = కదిలిపోగా; వాయుజున్ = భీముని; వ్రేసెన్ = కొట్టెను; వ్రేయన్ = కొట్టగా; అతడున్ = అతను; ఉగ్ర = భయంకరమైన; క్రోధ = కోపము చేత; దీప్త = మెరుస్తున్న; ఆస్యుడు = మోము కలవాడు; ఐ = అయ్యి; అది = దానిని; తప్పించి = తొలగనేసి; విరోధి = శత్రువు; మస్తకమున్ = తలను; వ్రేయన్ = కొట్టగా; వాడు = అతడు; పోదట్టుచున్ = దానిని తప్పించుకొనుచు.
భావము:- హుంకార శబ్దంతో ఆకాశం అల్లల్లాడేలా పాదఘట్టనతో భూమండలం దద్దరిల్లేలా విజృంభించి జరాసంధుడు గదతో సాచిపెట్టి భీముడిని కొట్టాడు. దానితో భీముడు ఆగ్రహోదగ్ర మైన ముఖం భీకరమై వెలిగిపోతుండగా ఆ దెబ్బను తప్పించుకుని, తిరిగి జరాసంధుని తలమీద మోదాడు. అతడు దానిని తప్పించుకున్నాడు.
తెభా-10.2-736-చ.
మడవక భీమసేనుఁడును మాగధరాజు గడంగి బెబ్బులుల్
విడివడు లీల నొండొరుల వీఁపులు మూఁపులునుం బ్రకోష్ఠముల్
నడితల లూరు జాను జఘనప్రకరంబులు బిట్టు వ్రయ్యఁగాఁ
బిడుగులఁబోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచుఁ బాయుచున్ వెసన్.
టీక:- మడవకన్ = వెనుదీయక; భీమసేనుడును = భీముడు; మాగధరాజున్ = జరాసంధుడు; కడంగి = పట్టుదలతో; బెబ్బులుల్ = పెద్దపులుల; విడివడు = యథేచ్ఛముగా మెలగు; లీలన్ = విధముగా; ఒండురులన్ = ఒకరి నొకరు; వీపులు = వీపులు; మూపులునున్ = భుజములు; ప్రకోష్ఠముల్ = ముంజేతులు; నడితలలు = నడినెత్తి, మాడులు; ఊరు = తొడలు; జాను = మోకాళ్ళు; జఘన = పిక్కలు; ప్రకరంబులున్ = సమూహమును; బిట్టు = గట్టిగా; వ్రయ్యగాన్ = బద్దలయ్యేలా; పిడుగుల = పిడుగులు; పోలు = వంటి; పెన్ = పెద్ద; గదలన్ = గదలతో; బెట్టుగ = గట్టిగా; వ్రేయుచున్ = కొట్టుచు; పాయుచున్ = తప్పించుకుంటు; వెసన్ = శీఘ్రముగా.
భావము:- భీమజరాసంధులు ఏమాత్రం వెనుదీయకుండా విజృంభించి పెద్దపులుల్లాగా ఒకరినొకరు వీపులూ మూపులూ ముంజేతులూ శిరస్సులూ తొడలూ మోకాళ్ళూ నడుములూ బ్రద్దలయ్యేటట్లు గట్టిగా పెద్ద పెద్ద గదాఘట్టనలతో కొట్టుకోసాగారు. అలా పరస్పరం మోదుకుంటూ, తప్పించుకుంటూ...
తెభా-10.2-737-లవి.
బెడ గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ, బెను;
పిడుగు లవనిం దొరఁగ, నుడుగణము రాలన్,
మిడుఁగుఱులు చెద్ర, నభ మడల, హరిదంతములు;
వడఁక, జడధుల్ గలఁగఁ, బుడమి చలియింపన్,
వెడచఱువ మొత్తియునుఁ, దడఁబడఁగ నొత్తియును;
నెడమగుడు లాఁచి తిరుగుడు పడఁగ వ్రేయన్,
వడవడ వడంకుచును, సుడివడక డాసి, చల;
ముడుగ కపు డొండొరుల వడిచెడక పోరన్.
టీక:- బెడగు = అధికముగా; అడరు = విజృంభించు; పెన్ = పెద్ద; గదలు = గదలు; పొడిపొడిగన్ = పిండిపిండి అయ్యెలా; తాకన్ = కొట్టుకోగా; పెను = పెద్ద; పిడుగులు = పిడుగులు; అవనిన్ = భూమిపై; తొరగన్ = పడగా; ఉడు = నక్షత్రముల; గణము = సమూహము; రాలన్ = రాలగా; మిడుగుఱులు = నిప్పురవ్వలు; చెద్ర = చెదరగా; నభము = ఆకాశము; అడలన్ = బెదరగా; హరిత్ = దిక్కుల; అంతముల్ = కొనలు; వడకన్ = వణకిపోగా; జడధుల్ = సముద్రములు; కలగన్ = సంక్షోభించగా; పుడమి = భూమి; చలియింపన్ = కంపించగ; వెడ = అపూర్వముగా; చఱువన్ = చరచగా; మొత్తియునున్ = కొట్టి; తడపడగన్ = తత్తఱపడునట్లు; ఒత్తియునున్ = తోసి; ఎడమ = ఎడమపక్క; కుడులు = కుడిపక్కలు; ఆచి = కదిసి; తిరుగుడుపడగన్ = వళ్ళుతిరిగిపోగా; వ్రేయన్ = కొట్టగా; వడవడ = వడవడ మని; వడంకుచును = వణకిపోతూకూడ; సుడిపడకన్ = చీకాకు చెందకుండ; డాసి = సమీపించి; చలము = పట్టుదల, మాత్యర్యము; ఉడుగక = విడువకుండ; అపుడు = అప్పుడు; ఒండొరులన్ = ఒకరి నొకరి; వడిన్ = తీవ్రతకు; చెడక = ఓడిపోకుండ; పోరన్ = ద్వంద్వ యుద్ధము చేయగా.
భావము:- పెనుగదలు బద్దలై పొడిపొడిగా రాలేలాగ, పిడుగులు పడేలా, చుక్కలు రాలేలా, నిప్పురవ్వలు వ్యాపించేలా, దిక్కులు వణికేలాగ, సముద్రాలు అల్లకల్లోల మయ్యేలాగ, భూమి చలించేలా; కొట్టుకుంటూ, నెట్టుకుంటూ; ఒకరికొకరు తీసిపోకుండా; పిడుగుపాటు దెబ్బలకు అదిరిపోతున్నా, తడబాటు అన్నది లేకుండా తట్టుకుంటూ ఆ భీమజరాసంధులు యుద్ధం చేశారు.
తెభా-10.2-738-వ.
ఇవ్విధంబునం బోరుచుండ నొండొరుల గదా దండంబులు దుమురులైనం బెండువడక సమద దిగ్వేదండశుండాదండమండిత ప్రచండంబు లగు బాహుదండంబు లప్పగించి ముష్టియుద్ధంబునకు డగ్గఱి.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = రీతిగా; పోరుచుండన్ = యుద్ధము చేయుచుండగ; ఒండొరులన్ = పరస్పర; గదాదండంబులున్ = గదాయుధములు; తుమురులు = ముక్కలు ముక్కలు; ఐనన్ = అయినప్పటికి; బెండుపడక = నీరసించి పోకుండ; సమద = మదించిన; దిక్ వేదండ = దిగ్గజముల; శుండా = తొండములను; దండ = బడితెకఱ్ఱలచేత; మండిత = అలంకరింపడిన; ప్రచండంబులు = మిక్కిలి భీకరమైనవి; అగు = ఐన; బాహు = చేతులు అను; దండంబులు = దండములను; అప్పగించి = చరచి; ముష్టి = పిడికిపోట్ల; యుద్ధంబున్ = పోరున; కున్ = కు; డగ్గఱి = కలియబడి.
భావము:- అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాదండాలు ఖండఖండాలు అయిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండాలవంటి ప్రచండ బాహుదండములు సాచి ముష్టియుద్ధానికి తలపడి.....
తెభా-10.2-739-లగ్రా.
కాల వెస దాచియును, గీ లెడలఁ ద్రోచియునుఁ,
దాలుములు దూలఁ బెడకేల వడి వ్రేయన్,
ఫాలములు గక్షములుఁ దాలువులు వక్షములు;
వ్రీల, నెముకల్ మెదడు నేలఁ దుమురై వే
రాల, విపులక్షతవిలోలమగు నెత్తురులు;
జాలుగొని యోలిఁ బెనుఁ గాలువలుగం, బే
తాలమదభూతములు ఖేలనలఁ జేతులనుఁ;
దాళములు తట్టుచు సలీలగతి నాడన్.
టీక:- కాలన్ = కాలితో; వెసన్ = వడిగా; తాచియునున్ = తన్నియును; కీలు = కీళ్ళు; ఎడలన్ = వదులై పోవునట్లు; త్రోచియును = తోసియును; తాలుములున్ = దవుడలు; తూలన్ = కదలి పోవునట్లు; పెడకేలన్ = మండతో, అరచేతి పెడ (వెనుక) భాగంతో; వడిన్ = వడిగా, గట్టిగా; వ్రేయన్ = కొట్టగా; ఫాలములు = నొసళ్ళు; కక్షములున్ = చంకలు; తాలువులున్ = దౌడలు; వక్షములున్ = రొమ్ములు; వ్రీలన్ = చీలగా; ఎముకల్ = ఎముకలు; మెదడు = తలలోని కొవ్వు; నేలన్ = నేలమీద; తుమురు = పొడిపొడి; ఐ = అయ్యి; వే = వడిగా; రాలన్ = రాలగా; విపుల = పెద్ద; క్షత = గాయముల నుండి; విలోలము = స్రవించునది; అగు = ఐన; నెత్తురులు = రక్తాలు; జాలుగొని = వెల్లువలై; ఓలిన్ = క్రమముగా; పెను = పెద్ద; కాలువలు = కాలువలు; కన్ = కాగా; బేతాల = బేతాళములు ఆది; మద = మదించిన; భూతములు = పిశాచములు; ఖేలనలన్ = వేడుకలతో; చేతులున్ = చేతులుతో; తాళములు = తాళములు; తట్టుచున్ = వేయుచు; సలీల = విలాసములతో కూడిన; గతిన్ = విధముగా; ఆడన్ = నాట్యము లాడగా.
భావము:- కాళ్లతో కుమ్ముకుంటూ కీళ్ళు విరగకొట్టుకుంటూ, నొసళ్ళూ, ప్రక్కలూ, చెక్కిళ్ళూ, రొమ్ములు పగిలేలా, ఎముకలు విరిగేలా, గాయాలనుండి నెత్తురు కాలువలు కట్టి ప్రవహించేలా, భూత, బేతాళాలు కేరింతలు కొడుతూ ఉండగా భీమజరాసంధులు ఇరువురూ యుద్ధం చేయసాగారు.
తెభా-10.2-740-ఉ.
ప్రక్కలుఁ జెక్కులున్ మెడలుఁ బాణితలంబులచేఁ బగుల్చుచున్
ముక్కులు నక్కులుంజెవులు ముష్టిహతిన్ నలియంగ గ్రుద్దుచున్
డొక్కలుఁ బిక్కలున్ ఘనకఠోరపదాహతి నొంచుచున్ నెఱుల్
దక్కక స్రుక్క కొండొరులఁ దార్కొని పేర్కొని పోరి రుగ్రతన్.
టీక:- ప్రక్కలున్ = పక్కలు; చెక్కులున్ = చెక్కిళ్ళు; మెడలున్ = మెడలు; పాణితలంబుల = అరచేతులు; చేన్ = తోటి; పగుల్చుచున్ = పగలగొట్టుచు; ముక్కులు = ముక్కులు, నాసికలు; అక్కులు = వక్షస్థలములు; చెవులు = చెవులు, శ్రవణేంద్రియములు; ముష్టిహతిన్ = పిడికిటిపోట్లతో; నలియంగన్ = నలగిపోవునట్లు; గ్రుద్దుచున్ = గుద్దుతు; డొక్కలున్ = కడుపు పక్క భాగములు; పిక్కలు = మోకాలి పిక్కలు; ఘన = గొప్ప; కఠోర = గట్టి; పదాహతిన్ = కాలి తన్నులచేత; నొంచుచున్ = బాధించుచు; నెఱుల్ = క్రమములు; తక్కక = తప్పకుండ; స్రుక్కక = అలసిపోకుండ; ఒండొరులన్ = ఒకరి నొకరు; తార్కొని = కదిసి; పేర్కొని = పేర్లుపెట్టి పిలుచుకొంటు, మెచ్చుకుంటూ; పోరిరి = యుద్ధము చేసారు; ఉగ్రతన్ = భీకరత్వముతో.
భావము:- ఆ ముష్టియుద్ధంలో భీమజరాసంధులు ప్రక్కలూ, చెక్కులూ, మెడలూ పగిలేలా చేతులతో బాదుకుంటూ, ముక్కులు పగిలేలా గ్రుద్దుకుంటూ, డొక్కల్లో పిక్కల్లో పొడుచుకుంటూ అతి భయంకరంగా పోరాడారు.
తెభా-10.2-741-ఉ.
హుమ్మని మ్రోఁగుచుం, బెలుచ హుంకృతు లిచ్చుచుఁ, బాసి డాసి కో
కొమ్మనుచున్నొడళ్ళగల గుల్లల తిత్తులుగాఁ బదంబులం
గ్రుమ్ముచు, ముష్ఠి ఘట్టనల స్రుక్కుచు, నూర్పులు సందఁడింపఁగా
సొమ్మలు వోవుచుం, దెలియుచున్, మదిఁ జేవయు లావుఁ జూపుచున్
టీక:- హుమ్ = హం; అని = అని; మ్రోగుచున్ = అరుస్తు; పెలుచన్ = గట్టిగా; హుంకృతులు = హుంకారములు; ఇచ్చుచున్ = చేస్తు; పాసి = దూరముగా తొలగి; డాసి = దగ్గరకు వచ్చి; కోకొమ్ము = ఇదిగో తీసుకో; అనుచున్ = అంటు; ఒడళ్ళు = దేహములు; అగలన్ = చిట్లి; గుల్లలతిత్తులు = గుల్లలతిత్తులువలె; కాన్ = అగునట్లు; పదంబులన్ = కాళ్ళతో; కుమ్ముచున్ = అణగమోదుచు; ముష్టి = పిడికిటి; ఘట్టనలన్ = పోటులతో; స్రుక్కుచున్ = అలసట నొందుతు; ఊర్పులు = నిట్టూర్పులు; సందడింపగా = అతిశయించగా; సొమ్మలుపోవుచున్ = మూర్చిల్లుతు; తెలియుచున్ = తేరుకొనుచు; మదిన్ = మనసులో గల; చేవ = శూరత్వము; లావున్ = బలమును; చూపుచున్ = కనబరచుచు.
భావము:- భీమజరాసంధులు ఇద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరి నొకరు తాకుతూ, తిరిగి దూరమవుతూ, శరీరాలు పగిలి గుల్లలయ్యేలా కాళ్ళతో కుమ్ముకుంటూ, పిడికిటి పోట్లతో నొప్పించుకుంటూ, సోలుతూ, వాలుతూ, రొప్పుతూ రోజుతూ, తేరుకుంటూ, బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడ సాగారు.
తెభా-10.2-742-వ.
ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు నితరేతర ముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్తశరీరంబులతోడం బుష్పితాశోకంబుల వీఁకను, జేగుఱుఁ గొండల చందంబునను జూపట్టి పోరుచుండఁ, గృష్ణుండు జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెఱుంగుటం జేసి, వాయుతనూభవున కలయికలేక లావును జేవయుఁ గలుగునట్లుగాఁ దద్గాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి, యరినిరసనోపాయం బూహించి సమీరనందనుండు సూచుచుండ నొక్క శాఖాగ్రంబు రెండుగాఁ జీరివైచి వాని నట్ల చీరి చంపు మని సంజ్ఞగాఁ జూపిన, నతండు నా కీలుదెలిసి, యవక్రపరాక్రముండై మాగధుం బడఁద్రోచి, వాని పదంబు పదంబునం ద్రొక్కి, బాహుయుగళంబున రెండవ పదంబుఁ గదలకుండంబట్టి, మస్తకపర్యంతంబుఁ బెళబెళమని చప్పుళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరు చందంబునఁ బాద జాను జంఘోరు కటి మధ్యోదరాంస కర్ణ నయనంబులు వేఱువేఱు భాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినఁ, బౌరజనంబులు గనుంగొని భయాకులులై హాహాకారంబులు సేసి;రంత.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = రీతిని; వజ్రి = ఇంద్రుని; వజ్ర = వజ్రాయుధము; సన్నిభంబు = పోలినవి; అగు = ఐన; ఇతరేతర = ఒకరి నొకరు; ముష్టి = పిడికిటి; ఘట్టనంబులన్ = పోట్లతో; భిన్న = విరిగిన; అంగులు = దేహములు కలవారు; ఐ = అయ్యి; రక్త = నెత్తుటితో; సిక్త = తడసిన; శరీరంబుల్ = దేహముల; తోడన్ = తోటి; పుష్పిత = పూలు పూచిన; అశోకంబుల = అశోకచెట్ల; వీకను = వలె; జేగుఱు = ఎఱ్ఱని; కొండల = కొండల; చందంబునన్ = వలె; చూపట్టి = కనబడి; పోరుచుండన్ = కొట్టుకొనుచుండగా; కృష్ణుండు = కృష్ణుడు; జరాసంధుని = జరాసంధుని యొక్క; జన్మ = పుట్టుక; మరణ = చావుల; ప్రకారంబులన్ = విధానములు; ఆత్మన్ = మనసులో; ఎఱుంగుటన్ = తెలిసి ఉండుట; చేసి = వలన; వాయుతనూభవున్ = భీముని; కున్ = కి; అలయిక = అలసట నొందుట; లేక = లేకుండా; లావును = బలమును; చేవయున్ = ధైర్యము; కలుగునట్లుగా = కూడునట్లుగా; తత్ = అతని; గాత్రంబున్ = దేహము; అందున్ = లో; తన = తన యొక్క; దివ్య = అప్రాకృతమైన, మానవాతీతమైన; తేజంబున్ = తేజస్సును; నిలిపి = ఉంచి; అరి = శత్రువును; నిరసన్ = అణచివేయు; ఉపాయంబున్ = కిటుకును; ఊహించి = ఆలోచించి; సమీరనందనుండు = భీముడు {సమీర నందనుడు - సమీర (వాయు) నందనుడు, భీముడు}; చూచుచున్ = చూస్తూ; ఉండన్ = ఉండగా; ఒక్క = ఒకొనొక; శాఖాగ్రమున్ = కొమ్మకొసను, సన్నటికొమ్మను; రెండుగా = రెండు భాగములుగా; చీరి = చీల్చి; వైచి = వేసి; వానిన్ = వాడిని కూడ; అట్ల = అలానే; చీరి = చీల్చి; చంపుము = చంపుము; అని = అని; సంజ్ఞగా = సైగగా; చూపినన్ = చూపించగా; అతండున్ = అతను; ఆ = ఆ; కీలు = మర్మము; తెలిసి = తెలిసికొని; అవక్ర = వెలలేని; పరాక్రముండు = పరాక్రమము కలవాడు; ఐ = అయ్యి; మాగధున్ = జరాసంధుని; పడన్ = పడిపొవునట్లు; త్రోచి = తోసి; వాని = అతడి; పదంబున్ = కాలిని; పదంబునన్ = కాలితో; త్రొక్కి = తొక్కిపట్టి; బాహు = చేతులు; యుగళంబునన్ = రెంటితోను; రెండవ = రెండో (2); పదంబున్ = కాలిని; కదలకుండన్ = కదలకుండ; పట్టి = పట్టుకొని; మస్తక = తల; పర్యంతంబున్ = వరకు; పెళపెళమని = పెళపెళ అను; చప్పుళ్ళు = శబ్దములు; ఉప్పతిల్లన్ = పుట్టగా; మత్త = మదించిన; దంతావళంబు = ఏనుగు; తాళవృక్షంబున్ = తాడిచెట్టును; చీరు = చీల్చు; చందంబునన్ = విధముగా; పాద = పాదములు; జాను = మోకాళ్ళు; జంఘ = కాలిపిక్కలు; ఊరు = తొడలు; కటి = పిరుదులు; మధ్య = నడుము; ఉదర = కడుపు; అంస = భుజములు; కర్ణ = చెవులు; నయనంబులున్ = కళ్ళు; వేఱువేఱు = విడివిడి; భాగంబులు = భాగములు; కాన్ = అగునట్లు; వ్రయ్యలు = చీలికలు; వాపి = చేసి; ఆర్చినన్ = బొబ్బ పెట్టగా; పౌర = పుర; జనంబులు = ప్రజలు; కనుంగొని = చూసి; భయ = భయముచేత; ఆకులులు = కలత చెందినవారు; ఐ = అయ్యి; హాహాకారంబులు = హాహా అను అరుపులు; చేసిరి = చేసారు; అంత = అంతట.
భావము:- ఇలా దేవేంద్రుడి వజ్రాయుధంలాంటి పిడిగ్రుద్దుల వలన శరీరాలు పగిలి కారుతున్న రక్తాలతో భీముడు జరాసంధుడు పుష్పించిన అశోకవృక్షాలలా, ఎఱ్ఱని కొండలలా కనబడసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని మదించిన ఏనుగు తాటిచెట్లను పెళపెళమనే శబ్దం పుట్టేలా చీల్చునట్లు, వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు.